Site icon Sanchika

శ్రీమద్రమారమణ-2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[యానాదుల దిబ్బకు చెందిన కోనేటయ్య విశ్రాంతిగా తన గుడిసె ముందు కూర్చుని ఉంటాడు. అతని భార్య తిరుపాలమ్మ జొన్నరొట్టెలు చేస్తూ ఉంటుంది. గుడిసె వెనక పెరట్లో వాళ్ల కూతురు రమణమ్మ గిన్నెలు కడుగుతూంటుంది. దూరంగ కొట్టంలో చూలుతో ఉన్న ఆవుని చూస్తాడు కోనేటయ్య. అది ఈనితే పాలకు లోటుండదని అనుకుంటాడు. కాసేపటికి తినడానికి రమ్మని పిలుస్తుంది తిరుపాలమ్మ. ఇంతలో వాళ్ళ కొడుకు ఎనిమిదేండ్ల వైనతేయ కూడా వచ్చి, అన్నానికి కూర్చుంటాడు. పుస్తకాలు కొనడానికి డబ్బులు కావాలని తండ్రిని అడుగుతాడు. తిన్నాకా వైనతేయ బడికి, కోనేటయ్య, తిరుపాలమ్మ పనికి, రమణమ్మ ఆవుని తిప్పుకురావడానికి వెళ్తారు. వైనతేయ తమ ఊరికి రెండు కిలోమీటర్ల దూరంలో ఉన్న జలదుర్గం ఎలిమెంటరీ స్కూల్లో నాల్గవ తరగతి చదువుతున్నాడు. అది ఏకోపాధ్యాయ పాఠశాల. దస్తగిరి ఉపాధ్యాయుడు. ఆయన ప్యాపిలి నుంచి రోజూ వచ్చి పాఠాలు చెఫ్ఫి వెళ్తుంటాడు. ఐదు తరగతులకూ కలిసి వందకు లోపే పిల్లలున్న ఆ స్కూలుకి మద్దిలేటి ప్యూన్. బడి సమయం కాగానే బెల్లు కొడతాడు మద్దిలేటి. పిల్లలంతా తరగతుల వారీగా వరుసలో నిలబడతారు. ప్రేయర్ అని సార్ అనగానే వైనతేయ వెళ్ళి పద్యాన్ని పాడతాడు. ఆ పద్యం వాడికి నేర్పింది ఆయనే. అయనకి సంగీతంలో ప్రవేశముంది. హార్మోనియం వాయించటం వచ్చు. ప్రార్థన ముగిసి తరగతలు మొదలవుతాయి. మధ్యాహ్నం విరామంలో అన్నం తిన్నాకా, ఇంకా సమయ్ం ఉండడంతో, వైనతేయని పిలిపించుకుని ఇంకో పద్యాన్ని పాడించుకుంటాడు దస్తగిరి. తప్పులు పాడిన చోట సరిదిద్దుతాడు. వైనతేయలో దైవదత్తమైన గళం, మాధుర్యం ఉన్నాయనీ, సానబెడితే వజ్రమవుతాడని అనుకుంటాడు. – ఇక చదవండి.]

[dropcap]బ[/dropcap]డి వదిలింతర్వాత, పిల్లలందరూ వెళ్ళిపోయారు.

వైనతేయ, దస్తగిరి సారు దగ్గరికి వెళ్లాడు. ఆయన కొంతసేపు వాడికి పద్యాన్ని నేర్పించాడు. వాడు జంకుతూ అన్నాడు – “సార్, వర్కుబుక్కులు కొనలేదు. మా నాయిన ఇంకా డబ్బులు ఇవ్వలేదు”. సారు నవ్వాడు. “నేను నీకు ఇప్పిస్తాలే! నాయినను అడగవాకు” అన్నాడు. వైనతీయ ముఖం పొద్దుతిరుగుడు పువ్వంత అయింది. వంగి సారు కాళ్లకు మొక్కాడు.

ఆయన వాటిని లేవనెత్తి, “ఒరేయ్ వైనా, కష్టపడి చదువురా! నీకు దేవుడు పాడగలిగిన వరం ఇచ్చినాడు. దానిని వదిలిపెట్టకు” అన్నాడు.

“అట్లనే సార్!” అన్నాడు వాడు వినయంగా.

“సరేగాని, ఎల్లుండి సెకండ్ సాటర్ డే, మనకు సెలవు. ఆవలెల్లుండి ఆదివారం. నీవు శనివారం మధ్యాన్నం మా ఇంటికి వచ్చాయి. అన్నం మా యింట్లోనే తిందువుగాని. ఆ రోజు రాత్రి ప్యాపిలి చెన్నకేశవ స్వామి దేవళంలో హరికథ ఉంది. ఎవరో విద్యాంసుడు, ఆయనది ఆదోని దగ్గర కౌతాళం అనే ఊరట. ఆయనపేరు ఆంజనేయ శర్మగారట. ‘భక్త మార్కండేయ’ హరికథాగానం చేస్తారట. మనిద్దరం పోదాము. రాత్రి మా యింట్లో వుండి, పొద్దున మీ ఊరికి పోదువుగాని.”

వైనతేయ సంతోషంగా ఒప్పుకున్నాడు.

వాడు ఇంటికి చేరేసరికి పొద్దు వాటారుతూంది. గుడిసె వెనక పెరట్లోకి వెళ్లి, గోలెం లోని నీళ్లతో కాళ్లూ చేతులు, ముఖం శుభ్రంగా కడుక్కున్నాడు. తాటాకులతో ఒక దడి కట్టి ఉంది. అదే తిరుపాలమ్మకూ రమణమ్మకూ స్నానాల గది. కర్నూలు జిల్లా దాన్ని ‘జల్లాడి’ అంటారు. ‘జలహరి’ అన్న సంస్కృత పదానికి అది వికృతి కావచ్చు. ఇంటి వాళ్లందరూ బహిర్భూమికి ఊరిబయట దొంకల్లోకి పోవలసిందే.

తిరుపాలమ్మ కొడుక్కు కారం బొరుగులు తినడానికి యిచ్చింది. బొరుగులంటే మరమరాలు. వాటిల్లో రెండు చుక్కలు నూనె, ఉప్పు, కారం, కొద్దిగా గుల్లపప్పులు కలిపితే వాటిని కారం బొరుగులంటారు. పేదవారి స్నాక్ అది. వైనతేయ వాటిని యిష్టంగా తిన్నాడు

తొమ్మిదికి నాయిన వచ్చాడు. రెడ్డిగారింట్లోనే భోంచేసి వస్తాడు. రెడ్డెమ్మ (రెడ్డిగారి భార్య) ఆ రోజు తునకల కూర (మటన్ కర్రీ) కొంత కట్టి పంపింది. మిగిలిన సాదకాలు (డిషెస్) ఏవయినా ఉంటే కోనేటయ్యకు ఇస్తుందామె.

తిరుపాలమ్మ రాత్రికి కొర్రన్నం వండింది. గుడిసె మీద పాకిన సొర్ర (అనప) కాయతో పులుసు చేసింది, కందిపప్పు లేకుండా. కోనేటయ్య తెచ్చిన కూరతో అందరూ భోంచేసినారు, నాయిన తప్ప.

నాయిన సైనుగుడ్డ బనీను లోంచి ముఫ్ఫై రూపాయలు తీసి కొడుకు కిచ్చినాడు

“ఇదిగో రా పొట్టిగా, అవేవో బుక్కులు అంటివి కదా, కొనుక్కో.”

వాడు తీసుకోలేదు. “వద్దు నాయిన! మా దస్తగిరి సారు నాకు తెప్పించి ఇస్తాడుటలే.”

తండ్రి సంతోషించినాడు. ఆ డబ్బు భార్యకిచ్చినాడు. “రేపు జలదుర్గం సంతలో కూరగాయలు తెచ్చుకోడానికి పనికివస్తాయి” అన్నది సంతోషంగా ఆమె.

“అమ్మా! ఎల్లుండి నన్ను మా సారు ప్యాపిలికి వాళ్లింటికి రమ్మన్నాడు. పైటాల (మధ్యాన్నం) అన్నం వాండ్ల ఇంట్లోనే తినమన్నాడు. రాత్రి చెన్నకేశవులు దేవళంలో హరికథ ఉందంట. దానికి నన్ను తీస్కపోతాడంట. రాత్రి సారింట్లోనే పండుకోని, ఆదివారం పొద్దున వస్తానే.”

వాడి కళ్లతో వెలుగు!

“అట్లనే గాని, పోదువులే” అంది అమ్మ.

“దస్తగిరి సారు శానా మంచాడు. మన పిల్లడంటే ఆయనకంత ఇది!” అన్నాడు కోనేటయ్య. “వానికి పాటలు, పజ్యాలు నేర్పిస్తాడు.”

అందరూ గుడిసెకు ఆరుబయట నిద్రబోయినారు.

***

శనివారం పొద్దున అమ్మ చేసిన ‘ఉగ్గాణి’ తిన్నాడు వైనతేయ. పదకొండు కల్లా బయలుదేరి ప్యాపిలి చేరుకోన్నాడు. నడిచి వెళ్లాడు. సారు యిల్లు ప్యాపిలిలో ‘మేదర గేరి’లో ఉంది. మేదరులు అంటే బుట్టలు, చేటలు వగైరా అల్లేవారు. గేరి అంటే వీధి బహుశా అది కన్నడ పదం అయి ఉండవచ్చు. కర్నూలు జిల్లా సరిహద్దులో కర్నాటక రాష్ట్రం ఉంటుంది. కొన్ని కన్నడ పదాలు తెలుగులో చేరాయి. ఉదాహరణకు పెద్ద గంపను ‘జల్ల’ అంటారు. ‘ఆలస్యం’ను ‘బిడువు’ అంటారు.

సారు ఇంట్లోనే ఉన్నాడు, వైనతేయ కోసం ఎదురు చూస్తున్నాడు. వాడిని చూసి నవ్వాడు. “వచ్చినావా? వెరీ గుడ్” అన్నాడు.

సారు భార్య ప్లాస్టిక్ బిందె చంకన పెట్టుకోని, నీళ్ల కోసం బోరింగ్ దగ్గరకు బయలుదేరింది. అది చూసి వాడు “అమ్మా! నేను తెస్తాను” అని బిందె తీసుకున్నాడు. వీధి చివర బోరింగ్ ఉంది. ప్యాపిలి ప్రాంతంలో నీటికి కటకట. బోరింగ్ నీళ్ళు వాడకానికి పనికొస్తాయి.  త్రాగే నీటికి మాత్రం ఊరికి అర కిలోమీటరు దూరంలో ఉన్న ‘వంక’ (వాగు)కు వెళ్లాలి. అక్కడ చెలమలు తవ్వి ఉంటాయి. వాటిలో ఊరిన నీటిని చెంబులతో బిందెలలో నింపుకొని మోసుకుని తెచ్చికోవాలి. ప్లాస్టిక్ బిందెలు బరువుండవు. కంచు, ఇత్తడి బిందెల కంటే శానా అగ్గువ (చౌక) గా వస్తాయి. వాటితో నీళ్లు మోయడం సులభం. వైనతేయ ఏడెనిమిది బిందెలు బోరింగ్ దగ్గర కొట్టి, తెచ్చి, పెరట్లోని సిమెంట్ తొట్టి నింపాడు. దాన్ని ‘అవుత్ ఖానా’ అంటారు.

వాడు నీళ్లు తెచ్చి పోస్తుంటే సారు గాని, అమ్మ గాని వద్దనలేదు. అతి సహజంగా వాడి సేవను స్వీకరించారు వారు.

సారుకు ఒక్కతే కూతురు. ఆమెకు పెండ్లి చేశారు. అల్లుడు రాయలసీమ కార్బైడ్స్ ఫ్యాక్టరీ, కర్నూలులో ఫిట్టరు. సారుకు మేనల్లుడే. వాళ్ళు ఫ్యాక్టరీకి దగ్గరని ‘దూపాడు’లో ఉంటారు. అది కర్నూలుకు ఎనిమిది మైళ్ళు. అక్కడ రైల్వే స్టేషన్ కూడ ఉంది. అక్కడ ఇంటి బాడుగలు తక్కువ. కర్నూల్లో అయితే మిడిమాలె౦ ధరలు!

“రాండి! అన్నం తిందాము” అని పిలిచింది సారు భార్య. ఆమె పేరు కాశింబీ.

మధ్యలో అన్నం గిన్నె, పప్పు, చారుగిన్నెలు, కూర బాణలి, మజ్జిగ గిన్నె పెట్టుకున్నారు.

వైనతేయ అమ్మకు సాయం చేశాడు. వాడినీ తమతో పాటు కూర్చోబెట్టుకున్నారా దంపతులు.

గోళి కూర, మామిడికాయ పప్పు చేసిందామె. మటిక్కాయలు (కర్నూలు జిల్లా గోరుచిక్కుడును అలా పిలుస్తారు) తాలింపు చేసింది. పప్పు ఉడికిన కట్టు నీటిలో టమోటాలు వేసి చారు చేసింది.

కొసరి కొసరి వడ్డించింది వాడికి. వాళ్లింట్లో వరన్నం రోజా ఉండదు, పప్పు నాలుగు రోజులకొకసారే. ఆ భోజనం వాడికి షడ్రసోపేతంగా అనిపించింది. తృప్తిగా తిన్నాడు.

భోజనం తర్వాత సారు నవారు మంచం మీద కాసేపు పడుకున్నాడు. ముగ్గురి ప్లేట్లూ తానే తీయబోతుంటే వారించిందామె. వైనతేయ వెళ్లి ఆయనకు కాళ్ళు పట్టసాగాడు. ఆయన వద్దనలేదు. “ఒరేయ్! ఏదైనా పద్యం అందుకో” అన్నాడు.

వాడు గొంతు సవరించుకొని, సారు నేర్పిన, పోతన గారి పద్యం, రాగయుక్తంగా చదివాడు –

“అమ్మలగన్నయమ్మ, ముగురమ్మల మూలపుటమ్మ, చాల బె

ద్దమ్మ, సురారులమ్మ, కడుపారడి బుచ్చినయమ్మ, దన్నులో

నమ్మిన వేల్పుటమ్మల మనమ్ముల నుండెడి యమ్మ దుర్గ, మా

యమ్మ, కృపాబ్ధి ఇచ్చుట మహత్వ కవిత్వ పటుత్వ సంపదల్”

“గుడ్” అన్నాడు దస్తగిరి సారు. “ఇదే రాగం, తెలుసు కదా” అడిగాడు.

“మధ్యమావతి అని నీవే గద చెప్పినావు సార్” అన్నాడు వాడు.

సారు నిద్రలోకి జారుకున్నాడు.

నాలుగు గంటలకు లేచాడు. కాశింబీ ‘టీ’ పెట్టింది. వైనతేయ వాళ్లింట్లో టీ, కాఫీలుండవు! ఆ టీ అమృతోపమానంగా తోచింది వాడికి.

“అమ్మా! ‘వంక’కు పోయి మంచినీళ్లు తెస్తా” అన్నాడు

“ఉన్నాయి లేరా” అన్నదామె. వాడు వినలేదు. ప్లాస్లిక్ బిందె తీసుకుని వంకకు వెళ్లాడు. చెలిమలో అంతకముందే ఊరిన నీటిని లాఘవంగా బయటకు చల్లాడు. మళ్లీ నీరు ఊరింతర్వాత ప్లాస్లిక్ చెంబుతో నీటిని బిందెలో తోడుకున్నాడు. బిందె భుజానికెత్తుకుని సారు యింటికి పోయినాడు.

సారు భార్య వానికి వాము కారప్పూస, ఒక సొజ్జ (రవ్య) లడ్డు ఇచ్చింది.

హరికథ రాత్రి ఎనిమిదికి. ఏడున్నరకు – ఉదయం మిగిలిన కూర అన్నం తిన్నారు గురు శిష్యులు. సరిగ్గా ఎనిమిదికి చెన్నకేశవులు దేవళం చేరుకున్నారు.

ఆ దేవళం చాలా పెద్దది. పురాతనమైనది. పూర్తిగా రాతి నిర్మాణం. ఒక ఇరవైమెట్లు ఎక్కాలి. కొంచెం ఎత్తున ఉంటుంది. చెన్నకేశవస్వామివారి నిలువెత్తు విగ్రహం నల్ల రాతితో చెక్కబడి, దీపారాధనల వెలుగులో ప్రకాశిస్తూ ఉంది. గురుశిష్యులిద్దరూ స్వామివారి దర్శనం చేసుకున్నారు

పూజారి గారు, నీలకంఠ దీక్షితులు, వారికి తీర్థం ఇచ్చి, శిరసులకు శఠగోప స్పర్శ చేయించారు.

“దస్తగిరీ! హరికథకు నీవు వస్తావని నాకు తెలుసులే!” అని నవ్వాడాయన. నల్లని శరీరం ఆయనది. నుదుట తిరునామం. పసుపు రంగు ధోవతి, వంగపండు రంగు అంచుది, కాసెపోసి కట్టుకున్నాడాయన. తల వెనుక గోష్పాదమంత జుట్టును ముడి వేసుకొన్నాడు. ఎర్ర రాళ్ళు పొదిగిన చెవి కమ్మలు మెరుస్తున్నాయి. ప్యాపిలిలో ఆయన పౌరోహిత్యం కూడా చేస్తాడు. వాస్తు, జ్యోతిష్య శాస్త్రాలతో కూడా ప్రవేశముంది. పురోహితుడు అన్న పదానికి ఆయన నిలువెత్తు ఉదాహరణ. ఎందుకంటే గ్రామంలోని అన్ని వర్గాలవారికి ఆయన హితుడే. వారందరి హితం కోరేవాడు నీలకంఠ దీక్షితులు.

“వీడెవరు?” అని అడిగా డాయన దస్తగిరి సారును.

“వీని పేరు వైనతేయ. నా శిష్యుడు. వీనికి సంగీతం నేర్పిస్తున్నాను. పద్యాలు చక్కగా పాడగలడు. హరికథ వింటే అవగాహన పెరుగుతుందని తీసుకొచ్చినాను స్వామి.”

ఆయన మంటపంలోకి రాగానే వైనతేయ ఆయనకు పాదాభివందనం చేసినాడు.

“విద్యావాన్ భవ!’ అని ఆశీర్వదించినా డాయన నవ్వుతూ. “ఒరేయ్! మంచి పేరు రా నీది! దానికర్థం తెలుసునా?” అడిగాడు.

వాడు సారు వైపు చూసినాడు. ‘చెప్పమంటారా?’ అని ఆ చూపుకు అర్థం. సారు అంగీకార సూచకంగా తల ఊపినాడు.

“స్వామి, వినతాదేవి కుమారుడు వైనతేయుడు. అంటే గరుత్మంతుడు అని మా సారే నాకు చెప్పినాడు” అన్నాడు వాడు.

“శభాష్! ఈ పేరు నీకు ఎవరు పెట్టినారు? మీది ఏ ఊరు?”

“మాది ఇక్కటికి దగ్గరలోనే యానాదుల దిబ్బ గ్రామం స్వామి!”

స్వామి భృకుటి ముడిపడింది. ‘అయితే వీడు యానాదుల పిల్లవాడన్నమాట’ అనుకొన్నాడు మనసులో. బైటికి ఏమీ అనలేదు.

“మా నాయిన కోటకొండ శేషశయనారెడ్డి గారింట్లో వంట చేస్తాడండి. ఆయన బిడ్డ, అల్లుడు బెంగులూరులో ఉంటారట. నేను పుట్టినపుడు, ఆయమ్మే నాకీ పేరు పెట్టనాదంట.”

“బాగుంది, బాగుంది. సరేగాని, హరికథ మొదలు కావడానికి ఇంకా టైముంది. స్వామి వారి మీద ఏదైనా పద్యమో శ్లోకమో పాడు రా, విందాము!”

మళ్లీ సారు వైపు చూసినాడు వాడు.

“మీ గురువు అనుమతి లేకుండా గాలి కూడా పీల్చేట్టు లేవు గదరా?” అన్నాడాయన నవ్వుతూ.

“పాడురా వైనా, స్వామి అడుగుతున్నాడు కదా!” అన్నాడు సారు.

వాడు గొంతెత్తి,

“వసుదేవ సుతం దేవం కంస చాణూర మర్దనమ్

దేవకీ పరమానందం, కృష్ణం వందే జగద్గురుమ్”

అని భూపాలరాగంలో ఆలపించినాడు. కొందరు భక్తులు ఆ శ్లోకాన్ని వింటున్నారు. అప్పుడే హరిదాసుగారు అంజనేయశర్మగారు ప్రవేశిస్తున్నారు. ఆ శ్లోకం విని ఆయన ముగ్ధులైనారు.

వారిని చూసి, నీలకంఠ దీక్షితులు, దస్తగిరి స్తారు వినయంగా నమస్కరించినారు. వైనతేయ కూడా ఆయనకు మొక్కినాడు. ఆయన వాడి తల నిమిరి,

“నాయనా, నీ గాత్రం బాగుంది. శ్రుతి తప్పలేదు. సంస్కృత శ్లోకాన్ని స్వచ్ఛమైన ఉచ్చారణతో ఆలపించినావు. దీర్ఘాయుష్మాన్ భవ!” అని ఆశీర్వదించి

“ఉండండి! దైవదర్శనం చేసుకోని వస్తాను” అని వెళ్లాడు.

ధ్వజస్తంభం ముందున్న ఖాళీ స్థలంలో జంపఖానాలు పరిచి ఉన్నాయి. రెండు పెట్రోమాక్సు లైట్లు వెలుగుతున్నాయి. వేదిక అంటూ ఏదీ లేదు.

ముందు వరుసలో ప్యాపిలి గ్రామపంచాయితీ సర్పంచ్ వీరబ్రహ్మేంద్ర రెడ్డి, వైశ్య ప్రముఖడు రామలింగయ్యశెట్టి, ఇంకా కొందరు కూర్చున్నారు.

ఆంజనేయశర్మగారు కాషాయ రంగు ధోవతి ధరించారు. నడుముకు ఒక ఉత్తరీయం బిగించి కట్టుకున్నారు. ఎడమ చేతికి తెల్లని చెయినున్న వాచీ. మెడలో తులసిపేరుల మాల, పగడాల దండ ఒకటి ధరించారు. ఆలయ కమిటీ మెంబరు ఒకాయన ఆయన మెడలో బంతిపూల దండ వేశాడు.

మృదంగ విద్యాంసుడు శ్రుతి చూసుకొంటున్నాడు. ఆంజనేయశర్మ మాట మాటికి చేతివాచీలో టైము చూసుకుంటున్నాడు. ఆయన కళ్లల్లో అసహనం!

“హార్మోనిస్టు ఉరుకుందప్ప ఇంకా రాలేదు! ఏమైనాడో!” అని మృదంగ విద్వాంసుడు ఓబులేశయ్యతో అన్నాడు.

“కోడుమూరు నుంచి రావాల గద స్వామి! వస్తాడు లెండి” అన్నాడు ఓబులేశయ్య.

హరిదాసుగారికి ఒక ఆలోచన వచ్చింది.

“ఇందాక దేవళంలో ఒక శ్లోకం పాడినాడే, ఒక పిల్లవాడు! వాడేడి? ఒకసారి రమ్మనండి” అన్నాడు.

దస్తగిరి సారు, కొంచెం వెనుక వరుసలో, శిష్యునితో బాటు కూర్చుని ఉన్నాడు. ఎవరో వచ్చి హరిదాసుగారు మిమ్మల్ని రమ్మంటున్నారు అని చెబితే ఆయన ఆశ్చర్యపోయాడు. ఇద్దరూ వెళ్లారు.

“భక్తులారా! మా హార్మోనిస్టు వచ్చేందుకు కొంత ఆలస్యమయ్యేట్లు ఉంది. ఈ లోపల ఈ పిల్లవాడు కొన్ని పాటలు, పద్యాలు పాడతాడు. వినండి” అని ప్రకటించారు హరిదాసుగారు.

(ఇంకా ఉంది)

Exit mobile version