Site icon Sanchika

శ్రీ సీతారామ కథాసుధ-7

[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]


~
మధ్యాక్కర

విశ్వకళ్యాణ సంభావవేదియౌ గాధిజు యజ్ఞ
శశ్వత్విధానము చెరుప చనుదెంచిన సుబాహు చంపె
శాశ్వత కీర్తిని మౌని చైతన్య సంధాన మహిమ
వైశ్వమాంగళ్యకారకులు ప్రాజ్ఞసంస్తుతులైరి వారు. (61)

వచనము

అంత నా మువ్వురు సాగుచు సాగుచు సురనదియైన భాగీరథీ సమీపమునకు చేరినంత వారికి ఆ సౌరవాహిని పాలకడలి తరలి వచ్చినట్లు, పాంచజన్యము చివ్వున మ్రోగినట్లు, ఆదిశేషుని పడగల మణి కాంతులు విరిసిన గగనమట్లు, నాలుగు మొగములతో పద్మసంభవుడు వేదముల నాలపించినట్లు, సరస్వతీ దేవి వాహనమైన కలహంస కూజితమట్లు, ధూర్జటి జటాజూటము విప్పార్చినట్లు, అంతరిక్షమట్లు, అచ్చరలు చేతులతో చప్పట్లు చరచినట్లు, వారి చేలాంచలములు తడియార పరిచినట్లు, వారి నవ్వులు పువ్వుల గుంపులవలె తరంగములు తరంగములుగా ప్రకాశించినట్లు, ఇక్ష్వాకుల తపస్సులు ధవళ కాంతిమంతములై వీచికలను విప్పారించినట్లు, ఆ మహానది సగరభగీరథాదుల దివ్యతపముల ప్రవాహమైనట్లు, వసుంధరాదేవికి ఆ మహానది అభ్యంజన స్నానము చేసినట్లు, ఓషధుల దప్పికలు చల్లారినట్లు తోచినంత శ్రీరామలక్ష్మణులు అంతర్బహిశ్చైతన్యముల యందు వివస్వంతుడు ప్రకాశించినట్లు తోచిన. (62)

కం.

పరితః ప్రసన్నమగు ని
ర్జరవాహిని చేరనరిగి సంబరమున ఇ
ర్వురు నదిలోనన్ దిగి రా
తరగలు ప్రియమున స్పృశింప తర్పితమతులై. (63)

మధ్యాకర

భగవంతుని యనుగ్రహమ్ము ప్రవహనశీలమై నట్టు
లెగసిన గరుడుని పక్ష నృత్యమై తడలాడినట్లు
మొగిచిన సురల హస్తములు ముద్దాడినట్లు పాదముల
యుగములపుణ్యగంధమ్ము లొలయుచు నది సాగుచుండె. (64)

తే.గీ.

అన్నదమ్ములు స్నానములాడుచుండ
వీచికన్నియ లభిషేకవిధి పొనర్చి
పూలపడవల నాడించి పూజ చేసి
రంత లలితమర్యాదిను లలలచెలులు. (65)

కం.

కోలాటము లాడించిరి
లాలించిరి దాశరథుల లహరీవనితల్‌
కేళీభ్రమరములు కథా
మాలికలను పాడిరంత మధురశ్రుతులన్‌. (66)

కం.

ధృతి బ్రహ్మకర్ములును స
న్నుతమతులగు రామ లక్ష్మణుల తోడ సమా
హితచిత్తుడైన ముని స
మ్మతి కూర్చొని రతని శాంతమతి విను కోర్కిన్‌. (67)

వచనము

అంత విశ్వామిత్రుండు… (68)

ద్విపద మాలిక

అపుడు నెత్తిన రాజసాహంత పెరిగి
ప్రబలశస్త్రాస్త్రసంపత్తి గర్వించి
ఎవరిని లెక్కించనీని ప్రవృత్తి
నృపతినై ఊర్జితవృత్తి పెంపొంది
ఒకనాడు బ్రహ్మర్షి ఉదితాశ్రమమున
ఆతిథ్యమునుగొని అంతతో దాని
కారణమైనట్టి కామధేనువును
కావలెనని కోరగా తిరస్కరణ
పొంది యుద్ధమునకు పూని సర్వాస్త్ర
సమితి యాతని యోగ శక్తి నడంగ
నిర్వేదమును పొంది నిగుడు వైరేచ్ఛ
తపమును బూనినంతన అల్పచిత్త
మును పొంది ఇంద్రాదులను లెక్క లేక
ప్రాకృతదేహు నప్రాకృత లోక
మెత్తించ యత్నించి ఇల కూలబడిన
గర్వమ్ముతో కొత్తగా స్వర్గమొకటి
నిర్మింపబూని గణింపని దైవ
విపరీతఫలమును వెక్కిరించి నటు
లను విపరీతఫలాప్తి ఓటమిని
అంగీకరింపని అహము లోపింప. (69)

తే.గీ.

అపుడు తపమాచరింతు బ్రహ్మర్షి పదము
కలుగునందాక ఎట్టి వికల్పబుద్ధి
కలుగకుండ తీవ్రత తోడ విలులితాత్మ
సిద్ధితో లక్ష్యమును చేరు చెలువు గలుగ. (70)

(సశేషం)

Exit mobile version