Site icon Sanchika

శ్రీమద్రమారమణ-4

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[హార్మోనిస్టు రాకపోవడంతో, అతని కోసం ఎదురు చూసే సమయంలో వైనతేయని కొన్ని పాటలు, పద్యాలు పాడమని అడుగుతారు హరిదాసు ఆంజనేయశర్మగారు. దస్తగిరిసారు అనుమతితో వైనతేయ ఒక పాట పాడతాడు. వాడి ప్రతిభని గుర్తించిన ఆంజనేయశర్మగారు, కార్యక్రమం పూర్తయ్యాకా వెంతనే వెళ్ళవద్దనీ, మీతో మాట్లాడే పని ఉందని దస్తగిరితో అంటారు. హార్మీనిస్టు రాలేదని ఆయన ఆందోళన చెందుతుంటే, మా సారు హార్మోనియం బాగా వాయిస్తాడని వైనతేయ ఆయనకి చెప్తాడు. స్థానికంగా ఒకరి ఇంటి నుంచి హార్మోనియం తెప్పించి, దస్తగిరిసారుతో వాయింపజేసి, హరికథను అద్భుతమైన రీతిలో ముగిస్తారు ఆంజనేయశర్మ. వైనతేయకు అదంతా ఒక కలలా ఉంటుంది. హరికథకుని ఆహార్యం, పద్యాలు పాడే విధానం, పాటలు ఆలపించే తీరు, సందర్భానుగుణంగా ఆయన చేసే నాట్యం, పాత్రల హావభావాల కనుగుణంగా ఆయన చేసే అభినయం, వాడిని మంత్రముగ్ధుడిని చేశాయి. హరికథ పూర్తవగానే ఉద్వేగానికి లోనై, వెళ్ళి ఆంజనేయశర్మగారి పాదాలకు నమస్కరిస్తాడు. స్వామీ అంటుంటాడు కాని ఏమీ చెప్పలేకపోతున్నాడు. వైనతేయకి రసస్ఫూర్తి కలిగిందని గ్రహించిన ఆయన, భోజనాలు చేసి వచ్చాకా, పిల్లవాడితో సహా తనని కలవమని దస్తగిరికి చెప్తారు. – ఇక చదవండి.]

గురుశిష్యులిద్దరూ ఇంటి ముఖం పట్టారు. వైనతేయ ఇంకా ఆ ట్రాన్స్ నుండి తేరుకోలేదు. దస్తగిరి సారు వాటిని పలుకరించలేదు. మౌనంగా ఉండిపోయినాడు. వాడికి సంగీతం పట్ల అభినివేశం ఉందని తెలుసుగాని, వాడింత భావావేశానికి లోనవుతాడని ఆయన ఊహించలేదు. ఆయనకు తన హైస్కూలులో తెలుగు పండితులు యాజ్ఞవల్క్య శాస్త్రి గారు చెప్పిన కాళిదాసుల వారి శ్లోకం గుర్తుకు వచ్చింది. ఆయన హైస్కూలు చదువంతా డోన్ వాసవి కన్యకా పరమేశ్వరి హైస్కూలులో జరిగింది. అది ఒక ఎయిడెడ్ స్కూలు. ఆ శ్లోకం ఇది.

“రమ్యాణి వీక్ష్య, మధురాంశ్చ నిశమ్య శబ్దాన్

పర్యత్సుకో భవతి యత్ సుఖితోపి జంతుః

త చ్చేతసా స్మరతి నూన మబోధపూర్వం

భావస్థిరాణి జననాంతర సౌహృదాని”

(అందమైన దృశ్యాలను వస్తువులను చూసినపుడు మధురమైన ధ్వనులను విన్నపుడు, ఏ కారణం లేకుండానే, సుఖంగా ఉన్న ప్రాణి మనసు ఒకానొక అలజడికి లోనవుతుంది. దేన్నో చేరుకోవాలనే తపనను అనుభవిస్తుంది. ఆ వ్యక్తి తాను ఇంతకు పూర్వం లోనవని ఒకానొక అనుభూతికి లోనవుతాడు. బహుశా పూర్వజన్మ వాసనల వల్ల ఏర్పడిన స్నేహసంబంధాలే దీనికి కారణం) అని తెలుగు సారు చెప్పిన వివరణ దస్తగిరికి గుర్తొచ్చింది. అప్పుడు విని ఊరుకోన్నాడు. ఇప్పుడా శ్లోకం లోని గొప్పదనాన్ని ప్రత్యక్షంగా తన శిష్యునిలో దర్శించాడు.

సారు భార్య ఇద్దరికీ బియ్యపు నూక ఉప్మా వడ్డించింది. దానిలోకి పుట్నాల పొడి వేసి, నెయ్యి వేసింది. ఒకమారు తిన్న తర్వా త రెండోమారు వడ్డించి, చిక్కని మజ్జిగ పోసింది.

ఇద్దరూ సావకాశంగా కూర్చున్నారు. గురువు నవారు మంచం మీద, శిష్యుడు నేల మీద!

“సార్, హరికథ ఎంత బాగుంది కద సార్!” అన్నాడు. వాడి గొంతులో ఒక తన్మయత్వాన్ని సారు గమనించాడు. వాడి తల నిమిరి, ఇలా అన్నాడు –

“ఒరేయ్ వైనా, నీవు అదృష్టవంతుడివిరా. దేవుడు నీకు పాడగల విద్యతో బాటు, ఆనందించగల సున్నితమైన మనస్సును కూడా ఇచ్చినాడు. స్వామి చూశావా, ఎంత పండితుడో? పద్యాలు చదివే విధానం గమనించావా? ఎక్కడ వాక్యాన్ని విరచాలి, ఎక్కడ రెండోసారి అనాలి, అబ్బ! మహానుభావుడు రా!”

“అవును సారు.”

“హరికథా కాలక్షేపం అనేది విభిన్నమైన ప్రక్రియ రా. సంగీతం, సాహిత్యం, అభినయం, నృత్యం, ఇలా ఎన్నో కళల సమాహారమే హరికథ. అవన్నీ ఆంజనేయ శర్మగారిలో మేళవించినాయి. ఈరోజు నిన్ను రమ్మనడం మంచిదయింది వైనా” అన్నాడు సారు.

“మీరు రమ్మన్నాక రాకుండా ఉంటానా సార్” అన్నాడు ఆ బాల రసికుడు.

“స్వామి అనుష్ఠానం, భోజనం ముగించి ఉంటారు. మనలను ఎందుకో రమ్మన్నారు. వెళ్లి కలిసి వద్దాం పద.”

ఒక టార్చి లైటు తీసుకొన్నాడు. ఆంజనేయ శర్మగారికి ఇవ్వడానికి నాలుగు అరటిపళ్ల కవర్లో వేసి, పట్టుకొమ్మని శిష్యునిచ్చినాడు. గుడి లోనే ఆయనకు యాభై రూపాయలు సంభావన చదివించి ఉన్నాడు.

వీళ్లు వెళ్లేసరికి పూజారిగారు, శర్మగారు, కంబడి పరచిన పట్టి మంచం మీద కూర్చుని తాంబూల సేవనం చేస్తున్నారు. హర్మోనిస్టు ఉరుకుందప్ప, మృదంగ విద్యాంసుడు ఓబులేశయ్య, క్రింద అరుగు మీద కూర్చున్నారు.

శర్మగారు లేచి, సంతోషంగా, వారిని ఆహ్వానించారు.

“రండి, రండి, దస్తగిరిగారు! పొద్దుపోయింది కదా, వస్తారో రారో అనుకున్నాను” అన్నారు.

“అయ్యో, స్వామి మీరు అంతగా చెప్పిన తర్వాత రాకుండా ఉంటామా?” అన్నాడు సారు.

శర్మగారు వారి పట్ల చూపుతున్న ఆదరణను చూసి, నీలకంఠ దీక్షితులుగారి ముఖం అప్రసన్నంగా మారింది. ఆయన నిరంతరం చెన్నకేశవుని సేవతో ఉన్నా, పరమాత్మ ప్రవచించిన ‘సర్వత్ర సమ దర్శన యోగం’ ఆయనకు వంటబట్టలేదు.

‘యానాదుల పిల్లవానికి దూదేకుల వాడు గురువు! సరిపోయింది. వాళ్లేదో మహా విద్వాంసులైనట్లు ఈయన వాళ్ల అడుగులకు మడుగులొత్తడం!’ అనుకున్నాడు.

“మీరు ఒక్కసారి లేస్తే, మంచం లేపి గోడకు అనిద్దాము. అప్పుడు అందరం అరుగు మీద సరిపోతాము. నాయనా ఓబులేశయ్యా, ఆ కంబడి తీసి, మడతలు విప్పి, విశాలంగా పరుచు” అన్నారు ఆంజనేయ శర్మ గారు.

దీక్షితులుగారు లేచి, “సరే, మీరు మాట్లాడుతూ ఉండండి. నేను ఇప్పుడే వస్తాను” అని లోపలికి వెళ్లిపోయారు. శర్మగారికి చూచాయగా అర్థమైంది. నవ్వుకున్నారు. కౌశికుడంతటి తపశ్శాలి, ధర్మవ్యాధుడి వద్ద ధర్మసూత్రాలు నేర్చుకున్నాడు. ‘జన్మనా జాయతే శూద్రః కర్మణా జాయతే ద్విజః’ అన్న ఆర్ష వాక్యమెంత గొప్పది? ప్రతి మానవుడూ జన్మ చేత శూద్రుడే కాని, తాను అనుసరించు సత్కర్మల చేత బ్రాహ్మణుడగుచున్నాడు. అంతేగాని, బ్రాహ్మణ కులములో పుట్టిన ప్రతివాడూ, నిజంగా బ్రాహ్మణుడనడానికి లేదు. దానికి నిదర్శనం, ఇదిగో, ఈ నీలకంఠ దీక్షితులే! శర్మగారి మనస్సు ఈ భావనతో తేలికైంది.

అందరూ కంబడి మీద కూర్చున్నారు. హార్మోనిస్టు ఉరుకుందప్పకు శర్మగారు చెప్పినట్లున్నారు. అతడు దస్తగిరి చేతులు పట్టుకోని కళ్ల కద్దుకొని, ఇలా అన్నాడు –

“సార్. ఈ రోజు మా గురువుగారి పరువు కాపాడినావు నీవు. నేను వస్తున్న బస్సు ఉడుములపాడు కాడ చెడిపాయ. అది ఆర్డినరీ బస్సు. ఇంకో బస్సు ఎక్కించనీకె కండక్టరు చూసెగానీ, ఎక్స్‌ప్రెస్సులు పనికి రావంట. వాటిల్లో ఛార్జి ఎక్కువగదా! గంటన్నర రోడ్డు మినే ఉంటిమి. ఆకరికి ఒక షేర్ వ్యానులో డోన్‌కు వచ్చి, చూస్తే ప్యాపిలికి బస్సు లేదు. అనంతపురము ఎక్స్‌ప్రెస్ ఒకటి వచ్చెగాని అది ప్యాపిలి ఊర్లోకి రాదంట. ఇంతా చేసి నేను వచ్చేటి యాలకు హరికథ అయ్యేపాయ.”

శర్మగారు నవ్వుతూ “ఈ రికార్డు ఎన్నిసార్లు వినిపిస్తావురా?” అన్నారు. ఉరుకుందప్ప మళ్లీ అన్నాడు “లేదు స్వామి, ఈ యప్ప గిన ల్యాకపోతే, ఎంత పని అయ్యేది? సారూ, మీ విద్యను గురించి స్వామి చెప్పినాడు. ఎక్కడా తడుముకోలేదంట నీవు. సొంత హార్మోనిస్టునైన నా కంటె, స్వామి గాత్రాన్ని, సలీసుగ అనుసరించి నావంట. నీ రునం తీర్చుకోలేను” అని కళ్లనీళ్ల పర్యంతమయినాడు ఉరుకుందప్ప. ‘విద్యానేవ విజానాతి విద్వజ్జనా పరిశ్రమమ్’ అన్న ఆర్యోక్తి వీరిద్దరి పట్ల నిజమైంది – అనుకోన్నారు శర్మగారు.

“సరే, నీవు కొంచెం గమ్మునుంటే, వారితో మాట్లాడదాము” అన్నారాయన.

వైనతేయను పిలిచి తన దగ్గర కూర్చోబెట్టుకున్నారు.

“నాయనా, దస్తగిరీ, వీడు సామాన్యుడు కాదు. భగవద్దత్తమైన కళతో బాటు అద్భుతమైన రసగ్రాహి. వీడిని తీర్చిదిద్దితే చక్కని సంగీత విద్వాంసుడవుతాడు. నా హరికథాగానం విని వాడు పొందిన తన్మయత్వం గమనించాను. వాడిని ఒక హరికథా విద్యాంసునిగా తయారు చేద్దాము. ఏమంటారు?”

దస్తగిరిసారు నోట మాట రాలేదు. గొంతు పెగుల్చుకుని, “మహాభాగ్యం, స్వామీ” అన్నాడు.

“తిరుపతిలో శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్య కళాశాల రెండేళ్ల సరిఫికెట్ కోర్సు ఉంది. హరికథలో దానికి పది సంవత్సరాలు నిండిన ఐదవ తరగతి పాసయిన పిల్లలు అర్హులు. అది పార్ట్ టైం కోర్సు. వీడిప్పుడు ఏమి చదువుతున్నాడు?”

“మూడో తరగతి ఈ మార్చికి అయిపోతుంది స్వామీ. నాలుగో తరగతికి వస్తాడు.”

“మీరు వీడి తల్లిదండ్రులతో మాట్లాడండి. నేను వీడిని నాతో కౌతాళం తీసుకుని వెళతాను. స్కూల్లో టి.సి. మీరే ఎలాగూ ఇస్తారు. నాలుగు, ఐదు తరగతులు, కౌతాళం ఎలిమెంటరీ స్కూల్లో చదివిస్తాను. ఈ రెండేళ్ళూ నా దగ్గర సంగీతంలో, హరికథాగానంలో శిక్షణ ఇస్తాను. మా ఇంట్లోనే ఉంటాడు.

తిరుపతి శ్రీ వెంకటేశ్వర సంగీత నృత్యకళాశాలలో నా షడ్డకుడు కైప సదాశివశర్మగారు ఆచార్యులుగా పని చేస్తున్నారు. ఆయన సాయంతో వీడిని అక్కడ చేర్పిద్దాము. ఒక సర్టిఫికెట్, అందునా, తిరుపతి వారిది ఉండటం మంచిది కదా! అక్కడే హైస్కూలులో చేర్పిద్దాము. ఏడవ తరగతి పూర్తయ్యే సరికి హరికథ కోర్సు కూడా పూర్తవుతుంది.

తర్వాత మళ్లీ మీ దగ్గరకే వస్తాడు. ఒక ముఖ్య విషయం. కేవలం హరికథలనీ వృత్తిగా స్వీకరిస్తే, జీవనం జరుగదు. లౌకిక విద్య కూడా అవసరమే. ఏదైనా ఉద్యోగం చేస్తూ, ప్రవృత్తిగా దీనిని కొనసాగించాలి. మా తరం వారికి చెల్లింది కాని, ఇప్పుడు కుదరదు. తిరుపతి నుంచి వచ్చిన తర్వాత, చదువును ఎలా కొనసాగించాలో మీరు ప్రణాళిక వేద్దురు గాని.”

వైనతేయకు ఆయన చెప్పినది అర్థమైంది. తనను కేవలం మెచ్చుకోవడంతో సరిపెట్టకుండా, తన జీవితాన్ని తీర్చిదిద్దాలని కృతనిశ్చయంతో అంజనేయ శర్మగారున్నారని ఆ పిల్లవాడికి అర్థమైంది. కన్నీళ్లతో ఆయన పాదాలతో నమస్కరించాడు.

“మరి వీడి తల్లిదండ్రులు ఒప్పుకుంటారో లేదో?” అన్నారు శర్మగారు.

“నేను వారితో మాట్లాడి, నచ్చ చెప్పి, ఒప్పిస్తాను స్వామి. వారు నా మాట కాదనరు లెండి.”

“ఇంకా రెండేళ్లుంది కదా! ఐదవ తరగతి పరీక్షలు అవగానే తిరుపతిలో చేర్చుదాము. ఈ మూడవ తరగతి పరీక్షలు రాసిన వెంటనే నా దగ్గరకు తీసుకొని రండి.”

దస్తగిరిసారు ఆయనకు పాదాభివందనం చేశాడు. గురుశిష్యులిరువురూ ఇంటికి బయలుదేరారు. దారిలో సారు అడిగాడు.

“వైనా, మరి శర్మగారి దగ్గర విద్య నేర్చుకుంటావా?”

“తప్పకుండా సారు. ఆయన హరికథ చెపుతూ ఉంటే, ఏనాడైనా నేను అట్లా చెప్పాలనిపించింది.”

“వెరీ గుడ్. భగవంతుడు ఆయన రూపంలో నీకు తారసిల్లాడు. నీ జీవితం మలుపు తిరగబోతుంది.”

వైనతీయ కళ్ళు వెలుగుతున్నాయి, ఆ చీకట్లో కూడా!

“నిజము సార్! దేవుడే ఆయన” అన్నాడు భక్తిగా.

***

మర్నాడు ఆదివారమే కాబట్టి, దస్తగిరిసారు కూడా వైనతేయతో యానాదుల దిబ్బకు బయలుదేరాడు, తన సైకిలు వెనక వాడిని కూర్చోబెట్టుకొని.

సారును చూసి కోనేటయ్య దంపతులు ఆశ్చర్యపోయి, నులకమంచం వాల్చి, దాని మీద షోలాపూరు దుప్పటి పరిచి, కూర్చోబెట్టారు, ఇంటి బయటే, చెట్టు కింద.

“మావాడు బడిలో బాగా సదువుకుంటున్నాడా సారు?” అనడిగింది తిరుపాలమ్మ ఆందోళనగా.

సారే స్వయంగా తమ యింటికి వచ్చినాడంటే వీడేమయినా అల్లరి పని చేసినాడేమో అని ఆమె అనుమానం.

“వానికేమమ్మా! బాగా చదువుతాడు. మాణిక్యం పుట్టింది తల్లీ నీ కడుపున!” అన్నాడు దస్తగిరిసారు.

అమ్మానాన్నల కళ్లల్లో ఆనందం! మగని సైగను అర్థం చేసుకొని, కొంచెం దూరం లోని కిరాణా షాపుకు వెళ్లిందామె. ఒక బ్రూ పాకెట్టు చిన్నది, రెండు రూపాయల చక్కెర తెచ్చుకుంది. ఇంట్లో పాలు కొద్దిగా ఉన్నాయి. పొయ్యిలో ఎండుపుల్లలు వెలిగించి, సత్తు గిన్నెలో పాలు మరిగించి, వాటిలో బ్రూ పౌడరు, చక్కెర కలిపింది.

వాళ్లింట్లో ఒకే ఒక స్టీలు గ్లాసుంది. అదీ కొంచెం సొట్ట పడింది. దానిలో కాఫీ పోసింది. ఇంకో సత్తుగ్లాసులో మగనికి కొంచెం పోసుకుని, బయటకు వచ్చి ముందు దస్తగిరి సారుకో గ్లాసునందించింది.

“ఎందుకమ్మా, ఇప్పుడివన్నీ అవసరమా?” అన్నాడాయన గ్లాసందుకుంటూ.

“అయ్యో. సారు!” అని నొచ్చుకుంది తిరుపాలమ్మ. “నీవు మా యింటికి రావడమే శాన. కాపీ అయిన ఇచ్చుకోకుంటే ఎట్ల?” అన్నది. మగనికి ఇస్తే “నాకెందుకే? పిల్లోనికి ఇయ్యి” అన్నాడు.

“నా కొద్దు నాయినా, నీవే తాగు” అన్నాడు వైనతేయ. “సారమ్మ నాకు పొద్దున టీ ఇచ్చినాదిలే” చెప్పాడు.

“జొన్న రొట్టెలు కాలుస్త! రెండు తినిపో సారు! కాని రొట్టెలోకి గొడ్డు కారం నూరినా. నేతిసుక్క లేదు సారు” అన్నదామె.

“ఏం పరవాలేదు. చెయ్యమ్మా! గొడ్డు కారం, జొన్నరొట్టె, అంటే నాకిష్టం!” అన్నాడు దస్తగిరిసారు.

యానాదుల యింట్ల తాను తినడేమో అన్న, వారి న్యూనతా భావాన్ని అలా పోగొట్టాడు ఆ గురువర్యుడు. ఆమె లేచి వెళ్లబోతుంటే,

“అమ్మా, కొంచెంసేపు తాళు. మీ ఇద్దరితో ఒక ముఖ్య విషయం మాట్లాడదామని వచ్చినా, అదే పనిగా” అన్నాడు సారు.

“చెప్పు సారు” అన్నాడు కోనేటయ్య వినయంగా.

వైనతేయ ఉత్కంఠగా చూస్తున్నాడు

“నేను మన వైనాకు పాటలు, పద్యాలు నేర్పిస్తున్నా గదా! నిన్న వాడిని ప్యాపిలి లోని చెన్నకేశవుల దేవళంతో జరిగిన హరికథకు తీసుకుపోయినా. అక్కడ వాడు ఒక శ్లోకం, ఒక పాట పాడినాడు. హరికథ చెప్పే స్వామి పెద్ద పండితుడు. ఆయన పేరు ఆంజనేయ శర్మ గారు. ఆయనది ఆదోని దగ్గర కౌతాళం.

మన వాని గాత్రం చానా బాగుందని స్వామి మెచ్చుకున్నాడు. సంగీతంలో తరిఫీదు ఇప్పిస్తే, గొప్ప గాయకుడైతాడనీ, హరికథా విద్వాంసుడవుతాడని స్వామి చెప్పినాడు.  వాడిని వచ్చే రెండేళ్లు, తన దగ్గర, కౌతాళంలో పెట్టుకుని నాలుగు, ఐదు తరగతులు అక్కడే చదివిస్తాడంట స్వామి. తర్వాత మన వైనతేయను తిరుపతిలోని శ్రీ వెంకటేశ్వర స్వామి సంగీత పాఠశాలలో చేర్పించి, హరికథ కోర్సు చదివిస్తాడు. ఏడవ తరగతి తర్వాత, వాని పైచదువులు నేను చూసుకుంటాను. నా మాట విని వాడిని పంపండి. మీకూ, నాకూ, మంచి పేరు తెస్తాడు” చెప్పాడు సారు.

కోనేటయ్య, తిరుపాలమ్మ అవాక్కై చూడసాగారు. సారు మాటలు వారి మెదళ్లలోకి చేరడానికి కొన్ని క్షణాలు పట్టింది.

“అయితే, మా పిల్లోడు మమ్మల్ని విడిచిపెట్టి నాలుగేండ్లు ఉంటాడా?” అన్నాడు కోనేటయ్య. “ఒకే కొడుకు సారు! మా రమణమ్మకు మనువు వేసి పంపిస్తే, మాకు వాడు తప్ప దిక్కెవరు? మేము వాడిని విడిచిపెట్టి ఉండలేము సారు!” అన్నాడు.

వైనతేయకు కూడా, అమ్మను, నాన్నను వదిలిపెట్టి పోవాలంటే బాధగానే ఉంది.

కాని, తిరుపాలమ్మ ఇలా అనింది – “సారు, ఆయప్ప మాటలకేంగాని, మా వాన్ని పంపిస్తాము. మాకాడ ఉంటే ఏమొస్తాది? వాండ్ల నాయిన లెక్క ఏ రెడ్డి గారింట్లోనో వంటలు చెయ్యాల. దేవుడు వానికి పాడే వరం ఇచ్చినాడు. నీవు వాడికి అండగా ఉంటివి. ఆ కౌతాళం స్వామి ఎవరో, మానుబావుడు! (చేతులెత్తి కనబడని ఆంజనేయ శర్మగారికి మొక్కిందా తల్లి) బ్రేమ్మలు మా యానాదోల్లను ఇండ్ల ఛాయలకే రానియ్యరు. అసుమంటిది, ఆ స్వామి, మన పిల్లోన్ని చేరదీసి విద్దె నేర్పిస్తానంటుంటే, అంత బాగ్గిం వదులుకుంటామా?”

కోనేటయ్య భార్య వైపు చూసినాడు. తర్వాత దస్తగిరి సారు వైపు చూసినాడు. వైనతేయను రమ్మని మీద కూర్చోబెట్టుకున్నాడు.

“ఒరేయ్, అమ్మ చెప్పింది ఇన్నావు కదా! సారొల్ల ఎంబడి పోయి విద్య నేర్చుకుంటావా?” అని అడిగాడు.

“మా సారు ఎట్ల చెపితే అట్ల జేస్తా నాయిన” అన్నాడు వాడు.

తిరుపాలమ్మ ఆలోచనా విధానం, పరిస్థితిని ఆమె సమీక్షించిన తీరు, దస్తగిరిసారుకు అబ్బురం కలిగించాయి. ‘మగనికి, ఆమెకూ ఎంత తేడా?’ అనుకున్నాడాయన. కొడుకు భవిష్యత్తు పట్ల ఆ తల్లికున్న అవగాహన గొప్పది అని సారు ఆమెను లోలోపల మెచ్చుకున్నాడు.

“అయితే ఇంకేం? శుభం” అన్నాడాయన. “పెద్ద పరీక్షలు మరో మాడు నెలలే ఉన్నాయి. అవి రాసిన తర్వాత మా బళ్ళో నేనే టి.సి. ఇస్తాను. వీన్ని తీసుకుపోయి కౌతాళంలో స్వామి దగ్గర వదిలి వస్తా. ఆయన చూసుకుంటాడు.”

తిరుపాలమ్మ పెట్టిన జొన్నరొట్టెలు, గొడ్డు కారం తిని, దస్తగిరిసారు ప్యాపిలికి ఎలబారినాడు, తన సైకిలు మీద! వెళ్లే ముందు వారిని అనునయించినాడు ఇలా –

“మధ్యలో అప్పుడప్పుడు వచ్చి పోతుంటాడులే. మీరు ఎదారు (బెంగ) పడవాకండి!”

ప్రతిభను గుర్తించడం వేరు, ప్రశంసించడం వేరు, దానిని పూనికతో పెంపొందింప చేయడం పూర్తిగా వేరు! దస్తగిరిసారు, ఆంజనేయశర్మ గారు మూడో కోవకు చెందినవారు!

(ఇంకా ఉంది)

Exit mobile version