[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 11వ భాగం. [/box]
20
[dropcap]ఇ[/dropcap]ది కృష్ణమూర్తి రెండో లెక్చరు. వింటున్న వాళ్ళ ఆసక్తిని బట్టి చెప్పే వాళ్ళ శ్రద్ధ కూడా ఉంటుంది. వింటున్న వాళ్ళు విద్యాధికులవడం చేత, చెప్పే వాళ్ళు ఒళ్ళు దగ్గర పెట్టుకొని, బాగా తయారయి వస్తున్నారు. విషయం ఎప్పుడూ ఉన్నదే. కాని, రక్తి కట్టేటట్లు చెప్పడంలోనే ఉంది. కాఫీలు మొదలైనవి గవర్నమెంటు స్కాలర్లు, క్యూరేటరు ఏర్పాటు చేస్తున్నారు. చలి తగ్గి వాతావరణం కూడా బాగుంది.
కృష్ణమూర్తి సరిగ్గా మూడు గంటలకు చెప్పడం మొదలు పెట్టారు.
“గౌతముడు వైశాఖ పూర్ణిమ నాడు జన్మించాడు. వైశాఖ పూర్ణిమనాడే అతనికి జ్ఞానోదయమయింది. వైశాఖ పూర్ణిమ నాడే బుద్ధుడు మహాపరినిర్వాణం చెందాడు. అందుచేత బౌద్ధులకు వైశాఖ పూర్ణిమ చాల పవిత్రమైనదినం. సింహళ దేశంలో లభించిన చరిత్రలో గౌతమబుద్ధుడు నిర్యాణం చెందిన సంవత్సరం, క్రీస్తు పూర్వం 544తో సరిపోతుంది. బుద్ధుడు చనిపోయిన 218 సంవత్సరాలకు అశోకుడికి పట్టాభిషేకం జరిగింది. ఇంతకంటే సరియైన సంవత్సరం చైనీయుల రికార్డుల నుండి లభించింది. చైనీయులు చుక్కలు పెట్టిన రికార్డు ఒకటి, కొన్ని వందల సంవత్సరాలలో వ్రాస్తూ వచ్చారు. బుద్ధుడు చనిపోయిన తరువాత, ఒక ఏడాది కాలం గడువగానే ఒక చుక్క ఆ రికార్డులో పెట్టారు. గడచిన ప్రతి సంవత్సరానికి ఒక చుక్క చొప్పున పెట్టుకుంటూ పోయారు. ఆ విధంగా క్రీస్తు శకం 489 నుండి కొట్టి వేస్తే, బుద్ధుడి నిర్యాణం క్రీస్తు పూర్వం 486వ సంవత్సరంలో చుక్కలన్నీ లెక్కబెడితే అవి 975 వరకూ వచ్చాయి. ఈ 975ని క్రీస్తు శకం 489వ సంవత్సరంలో జరిగినట్లు తేలింది. దీనిని చరిత్రకారులందరూ అంగీకరించారు. బుద్ధుడు ఎనభై సంవత్సరాలు జీవించాడు. కాబట్టి అతడు క్రీస్తు పూర్వం 566లో జన్మించాడు. ఇవి జ్ఞాపకం పెట్టుకోవలసిన సంవత్సరాలు. బింబిసారుడు కాశీ రాజు. ఇతడు 52 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతని కొడుకు అజాత శత్రువు. ఇతని ఎనిమిదవ రాజ్యపాలనా సంవత్సరంలో బుద్ధుడు నిర్యాణం పొందాడు.
మగధ సామ్రాజ్యం చాల శక్తివంతమయినది. ఆఖరి బారహద్రధరాజు రిపుంజయుడు మగధను పాలించాడు. అతని అనంతరం బింబిసారుడు మగధ సింహాసనం ఎక్కాడు. బౌద్ధుల మహావంశం ప్రకారం, బింబిసారుడు తన 15వ ఏట రాజ్యాభిషిక్తుడయాడు. అతని తండ్రి తన చేతులతో ఈ పని చేశాడు. ఇతనిని సేనియ బింబిసారుడని అంటారు. సేనియ అంటే సంస్కృతంలో శ్రేణికుడని అర్ధం. బింబిసారుడు ముందు సేనాపతి అని, మగధను జయించిన వజ్జయులకు చెందిన వాడని, తరువాత తనను తానే రాజుగా ప్రకటించుకున్నాడని కొందరంటారు. కాని, మహా వంశం ప్రకారం ఇది సరికాదు.
మహావంశంలో బింబిసారుడి తండ్రి పేరు లేదు. మరికొన్ని గ్రంథాలలో అతని పేరు భట్టియుడు లేక మహాపద్ముడు అని ఉంది. అశ్వఘోషుడి బుద్ధ చరిత్రం ప్రకారం బింబిసారుడు హర్యంక కులానికి చెందినవాడు.
మహావగ్గం ప్రకారం బింబిసారుడికి 500 భార్యలుండేవారు. కొన్ని వివాహ సంబంధాలవల్ల అతనికి రాజకీయంగా సహాయం లభించింది. కోసల రాజు ప్రేసనజిత్తు సోదరి ఇతని మొదటి భార్య. ఆమెకు కట్నంగా కాశీ రాజ్యంలో లక్ష బంగారు నాణాలు సంవత్సరాదాయం గల గ్రామాన్ని ఒకటి ప్రసేనజిత్తు ఇచ్చాడు. లిచ్ఛవి ముఖ్యుడైన చేతకుడి కూతురు ఛెల్లానా అతని రెండవ భార్య. అతని మూడవ భార్య వైదేహి – వాసవి. బింబిసారుని కొడుకు అజాత శత్రువు తన తండ్రిని చెరసాలలో పెట్టినప్పుడు ఈమె భర్తకు ఆహారం అందించి అతని సేవ చేసింది. మద్ర దేశపు రాజకుమారి ఖేమా, బింబిసారుని నాలుగవ భార్య.
బింబిసారుడికి చాలమంది కొడుకులుండేవారు. వాళ్ళు తల్లుల పుట్టినిండ్ల నుండి పరస్పర భిన్నమైన రాజకీయాలు తీసుకొని వచ్చి తండ్రిని బాధపెట్టేవారు. జైన గ్రంథాలలో కూణికుడు లేక అజాత శత్రువు, హల్లుడు, వేహల్లుడు అన్న వాళ్ళు ఛెల్లానాకు పుట్టిన వాళ్ళని ఉంది. లిచ్ఛవి నగర వధువు అంబపాలికి పుట్టిన వాడు అభయుడు. వీరు కాక మేఘకుమారుడు మొదలైన వారు బింబిసారుని పుత్రులని ఆ గ్రంథాలలో ఉంది. బౌద్ధ గ్రంథాలలో కోసల రాజకుమారికి జన్మించిన వాడు అజాత శత్రువుని, అంబపాలి పుత్రుడు విమల కొండన్న అని, వేహల్లుడు శీలవతుడు అతని పుత్రులేనని ఉంది. కొన్ని గ్రంథాలు అజాత శత్రువు వేదేహీ పుత్తుడని పేర్కొన్నాయి.
గిరివ్రజపురం అంటే రాజగృహం, బింబిసారుడి తొలి రాజధాని. ఈ నగరానికి రూపకల్పన చేసి, దానిని నిర్మించిన వాస్తుశాస్త్రజ్ఞుడు సాంకేతిక నిపుణుడు మహా గోవిందుడు. సాయంకాలం కాగానే నగర ద్వారాలు మూసి వేసేవారు. అటు పిమ్మట రాజుగారికి కూడా లోనికి ప్రవేశం లేదు.
అంగరాజు బ్రహ్మదత్తుడు, బింబిసారుని తండ్రిని యుద్ధంలో ఓడించాడు. ఈ పరాజయానికి బదులు తీర్చుకోడానికి బింబిసారుడు అంగదేశం మీద దండెత్తి దానిని జయించాడు. అంగరాజ్యాన్ని మగధలో కలుపుకున్నాడు. అంగదేశవు రాజధాని చంపానగరం. బౌద్ధగ్రంథాలలో ప్రస్తావించిన ఆరు ముఖ్యమహా నగరాలలో ఇదొకటి. బింబిసారుడు అంగరాజ్యాన్ని జయించి తన కొడుకు కూణికుడిని అంటే అజాత శత్రువుని రాజ్య పాలకుడిగా నియమించాడు. అంగరాజ్యన్ని యుద్ధంలో జయించి, కాశీ రాజ్యాన్ని శాంతియుతంగా లోబరుచుకుని బింబిసారుడు మగధ రాజ్యాన్ని విస్తరించాడు. ఈ విస్తరణ క్రమంగా భారతదేశాన్ని పూర్తిగా మగధ రాజ్యం కిందికి తీసుకువచ్చింది. బింబిసారుడు దూరదేశాలతో కూడా స్నేహసంబంధాలు ఏర్పరచుకున్నాడు. అవంతీ పాలకుడైన ప్రద్యోతుడితో అతనికి సత్సంబంధ ఉండేది. ఒకసారి ప్రద్యోతుడికి అనారోగ్యం చేస్తే, ప్రఖ్యాతుడైన తన వైద్యుడు జీవకుడిని అతని దగ్గరికి బింబిసారుడు పంపించాడు.
బింబిసారుడి రాజ్యం 300 క్రోసులు విశాలంగా ఉండేది. దీనిని మరో 200 క్రోసుల వైశాల్యం గల రాజ్యాన్ని, అజాత శత్రువు యుద్ధాలు జయించి కలిపాడు. ఈ పెద్ద రాజ్యంలో 80,000 సంపన్నమైన గ్రామాలు ఉండేవి. వీటిలో సేనాని గ్రామంలో యుద్ధానికి కావలసిన సైనికులను ఎంపిక చేసేవారు. ప్రఖ్యాతి చెందని బ్రాహ్మణ భరద్వాజుని గృహం ఏకనాలా గ్రామంలో ఉండేది. ఈ భరద్వాజుడినే బుద్ధుడు తన మతంలోకి మార్చాడు. ఖానుమత మరొక బ్రాహ్మణ గ్రామం. సారిపుత్తుడు తన మొదటి ధర్మోపదేశాన్ని నాలక గ్రామంలో ఇచ్చాడు. బింబిసారుడి రాజ్యంలో స్వయం ప్రతిపత్తగల గణతంత్ర రాష్ట్రాలు ఉండేవి. ఇవి పాక్షికంగా స్వతంత్రంగా ఉండేవి. వీటి ముఖ్య పాలకుడిని రాజకుమారుడని పిలిచేవారు.
బౌద్ధ గ్రంథాలలో ఈ విశాలమైన దేశం ఏవిధంగా పాలింపబడిందో వివరంగా ఉంది.
గ్రామాలు జనసభల పాలనలో ఉండేవి. వాటి ముఖ్యులను గ్రామకులంటారు. మహా వర్గంలో 80,000 గ్రామాల గ్రామకులు జరిపిన ఒక మహా సభ గురించి చెప్పబడింది. రాజధానిలోగల ముఖ్యాధికారులను మహా మాత్రులని పిలిచేవారు. వీరిని మూడు తరగతులుగా విభజించారు. 1) అన్ని విషయాలు, అన్ని రాజ్యానుకూలమైన సంగతలు పర్యవేక్షించే ముఖ్య పాలనాధికారులను సబ్బాత్తకులు (సర్వార్థకులు) అనేవారు. 2) న్యాయ శాస్త్ర సంబంధమైన విషయాలను పర్యవేక్షించే అధికారులను వోహరికులు (వ్యవహారికులు) అని పిలిచేవారు. 3) యుద్ధ సంబంధమైన విషయాలను పర్యవేక్షించే అధికారులను సేనానాయకులన్నారు. శిక్షాస్మృతిలో నేరాలకు కారాగారావాసం, అంగ విచ్ఛేదం మొదలైన శిక్షలు ఉండేవి. బింబిసారుడు స్వయంగా ఈ శిక్షలను అదుపులో ఉంచేవాడు.
బౌద్ధులు, జైనులు బింబిసారుడు తమ తమ మతాలను అనుసరించేవాడని పేర్కొన్నారు. రాజసింహుడైన బింబిసారుడు అణాగర సింహుడైన (ఇల్లూ వాకిలి లేని సన్యాసియైన) మహావీరుని, తన భార్యలతోను, సేవకులతోను, బందువులతోను సందర్శించేవాడని, జైనధర్మాన్ని ప్రగాఢంగా నమ్మినవాడని ఉత్తరాధ్యయనంలో ఉంది. అతని భార్య ఛెల్లానా, జైనమతం వేవు బింబిసారుడు మొగ్గు చూపించడానికి కారణమై ఉంటుంది. హేమచంద్రుడో కథ చెప్పాడు. దేశం తీవ్రమైన చలికి లొంగి నాశనమవుతుంటే, బింబిసారుడు దేవీ ఛెల్లానాతో కూడి మహావీరుని పూజించడానికి వెళ్ళాడని అందులో ఉంది.
బౌద్ధ గ్రంథాలు కూడా, బింబిసారుడికి బుద్ధుడియందుగల భక్తి విశ్వాసాల గురించి చెప్పాయి. గౌతముడు బుద్ధత్వం పొందడానికి ఏడు సంవత్సరాల ముందు, బింబిసారుడిని గిరివ్రజంలో మొదటిసారి కలిశాడు. గౌతముడిని చూసి అతడు చాల మనసు పడ్డాడు. అతనికి కావలసిన ధనమిచ్చి, ముఖ్యాధికారిని చేయాలని సంకల్పించాడు. కాని అది కుదరలేదు. రెండవసారి బింబిసారుడు గౌతముని రాజగృహంలో కలిసేటప్పటికి అతడు సంపూర్ణ బుద్ధుడుగా అయాడు. అతనితో చాలామంది శిష్యులున్నారు. కస్సపులు యశస్సు పొందిన బ్రాహ్మణ సన్యాసులు. వారికి, జటిలురు అన్న అనుయాయులు వేయి మంది ఉన్నారు. వీరందరూ బుద్ధుడి వెంట వచ్చారు. బుద్ధుడిని తమ భగవానుడని ఘోషించారు. ఇదే చూసి సేనియ బింబిసారుడు బుద్ధుడి ధర్మాన్ని, క్రమ శిక్షణను స్వీకరించాడు. తాను బౌద్ధ మతంలోకి మారడం పెద్ద సంబరంగా చేశాడు. బుద్ధుడిని, అతని శిష్య సమూహాన్ని రాజు భవనంలో విందుకు ఆహ్వానించాడు. వేలువనాన్ని బుద్ధుడికి, సంఘానికి బహుమతిగా ఇచ్చినట్లు ప్రకటించాడు. అతని భార్య ఖేమా ధర్మం గురించి బాగా అధ్యయనం చేసింది. రాజుగారికి కూడా ఆ ధర్మాన్ని ఉపదేశించింది. బింబిసారుడు బౌద్ధమతమందు తనకుగల అభిమానాన్ని పురస్కరించాడు. ఒకసారి బుద్ధుడు గంగను దాటేటప్పుడు బల్లకట్టు వాడికి ఇవ్వడానికి డబ్బు లేకపోయింది. ఆ సంగతి బింబిసారుడు తెలుసుకొని, భగవానుడి యందు తనకు గల గౌరవాన్ని ప్రకటించి, భిక్షువులు బల్లకట్టు మీద నదిని దాటినప్పుడు శుల్కం చెల్లించనక్కరలేదని ఘోషించాడు.
బౌద్ధుల ఐతిహ్యాన్ని బట్టి బింబిసారుడు తన కొడుకు చేతులలోనే ప్రాణాలు పోగొట్టుకున్నాడని తెలుస్తుంది. బుద్ధుడి సమీప బంధువైన దేవదత్తుడు దుర్మార్గత్వంతో, ద్వేషంతో అజాత శత్రువుతో ఈ పని చేయించాడు.
మొదటిసారి అజాతశత్రువు తన తండ్రిని ఖడ్గంతో చంపడానికి ప్రయత్నిస్తే రాజుగారి మంత్రులు తెలుసుకున్నారు. వాళ్ళ దగ్గిర అజాత శత్రువు తన తప్పును ప్రకటించాడు. మంత్రులు బింబిసారుడిని కలిసి, కుట్రలో పాల్గొన్న రాజు ద్రోహుల నందరినీ చంపించమని సలహా ఇచ్చారు. కాని, మహారాజు తన కొడుకుని, మిగిలిన ద్రోహులను క్షమించి విడిచి పెట్టాడు. అజాత శత్రువుకి సింహాసనం ఇవ్వడానికి తాను పదవినుండి వైదలగుతానన్నాడు. దేవదత్తుడు మాత్రం, అజాత శత్రువుని నేరం చేయడానికి పురికొల్పి, జీవితం చాల హ్రస్వమైనదని, సింహాసనం లభించడానికి చాలకాలం పడుతుందని అతనికి నూరిపోశాడు.
“కాబట్టి, ఓ రాజ కుమారా! నీ తండ్రిని చంపి నువ్వు రాజు కావలసింది”.
అజాత శత్రువు, రాజ్యం కోసం న్యాయవంతుడైన తన తండ్రి ప్రాణాలను తీసినట్లు, బుద్ధుడి ఎదుట తన నేరం ఒప్పుకున్నాడు.
జైనుల గ్రంథాలు మాత్రం అజాత శత్రువు పట్ల ఉదారంగా వ్యవహరించాయి. అతడు పితృహత్య చేసినట్లు అవి చెప్పలేదు. అజాత శత్రువు సింహాసనం కోసం తొందరపడి బింబిసారుని కారాగృహంలో బంధించాడు. అప్పటికే బింబిసారుడు తన పుత్రుడు కూణికుడిని (అజాత శత్రువుని) సింహాసనం కోంస ఎంపిక చేశాడు. తన తరువాత రాజుగా ప్రకటించాడు. బింబిసారుడు కారాగారంలో ఉండగా అతని మీద అనురాగం గల రాణి ఛెల్లానా, భర్తకు సేవ చేసింది. అతని చేతికి కట్టిన గొలుసుల రాపిడికి, ఒక వేలు దెబ్బతిని వాచిపోగా, అతని బాధను పోగొట్టడానికి ఆమె ఆ వేలును చీకింది. ఈ దృశ్యం అజాత శత్రువుని కూణికుడిని బాగా కదిపివేసింది. “నేను నా తండ్రిని నిర్దయగా హింసించాను” అని అతడు తలచి, ఇనుపగదతో తండ్రి చేతులకున్న సంకెళ్ళను పగులగొట్టడానికి పరుగెత్తాడు. కొడుకు తనను చంపడానికి వస్తున్నాడని బింబిసారుడు భయపడి, విషం తాగి ప్రాణాలను తీసుకున్నాడు.
అజాత శత్రువు ఇతర రాజ్యాలపై దండెత్తి, వాటిని తన రాజ్యంలో కలుపుకున్నాడు. ఈ విధంగా అతడు కోసల రాజ్యంపై యుద్ధం మొదలు పెట్టాడు. కోసల దేశపు రాజు ప్రసేనజిత్తు. అతని సోదరిని బింబిసారుడి కిచ్చి వివాహం చేశాడు. బింబిసారుడి మరణంతో ఆమె వైధవ్యం పొంది, ఆ దుఃఖంతో మరణించింది. కోసల రాజకన్యను వివాహమాడినందుకు అరణంగా యిచ్చిన కాశీ గ్రామాన్ని ప్రసేనజిత్ తిరిగి తీసుకున్నాడు. అపుడు రెండు రాజ్యాలకు యుద్ధం సంభవించింది. మొదట అజాత శత్రువు యుద్ధంలో గెలిచి, వయసు మీరిన మామను శ్రావస్తివరకు తరిమి వేశాడు. కాని, కొద్ది కాలంలోనే పరిస్థితులు తారుమారయాయి. కాని, ప్రసేనజిత్తు పాంచి చేసని దాడిలో, అజాత శత్రువు చిక్కుకొని, తన సైన్యమంతటితో లొంగిపోయాడు. అయితేనేం, చివరకు ప్రసేనజిత్ రెండు పక్షాలకు సంధి చేసి శాంతిని స్థాపించాడు. అజాత శత్రువును విడిచి పెట్టడమే కాకుండా అతని సైన్యాన్ని కూడా విడిచి పెట్టి, కాశీ గ్రామాన్ని యిచ్చి వేసి, తన కూతురు వజీరాను కూడా అతనికిచ్చి వివాహం చేశాడు.
జైన గ్రంథాలలో, అజాత శత్రువు రాజకీయంగా శక్తివంతమైన తూర్పు గణతంత్ర పరిషత్తును జయించినట్టుంది. ఈ తూర్పు గణ తంత్ర పరిషత్తులోని రాజ్యాలు 36 వాటిలో 9 రాజ్యాలు లిచ్ఛవులని కాశీకి, కోసలకు చెందినవి 18.
ఈ తూర్పు గణ తంత్ర పరిషత్తులో చాల శక్తివంతమైనది లిచ్ఛవుల గణతంత్ర రాజ్యం. లిచ్ఛవులకు, అజాత శత్రువులకు గల వైర కారణం, వేరువేరు గ్రంథాలలో భిన్నంగా చెప్పబడింది.
బౌద్ధ గ్రంథాలలో చెప్పిన విధం ఇది. గంగానదీ తీరంలో ఒక రేవుకు సమీపంలో ఒక కొండ మొదట నొక వజ్రాలగని బయట పడింది. గని నుండి లభించే వజ్రాలను రెండు దేశాలవారు సమంగా తీసుకుందాని ఒక అంగీకారానికి వచ్చారు. లిచ్ఛవులు ఈ నిబంధనను అతిక్రమించారు. పోరుకు దారి తీశారు.
జైనుల గ్రంథాల ప్రకారం ఈ తగవుకు మూల కారణం మగధ సామ్రాజ్యం యొక్క భద్రగజం. ఆ అంబారీ ఏనుగు పేరు సేయనగం (సేఛనకం – నీల్ళను చిమ్మునది) అదికాక, 18 పేటల ముత్యాలహారం కూడా కారణమే. బింబిసారుడు వీటిని తన కొడుకులు హల్లుడికి, వేల్లుడికి ఇచ్చినవి. వాళ్ళు ఏనుగును, ముత్యాలహారాన్ని తమతో తీసుకొని, మాతామహుడైన లిచ్ఛవుల రాజు చేతకుడి దగ్గరికి పోయి అతని రక్షణను కోరారు. అజాత శత్రువు వాటిని తీసుకోదలచాడని అతనితో చెప్పారు. పారిపోయినవారిని రప్పించడానికి కూణికుడు శాంతియుతంగా ప్రయత్నించినా లాభం లేకపోయింది. అప్పుడతడు చేతకుడి మీద యుద్ధం ప్రకటించాడు. అజాత శత్రువు భార్య పద్మావతి. ఆమె భర్తను యుద్ధానికి పురి కొల్పిందని అంటారు.
లిచ్ఛవులను జయించడం సులువుగా జరిగే పనికాదు. వాళ్ళు గణతంత్ర పరిషత్తుకి ఆధిపత్యం వహించి ఉన్నతమైన స్థానంలో ఉన్నారు. ఉన్నారు. వాళ్ళు చాల శక్తివంతులు. అన్ని విధాలైన సహాయ సంపత్తులు వారికి అందుబాటులో ఉన్నాయి. నిజానికి, రాజు చేతకుడు, ప్రజాపరిషత్తును ముందుగా సమావేశ పరిచాడు. కాశీ, కోసల దేశాలలోని ముఖ్యుడైన గణతంత్ర పాలకులను పిలిపించాడు. అజాతశత్రువుకి లొంగిపోడమో, ఎదిరించి పోరాడడమో వారిని నిశ్చయించమన్నాడు. ఆ విధంగా అజాత శత్రువు, చాల బలవంతులైన తూర్పు దేశపు శత్రుపాలకులను, తన పాత విరోధులైన కాశీ కోసల రాజులను ఎదుర్కోవలసి వచ్చింది.
దీనిలో ముఖ్యమైన సమస్య ఒకటి ఉంది. మగధ సామ్రాజ్యం తూర్పుదేశాలపై ఆధిపత్యం వహించడమనేది దీనికి మూలకారణం. ఇరుపక్షాలవారు ఈ సంగతి గ్రహించారు. ఈ మహాసంగ్రామం దేశంలో అతిముఖ్యమైన రాజకీయ సంక్షోభాన్ని సృష్టించింది. అన్ని ప్రాపంచిక విషయాలనుండి దూరంగా ఉన్న బుద్ధుడు కూడా, దేశం యొక్క ముఖ్యరాజకీయాలలో పాల్గొనడం తన ధర్మమని భావించాడు. పుట్టుకతోనే బుద్ధుడు ప్రజాస్వామ్యవాది. గణతంత్ర పరిషత్తును సమావేశపరచిన లిచ్ఛవులను అతడు సమర్థించాడు. కొన్ని నియమాలను దేశాభ్యుదయం కోసం పాటిస్తే అజాత శత్రువు వంటి మహారాజు కూడా వారిని జయించలేడని అభయమిచ్చాడు. అ నియమాలు ఏవంటే
- సమావేశాలను ఏర్పాటు చేసినప్పుడు సభ నిండా సభ్యులు ఉన్నట్లు చూడాలి.
- ప్రజా పాలనలోను జన సభలోను, సభికులు అంతర్గతంగా తమలో తాము ఒక నిర్ణయానికి రావాలి.
- విప్లవకరమైన చట్టాలను, ప్రయత్నాలను దూరంగా ఉంచాలి.
- పురాతన సంప్రదాయాలను పాటించాలి.
- సమాజంలో వృద్ధులను, పురాతన సంస్థలను, దేవ గృహాలను, సాధువులను, స్త్రీలను గౌరవించాలి.
లిచ్ఛవులను జయించడానికి ఒకే మార్గముందని అజాతశత్రువు గ్రహించాడు. వారి అంతర్గతమైన ఐక్యతను నాశనం చేసిననాడే వారిని జాయించడానికి వీలవుతుందని అతడు విశ్వసించాడు. ఈ ప్రయోజనం కోసం అతడు వైశాలిలోని లిచ్ఛవుల మధ్య అంతఃకలహాలు సృష్టించమని తన మంత్రి వస్సకారుడిని, ఈ అతి నికృష్టమైన పనిమీద పంపించాడు. మూడు సంవత్సరాల తరువాత అతని ప్రయత్నం ఫలించింది. వేరు వేరు తరగతుల ప్రజల మద్య ఈర్ష్య నెలకొంది. ధనికులకు పేదలకు మధ్య, బలవంతులకు దుర్బలులకు మధ్య ద్వేషం పెరిగింది. పూర్వపు సామాజికమైన ఐకమత్యం లిచ్ఛవులలో కొరవడి, వాళ్ళు మారిపోయారు. ఆ విధంగా లిచ్ఛవుల మీద అజాత శత్రువుచేసే దండయాత్రకు రంగం సిద్ధమయింది.
రాజు ఘోషించాడు.
“ఈ వజ్జియులను సమూలంగా పెరికి నాశనం చేస్తాను. వారు శక్తివంతులు కావచ్చు. అధికార దర్పితులు కావచ్చు. వాళ్ళనందరిని సంపూర్ణంగా ధ్వంసం చేస్తాను.”
కాని, ఈ పని చేయడానికి అతడు పెద్ద ఎత్తున సేనా వ్యూహాలను పన్నవలసి వచ్చింది. లిచ్ఛవుల గణతంత్ర రాజ్యం గంగానదికి రెండవ వేపు, అటు పక్కన ఉంది. మగధ రాజ్యానికి రాజధానియైన రాజగృహం, గంగానదికి ఇటుపక్కన, చాల దూరంలో లోనికి ఉంది. అందుచేత సైనికస్థావరాన్ని నిర్మించవలసి వచ్చింది. గంగానదీ తీరాన్న అనుకూలమైన స్థలంలో దుర్గం ఒకటి కట్టించడానికి అతడు నిశ్చయించాడు. ఆ విధంగా పాటలీపుత్ర నగరానికి పునాదులు పడ్డాయి. అజాత శత్రువు యొక్క ముఖ్య మంత్రులిద్దరు, సునీదుడు, వస్సకారుడు అన్నవాళ్ళు పాటలీపుత్ర నగరనిర్మాణాన్ని పర్యవేక్షించారు. నిర్మాణం పూర్తయిన తరువాత ఆ ఇద్దరు మంత్రలు బుద్ధుడిని తమ గృహాలకు ఆహ్వానించారు. బుద్ధుడు ఏ నగర ద్వారం నుండి పైకి వచ్చాడో దానికి గౌతమ ద్వారమని పేరు ఎట్టారు. బుద్ధుడు ఏ రేవు నుండి బల్లకట్టుమీద గంగానదిని దాటాడో దానికి కూడా గౌతముని పేరు పెట్టారు. అటువంటి అమోఘమైన తరుణంలో బుద్ధుడు పాటలీపుత్ర నగరం యొక్క భవిష్యత్తును అర్థవంతంగా నిర్వచించాడు. ఏదో ఒక దినం, ఆర్య భారతదేశానికి పాటలీపుత్రం ముఖ్య నగరమవుతుందని, వాణిజ్యానికి, వ్యాపారానికి, ఆర్ధికమైన అభ్యుదయానికి కేంద్ర మవుతుందని బుద్ధుడు వక్కాణించాడు.
దుర్గనిర్మాణం పూర్తయిన తరువాత వైశాలి మీద దండయాత్ర మొదలయింది. తన భూమి మీద శత్రువు దాడి చేయగానే, లిచ్ఛవులు యుద్ధానికి సిద్ధమవడానికి బదులు తమలో తాము వాదించుకోడానికి మొదలు పెట్టారు. ఆ సరికే వాళ్ళు అంతఃకలహాల వల్ల విడిపోయారు. దండయాత్ర సలుపుతున్న శత్రువును ఎవరు ఎదుర్కొంటారని వాళ్ళు ప్రశ్నించుకున్నారు. “బలవంతులైన లిచ్ఛవులు ముందుకు పోయి శత్రువులనెదిరించాలి” అని వాళ్ళు వంతులు పోయారు. అందరికీ శత్రువైన అజాత శత్రువు పైకి అందరూ కలిసి యుద్ధం చేయడానికి బదులు, వాళ్ళు వాగ్యుద్ధానికి లోబడ్డారు. ఇటువంటి వారిని జయించడం అజాత శత్రువుకు సులభమయింది.
జైన గ్రంథాలలో మగధ సైన్యాల యుద్ధ చర్యలు చాల ఆసక్తికరమైన వివరాలతో లిఖింపబడ్డాయి. అజాతశత్రువు, మొట్టమొదటిసారిగా, రెండు రహస్యాయుధాలను యుద్ధం కోసం తయారు చేయించాడు. మొదటిది మహాళిలాకంటకము, బరువైన రాళ్ళను విసిరే యంత్రమిది. రెండవది రథముసలము. రథ చక్రాలకు ఇనుప చువ్వలు కడతారు. ఈ రథం యుద్ధంలో నడిచినప్పుడు చక్రాలు తిరిగి, వాటికి కట్టిన చువ్వలు శత్రువులను నాశనం చేస్తాయి. ఈ రథం యుద్ధ భూమిలో ప్రళయాన్ని సృష్టించింది. ఇంకా మరో విశేషం. దీనికి సారథి, గుర్రాలు లేవు. స్వయం చోదకమైనదీ రథం. మధ్య యుగంలో ఇటువంటి రథాలను, లోపల దాగిన మనుష్యుడు, చక్రాలను తిప్పి నడిపించేవాడు. రెండు ప్రపంచ మహా సంగ్రామాలలోను ఉపయోగించిన టాంకులతో వీటిని పాల్చవచ్చు.
చాల శ్రమపడి చేసిన ఈ ప్రయత్నాలను బట్టి, మగధ సామ్రాజాన్యినకి లిచ్ఛవుల గణతంత్ర పరిషత్తుకు మద్యను జరిగిన యుద్ధం చాలకాలం సాగిందని చెప్పవచ్చు. దండయాత్ర సలిపిన రాజు చాలా ధనం వెచ్చించి గంగానది ఒడ్డును దుర్గం నిర్మించవలసి వచ్చింది. బహుశా దుర్గనిర్మాణం రెండు సంవత్సరాలు పట్టి ఉంటుంది. తరువాత లిచ్ఛవుల మధ్య విభేదాలు కల్పించడానికి, అంతఃకలహాలను లేపి వారి జాతీయమైన ఐకమత్యాన్ని భగ్నం చేయడానికి, వైశాలికి వెళ్ళిన మగధ చారులకు మూడు సంవత్సరాలు పట్టి ఉంటుంది. మూడవది ఏదో గణతంత్ర రాష్ట్రంతో యుద్ధం చేయడం కాదిది. 36 గణతంత్ర రాష్ట్రాల పరిషత్తును మగధరాజు ఎదుర్కోవలసి వచ్చింది. గణతంత్రరాష్ట్రాల ముఖ్యపాలకుడు చేతకుడు. ఇతడు రాజకీయమైన సంబంధాలు కలవాడు. అంతే కాకుండా సింధు, సౌవీర, వత్స, అవంతీ దేశాల రాజులకు తన కుమార్తెలనిచ్చి పెండ్లి చేసి బంధుత్వం ఏర్పరచుకున్నాడు.
ఆ యుద్ధం 16 సంవత్సరాలకు మించి జరిగిందని జైన గ్రంథాలలో ఉంది. గోశాలుడు పెద్ద మతగురువు. ఇతడు మహావీరుని ప్రతిస్పర్థి. ఇతడు క్రీస్తు పూర్వం 484లో చనిపోయాడు. ఈ యుద్ధం విజృంభిస్తూ ఉంటే ఇతడు చూశాడు. గణతంత్ర పరిషత్తు మహావీరుడి మరణం వరకు అవిచ్ఛన్నంగా కొనసాగింది. మహావీరుడు క్రీస్తు పూర్వం 468లో చనిపోయాడు. ఈ మహాయుద్ధం క్రీస్తు పూర్వం 484 నుండి 468 వరకు తప్పక జరిగి ఉంటుంది. అజాతశత్రువుకు సంపూర్ణమైన విజయం లభించింది. అజాత శత్రువు తల్లి వైశాలిలో జన్మించింది. ఇది కూడా అతడు పరిగణించలేదు. వైశాలీ నగరపరిషత్తు యొక్క స్వాతంత్ర్యాన్ని అతడు నాశనం చేశాడు.
తూర్పు భారతంలో అజాతశత్రువు తన సామ్రాజ్యాన్ని స్థిరం చేసుకుంటున్నాడు. అపుడు మధ్యభారతంలో అవంతిని పాలిస్తున్న చండ ప్రద్యోతుడు అతనిపై ఎదురు తిరిగాడు. రాజధాని యైన రాజగృహంపై చండ ప్రద్యోతుడు దండయాత్రకు ప్రయత్నం చేస్తూఉంటే, అజాత శత్రువు తన కోటను, రక్షణ దృష్ట్యా దృఢపరిచాడు. అతడు చాల శ్రమపడి ఉంటాడు. పశ్చిమం నుండి అవంతి రాజు, ఉత్తరం నుండి లిచ్ఛవులు బెదిరిస్తూ ఉంటే, అటు పాటలీపుత్రానికి ఇటు రాజగృహానికి మధ్యను కదులుతూ, రక్షణకొరకు చేసే ఏర్పాటులను పర్యవేక్షించడం చాల కష్టమైన పని. కాని అజాత శత్రువుకి సంపూర్ణమైన విజయం కలిగింది. కోసల మొదలైన తూర్పు దేశపు ప్రభుత్వాలను అతడు అణచివేశాడు. వైశాలిని, కాశీని సంపూర్ణంగానో పాక్షికంగానో మగధలో కలుపుకున్నాడు. అవంతి రాజు అతనిని ఏమీ చేయలేకపోయాడు. ఆ విధంగా అజాతశత్రువు తన రాజ్యాన్ని విస్తరించి, మగధ సామ్రాజ్యానికి దృఢమైన పునాదులు వేశాడు.
అజాత శత్రువు గురించి జైన గ్రంథాలలోను, బౌద్ధ గ్రంథాలలోను ఉంది. తండ్రిని చంపినా, అజాత శత్రువు, మహావీరుని తన రాణులతోను రాజ పరివారం తోను దర్శించేవాడని జైన గ్రంథాలు చెస్తాయి. వైశాలిలోను చంపానగరంలోను మహావీరుని దర్శించి, జైన మునుల మీద తనకున్న ఉన్నతమైన అభిప్రాయాన్ని అజాత శత్రువు వెలిబుచ్చాడు. జీవ పాతకి సూత్రంలో, అజాత శత్రువు బహిరంగంగా మహావీరుని పైన, అతని శిష్యులపైన, తనకు గల విశ్వాసాన్ని ప్రకటించాడు. పరిత్యాగం మీద, అహింస మీద ఆధారపడిన మతం యొక్క నిజమైన మార్గం మీద మహా వీరుడు నడిచాడని అతనిని కొనియాడాడు.
బుద్ధుడితో అజాతశత్రువు ముందు వైరం పెట్టుకున్నాడు. చివరకు బుద్ధునిపై సంపూర్ణమైన భక్తిని ప్రకటించాడు. బుద్ధుడి మీద శత్రుత్వాన్ని పురికొల్పిన అతి దుర్మార్గుడు, దేవదత్తుడు. అతడు ఒక దినాన అజాత శత్రువును సమీపించి అన్నాడు.
“ఓ రాజా! మనుష్యులను ఆదేశించవలసింది. సమణ గౌతముడి జీవితాన్ని తుదముట్టిస్తాను”. రాజకుమారుడు అజాత శత్రువు తన మనుష్యులను ఆజ్ఞాపించాడు.
“యోగ్యుడైన దేవదత్తుడు ఏ పని చెప్తే దానిని చేయవలసింది”.
దేవదత్తుడి నిజమైన స్వభావం బుద్ధుడికి తెలుసు. అతడు తన వాళ్ళతో అన్నాడు.
“భిక్షువులారా! మగధ రాజు అజాత శత్రువు దుర్మార్గానికి స్నేహితుడు, దానితో దగ్గర సంబంధం ఉన్న వాడు, దానితో కలిసిపోయినవాడు.”
కాని, బుద్ధుడికి అజాత శత్రువుకి మద్యనున్న సంబంధాలు తొందరలోనే మారిపోయాయి. తన తండ్రిని హత్య చేసిన పిమ్మట అజాత శత్రువు బుద్ధుడిని తన దుఃఖంలో దర్శించాడు. అతనిని ప్రార్థించాడు.
“భగవానుడు, నేను ధర్మాన్ని అతిక్రమించి చేసిన పాపాన్ని పాపంగానే స్వీకరించుగాక! ముందు ముందు ఇటువంటి పని చేయకుండా నన్ను నిగ్రమించుగాక!”
ఒకసారి రాజవైద్యుడు జీవకుడు, బుద్ధుడిని దర్శించమని తన రాజైన అజాత శత్రువుని ప్రేరేపించాడు. అనాడు పూర్ణిమ. బుద్ధుడు తన భిక్షు సంఘంతో ఆమ్రవనంలో ఉంటున్నాడు. అజాత శత్రువు జీవకుడితో కలిసి అమ్రవనం ప్రవేశించాడు. అక్కడ ప్రగాఢమైన నిశ్శబ్దత అలముకుంది. ఈ పరిస్థితిని అజాతశత్రువు గమనించాడు. శత్రువులు తనను, పొంచి దాడిచేయగలరని భావించాడు. జీవకుడిని అడిగాడు.
“జీవకా! నువ్వు నా పై కుతంత్రాలు పన్నడంలేదు కదా? శత్రువులకు నన్ను అప్పగించడం లేదు కదా? ఇక్కడ శబ్దమనేదే లేదు. ఎవరూ తుమ్మినట్లు కాని, దగ్గినట్లు కాని వినిపించలేదు. ఇంత పెద్ద సభ ఇది! ఇక్కడ 1250 మంది భిక్షువులు సమావేశ మయారు కదా!”
జీవకుడు రాజుకు అభయమిచ్చాడు. ఎటువంటి మోసమూ జరగదని, అతడు సూటిగా బుద్దుడిని దర్శించవచ్చునని చెప్పాడు. రాజు అటుపిమ్మట సమావేశాన్ని సమీపించాడు. నిర్మలమైన సరోవరం వలె నిశ్శబ్దంగా ఉంది. ఆ సమావేశాన్ని చూసి అజాతశత్రువు బిగ్గరగా అన్నాడు.
“నా పుత్రుడు ఉదాయి భద్రుడు సమావేశం జరిపినపుడు, ఈ భిక్షు సంఘం వలె ప్రశాంతంగా ఉంటే ఎంత బాగుండును!”
బారమత్ శిల్పాలలో ఒకదానియందు అజాతశత్రువు బుద్ధుడిని దర్శించిన వృత్తాంతముంది. ఈ శిల్పం క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దానిది. బౌద్ధులకథ సామాన్యులలో ఎంత వ్యాప్తి చెందిందో ఈ శిల్పం నిరూపిస్తుంది. ఈ శిల్పం కింద చెక్కిన శాసన మిలా ఉంది.
“అజాత శత్రువు భగవానునికి నమస్కరిస్తున్నాడు.”
బౌద్ధ గ్రంథంలో ఈ విధంగా ఉంది.
“మా గధో అజాత సత్తు వేదేహీ పుత్తో
భగవతో పాదే సిరసా వందతి”
మాగధుడు, వేదేహి పుత్తుడైన అజాతశత్రువు భగవంతుని పాదాలకు శిరసా నమస్కరిస్తున్నాడు. అని దీని అర్థం. శిల మీద, బౌద్ధ గ్రంథంలోని ఈ వాక్యం చెక్కబడినట్టుంది.
రాజు, ఏనుగుమీద ముందు పోతుంటే స్త్రీ జనం ఏనుగుల పైనెక్కి అతనిని ఉత్సవంలో అనుసరిస్తున్నట్లు, అతడు ఏనుగు నుండి దిగి చేయెత్తి మాట్లాడడానికి సిద్ధమవుతున్నట్లు, బుద్ధుడి పాదముద్రలు గల సింహాసనం ముందు రాజు తన భక్తిని ప్రకటిస్తున్నట్లు ఆ శిల్పంలో ఉంది.
బుద్ధుడిని దర్శించడంతో అజాతశత్రువు యొక్క ధార్మిక జీవితంలో మార్పు వచ్చింది. అతడు ముందుగా ఆరుగురు ముఖ్యాచార్యులను కలిసి, పితృహత్యాపాతకం చేత గాయపడిన తన అంతరాత్మకు పూయడానికి, శాంతి నొసగే లూనమొకటి ప్రసాదించమన్నాడు. తన మంత్రుల సలహాను పాటించి మక్తాలి గోసాలుడిని, నిగ్గంఠ నాతపుత్తుడైన మహావీరుడిని అతడు కలిశాడు. కాని, ఆ ఆచార్యులెవరూ అతడు కోరిన శాంతిని ప్రసాదించలేకపోయారు అప్పుడు తడు తన చివరిప్రయత్నంగా బుద్దుడి దగ్గరికి బయలుదేరాడు.
బుద్ధుని మరణ వార్తవిని అతడు కుసీనగరానికి వేగంగా పోయాడు. ధర్మాన్ని తీవ్రంగా పాలించే బౌద్ధుడుగా అజాత శత్రువు, బుద్ధుని పవిత్ర శరీరావవేషాలలో తన భాగం తెచ్చుకోడానికి ప్రయాణమయాడు. ముందుగా తన దూతను పంపి, తన సందేశం తెలియజేశాడు.
“భగవానుడు క్షత్రియుడు. నేను కూడా క్షత్రియుడనే. భగవంతుడి శరీరావశేషాలను పొందడానికి యోగ్యత కలిగిన వాడిని. భగవానుని ధాతువుల పైన స్తూపాన్ని ఒకటి లేవనెత్తి అందరికీ విందు చేస్తాను.”
బుద్దుడి ముఖ్య శిష్యుడు మహాకస్సపుడు. అతడు భగవానుడి శరీరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. అంత్య క్రియల తరువాత అతని అస్తికలను తన దగ్గిర ఉంచుకున్నాడు. అస్తికలను తమకు కావాలని ఎనమండుగురు కోరారు.
మొదట అనుకున్న ప్రకారం ఈ ఎనిమిది మందికి అస్తికలనిచ్చి, ఎనిమిది స్తూపాలలో వాటిని నిక్షేపించడం క్షేమం కాదని అతడు భావించాడు. మనసు మార్చుకొని, అస్తికలను కోరిన ఎనమండుగురిలోను అజాతశత్రువు తగిన వాడని అతడు ఒక నిర్ణయానికి వచ్చి, వాటిని పెద్ద మొత్తంలో రాజగృహంలో ఒక స్తూపంలో నిక్షేపించమని అతనిని కోరాడు. అస్తికలలో తక్కువ భాగాన్ని అతడు వాళ్ళకు పంచిపెట్టాడు.
అజాతశత్రువు రాజధాని చుట్టూ ధాతు చైత్యాలను నిర్మించాడు. బుద్ధుడి మరణం తరువాత, రాజ గృహంలో ఉన్న 18 విహారాలు విడిచి భిక్షువులు వెళ్ళిపోయారు. వాటినన్నటినీ అతడు బాగు చేయించాడు. వీటన్నిటికన్న చాల ముఖ్యమైన విషయమొకటి అజాత శత్రువు పేరును శాశ్వతంగా బౌద్ధంలో నిలిపింది. ఇతని కాలంలోనే మొదటి బౌద్ధ సర్వ సభ్య సమావేశం లేక సంగీతి జరిగింది. అజాతశత్రువుకి ఈ సమావేశంతో చాల సంబంధముంది. 500 మంది ప్రఖ్యాతులైన భిక్షువులు, థేరులు దేశం నాలుగు చెరగుల నుండి ప్రయాణం చేసి రాజగృహం చేరుకున్నారు. మగధ రాజధాని చాల ఉత్తమమైన స్థలంగా వాళ్ళు నిర్ణయించారు. వారికి ముఖ్యావసరాలయిన బట్టలు, భిక్షగా లభించే ఆహారం, నివాస స్థలాలు, ఔషధాలు సమృద్ధిగా ఆ పట్టణంలో లభించడమే ఈ నిర్ణయానికి ముఖ్యకారణం. అందుకు తగినట్లే, అజాత శత్రువు యొక్క రాజధానిలో, వారికి అతిథ్యమూ సదుపాయాలూ లభించాయి. అజాత శత్రువు శ్రద్ధ తీసుకొని వారికి మరికొన్ని సదుపాయాలు కల్పించాడు. సమావేశం విజయవంతం కాడానికి దోహదం చేశాడు. వేభారశిల పక్కను దేదీప్యమానమైన మండపమొకటి నిర్మించాడు. సత్తపణ్ణి గుహాముఖంలో శిలలను దొలిచి ఈ మండపాన్ని నిర్మించాడు. స్వర్గ సభవలె ఇది కనిపించింది. అన్ని విధాల ఆ మండపాన్ని అలంకరించిన తరువాత భిక్షువుల సంఖ్య ననుసరించి, రత్న కంభళాలను వేయించాడు. అధ్యక్ష పదవి వహించిన భిక్షువు కోసం ఎత్తుగా థేరాసనం, గాథలను గానం చేసే భిక్షువుకు ధర్మాసనం చేయించి మండపం మధ్యను వేయించాడు.”
కృష్ణమూర్తి అంతటితో చెప్పడం ఆపారు. అప్పటికే బాగా చీకటి పడింది. చరిత్ర గురించి చెప్పడంలో ఒక విశేషం ఆయన ప్రదర్శించారు. చాలా ఆసక్తికరమైన సంఘటనలకు ప్రాధాన్యమిచ్చి, వింటున్న వాళ్ళ మనస్సులను ఆకర్షించేటట్లు కృష్ణమూర్తి చెప్తున్నారు. ఎవ్వరూ ఒక ప్రశ్న కూడా వెయ్యకుండా చెవులప్పగించి వింటున్నారు. మన పూర్వుల గురించి, ప్రాచీన చరిత్ర గురించి వింటుంటే ఒళ్ళు పులకరిస్తోంది.
చెప్పేవాళ్ళు స్కాలర్లు. వినేవాళ్ళు కూడా అంత గొప్పవాళ్ళే. అపుడు చరిత్ర అమృతం కాక మరేమవుతుంది.
(సశేషం)