[dropcap]22[/dropcap] సెప్టెంబరు 2024, ఆదివారం, రవీంద్రభారతి మినీహాల్‌లో, భవానీ సాహిత్య వేదిక, కరీంనగర్ వారిచే ‘శ్రీమద్భగవద్గీత – జీవన తత్త్వగీత – విశ్వజన సంహిత’ పుస్తకం ఆవిష్కరణ ఆధ్యాత్మవాతావరణంలో జరిగింది. సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు, డా॥ వైరాగ్యం ప్రభాకర్ గారు సంపాదకత్వం వహించి, భగవద్గీత 18 అధ్యాయాలపై, 18 మంది రచయితలు వ్రాయగా, సంకలనం చేశారు.
సభకు ప్రముఖ కవి, రచయిత, కాలమిస్ట్, ప్రవచనకర్త శ్రీ పాణ్యం దత్తశర్మ గారు అధ్యక్షత వహించారు. తెలంగాణ జాతీయ సాహిత్య పరిషత్ అధ్యక్షులు ఆచార్య కసిరెడ్డి వెంకట రెడ్డి గారు ముఖ్య అతిథిగా విచ్చేసి, గ్రంథాన్ని ఆవిష్కరించారు. ప్రముఖ సాహితీవేత్త, ఉపనిషద్బ్రహ్మ, ఉస్మానియా విశ్వవిద్యాలయ విశ్రాంత తెలుగు శాఖాధ్యక్షులు శ్రీ మసన చెన్నప్ప విశిష్ట అతిథులుగా వ్యవహరించారు. శ్రీ యోగి రవికాంత్ తాత గారు, ప్రముఖ గీతా ప్రచారకులు, చార్టర్డ్ అకౌంటెంట్, గౌరవ అతిథిగా హజరైనారు. ‘సాహితీ గౌతమి’, కరీంనగర్ కోశాధికారి, ప్రముఖ కవి శ్రీ స్తంభంకాడి గంగాధర్ గ్రంథ సమీక్ష చేశారు.
సభకు ముందు భగవద్గీతపై కవి సమ్మేళనం జరిగింది. శ్రీ పాణ్యం దత్తశర్మ, అధ్యక్షుని తొలి పలుకులతో ‘సాధక గీత’ గురించి చెప్పారు. గీత, వేదార్థసారసంగ్రహమని, దానిలో 4 యోగాలున్నా అవి రెండేనని, లోతుగా ఆలోచిస్తే, జ్ఞాన, భక్తియోగాలు ఒకటేననీ అన్నారు. ‘ఏకం సాంఖ్యం చ యోగం చ యః పశ్యతి సపశ్యతి’. ఆత్మ, అనాత్మ, వివేచన సాంఖ్యమని దత్తశర్మ వివరించారు. “పండా ఆత్మవిషయా బుద్ధిః, సాయేషాం తే పండితః” అని పండితపదాన్ని ఆయన వివరించారు. విద్య, జ్ఞానం, 4 దశలని, అధీతి, బోధ, ఆచరణ, ప్రచారం. ఉషశ్రీ గారు ‘మనం గీతను ప్రచారం చేసే దశకు వెళ్లలేము, కేవలం అధీతి (అధ్యయన) దశలోనే ఉన్నామ’ని అన్నారని దత్తశర్మ చెప్పారు.
తర్వాత, ప్రధాన వక్త, గ్రంథసమీక్షకులు గంగాధర్ మాట్లాడుతూ, పుస్తక ముఖచిత్ర వైశిష్ట్యాన్ని కొనియాడారు. డా. వైరాగ్యం ప్రభాకర్ భారత, రామాయణ, భాగవతాలలోని సమకాలీనతను తాను సంపాదకత్వం వహించి వెలువరించిన గ్రంథాల ద్వారా విశదపరచారన్నారు.
తర్వాత ఆచార్య మసన చెన్నప్ప గారు, తమ సందేశంలో ‘యద్యాదాచరతి శ్రేష్ఠః’ అన్న భగవానుని మాటను ఉటంకించి, అనుసరించడం ద్వారా మనల్ని మనం ఉన్నతీకరించుకోవచ్చని అన్నారు. కృష్ణుడు ఉత్తమ విద్యార్థి అని, యోగీశ్వరుడని, తనకు ఆయన ఉపనిషత్తులలో దొరికాడన్నారు. ‘భగవంతుని పట్టుకోవాలంటే భగవద్గీతను పట్టకోవాలి’ అని ఆయన అన్నపుడు చప్పట్లు మారుమ్రోగాయి. భగవద్గీత నుండి మనం వేదాధ్యయనం లోకి ప్రయాణించాలని ఆయన ఉద్బోధించారు. ధర్మం మనిషికి గాని, దేవునికుండదని, దాన్ని పాటింప చేసేవాడే పరమాత్మనీ చెప్పారు. ఓంకారం చాలా శక్తివంతమైనదనీ, దాన్ని అన్నింటికీ జోడించి పలుచన చేస్తున్నారనీ విమర్శించారు.
తర్వాత కసిరెడ్డి వెంకట రెడ్డి ఆచార్యులు ప్రసంగించారు. ‘యోజకః తత్ర దుర్లభః’ అన్న మాటను ఉటంకిస్తూ, 18 మంది రచయితలను సమీకరించి, వారి వ్యాసాలను ఒక గుత్తిగా అందించిన డా. వైరాగ్యం వారు గొప్ప యోజకులని (అనుసంధానకర్త), అటువంటి వారు అరుదుగా ఉంటారని కొనియాడారు. ఎక్కడ చైతన్యం ఉంటే అక్కడ బ్రహ్మం ప్రకాశిస్తుందన్నారు. కృష్ణుడు గీతాబోధన చేసే చిత్రాన్ని ఎవరు రూపొందించారో గాని, అర్జునుడు రథంలోనే విరక్తితో కూలబడి, ధనుస్సును విసర్జించగా, పరమాత్మ రథం నుండే బోధ చేశారన్నారు. “ధర్మరక్షార్థమై యోగం బూనితి పార్థసారథి మహోద్యోగంబు సాధించితిన్” అన్న కరుణశ్రీ గారి పద్యాన్ని ఉటంకించారు.
ప్రముఖ గీతాప్రచారకులు శ్రీ యోగి రవికాంత్ తాత గారు మాట్లాడుతూ, భగవద్గీతను ఆధానిక విజ్జానశాస్త్రంతో అనుసంధిస్తూ తాను వ్యాఖ్యాన గ్రంధాన్ని రాశానని, దానిని తన గురువు గారు శ్రీ పాణ్యం దత్తశర్మగారు ఆంగ్లంలోకి అనువదించారని చెప్పారు. రెండూ త్వరలో రాబోతున్నాయన్నారు. బ్రహ్మం అంటే త్రిమూర్తులలోని బ్రహ్మ కాదన్నారు. ఓంకారాన్ని ఉచ్చరించే సమయంలో వెలువడే ధ్వని ప్రకంపనములు ఫిజిక్స్ లోని సూత్రాలకు దగ్గరగా ఉంటాయని నిరూపితమైందన్నారు.
సభానంతరం, నాట్యసరస్వతి శ్రీమతి డా. కె.వి. విజయవేణి, కళారత్న కుమారి కె. శ్రీవాణి గారలచే ‘శ్రీకృష్ణ లీలా వైభవం’ అను శాస్త్రీయ నృత్యప్రదర్శన జరిగింది.
గ్రంథంలోని రచయితలను, అతిథులను, అధ్యక్షులను, డా. వైరాగ్యం వారు సముచితంగా సన్మానించారు. రచయితలకు ప్రశంసాపత్రాలు అందజేశారు.
‘జగద్గురుః కృష్ణో, జగత్ శిష్యో ధనుంజయః’