మానిని
నారద గానము నట్టువమందున నామము భాసిల నాదముగా,
శారద పల్కులు శాస్త్రచయమ్ముగ సన్నుతి నీకయి సల్ఫసదా,
సారమెరింగిన సత్కవి సంస్తుత సన్నతు లందెడు చక్రధరా!
భారము గైకొని భక్తజనాళికి భద్రత నీగది, భావవశా! 17
శార్దూలము
వంశీనాదమరంద బిందులహరీ ప్రహ్లాద చేతస్కులై,
అంశీతుల్యముఖావలోక జనితాహ్లాదౌత్సుకత్వమ్ముచే,
త్రింశత్కోటి నిలింపబృంద మిల సంప్రీతి న్నినున్ గొల్వగా
నంశం బందిరి, గోపవర్గ మగుచున్ హర్షాతిరేకమ్ముతో. 18
చంపకమాల
ధరణిని యెల్లజీవులను ధన్యుల జేసెడి దివ్యమూర్తి నె
క్కరణిని గాంతుమో యనుచు గాసిలుచుండగ యోగిపుంగవుల్,
అరమరలేని ప్రేమ నిను నర్మిలి గూడిరి యాలకాపరుల్,
అరయగ భక్తిరీతుల సమంచితమైనది ప్రేమయందు
నీ నరులకు జాటి నాడవయ, నైగమగోచర! నందనందనా! 19
శార్దూలము
త్రైలోక్యస్థిత జీవకోట్యఘములన్ దక్కించు నేత్రంబుతో,
సాలోక్యంబిడ భక్తషండభవమున్ శాసించు హస్తంబుతో,
కాళీయాహిమదాపకర్తమహిమన్ గైకొన్న పాదంబుతో,
నాలో నిల్చిన బాలకృష్ణ! కృపతో నన్నేలు, భక్తప్రియా! 20
శార్దూలము
గోలోకం బది బృందావాటి, దివిజుల్ గోపార్బకశ్రేణిగా,
నాలో కింపగ సన్మునీంద్రు లిలపై నాగోపికావర్గమై,
భూలోకంబున రాధగా మెయిగొనెన్ మున్నీటిరాకన్య, నీ
లీలాకేళి శుభోత్కరంబయి, హరీ! సుశ్రేయమందించుతన్. 21
శార్దూలము
సంసారమ్మది మోహహేతువు, కడున్ సంతాపమగ్నంబునై,
హింసామార్గవిబోధకత్వ పటిమన్ హీనాత్ములం జేయుచున్
సంస్పష్టత్వము వృద్దిగూర్చు కతనన్, సన్మార్గయోనంటుకై
కంసారీ! భవదీయ నామజపమే కైవల్యసంధానమౌ! 22
మత్తేభము
రమణీయోనన చంద్రచంద్రికల విభ్రాజిల్లు నెమ్మోవిపై
మమకారామృతవృష్టిగూర్చు విలాసన్మాధుర్య గానంబుతో
ప్రమదా మానసపీఠి నిల్చి కరుణన్ బ్రారబ్దముల్ దీర్చు, నా
కమనీయాద్బుత శైశవాకృతిక నే గైమోడ్పు అందించెదన్. 23
ఆ.వె.
ఆవుపాల దీయ నరిగిన యమ్మకు
బాలకృష్ణ! నీవు లీలజూప,
వేగజేర నచటి లేగదూడయు గూడ
ప్రియము తోడ నీకు పేయ మొసగె. 24