శ్రీపర్వతం-10

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 10వ భాగం. [/box]

19

[dropcap]ఈ[/dropcap] మధ్యనే ఒక పద్ధతిలో పనులువుతున్నాయి. మూడు నెలల పాటు శశికళ, మోహన్ నాగార్జున కొండలోయలోని తవ్వకాలనన్నిటినీ చూసి వచ్చారు. పిమ్మట, ఒక గురువారం నాడు మధ్యాహ్నం మూడు గంటలకు మ్యూజియం చేరుకున్నారు. అక్కడ క్యూరేటర్ ప్రసాద్, స్కాలర్ కృష్ణమూర్తి ఉన్నారు. పిచ్చాపాటి కొంత సేపు అయింది. ఎండలు ఇంకా ముదరలేదు.

రాత్రి పూట చల్లగా ఉంటున్నది.

“ఇవాళ నేనో అర్జంటు రిపోర్టు తయారు చేసి ఢిల్లీ పంపవలసి ఉంది. మిత్రులు కృష్ణమూర్తి మాట్లాడుతారు” అన్నాడు ప్రసాద్.

“ముందు కాఫీలు తాగి, సావకాశంగా మాట్లాడుకుందాం” అన్నారు కృష్ణమూర్తి, కాఫీలు తాగి వాళ్ళు కూర్చున్నారు.

“బుద్ధుడి గురించి మీకు బాగా తెలుసుననుకుంటాను!” అన్నారు కృష్ణమూర్తి.

“నాకు కొంత తెలుసు” అన్నాడు మోహన్.

“నాకు అంతంత మాత్రమే తెలుసు” అంది శశికళ. ఇంతలో సుబ్రహ్మణ్యేశ్వరరావు సైకిలు మీద వచ్చి వాళ్ళను కలిశాడు.

“నాకు బుద్ధుడి గురించి ఏమీ తెలియదు” అన్నాడతను కాఫీ పూర్తి చేసి.

“కాబట్టి వివరంగా చెస్తే బాగుంటుంది” అన్నారు కృష్ణమూర్తి.

అందరూ తలలూపారు.

“బుద్ధుడి గురించి చెప్పేముందు, ఆనాటి రాజ్యాల గురించి చెప్పవలసి ఉంటుంది. కొంచెం సావధానంగా వినండి.”

తరువాత కృష్ణమూర్తి చెప్పారు.

“క్రీస్తు పూర్వం ఆరవ శతాబ్ది ప్రారంభంలో గౌతమ బుద్ధుడికి పూర్వం, ఉత్తర భారతం ఏకఛత్రాదిపత్యంలో లేదు. ఉత్తర దేశంలో మూడు ముఖ్యమైన స్వతంత్ర రాజ్యులు ఉండేవి. అవి మగధ, కోసల, వత్సదేశాలు. కురు, పాంచాల, శూరవేన, కాశీ మిథిల, అంగ, కళింగ, గంధార, కాంభోజ రాజ్యాలు చిన్న వాటిలో ముఖ్యమైనవి. హైహయుల రాజ్యం, నీతిహోత్రుల రాజ్యం అనేవి కూడా ఉండేనట. కాని ఇవి ఎక్కడినో తెలియదు. బహుశా అవి అవంతి, ఛేది రాజ్యాలు కావచ్చు.

బౌద్దుల గ్రంథమైన అంగుత్తరనికాయంలో పదహారు మహారాజ్యాల గురించి ప్రస్తావించారు. అవి అంగ, మగధ, కాశీ, కోసల, వృజి (వజ్జి), మల్ల, ఛేది వత్స (వంశ), కురు, పాంచాల, మత్స్య, పూరసేన, అవ్వక లేక అవ్మక, అవంతి, గంధార, కాంభోజ దేశాలు. వీటిని షోడశ మహాజనపదాలు అంటారు. ఛుల్ల నిద్దేశంలో కళింగ దేశం కూడా వీటిలో చేర్చబడింది. గంధార దేశాన్ని యవన దేశమని దీనిలో పేర్కొన్నారు. మహావస్తువులో మొదటి పదహారు దేశాలనే పేర్కొన్నారు. కాని, గంధార దేశాన్ని శివి అని, కాంభోజ దేశాన్ని శార్ణమని అందులో ఉల్లేఖించడం జరిగింది.

రేణు మహారాజా యొక్క బ్రాహ్మణ మంత్రి పేరు మహా గోవిందుడు. అతడు తన సామ్రాజ్యాన్ని ఏడు వేరు వేరు దేశాలుగా విభజించాడు. కళింగదేశం మొదటిది, దీని రాజధాని దంతపురం, అస్పక దేశం రెండవది, దీని రాజధాని పోతన, అవంతి దేశం మూడవది, మహిష్మతి దీని రాజధాని, సౌవీర దేశం నాలుగవది. దీని రాజధానిర రోరోకం, విదేహ అయిదవది. మిథిల దీని రాజధాని, అంగదేశం ఆరవది, దీని రాజధాని చంప, కాశీ రాజ్యం ఏడువది. దీని రాజదాని వారణాసి.

ఈ దేశాల గురించి తెలుసుకోవడం చాల ముఖ్యం. వీటిని స్వతంత్రమైన రాజ వంశాలు, సామ్రాజ్య పాలనకు భిన్నమయిన గణతంత్ర ప్రభుత్వాన్ని నడుపుతుండేవి. పురాణాలలో ఈ విషయం చెప్పలేదు. గౌతమ బుద్ధుడి కాలంలో ఇటువంటి గణ తంత్ర పాలన కల రాజవంశాలు ఉండేవి. కపిల వస్తువుకు చెందిన శాక్యులు. పాప కుశీనగర దేశాలకు చెందిన మల్లులు, వైశాలికి చెందిన లిచ్ఛవులు, మిథిలకు చెందిన వైదేహులు, రామ గ్రామానికి చెందిన కోలియులు, అల్లకప్పకు చెందిన బులులు, కేనే పుత్తకు చెందిన కాలాములు, పిప్ప పిప్పలి వనానికి చెందిన మౌర్యులు, సుంసుమార వైలం రాజధానికుల భర్గులు ఇటువంటి గణ తంత్ర పాలన జరిపిన వంశాలు.

పాణిని తన అష్టాధ్యాయిలో ఈ రెండు తరగతులకు చెందిన దేశాల గురించి వ్రాశాడు. గణ తంత్ర దేశానికి సంఘము లేక గణమని, రాజులు పాలించే దేశాలను జనపదాలని అతడు ఉదహరించాడు. క్షుద్రకులు, మాలవులు, అంబష్టులు, హస్తినాయనులు, ప్రకణ్వులు, మదుమంతులు, అప్రీతులు, వసాతులు, భర్గులు, శిబులు, అశ్వాయనులు, మశకావతి రాజధానిగా గల అవ్వయనులు అటువంటి గణాలని పాణిని చెప్పాడు. అలెగ్జాండరు భారతదేశం మీద దండయాత్ర జరిపినపుడు ఈ గణ తంత్ర దేశాలన్నీ అతనిని ప్రతిఘటించాయి. జనపదాలు లేక రాజ్యాల గురించి పాణిని చెప్తూ, గంధార, అవంతి, కోసల, ఊశీనర, విదేహ, అంగ, వంగ దేశాలను ప్రాచ్య జనపదాలని అన్నాడు.

బుద్ధుడికి పూర్వం పెద్ద రాష్ట్రాలు, చిన్న రాష్ట్రాలు చాల ఉండేవి. వాటిలో చాలవరకు గణతంత్ర పాలనలో ఉండేవి.

అంగదేశం నేటి భాగల్‌పూరు, మాంఘీర్ జిల్లాలున్న దేశం. దీని రాజధాని చంప. దీనినే మాలిని అని కూడా అంటారు. ఇది గంగానది కుడిగట్టున ఉంది. గంగ చంపానదుల సంగమానికి సమీపంలో మిథిలకు అరవై యోజనాల దూరంలో ఇది ఉంది. గంగానది దీనికి ఉత్తర సీమ. చంప వర్ధమాన నగరం. భారతదేశంలో ప్రాముఖ్యత వహించిన ఆరు మహా నగరాలలో ఇదొకటని దీఘ నికాయంలో ఉంది. ఇది గొప్ప వ్యాపార స్థలం. ఇక్కడ నుండి వర్తకులు దూరాన్న ఉన్న సువర్ణ భూమికి నావలలో ప్రయాణం చేసేవారు. అంగరాజ్యంలో భద్దీయము, అస్స పురం అన్నవి మరో రెండు పట్టణాలు.

కాశీ రాజ్యం ధనవంతమైన వర్థమాన దేశం. దీని రాజధాని వారణాసి. వరుణ, అసి అన్ననదులు ఈ నగరానికి ఉత్తరాన, దక్షిణాన పారుతున్నవి. అందుచేతనే దీనికి వారణాసి అన్న పేరు వచ్చింది. కాశీ కోసల దేశాల మధ్య చాల కాలం వైరం సాగింది.

కోసల దేశం నేటి ఔధ్‌గా తీసుకోవచ్చు. సదా నీరనది (గండక్ నది) తూర్పున ఉంది. పాంచాల దేశం పశ్చిమాన ఉంది. సర్పికానది లేక స్యండికానది (సాయి) దక్షిణాన ఉంది. నేపాల్ దేశపు పర్వతాలు ఉత్తరాన ఉన్నవి. కోసలదేశాన్ని సరయూనది రెండుగా విభజిస్తున్నది. ఉత్తర కోసలకు శ్రావస్తి రాజధాని. దక్షిణ కోసలకు కుశావతి ముఖ్యపట్టణం. కాశీ రాజ్యాన్ని జయించి కోసల చాల శక్తివంతమైన దేశంగా రూపొందింది. కపిల వస్తువుకు చెందిన శాక్యుల మీద, కేసపుత్తదేశంలోని కాలాముల మీద ఈ రాజ్యం ఆధిపత్యం వహించింది. కోసల రాజు ప్రసేనజిత్తు బుద్దుడి సమకాలికుడు. ఇతడు చాల ముఖ్యమైన పాలకుడు. మగధ రాజైన అజాత శత్రువుతో ఇతడు దీర్ఘకాలం వైరం సాగించాడు.

ప్రసేనజిత్తు బౌద్ధాన్ని స్వీకరించకపోయినా, బుద్ధుడిని మాత్రం అధికంగా ప్రశంసించాడు. బుద్ధుడికి ప్రసేనజిత్తుకి మద్య చాల సార్లు సంభాషణలు జరిగినట్లు బౌద్ధ గ్రంథాలలో ఉంది. బుద్ధ భగవానుడు జన్మించిన శాక్యవంశాన్ని కూడా ఈ రాజు చాల మెచ్చుకున్నాడు. శాక్యముఖ్యుడొకడుంటే, అతని కూతురిని తనకు భార్యగా ఇమ్మని ప్రసేనజిత్తు కోరాడు. శాక్యులు తమ వంశగౌరవమంటే గర్వపడతారు. ప్రసేనజిత్తుతో సంబంధం చేయడానికి వాళ్ళు ఇష్టపడలేదు. కాని, పక్కనే ఉన్న మహా శౌర్యవంతుడైన ప్రభువు కోరికను వాలు నిరాకరించలేకపోయారు. వాళ్ళొక వంచనకు పాలపడ్డారు. శారక్య ముఖ్యుడికి బానిస పిల్ల వలన ఒక కూతురు జన్మించింది. ఆమె శాక్య వంశంలో న్యాయ సమ్మతంగా జన్మించిన కూతురని వాళ్ళు ప్రకటించి, ఆమెను ప్రసేనజిత్తుకిచ్చి పెళ్ళి జరిపించారు. ఆ దంపతులకు విదుదాభుడనే కొడుకు పుట్టాడు. ఒకసారి తన తల్లి పుట్టినింటికి, అంటే తాతగారింటికి అతడు వెళ్ళినప్పుడు తన తల్లి వంశం గురించి ఆ రాజకుమారుడికి తెలిసింది. ఈ సంగతి చాల పెద్ద కల్లోలాన్ని లేవదీసింది. ప్రసేనజిత్తు తన భార్యను, కుమారుడిని విడిచి పెట్టాడు. బుద్ధ భగవానుడు ఈ విషయంలో ప్రసేనజిత్తుతో మాట్లాడాడు. రాణి ఎటువంటి వంశంలో పుట్టినా, ఆమెకు జన్మించిన కుమారుడు మాత్రం తన తండ్రి కులానికే చెందుతాడని బుద్ధుడు చెప్పాడు. బుద్దుడు చెప్పిన హితువును రాజు గౌరవించాడు. అతడు రాణిని, రాజకుమారుడిని తిరిగి స్వీకరించాడు.

ఈ సంఘటన తరువాత ప్రసేనజిత్తు కుటుంబంలో ఇబ్బందులు మొదలయాయి. ప్రసేనజిత్తు శాక్యదేశం పోయి బుద్ధుడితో సంభాషించాడు. బహుశా, ఇదే వారిద్దరి మధ్య జరిగిన ఆఖరి సంభాషణ. బౌద్ధ సంఘంలో లభించే ప్రశాంతమైన వాతావరణాన్ని ఆ రాజు ప్రశంసించాడు. తన కుటుంబంలోను, ప్రభుత్వంలోను తలెత్తిన అభిప్రాయభేదాలను, వివాదాలను అతడు గర్హించాడు. ప్రసేనజిత్తు బుద్ధుడితో మాట్లాడుతూ ఉండగా, రాజ్యాన్ని చూడమని అప్పజెప్పిన మంత్రి, రాజులేని అవకాశాన్ని చూనుకొని, రాజపుత్రుడైన విదుదాభుడిని రాజుగా ప్రకటించాడు. ప్రసేనజిత్తు తన ప్రజల చేతనే పరిత్యజింపబడి, అజాతశత్రువు సహాయం కోసం రాజగృహానికి బయలుదేరాడు. ప్రయాణంలో అతడు బాగా అలసి పోయాడు, కుంగిపోయాడు, నగర ద్వారం దగ్గర పడి, చనిపోయాడు. బౌద్ధ గ్రంథాలు ప్రసేనజిత్తును అత్యధికంగా ప్రశంసించాయి. అట్టి మహా వ్యక్తి యొక్క జీవితం, ఆ విధంగా దిక్కుమాలిన చావుతో ముగిసింది. బౌద్ధమతం పట్ట అతనికి కల అభిమానం, అతనిని ప్రజల నుండి దూరం చేసి, ఇటువంటి దుఃఖాంతానికి దారి తీసింది. ప్రసేనజిత్తు బ్రాహ్మణులను బాగా పోషించేవాడని, వారికి రాజుగారి స్థలాలలో చోటు నిచ్చి, దానిపై వారికి విస్తృతమైన అధికారం ప్రసాదించాడని, కొన్ని గ్రంథాలలో ఉంది.

ఆ కాలపు రాజులలో ప్రసేనజిత్తు ఒక్కడే వ్యక్తిత్వం గల ఏకైక పాలకుడు. బౌద్ధ గ్రంథాలలో ఈ విషయం వివరంగా చెప్పబడింది.

శ్రీమతి రైస్ డేవిస్ ప్రసేనజిత్తు గురించి ఇలా వ్రాశారు.

“ప్రపంచంలో చాల దేశాలలో ఉన్న పద్ధతే ఇది. ప్రసేనజిత్తు, కుటుంబంపట్ల బాద్యత గల యజమాని. అతడు తన కామవ్యాపారాలను ఉత్తమగుణాలతోను, గృహస్తు యొక్క విధులతోను మేళవించి ఆనందించాడు. ఇతడు బోజన ప్రియుడు. కాని, చక్కని శరీరాన్ని పోషించడం కోసమే, ఆహారం సేవించేవాడు. అతడు మర్యాదను పాటించాడు, నిజాయితీని పాలించాడు, న్యాయం సంబంధమైన విషయాలలో వంచన తరువాత లభించే నష్టపరిహారం పట్ల అత్యధికమైన ఆశ కనబరిచాడు. చేయి జారిపోయిన ఆస్తి కోసం ఆర్భాటం చేసేవాడు. చేజిక్కిన శత్రువు పట్ల చాల ఉదారంగా ప్రవర్తించాడు. యజ్ఞ యాగాదులలో జరిగే పశుపధ పట్ల, నేరస్తులను శిక్షించడం లోను, నిర్దయతో వ్యవహరించాడు. ఉదరబాధ వలన కలిగే దుఃస్వప్నాల మీద అతనికి చాలా నమ్మకం ఉండేది. కలల దుష్పలితాలు ఎటువంటి హాని చేస్తాయోనని భయపడేవాడు. అన్ని మతాల వారితో సత్సంబంధాలను ఏర్పరచుకొని, తన రాజకీయ విజ్ఞతను ప్రదర్శించాడు. ఆ మతాలు యదార్థమైనవా లేక బూటకాలా అని కూడా అతడు ఆలోచించలేదు.

ప్రసేనజిత్తు తరువాత విదుదాభుదు సింహాసనం అధిష్టించాడు. ఇతడు శాక్యదేశంపై దండెత్తి, శాక్య రాజ వంశాన్ని నిర్దాక్షిణ్యంగా నరికి పారేశాడు. పురుషులను కాని, స్త్రీలను కాని, పిల్లలను కాని అతడు విడిచిపెట్టలేదు.  చాలమంది తప్పించుకొని పారిపోయారు. కాని, ప్రఖ్యాతిగల, స్వయం ప్రతిపత్తి గల ఈ గణతంత్ర పాలననూ, ప్రపంచంలోని మహా వ్యక్తులలో ఒకడైన గౌతమబుద్ధుడు జన్మించిన వంశాన్నీ, అతడు నాశనం చేశాడు. అతని కోపానికి కారణం లేకపోలేదు. శాక్యులు తన తల్లి పట్ల జరిపిన వంచనను అతడు సహించలేకపోయాడు. రాజకీయ కారణాలు కాని, మరేవో కాని ఈ శత్రుత్వానికి మూలమంటారు. అటుపిమ్మట విదుదాభుడి గురించి కాని, అతని కోసల రాజ్యం గురించి కాని ఏమీ తెలియకుండా పోయింది.

వృజిదేశం ఇది ఎనిమిది లేక తొమ్మిది రాజవంశాల కూటమి. విదేహులు, లిచ్ఛవులు, జ్ఞాత్రికులు, వృజీయులు వీటిలో బలమైన రాజకుంటుంబాలు. వృజ దేశానికి వైశాలి రాజధాని. వృజీ దేశం నేటి ఉత్తర బీహారు రాష్ట్రంలో బసార్, ముజఫర్‌పూరు జిల్లాలు గల ప్రదేశం. వృజి

గ్రామం వైశాలికి దగ్గరలో ఉంది. వైశాలి లిచ్ఛవులకు రాజధాని. రాజవంశాల కూటమికి ముఖ్య నివాసము. మొదట ఈ దేశం రాజుల పాలనలో ఉండేది. రామాయణంలో విశాల ఉత్తమపురి అని ఉంది. వైశాలి ధనధాన్యాలతో తులతూగుతూ ఉండేది. ప్రజలతో కిక్కిరిసి ఉండేది. ఈ నగరం చుట్టూ మూడు ప్రహరీ గోడలుండేవి. ఒక గోడకు మరోక గోడకు మధ్యను ఒక గవ్యూతం దూరం ఉండేది. ఆ గోడలకు ద్వారాలు కోట బురుజులు ఉండేవి.

విదేహ నేటి తిరహత్ జిల్లా. అది ఒకప్పుడు బలహీనమైన రాజ్యంగా ఉండేది. మిథిల దాని రాజధాని. ఈ రాజ్యానికి తూర్పున కౌశికీనది, దక్షిణాన్న గంగానది, పశ్చిమాన్న సదా నీరనది, ఉత్తరాన్న హిమాలయాలు ఉన్నాయి. నేపాలు సరిహద్దులలో ఉన్న ‘జనకపుర’ అన్న చిన్న పట్టణం ఆనాటి మిథిల అని అంటారు. వైశాలిలో రెండు చిన్న బస్తీలు కుండ గ్రామ, కొల్లాగ అన్నవి ఉండేవి. జ్ఞాతికలు ఈ గ్రామాలకు చెందినవారు. పాణిని వజ్జీయులు గురించి ప్రస్తావించాడు. ఉక్కాశీల ఈ వజ్జీయుల పట్టణం. కౌటిల్యుని అర్థశాస్త్రంలో వజ్జియులు, లిచ్ఛవులు వేరు వేరు రాజవంశాల వారని వ్రాసి ఉంది. మిగిలిన రాజవంశాల గురించి మనకు తెలియదు.

లిచ్ఛవులు క్షత్రియులు. వీరు గౌతమ బుద్ధుడి కాలంలోను, మహావీరుని కాలంలోను రాజ్యపాలకులయారు. గౌతమ బుద్ధుడు లిచ్ఛవుల ఐకమత్యానికి, వారి బలానికి, ఉత్తమ వంశసంజాతులైన వారి ఉదార స్వభావానికి, గణతంత్ర సూత్రాలపై వారు చేసే న్యాయమైన పరిపాలనకు మురిసి వారిని మెచ్చుగా కొనియాడాడు. కోసల దేశ రాజైన ప్రసేనజిత్తుతో లిచ్ఛవుల కుటుంబాలు, తొమ్మిది మల్లుల కుటుంబాలు, కాశీ, కోసల దేశాలకు చెందిన పద్దెనిమిది గణపాలకులు ఒక కూటమిగా ఏర్పడినట్లు వ్రాసి ఉంది. కాని, మగధ మాత్రం వైశాలికి ప్రబలమైన శత్రువుగా నిలిచింది. ఐతిహ్యమొకటి ఈ విధంగా ప్రచారంలో ఉంది. బింబిసారుడు పాలిస్తున్న దినాలలో వైశాలీ పాలకులు మగధ మీదికి సైన్యాన్ని పంపించారు. నిరయావలి సూత్రం (గ్రంథం) ప్రకారం బింబిసారుడు లిచ్ఛపుల రాజ పుత్రిక ఛెల్లానాను పెండ్లాడాడు. ఈమె వైశాలి రాజైన చేతకుని కుమార్తె. చేతకుని సోదరి మహావీరుని తల్లి. ఈ విధమైన సంబంధ బాంధవ్యాలు, బింబిసారుడికి లిచ్ఛవులకు మధ్యను నెలకొనడంతో, యుద్ధానంతరం శాంతి లభించింది. ఈ సంబంధ బాంధవ్యాలు, శాంతి లిచ్ఛవుల నాశనానికి దారి తీశాయి.

మల్ల దేశం – బౌద్ధ గ్రంథాలలోను, జైన గ్రంథాలలోను తరచు మల్లుల ప్రసక్తి వస్తుంది. తూర్పు భారతంలో మల్లులు చాల శక్తివంతంగా ఉండేవారు. మల్ల దేశంలో తొమ్మిది రాష్ట్రాలుండేవి. మల్లులు వ్రాత్య క్షత్రియులని మనుపు పేర్కొన్నాడు. మల్లులు మొదట సామ్రాజ్య పాలకులే. ఇక్ష్వాకువు మల్లుల వంశంలోని రాజు, మల్లులు ఒక గణతంత్ర కూటమికి చెందిన వరాఉ. కూటమి సబ్యులను రాజులని పిలిచేవారు. ఆత్మ రక్షణ కోసం మల్లులు లిచ్ఛవులతో సఖ్యం చేసుకున్నారు. బుద్ధుడు చనిపోయిన కొద్ది కాలంలోనే మల్లుల స్వాతంత్ర్యం అంతరించింది. వారి దేశం మగధకు చేర్చబడింది.

ఛేదిదేశస్తులు భారతదేశానికి చెందిన చాల పురాతన జాతుల వారు. వీరు కళింగ దేశంలో తమ రాజ వంశశాఖను నెలకొల్పారు.

వత్సదేశం ప్రశస్తమైన నూలు బట్టలకు ప్రసిద్ధి చెందింది. దీని రాజధాని కౌశాంబి యమునానదికి కుడి గట్టున ఉన్న ‘కోసం’ అన్న గ్రామమే ఆనాటి కౌశాంబి. వత్సరాజైన ఉదయనుడు బుద్ధుడి సమకాలికుడు. ఇతడు చాల శక్తి కల రాజు. అవంతి ప్రభువు ప్రద్యోతుడికి, ఇతనికి వైరం ఉండేది. ఉదయనుడికి ఏనుగులను పట్టుకోడం చాల ఇష్టం. ఈ సంగతి ప్రద్యోతుడికి తెలుసు. అతడు ఒక కర్ర ఏనుగును చేయించాడు. దానిని రెండు రాజ్యాల నరిహద్దులో ఉన్న ఒక అడవిలో ఉంచాడు. ఉదయనుడు ఈ కపటోపాయానికి చిక్కిపోయి, పట్టుబడ్డాడు. ఏనుగులను మచ్చిక చేసుకునే రహస్యం ఉదయనుడికి తెలుసు. తనకా రహస్యం చేస్తే ఉదయనుడికి స్వేచ్ఛ దొరుకుతుందని ప్రద్యోతుడన్నాడు. ఉదయనుడు ఒక షరతు విధించాడు. ఈ రహస్యం ఏ శిష్యునికి చెప్తాడో అతడు తనను గౌరవించాలని ఉదయనుడు కోరాడు. పైవాళ్ళకు ఈ రహస్యం తెలియడం ఇష్టంలేక ప్రద్యోతుడు తన కూతురు వాసవదత్తను తన స్థానంలో ఈ పనికి నియోగించాడు. తెర వెనుక ఒక గూని మనిషి ఉంటుందని, ఆమె ఉదయనుడికి నమస్కారం చేసి రహస్యం తెలుసుకుంటుందని ప్రద్యోతుడు చెప్పాడు. కాని, కొద్ది కాలంలోనే, అనుకొని పని జరిగింది. ఉయదనుడు రాజపుత్రికను లేవనెత్తుకొని పారిపోయాడు. ఆమెను తన రాణిగా చేసుకున్నాడు. ఉదయనుడికి చాలామంది ఇతర రాణులున్నారు. అందులో ఒకామె కురుబ్రాహ్మణుని కూతురు. ఇది ప్రతిలోమ వివాహం. మగధ రాజైన దర్శకుడి సోదరి మరొక రాణి. ఇతడు భాసుడి స్వప్నవాసవదత్త, హర్షుడి ప్రియ దర్శిక, రత్నావళి నాటకాలకు నాయకుడు. కాళిదాసుని మేఘ సందేశ కావ్యం ప్రకారం, ఆ కవి కాలంలో కూడా అవంతిలో ఉదయనుడి గురించి చాల కథలు ప్రచారంలో ఉండేవి. ఇతని దిగ్విజయం గురించి కథాసరిత్సాగరంలో ఉంది. ప్రియదర్శిక నాటకంలో ఇతడు కళింగను జయించినట్లు ఉంది. ఇతడు అంగరాజ్యాన్ని జయించి, దానికి తన మామగారైన దధివర్మను రాజుగా చేశాడు.

ఉదయనుడు, మొదట, బౌద్ధం పట్ల అనుకూలుడుగా లేడు. పిండోలకుడనే ప్రఖ్యాతి చెందిన బౌద్ధభిక్షువును ఈ రాజు చిత్రహింసలు పెట్టాడు. ఎర్ర చీమలు పుట్టలు పెట్టిన గూడుకి అతనిని వేసి కట్టించాడు. కాని, తరువాత కాలంలో, ఈ పిండోలకుడే ఉదయనుని బుద్ధుడి అనుయాయిగా మార్చాడు.

బుద్దుడి నిర్యాణం తరువాత కొంతకాలం ఉదయనుడు జీవించే ఉన్నాడు. అతని తరువాత అతని కొడుకు బోధి, రాజ్యానికి వచ్చాడు. అతని తరువాత రాజ్యం ఏమయిందో మరి తెలియదు.

కురుదేశానికి ఇంద్రప్రస్థం రాజధాని. అది నేటి ఢిల్లీకి సమీపంలో ఉంది. ఈ నగరం సప్తక్రోశాల దూరం వ్యాపించి ఉండేది. బుద్ధుడి కాలంలో కౌరవ్యుడనే రాజు కురుదేశాన్ని పాలించాడు. రాజకీయంగా అతనికి ప్రాముఖ్యత చాల తక్కువ. కురు రాజులు చాల నిశితమైన జ్ఞానం కలవారు. మంచి ఆరోగ్యం కలవారు. వీరు యాదవులతో, భోజులతో, పాంచాలులతో వివాహ సంబంధాలు చేసుకున్నారు. క్రమంగా ఈ రాజ్యం గణతంత్ర పాలనకు మారింది. కురురాజులు వత్స దేశంలో రాజులుగా పలించారు.

పాంచాల దేశం, ఢిల్లీకి ఉత్తరాన్న, తూర్పున ఉన్న దేశం. హిమాలయ పర్వతాల వరకు, చంబల్ నది వరకు ఈ దేశం వ్యాపించి ఉండేది. గంగానది ఈ దేశాన్ని ఉత్తర పాంచాలంగాను, దక్షిణ పాంచాలంగాను విభజించింది. ఉత్తర పాంచాలానికి అహిచ్ఛత్రం రాజధాని. ఇది నేటి బెరెయిలీ జిల్లాలోని రాంనగర్. దక్షిణ పాంచాలానికి కాంపిల్యం రాజధాని. ఇది నేటి ఫరుఖాబాద్ జిల్లాలోని కంపిల్. ప్రఖ్యాతి చెందిన కన్యాకుబ్బ నగరం నేటి కనౌజ్. రాజుల పాలనలోనే ఉన్నా, క్రీస్తు పూర్వం ఆరు అయిదు శతాబ్దాలలో గణతంత్ర పాలనకు మారి సంఘంగా ఏర్పడింది.

మత్స్యదేశం నేటి జయపూర్ ఉన్న ప్రదేశం. నేటి ఆల్వార్, భరతపూర్లో కొంతభాగం దీనిలోనివే. విరాటనగరం, అంటే నేటి బైరాట్, దీని రాజధాని. బుద్ధుని కాలంలో మత్స్య దేశానికి ప్రాముఖ్యత లేదు. ఛేదిదేశరాజు, సహజుడు, దీనిని కూడా పాలించేవాడు.

సూర సేన దేశానికి మధురా నగరం రాజధాని. ఇది యమునానది గట్టున ఉంది. సూరసేనరాజైన అవంతీ పుత్రుడు బుద్ధుడికి ముఖ్యశిష్యుడయాడు. మదురా ప్రాంతాలలో బౌద్ధం వ్యాప్తి చేశాడు. అవంతికి సూరసేనులకు మధ్య వివాహ సంబంధాలుండేవి. పాణిని తన అష్టాధ్యాయిలో అంధకులు, వృష్ణులు మధురకు చెందిన వారని వ్రాశాడు. కౌటిల్యుడి అర్ధ శాస్త్రంలో వృష్ణులు గణతంత్ర పాలనకు చెందిన సంఘం వారని వ్రాసి ఉంది. వృత్తులు, అంధకులు, మరికొన్ని మిత్ర జాతులు కలిసి సంఘంగా ఏర్పడ్డాయని, వాసుదేవుడు సంఘముఖ్యుడని అందులో ఉంది. శూరసేన రాజ్యం మగధ రాజ్యంలో భాగమయింది.

అశ్మక దేశం లేక అస్సక దేశం లేక అశ్వకదశం సింధు దేశపు దిగువ భాగంలోనిది. పాణిని వీరి గురించి వ్రాశాడు. ఇది స్వాత్ లోయ లోనిది. బౌద్ధ గ్రంథాలలో అస్సక దేశం దక్షిణభారతంలోనిదని, మూళక లేక అళక రాజ్యానికి అస్సక దేశానికి మధ్యను గోదావరీ నది ప్రవహించేదని ఉంది. మూళిక దేశ రాజధని ప్రతిష్ఠానపురమని, అస్పక దేశం ఈ నగరానికి దక్షిణాన్న ఉందని వ్రాసి ఉంది. అస్సక దేశం లేక మూళక రాజ్యం అంధకులు లేక ఆంధ్రులదని సూత్తనిపాత వ్యాఖ్యలో ఉంది. కౌటిల్యుని అర్థ శాస్త్రానికి వ్యాఖ్య రచించిన భట్టస్వామి, ఇది మహా రాష్ట్రంలోనిదన్నాడు. బౌద్ధులు గుర్తించిన ఈ అస్సక దేశం మహా రాష్ట్రంలో ఉన్నా, గోదావరి నది పక్కన ఉన్నా, మధ్య దేశానికి వెలుపలే ఉండేది.

అశ్మకులు, మూలకులు ఇక్ష్వాకువంశం వారు. బ్రహ్మదత్తుడనే అశ్మక రాజు అంగ కాశీ దేశాల రాజైన ధృతి రాష్ట్రుడికి సమకాలికుడు. మరోక అశ్మక రాజు అరుణుడ కళింగరాజును యుద్ధంలో ఓడించాడు. బుద్ధుడి కాలంలో అశ్మక రాజ్యాన్ని పాలించిన రాజపుత్రుడి పేరు సుజాతుడు.

అవంతి పశ్చిమభారతంలో ముఖ్యమైన రాజ్యం. బౌద్ధం ఉద్భవించిన దినాలలో నాలుగు మహారాజ్యాలుండేవి. అవంతి అందులో ఒకటి. కోసల, వత్స, మగధ రాజ్యాలు మిగిలినవి. వేత్ర వతీనది అవంతిని దక్షిణ, ఉత్తర భాగాలుగా విభజించింది. వెస్సాభుడు దీని పాలకుడు. మహిష్మతి దీని రాజధాని. బుద్ధుడి కాలంలో అవంతి చండ ప్రద్యోతుడి పాలనలోనిదని

బౌద్ధ గ్రంథాలు చెప్తాయి. అతని రాజధాని ఉజ్జయిని. అవంతి రెండుగా విభజింపబడిందని, ఒక భాగం దక్షిణా పథంలో ఉండేదని, దాని రాజధాని మహిష్మతి అని, ఉత్తర భాగానికి ఉజ్జయిని రాజధాని అని డాక్టర్ భండార్కర్ అభిప్రాయపడుతున్నారు. మాల్వా, నిమార్, ఆ పక్కనే ఉన్న మధ్య ప్రదేశ్ లోని కొంత భాగం అవంతి రాజ్యం. ఉజ్జయిని, మహిష్మతీ నగరాలు, రాజగృహానికి ప్రతిష్ఠానపురానికి మధ్యనున్న దక్షిణ మహామార్గం పక్కను ఉన్నాయి. విదిశ ఉజ్జయినికి పోయే దారిలో ఉంది. కుర రఘర, సుదర్శన పురాలు అవంతి రాజ్యంలోనివని బౌద్ధ జైన గ్రంథాలలో ఉంది. అవంతి రాజధానియైన ఉజ్జయినిని అచ్చుతగామి నిర్మించాడు. బౌద్ధమత కేంద్రంగా అవంతి చాల ఖ్యాతి గాంచింది. ప్రముఖులైన థేరవాదులు, థేరవాదినులు అవంతిలోనే జన్మించారు, లేక అక్కడే నివసించారు.

ప్రద్యోతుడు చాల బలమైన రాజు. అతని తండ్రి పుణికుడు. అతడు తన ప్రభువును చంపి అతని స్థానంలో తన కొడుకును సింహాసన మెక్కించాడు. ఇతడు పొరుగు వత్స, మగధ, కోసల దేశాలతో వైరం పెట్టుకున్నాడు. బుద్ధుడి సమకాలికుడితడు. ఇతడు క్రూరుడని బౌద్ధ గ్రంథాలలో ఉంది. అతని క్రూరత్వం ‘చండ’ ‘మహా సేన’ అన్న అతని బిరుదులలో కనిపిస్తున్నది. ఇతడు దండయాత్ర చేస్తాడేమోనని అజాత శత్రువు తన రాజధాని రాజగృహాన్ని కట్టుదిట్టం చేశాడు. ఇతడు ఇరవై మూడు సంవత్సరాలు రాజ్యం చేశాడు. మరి ముగ్గురు రాజుల తరువాత అవంతి మగధ దేశంలో చేరిపోయింది.

గంధారదేశం లేక గంధర్వ విషయం నేటి షెషావర్, రావల్పిండి జిల్లాలు ఉన్న దేశం. పురుషపరమే నేటి షెషావర్. దీని రాజధాని తక్షశిల లేక తక్కసిల, నేటి టాక్సిలా. తక్షశిల వాణిజ్య కేంద్రమే కాక ప్రాచీన విద్య కేంద్రం కూడా. కాశ్మీర దేశం కూడా గంధార దేశంలోని భాగమంటారు. తక్షశిల వారణాసికి రెండువేల క్రోసుల దూరంలో ఉంది.

మగధరాజైన బింబిసారుడికి గంధారరాజు పుక్కుసాతి, అంటే పుష్కర సారినుడు సమకాలికుడు, మగధ సామ్రాట్టుకు ఇతడు తన రాజ ప్రతినిధుల ద్వారా లేఖను పంపించి, అతని స్నేహాన్ని కోరాడు. అవంతి రాజు ప్రద్యోతుడిమీద దండెత్తి అతనిని యుద్ధంలో ఓడించాడు.

కాంభోజదేశం ఉత్తరాపథంలో చేర్చబడింది. గంధార దేశంలో కలిపి దీనిని చెప్తారు. రజారీ చుట్టు పట్ల దేశం, వాయువ్య దిశలో ఉన్న హజారా జిల్లా ఈ దేశంగా రూపొందాయి. ప్రాచీన కాలంలో ఈ దేశం రాజుల పాలనలో ఉన్నా, కౌటిల్యుడి కాలానికి ఇది రాజుల పాలన నుండి తొలగి, సంఘంగా పాలింపబడింది.

అంగుత్తరని కాయంలో చెప్పబడ్డ ఈ పదహారు రాష్ట్రాలు క్రీస్తు పూర్వం అయిదు వందల ఏభైలో స్వతంత్ర ప్రతిపత్తి గల గణతంత్రదేశాలుగా ఉండేవి. వీటిలో కపిల వస్తువు ముఖ్యమైనది. శాక్యుల పాలనలోని రాష్ట్రమిది.

గౌతమ బుద్ధుడు శాక్యుడుగా జన్మించడం వలన దీనికి ప్రాముఖ్యత వచ్చింది. రాజకీయంగా ఇదేం పెద్ద రాష్ట్రం కాదు. ఈ రాజ్యం కోసలదేశానికి లోనయింది. కోసల రాజు విదుదాభుడు దీనిని సమూలంగా నాశనం చేశాడు.

శాక్యుల సూర్యవంశానికి చెందినవారని, ఇక్ష్వాకుల సంతతివారని, కోసల దేశానికి చెందిన వాళ్ళని భాగించారు. శాక్యరాష్ట్రానికి ఉత్తరాన హిమాలయాలు, తూర్పున రోహిణీనది, పడమటను దక్షిణాన్న రాప్తీనది ఎల్లలు. కపిలవస్తు దీని రాజధాని. ఉత్తర ప్రదేశ్, బస్తి జిల్లాలో పిప్రహ్వాకి వాయువ్యంలో పది మైళ్ళ దూరంలో, నేపాలీ తిరాయిలో గల తిలేరాకోట్ శిథిలా ఆనాటి కపిలవస్తు నగరమని అంటారు. కొంతమంది పిప్రహ్వాయే కపిలవస్తు అంటారు. ఎందుచేతనంటే, బుద్ధుడి అస్తికలున్న కుండ ఒకటి ఇక్కడ బయటపడింది. శాక్యుల కుటుంబాలు ఎనభై వేల వరకు ఉండేవి. అంటే వారు అయిదు లక్షలమంది జనాభా.

రామా గ్రామానికి చెందిన కోలియులు శాక్యులకు పొరుగువారు. వీరు తూర్పు దిశనున్నవారు. వీరు రోహిణీ నది అవతలిగట్టున ఉండేవారు. వీరు ఉభయులు ఒకే నది నీటిని వ్యవసాయానికి ఉపయోగించేవారు. అందుచేత సహజంగానే వీరి మధ్య వివాదాలు లేచేవి. ఒక బౌద్ధ గ్రంథంలో ఇటువంటి దెబ్బలాట వివరించబడింది. శాక్యులు తమ అక్కచెల్లెళ్ళను వివాహమాడతారని కోలీయులు ఎగతాళి చేస్తూ ఆ ఆచారాన్ని నిందించేవారు. మరొక గ్రంథం ప్రకారం కోలియులు, శాక్యులు రక్తబంధువులని ఉంది. కోలియులుకు రాజధాని కాక చాల పట్టణాలుండేవి. వారందరికి వ్యాఘ్ఘపజాలని ఇంటి పేరుంది. కోలియులలో రక్షణ శాఖవారికి ప్రత్యేకమైన శిరోవేష్టనముండేది. వీరు డబ్బు గుంజడంలోను, హింసించడంలోను పేరు పొందిన వాళ్ళు,

లిచ్ఛవులకు శాక్యులకు చెందిన గణతంత్రపాలనా విధానం గురించి వివరాలు లభించాయి. ఈ రెండు రాష్ట్రాలలోను కేంద్ర జనసభ ఒకటి ఉండేది. సర్వాధికారాలతో ఈ సభ పాలన చేసేది. యువకులు, వృద్ధులు ఈ సభకు సభ్యులు. వాళ్ళు రాష్ట్రానికి సంబంధించిన విషయాలలో చర్చలు సాగించేవారు.

ఈ విధమైన స్వతంత్ర ప్రతిపత్తి గల ప్రజాపాలన వ్యాప్తిలోకి రావడానికి కారణమేమై ఉంటుంది? రాజు భగవదంశనుండి జన్మించాడని, అతనికి రాజ్యం చేసే హక్కు ఉన్నదన్న సంగతిని ప్రజలు అంగీకరించలేదు. రాజుల దుష్టపాలన, వారు ప్రజలకు పెట్టిన హింసలు, ఈ గణ తంత్ర పాలనకు కారణాలు. కొన్ని జాతులకే ఇటువంటి పాలన పరిమితమై ఉండేది. బౌద్ధమతం, జైన మతం ఇటువంటి స్వతంత్ర పాలన గల జాతులలోనే పెరిగాయి. ఈ జాతుల వారే ఆ మతాలకు ఆశ్రయమిచ్చి వాటిని పోషించినవారు. రాజకీయ స్వాతంత్ర్యం లేనిదే భావస్వాతంత్ర్యం రాణించదు.”

కృష్ణమూర్తి చెప్పడం ఆపివేశారు. అప్పటికే చాల చీకటయింది. అటెండెంటు హరికేన్ లాంతరు వెలిగించి పెట్టడం కూడా వాళ్ళు గమనించలేదు.

“ఇంతవరకు ఇది ఉపోద్ఘాతం. ఇంకా మరికొంత ఉంది. బుద్ధుడి గురించి తెలుసుకునే ముందు ఆ కాలం నాటి పరిస్థితుల గురించి తెలుసుకోవాలి. షోడశ జనపదాల గురించి తెలుసుకోవాలి. గణ తంత్ర పద్ధతిలో జరిగే ప్రజాపాలన గురించి తెలుసుకోవాలి. ఈ పద్ధతిని అనుసరించే బుద్ధుడు భిక్షుసంఘాలను నడిపించాడు. అందుకోసం మీకు కొంత బోర్ కొట్టినా, ముందు ముందు వీటి అవసరముంటుంది.”

ఎవరూ ఏమీ జవాబు చెప్పలేదు. చాల విషయాలు తెలుసుకోవలసి ఉన్నాయి.

అందుచేత తరచుగా మధ్యాహ్నవేళల్లో మ్యూజియంలో కలుసుకోడానికి వాళ్ళు నిశ్చయించారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here