[తెలుగు సాహిత్యం పట్ల కొన్ని తరాలలో ఆసక్తి రగిలించి, ఆధునిక తరానికి వ్యక్తిత్వ వికాస పాఠాలు చెప్తూ, యువతకు ఉత్తమ సాహిత్యం ద్వారా ఉత్తమ వ్యక్తిత్వాన్నివ్వాలని నిరంతరం తపించే యువభారతి సంస్థ స్థాపించి వచ్చే దసరాకు 60 సంవత్సరాలు పూర్తవుతాయి. ఈ సందర్భాన్ని పురస్కరించుకుని తెలుగు సాహిత్యానికి, సమాజానికి యువభారతి చేసిన సేవను తెలుగు పాఠకులకు పరిచయం చేసే ఉద్దేశంతో ప్రతి ఆదివారం సంచికలో యువభారతి ప్రచురించిన పుస్తకాల పరిచయం వుంటుంది. ఈ శీర్షిక వచ్చే సంవత్సరం విజయదశమి వరకూ సాగుతుంది.]
శ్రీనాథుని కవితా వైభవం
చిన్నారి పొన్నారి చిరుత కూకటినాడు రచియించితి మరుత్తరాట్చరిత్ర
నూనూగు మీసాల నూత్న యౌవనమున శాలివాహన సప్త శతి నొడివితి
సంతరించితి నిండు జవ్వనంబునయందు హర్ష నైషధ కావ్య మాంధ్ర భాష
బ్రౌఢ నిర్భర వయః పరిపాకమునగొని యాడితి భీమనాయకుని మహిమ
బ్రాయమెంతయు మిగుల గైవ్రాలకుండ
గాశికాఖండమను మహా గ్రంథ మేను
దెనుగు జేసెద గర్ణాట దేశకటక
పద్మవనహేళి శ్రీనాథ భట్టనుకవి.
మాన వీర ప్రధానమైన మరుత్తరాట్చరిత్ర శ్రీనాథుని మనసును మొదట ఆకర్షించింది. తొలి యౌవనం శాలివాహన సప్తశతి లోని శృంగారరసాన్ని తెలుగు తియ్యదనాలతో చవిచూచింది. నిండు యౌవనంలో శృంగార వీరాలు మహాకావ్య పథంలో మదేభయూధంలా మనోజ్ఞంగా విహరించాయి. ఉవ్వెత్తుగా లేచిన ఉదధి తరంగంలా శ్రీనాథుడు విద్యాసనాథుడైనాడు. విద్యాధికారి అయినాడు. పట్టుపరుపుల్లో పవ్వళించిన పండితకవికి ప్రబంధ నిర్మాణంతో అవసరం పడలేదు. పదవి పోయిందో లేదో పరమేశ్వరుడు జ్ఞాపకం వచ్చాడు. పచ్చి మంచినీళ్ళు కరవైతే గంగాధరున్ని గొంతెత్తి పిలిచాడు. శృంగారనైషధం తరువాత వెలసినవన్నీ శివకథా ప్రబంధాలే. భక్తి కుదిరిన శ్రీనాధుడు రక్తినివీడి విరక్తుడు మాత్రం కాలేదు. భక్తి కవితలల్లి కూడా సూక్తి మౌక్తికంలా శృంగారాన్ని వెలయించాడు. రాజ్యాలు జీర్ణించినా, భోజ్యాలు పూజ్యాలైనా, శ్రీనాథుడు స్వీయకవితాసామ్రాజ్యాన్ని నిర్మించుకొన్నాడు.
తెలుగులో కావ్య స్పృహ – నన్నయలో బీజరూపం లోనూ, తిక్కనలో అంకురరూపంలోనూ, ఎర్రనలో కుట్మల రూపంగానూ, నాచన సోమనాథునిలో పుష్పరూపంగానూ, శ్రీనాథునిలో ఫలరూపం గానూ పరిణమించింది. శ్రీనాథుని యుగం కావ్యయుగం అంటారు. ఆంధ్ర కావ్య స్పృహకు శ్రీనాథుడు కళాపూర్ణుడు; శృంగార నైషద రచనం శరద్రాత్రి.
ప్రాతఃస్మరనీయులైన ప్రాచీన కవుల రచనలకు, ఈనాటి తెలుగు సాహితీప్రియులకు అర్ధమయ్యే రీతిలో వ్యాఖ్యానాలను వ్రాయించి అందించాలని యువభారతి ‘సాహితీ వాహిని’ పరంపరను ప్రారంభించింది. ఆ సాహితీ వాహినిలో ఇది ఆరవ తరంగం.
సంస్థ చేస్తున్న సాహితీ సేవలోని ఆంతర్యాన్ని, నైర్మల్యాన్ని అర్ధంచేసుకుని, సంస్థకు చేదోడు వాదోడుగా ఉన్న తపస్వులు, మనస్వులు, యువభారతి అధికభాగం ప్రచురణలకు ప్రధాన సంపాదకులు, డాక్టర్ జి వి సుబ్రహ్మణ్యంగారు వ్రాసి ఇచ్చిన ఈ పుస్తకం ప్రతి సాహితీ పిపాసి తప్పనిసరిగా చదవవలసిన పుస్తకం.
క్రింద ఇవ్వబడిన link ను క్లిక్ చేసి ఈ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోండి.
https://drive.google.com/file/d/17Yiz19IBPJ0FEOEg4Ml3Plnzthce5Ros/view
లేదా క్రింద ఇవ్వబడిన QR code ను scan చేసినా ఆ పుస్తకాన్ని ఉచితంగానే చదువుకోవచ్చు.