శ్రీమద్రమారమణ-6

0
2

[శ్రీ పాణ్యం దత్తశర్మ రచించిన ‘శ్రీమద్రమారమణ’ అనే నవలని ధారావాహికంగా అందిస్తున్నాము. డల్లాస్ లోని సిరికోన సంస్థ – నటసామ్రాట్ అక్కినేని శతజయంతి సందర్భంగా నిర్వహించిన, ‘స్వర్గీయ జొన్నలగడ్డ రాంభొట్లు – సరోజమ్మగార్ల స్మారక నవలల పోటీ’ (2023)లో ప్రథమ బహుమతి పొందిన నవల ఇది.]

[పెద్ద పరీక్షలు అయిపోతాయి. ఆంజనేయ శర్మగారు వైనతేయని కౌతాళం పంపమని దస్తగిరిసారుకు ఉత్తరం రాస్తారు. మూడో తరగతి పాస్ అయినట్టు టి.సి. రాసిస్తాడాయన. వైనతేయని కౌతాళం తీసుకువెళ్తాడు. ఆంజనేయశర్మగారింటికి చేరుతారు. కాళ్ళు చేతులు కడుక్కురమ్మని చెప్పి, భార్యని పిలుస్తారు. ఆవిడ పేరు వెల్లెలాంబ. ఒకరినొకరికి పరిచయం చేస్తారు. ఆవిడ ఉపాహారం తెస్తుంది. అవి తిన్నాకా, కాఫీ ఇస్తుంది. పక్కవీధిలో ప్రభుత్వం వారి ఎలిమెంటరీ స్కూలు ఉందనీ, అందులో వైనతేయను నాల్గవ తరగతిలో చేర్పిస్తాననీ, స్కూళ్ళు తెరిచేంతవరకూ పిల్లవాడికి స్వరాలు, రాగాలు, ఆరోహణ, అవరోహణ, మంద్రం, ఉచ్చస్థాయి, ఇలాంటి వన్నీ నేర్పిస్తానని చెప్తారు. వీడు ఉండడానికి బాలుర సంక్షేమ వసతి గృహం ఏదైనా.. అని దస్తగిరిసారు అంటుండగానే శర్మగారు కలుగజేసుకుని, పిల్లాడిని తమ ఇంట్లోనే ఉంచుకుంటామని, తాము తిన్నదే తింటాడని చెప్తారు. రెండేళ్ళు త్వరగా గడిచిపోతాయనీ, ఆ పై ఎలాగూ తిరుపతి వెళ్ళాల్సిందే కదా అని అంటారాయన. తాను తొందరపడి హాస్టల్ ప్రస్తావన తెచ్చినందుకు పశ్చాత్తాపపడతాడు దస్తగిరిసారు. క్షమించమని అడిగితే, తనకు గానీ, తన శ్రీమతికి గాని కులం పట్టింపులు లేవని అంటారు. మరి తాను బయల్దేరతానని దస్తగిరి అంటే, అప్పుడే కాదు మరో రెండు రోజులుండి, పిల్లవాడు అలవాటు పడ్డాకా, వెళ్ళమంటారు. వైనతేయకు వచ్చిన పద్యాలను పాడించుకుని విని తృప్తిగా తల ఊపుతారు శర్మగారు. దస్తగిరిసారు కల్యాణి రాగంలో నేర్పిన పద్యాన్ని, మాల్కోస్ రాగంలో పాడి వినిపిస్తారు శర్మగారు. కొన్ని క్షణాల తరువాత అచ్చం ఆయన పాడినట్టే పాడి వినిపిస్తాడు వైనతేయ. వల్లెలంబ మెచ్చుకుని, వాడి తల నిమురుతుంది. ఆ రాత్రి భోజనాలయి విశ్రమిస్తారు. మర్నాడు దస్తగిరి సారు ప్యాపిలికి బయల్దేరుతారు. బస్టాండు దాకా, ఆయన వెంట వెళ్తాడు వైనతేయ. ఆయన ఎన్నో జాగ్రత్తలు చెప్తాడు. – ఇక చదవండి.]

[dropcap]తె[/dropcap]ల్లవారు జామునే నిద్ర లేస్తారు శర్మ దంపతులు. పనిమనిషి మద్దమ్మ ఒక లీటరు పాలు తెస్తుంది. ఆమెకు రెండు ఎనుములు (గేదెలు) ఉన్నాయి. వాకిలి ముందు కసువు ఊడ్చి, బకెట్‍లో పేడను నీళ్లతో కలిపి, ఇంటి ముందు కళ్లాపి చల్లుతుంది. అరుగులు అరుగుల మధ్యనున్న మెట్లు కడుగుతుంది.

వల్లెలాంబ ఇంటిముందు, అరుగుల మీద చక్కని ముగ్గులు వేస్తుంది.

ఐదున్నరకల్లా కాఫీ తాగుతారు. వైనతేయకూ ఇస్తారు. ఒక గంట గంటన్నరపాటు సంగీత సాధన చేయిస్తారు శర్మగారు వాడితో. ఒక రాగం ఆలపిస్తే అది ఏ రాగమో చెప్పడం, ఒక కీర్తన ఏ రాగంలో ఉందో కనిపెట్టడం, ఇలా.

వాళ్లింట్లో టిఫిన్ చేయరు. శర్మగారి సంధ్యావందనం, అనుష్ఠానం పూర్తయ్యేసరికి పదకొండు. దంపతులు పదకొండున్నరకు ఏకంగా భోం చేస్తారు. మధ్యాహ్నం మళ్లీ కాఫీ. రాత్రికి ఫలహారం.

ఎండాకాలం సెలవులు పూర్తయి బళ్ళు తెరిచారు. వైనతేయను నాల్గవ తరగతిలో చేర్పించారు. వాడికి పొద్దున్న రెండు రూపాయలిచ్చి ఇడ్లీలో, రెండు పూరీలో, ఒక దోసెనో తిని రమ్మంటారు. అది పెద్ద గేరి కాబట్టి, దగ్గర లోనే కోమట్లది ఒక చిన్న హోటలుంది. మధ్యాహ్నం ఇంటికి వచ్చి అన్నం తినిపోతాడు.

సాయంత్రం మళ్లీ సంగీత సాధన. పద్యాలలోని ఛందస్సును గూడ నేర్పించసాగారాయన. కొన్ని త్యాగరాజ కృతులు, అన్నమయ్య కీర్తనలు, రామదాసు కీర్తనలు, పురందరదాసు, నారాయణ తీర్థుల కీర్తనలు వాడికి నేర్పించసాగాడాయన.

త్యాగరాజ స్వామి వారి ‘సీతమ్మ మాయమ్మ, శ్రీరాముడు మా తండ్రి’ అన్న కీర్తన వాడు నేర్చుకుని పాడుతుంటే శర్మగారు తన్మయులయ్యేవారు.

‘వాతాత్మజ సౌమిత్రీ..’ అన్న చోట ఆలాపన అత్యున్నత స్థాయికి చేరేది.

అట్లే ‘భజవారం వారం మానస, భజనంద కుమారం’ అన్న సదాశివబ్రహ్మేందుల వారి కీర్తనను కాంభోజి – త్రిపుట రాగంలో మిత్రచాప తాళంలో పాడడం వాడికి వచ్చింది.

వాడి గొంతులో అద్భుతంగా పలికే కీర్తన స్వాతి పెరుమాళ్ రాసిన ‘గోపాలక పాహిమాం అనిశం’, దేవగుప్తి రాగం.

ఏ కీర్తన ఐనా నాలుగయిదుసార్లు సాధన చేయిస్తే చాలు, వైనతేయకు పట్టుబడేది. తర్వాత కొన్ని చక్కని శ్లోకాలను పద్యాలను ప్రాక్టీసు చేయించారు శర్మగారు. ‘కస్తూరీ తిలకం లలాట ఫలకే’, ‘అంకము చేరి శైలతనయాస్తన దుగ్ధములాను వేళ’ (పెద్దన గారి మను చరిత్ర – నాందీ పద్యం), ‘సరసిజనయనే సరోజహస్తే’, ‘తీయని గీరినా బరగు చెల్వకు చిత్తము పల్లవింప’.

తర్వాత హరికథలలో, సందర్భానుసారంగా ఉటంకించడానికి కొన్ని ప్రసిద్ధ పద్యాలను వాడికి నేర్పారు శర్మగారు.

‘పండితులైన వారు దిగువన్ దగనుండగ..’ (భాస్కర శతకం), ‘చదువది యెంతగల్గిన..’ (భాస్కర శతకం)

అట్లే ప్రహ్లాద చరిత్ర, రుక్మిణీ కల్యాణము, గయోపాఖ్యానము లోని కొన్ని, సత్యహరిశ్చంద్ర నాటకంలోని బలిజేపల్లి వారి పద్యాలను, జాషువా గారి స్మశానవాటిక పద్యాలను వాడికి నేర్పారు.

వాడు రాత్రిపూట తన కొట్టు గదిలో వాటిని పునః పునః సాధన చేసుకునేవాడు. శర్మగారు, వల్లెలాంబగారితో నిత్యం మాట్లాడడం వల్ల వాడు మాట్లాడే భాష కూడా సంస్కరింపబడింది. బడిలో చదువును కూడా వాడు అంతే శ్రద్ధగా నేర్చుకునేవాడు. ఐదవ తరగతి లోకి వచ్చిసరికి గురువుగారే గర్వపడేంతగా సంగీతజ్ఞుడైనాడా బాలగంధర్వుడు. ఒక దశలో గురువు నేర్పిన సంగతులను మెరుగుపెట్టి, తన సొంత పద్ధతిలో కూడా పాడేవాడు. శర్మగారు బాగుందనేవారు. ఇంకా ఏవైనా లోపాలుంటే దిద్దేవారు.

ఒక మంచి రోజు చూసి, ఆయన వైనతేయతో అన్నారు “నాయనా! కొంతవరకు సాధించినావురా! ఈ రోజు నుంచి నీకు హరికథాగానంలో శిక్షణ ఇస్తాను.”

వైనతేయకు భయం కలిగింది. కానీ, కొండంత గురువుండగా భయమెందుకు అనుకున్నాడు.

“మీ అనుగ్రహం ఉంటే నీర్చుకుంటాను స్వామి” అన్నాడు.

‘Language is acquired as well as embellished by exposure’ అని ఆంగ్ల భాషాశాస్త్రవేత్తల అభిప్రాయం. అది ఏ భాషకైనా వర్తిస్తుంది. శర్మగారి ఇంట్లో మెసలడం వలన వైనతేయకు, సంభాషణల్లో, చక్కని తెలుగు, సంస్కృత పదాలు వాడటం వచ్చింది.

“నీకు ఓంప్రథమంగా ‘భక్తప్రహ్లాద’ హరికథ నేర్పిస్తాను. ప్రహ్లాదుడు ఐదేండ్ల వయసులోనే పరమాత్మ తత్త్వాన్ని గ్రహించిన భాగవతోత్తముడు. ముందుగా అతని కథను క్లుప్తంగా చెబుతాను విను.”

కథను శ్రద్ధగా విన్నాడు. “డోన్ శేగు టాకీసులో ఒకసారి నేను, మా దస్తగిరిసారు ఈ సినిమా చూసినాము స్వామి” అన్నాడు.

“అందులో ఏదైనా పద్యం వచ్చా?”

“రాదు స్వామి. మీరు నేర్పినవీ కొన్ని వచ్చు.”

ముందుగా విఘ్నేశ్వరస్తుతితో హరికథ ప్రారంభమైంది.

‘శ్రీగణపతిని సేవించరారి, శ్రితమానవులారా!’ అన్న త్యాగరాజస్వామి కీర్తన ముందే నేర్పించి ఉన్నాడు వాడికాయన.

కీర్తన పాడుతూ, తదనుగుణంగా అడుగులు ఎలా వెయ్యాలో, కొంత నాట్యరీతిని వాటికి చేసి చూపించారు.

శ్రోతలను ఎలా సంబోధించాలి, మధ్యలో గోవింద నామస్మరణ ఎలా చేయించాలి, భక్తులను మధ్యమధ్యతతో చెబుతూ వారిని ఎలా వినోదపరచాలో బోధించారు.

హిరణ్యాక్షుడు విష్ణువు చేతిలో హతుడైనాడని విని, క్రోధంతో హిరణ్య కశిపుడు బ్రహ్మను గురించి ఘోర తపస్సు చేసి, ఎన్నో రకాలుగా తనకు మరణము లేకుండా వరము పొందినాడు.

తపస్సమయములో ఇంద్రుడు ఆయన భార్య లీలావతిని చెరబట్టపోగా, నారదుడు నచ్చచెప్పి. ఆమెను తన ఆశ్రమానికి తీసుకొనిపోతాడు. అక్కడ ఆమె ప్రహ్లాద కుమారునికి జన్మనిస్తుంది.

వరగర్వముతో లోకాలను పీడిస్తుంటాడు హిరణ్య కశిపుడు. ప్రహ్లాదుడు నిరంతరం విష్ణు చింతనతోనే కాలం గడుపుతుంటాడు. చండామార్కులను రాక్షసగురువుల దగ్గరికి విద్యాబోధనకై పంపినా ప్రయోజనం ఉండదు.

రకరకాలుగా పహ్లాదుని చంపమని ఆజ్ఞాపిస్తుంటాడు తండ్రి. తల్లి వేదన వర్ణించరానిది. ఆ సందర్భంలో ప్రహ్లాదుని నోట ఎన్నో పద్యాలు రావాలి. ఎర్రన నృసింహపురాణములోని, పోతన దశమస్కంధములోని పద్యాలను శిష్యునికి నేర్పించారు శర్మగారు.

హిరణ్యకశిపుని కోపాన్ని ఎలా అభినయించాలో, లీలావతి శోకాన్ని ఎలా ఆవిష్కరింపచేయాలో, ప్రహ్లాదుని స్థితప్రజ్ఞత్వాన్ని, భగవంతునిపై ఆ పిల్లవానికి గల అచంచల విశ్వాసాన్ని, ఎలా శ్రోతల ముందు సాక్షాత్కరింప చేయాలో, నటించి చూపేవారు శర్మగారు.

‘కమలాక్షు నర్చించు కరములు కరములు’

‘కంజాక్షునకు గాని కాయమ్ము కాయమే’

‘ఇందుగలడందు లేడను’

‘చదివించిరి నను గురువులు’

‘ఎల్ల శరీరధారులకు’

ఇంకా హిరణ్యకశిపుని పద్యాలు, నారదుని పద్యాలు కూడా ప్రాక్టీసు చేయించారు.

మొత్తం ‘భక్తప్రహ్లాద’ హరికథాగానం శిక్షణ పూర్తి గావడానికి మూడు నెలలు పట్టింది.

ఉరుకుందప్పను, ఓబులేశయ్యను పిలిపించి, వాద్య సహకారంతో కూడా అభ్యాసం చేయించినారు.

ఆయనకు ప్రతి నెలా ఒకటో రెండో పోగ్రాములుండేవి. వాటికన్నింటికీ తన వెంట తీసుకొని పోయేవారు వైనతేయను. ఆ విధంగా వాడు ప్రత్యక్షంగా ‘Stage Performance’ లోని మెళకువలను ఆకళింపు చేసుకున్నాడు. ఆయన వద్ద పిల్లవాడు నేర్చుకుంటున్న విషయం అందరికీ తెలుసు. సహజంగానే వాడు ఏకసంథాగ్రాహి. భగవద్దత్తమైన సంగీత జ్ఞానం ఉంది. దానికి ఆంజనేయ శర్మ భాగవతార్ గారి వంటి నిపుణుని శిక్షణ తోడవడంతో, వాడి ప్రతిభ మరింత నిగ్గు తేలింది.

ఐదవ తరగతి పెద్ద పరీక్షలు మరో రెండు నెలలున్నాయి. వాడు సొంతంగా ప్రదర్శన యివ్వగలడన్న విశ్వాసం ఆయనకు కదిరిన తర్వాత, కౌతాళంలోని కోదండరామస్వామి వారి ఆలయంలో వైనతేయ ‘భక్తప్రహ్లాద’ హరికథాగానాన్ని ఏర్పాటు చేశారు శర్మగారు.

దస్తగిరిసారు, కోనేటయ్య, తిరుపాలమ్మ, అక్క రమణమ్మ ముందు రోజే వచ్చేసినారు. ఈ రెండేళ్లలో కొంచెం పొడుగై, వల్లెలాంబ గారి పోషణ వల్ల రంగుతేలి, అందంగా కనిపిస్తున్నాడు వైనతేయ. వాటి భాష కూడా పూర్తిగా మారిపోవడం వారు గమనించి ఆనందించారు. మధ్యలో మూడు నాలుగు సార్లు ‘యానాదుల దిబ్బ’కు, ‘ప్యాపిలి’కి వెళ్లివచ్చాడు వాడు.

శర్మగారింట్లో ఒక కుటుంబ సభ్యుడుగా కలిసిపోవడం, ప్రతిదానికి, శర్మగారు, అమ్మగారు “ఒరేయ్ వైనతేయ!” అని వాడిని పిలవడం, ఊర్లోనివారు సైతం, వాడిని శర్మగారి శిష్యుడిగా ఆదరించడం వారికి మహదానందాన్ని కలిగించింది. దస్తగిరిసారు తన శిష్యున్ని చూసుకొని మురిసిపోయాడు.

కౌతాళం నడిబొడ్డున ఉన్న కోదండ రామాలయం పురాతనమైనది. ఆ రోజు సాయంత్రం 7 గంటలకు వైనతేయ హరికథ. చుట్టుపక్కల ఊళ్లలో ఆంజనేయ శర్మగారిని ఎరుగని వారు లేరు. హరికథకుడిగా ఆయన కీర్తి రాయలసీమ నాలుగు జిల్లాల్లో విస్తరించింది. అంతటి మహాపండితుడు ఒక పిల్లవాడిని చేరదీసి, విద్య నేర్పించడం, వాడు ఎట్లా చెబుతాడో చూద్దామనీ కుతుహలం, చాలామందిని ఆ కార్యక్రమానికి రప్పించాయి. ఊర్లోని బ్రాహ్మణ్యం కొంతమందికి ఆంజనేయ శర్మగారి పద్ధతి నచ్చదు. కానీ ఆయన ఎదుటపడి అడిగే ధైర్యంలేదు వారికి.

కౌతాళంలో పెద్ద భూస్వామి, శర్మ గారి శిష్యుడు సభకు అధ్యక్షత వహించినాడు. ఆయన పేరు చంద్రాయుడు. ఆరున్నరకే దేవళంలోని ఆవరణ నిండిపోయింది.

“పదేండ్ల పిల్లడంట. స్వామి శిష్యుడంట. హరికథ చెబుతాడంట!” అని ఆసక్తిగా అనుకోసాగారు శ్రోతలు.

హార్మోనిస్టు ఉరుకుందప్ప, మృదంగ విద్వాన్ ఓబులేశయ్య ఉదయాన్నే వచ్చి ఉన్నారు. వాయిద్యాలకు, హరికథకునికీ మధ్య చక్కని పొంతన కుదరాలి. లేకపోతే కథనం రక్తికట్టదు. ఏదైనా కీర్తననో, శ్లోకాన్నో, పద్యాన్నో హరిదాసు ఆలపించే ముందు ఆయనకు దాని రాగాన్ని, శృతిని, హార్మోనిస్టు అందిస్తాడు హార్మోనియం మెట్ల మీద. మధ్యలో కథనం సాగుతున్నపుడు కూడా ఇరువురు నేపథ్య సంగీతం అందించాలి. ఒక్కోసారి గాయకుడు గాత్ర సౌలభ్యం కుదరక, అర్థోక్తిలో  ఆపినపుడు, హార్మనిస్టు దానిని చాకచక్యంగా పలికించాలి. ఒక రకంగా ఆయనను అన్ని విధాలా కవర్ చేయాలి.

అంజనేయశర్మగారితో వారిద్దరికీ చిరకాల అనుబంధం ఉంది. ఆయన చెప్పే ప్రతి కథలోని ప్రతి చిన్న సంగతీ, వారికి తెలుసు. ఆయన సందర్భానుసారంగా అప్పటికప్పుడు తన సమయస్ఫూర్తితో చెప్పే పద్యాలను, శ్లోకాలను, కీర్తనలను, వారు సునాయాసంగా అనుసరించగలరు.

కాని వారికి కూడా, వైనతేయతో ఇది తొలి ప్రోగ్రాము. కొంతవరకు ముందే రిహార్సల్ చేసి ఉన్నారు. తమ గురువుగారి ప్రియశిష్యుడు ఇస్తున్న తొలి ప్రదర్శన విజయవంతం కావాలని, వారు కృతనిశ్చయంతో ఉన్నారు.

వైనతేయ మాత్రం కాన్ఫిడెంట్‌గా ఉన్నాడు. శర్మగారిచ్చిన శిక్షణయే ఆ ఆత్మవిశ్వాసానికి కారణం.

సరిగ్గా ఏడు గంటలకు కార్యక్రమం ప్రారంభమైంది. వైనతేయ వంగపండు రంగు ధోవతి ధరించాడు. అది వదులవకుండా నడుముకు మెత్తని, ఎర్రని ఉత్తరీయం బిగించాడు. నుదుట తిరునామం దిద్దుకున్నాడు. మెడలో రుద్రాక్షమాల. వక్షం అనచ్ఛాదితం. కనకాంబరాలు, జాజులు, మరువము, చిట్టి చేమంతులతో అల్లిన కదంబమాల మెడలో వేసుకున్నాడు. కాళ్లకు చిరుగజ్జెలున్న పట్టీలు కట్టుకున్నాడు. ఎడమ చేత చిడతలు. దశ వర్ష ప్రాయుడైన ఆ బాల హరిదాసు సాక్షాత్తు ప్రహ్లాద కుమారునిలా ఉన్నాడు.

మొదట ఆంజనేయశర్మగారు ఆ బుడతడిని సభకు పరిచయం చేశారు.

“నాయనలారా! ఈ పిల్లవాడు, వైనతేయ, నా శిష్యుడు. నా హరికథా సంపద వారసుడు కూడా అని చెప్పడానికి ఆనందిస్తున్నాను. రెండేళ్ల క్రిందట ప్యాపిలిలోని చెన్నకేశవాలయంలో వీని గాత్రం విని ఆశ్చర్యపోయాను. వీడే నాకు సరైన శిష్యుడని నిర్ణయించుకున్నాను.

ఏ కళ అయినా చక్కగా పట్టుబడేది ఎనిమిది నుండి పన్నెండు సంవత్సరాల మధ్యవయసు లోనే. ఈ పిల్లవాడిలోని ప్రతిభను గుర్తించి, ప్రోత్సహించి, సంగీతంలో మౌలిక శిక్షణ ఇచ్చిన అతని ఉపాధ్యాయుడు శ్రీ దస్తగిరి గారిని వేదిక దగ్గరికి ఆహ్వానిస్తున్నాను.”

శ్రోతలు చప్పట్లు!

దస్తగిరి సారు వచ్చి, శర్మగారి పక్కన నిలబడి శ్రోతలకు నమస్కరించాడు.

“మా వైనతేయను, స్వామి రెండేళ్లుగా తమ ఇంట్లోనే పెట్టుకొని, విద్య నేర్పిస్తున్నారు. వారికి నా పాదాభివందనం!” అని శర్మగారి కాళ్లకు నమస్కరించాడు.

“తర్వాత, హరిదాసుని తల్లిదండ్రులు, శ్రో కోనేటయ్య గారిని, శ్రీమతి తిరుపాలమ్మ గారిని, వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాను” అన్నారు శర్మగారు.

వారిద్దరూ, బిడియపడుతూ వచ్చి నిలుచున్నారు. స్వామి పాదాలకు నమస్కరించారు.

“ఇక ప్రారంభించు నాయనా!” అని ఆదేశించారు శర్మగారు.

వైనతేయ ముందుగా శర్మగారికి, తర్వాత దస్తగిరి సారుకు, తర్వాత అమ్మానాన్నలకు పాదాభివందనం చేశాడు. తర్వాత వేదికని ఎక్కి

“హరికథాశ్రవణ కుతూహలులైన, భాగవతోత్తములకందరికీ నా జోతలు. అందరం ఒకసారి భగవన్మామ స్మరణ చేద్దాము. శ్రీమద్రమారమణ గోవిందా.. హరి!” అన్నాడు.

అందరూ నినదించారు. మధ్యమధ్యలో ఈ దైవస్మరణ వల్ల, శ్రోతలలో అటెన్షన్ వస్తుంది.

ఉరుకుందప్ప హార్మోనియంపై కృతిని, రాగాన్ని అందించగా బాల హరిదాసు, త్యాగరాజస్వామి వారి కీర్తన అందుకున్నాడు శ్రావ్యంగా..

‘శ్రీగణపతినీ, సేవించ రారే. శ్రిత మానవులారా!’ అన్న పల్లవి తోనే అందరినీ ఆకట్టుకొన్నాడు. శ్రావ్యమైన కంఠానికి దివ్యమైన శిక్షణ తోడవడంతో, గాత్ర ధర్మం సుసంపన్నమైంది.

‘పనస నారికేళాది బంబూఫలముల నారగించి అనయము హరి చరణ యుగములను హృదయాంబుజమున మదినించి’ అంటూ సరిగమలు వేస్తూ.. నాట్యం చేయసాగాడా బాలుడు. అతనిలో వేరే ధ్యాస లేదు. శ్రోతలు ఎలా స్పందిస్తున్నారో గమనించడం లేదు. తన్మయత్వంతో, త్యాగరాజస్వామి ఆత్మతో మమేకమైనట్లుగా సాగుతూంది కీర్తన. ఓబులేశయ్య మృదంగం ధ్వని తరంగాలను అనుషంగికంగా అందించసాగింది. ఆ చిన్ని పాదాలు పాటలోని లయకనుగుణంగా కదులుతున్నాయి. కీర్తనలోని భావాలను వదనం ప్రతిఫలిస్తూంది.

‘నిరతము వెలిగెడు త్యాగరాజువినుతుడు

సరసగతిని ధిక్కళాంగుమని ఎగియగ’

అంటూ, ‘ధిక్కళాంగు’ అన్నచోట నయనానందకరంగా, నాట్యశాస్త్ర, బద్ధంగా పైకి ఎగిరి అచ్చం బాలగణపతి నర్తనమాడినట్లుగా అభినయించాడు. కీర్తన ముగిసింది. దేవాలయ ప్రాంగణమంతా కరతాళధ్వనులతో హోరెత్తింది!

ఆంజనేయ శర్మగారు అబ్బురంగా చూస్తున్నారు. చివర్లో ‘ధిక్కళాంగు’ అన్నచోట వేయవలసిన భంగిమ తాను వాడికి చెప్పలేదు. అయినా, అద్భుతంగా అభినయించాడు. దానినే ‘ఇన్నోవేటివ్ ఆర్ట్’ అంటారు. ఓబులేశయ్య ఆనందానికి అంతు లేదు. ఉరుకుందప్ప పరవశించాడు.

శ్రోతలలో కొందరు లేచి, పది రూపాయల నోట్లు హరిదాసుల వారికి సమర్పించడానికి రాసాగారు. శర్మగారు అది గమనించి, “నాయనలారా, ఆగండి! ఇలాంటివి కథాగమనాన్ని కుంటుపడ జేస్తాయి. కార్యక్రమం చివర హరిదాసును సన్మానించుదురుగాని” అని ఆపారు. ఆయన కూడా తన పోగ్రాములలో ఈ సంప్రదాయాన్ని ప్రోత్సహించరు. కథ మధ్యలో ఎవరో వస్తారు. హరిదాసుగారికి ఎంతో కొంత సమర్పిస్తారు. ఆ కథను మధ్యలో ఆపి, ఇచ్చినవారి పేరు ప్రకటించి, వారికి, వారి కుటుంబానికి భగవంతుడు సకల మంగళములు కలుగ చేయాలని కోరుకుంటాడు.

బాగానే ఉంది కాని, కథనంలోని ‘ఫ్లో’ ఆగిపోతుంది. వాద్య సహకారులు కూడా నిరుత్సాహపడతారు.

తర్వాత సరస్వతీ దేవిని ప్రార్థన చేశాడు హరిదాసు. తర్వాత సర్వవిద్యలకు ఆధారభూతుడైన హయగ్రీవుని. తర్వాత, హరికథ జరుగుతూ ఉన్న దేవళంలోని మూలవిరాట్లు, సీతాలక్ష్మణ సమేత కోదండరామస్వామి వారిని

‘శ్రీరామచంద్రః శ్రితపారిజాతః

సమస్త కల్యాణ గుణాభిరామః

సీతాముఖాంభోరుహచంచరిక

నిరంతరం మంగళమాతనోతు’

అన్న శ్లోకంతో, సావేరి రాగంలో కీర్తించాడు.

తర్వాత, శర్మగారు ఊహించనిది, అసలు ఆయన బోధించనిది, ఒకటి జరిగింది.

“భక్తులారా! యానాది కులమునకు చెందిన నన్ను, బ్రాహ్మణోత్తములైన మా గురువర్యులు, హరికథాపంచానన, సంగీతశిరోమణి, శ్రీమాన్ ఆంజనేయశర్మగారు చేరదీసి, నాకు విద్య నేర్పినారు. నా ప్రతిభంతా నాది కాదు. ఆయన అనుగ్రహమే. వారికి నివేదనగా వారికి ఈ పద్యపుష్పాన్ని సమర్పిస్తున్నాను.”

శర్మగారే కాదు, అందరూ ఆశ్చర్యపోయారు.

“ఈ పద్యం నేను స్వంతంగా రచించినాను. నాకు ఛందో జ్ఞానాన్ని ప్రసాదించింది కూడా గురువర్యులే. దీనిలో, సాహిత్యంలోగాని, స్వరములలో గాని, దోషములున్నచో, గురువర్యులు, విద్వన్మణులు మన్నించవలె ప్రార్థన. ఈ పద్యము వారి చరణారవిందములకు, సభక్తికముగా కల్యాణి రాగములో సమర్పించుకుంటున్నాను.”

కరతాళధ్వనులు!

ఉ॥

ఏమి యొసంగి మీదగు విశిష్ట రుణంబును తీర్చుకొందునో

స్వామి! త్వదీయమైదనరు సన్మతి నన్నుకృతార్థు చేయగా

నీ మహి కేగుదెంచిన యహీనసు గాన విశారదా! గురూ!

నేమము తోడ మీకు ఘన నిశ్చల కీర్తినొసంగి, తీర్చెదన్.

గురువుగారి కళ్ల నుండి ఆనంద భాష్పాలు రాలుతున్నాయి. బాల హరిదాసు కంఠం చివర్లో గద్గదమైంది. కళ్లు చెలిమలైనాయి. అక్కడినుంచే.. శిష్యున్ని ఆశీర్వదించాడు గురువు.

‘తనకు తెలియకుండా చక్కని ఉత్పలమాలావృత్తాన్ని రాసుకొన్నాడు. యతిప్రాసలు, గణాలు అన్నీ సక్రమంగా పడ్డాయి. సాహిత్యం ఎంత భావ స్ఫోరకంగా ఉంది! కల్యాణి రాగాన్ని దానికి ఎన్నుకోవడం పూవుకి తావి అబ్బినట్లయింది. యశస్వీ భవ కుమారా!’ అని లోలో ఆశీర్వదించారు శర్మగారు. దస్తగిరి సారు నిశ్చేష్టుడై చూస్తున్నాడు.

‘వీడు మా వైనా గాడేనా? ఏమి ఆ భాష? ఆ ఉచ్చారణ! స్వంతంగా పద్యం రాసినాడే! ఎంత బాగా పాడినాడు? ఏ గురువుకైనా ఇంతకంటే కావలసినదేముంటుంది?’ అనుకున్నాడాయన.

ఇంతలో ఆయనకూ ఆనందకరమైన ఆశ్చర్యం కలిగింది

“నన్ను చిన్నప్పటి నుంచి తన యింట్లో పిల్లవానిగా భావించి, నాకు సంగీతంలో ఓనమాలు నేర్పించిన మా గురువుగారికి ఈ పద్యం అంకితం ఇస్తున్నాను. ఇదీ నేను వ్రాసినదే!”

మళ్లీ చప్పట్లు.

తే.గీ.:

మారుమూలపు గ్రామాన మగ్గునట్టి

నన్ను తన సొంత కొడుకుగా నాదరించి

గాన భిక్షను పెట్టిన కరుణశీలు

దస్తగిరి సారుకున్ వంతు మస్తకంబు

ఔరా! అనుకున్నారు పద్య ప్రేమికులు! దస్తగిరిసారు, ఉండబట్టలేక, వేదిక పైకి వెళ్లి, వాడిని కౌగిలించుకోవాలని లేస్తుంటే శర్మగారు వారించారు.

“ఇక నా తల్లిదండ్రులు. వారికి సంగీతం పట్ల అవగాహన లేదు మా నాయన నన్ను స్వామి గారి దగ్గరికి పంపడానికి కొంత జంకినా, మా అమ్మ, ధైర్యంగా సమ్మతించింది. వారు నా మాతాపితరులైనందుకు గర్వపడుతున్నాను. వారి కొరకు ఈ పద్యం.”

తే.గీ.:

తండ్రి కోనేటి రాయుడు తల్లి సాధ్వి

తనరు తిరుపాలు నామమున్; తాము నన్ను

ప్రేమ మీరగ బెంచిరి పెద్దమనసు

తోడ నను బంపిరిచటకు ధన్యుడైతి!

తమ గురించి సభలో కొడుకు ప్రస్తావించడం వారికి గర్వకారణమైంది. కోనేటయ్యకు, తిరుపాలమ్మకు పద్యం పూర్తిగా అర్థం కాలేదు. కానీ. వైనతేయ వివరించాడు పద్యాన్ని; వారికోసం.

“మా నాయన పేరు కోనేటి రాయుడు. కోనేటయ్య అంటారు. అంటే సాక్షాత్తు ఆ వెంకటేశ్వరుడే. ఇక మా అమ్మ తిరుపాలమ్మ. అదే స్వామి పేరే. వారు నన్ను ప్రేమగా పెంచినారు. దస్తగిరిసారు మాట మన్నించి నన్ను స్వామి దగ్గరకు పంపడానికి ఒప్పుకున్నందు వల్లనే, ఈ రోజు నేను మీ ముందు నిలబడగలుగుతున్నాను.”

అతని సంస్కారానికి సభ ముగ్ధమైంది.

“మళ్లీ ఒకసారి! శ్రీ మద్రమారమణ గోవిందా.. హరి!” అని నినదింప చేశాడు బాల హరిదాసు.

త్వరలోనే అందరినీ కథలో లీనం చేశాడు. హిరణ్యకశిపుని క్రోధాన్ని, ప్రహ్లాదుని శాంతభక్తిని, లీలావతీదేవి నిస్సహాయతను కనులకు కట్టినట్లు శ్రోతల ముందు ఆవిష్కరించాడా బాలమేధావి. పద్యాలు పాడేటపుడు, సినిమా లోని రాగాల ప్రభావం వాటిపై పడకుండా సాధన చేయించి ఉన్నారు శర్మగారు.

చివర నృసింహవిర్భావ ఘట్టాన్ని ఆ బుడతడు వర్ణిస్తూంటే శ్రోతలు ఒక దివ్యానుభూతికి లోనైనారు. మధ్యలో చండామార్కుల వారు ప్రహ్లాదునికి చదువు చెప్పలేక పడే అవస్థను చెప్పి అందరినీ నవ్వించినాడు. చివరగా నారద మునీంద్రుడు విష్ణుతత్త్వాన్ని వివరించిన పద్యం, మోహనరాగంలో అందరినీ ఆకట్టుకుంది.

తే.గీ.:

ఎందు వెదకిన కనరాక; హేమకశిపు

హృదయమున తిష్ఠ వేసి, తబ్బిబ్బు చేసి

శిశువు నుసికొల్పి సాగించు నీదు లీల

పరులకు గ్రహింపశక్యమా? గరుడగమన!

సింహభాగం గురువు గారు నేర్చినివే. అక్కడ కూడా వైనతేయ సృజనాత్మకత మెరిసింది.

తొలి ప్రయత్నమైనా, తడబడకుండా, మొక్కవోని ఆత్మవిశ్వాసంతో, సంగీత, సాహిత్య, నృత్య, అభినయాలకు ప్రాణం పోశాడు ఆ చిరుతడు.

చివరగా “పవమానాసుతుడు బట్టు..”, “మంగళం కోసలేంద్రాయ” లతో హరికథ ముగిసింది.

గ్రామ పెద్ద చంద్రాయుడుగారు, వైనతేయకు శాలువా కప్పి ఐదు వందల పదహార్లు సంభావన సమర్పించి, సన్మానించారు. దానిని వినయంగా గురువు చేతిలో పెట్టి కాళ్లకు నమస్కరించినాడు ఆ బాలుడు.

కోనేటయ్యకు, తిరుపాలమ్మకు, నమ్మశక్యం కాకుండా ఉంది. తనివితీరా వాడిని అక్కున చేర్చుకుని ముద్దాడాలని ఉన్నా, జంకుతున్నారు. అది గమనించిన వైనతేయ, తానే వెళ్లి అమ్మను నాయనను వాటేసుకొన్నాడు. అక్క రమణమ్మ వాడిని కౌగిలించుకుంది.

“నాయనా! నా పేరు నిలబెట్టావు! నీ ముందర అనకూడదు కాని, నీ ప్రదర్శన అసలు తొలి ప్రయత్నంగా అనిపించలేదు” అన్నారు శర్మగారు.

“అంతా మీ అనుగ్రహమే కదా స్వామి” అన్నాడు వాడు వినయంగా.

అందరూ ఇంటికి చేరుకున్నారు. గ్రామస్థులు చదివించిన సంభావనలు మూడు వందల దాకా వచ్చినాయి.

“అవి మీ నాయన కివ్వురా” అని చెప్పినాడు స్వామి. కోనేటయ్య ఉబ్బితబ్బిబ్బు అయినాడు.

వల్లెలాంబ వాడికి దిష్టి తీసింది.

ఆమె సాయంత్రమే అందరికీ అన్నం, మునక్కాడల పులుసు (సాంబారు) చుక్కకూర పచ్చడి, చేసి పెట్టి వచ్చింది.

“మా బంగారు కొండ!” అని వాడి బుగ్గలు పుణికిందామె. అందరూ భోజనాలు చేసి విశ్రమించారు.

మరునాడు పొద్దున్న వారంతా వెళ్లిపోయారు.

(ఇంకా ఉంది)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here