[ఆచార్య కోవెల సుప్రసన్నాచార్య రచించిన ‘శ్రీ సీతారామ కథాసుధ’ అనే పద్యకావ్యాన్ని అందిస్తున్నాము.]
~
సీ.
నడుచుచున్నప్పుడు నాథుడు దశరథ
రాజు నడక ఠీవి రాణకెక్కు
వినునప్డు కౌసల్య వినుత వాగ్దేవతా
స్ఫురణ సౌందర్యము చొప్పు తెలియు
కాంచునప్పుడు కూడ కన్నులు రమణీయ
విశ్వరహస్యముల్ వెలుగు లొలయు
తనలోన తానయై కనెడు వేళల ఎదో
విశ్వకారణ శంప విరియునట్లు
తే.గీ.
ఆ ప్రభువు లక్ష్మణునితోడ అంతరంగ
గాథలను ముచ్చటలను పల్కాడు వేళ
అతనిపై గల వాత్సల్య మతిశయిల్లు
శ్రీ వికుంఠుడు శైశవ స్థితి చెలంగు. (81)
ద్విపద
అడవులన్ కొండల నాపగల్ దాటి
కడలేని చిక్కటి గహనముల్ దాటి
చెరువులన్ సరసులన్ తరువులన్ దాటి
ఆశ్రమ వాటికల్ విశ్రమస్థలులు
దాటుచు గోవుల దారుల దాటి
ఆరాజ సుతులు గుర్వంకితబుద్ధి
కదలుచుండిరి భావ గంభీరవృత్తి. (82)
మధ్యాక్కర
శ్రీరామచంద్రుని చిత్త సీమలో ఇంద్రుడు తోచె
శారద గిరులకు దించి జగతికి స్థిరత చేకూర్చె
పోరులో వృత్రుని చంపె పుడమికి వెలుగులు నింపె
ధీరుడై జగదధిష్టాత తెలియగ అగ్నికి చెలుడు. (83)
మధ్యాక్కర
మొయిలుల కడుపుల జీల్చి ముద్దగా మట్టిని జేసి
ప్రయతించి జీవుల కన్నభాగ్యము కల్గించినాడు
క్రియలకు పుణ్య పాపముల రీతిని ఫలములనిచ్చు
నయముల మూగలోకముల నడిపించు వృద్ధ శ్రవుండు. (84)
మధ్యాక్కర
ఐనను లోకమునందు ఆ మహాత్ముని ఇంద్రియముల
పనుపున వర్తించునట్టి వానిగా చేసె నీ జగతి
జనులయందలి లోభమోహ సంగతి తనయందు నిల్పె
అనరాదు గాని లోకమ్ము నంతయు తన స్థాయి జేర్చు. (85)
మధ్యాక్కర
ప్రభువిటులంతరంగమున భావనాధీనుడై నడువ
విభుడగు లక్ష్మణస్వామి వీతరాగుడు యోగి పలికె
ఋభుగణ్య గౌతమ మౌని వృత్తాంతమున్ తెల్పగదవె
శుభములు మాకు చేకూరు చొక్కముగ తెలుపుమనిన. (86)
తే.గీ.
గౌతముడు సూర్య సముడు నఖండ తపము
ఉదితదీప్తి సమస్త లోకోత్తరుండు
సప్త పాతాళ గామి ఆశ్చర్యభూమి
ఊర్థ్వలోకసురభుడు నియుక్త బుద్ధి. (87)
వచనము
సప్త పాతాళ లోకములు జీవుల పరిణామమును ఊర్థ్వముఖముగా తీర్చి దిద్దును. ఊర్ధ్వలోకములలో భూర్భువఃస్వర్లోకములు ధర్మస్థానములు, కర్మ ఫలానుభవ యోగ్యములు పునరావృత్తి గలవి. మహదాది చతుర్లోకములు తపోమయములు. బ్రహ్మర్షులు సత్య లోకమున విధాతతో సమస్థాయి గలవారు. వారి యాతాయాతములు లోకానుగ్రహ దృష్టి గలవి. (88)
తే.గీ.
ఆ విధాత హృదంతరమందు గలిగె
నొక తపోదేవతను సృష్టి యొనరుపంగ
ఆమె తాపసి సౌందర్య సీమ అప్స
రసల మించు తపస్వుల కొసరుగట్టు. (89)
తే.గీ.
అజుని అనుమతి తోడ బ్రహ్మర్షి గౌత
ముం డహల్యను భార్యగా మోదమునను
గైకొనియె వారి దాంపత్యగమనమందు
దివ్యభావనావధులు ప్రదీప్తమయ్యె. (90)
(సశేషం)