‘శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ – రచనలు – విశ్లేషణ’ సాహిత్య సభ – నివేదిక

0
3

[dropcap]సం[/dropcap]చిక-స్వాధ్యాయ, తెలంగాణా భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో – ‘శ్రీమతి సంధ్యా యల్లాప్రగడ – రచనలు – విశ్లేషణ’ సాహిత్య సభని – 25.9.2022, ఆదివారం ఉదయం 10 గంటల నుండి మధ్యాహ్నం1.00 గంట వరకు, స్వాధ్యాయ లైబ్రరీ హాల్, నారపల్లిలో నిర్వహించాము.

ఈ సమావేశానికి శ్రీమతి సంధ్య యల్లాప్రగడ, శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి, శ్రీమతి తమిరిశ జానకి, శ్రీ ఎన్. వి. హనుమంత రావు, శ్రీ కస్తూరి మురళీకృష్ణ, శ్రీ కోవెల సంతోష్ కుమార్, శ్రీమతి నళిని, కొల్లూరి సోమ శంకర్, తదితరులు హాజరయ్యారు.

శ్రీ కస్తూరి మురళీకృష్ణ అతిథులను సభకు పరిచయం చేశారు.

అనంతరం ‘నమామి దేవి నర్మదే’ పుస్తకాన్ని శ్రీ ఎన్. వి. హనుమంత రావు విశ్లేషించారు. ఆ పుస్తకం తనకి కలిగించిన ప్రేరణని వివరించారు. ముఖ్యంగా తనని బాగా ఆకర్షించింది పరిక్రమ గురించి వివరించే ప్రతి అధ్యాయము చివర్లో ‘త్వదీయ పదపంకజ నమామి దేవీ నర్మదే’ అంటూ ఆ నర్మదా దేవి పాదపద్మములకు రచయిత్రి వందనం చేయడం గొప్పగా ఉందని అన్నారు. నదీ పరిక్రమలో రాజమాత అహల్యాబాయి హోల్కర్ గురించిన ఎన్నో వివరాలని తెలియజేయడం బావుందని చెప్పారు. ఈ పరిక్రమ ద్వారా అనుభవాలను అక్షరీకరించడం వలన మన మనసులు కూడా ఆ జగదాంబ మీద అనుసంధానం అయ్యేలా కొంత మత్తును చల్లారేమో అనిపిస్తుందని వ్యాఖ్యానించారు.

‘కార్తీకంలో కాశీయాత్ర’ పుస్తకంపై ప్రసంగించవలసిన శ్రీ కోవెల సుప్రసన్నాచార్య అనారోగ్యం వల్ల సభకు రాలేకపోవడంతో – ఆ పుస్తకం నేపథ్యం గురించి, గొప్పతనం గురించి కస్తూరి మురళికృష్ణ సంక్షిప్తంగా వివరించారు. అలాగే ‘సత్యాన్వేషణ’ పుస్తకాన్ని విశ్లేషించిన శ్రీ పాణ్యం దత్తశర్మగారు కేరళ పర్యటనలో ఉండడం వారు వ్రాసి పంపిన విశ్లేషణని రేఖామాత్రంగా స్పృశించారు. దత్తశర్మ గారు తమ వ్యాసాన్ని ఆడియో రికార్డు చేసినందున ఆ ఆడియోని స్వాధ్యాయ యూట్యూబ్‍ ఛానెల్‍లో ఉంచుతామని తెలిపారు.

శ్రీమతి పొత్తూరి విజయలక్ష్మి తనకి సంధ్య యల్లాప్రగడ గారితో ఉన్న అనుబంధాన్ని గురించి వివరించారు. ఆమె తనకి ఓ కూతురిలా ఎలా దగ్గరయ్యారో ఆత్మీయంగా వివరించారు.

‘భారతీయ యోగులు’ పుస్తకాన్ని శ్రీమతి తమిరిశ జానకి గొప్పగా విశ్లేషించారు. శ్రీ శంకరభగవత్పాదులు త్రైలింగస్వామి మొదలుకొని అవధూత శ్రీ చిమటం అమ్మ కాశిరెడ్డి నాయన వరకూ అధ్యయనం చేసి పాఠకులకు అందించారని అన్నారు. కనిపించని విద్వన్మూర్తుల సాంగత్యం, అదృశ్య సద్గురువుల సాంగత్యం ఎవరికైనా లభించాలీ అంటే వారిని గురించిన పుస్తకాలు పదేపదే అధ్యయనం చెయ్యాలనీ, సంధ్య యల్లాప్రగడ అధ్యయనం చేయడంలో నిష్ణాతురాలయ్యారని ఘంటాపధంగా చెప్తుంది ఆమె రాసిన ఈ పుస్తకం అని వ్యాఖ్యానించారు. మన భారతదేశం ఒక పుణ్యస్థలమనీ, ఇక్కడ ఎందరో యోగులు తమ జన్మచరితార్ధకం చేసుకున్నారనీ జానకి గారు అన్నారు. ఇతరులకోసం వారు చేసిన హితబోధలు మనం మర్చిపోకూడదని తెలిపారు.

శ్రీమతి నళిని మాట్లాడుతూ – ఫేస్‌బుక్‍లో సంధ్య యల్లాప్రగడ రచనలు – కష్టకాలంతో తనకెంత ధైర్యాన్నిచ్చాయో సభికుల కళ్ళు చెమర్చేలా వివరించారు. కేన్సర్‍ని తట్టుకునే మనోబలాన్ని పొందడంలో సంధ్య గారి రచనలు తనకి ఉపకరించాయని తెలిపారు.

‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కథలు’ పుస్తకాన్ని నేను (కొల్లూరి సోమ శంకర్) పరిచయం చేశాను.

అనంతరం సంధ్య గారు ఈ పుస్తకాలు రాయడానికి గల నేపథ్యాన్ని వివరించి, రచయిత్రిగా, సాధకురాలిగా తమ అనుభవాలను ప్రస్తావిస్తూ తమ స్పందనని తెలియజేశారు. ముఖ్యంగా నళిని గారి మాటలు తననెంతో ఉద్వేగానికి గురిచేశాయని తెలిపారు. పొత్తూరి విజయలక్ష్మి గారితో ఉన్న అనుబంధాన్ని సంధ్యగారు ప్రస్తావించారు.

వంటల పుస్తకం తొలుత ఫేస్‌బుక్ మాధ్యమం ద్వారా రచించినట్లు తెలిపారు. కడుపు నింపే చక్కని రుచులతో, పసందైన కబుర్లతో సరదాగా ఉండేలా ఆ రచన సాగిందని తెలిపారు. అలాగే భారతీయ యోగుల గొప్పదనాన్ని అందరికీ తెలపాలనే ఉద్దేశంతో ఫేస్‍బుక్‍లో రచించిన వ్యాసాలతో ‘భారతీయ యోగులు’ పుస్తకం రూపొందించినట్లు తెలిపారు

2019 కార్తీకంలో ఒక నెల పాటు కాశీలో ఉండే అదృష్టం కలిగిందని అక్కడి ఆలయాలను, యోగులను, ఘాట్‌లను దర్శించి – సంచికలో వ్యాసాలుగా ప్రచురించానని, వాటినే తరువాత పుస్తకం రూపంలోకి తెచ్చానని తెలిపారు.

గురువు కోసం తాను జరిపిన అన్వేషణను వ్యాసపరంపరగా రూపొందించి సంచిక పత్రికలో ప్రచురించానని, వాటి సంకలనమే ‘సత్యాన్వేషణ’ పుస్తకమని తెలిపారు.

ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ కలిగించిన అశాంతికి తామూ గురయ్యామని, దానిని దూరం చేసుకోవడానికి నర్మద పరిక్రమ చేయాలనే ఆలోచన కలిగిందని తెలిపారు. కోవిడ్ తగ్గుముఖం పట్టి, భారతదేశానికి రాగలమని నిశ్చయమయ్యాకా, నర్మద పరిక్రమ ఏర్పాట్లు చేసుకుని, అనుకున్న విధంగా యాత్ర ముగించామని తెలిపారు. నర్మద పరిక్రమ చేసినట్టు తమ గురువుగారికి చెప్పగా, వారు ఈ పరిక్రమ గురించి వ్రాసి పుస్తక రూపంలో తెచ్చి నర్మద పరిక్రమ గురించి పదిమందికీ తెలిసేలా చేయమని ఆదేశించారని, గురువాజ్ఞ మేరకు ఈ పుస్తకాన్ని ప్రచురించినట్లు తెలిపారు. తనను నడిపిస్తున్న అమ్మవారికి కృతజ్ఞతలు తెలిపారు.

శ్రీ కోవెల సంతోష్ కుమార్ సభ ఏర్పాట్లను పర్యవేక్షించారు.

చివరగా సంచిక – స్వాధ్యాయ రాబోయే కాలంలో చేపట్టబోయే సాహిత్య కార్యక్రమాల గురించి, సంచికలో ప్రచురించబోయే కొత్త రచనల గురించి శ్రీ కస్తూరి మురళీకృష్ణ వివరించాకా, సభ ముగిసింది.

***

‘నేను వడ్డించిన రుచులు – చెప్పిన కథలు’ పుస్తకం గురించి నా పరిచయం – ఇక్కడ అందిస్తున్నాను.

***

అందరికీ నమస్కారం.

శ్రీమతి సంధ్య యల్లాప్రగడ ప్రసిద్ధ రచయిత్రి. విద్వన్మణులు. వివేకవంతులు. భౌతిక ప్రపంచంలో ఉంటూ కూడా ఆధ్యాత్మిక చింతనలో ఉంటారావిడ. జీవితంలో ఎంత ఎదిగినా, ఒదిగి ఉంటూ, ఒద్దికగా ఉండే వ్యక్తి.

సంధ్య గారు రచించినవి ఎక్కువగా ఆధ్యాత్మిక పుస్తకాలే! బహుశా ఈ పుస్తకం వారి తొలి పుస్తకం ఏమో – ఆధ్యాత్మికతకి భిన్నంగా ఉంది. అయినా ఇందులోనూ ఆధ్యాత్మికతను మనం చూడచ్చు. అన్నం పరబ్రహ్మ స్వరూపం అంటారు, ఆహారం తీసుకోవడాన్ని ఉదర పూజ అని కూడా అంటారు. ఆహారం తీసుకున్నాకా ‘ఆత్మారాముడు’ చల్లబడ్డాడు అంటారు. కాబట్టి ఈ పుస్తకం లోనూ ఓ రకంగా ఆధ్యాత్మికత ఇమిడి ఉన్నట్టే.

అన్నం కడుపు నింపితే, సాహిత్యం మనసు నింపుతుంది. ఈ పుస్తకం ద్వారా ఆ రెండూ నిండే అవకాశం ఉంది. రుచికరమైన వంటకాలని, చక్కని కబుర్లతో ఆస్వాదించవచ్చు. సాధారణంగా వంటల పుస్తకాలు, కథల పుస్తకాలు వేర్వేరుగా ఉంటాయి. కానీ రెసిపీలని, జీవితంలో సంఘటనలకు ముడిపెడుతూ, వంటకాలు తయారు చేసే విధానాన్ని కథలో ఇమిడిపోయేలా వివరిస్తూ రుచికరంగా వడ్దించిన పుస్తకం ఇది.

ఇందులోని వంటలు కొందరికి తెలిసే ఉంటాయి.. తెలియనిదల్లా ఆ వంట చేస్తున్నప్పుడో, లేదా కుటుంబ సభ్యులకు వడ్డిస్తున్నప్పుడో జరిగిన సంగతులని కబుర్లుగా చెప్పడం! అదే ఈ పుస్తకం విశేషం.

ఈ పుస్తకంలోని కొన్ని వంటలని, విశేషాలని ప్రస్తావిస్తాను.

భోజనప్రియులు చాలామంది కాకినాడ సుబ్బయ్య హోటల్ పేరు వినే ఉంటారు, అక్కడ భోంచేసే ఉంటారు. అక్కడి రుచులు, వడ్డన అద్భుతం. ఒక్కో పదార్థాన్ని ఎలా తినాలో చెబుతూ మరీ వడ్డిస్తారు. అంత పేరు పొందిన ఆ హోటల్‌ని హైదరాబాదు కుకట్‍పల్లిలోనూ తెరిచారు. ఈ హోటల్‍లో ఎంతో ఆదరణ పొందిన ‘బుట్ట భోజనం’ వర్ణనతో ప్రారంభమవుతుంది ‘బుట్టోపాఖ్యానము’. తార్నాక నుంచి కుకట్‌పల్లి వచ్చి ఆ బుట్ట భోజనం తెచ్చుకునే కన్నా.. కాకినాడ వెళ్ళి తినేసి రావడం సులువని చెబుతారు. రచయిత్రి భర్త విమానంలో హైదరాబాద్ చేరే వైనం, నగరంలోని ట్రాఫిక్ జామ్, ఆ రద్దీలో గంటల కొద్దీ గడిచిపోయే సమయం… చివరికి చల్లారి పోయి – రుచి మారిపోయిన ఆ భోజనం ఆయన తినడం – హాయిగా చదివిస్తుంది. కొద్దిగా బాధనూ కలిగిస్తుంది, అంత ఆకలితో వచ్చి అలాంటి భోజనం తినాల్సి వచ్చిందే అని.

కిరీటం ఉన్న కూర వంకాయని అంటారు. అలా కిరీటం ఉందని వంకాయ విర్రవీగితే, దేవుడు దాని తల మీద ఓ మేకు కొట్టాడంటారు. వంకాయ గురించి ఓ సినీకవి – ఆహా ఏమి రుచి – తినరా మైమరిచి అని అన్నారు. అలాంటి వంకాయలతో మెంతికూర వేసి రుచికరంగా ఎలా వండాలో చెప్తారు ‘వంకాయోపాఖ్యానము’లో.

‘ఆవడలు – ఊడిన పళ్ళు’ శీర్షిక చదవగానే నవ్వొస్తుంది. లోపల ఏముంటుందో ఊహించేస్తాం… ఆవడలో కాదందోయ్… ఆ కథలో…! ఆవడలో ఏముటుందో మన అందరికీ తెలిసిందే! మెత్తని పెరుగావడలు ఎలా చేసుకోవాలో చెప్తూ, తనకెదురయిన ఓ అనుభవాన్ని హాస్యంగా పంచుకుంటారు.

కొంత కాలం క్రితం వరకు తెలుగువారి పెళ్ళిళ్ళలో గుమ్మడికాయ పులుసు ఫేమస్. చేయి తిరిగిన వంటవాళ్ళు చేస్తే ఆ రుచే వేరు. తమ పెళ్ళి అనుభవాన్ని, అనుభూతులని చెప్తూ, గుమ్మడికాయ పులుసు ఎలా చేసుకోవాలో చెప్తారు రచయిత్రి.

ఓ మాంఛి రుచికరమైన పెసరట్టు తింటే ఎలా ఉంటుందో కవితా రూపంలో చెబ్తూ – ఎలా చేస్తే సూపర్ హిట్ అవుతుందో వివరిస్తారు. మరో చోట రుచికరమైన, పెళ పెళ లాడే రవ్వ దోశ ఎలా వేసుకోవాలో చెప్తారు.

ప్రెసిడెంట్ ట్రంప్ సృష్టించిన ఇబ్బందులను ప్రస్తావిస్తూ – వాటిని కొత్తావకాయలో దినుసుల్లా అనుకుంటూ – ఆ కోపాన్ని కారంగా మార్చి రచయిత్రి అమెరికాలో ఆవకాయ పెట్టిన వైనం నవ్విస్తుంది.

‘రోటీమ్యాటిక్ మ్యాజిక్’ కథలో రోటీమేకర్ తమని ఎలా ఆదుకుందో వివరించారు.

శనగ పిండి అనుకుని కస్టర్డ్ పొడితో దోశలు వేయడానికి ప్రయత్నించిన తీరు నవ్విస్తుంది. అయితే కాస్త అనుభవం వచ్చాకా, శనగపిండి దోశలని సులువుగా ఎలా వేసుకోవచ్చో తెలుసుకుని పాఠకులకు వివరిస్తారు.

అత్తారింట్లో కోడళ్ళు ఎలా నడుచుకుంటే ఎవరికీ ఏ ఇబ్బందులు రాకుండా ఉంటాయో చెబుతూ పూర్ణం బూర్ల రెసిపీ వివరిస్తారు.

తాను చక్కటి దోశ వేయడానికి ఒక దశాబ్ద కాలం పట్టిందనీ – ఆ కాలంలో తాను పడ్డ తిప్పలు, అగచాట్లు అన్నీ ఇన్నీ కావని చెబ్తూ – అదంతా రాస్తే ఒక నవల అవుతుందనీ, సినిమాగా తీస్తే జంధ్యాల వారి బాణీ హాస్య చిత్రం అవుతుందని అంటారు. ఈ ఎపిసోడ్‍లో దిబ్బరొట్టె దోసెగా మారిన వైనం వివరిస్తారు.

గుజరాతీలు ఎంతో ఇష్టంగా తినే వంటకం డోక్లా. ఆ వంటకాన్ని గుజరాతీలు చేసుకునేంత చక్కగా ఎలా చేసుకోవచ్చో చెప్తూ – అలా ఒకసారి తాను డోక్లా చేసినప్పుడు తన బామ్మగారు ఏం చేసారో రచయిత్రి చెప్పినప్పుడు పాఠకులకు నవ్వు ఆగదు.

ముక్కల పచ్చడిని ముత్తైదువగా పోల్చి నవ్విస్తూ ఆ పచ్చడి ఎలా చేసుకోవాలో చెప్తారు.

మన అందరి వంటిళ్ళలో దర్శనమిచ్చేది పోపుల పెట్టె. అమ్మలు వీలైనంత డబ్బులు కూడా దీనిలో దాచేవారు. అలాంటి పోపుల పెట్టెలో ఉండే అమృతం గురించి చెప్తారు ఓ కథలో. అనుకోకుండా అతిథులు వస్తే సులువుగా, రుచికరంగా జీరా రైస్ ఎలా వండిపెట్టాలో చెప్తారు.

నేర్చుకునే దశలో చాలామందికి వంటిల్లే ఒక ప్రయోగశాల అవుతుంది. సంధ్య గారికీ అంతే. ఏడవ తరగతిలో గులాబ్ జామ్ చేయాలని తాను చేసిన ప్రయోగం గురించి చెబుతూ.. పెద్దలు లేని సమయంలో చేసే ప్రయోగాలు దారి తప్పితే ప్రమాదమని తస్మాత్ జాగ్రత్త అంటారు.

వంకాయతో మరో రుచికరమైన పదార్థం – వంగీబాత్. అన్నంలోనే మిక్స్ కలిపి సులువుగా చేయవచ్చని చెప్తారు. అన్నీ తగిన పాళ్ళలో పడితే.. చక్కని రుచి వస్తుందంటారు.

అయితే ఒక్కోసారి పొరపాటున వంటలు రుచి మారి అతిథులను ఇబ్బంది పెడతాయని చెప్తూ తానూ కూర చేసిన వంకాయలకి కాకరకాయంత చేదు ఉన్నది గమనించుకోలేదని అంటారు. అతిథులను భోజనానికి పిలిచే ముందు తీసుకోవలసిన జాగ్రత్తలో మరొకటి చేరుతుంది.

రచయిత్రికి కొడుకు వరసయ్యే అబ్బాయి హల్దీరామ్స్ వారి మూంగ్ దాల్‌తో పప్పు చేసిన వైనం నవ్విస్తూనే – మగపిల్లలకి వంటపై కనీస జ్ఞానం ఉండాల్సిన అవసరాన్ని చెబుతుంది.

కాప్సికమ్ రైస్‌తో రచయిత్రి చెప్పే జీవిత పాఠాలు చదివి తీరవలసిందే. ఆచరించదగినవీ సూత్రాలు.

పచ్చళ్ళూ, కూరలూ, దోశలే కాదు… స్వీట్ల గురించీ చెప్తారు రచయిత్రి. డ్రై ఫ్రూట్లతో మిఠాయి ఎలా చేసుకోవచ్చో చెప్తారు.

పెళ్ళయిన కొత్తల్లో ఇటుక ముక్కల్లాంటి ఇడ్లీలతో చెడుగుడు ఆడిన వైనం హాయిగా నవ్విస్తుంది.

కెవ్వుకాయ కాకరకాయ అంటూ పులుసుకూర ఎలా చేయవచ్చో చెప్పి, దీనితో అమ్మల కష్టం తీరుతుందని హామీ ఇస్తారు.

సమోసాలంటే అందరికీ నూరూరుతుంది. అయితే నూనెలో వేయించకుండా ఇంట్లోనే కన్వెషన్ ఓవెన్‍లో సమోసాలను ఎలా చేసుకోవచ్చో చెప్తారు. కొబ్బరితో కేకు చేసుకునే విధానం ఆసక్తికరంగా ఉంటుంది.

గుళ్ళో ప్రసాదంగా ఇచ్చే పులిహోర ఎంత రుచిగా ఉంటుందో అందరికీ తెలిసినదే. ఆ రుచికి ఏ మాత్రం తగ్గకుండా, ఇంట్లోనే ఎలా చేసుకోవచ్చో వివరించారు. ధనుర్మాసంలో వైష్ణవాలయాలలో ప్రసాదంగా ఇచ్చే పొంగల్‌ని అంతే రుచిగా ఇంట్లోనే చేసుకునే విధానం వివరిస్తారు.

‘బొంతకాకర పులుసు – వింతలు’ హాయిగా చదివిస్తుంది. కొత్త రుచిని పరిచయం చేస్తుంది.

తాను చేసిన హల్వా భర్త నోటికి అతుక్కుపోతే ఆ వంటకం – హిట్టా ఫట్టా అని సంశయంలో పడతారు.

బంగాళాదుంప భౌ భౌ లాగా కాకరకాయ క్యావ్ క్యావ్ చేసుకునే విధానాన్ని తెలిపి, అది ‘తినబుల్’ గానే ఉంటుందని భరోసా ఇస్తారు.

ఈ పుస్తకంలో ఇంకా పలు పసందైన వంటాకాలను చేసుకునే పద్ధతులను వివరించారు. ఈ కథలకి సరసి గారు వేసిన బొమ్మలు హైలైట్. ఒక్కోసారి కథ చదవక ముందే బొమ్మను చూస్తుంటేనే పెదాలపై నవ్వులు పూస్తాయి.

ఈ పుస్తకంలో కథన శైలి ఎలా ఉందంటే, రచయిత్రే స్వయంగా మన పక్కన ఉండి, కబుర్లు చెబుతున్నట్టుగా ఉంటుంది.

కమ్మని వంటకాలతో నవ్వించే కబుర్లు. కొత్త వంటలు ప్రయత్నిద్దామనుకునే వారికి ఉపయుక్తమైన పుస్తకం ఇది.

వంగూరి ఫౌండేషన్ ఆఫ్ అమెరికా వారు ప్రచురించిన ఈ 132 పేజీల పుస్తకం వెల ₹ 100.

ఇండియాలో, నవోదయ్ బుక్ హౌస్, కాచీగుడా హైదరాబాద్ లోనూ – అమెరికాలో వంగూరి ఫౌండేషన్ వారి వద్ద లభ్యం.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here