కందము
అందర నడపెడి దేవుని
కెందామర బోలినట్టి కేలుం గొనుచున్
నందుడు నడకలు నేర్పగ
ముందెట్టి తపంబు జేసి, మురళీకృష్ణా! 9
ఉత్పలమాల
శారదరాత్రియందు ఘనసారఘటంబున పూర్ణరూపుడౌ
నీరజవైరి గాంచి, నవనీతమటంచు భ్రమించి, జేకొన
న్నారము నందు జేయిడగ, నవ్విన తల్లినిగాంచి, వెన్నకై
కోరుచు జాను కేలు, నను గూరిమి గానుత నెల్లవేళలన్. 10
ఉత్పలమాల
ఎత్తగు నొక్కపీటపయి నింకొక పీటను జేర్చి, మీదుగా
పొత్తుగ నొక్కని నిలిపి, పుత్తము మీదుగ నుట్టి నందు, ని
న్నత్తరి యింటివారు గని, ‘హర్తవు! చిక్కితి’ వంచు బల్కగా,
మొత్తము కన్నులం దుమిసి, ముంగిలి దాటిన లీలలెంచెదన్. 11
మత్తేభము
పెరుగున్ జిల్కెడు నొక్కగోపిక నినుం ప్రేమంబుతో గాంచుచున్,
పెరుగే లేని ఘటంబులో దరచగా పెంగవ్వముం నిల్పుచో,
కరుణాదృక్కుల నట్టి భామ గనుచున్ కామంబు పోద్రోచు, నీ
చరణేందీవర సాన్నిహిత్యమున సాలోక్యంబు గోరెదన్. 12
చంపకమాల
ఉరమున సింధురాజసుతే నుంచుచు నొద్దక గారవించుచున్,
ధరణిని ప్రేమ నేలునెడ, తామరకజ్జల మొక్కమాటుగా
విరిసిన రీతిగా గనుచు విస్మయనుందేడు జీవకోటులన్
పరవశవార్ధి ముంచు, ప్రణవాత్మకు గొల్చెద నిష్టసిద్ధికై. 13
ఉత్పలమాల
చక్కనినారిలో మిగుల చక్కనివాడవు నీవటంచు, నీ
ప్రక్కన జేరు భామినుల పాశము లన్నియు ద్రెంచివైచుచో
నక్కట! నీదు తత్త్వము మహాద్బుత మంచు నెరుంగనేరకే
పెక్కురు వెక్కిరించిరట, పేరున వారి దిరస్కరించెదన్. 14
ఉత్పలమాల
అన్నువ మీర నిన్ను గని, యంజలి సేయుచు గారవించు, నా
కన్నులనీరు నీదు పదకంజయుగంబున జాలువార, నీ
వెన్నడు వత్తు వింక? పరమేశ్వర! దివ్యసరిత్పితా! హరీ!
మన్నును మిన్ను నేలుదొర! మాధవ! దర్శన భాగ్య మీయరా! 15
ఉత్పలమాల
పావన శంఖుచక్ర కరవాల గదాంబుజ భూషణాళితో,
సేవకు సిద్ధమై నిలచు శ్రీవినతాసుత వాహనమ్ముపై,
తావక దివ్యరూప మతితన్మయ మొందుచు గాంచు రాధతో,
భావమునందు నిల్చి, కడుభద్రత నాకిడు నందనందనా! 16