హరి దర్శనం కోసం తపించే మనసుతో, పరమేశ్వర దర్శన భాగ్యం కోసం ఆరాటపడే హృదయంతో హరి వేంకట లక్ష్మీ ప్రసాద్‌బాబు సృజించిన పద్యమాలిక శ్రీపదార్చన పద్యకావ్యం.
ఉత్పలమాల
శ్రీరమణీమనోహరుడు, చిన్మయరూపుడు, వేదవేద్యుడున్,
భూరమణీ వ్యధాహరుడు, భూరిశుభమ్ముల గూర్చువాడు, బృం
దారకవందితుండు, ఘనతాపసవర్గము నేలువాడు, నీ
రేరుహగర్భౌడౌ హరికి లెంకగ నయ్యెది నిండుభక్తితో. 1
మత్తకోకిల
నందదాతకు, శైలధారికి, నందుపట్టికి, చక్రికిన్,
నందగోకుల మేలు స్వామికి, నల్లనయ్యకు, శౌరికిన్,
నందినీ తటనృత్యకేళికి, నాదలోలుకు, శార్జికిన్,
వందనమ్మిడి కావ్యకన్యక వాసి నేలగ గోరెదన్. 2
చంపకమాల
అనయము వేణునాదమున హాయినొసంగెడు నల్లనయ్యపై
వినయము మీర కల్పముల బ్రీతిగ నుంచుచు దివ్యభామినుల్
వినతులొనర్చ, గోపజనవేలము గూడుచు నాడిపాడెడా
ఘనుడగు శ్యామసుందరుని గాఢముగా హృదినిల్పి గొల్చెదన్. 3
ఉత్పలమాల
నీ కడగంటి చూపులతి నేర్పున లీలల జేయుచున్ సదా
నీ కడ కెల్లజీవులను నేరిమి జేరిచి ముక్తిగూర్చుగా!
నీ కమనీయరూపమును నిర్మలచిత్తము నందు నిల్పెదన్
నీ కరుణావలోకనము నెమ్మి నొసంగుము నాకు మాధవా! 4
ఉత్పలమాల
గోపవధూకుచాగ్ర ఘనకుంకుమలాంఛన మొప్పు మేనితో,
గో పదధూళిధూసరితకుంతలభాసితమైన మోముతో,
గోపుల నుగ్గుజేయగల గోహరి వెల్గిడి గోపగోప్తయై
గోపరిపాలనా పటిమ గొప్పగ జాటిన కృష్ణు గొల్చెదన్. 5
ఉత్పలమాల
క్ష్మాతలి తల్లిదండ్రులును సద్గురు వెన్నగ కృష్ణుడౌటచే,
చేతము కృష్ణమందిరము, చేతలు భక్తుల సేవనమ్మునై,
వ్రాతలు వేణుమాధవుని ప్రాగ్ర్యము బిట్టుగా జాటుకోసమై
భాతిని గాంచగావలెను, భవ్య పథంబును జూపగావలెన్. 6
ఆ.వె.
నల్లకలువపూలు నడచివచ్చినరీతి
మేనిఛాయతోడ మెరయువాడ
తమ్మియింటిగరిత నెమ్మ నమ్మున నిల్పు
సారసాక్ష! కృష్ణ! సన్నుతింతు. 7
ఉత్పలమాల
ఆగమపంజరస్థిత, మనారతలోకహితైకకాంక్షితో
ద్యోగపరిశ్రమంబు, విబుధోన్నతవర్గసుసేవితంబు, శ్రీ
సాగరకన్యకాహృదయసారసభృంగము, గోపభామినీ
సాగతదివ్యమూర్తి గని సంస్తుతి జేసెద, శ్యామసుందరా! 8