ఉత్పలమాల
శ్రీశ! భవత్పాదాబ్జముల సేవయె ‘ధర్మము’ నాదు మేనికిన్
నీ శుభనామచింతనమె నిర్ణయి ‘తార్థము’ నాదు మాటకున్,
కేశవ! నీదు భక్తగుణ కీర్తనె ‘కావ్యము’ నా తలంపుకున్,
ఆశయమైన ‘మోక్షము’న కందవు నీవు, నతుల్ రమాధవా! 41
ఉత్పలమాల
తావక నామకీర్తనమె ధన్యతమంబగు మంత్రరాజమై
త్రీవనొసంగి జేర్చుగద తోషణ మిచ్చెడు ముక్తిధామమున్
కావున ‘కృష్ణ కృష్ణ’ యను కామితదాయక అక్షరాక్షరిన్
భావము నందు సంతసము భావనజేసెద నందనందనా. 42
ఉత్పలమాల
పన్నుగ నీదు పాణిగొను భాగ్యమునందిన వంశీకమ్ము, తా
నెన్నగ నెన్ని జన్మముల నేమి తపంబొనరించి మించెనో!
వన్నెలు జిల్కుచున్ సతము బాయక నిల్చెను నీదు మోవిపై
విన్నప మేనొనర్తు హరి! ప్రేమగ నా కరమూని బ్రోవరా! 43
శార్దూలము
ఓ వంశీధర! వాసుదేవ! వరదా! ఓ దేవకీనందనా!
నీవే సత్యము నిత్యమంచు మదిలో నిర్ధారణం బయ్యెడిన్,
భావంబందున నిన్ను నున్ను నిల్పి గొలుతున్ భద్రంబు జేకూర్చగా
రావే, కుంజరరాజరక్షక! ననున్ రక్షింప వేవేగమే! 44
ఉత్పలమాల
తావక పాదపద్మముల దాస్యము జేయగ నెంచు నన్ను, వే
కావగ వచ్చి నిల్చు నిను గాంచెడి భాగ్యము నందజేయు నీ
పావన నామమంత్రమును బాయకి బల్కెడి శక్తినిచ్చి సం
భావన జేయుమో వరద! వాసవసన్నుత! వాంఛితార్థదా! 45
చంపకమాల
అనుదిన వేదపాఠి యను సంచితకీర్తిని బొందినట్టి ధీ
ఘనునకు లోకమందు తగు గౌరవ మబ్బిన యబ్బనచ్చు, నో
వనజదళాక్ష! నీ పతితపావన నామము నుచ్చరించకే
యొనరునె జన్మధన్యత, మహోత్తమభాగ్యము నందగల్గునే? 46
చంపకమాల
మునుకొని యింద్రియములను మొత్తెడు నద్బుతశక్తి నందగా,
మనమను దివ్యహంసమును మాకొను శత్రుల జీల్చివేయగా,
ననయము కృష్ణనామసుధ లానిన జాలును, భక్తిపంపునన్
మననము జేయు మెప్పుడు మాధవనామము నంతరంగమా! 47
శార్దూలము
వ్యామోహమ్ముల దీర్చెడౌషధము, సద్వాసంగ సంపాదితం
బై, మాయ ల్టునుమాడు సాయకమునై, వైక్లబ్యనిస్త్రాణమై,
క్షేమప్రాప్తి నొసంగి శీఘ్రముగ సుశ్రేయెమ్ము చేకూర్చు నీ
నామం బెప్పుడు బల్కనెంతు మదిలో వంశీధరా! శ్రీధరా! 48