Site icon Sanchika

మధురమైన నవల ‘శ్రీలేఖ’

[dropcap]డా.[/dropcap] ముదిగొండ శివప్రసాద్ గారి ‘శ్రీలేఖ’ చారిత్రక నవలను ఈమధ్యనే చదివాను. పుస్తకం కొని దాదాపు మూడు నెలలు దాటింది. కానీ మార్చి, ఏప్రిల్ నెలల్లో ఉన్న పని ఒత్తిడి, ఈ పుస్తకాన్ని చదివేందుకు అవకాశం ఈయలేదు.

కథ బాగుంది. కథనం చక్కగా ఉంది. తొలితరం శాతవాహనుల కథ ఇది. శ్రీముఖ శాతవాహనుని కుమారుడు మొదటి శాతకర్ణి సమయంలోని మనుషులు, సంఘటనలు కలగలిపిన చరిత్రకు కొంత ఊహను జోడించి రచించిన రమణీయమైన గాథ ఇది. మహారాజు శాతకర్ణి, మహారాణి నాగవరదాయిని, యువరాజు పూర్ణోత్సంగుడు, సర్వసైన్యాధ్యక్షుడు విజయదత్తుడు, బౌద్ధభిక్షుకి శ్రీలేఖ, కళింగాధిపతి ఖారవేలుడు ప్రధాన పాత్రలుగా కథ ముందుకు సాగుతుంది. ఇదంతా క్రీ.శ. మొదటి శతాబ్దానికి ముందు జరిగిన కథ అని రచయితే తన ముందుమాటలో తెలియజేశాడు.

ఇక కథలోకి పోతే మహారాష్ట్రుల ఆడపడుచు నాగవరదాయినిని వివాహమాడిన శాతకర్ణి తన రాజ్యాన్ని సుసంపన్నంగాను, శత్రుభయం లేకుండానూ పరిపాలన చేస్తుంటాడు. దానికి మహారాణి నాగవరదాయిని మరియు సర్వసైన్యాధ్యక్షుడు విజయదత్తుని సహకారం ఎంతైనా ఉంటుంది.

తొలి శాతవాహనుల రోజుల్లో వైదికమతం రాజకుటుంబపు ఆదరణనూ, ఆర్థికసహకారాన్ని పొందుతుంటుంది. మరోవైపు సామాన్య ప్రజానీకపు అభిమానం పొందిన బౌద్ధమతం కూడా వైదికమతానికి సమాంతరంగా సంచరిస్తూ, సవాలు విసురుతుంటుంది. రాజు, రాణి, రాజకుటుంబం బౌద్ధం పట్ల గౌరవాభిమానాలు చూపించినప్పటికీ బౌద్ధ సంఘాలకూ, అనుయాయులకూ రాజకుటుంబం పైననూ, రాజ్యాధికారుల పైననూ నమ్మకం, విశ్వాసం ఉండవు.

శత్రుభయంకరుడై, హింసకు మారుపేరైన విజయదత్తుణ్ణి, యుద్ధవిజయ పిపాసి అయిన మహారాజు శాతకర్ణిని, హింసతోనైనా దేశంలో శాంతిభద్రతలను నెలకొల్పాలనీ, సామ్రాజ్యవిస్తరణ చేసి ఆంధ్రుల ఔన్నత్యాన్ని నలుదిశలా వెల్లడిచేయాలనే ఆశ కల్గిన మహారాణి నాగవరదాయినినీ ఆ బౌద్ధసంఘాలు బాహాటంగా వ్యతిరేకిస్తూనే ఉంటారు. ఒకానొక సమయంలో యువరాజు, బలహీనమైన శౌర్యంగల పూర్ణోత్సంగుడిని రాజును చేయి సంకల్పించి విఫలమైన కుట్ర పన్నుతారు. ఇలా సామాజికంగా రెండు మతాల, వర్గాల విభజన, ఘర్షణ కథలో అగుపడుతుంది.

ఒక ప్రమాదం వాటిల్లిన సందర్భంలో శ్రీలేఖతో విజయదత్తుని పరిచయం అవుతుంది‌. అది విజయదత్తునిలో శ్రీలేఖ పట్ల ఇష్టాన్ని, తద్వారా ప్రేమనూ ఉదయింప జేస్తుంది. అయితే భౌతిక అంశాలపై, వాంఛలపై అంతగా ఆసక్తి, అనురక్తిలేని శ్రీలేఖ ఆ విషయం గమనించదు. శస్త్రజీవనుడూ, హింసకు ప్రతిరూపంగా భావిస్తూ విజయదత్తుణ్ణి అనునిత్యం విమర్శిస్తూనే ఉంటుంది. అంతేగాక ఖారవేలుని ప్రోద్బలంపై రహస్యకార్యకలాపాలు చేస్తూన్న ముఠాలు విజయదత్తుని పేర దోపిడీలు దొంగతనాలు చేస్తూ ఒకానొక సందర్భంలో శ్రీలేఖనూ ఎత్తుకునిపోయి ఖారవేలుని వద్ద బందీని చేస్తారు. ఆ నేరం విజయదత్తునిపై బడి అతనికి దేశ బహిష్కరణ విధించడమవుతుంది. శ్రీలేఖను రక్షించిన ఆ సందర్భంలో విజయదత్తుని పట్ల ఆమెకు సదభిప్రాయం కలుగుతుంది. అయినప్పటికీ కథలో వారి అనురాగం చిక్కబడదు ఇంకా.

ఆ తదుపరి కథంతా యుద్ధాలు, యుద్ధానికి ముందూవెనుకా ఎత్తుగడలు, ఒప్పందాలు, కూటములు ఇలా సాగుతుంటుంది. విజయదత్తుడు మారువేషంతో ఉజ్జయినిలో గడిపిన రోజులకు సంబంధించిన, తన చాకచక్యంతో ఉజ్జయినిని జయించిన ఉపకథ కూడా ఉంటుంది.

కొంతకథ పుష్యమిత్ర శుంగుని కుమారుడూ, విలాసపురుషుడూ అయిన అగ్నిమిత్రుని గూర్చి, అతని ప్రేయసి, అర్ధాంగి మాళవికల గూర్చి, వారి అనురాగం దేశభవిష్యత్తుని పణంగా పెట్టే పరిస్థితులకు దారితీయడాన్ని విదిషను జయించి విజయదత్తుడు పరిస్థితులను దారికి తేవడం గురించి ఉంటుంది.

తదుపరి ప్రణాళికలో భాగంగా కళింగ నరపతి ఖారవేలుణ్ణి మండలం దినాలు బందీని చేసి అతనిలో దేశంపట్ల, దేశాభివృద్ధి పట్ల అభిమానం, మానవత్వం పట్ల అనురాగం పెంపొందించే ప్రయత్నాలు విజయదత్తుడు, పతంజలి మహర్షి సంయుక్త నిర్వహణలో శ్రీలేఖ సౌజన్యంతో సఫలమౌతాయి. తత్ఫలితంగా కసాయి ఖారవేలుడు కరుణ సందేశాన్ని ఆగ్నేయ దేశాలకు మోసుకెళ్ళేంతగా ప్రభావితుడవుతాడు. తనంత తానే అట్టి దేశాలకు బయలుదేరుతాడు.

ఇలా సాగిన కథ శాతకర్ణి, పుష్యమిత్ర, ఖారవేల మహారాజుల సమైక్య సైన్యపు రూపుడు దారితీసి విదేశీయుడైన డెమిత్రయస్‌ను ఓడించి భారతదేశ సరిహద్దులనుంచి దూరంగా పారదోలడం వరకూ కొనసాగుతుంది.

ఉజ్జయిని వద్ద యుద్ధంలో జరిగిన అమితమైన జననష్టం పట్ల బాధనొందిన విజయదత్తుడు రాజభోగాల పట్ల విరక్తి చెంది, బౌద్ధజీవన విధానాన్ని, భారత సంస్కృతినీ వ్యాపింపజేసేందుకు, హింస ద్వారా సాధిస్తోన్న ఖడ్గవిజయాన్ని వీడి జ్ఞానవిజయం, ధర్మవిజయం సాధించేందుకు తన ధర్మపత్ని శ్రీలేఖతో కలిసి కళింగాధీశుడు ‘ఖారవేలుని’ వెంట ఆగ్నేయాసియా దేశాలకు పయనమవడంతో కథ ముగుస్తుంది.

నవల చారిత్రక రచన అని చెప్పినప్పటికీ ఇందులో నాటి సామాజిక ఆర్థిక పరిస్థితులపై తగు సమాచారం అందజేయలేదని చెప్పవచ్చు. కులవృత్తులు, వర్ణవ్యవస్థలోని హెచ్చుతగ్గులు, బ్రాహ్మణాధిక్యత, వైశ్యుల ఆర్థికపరమైన సుసంపన్నత లాంటివి స్పష్ చేయబడలేదు. అలాగే నాటికాలంలోని అధికారగణం, వారి బాధ్యతలు, అధికారాలు, సౌకర్యాల గురించిన సమాచారం అంతంతమాత్రంగానే ఉంది.

బౌద్ధమతం పట్ల రచయిత అభిమానాన్ని కొంత ఎక్కువగానే కనబరిచిన దాఖలాలు కనబడుతుంటాయి. అంతేకాకుండా బౌద్ధమతపు పతనానికి దారితీసే దిగుడుమెట్లు మెల్లమెల్లగా ఏర్పడుతున్నాయనే సూచనను కూడా రచయిత చేస్తాడు.‌ అదేగాక సరళజీవన బౌద్ధమతానికి తనదైన సూచనగా…. “గృహస్థు గానే ఉంటూ, నిత్యకర్మలు చేసుకునే, ప్రాపంచిక జీవనులు కూడా బౌద్ధమత అనుయాయులుగా మారబోతారు” అనే ఆలోచనను మన మనసుల్లోకి వచ్చేలా చేస్తాడు రచయిత.

నవలకు పెట్టిన ‘శ్రీలేఖ’ అనే పేరు పట్ల నాకు కొద్దిగా అభ్యంతరం కలుగుతోంది. ఈ కథంతా కథానాయకుడైన ‘విజయదత్తుని’ వీరపరాక్రమం చుట్టూ నడుస్తుంది. శ్రీలేఖ అతని మానససుందరిగా అతని భవిష్యుత్తును భవితవ్యాన్ని నిర్దేశించినప్పటికీ నవలకు ఆమెయే కార్యమూ కాదు, కారణమూ కాదు. ఈ నవలలో ఎక్కువ సందర్భాల్లో, సన్నివేశాల్లో అగుపించే, కథను అడుగడుగునా ముందుండి నడిపించిన నాయకుని పేర ‘విజయదత్తుడు’ అనైతే బాగుండేదని నా అభిప్రాయం. ఇలా అంటున్నందుకు రచయితకు బేషరతు క్షమాపణలు.

మనసు పెట్టి ఓపికగా చదవాల్సిన మధురమైన నవల ఇది. చదువుతూ పోతూంటే మనోవేదికపై నవలలోని పాత్రలూ, పరిస్థితులు ప్రత్యక్షమౌతాయి. పాత్రల మధ్య చక్కని సంభాషణల సన్నివేశాలననురించి అగుపించి మైమరిపిస్తుంటాయి.

బాపు వేసిన బొమ్మ ముఖచిత్రంగా గల ఈ నవల మూడువందల ముప్ఫైఐదు పేజీలుంటుంది. వెల రెండువందల డెబ్భైఐదు రూపాయలు. నవోదయ బుక్‌హౌస్ వారు తమ ప్రథమ ముద్రణగా 2013వ సంవత్సరంలో ఈ నవలను ప్రచురించినారు. అన్ని ప్రముఖ పుస్తక విక్రయకేంద్రాల్లో ఈ నవల లభిస్తుంది.

Exit mobile version