Site icon Sanchika

శ్రీ సీతారామ కథాసుధ-5

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]

~
సీ.
ఆజానుబాహు డహర్పతి తేజుడు
ఇందీవరశ్యాము డెదురువచ్చి
అవనతశీర్షుడై అంజలించిన యంత
ముని చేరువకు తీసికొనియె ప్రీతి
పాతాళముననుండి బ్రహ్మలోకముదాక
నిలుచు ననంతుడై చెలువుదీరి
అవనతశీర్షుడై ఆ లక్ష్మణస్వామి
యంజలించిన ప్రేమ నక్కుజేర్చి
తే.గీ.
భరత శత్రుఘ్ను లట్లె ప్రపన్నబుధ్ధి
ఋషిపదమ్ముల చెలగిన తృప్తి తోడ
మరల నాశీర్వదించెను మౌని వరుడు
నలుగురును ప్రాణముల యందు పొలిచినట్లు. (41)

ఉ.
ఆసురశక్తు లీ పుడమి నంతట చీకటులై గ్రసింపగా
ధీసమవృత్తి ప్రార్థన విధిన్‌ పులకించిన స్వామి తాను వి
శ్వాసితుడై చతుర్భుజుడు వచ్చెను వానికి దారి తీర్పగా
నే సమకట్టితిన్‌ ప్రభుని నేత్రమహస్సులు నిండ పృథ్విపై. (42)

తే.గీ.
లక్ష్య సిద్ధికై నే రామ లక్ష్మణులను
వెంట గైకొని పోవుదు విపినములకు
భరత శతృఘ్ను లిల యోగపథము వెంట
విశ్వపరిణామరీతిని విస్తరింత్రు. (43)

కం.
అని చెప్పిన విశ్వామి
త్రునితో ఇంద్రాగ్ను లటు లతుల్యబలులు భూ
పునికిని తల్లుల కెరగిన
చని రిరుసంద్రములవోలె సంయతచిత్తుల్‌. (44)

సీ.
అడుగు వేసినచోట నంబుజమ్ములు పుట్టు
సంపెంగ లంగుళీసంపుటమున
పాదాంగులుల శేఫాలిక లుదయించు
మోవిపై మందారములును విరియు
పుండరీకమ్ములు పొలుచు కన్నులయందు
విరియును దేవగన్నెరులు దిశల
కరములయందు చెంగల్వలు కుసుమించు
విధికమలమ్మును వెలయు నొసట
తే.గీ.
వాన మొయిలయి వచ్చిన పరమపురుషు
డెన్ని వన్నెలు చూపిన నేమి వింత
పుష్పహాసుడు పొడమిన భువనమెల్ల
పారిజాతగుళుచ్చమై పరవశించు. (45)

మధ్యాక్కర
మునివెంట నడుగులు వేయు మోహన రాముని తోడ
ననిమిషుల్‌ సిద్ధులు మునులు ఆశ్చర్యచకితులు నైరి
వినమితశీర్షులు ఋషులు వేదవేద్యుని భావలీల
లను భావనముచేసి సంవలనదీప్తి బోధితులైరి. (46)

మధ్యాక్కర
ఏవొ అంహఃప్రవాహముల ఇంకించు కోరిక యౌనొ
ఏవొ ఏనః ప్రభూతముల ఎదిరించి ద్రొక్కుట కేమొ
ఆవల పాపపు గట్టు అచట కాంతాపచారములు
పావకుడట్లు శ్రీరామభద్రుడు చింతించుచుండె. (47)

మధ్యాక్కర
ఒక్క తలతోడి మనుజుడు ఒక పదినూరు తలలైన
వికలుడై అర్థకామముల వెంబడి పర్వెత్తుచుండ
అకట! మృత్యువు తలపైన ఆర్చుచు దండిరచుచుండ
ఒక్క తలయును రక్షింప దుప్పెన తాడించినట్లు. (48)

వచనము
అని త్రికాలములు తనలో సంయోజితములైనట్లు భావించుచు విశ్వమయుండైన శ్రీ రామచంద్రుడు లక్ష్మణునితో మహర్షిని సమీపించిన సాయంకాలమైనట్లు తలంచి గాధిసూనుడచట విశ్రమింపనెంచి ప్రక్కన నదిలో స్నానాదికములు చేసి రమ్మని ఫలమూలాదికములను వారు నారగించి నంత. (49)

మ.
త్రివిధావస్థల నిత్యజాగృతులు ధాత్రీనాథపుత్రుల్‌ తప
శ్ఛవిదీప్తార్చిషు గాధిసూనుని పదార్చాసక్తసంవాహనో
త్సవులై నిద్దురపోయి రచ్చటనె విశ్వం బెల్ల నిద్రించునో
స్తవనీయాకృతి శ్రీ ఉషస్సుదతి ప్రాగ్ద్వారంబు విప్పంగనెన్‌. (50)

(సశేషం)

Exit mobile version