Site icon Sanchika

శ్రీమద్రమారమణ-5

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[గురుశిష్యులిద్దరూ ఇంటికి వెళ్తారు. వైనతేయ ఇంకా ఆ ట్రాన్స్ నుంచి తేరుకోడు. వాడింత భావావేశానికి లోనవుతాడని ఊహించని దస్తగిరిసారు తన చిన్నప్పుడు తెలుగు మాస్టారు చెప్పిన శ్లోకాన్ని గుర్తు చేసుకుంటాడు. ఆ శ్లోకం గొప్పదనాన్ని ఇప్పుడు ప్రత్యక్షంగా శిష్యునిలో గమనించాడు.  భోజనం చేశాకా, కాసేపు గురుశిష్యులిద్దరూ హరికథ గురించి, శర్మగారి గురించి మాట్లాడుకుంటారు. కాసేపాగి పూజారి గారింటికి వెళ్తారు. అక్కడ శర్మగారు, పూజారి గారు కంబళి పరచిన మంచం మీద; హర్మోనిస్టు ఉరుకుందప్ప, మృదంగ విద్యాంసుడు ఓబులేశయ్య, క్రింద అరుగు మీద కూర్చుని ఉంటారు. వీళ్ళను చూసి శర్మగారు సంతోషంగా ఆహ్వానిస్తారు. మంచం మీద కంబళి తీసి, కింద పరిస్తే, అందరం కూర్చోవచ్చని అంటారు శర్మగారు. ఆంజనేయశర్మగారు ఆ గురుశిష్యుల పట్ల చూపుతున్న ఆదరణ  పూజారి నీలకంఠ దీక్షితులుగారికి నచ్చదు. పని ఉందంటూ, ఆయన లోపలికి వెళ్ళిపోతారు. అసలు విషయం గ్రహించిన శర్మగారు నవ్వుకుంటారు. తన బదులుగా హార్మోనియం వాయించి, హరికథకు ఆటంకం కలగకుండా చూసినందుకు ఉరుకుందప్ప దస్తగిరికి ధన్యవాదాలు చెప్తాడు. తను ఎందుకు సమయానికి రాలేకపోయాడో వివరిస్తాడు. శర్మగారు వైనతేయ విషయంలో తన ప్రణాళికను వెల్లడిస్తారు. ముందుగా తమ ఊరిలో రెండేళ్ళు, ఆ పై తిరుపతిలో మరో రెండేళ్ళు హరికథా కోర్సు చేయిస్తానని చెప్తారు. ఆ తరువాత మామూలు చదువు కొనసాగించాలని చెప్తారు. సరేనంటాడు దస్తగిరి సారు. ఇంటికి వస్తూ, దారిలో వైనతేయని అడిగితే, తనకూ ఆయనలా హరికథలు చెప్పాలని ఉందని అంటాడు. మర్నాడు సైకిల్ మీద వైనతేయని యానాదుల దిబ్బకు తీసుకువెళ్ళి దింపుతాడు దస్తగిరి. సారు స్వయంగా వచ్చేసరికి కోనేటయ్య, తిరుపాలమ్మ కంగారుపడతారు. మా వాడేమైనా తప్పు చేశాడా అని తల్లి అడుగుతుంది. అదేం లేదని చెప్పి, జరిగినదంతా చెప్పి – ఆంజనేయ శర్మగారి ప్రతిపాదనని వారికి వివరిస్తారు. నాలుగేళ్ళ పాటు కొడుకుకి దూరంగా ఉండలేమని కోనేటయ్య అంటాడు. తిరుపాలమ్మ మాత్రం, కొడుకుని పంపిస్తానంటుంది. ఆ స్వామి గొప్పోడంటూ చేతులెత్తి మొక్కుతుంది. కోనేటయ్య కూడా సరేనంటాడు. తిరుపాలమ్మ చేసిన జొన్నరొట్టెలు తిని దస్తగిరి ఇంటికి బయల్దేరుతాడు. – ఇక చదవండి.]

పెద్ద పరీక్షలు (యాన్యువల్) అయిపోయినాయి. ఈ మూడు నెలలూ కొడుకును అపురూపంగా చూసుకోన్నారు వారు. పెదరెడ్డి దగ్గర రెండువందలు అడిగి తెచ్చుకున్నారు. పిల్లవానికి రెండు జతలు నిక్కరు, అంగీ, ఒక టవలు, ఒక కొత్త దుప్పటి కొనిచ్చినారు ప్యాపిలి కోమట్ల బట్టల మళిగెలో. యాభై రూపాయలు దగ్గర పెట్టుకోమని కొడుక్కు ఇచ్చినారు.

ఆంజనేయ శర్మ గారి వద్ద నుంచి పోస్టుకార్డు వచ్చింది, దస్తగిరి సారుకు బడి అడ్రసుకు వ్రాసినారాయన.

“చి. దస్తగిరికి, దీవించి వ్రాయటనది. మనం అనుకొన్నట్లు, చి. వైనతేయను నా దగ్గరికి తీసుకు రావలసినది. సకల ఏర్పాట్లూ చేసినాము. ఇట్లు ఆం.శ. వ్రాలు.”

టి.సి. రాసినాడు సారు. అందులోనే మూడవ తరగతి పాస్ అయినట్లు నమోదు చేసినాడు. తల్లి తండ్రుల కాళ్ళకు మొక్కి, చేతిసంచీలో బట్టలు సర్దుకొని తయారైనాడు వైనతీయ. కోనేటయ్యకు, తిరుపాలమ్మకు ధైర్యం చెప్పడం కోసమని దస్తగిరి సారు స్వయంగా వచ్చినాడు.

గురుశిష్యులిద్దరూ ప్యాపిలిలో పల్లె వెలుగు బస్సు ఎక్కి, గుత్తిలో దిగినారు. గుత్తిలో ఆదోని ఎక్స్‌ప్రెస్ ఎక్కి, గుంతకల్, పత్తికొండ మీదుగా ఆదోని చేరినారు. అటు వెల్దుర్తికి పోయి, కోడుమూరు మీదుగా కూడ పోవచ్చు ఆదోనికి. కాని కొంచెం చుట్టు అవుతుందని సారు ఈ రూటు ఎంచుకొన్నాడు.

గుంతకల్ పెద్ద టవును. రైల్వే జంక్షన్. అక్కడ బోజనానికి బస్సు ఆపినారు. సారు వాటిని బస్టాండు ఎదురుగా ఉన్న ‘ఉడిపి కృష్ణభవన్’కు తీసుకునిపోయి భోజనం పెట్టించినాడు తనతో బాటు. అరటి ఆకులో టమోటా పప్పు, వంకాయ కూర, సాంబారు, పెరుగు వడ్డించినారు. వైనతేయకు ఆ భోజనం అమృతోపమానంగా తోచింది. అటువంటి భోజనం చేయడం వాడి జీవితంలో అదే మొదటిసారి.

“సార్, నా దగ్గర యాభై రూపాయలు ఉండాయి. మా నాయిన ఇచ్చె” అన్నాడు వాడు.

సారు వాని నెత్తిన సున్నితంగా మొట్టి, నవ్వుతూ అన్నాడు “ఉండనీలేరా తిక్కోడా!”

ఆదోని నుంచి కౌతాళం బస్సు ఎక్కినారు. నలభై ఐదు నిమిషాల ప్రయాణం. వారు కౌతాళం చేరేసరికి మధ్యాహ్నం మూడు కావస్తుంది.

కౌతాళం పెద్ద ఊరే. ప్యాపిలి అంత ఉంటుందనిపించింది దస్తగిరి సారుకు. ప్యాపిలి నేషనల్ హైవే మీద ఉండడం వల్ల డెవలప్ అయింది. ‘ఈ ఊరు ఇంచుమించు కర్నాటక బార్డరు’ అనుకున్నాడు.

ఆంజనేయ శర్మగారి ఇల్లు ఎక్కడని అడిగితే, ఒకాయన వారి వెంట వచ్చి చూపించాడు. ఆయన ఇల్లు పెద్ద గేరి (మెయిన్ స్ట్రీట్) లోనే ఉంది. ఇంటి ముందు రెండు అరుగులు, పెద్ద వాకిలికి అటూ ఇటూ ఉన్నాయి. వాటి మీదుగా ‘వారపాగు’ దించి ఉంది. వాటికిందుగా సైడు కాలువపై బేతంచెర్ల నాపబండలు పరచి ఉన్నాయి.

గుమ్మం దాటినంకనే ఒక పడసాల (హలు) ఉంది. అది విశాలంగా ఉంది. మధ్యలో టేకు స్తంభాలు పైకప్పుకు దన్నుగా ఉన్నాయి. వాటికి నల్లని పెయింట్ వేశారు. అవి నున్నగా మెరుస్తున్నాయి. వాటి అడుగు భాగాలను రాతి దిమ్మలపై నిలిపారు.

పడసాల లోని కుర్చీలో కూర్చుని ఆంజనేయ శర్మగారు ఏదో పుస్తకం చదువుతున్నారు. వీళ్లను చూసి లేచి, ఆదరంగా ఆహ్వానించారు.

“రాండి నాయనా, కూర్చొండి” అని గోడకానించి ఉన్న బెంచీ చూపారు. “వెనక జల్లాది (బాత్‍ రూం) ఉన్నది. వెళ్లి కాళ్లు కడుక్కోండి” అన్నారు.

వెనక పెరడు ఉంది. ఒక మూల జల్లాది. దానికి పైకప్పు లేదు. ఒక పెద్ద బాదం చెట్టు, నందివర్ధనం చెట్టు, కొన్ని కూరగాయ మొక్కలు, కొన్ని చెండు (బంతి) పూలమొక్కలు ఉన్నాయి. ఒక చేదబావి ఉంది. ఒక ఇనుప బకెట్, చిన్నది, బావి చప్టాపై ఉంది. దానికి కొబ్బరితాడు బిగించి ఉంది. బావిపైన అడ్డంగా వేసిన దూలానికి గిలక (కప్ప) బిగించి ఉంది.

వైనతేయ, బక్కెటుతో నీళ్లు తోడాడు. నీళ్ళు పైకే ఉన్నాయి. ఇద్దరూ కాళ్లు చేతులూ కడుక్కొని వచ్చినారు. వచ్చి స్వామి ఎదుట బెంచీపై కూర్చున్నారు.

“ఇదిగో, ఒకసారి ఇట్లా రా” అని పిలిచారు స్వామి. లోపల నించి ఒక ముత్తయిదువ బయటికి వచ్చింది. “ఈమె నా శ్రీమతి వల్లెలాంబ. నేను చెప్పానే, వైనతేయ, వీడే ఆ పిల్లవాడు. వీనిని, వీని లోని ప్రతిభను గుర్తించి పోత్సహిస్తున్న వీని గురువు దస్తగిరి” అని ఉభయులకు పరస్పరం పరిచయం చేశారాయన.

ఆయన అంజనేయుడయితే, ఆమె సాక్షాత్తు సువర్చలా దేవిలా ఉంది. గళ్ల నేతచీర కట్టుకుంది. ఆమె ఫాల భాగాన కుంకుమ బొట్టు మెరుస్తూంది. చేతికి మట్టిగాజులు. మెడలో నల్లపూసల పేరు, తాళిబొట్లు అంతే. “మీ గురించి ఈయన అనుకోని క్షణం లేదు నాయనా! చాలా సంతోషం మీరు వచ్చినందుకు! ఉండండి, ఏదైనా ఫలహారం పట్టుకొస్తాను. ఎప్పుడు ప్రయాణమైనారో ఏమో?” అంటూ లోపలికి వెళ్లిందామె.

మూడు స్టీలు ప్లేట్లలో అరిసెలు, వాము కారాలు పెట్టుకొని వచ్చి అందరికీ ఇచ్చింది. తిన్న తర్వాత చిక్కటి ఫిల్టర్ కాఫీ ఇచ్చింది.

“పక్కవీధిలోనే సర్కారు వారి ఎలిమెంటరీ స్కూలుంది. పెద్దదే. నాలుగువందల మంది విద్యార్థులుంటారు. మన వాడి గురించి చెప్పాను. హెడ్మాస్టరు పోసెట్టి నా శిష్యుడే. నాలుగో తరగతిలో చేర్చుకుంటానని చెప్పినాడు. ఇంకా ఎండాకాలం సెలవులు నెలకు పైగా ఉన్నాయి కదా! స్కూళ్ళు తెరిచేంత వరకు పిల్లవాడికి స్వరాలు, రాగాలు, ఆరోహణ, అవరోహణ, మంద్రం, ఉచ్చస్థాయి, ఇలాంటి వన్నీ నేర్పిస్తాను” అన్నారాయన.

“వీడు ఉండటానికి బాలుర సంక్షేమ వసతిగృహం ఏదైనా..” అని దస్తగిరి సారు అంటుండగానే శర్మగారు కలుగజేసుకొని “ఎంత మాటన్నావు నాయనా, వాడు హాస్టల్లో ఉంటే నా వద్ద విద్య నేర్చుకునేదెప్పుడు? ఈ రోజు నుంచి వాడు మా దగ్గరే ఉంటాడు. మేం తిన్నదే తింటాడు. పెరట్లో ఒక కొట్టుగది నిరుపయోగంగా ఉంది. మొన్ననే దానిని మా వల్లి శుభ్రం చేయించి పెట్టింది. అందులోనే వాడుండబోతున్నాడు. రెండేళ్లు ఎంతలో గడుస్తాయి దస్తగిరీ! తర్వాత తిరుపతికి వెళ్లాల్సిందేనాయె” అన్నారాయన. ఆయన విశాల దృక్పథం తెలియక హాస్టలు ప్రస్తావన తెచ్చినందుకు దస్తగిరి సారు పశ్చాత్తాప పడినాడు. శర్మగారు కొంచెం మనసు నొచ్చుకున్నట్లనిపించిది.

“క్రమించండి, స్వామి! మహోన్నతమైన మీ వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోలేకపోయినాను” అన్నాడు.

“అబ్బాయీ, ఈ కులం పట్టింపులు నాకు గాని, మా వాండ్లకు (శ్రీమతి) గాని లేవయ్యా! అన్ని జీవులలో పరమాత్మ ఉన్నాడనే కదా సాక్షాచ్చంకర మహదేవుడు ఆదిశంకరుల వారికి కనువిప్పు కలిగించింది! మేము స్మార్తులము. అద్వైత సిద్ధాంతాన్ని అవలంబిస్తాము. జీవునికి దేవునికీ అభేదమే కదా అద్వైతమంటే!” అని,

“మాకు ఏ బాదరబందీ లేదు. ఒక్క అమ్మాయి. దానికి వివాహం చేసి పంపినాము. అల్లుడు కర్నాటక బ్యాంకు, రాయచూరులో ఆఫీసరు. వాండ్లకు ఒక కొడుకు. దౌహిత్రుడన్నమాట. పిత్రార్జితం ఈ ఇల్లు, ఒక ఎకరం తరిపొలం (మాగాణి), ఐదెకరాలు వెలిపొలం (మెట్ట) ఉన్నాయి. వాటిని సరికారు కిచ్చినాను. మీవాడే హుసేనప్ప అని నాకు నమ్మినబంటు, మా తండ్రి, గారి కాలం నుండి వాళ్ళే మా పొలాలు సాగు చేస్తున్నారు. వరి మడికి తుంగభద్ర కాలువ నీళ్లు అందుతాయి. సాలుకు ఇరవై బస్తాల వడ్లు. ప్రశస్తమైన ‘ఈతగొలలు’ రకాన్ని పండిస్తాడు మా హుసేనప్ప. గరిసెలో పోసిపోతాడు. మూడు నెలల కొకసారి మర పట్టించి బియ్యం ఇంటికి తెస్తాడు. వాడి భార్య మస్తానమ్మ వాటిని శుభ్రం చేసి యిస్తుంది.

ఇక వెలిపొలంలో బుడ్డలు (వేరుశనగ) పంట వేస్తాము. మధ్యలో కంది మొక్కలు అక్కిళ్లు (వరుసలు)గా విత్తుతాము. సాలుకు సరిపడా కందులు వస్తాయి. ఎకరానికి ఐదు బస్తాల చొప్పున బుడ్డలు, నా భాగానికి 25 బస్తాలు వస్తాయి. వాటిని వసంత గుప్త గారి నూనె మిల్లుకు తోలతాము. సరే నా హరికథా గానాల ద్వారా ప్రతి నెలా ఆ పరాత్పరుడు అంతో ఇంతో ప్రసాదిస్తూనే ఉంటాడు. కాబట్టి ఆర్థికానికేమీ లోటు లేదు” అన్నాడా విద్వన్మణి.

“ఇక కులం అంటావా? అది మనం ఏర్పరచుకున్నది. భగవంతుడు గొల్లవానిగా పుట్టి గీతోపదేశం చేయలేదా? బోయవాడైన వాల్మీకి రామాయణ మహాకావ్యాన్ని రచించలేదా? రాయల వారు రచించిన ‘ఆముక్త మాల్యద’లోని మాల దాసరి వృత్తాంతాన్ని గురించి వినే ఉంటావు. ఆయన కన్నా జ్ఞానులమా? మా అమ్మ నేను పుట్టగా చనిపోతే, నాకు పాలిచ్చి సాకింది నాగరత్నమ్మ అని మా ఇంట్లో అప్పుడు పని చేస్తున్న ఈడిగె ఆమె (కల్లు గీత కులం). ఆ రోజు ఆమె నన్ను అక్కున చేర్చుకోకపోయి ఉంటే ఈ ఆంజనేయశర్మ ఎక్కడుండేవాడు? ‘సర్వదేవ నమస్కారః కేశవం ప్రతి గచ్ఛతి’ అన్నారు. ఈ వైనతేయుడున్నాడే, వీడిని చూసినప్పటి నుంచీ నాకో అదొక అనిర్వచనీయమైన ఆపేక్ష కలిగింది. మా హరికథకు రాను రాను ఆదరణ తగ్గుతూంది. ఈ విద్యకు వారసులు లేరే అని మథనపడేవాడిని. ఆ భగవంతుడే వీడిని నాకు తారసింప చేసినాడు.

ఏడవ తరగతి వరకు తిరుపతిలో చదువు, హరికథ కోర్సు చేస్తాడు. తర్వాత జీవికకు పనికి వచ్చి చదువును చదివించే బాధ్యత నీది. వీని తల్లిదండ్రులకు నా కృతజ్ఞతలు తెలియచేయి, మన మీద నమ్మకంతో మనకు ఇంత చిన్న వయసుతో వీడిని అప్పగించినందుకు” అన్నారాయన.

ఆయన సంస్కారానికి ముగ్ధుడైనాడు దస్తగిరిసారు. తాను వారికి మహోపకారం చేయబూనుతూ, పైగా వారికే కృతజ్ఞతలు తెల్పమంటున్నారు!

“మరి నేను, మీరు అనుమతిస్తే, బయలుదేరుతాను స్వామి!” అన్నాడు చేతులు జోడించి.

“నీకేమైనా పిచ్చా? వెర్రా?” అన్నాడాయన. “ఇంత ప్రయాణం చేసి వచ్చి, వెంటనే వెళ్లిపోతానంటావా? రెండ్రోజులుండు. పిల్లవాడు కొత్త తీరి స్తిమితపడేంత వరకు” అని ఆదేశించారాయన.

దస్తగిరిసారు అంగీకరించాడు.

“ఒరేయ్, నాయిన! ఏదైనా ఆలపించు, ఒకసారి”

“మన స్కూలు ప్రేయర్‌లో పాడే పద్యం పాడి వినిపించరా” అన్నాడు సారు.

వైనతేయ ‘ఎవ్వనిచే జనించు..’ పద్యం గొంతెత్తి పాడాడు. వల్లెలాంబమ్మ బైటికి వచ్చి పద్యాన్ని విని, ప్రశంసగా తల ఊపింది.

“బాగుంది. దీన్ని ‘కల్యాణి’లో నేర్పాడు మీ దస్తగిరిసారు. నేను దీనినే ‘మాల్కోస్’ లో పాడతాను. జాగ్రత్తగా విను” అని మాల్కోస్ రాగంలో ఆ పద్యాన్ని ఆలపించారాయన. పిల్లవాడు శ్రద్ధగా విన్నాడు.

“ఏదీ ఈ రాగంలో ఆ పద్యాన్ని పాడు”

వాడు తడుముకోకుండా, అచ్చం ఆంజనేయ శర్మగారు పాడినట్లే, ఆ పద్యాన్ని పాడాడు

“శహభాష్!” అన్నారు శర్మగారు. “ఎక్కడా ఒక్క సంగతి తప్పలేదు. దస్తగిరీ, చూసినావా? వీడు ఏకసంథాగ్రాహి” అని మెచ్చుకున్నారు. వల్లెలాంబ వాడి దగ్గరికి వచ్చి వాడిని అక్కున చేర్చుకుని, తల నిమిరింది.

“యశస్వీ భవ! నాయనా!” అని దీవించింది.

సామాన్లు అన్నీ ఒక మూలకు సర్దించారు కొట్టు గదిలో ఇది వరకే. చిన్న గది. వీధి వైపుకు ఒక కిటికీ ఉంది. గోడకానుకొని ఒక చెక్కభోషాణం పెట్టె ఉంది.

వల్లెలాంబ “నాయనా, నీవు దాని మీద పండుకోవచ్చు. దాంట్లో పూర్వీకుల నుంచి వస్తున్న ఇత్తడి, రాగి పాత్రలున్నాయి. నీకు ఒక పాత జంపభానా ఇస్తాను. దాని మీద పరుచుకొందువుగాని” అని చెప్పి, “దుప్పటి..” అని అంటుండగా,

“మా అమ్మ ఇచ్చిందండి” అని బ్యాగు లోంచి షోలాపూరు దుప్పటి తీసి చూపించాడు వాడు.

“బావి దగ్గర స్నానం చేయవచ్చు. కక్కసు దొడ్డి అటువైపు మూలగా ఉంది. మన వీధి దాటితే రెండు ఫర్లాంగుల దూరంలో ఒక బీడు ఉంది. అక్కడికి బహిర్భూమికి పోయినా సరే!” అన్నాడు శర్మగారు

ఏదో బయట అరుగు మీద పడుకోమనకుండా, పిల్లవాడికి అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తూన్న ఆ పుణ్యదంపతులకు మనసు లోనే ప్రణమిల్లాడు దస్తగిరిసారు.

రాత్రి అందరికీ గుంట పొంగణాలు పోసిందా అన్నపూర్ణమ్మ. మధ్యాన్నం మిగిలిన అన్నం కొద్దిగా ఉంటే, మజ్జిగ, ఊరగాయ వేసి పిల్లవానికి పెట్టింది.

“రాత్రుళ్లు రోజూ మేం ఫలహారమే నాయినా! నీవు చిన్నపిల్లవాడివి, నీకు మధ్యాహ్నమే కొంత అన్నం ఎక్కువ వండి ఉంచుతాలే – ఏదో ఒకటి వేసుకొని కొంచెం తిందువుగాని” అన్నదామె.

వైనతేయకు వాళ్ళమ్మ గుర్తుకు వచ్చి కంటనీరు తిరిగింది.

రాత్రి గురుశిష్యులిద్దరూ భోషాణం మీదే పడుకొని నిద్రపోయినారు. మర్నాడు సారు వాడిని బజారుకు తీసుకోపోయి, ఒక లైఫ్‌బాయ్ సబ్బు, ఒక ప్లాస్టిక్ సబ్బుపెట్టి, చిన్న అద్దం, దువ్వెన, ఒక ప్లాస్టిక్ బకెటు, మగ్గు, మంచినీళ్ళ కుండ, ఒక వెంకటేశ్వర స్వామి పటం, ఊదొత్తుల పాకెట్టు, అగ్గిపెట్టె, అన్నీ కొనిచ్చినాడు తన డబ్బుతో, క్రింద పరుచుకోవడానికి ఒక చాపతో సహా!

ద్వితీయ విఘ్నం కాకూడదని శర్మగారు వాడితో కొన్ని ఆలాపనలు ప్రాక్టీసు చేయించినారు. వాడికి సంగీత జ్ఞానం లేదుగాని, ఏ రాగాన్నైనా, నేర్పిస్తే, అవలీలగా పలికించగలడు. వాడి గ్రహణశక్తికి, సత్వర స్పందనకు ఆంజనేయ శర్మగారు చకితులవుతున్నారు. తన ఎంపిక సరైనదే అన్న నమ్మకం ఆయనలో బలపడింది.

మర్నాడు దస్తగిరిసారు ఊరికి బయలుదేరినాడు. వైనతేయ బస్టాండుకు వచ్చి సారును బస్సు ఎక్కించినాడు. ఆయన వానికి ఎన్నో జాగ్రత్తలు చెప్పినాడు.

“ఏ జన్మంలో చేసిన పుణ్యమో, నీవు ఆ మహనీయుని చేతిలో పడినావు రా వైనా! పొరపాటున కూడా వారికి అవిధేయత చూపకు. వారు కోపంతో ఒక మాట అన్నా, ఒక దెబ్బ వేసినా, పట్టించుకోవద్దు. వారిని సాక్షాత్ పార్వతీ పరమేశ్వరులుగా భావించి సేవించు. ఆయన అనుగ్రహంతో పెద్ద విద్యాంసుడివి కావాల.”

బస్ కదులుతూ ఉంటే వాటికి ఏడుపు వచ్చింది. దస్తగిరి సారు వెళ్లిపోతున్నాడు! ఆయనకు కూడా వాటిని వదలి వెళుతూంటే హృదయం బరువెక్కింది!

‘భావస్థిరాణి జననాంతర సౌహృదాని!’

(ఇంకా ఉంది)

Exit mobile version