శ్రీపదార్చన-పద్యకావ్యం

    0
    4

    కందము

    నందావాసము సరసము

    నందాత్మజ పాదయుగము నాళీకమ్ముల్

    అందెలు కలహంసమ్ములు

    అందెలగజ్జల రవళులు హంసధ్వనులౌ!                        25

    ఉత్పలమాల

    దప్పికతోడ గోగణము దవ్వుల నీలకళింద తోయమున్

    చప్పున గ్రోలనెంచి, తరు ఛాయల నిల్చిన నిన్ను గాంచి, న

    యప్పని భ్రాంతి జెంది, ముదమెందుచు దాపున కేగుదేరగా,

    చిప్పిలు ప్రేమ తోడ గని, చేరగ దీసిన స్వామి! మొక్కెదన్.         26

    ఉత్పలమాల

    కొందరు వేదశాస్త్రముల గోరి పఠింతురు మోక్ష లబ్దికై,

    కొందరు సద్గురూత్తముల గోరి భజింతురు జ్ఞానసిద్ధికై,

    అందగలేని ముక్తిపద మందెడి కోరిక సందడింప, నే

    నందుని గొల్చెదన్, యతని నందను డచ్చట జేరియుండుటన్.        27

    ఉత్పలమాల

    అందెలగజ్జెలున్ మొరయ, నందము జిందెడి మేఖలాధ్వనుల్

    సందడిజేయ, వ్యాఘ్రనఖసద్రుచు లొప్పె డురస్థలంబుతో

    కందళితాబ్జ నేత్రముల కంజభవాండము వీడి వేడ్కమై

    నందజనాంతవాటి నిల నవనాక మొనర్చిన నిన్ను గొల్చెదన్.        28

    ఉత్పలమాల

    తామరసాక్షుడైన హరి, తల్లికి లీలల జూపనెంచుచున్,

    ప్రేమనిబంధబంధనముల వీడక నిల్చుచు వేడ్కజేయగా

    నేమి తపంబొనర్చినదొ, యే భవనమందున నందపత్ని? స

    త్కామితదాయకుం సుతుని కౌగిట జేరిచి ముద్దులాడగా.           29

    శార్దూలము

    శ్రీరాజాన్వయ కీర్తిచంద్రికల వైశిష్ట్యంబు దీవింపగా,

    ధీరుండౌ వసుదేవనందనుడువై, దేదీప్యరూపమ్ముతో

    కారాగారమునందు బుట్టి, ప్రజకున్ కష్టంబు లీడేర్చి, సు

    శ్రీ రంజిల్లగ జేయు కృష్ణ! నిను నే చిత్రింతు చిత్తమ్మునన్.         30

    చంపకమాల

    అటమట బెట్టు కష్టముల కార్తత జెందుచు నిన్ను వేడగా

    నటుకుల మూటగట్టుకొని యాదృతిజేరు సుదాము పుణ్యమే

    యటుకులటంచు నెంచుచు, సమంచితవైభవ మిచ్చి బ్రోచుచో,

    పటుతర మైత్రి కెంతయును పట్టము గట్టిన కృష్ణ! సాంజలుల్.       31

    చంపకమాల

    ఎరుగక జేసి పాపముల నీభవమందున బుద్ధజీవులున్,

    ఎరుక వహించి నేరము లవెన్నియొ జేసెడి మోహబుద్ధులున్,

    ఎరిగి యెరుంగలేక నిను నెంచిన తోడనె వారిదోషముల్

    తరిగొని దీర్చి వేసెదవు, దైత్యనిసూధన! నందనందనా!           32

    LEAVE A REPLY

    Please enter your comment!
    Please enter your name here