Site icon Sanchika

శ్రీపర్వతం-13

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 13వ భాగం. [/box]

23

[dropcap]అ[/dropcap]మరావతి సర్వనాశనమయింది. అక్కడ పురాతన శిల్పసంపద భూమిలో కప్పొడిపోయింది. బహుశా అది మంచికే వచ్చింది. వర్షాలకో, లేకపోతే అనుకోకుండా జరిగిన తవ్వకాలలో ఒక రాతిపలక బయటపడేది. దానిని వెంటనే తీసుకుపోయి వీధి ద్వారం దగ్గిర మెట్టుగా ఉపయోగించేవారు. లేదా అంటే, ఆ రాతిని కాల్చి సున్నంగా తయారుచేసి ఇళ్ళకు వాడుకునేవారు ఆ వూరి ప్రజలు – వాళ్లెప్పుడూ ఆ రాళ్ల గురించి ఆలోచించలేదు. అందుచేత అమరావతి స్తూపం యొక్క మధ్యభాగం అక్కడ లేకుండా పోయింది. లోపలి ప్రదక్షిణాపథం కూడా లేదు. చుట్టూ పైనున్న కమ్మి మాత్రం పునరుద్ధరణకు నిలిచింది.

కలొనెల్ మెకంజీ 1797లో మొదటిసారి అమరావతి శిల్ప ఫలకాలను చూశాడు. 1818 సం॥లో వాటికి బొమ్మలు గీశాడు. అప్పటికవి ఆ చోటనే ఉండేవి. కాని, అతడు తన తవ్వకాల గురించి ఎటువంటి వివరాలను ఇవ్వలేదు. పన్నెండవ శతాబ్దంలోనో పదమూడవ శతాబ్దంలోనే స్తూపం నుండి చాలా పలకలను తీసి వాటిని ఆలయ నిర్మాణానికి, చుట్టూ ఉన్న ప్రహారికి ఉపయోగించిన వాటిని, సర్ వాల్టర్ ఎలియట్ కనుగొన్నాడు. వాటినుంచి కూడా ఏ విషయం సరిగా తెలియలేదు.

కలోనెల్ మెకంజీ 1797లో తన జిల్లాలో పర్యటించాడు. దీనికి రెండు మూడు సంవత్సరాలకు పూర్వం, చింతపల్లి రాజావారు అక్కడనున్న శివాలయం పట్ల ఆకర్షితులయ్యారు. ఆ శివుడు అమరేశ్వరుడు. ఆ ప్రదేశంలో ఒక పట్టణాన్ని నిర్మించాలని వారు సంకల్పించారు. తన రాజధానికి గృహనిర్మాణ వస్తువులు అవసరమయాయి. అపుడు వారు స్తూపం యొక్క దిబ్బను, అటువంటివే మరికొన్ని దిబ్బలను తెరచి రాళ్లను, ఇటుకలను గృహనిర్మాణానికి ఉపయోగించారు. అమరేశ్వరపురానికి అరమైలు దూరంలో ధరణికోట ఉంది. ఇదే ధాన్యకటకం. దీని చుట్టు గోడలను పడగొట్టించి, ఆ రాళ్లను కూడా ఉపయోగించారు. చాలా పురాతన వస్తువులు ఈ కార్యక్రమంలో నశించిపోయాయి. రాజావారు ఆలయాల క్రింద రాజభవనాల కింద ఈ రాళ్లను విరివిగా ఉపయోగించారు. ఇంత జరిగినా, కొన్ని శిల్పఫలకాలు ఆ చోటనే ఉండిపోయాయి. కలొనెల్ మెంకజీ అటుపిమ్మట వాటి గురించి ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాల్ వారికి నివేదిక పంపించాడు.

1816లో మెంకజీ తిరిగి అమరావతి వచ్చాడు. అప్పటికి అతను సర్వేయర్ జనరల్ ఆఫ్ మద్రాసుగా ఉండేవాడు. తనకు అందుబాటులో ఉన్న ప్రయత్నాలన్నీ చేసి, రెండు సంవత్సరాలు శ్రమించి, స్తూపం యొక్క ముఖ్యభాగాన్ని తీర్చిదిద్ది, దానిని “దీపాలదిన్నె’ అని పిలిచాడు. అతడు స్తూపానికి, పరిసరాలకి మాపులు గీయించాడు. 80 శిల్పాలకు జాగ్రత్తగా చిత్రాలు వేయించాడు. అతని అసిస్టెంటులు హామిల్టన్, న్యూమన్, బర్క్ అన్నవారు ఆ చిత్రాలను గీశారు. హిందూదేశంలో సరియైన కొలతలకు, అంత ఉత్తమమైన డ్రాయింగులు మరెవరూ గీయలేదు. వారు ఈ డ్రాయింగులను మూడు కాపీలు చేశారు. ఒక సెట్టు కలకత్తాలోని ఏషయాటికి సొసైటీకి, రెండవ సెట్టు మద్రాసుకు, మూడవది కోర్ట్ ఆఫ్ డైరెక్టర్స్‌కి పంపారు. మ్యూజియంలకు నమూనాలు పంపారు.

కొలనెల్ మెకెంజీ చేసిన పనిని, సర్ వాల్టర్ ఎలియట్ చేపట్టాడు. స్తూపాన్ని కొంతవరకు తవ్వించాడు. చాలా శిల్పాలను వెలికి తీసి మద్రాసు పంపించాడు. అక్కడ అవి ఎండకు, వానకు పధ్నాలుగు సంవత్సరాలు ఉండిపోయాయి. చివరకు 1856లో వాటిని బ్రిటన్ తరలించాడు.

1856, 1857 సంవత్సరాలలో హిందూ దేశంలో సిపాయి తిరుగుబాటు జరిగింది. ఈస్టిండియా కంపెనీకి ఆఖరి రోజులు. కొత్త ఇండియన్ కౌన్సిల్ స్థాపించడం జరిగింది. అటువంటి పరిస్థితులలో అమరావతి నుండి వచ్చిన శిల్పాలు బ్రిటన్ చేరుకున్నాయి. వాటిని భద్రపరచడానికి సరియైన స్థలం దొరకలేదు. ఫైఫ్ హవుస్ అనే భవనానికి ఒక గుర్రపుబగ్గీ ఉంచే శాల ఉంది. దానిలో ఈ శిల్పాలను పడవేశారు. అవి చెత్త చెదారాలలో కప్పబడి పోయాయి. శిల్పాలు ఇంగ్లండులో నున్న సంగతి ఫెర్గుసన్ దొరకు 1867లో తెలిసింది. వెంటనే ఆయన వాటిని బయటికి తెప్పించి ఫొటో గ్రూపులు తీయించారు.

అమరావతి మనకు 67 మైళ్ల దూరంలో ఉంది. కృష్ణానదికి కుడిగట్టున ఉంది. అమరావతిలో బౌద్ధుల శిల్పకళ, బౌద్ధ సంస్కృతి క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ది నుండి క్రీస్తు తరువాత మూడవ శతాబ్దం వరకు వర్ధిల్లాయి. కృష్ణానదీతీరాన చాలా స్తూపాలు, చైత్యాలు, విహారాలు నిర్మించబడ్డాయి. స్తూపనిర్మాణానికి పెద్దకొలతలు గల కాల్చిన ఇటుకలను ఉపయోగించారు. పునాదులు వర్తులాకారంలో బండి చక్రంవలె ఉండేవి. బండికమ్ముల మద్యనున్న స్థలంలో మట్టి నింపేవారు.

1786వ సంవత్సరంలో దక్షిణ భారతదేశంలో ఒక మద్రాసీ రైతు, నెల్లూరు దగ్గిర, ఒక శిథిలమైన ఆలయం కింద, చాలా రోమన్ నాణాలు, మెడల్సు కనుగొన్నాడు. అవి క్రీస్తు వెనుక రెండవ శతాబ్దికి చెందినవి. కాని దురదృష్ట మేమిటంటే, ఎవరూ ఈ సంఘటనను పట్టించుకోలేదు.

సర్ విలియం జోన్స్ 1784 జనవరి 15 తారీఖున ఏషియాటిక్ సొసైటీ స్థాపించాడు.

వాళ్లు ముగ్గురూ మధ్యాహ్నం మూడుగంటలకు టెంట్లు విడిచి, మహాస్తూపం పక్కనుంచి అష్టభుజస్వామి ఆలయం వైపు నడుస్తున్నారు. డాక్టర్ మోహన్ పిచ్చాపాటీగా అమరావతి గురించి మాట్లాడుతున్నాడు.

“ఇంకా మరేవైనా అమరావతి గురించి చెప్పవలసినవున్నాయా?” సుబ్రహ్మణ్యేశ్వర రావు ప్రశ్నించాడు.

“మరికొన్ని విషయాలు ఈ సందర్భంలో చెప్పాలని ఉంది.” అన్నాడు మోహన్.

“ఎందుకు సందేహిస్తున్నారు?” నవ్వుతూ అంది శశికళ.

“నేడు అమరావతి అని ప్రఖ్యాతి వహించిన ప్రదేశమందు ధనకటక మహాచైత్యముండేది. ఈ మహాచైత్యంలో బుద్ధధాతువుండేది. నానా చిత్ర సుచిత్రమైన స్తూపముండేది. ఆనాడు సంఘారామమున్న ప్రదేశము నేటి ధరణికోట. ఈ ధరణికోటకు 15వ శతాబ్దం వరకు సుధాన్యకటకము, ధాన్యకటకము, ధరణికోట, ధనకటకము, ధనకచ్చము అన్న పేర్లు ఉండేవి. దీనికి అమరావతి అన్న పేరు అర్వాచీనమైనది.

క్రీ.శ. 1182 వ సంవత్సరంనాటి శాసనం ఈ విధంగా అమరావతిని ప్రస్తుతించింది.

అస్తి శ్రీ ధాన్యకటకంపురం సురపురాత్పరమ్

యత్రామరేశ్వరశ్శంభు రమరేశ్వర పూజితః

బుద్ధ దేవస్య సాన్నిధ్యాత్ యత్ర ధాతోప్ర పూజితః

చైత్యమత్యున్నతం యత్రనానాచిత్రసుచిత్రితమ్.

స్తూపమున్న ప్రదేశము అమరావతి. ధనకటకమహా చైత్యం దాదాపు క్రీ.పూ. 3వ శతాబ్దం నుండి, క్రీస్తు వెనుక ఏడవ శతాబ్దం వరకు, అనగా ఒక వేయి సంవత్సరాలు, సర్వసంపన్నమై, సకల విద్యలకు ఆకరమై విలసిల్లింది. అశోక మహాచక్రవర్తి పంపిన మహాదేవన్ల విరుడు అన్న అతడు, ఈ మహాచైత్యాన్ని నిర్మించి, ఆంధ్రదేశంలో చైత్యక సంప్రదాయం నెలకొలిపినట్లు చెప్తారు.

ఆ కాలంలో ప్రాథమిక విద్యలో శబ్ద విద్య, శిల్పా స్థాన విద్య, చికిత్సా విద్య, హేతు విద్య ఆధ్యాత్మిక విద్య అను సంచశిక్షణలు ఉండేవి. ఈ ప్రాథమిక విద్య అయిన తరువాత అభిమాన విషయాలలో విద్య గరపేవారు.

విహారాలలో ఏ విధంగా నియమాలను అనుసరిస్తారో వినయపిటకంలో చెప్పబడింది. విహారాలలో శిక్షణ, ఆచార్య శుశ్రూష, అభిధర్మ ఆగమములందు ప్రావీణ్యము, వ్యాయామము, బౌద్ధ శ్రమణుల తరతమ నిర్ణయము, విహారాధికారి విహారపాలుర కర్తవ్యాధికారములు, కఠోర బ్రహ్మచర్యవ్రతము, పంచభోజనీయాలు, పంచఖాదనీయాలు, దండవిధానము, వేళాచక్రములు, స్వయం పరిపాలనా విధానము అనునవి జరుగుతూ ఉండేవి. శ్రమణుల శ్రేణీ విభజనం జరిగేది భిక్షువులు కేవలం మత గ్రంథాలనే కాక వివిధ విజ్ఞాన విషయాలను కూడా అభ్యసించేవారు. ధర్మ శాస్త్రము, రాజనీతి, సాహిత్యము, వ్యాకరణము, వైద్యము మొదలైనవన్నీ విహారాలలో బోధింపబడేవి.

ఉచితంగా విద్యావ్యాసములు, వసనములు, ఆహారము, ఔషధములు – మహారాజుల దానాల వలన, మహాశ్రేష్ఠుల ఔదార్యం వలన లభించేవి.

బుద్ధుడు విహారాలలోకి స్త్రీల ప్రవేశాన్ని అంగీకరించాడు. కాని సంఘారామాలలో సహవిద్యకు స్థానం లేకుండా పోయింది. 3,4 శతాబ్దాల వరకు స్త్రీలకు ప్రత్యేక సంఘారామాలుండేవి. అటు పిమ్మట వాటికి స్థానం లేకుండా పోయింది. వజ్రయాన తంత్రయానాలలో స్త్రీకి భైరవీస్థానం లభించింది. అది నైతిక పతనానికి దారి తీసింది.

బౌద్ధ మతంలో హీనయాన, మహాయాన శాఖలన్నిటికి ధరణి కోట కేంద్రంగా వ్యవహరించింది.

ధరణికోట విశ్వవిద్యాలయంతో సంబంధం కలిగిన ప్రసిద్ధ పండితులు ఒక నలుగురున్నారు. మంజుశ్రీ, ఆర్యనాగార్జునుడు, భావవివేకుడు, దశవలుడు అన్న నలుగురు మహాపండితులు ఈ విశ్వవిద్యాలయానికి చెందినవారు.

ఆర్య లేక ఆచార్య నాగార్జునుడు ప్రజ్ఞాపారమిత శాస్త్ర రచయిత. ఇతడు శాతవాహన రాజుల ఔదార్యము వలన చైత్యము చుట్టును నానాచిత్ర సుచిత్రమైన ప్రాకారం కట్టించాడు. రెండవ నాగార్జునుడు వజ్రయాన శాఖకు చెందినవాడు. ఇతడు తంత్రవిద్యాకుశలుడు, ఆరవ శతాబ్దంలో ఇతడు ధాన్యకటకంలో ఉన్నాడు. దశవలుడను బౌద్ధ సాధువుంగవుడు ఇక్కడ తంత్రాలన్నీ నేర్చుకున్నాడు. ఈ విధంగా బౌద్ధ ధర్మానికి, విద్యలకు కేంద్రమైన ధాన్యకటకం తన చరమదశలో వజ్రయాన, తంత్రయానాలకు ప్రధాన స్థానమయింది.

విద్యాసంస్థలలో నైతిక ప్రమాణం పడిపోనంత వరకు జనసామాన్యం ధరణికోట విశ్వవిద్యాలయాన్ని ఆదరించింది. కాని, నైతిక శక్తి దిగజారిపోవడంతో, ప్రజాదరము తగ్గిపోయి, సంఘారామాలు శిథిలమై, దిబ్బలయిపోయాయి.

ఆచార్య నాగార్జునుని కాలంలో ధరణికోట అత్యంత వైభవాన్ని అనుభవించి, గొప్ప విద్యాపీఠమని పేరుగాంచింది.

నైతిక పతనమే బౌద్ధమత నాశనానికి మూలకారణం. వజ్రయాన తాంత్రికాచారాలు, శక్తిపూజలు, రహస్య క్రియా కలాపాలు, పంచమకార సేవనము మున్నగు హేయములైన సంప్రదాయాలకు తావలమై బౌద్ధం ప్రజల దృష్టిలో నింద్యమై దుర్యశం సంపాదించుకున్నది.

ఇంతేకాకుండా, వైదికమైన పురాణమతం విజృంభించి బౌద్ధానికి గొడ్డలిపెట్టు అయంది. పల్లవులు, విష్ణుకుండినులు, చాళుక్యులు వీరి కాలంలో బౌద్ధం నామమాత్రావశిష్ఠమయింది. రెండవ మాధవవర్మ కాలంలో, అమరావతి మహాచైత్యం ప్రాధాన్యతను కోల్పోయింది.

దీవసహస్రాలంకృతమయి, బుద్ధదేవుని జయంత్యుత్సవాలకు, ఇతర బౌద్ధవర్ధంతులకు దేశాంతరాల నుండి ద్వీపాంతరాల నుండి వేలకొలది బౌద్దులను ఆకర్షించుతూ, నయనపర్వంగా విస్తున్న ఈ మహాచైతన్యం విలసిల్లిన క్షేత్రం, ఆ మహావిభూతి అంతా హరించిపోవ, ‘దీపాలదిన్నె’ అన్న పేరును మాత్రమే పరిశిష్టముగ నిలుపుకొని, ‘బ్రతికి చెడిన ఆంధ్రుల పూర్వ వైభవము’ అనేక శతాబ్దుల నుండి కన్నీరు మున్నీరుగా వర్ణించు మహావాహిని కృష్ణవేణి స్రవంతితో శ్రుతి కలిపి నేటికిని హృదయవిదారకముగ విషాదగీతిని ఆలపించుతునే ఉంది.

ఆ సరికి అష్టభుజస్వామి ఆలయం ఉండిన చోటు వాళ్లు చేరుకున్నారు. అప్పటికి నాలుగు దాటింది. ఎండలో వెచ్చదనం తగ్గింది. ఉత్తరానికి వాళు నడిచేటప్పుడు చలిగాలి సూదుల్లా పొడిచింది.

ఈరోజు ముగ్గురూ స్వెట్టర్లు వేసుకున్నారు. శశికళ తనతో పెద్ద ప్లాస్కులో కాఫీ, మంచినీళ్ల కాంటీను, టార్చిలైటు సంచిలో వేసుకొని తెచ్చింది. ఎప్పుడు టెంట్లకు తిరిగివస్తారో వాళ్లకు తెలియదు.

వాళ్ళొక చదునైన చోట కూర్చున్న తరువాత, కాఫీలు తాగి సావకాశంగా మాటలు సాగించారు.

“మన అమరావతీ స్తూపం క్రీస్తు పూర్వం మూడవ శతాబ్ది నుండి నేటివరకు ప్రజల మధ్యనే ఉండి శిథిలమయింది. కాని, నాగార్జునకొండలోయ, విజయపురి వీట్లలోగల శిల్ప సంపద, మిగిలిన కట్టడాలు చాలవరకు మిగిలాయి. పల్లవుల దండయాత్ర తరువాత విజయపురి పరిత్యజింపబడడమే దీనికి కారణమని మనం అనుకున్నాము. మనదేశంలో ఈ విధంగా మరుగునబడి, శిల్ప సంపద చెడిపోని పురాతనమైన బౌదులకట్టడాలు ఇంకెక్కడయినా ఉన్నాయా? అడిగాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“ప్రసిద్ధి చెందిన అజంతా గుహాలున్నాయి కదా!” అన్నాడు మోహన్.

“మీరు చూశారా?” శశికళ మోహన్ని అడిగింది.

“నేను కిందటి సంవత్సరమే చూసి వచ్చాను. మీరు చూశారా?”

సుబ్రహ్మణ్యేశ్వరరావు కాని, శశికళ కాని చూడలేదు.

మోహన్ అజంతా గుహల గురించి చెప్పడం మొదలు పెట్టాడు.

అజంతా గుహలు 29. అవి బౌద్ధుల విహారాలు, చైత్యాలు. విహారం భిక్షువులుండే కట్టడం. చైత్యం అంటే ఆలయం. బుద్దడి ప్రతిమను కాని, అతని ప్రతీకలను కాని పూజించే దేవాలయం. ఈ మందిరాలు క్రీ.పూ. రెండవ శతాబ్దం నుండి, క్రీ.శ. ఏడవ శతాబ్దం మధ్యను నిర్మింపబడినవి. వీటి నిర్మాణానికి రమారమి ఒక వేయి సంవత్సరాలు పట్టింది.

దక్కను పీఠభూమికి దక్షిణ ప్రాంతంలో అజంతా అన్న పేరు గల చిన్న పట్టణానికి దగ్గరలో ఈ మందిరాలున్నాయి. ఇవన్నీ శిల్పాలతోను, భిత్తికా చిత్రాలతోను అలంకరింపబడినవి. భారతీయ చిత్రకళ ఈకాలంలో భిత్తికా చిత్రాలలో తారస్థాయినందుకొన్నదని ఈ చిత్రాలు చెప్తాయి. ఈ చిత్రాలు అతి సహజమైనవి పరమసుందరమైనవి. ప్రపంచంలో గల అత్యుత్తమ చిత్రాలకు చెందినవి.

అజంతా గుహలు ఔరంగాబాద్‌కి 55 మైళ్ల దూరంలోను, జలగాం పట్టణానికి 39 మైళ్ళ దూరంలోను ఉన్నాయి. ఖాందేష్ సమభూముల నుండి దక్కను పీఠభూమికి పోయే మార్గంలో ఉన్నాయి. వాఘిరానది చంద్రవంక ఆకారంలో ఈ గుహలముందు ప్రవహిస్తున్నది. ఈ గుహలు అజంతా పట్టణానికి ఏడుమైళ్ల దూరంలో, ఫరద్‌పూర్‌కి నాలుగు మైళ్ల దూరంలోను ఉన్నాయి.

దక్షిణ వింధ్యాద్రి శ్రేణిలో ఈ గుహలు మలచబడ్డాయి.

విహారాల చైత్యాలు కఠినమైన ఉపరితలం కల రాళ్లలో చెక్కబడ్డాయి. శిల్పులు మీదనుండి కిందికి శిలలను మలచారు. ఈ విధంగా చేయడంవల్ల మంచెలను ఉపయోగించవలసిన అవసరం లేకపోయింది. గుహలు ఒకే పద్దతిలో మలచడం వలన వారికి పని సులువయింది. శిలలో వర్తులంగానో, దీర్ఘ చతురస్రాకారంలోనో వొలిచి ఆ చోటలలో ద్వారాలు ఉంచడానికి ముందుగా దొలిచి, తరువాత సన్నని మద్యదారులను దొలిచి, పిమ్మట పైకప్పును, పైకప్పు తరువాత మందిరాలలోకి, భవంతులలోకి పోయే వసారాలను తవ్వేవారు. స్తంభాలు ముందుగా చెక్కి, పిమ్మట వాటిపై చిత్రాలను చెక్కి అలంకరించేవారు. గుహాలయం ఏవిధంగా నిర్మిస్తారో 5వ విహారాన్ని బట్టి తెలుస్తుంది. ఈ విహారాన్ని కొంత వరకు దొలిచిన తరువాత, రాయి నాసిరకమైనది తగలడంతో నిర్మాణాన్ని ఆపుచేసి అసంపూర్ణస్థితిలో విడిచి పెట్టారు. దీనిని బట్టి విహారంకాని, చైత్యంకాని ఏవిధంగా రూపొందిస్తారో తెలుస్తుంది.

అజంతా గుహాలయం గురించి ఏ పురాణాలలో కాని, చారిత్రక గ్రంథాలలో కాని తెలుపలేదు. మొగల్ సైన్యాలు దక్కను పీఠభూమిని కటక్-ఇ-ఫరద్‌పూర్ దారి. దీనినే అజంతా పాస్ అంటారు. వాహనాలు వీటి గుండా ప్రయాణం చేసేవి. మొదటి అసఫ్ ఝా అజంతా దగ్గిర, ఫరద్‌పూర్ దగ్గర ప్రాకారాలు గల సెరాయిలను కట్టించాడు. సైన్యాలు, వ్యాపారస్తులు అటువేపు నుంచి పోతూ ఉండేవారు. చంద్రవంక ఆకారంలో, లేక గుర్రపు నాడా ఆకారంలో నున్న ఈ గుహలను దాటిపోడానికి మరే దారీ లేదు. అంతేకాక దట్టంగా పెరిగిన చెట్లు, తుప్పలు ఈ గుహలను తమలో దాచుకున్నాయి. ప్రయాణికులు, చుట్టు పక్కలను గ్రామాలవారు వీటిని కనుక్కోలేదు. 1819వ సంవత్సరంలో మద్రాసు సైన్యంలో పని చేస్తున్న కొంతమంది అధికారులు, శత్రువులకు అగుపడని రహస్య స్థావరాలకోసమో, పెద్ద ఎత్తున వేట జరపడం కోసమో అటువేపు వెళ్లి, అనుకోకుండా గుహలను చూడడం జరిగింది. ఆఫీసర్లు మద్రాసులో గల తమ పై అధికారులు ఈ విషయం నివేదించారు. విలియం ఎస్కిన్ వీటిపై ఒక నివేదిక తయారుచేసి బొంబాయి సాహిత్య సమాజం ముందు చదివాడు. ఆ నివేదిక అజంతా గుహలకు సంబంధించిన ప్రప్రథమమైన అధికారికమైన రిపోర్టు. 1824వ సంవత్సరంలో లెఫ్టినెంట్ జేమ్స్ ఇ అలెగ్జాండరు గుహలను దర్శించి సంగ్రహమైన రిపోర్టును రాయల్ ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బ్రిటన్‌కి, పంపించాడు. మరికొందరు గుహలను దర్శించారు. ఆ విధంగా అజంతా గుహలు ప్రచారాన్ని పొందాయి.

1839వ సంవత్సరంలో జేమ్స్ ఫెర్గుసన్ గుహలను దర్శించాడు. 1843లో రాయల్ ఏషియాటిక్ సొసైటీ సభ్యుల ముందు, ‘రాక్ కట్ టెంపుల్స్ ఆఫ్ ఇండియా’ అన్న వ్యాసం చదివాడు. ఈ వ్యాసం ఈస్టిండియా కంపెనీ డైరెక్టర్లను ఆకర్షించింది. అపుడు వారు కెప్టెన్ రాబర్ట్ గిల్‌ను, అజంతా గుహలగోడల పైన చిత్రాలను కాపీ చేయడానికి నియమించారు.

కెప్టెన్ గిల్ 1844లో అజంతా చేరుకున్నాడు. 27 సంవత్సరాలు శ్రమపడి చిత్రాలు కాపీ చేశాడు. అతని చిత్రాలను లండన్లోని క్రిస్టల్ పాలెస్‌లో ప్రదర్శించారు. 1866 డిసెంబర్‌లో ఆ భవనం అగ్నికి ఆహుతై చాలా చిత్రాలు దగ్ధమైపోయాయి. ఈ మహా నష్టాన్ని పూడ్చడానికి, మరో పది సంవత్సరాల తరువాత, జాన్ గ్రిఫిత్స్‌ను నియోగించారు. ఇతడు బొంబాయి స్కూల్ ఆఫ్ ఆర్ట్స్‌కి చెందినవాడు. ఆ విధంగా, ప్రభుత్వం, రెండవసారి, అజంతా చిత్రాలను కాపీ చేయడానికి ఏర్పాటులు చేసింది. గ్రిఫిత్స్ నాలుగు సీజన్లు (నవంబరు నుండి మార్చి వరకు) తైలవర్ణ చిత్రాలు తయారు చేశాడు. ఈ పని ముగిసిన తరువాత ఈ వర్ణ చిత్రాలను లండన్లో ఉన్న విక్టోరియా అండ్ ఆల్బర్ట్ మ్యూజియంలో ప్రదర్శించారు. ఈ చిత్రకారుడి శ్రమ కూడా నిరర్థకమైపోయింది. 1885లో జరిగిన అగ్నిప్రమాదంలో మ్యూజియం కాలిపోయింది. గ్రిఫిత్స్ తిరిగి అజంతాకు వచ్చాడు. చాలా ముఖ్యమైన చిత్రాలను అతడు కాపీ చేసి, 1896లో తన పని గురించి రెండు సంపుటాలను ప్రచురించాడు. 1908-10 సంవత్సరాలలో, లేడి హారింగ్‌టన్, చాలమంది భారతీయ చిత్రకారుల సహాయంతో, వాటర్ కలర్సులో చిత్రాలు కాపీలు చేసింది.

అయితేనేం కాపీలు చేయడంతో ఆ పని పూర్తికాలేదు. చిత్రాలను పూర్వపుస్థితికి తీర్చడం, శాస్త్రీయ పద్ధతులలో వాటిని రక్షించడం చాల అవసరమయింది.

1918లో, హైదరాబాదు సంస్థానంలో, ఆర్కిలాజికల్ శాఖలో ప్రొఫెసరుగా పనిచేస్తున్న ఘులామ్ యజదాని, బ్రిటిష్ అంబాసడర్ సర్ రెన్నెల్ రాడ్ సహాయంతో చిత్రాలను బాగుచేయడానికి పూనుకొన్నారు. ఇద్దరు ఇటాలియన్ చిత్రోద్ధారకులు, ప్రొఫెసర్‌ సిక్కోని, కౌంట్ ఆర్సెనీ అన్నవారలను హిందూ దేశానికి తెప్పించి, అజంతా గుహలలోని చిత్రాలను పునరుద్ధరించడానికి నియమించారు. ఇటలీదేశపు నిపుణులు అజంతాలో 1920 నుండి 1922 వరకు నివసించి, చాలా చిత్రాలను విజయవంతంగా సరిదిద్దారు. వారు చేయవలసిన పని ప్రత్యేకంగా కష్టతరమైనది. అజంతా గుహలు శతాబ్దాల తరబడి అశ్రద్ధకు లోనయాయి. వాతావరణంలో కలిగే తీవ్రమైన మార్పులకు గురిఅయాయి. అడవిలోని పక్షులు, గబ్బిలాలు మొదలైనవి గూళ్లు కట్టుకున్నాయి. గోడలకు పూసిన సున్నపు పూతలలో కీటకాలు ప్రవేశించి దొలిచివేశాయి. ఇవన్నీ కలిసి చిత్రాలను పాడుచేశాయి. కొన్ని చోట్ల చిత్రం యొక్క రంగుల పొర గోడలపై వేలాడుతూ కనిపించింది. కొద్దిపాటి తాకిడికి అది పడిపోయే స్థితిలో ఉంది.

ఇటాలియన్ చిత్రోద్ధారకులు రంగువేసిన గోడల ఉపరితాలలను కడిగి శుభ్రం చేశారు. కీటకాలు చేసిన గోతులను పూడ్చారు. వదులుగా వేలాడుతున్న రంగుపొరను దృఢంగా రతి గోడకు అతికారు. ఇటాలియన్ల కింద కొంతమంది భారతీయులకు శిక్షణ లభించింది. పై దేశం వారు విడిచిన పనిని మనవాళ్ళు చేపట్టి మిగిలిన చిత్రాలను యథాస్థితికి తెచ్చారు. ప్రొఫెసర్ యజదాని గారు ఆ వర్ణ చిత్రాలకు ఫొటోగ్రాపులు నలుపు, తెలుపు రంగులలో తీయించి వాటిని ప్రచురించారు.

విష్ణుధర్మోత్తరపురాణం పద్దెనిమిది ఉపపురాణాలలో ఒకటి. ఇది 7లేక 8వ శతాబ్దంలో వెలువడింది. ఈ గ్రంథం, అంతకు పూర్వం 4,5 శతాబ్దాలలో గల గ్రంథాలలోని విషయాలను ఆధారంగా తీసుకొని రచింపబడినది. 4,5 వ శతాబ్దాలలో అజంతా గుహలలో జరుగుతున్న చిత్ర లేఖనం అత్యున్నత్త స్థాయికి చేరుకుంది. విష్ణుధర్మోత్తరపురాణంలో గోడలపై చిత్రించిన వర్ణచిత్రాల రచనా పద్ధతి వివరింపబడింది.

ఏ గోడపై చిత్రాన్ని వేయదలచుకున్నారో, దానిని మట్టిలో పూస్తారు. తరువాత దానిపై పలుచగా సున్నపుపూత వేస్తారు. గోడను ఆ విధంగా తయారుచేసి, దాని పైన చిత్రకారుడు బొమ్మ యొక్క బాహ్యరేఖను గీసేవాడు. ఆనాటి చిత్రకారులు, కళాకుశలురు, సిద్ధహస్తులు. సంపూర్ణమైన చిత్రాలలో మానవరూపాలు, జంతువుల ఆకారాలు సహజసుందరంగా ఉంటాయి. చిత్రాలంకరణలో కుంచె చూపిన వివరాలు ప్రశంసనీయాలు. భావంలో స్పష్టత గోచరిస్తుంది. సహజమైన నేపథ్యం కనిపిస్తుంది. నాటకీయత గోచరిస్తుంది. ఇవన్నీ తొలిదశలో రచించిన చిత్రాలలో కనిపిస్తుంది. 10వ చైత్యం యొక్క గోడలు క్రీ.శ.రెండవ శతాబ్దంలో దొలచబడ్డవి. ఆ గోడల మీద షడ్గంత జాతకం రచింపబడింది. అంధులైన తల్లిదండ్రుల జాతకం, శ్యామజాతకం మూడవ శతాబ్దికి చెందినవి. రాజు తన పరివారంతో బోధి వృక్ష పూజకు వెళ్లడం, సంగీతనాట్యాల ప్రదర్శన గల చిత్రాలు క్రీస్తు పూర్వం రెండవ శతాబ్దికి చెందినవి. ఈ చిత్రాలరేఖలు వేలకొలది సంవత్సరాలు రేఖాచిత్రకళలో అనుభవం సంపాదించిన చిత్రకారులవి. వర్ణచిత్రాలు రచించడానికి ముందు, అజంతా చిత్రకారులు రేఖాచిత్రాల చిత్రణలో అద్వితీయమైన అనుభవం గడించినవారు. అట్టుపిమ్మటే వర్ణచిత్రాలను చిత్రించినవారు. తొలిదశలో వారికి అందుబాటులో నున్న వర్ణాలు చాలా పరిమితమైనవి. జేగురు రంగు, పసుపు రంగు, దీపపు మసి, తెల్ల సున్నం అన్నవి మూలమైన రంగులు. వీటిని స్వచ్ఛంగా గాని, మేళనం చేసికాని వారు ఉపయోగించి తాము కోరిన వర్ణచ్ఛాయను తయారు చేశారు. తొలిదశలో రంగులు పేలవంగా ఉండేవి. గాఢంగా ఉంటే లోతు తెలిసేది తరువాత కాలంలో వచ్చిన చిత్రాలలో ఈ ప్రత్యేకత కనిపిస్తుంది.

రెండవ విహారంలోను పదిహేడవ విహారంలోను పగటి వెలుగు బాగా వస్తుంది. అందులో మిశ్రమం చేయని రంగులు వాడారు. వాటిలో చాలా నీలి రంగు ఛాయలు కనిపిస్తాయి. పదిహేను శతాబ్దాలు గడిచినా, నీలిరంగు తాజాగా నేటికి కనిపిస్తుంది. దక్కను పీఠభూమిలో ఇంద్రనీల మణిపూసలు దొరికేవి. వాటిని చూర్ణం చేసి నీలిమందు రంగును తయారు చేసినట్లు తెలుస్తుంది. 3వ శతాబ్దికి ముందు రచించిన చిత్రాలలో, నీలిరంగు కనిపించనే కనిపించదు. ఈ చిత్రాలను సాంకేతిక, దృష్టితో పరిశీలిస్తే గాఢమైన గోధుమరంగు వేసిన మానవ మూర్తుల నాసికలు, చుబుకాలు కాంతివంతంగా స్పష్టంగా కనిపిస్తాయి. ఈ స్థలాలలో రంగు కొంతమేర తుడిచి వేయడం వల్ల ఇటువంటి ప్రత్యేకత కలిగిందని తొలుత భావించారు. బాగా పరిశీలన చేస్తే, తేలికయైన పసుపురంగును గాఢమైన గోధుమరంగుపై వేయడంతో ఈ కాంతి కనిపించిందని తెలుసుకున్నారు. కొన్ని చిత్రలలో కనురెప్పల కింద నీలపు రంగు ఛాయలను వేయడంతో కళ్లు చాలా బాగా కనిపిస్తున్నవి. తేలికరంగులలో వేసిన బొమ్మల వెనుక గాడమైన రంగు వేయడంతో బొమ్మలు చక్కగా కనిపిస్తాయి. ఒకొక్కప్పుడు నేపథ్యంలో నలుపు చుక్కలు పెట్టి ఇటువంటి స్పష్టతను కల్పించారు.

గోడల మీద జాతక కథలు చిత్రించారు. కథలో భిన్న భిన్న ఘట్టాలను వేరుచేయడానికి ఎరుపు పట్టీలు, ఆకుపచ్చ పట్టీలు, నిలువుగా, అడ్డంగా వేశారు. మానవుల చిత్రాలు వేసినపుడు, అరణ్యాలలో నివసిందే జనానికి ఆకుపచ్చ రంగు వేశారు. కొండలను వేసినప్పుడు త్రిభుజాలను గీశారు. మేఘాలను చిత్రించినప్పుడు నీలిరంగులను వేశారు.

ప్రముఖమైన వ్యక్తుల చిత్రాలు, మిగిలిన సాధారణమైనవారి చిత్రాలకన్నా పెద్దవిగా చిత్రించారు. ఆ  విధంగా పెద్దబొమ్మలు గొప్పవారివని భావించాలి.

అజంతా చిత్రకళ విధిగా మతసంబంధమైనది. ప్రజ్ఞావంతులైన కళాకారులతో పాటు బౌద్ధభిక్షువులు కూడా కుంచెపట్టినట్లు కొన్ని చిత్రాలబట్టి తెలుస్తుంది. బౌద్ధభిక్షువులు చిత్రకళయందు ప్రారంభకులు. బుద్ధునికి బదులు బోధి వృక్షము, బుద్ధపాదాలు మొదలైనవి వీరు చిత్రించారు.

చిత్రాల రంగులు చెరిగిపోకుండా వాటిపై వృక్షాల నుండి వచ్చిన బంకలు మొదలైనవి ఉపయోగించారు. రంగువేసిన పొర చాలా పలుచనది. రమారమి పదిహేను శతాబ్దాలు గాలికి వానకు ఆ పొర బలి అయింది. మారేడు పండు గుజురు, చెట్ల బంకుల ఎనుబోతుల చర్మంనుండి తయారయిన బంక వారు ఉపయోగించారు. శతాబ్దాల తరబడి ఎండకు, తేమగాలికి ఈ చిత్రాలు బలి అయినా, గోడలమీద, పైకప్పుల మీద వేసిన చిత్రాలరంగులు కొన్ని విహారాలలో ఈనాటికి కూడా తాజగా కనిపిస్తున్నాయి. 4,5వ శతాబ్దాలలో పలు రంగులు ఉపయోగించారు. వాటిలో నీలం, సిందూరపు రంగులు ముఖ్యమైనవి. ఈ రంగులు మెరుస్తూ ఈనాటికి తాజాగా కనిపిస్తాయి. ఈ శతాబ్దులలో వచ్చిన రేఖా చిత్రాలు, విషయమై వైవిధ్యం గల చిత్రాలు చాల చక్కనివి. మానవరూపాల హావభావప్రదర్శన నిజాయితీగా కనిపిస్తుంది. రూపరేఖల సౌందర్యాన్ని అతిశయింపజేయడానికి, మతపరమైన అర్హతను ప్రదర్శించడానికి, మానసికమైన ఉద్వేగాన్ని తెలియజేయడానికి, కాంతివంతమైన రంగులను ఉపయోగించారు.

క్రీ.పూ. ఒకటి, రెండవ శతాబ్దాలకు చెందిన చిత్రాలు తొమ్మిదవ చైత్యంలో లభిస్తాయి. ఆనాటి చిత్రకారులు అడవి జంతువులను చాల ప్రత్యేకంగా పరిశీలన చేశారు. వాటి చలనాన్ని శారీరకమైన బిగువుదనాన్ని, కథా విషయాన్ని అనుసరించి వాళ్లు చిత్రించారు. మానవ శరీరం ఎటువంటి భంగిమలోనున్నా చిత్రించే సామర్థ్యం వీరికుంది.

తొమ్మిదవ చైత్యంలో రేఖాచిత్రాలను గీసే నైపుణ్యం మానవుల ఉద్రేకాలను ఉత్సాహాలను చిత్రించే నేర్పు, ప్రకృతిపై గల అభిమానం ప్రస్ఫుటమౌతుంది.

మూడవ శతాబ్దానికి చెందిన శ్యామజాతకం ఈ చైత్యం గోడలమీద ఉంది.

రెండవ చిత్రం షడ్డంత జాతకానికి చెందినది. తామరపూల కొలను, పూతలోనున్న సాలవృక్షము, ఏనుగు యొక్క విలక్షణమైన చలనం, వివిధమైన మానసిక స్థితులలో తొండాన్ని ఎత్తడం, ఆడించడం చాల నిజాయితీతో చిత్రించారు, మహత్తరంగా ఈ సన్నివేశాన్ని ఆలోచించి చిత్రించారు.

మహాగజం స్నానం చేసే దృశ్యం, రాజభవన దృశ్యం, రాణి వివిధమైలైన మానసిక స్థితులలో ఉండడం చిత్రించారు.

మహాగజం యొక్క దంతాలను చూసి రాణి మూర్ఛపోతుంది. రాజు ఆమెను పట్టుకుంటాడు, పడిపోకుండా ఒక చేతితో ఆమె వీపును పట్టుకుంటాడు. రెండవ చేతితో ఆమె కుడి భుజాన్ని గ్రహిస్తాడు. ఒక పరిచారిక ఆమెకు విసురుతుంది. మరొకతె ఆమె ముఖం మీద నీటిని చల్లుతుంది. రాణికి సమీపంలో ఉన్న మూడవ పరిచారిక ఆమెకు పానీయాన్ని అందిస్తుంది.

వేరొకతె, భూమి మీద మోకాళ్ళపై కూర్చొని రాణి యొక్క అరిపాదాలను రాస్తూ తెలివి తెప్పించడానికి ప్రయత్నిస్తుంది. ఈ చిత్రం యొక్క నిర్మాణం అద్భుతమైనది, సహజమైన భంగిమలు చిత్రంలోని వ్యక్తులు ధరించిన దుస్తులు చాల తక్కువ కాని రమ్యంగా ఉన్నాయి. నగలు, ఆభరణాలు పాతకాలానికి చెందినవి. పూసల పేర్లు తల చుట్టూ, నడుం చుట్టూ కనిపిస్తాయి. గుండెమీద బంగారవు హరాలు, పురుషుల భుజాలకు, స్త్రీల భుజాలకు బరువైన భుజకీర్తులు, చేతులకు కంకణాలు, స్త్రీల పాదాలను గజ్జల పట్టీలు అలంకరిస్తాయి. శరీరాభాగాలను, విలాసవంతమైన శరీరాన్ని రేఖలలో చిత్రించడంలో కళాకారులు దివ్యమైన కౌశలాన్ని చూపించారు. ఎరుపు, పసుపుపచ్చ, నీలి రంగు, సున్నపు తెలుపు, దీవపుమసిని ఉపయోగించారు.

దక్కను పీఠభూమిని ఆంధ్రుల తరువాత వాకాటులు పాలించారు. వారి పరిపాలన 3వ శతాబ్దినుండి మొదలవుతుంది. వాకాటక రాజులు, వారి అమాత్యులు బౌద్ధ మతాభిమానులు, కళాపోషకులు. చాలామంది యాత్రికులు ఉత్తరభారతం నుండి అజంతాను దర్శించారు. అజంతాలో 4 లేక 5 వ శతాబ్దుల నాటి శాసనాల బట్టి అజంతాను దర్శించిన యాత్రికలు వివరాలున్నాయి. అజంతా చిత్రాలలో, దక్షిణ భారతం నుండి వచ్చిన అటవికులు సకృతంగా చిత్రింపబడ్డారు. చిత్రాలలో భారతదేశపు ఇతరభాగాల ప్రజల దుస్తులు, వైఖరి ప్రదర్శించబడ్డాయి. దక్షిణ ఆసియా, మధ్య ఆసియా నుండి వచ్చినవారు, చీనాదేశం నుండి వచ్చినవారు చిత్రాలలో కనిపిస్తారు.

భిన్నమైన సామాజికమైన తరగతులకు చెందినవారు, భిన్నమైన కళలను, చేతిపనులను అభ్యసించేవారు అయిన విదేశీయులతో అజంతా కళాకారులకు సంపర్కం కలిగింది. భిన్నమైన మతాలు, భిన్నమైన విహారాలలో జీవితం కల యాత్రికుల పరిచయంతో అజంతా చిత్రాకారుల దృక్పథంలో చాలా మార్పు వచ్చింది. నిరాడంబరంగా చిత్రించడానికి బదులు విలాసవంతమైన జీవితాన్ని వాళ్లు చిత్రించారు. చిత్ర రచనలో అవలంబించవలసిన కఠోర నియమాలు వెనుకబడి సంపూర్ణమైన నిర్మాణం జరిగింది. ఏదో ఒక ప్రాంతానికి చెందినవారిని చిత్రించడానికి బదులు విశ్వజనీనత వాటిలో కనిపించింది. 4, 5 శతాబ్దులలో వచ్చిన చిత్రాలలో మానవ జీవితం యొక్క క్రమం చాలా ఐశ్వర్య సూచకంగా వివిధ స్థితులకు చెందినదిగా కనిపిస్తుంది. రాజుల అభ్యంతర మందిరాలలో మెరుగులు తీరిన సింహాసనాలు, ముత్యాలు అంచులకు కుట్టిన తెరలు, కనిపిస్తాయి. రాజపుత్రులు, రాజపుత్రికలు ధగధ్ధగాయమానమైన ఆభరణాలను, చాల విలువ చేసే పట్టుబట్టలను వెండి, బంగారు జరాతలు, అద్భుతమైన అలంకారాలు అంచులు గలవి, చిత్రాలలో చూస్తాము. వాద్యసంగీతపు సభలు, జంతువుల పోరాటాలు, వేట ఏర్పాటులు, గుర్రపు రౌతులు, గజారోహకులు, పదాతులు, సైన్యాల పురోగమనం, రణరంగంలో కనిపించే భీకరహింస కల్లోలం ఇవన్నీ చాల స్పష్టంగా చిత్రింపబడ్డాయి కాని, ఈ చిత్రాలను పరికించి చూస్తే, అవన్ని బౌద్ధానికి సహజమైన కరుణ ప్రతిచిత్రంలోను కనబడుతుంది. సృష్టిలో గల ప్రతిదశపైన అపారమైన ప్రేమ కనబడుతుంది. ఈ ప్రేమ మానవుల పైన, జంతువుల పైననే కాకుండా సరీసృపాల పైన కూడా కనిపిస్తుంది. బీదవారి పట్ల ఔదార్యము, ఆత్మత్యాగం చేసి అయినా ఇతరులపైన దయ చూపడం, అణగదొక్కబడిన వారి పట్ల సానుభూతి, తాత్కాలికమైన విషయసుఖాల వలన కలిగే ఉద్రేకతలను సంపూర్ణంగా అదుపులో ఉంచడం ఇవన్నీ ఈ చిత్రాలలో గోచరిస్తాయి.

అజంతా వర్ణచిత్రాలలో ఉత్తమమైనవి ఒకటవ విహారంలోను, పదిహేడవ విహారంలోను ఉన్నాయి. ఈ రెండు విహారాలు 5వ శతాబ్ది చివరికాలంలో నిర్మింపబడ్డాయి. వాకాటకుల పరిపాలననాటివని.

మొదటి విహారంలో రచింపబడిన బోధిసత్వ పద్మపాణి చిత్రం దివ్యమైనది. ఈ చిత్రంలో మధ్యనున్న మూర్తి, బ్రహ్మండమైన కొలతలు కలిగి ఉంది. ఆ రూపంలో ఉన్నతవంత లక్షణాలు, గొప్ప ఆధ్యాత్మికమైన ఔన్నత్యం యొక్క లక్షణాలు కనిపిస్తాయి. ఆ భావప్రదర్శన అనన్య సమాన్యమై అత్యుత్తమస్థితికి చెందినది. ఆ భావంలో, జీవితంలో గల ఆనందంతోకాని, దుఃఖంతో కాని కలవరపడని పరమశాంతం గోచరిస్తుంది. చిత్రరచనా విధానం చాల జటిలమైనది. రాజపుత్రుడిని సభికుల మధ్య, ఉన్నతవంశానికి చెందిన మహిళల మధ్య, రాజభటుల మధ్య చిత్రకారుడుంచాడు. కాని రాజకుమారుడి ముఖంమీద తోచే ప్రసన్నత, చక్షువులలో తోచే ధ్యాననిమగ్నత చూపరుల హృదయాలలో ఒక స్పష్టమైన అవగాహన కలిగిస్తాయి. భౌతికంగా రాజపుత్రుడు ప్రపంచంలో చుట్టబడినా, ఆద్యాత్మికంగా అతడు దేనికి అంటనివాడై స్వేచ్చగా కనిపిస్తాడు.

రాజపుత్రుడి శరీరసౌష్టవం ప్రత్యేకమైన సౌందర్యం కలది. విశాలమైన వక్షం, పరిపుష్టిగా పెరిగిన భుజాలు, చేతులు బాగా అమరిన శిరస్సు, మెడ ఇవన్నీ చెప్పుకోదగిన చక్కదనం కలవి. రాజపుత్రుడు ధరించిన దుస్తులు చాల తక్కువ. శరీరం యొక్క దిగువ భాగాన్ని కప్పేది పట్టుబట్ట, వేరు వేరు రంగుల గళ్లు కలది రత్నాలు తాపిన బంగారు కిరీటం రాజపుత్రుని గౌరవాన్ని ఎత్తి చూపుతున్నది. ముత్యాల హారం, చెవి చుట్లు పెద్దవి, భుజకీర్తులు, కంకణాలు వీటన్నిటినని మించి ముత్యాలసరాలతో భుజం నుండి నడుము వరకు వేలాడే యజ్ఞోపవీతం ఇవన్నీ అతని శోభను పెంపొందిస్తున్నాయి. బుజాలపై వేలాడుతున్న నల్లటి మెత్తటి జుత్తు, నేపథ్యానికి భిన్నమైన వర్ణంలో, శిరసును ఉన్నతంగా చూపుతుంది. అంతేకాక, గాఢమైన ఆకుపచ్చరంగు గల చుక్కలు, దగ్గరదగ్గరగా ఉండి, బంగారపు కిరీటం వెనుక రచింపబడి, దృష్టిని ఆకట్టుకుంటాయి. శరీరం యొక్క ముఖ్య భాగానికి తేలిక రంగులు వేసి, బాహ్యరేఖకు దట్టమైన రంగులువేశారు. దీనివలన చిత్రం దివ్యమైన ఆకృతిలో దర్శనమిస్తుంది.

రాజపుత్రుని ప్రధాన లక్షణాలు – ఆర్యజాతిలో ఉత్తమ వంశంలో జన్మించడం వేరువేరు తెగలకు చెందిన పరిచారకులు వీరు వేరు వేరు శరీర ఛాయలలోను, భిన్నమైన దుస్తులలోను ఉండడం పరిచారిక నీలి ముఖమల్ అంగీని, జరీపని చేసిన కుళ్లాయిని ధరించడం బహుశా ఈమె పెర్షియన్ మహిళ కావచ్చు. ఖడ్గాన్ని పైకితీసి నిలుచున్న అంగరక్షకుడు ఇతడు చాల నల్లటివాడు. బిరుసైన శరీరావయాలు కలవాడు. బహుశా నీగ్రో జాతికి చెందినవాడు.

రాజపుత్రుని భార్య అతనికి ఎడంచేతి వేపున ఉంది. రాజపుత్రుడి శరీరవర్ణంతో పోలిస్తే ఈమె నల్లగా కనిపిస్తుంది. బౌద్ధమతం, జాతులకు దేశాలకు అతీతమైనదని, విశ్వజనీనమైనదని చెప్పడానికి చిత్రకారుడు ప్రయత్నిస్తాడు. చిత్రం యొక్క నేపథ్యంలో పావురాళ్ళు, నెమళ్ళు, కోతులు, సింహమొకటి, కొంతమంది కిన్నరులు, మరికొన్ని ప్రాణులు ఇవన్నీరాజపుత్రుడు సర్వసంగ పరిత్యాగం చేయడానికి నిర్ణయించడంలో చాల ఆనందాన్ని వెలిబుస్తున్నాయి. ఈ ఆనందానికి భిన్నంగా పరిచారకుల ముఖాలలో రాజపుత్రుని యందుగల ప్రేమ, అతడు ఎడమౌతున్నందుకు కలిగిన బాధ స్పష్టంగా కనిపిస్తాయి.

కొండలను ఎర్రరంగులోను, చెట్లు, మొక్కలు, పాదలు మొదలైనవి ఆకుపచ్చరంగులోను చిత్రింపబడ్డవి. మానవ ముఖాలమీద అక్కడక్కడ నీలపు ఛెళకులు, నల్లటి ముఖాలమీద ముత్యపు పాడుల తళతళలు ఆ చిత్రాల సౌందర్యాన్ని ఇనుమడింపజేస్తున్నవి. రాజకుమారుని భృకుటిమీద, నాసికమీద, చుబుకం మీద కాంతిరేఖలు, ప్రసన్నతా భావాన్ని పెంపొందింపజేస్తున్నాయి. ఈ భిత్తికా చిత్రం భారతీయ వర్ణచిత్రాలలో ఉత్తమ కళాఖండంగా పరిగణిపంబడుతున్నది. బౌద్ధమతం దృష్ట్యాగాని, కళాదృష్ట్యాగాని ఇది ఉత్తమోత్తమమైనది.

పదిహేడవ విహారంలో గౌతముడు కపిలవస్తువుకు తిరిగి వచ్చిన దృశ్యం చిత్రింపబడింది. ఈరచనలో బుద్దుడి చిత్రం చాల పెద్దది, యశోధర రూపం చిన్నది.

బాహ్యరేఖ, భుజాల వంపులు, బాహువుల వంవులు, అరచేతుల వంపులు మేరకే పరిమితమై ఉంది. రంగులలో వైవిధ్యం కూడా హెచ్చుగా లేదు. కాని, రేఖాచిత్రము, వర్ణము చాలచక్కని అభిరుచిని వ్యక్తం చేస్తాయి.

బుద్దుడు కాషాయపురంగు అంగీని ధరించాడు. అతని చేతిలో ఆకుపచ్చని రంగుగల బిక్షాపాత్ర ఉంది. దానినతడు యశోధర వేపు చాచాడు. ఆమె ప్రేమతో, బిడ్డను బుద్దుని వేపు తోసి ఆశీర్వచనాలను అర్ధిస్తుంది. ఆమె ముఖంలో ప్రేమభావాలు, భక్తిభావాలు ముసురుకుంటాయి. ఒకప్పుడు తన పురుషుడైనవాడు నేడు మహాపురుషుడై ఆమె ఎదుట నిలబడ్డాడు. బుద్దుని శిరస్సు యశోధరవేపు శిశువు వేపు వాలి ఉంది. బిడ్డడు చేతులు తండ్రివేపు చాచి, తనని అతడు ఎత్తుకుంటాడని ఎదురు చూస్తాడు.

యశోధర యొక్క శరీరభాగాలను లయాత్మకంగా చిత్రకారుడు రచించాడు. విలాసవంతమైన భంగిమ, చెంపలమీద వంపులు దేరిన కురులు, ఆమె భుజాల వరకు వాలాయి. ఆమె శరీర వర్ణం కెంపు, తెలుపురంగుల మిశ్రమం, ఆమె దుస్తులు తేలిక రంగులో ఉన్నాయి. ఆమె ఆభరణాలు ముత్యాలు పొదిగినవి, చేతులకు చాల మురుగులున్నాయి.

అయిదవ శతాబ్దానికి చెందిన మరొక చిత్రము సింహళ అవదానము. ఇది చాల పెద్దరచన. చాల దృశ్యాల కింది విభజింపబడింది. నౌకా భంగం, సింహళ సైన్యాలకు రాక్షసి యొక్క పరివారానికి మధ్య యుద్ధం. ఆ రాక్షసి ఒక ద్వీపంలో నివసిస్తూ ఉండేది. ఆ ద్వీపం మీదనే సింహళ నౌక భగ్నమయింది. యుద్ధ దృశ్యం భయంకరంగా ఉంటుంది.

సేనాగమనాన్ని సూచించే మరొక చిత్రం ఆనాటి చిత్రాలలో సర్వశ్రేష్టమైనదిగా పరిగణింపబడింది. ఇది సమిష్టి చిత్రం. ఆ చిత్రంలోని ఏనుగులు, కుంచెలతో వేయబడినట్లు కాక, ఉబ్బెత్తు కుడ్య శిల్పాలవలె కనిపిస్తాయి.

నాలుగు, అయిదు శతాబ్దాలలో చిత్రించిన ఉత్తమచిత్రాలలో స్త్రీ రూపం సౌందర్యానికి ప్రతీకగా అజంతా చిత్రాకారులు భావించారు. ఆమె రూపాన్ని చాల సొగుసుగా వివిధ భంగిమలలో చూపించారు. తరచు స్త్రీ మూర్తులను పలుచని దుస్తులలో రచించారు. ఆ దుస్తులు శరీరానికి అంటుకొని ఆమె శరీరభాగాల చక్కదనం ప్రస్ఫుటమవుతుంది. చిత్రకారులు ఇంతవరకు చొరవ తీసుకున్నారు. కాని స్త్రీని మాత్రం నగ్నంగా వారు రచించలేదు. ఈ చిత్రాలలో స్త్రీమూర్తి రాజపుత్రికగానో, పరిచారికగానో, పల్లెటూరి పడుచుగానో, భిక్షుణిగానో, లేక నాట్యకత్తెగానో రచింపబడింది. కాని ఎక్కడ కూడా హీనంగాగాని, దయనీయంగా గాని చిత్రించలేదు. అందుకు భిన్నంగా, స్త్రీ మూర్తి ఎప్పుడూ ప్రశంసింపదగినదిగాను, ఆరాధింపదగినదిగాను చిత్రింపబడింది.

ఒకటవ విహారంలో సంఖపాల జాతక చిత్రముంది. అందులో ఒక పల్లెటూరి వనిత బోధిసత్వుని చేస్తున్నట్లు చిత్రింపబడింది. విహారం యొక్క ఎడమ వరుసలో ఆ చిత్రముంది. భారతీయ మహిళ, గ్రామాలకు చెందినది, కాళ్లు ముడుచుకొని కూర్చుంది. ఆమె తన ఎడమ చేతిని నేలపై ఉంచి శరీరానికి ఊతనిస్తుంది. కుడిచేతిలో శిరసును మోపింది. బుద్ధుడు చేస్తున్న ధర్మోపదేశంపై ఆమె మనస్సు లగ్నమై ఉంది. చిత్రంలో శిరసును, మిగిలిన శరీరభాగాలను సరియైన తూకంలో రచించడం వలన, మృదువైన అంగాలను సూచించడమే కాకుండా సంతుష్టమైన మనసును, పద్ధతిని సూచిస్తున్నాయి. ఆమె ధరించిన దుస్తులు ఏ రంగులు లేనివి. ఆమె వీపు మాత్రం చూపరులకు కనిపిస్తుంది. వక్షభాగంపై వస్త్రం లేనట్లు తెలుస్తుంది.

ఒకటవ విహారం 5వ శతాబ్దంలో నిర్మింపబడింది. దానిలో అత్యంత సుందరమైన స్త్రీరూపం చాలచోట్ల రచించబడింది. పదవులలోనున్న కుటుంబాలకు చెందిన స్త్రీలు చిత్రింపబడ్డారు.

‘రాజభవన ద్వారం దగ్గర బౌద్ధ భిక్షువు’ అన్న చిత్రం మనసును కలవర పెడుతుంది. రాజపుత్రిముఖంలో విచారం నిండి ఉంటుంది.

ఒకటవ విహారం 5వ శతాబ్ది చివరిభాగంలో దొలచబడింది. చిత్రరచన జరిగింది. స్త్రీ సౌందర్యం విలక్షణంగా రచింపబడింది. ఉన్నతాధికారుల కుటుంబాలకు చెందిన మహిళలు ధరించిన దుస్తులను, ఆభరణాలను అజంతా చిత్రకారులు అద్భుతంగా చిత్రించారు. అజంతా చిత్రకారులు రాజకుటుంబాలతో పరిచయమున్నవారిగా తోస్తుంది. అంతేకాక, కావ్యాలలోను రసాల గురించి కూడా వారికి తెలుసు.

కాళిదాసు ఆ కాలంవాడని కొందరంటారు.

పై చిత్రాలలో స్త్రీలు యౌవనంలోనున్నవారు. వాళ్ల విలాసవంతమై ఆకారాలు ఆనాటి కావ్యాలలో వర్ణింపబడ్డాయి.

‘రాజభవన ద్వారం దగ్గర నిలుచున్న భిక్షువు’ ఈ చిత్రంలో రాజపుత్రి ముఖం నిండు విచారాన్ని సూచిస్తుంది. ఈ విచారాన్ని బాగా ప్రదర్శించడానికి, చిత్రకారుడు ఆమె రూపురేఖలలో యౌవనం ద్యోతకమైనట్లు చేశాడు. ఉన్నతమైన వక్షం, చక్కని వంపులు తిరిగిన బాహువు, క్రమంగా సన్నగిల్లిన చేతివేళ్లు, భుజాలమీద పడుతున్న పాడవుజుత్తు ఆమెలోని యౌవనాన్ని విశదీకరిస్తాయి.

స్త్రీమూర్తులను ఒకచోట చేర్చడం చాల రమ్యంగా కనిపిస్తుంది. భిన్నమైన కేశాలంకరణ, చాలచక్కని ముత్యాల ఆభరణాలు, విలువైన దుస్తులు బాలికల విషయంలో ఈ దుస్తులు పారదర్శకమైనవి. అన్నిటికన్న ముఖ్యమైనది అందరి ముఖాలలోను గోచరించే విచారం కళాత్మకంగా అత్యుత్తమశ్రేణికి చెందుతుంది.

వీటన్నిటికంటే ఆసక్తికరమైనది ‘రాజపుత్రి కృష్ణవర్ణ’. ఈ చిత్రం విహారం యొక్క వెనుక గోడమీద రచింపబడింది. ఆమె శరీరరేఖలు ఆమె యౌవనాన్ని సూచిస్తాయి. ఆమె కళ్ల యొక్క రచన, చిన్నగోధుమరంగు కనుపాపలతోను, చివరలు చిన్న ఎరుపుతోను, సహజంగా గోచరిస్తాయి. చెంపలమీద, మెడపైన చేసిన కుంచెపని చాల ఆలోచించి చేసిన రచన. ఆమె ధరించిన ఆభరణాలు చక్కని నగిషీతో చేసినవి. ముత్యాల కిరీటము, దాని మధ్యభాగంలో ఇంద్రనీలమణి, చాల ఆకర్షణీయంగా కనిపిస్తాయి. రాజపుత్రి నిలుచున్న భంగిమ, ఉత్కృష్టమైన అలంకరణ, శాంతంగా కనిపించే భావం అన్నీ కలిసి, ఈ చిత్రం, అజంతాలో చిత్రించిన స్త్రీ రూపాలలో మహాకౌశలంతో రచించినదిగా తెలుస్తుంది.

రెండవ విహారం, ఏడవ విహారంలోని చిత్రాలు, ఒకటవ విహారంలోని చిత్రాలకు సమకాలీనమైనవి. ఈ చిత్రాలలో కూడా స్త్రీల రూపాలలో సొగసులు గుబాళిస్తాయి. వీటిలో మాయాదేవి చిత్రం ప్రత్యేకంగా పేర్కొనదగినది. రెండవ విహారంలోనిది ఈ చిత్రం. బుద్ధుడి జననం ప్రదర్శించే ఈ చిత్రంలో మాయాదేవి ఒక స్తంభంపై అనినట్లుంది. ఈ వర్ణచిత్ర రచనలో చిత్రకారుడు ఆదర్శప్రాయమైన సౌందర్య చింతనతో పరవశించి వాస్తవిక రూవం గురించి శ్రద్ధ తీసుకోలేదు. భారతీయ చిత్రకళలో ఇది ఒక అపురూపమైన రచన. చక్కగా ఊహించిన రచన సమగ్రమైన శిల్పవైశిష్ట్యము. ఉత్తమశ్రేణిలో జరిగిన అలంకరణ తల కొంచెం వంగి, భుజాల వంపులు, నడుము యొక్క వంపులతో మేళవించి విలాసవంతమైన భంగిమను మనకు అందిస్తాయి. నల్లటికురులు, ముత్యాలసరాలు మృదువైన గోధుమరంగు శరీరానికి కాంతిని, శోభను సమకూర్చుతాయి.

ఆ విహారంలోనే మరొక సుందరమైన రచన ఉంది. యక్షరాజపుత్రుడు పూర్ణకుడికి, ఇరందతికి గల రహస్య ప్రేమ ఈ చిత్రమందు కనిపిస్తుంది. ఇరందతి నాగరాజు కూతురు. తొలుత ఈమె ఊయలలో ఉన్నట్లు చూపబడింది. తరువాత ఊయలరాటకు ఈమె ఆనుకొని, సిగ్గుతో పూర్ణకుడితో సంభాషిస్తున్నది. ఆమె వాక్కులు మధురాతి మధురములు. ఆ పలుకులకు రాజపుత్రుడు సమ్మోహితుడై, తానామెను వివాహమాడదలచినట్లు చెప్తాడు. ఇరందతి రాజవంశానికి చెందినది. స్త్రీ సహజమైన లజ్జ, తన గౌరవస్థితికి తగిన సంయమనం ఆమె ముఖంలో గోచరిస్తాయి. భారతీయ చిత్రకళా సూత్రాలను ఎరిగిన చిత్రకారుడు ఆమె హృదయంలో రాజకుమారునిపై జనించిన ప్రేమకు చిహ్నంగా ఆమె ముఖంలో ఆధ్యాత్మిక భావకాంతులను చూపిస్తాడు. సాంకేతింగా, ఫాలం మీద, నాసిక మీద, పెదవుల మీద, చుబుకం మీద కాంతులను ప్రసరింపజేసి ఈ ప్రేమభావాన్ని చిత్రకారుడు నిరూపిస్తాడు. పూర్ణకుని ముఖం మీద కూడా ఇటువంటి శృంగార భావన గోచరిస్తుంది. కాని అతని చేతివేళ్లు, నాట్యముద్రననుసరించి అతని కోరిక ఫలించదేమోనని సూచిస్తున్నవి.

రెండవ విహారం నుండి పదిహేడవ విహారానికి పోతే అక్కడక్కడ స్త్రీ సౌందర్యం ఉత్తమంగా ప్రదర్శింపబడినట్లు అవగతమవుతుంది. రాజకుమారుడు విశ్వంతరుడు, తాను దేశం నుండి బహిష్కరింపబడిన వార్తను తన పత్ని మాద్రికి తెలిపే దృశ్యమది. మాద్రి యొక్క ముఖం, ఆమె శరీరం, ఉత్తమోత్తమ కళా సూత్రాలననుసరించి రచింపబడినవి. ఆమె మృగనయని, చక్కని నాసిక, పూర్ణకుంభపయోధరాలు, సన్నని నడుము, మృదువైన బాహువులు, క్రమంగా సన్నగిల్లిన సున్నితమైన చేతివేళ్లు ఇవన్నీ కావ్యగత సౌందర్యానికి ప్రతీకలు. మాద్రిలో గల యౌవనావిర్భావాన్ని, విచారగ్రస్తమైన ఆమె మనసు అదుపులో నుంచినట్లు ఆమె కళ్లలో ద్యోతకమవుతుంది.

పై దృశ్యంతో సమానమైనది మరొక చిత్రం – ప్రసాధన దృశ్యం దాని పేరు. ముందు వసారాకు, కుడివేపు వసారాకు మధ్యను చిత్రించినది. ఈ చిత్రం యొక్క రంగులు వెలిసిపోవడం చేత, ముఖరేఖల సౌందర్యాన్ని పూర్తిగా ప్రశంసించడానికి అవకాశం లేదు. శరీరరేఖలు, దుస్తులరేఖలు యధాతథంగా ఉన్నాయి. కళయందు ఉన్నతమైన అభిప్రాయం, రచనాకౌశలం ఈ చిత్రంలో కనిపిస్తాయి. ఈ దృశ్యంలో గల నలుగురు వ్యక్తుల రూపాలు సొగసుగా ఉన్నాయి. వాటినన్నింటిలోను, రాజకుమారికి ఎడమవేపునగల చామరగ్రాహిక చాలా సుందరంగా సహజంగా కనిపిస్తుంది. ఆమె చామరాన్ని కలవరపాటు లేకుండా పట్టుకుంది. శిరసును లలితంగా తిప్పి సహజసుందరంగా చుట్టూ చూస్తున్నది. ఆమె ఎడమ ముడుకు వంగి, ఎడమచేతి మణము కొంచెం లేచింది. కాలివ్రేళ్లు మాత్రమే నేలను తగులుతున్నాయి. ఈ భంగిమ హృదయాహ్లాదకరమైన శరీరరేఖను, కంపించేదాన్ని, మనకు ప్రసాదిస్తుంది. ఈ చిత్రం యొక్క ప్రత్యేకత ఏమంటే వెలుగు – నీడలను సమర్థవంతంగా రచించడం గులాబి రంగు గల పర్వతశ్రేణుల పైన, గాఢమైన హరితవర్గం గల మామిడిచెట్లపైన కుంచెతో కాంతులను జిమ్మడం వలన వెలుగు నీడల భ్రాంతి బాగా కలుగుతుంది.

అయిదవ శతాబ్దికి చెందిన చిత్రకారులు చిత్రాలంకరణ విషయంలో అవధులు దాటి పోయారు. పైకప్పుల మీద, గోడలమీద, తలుపుల మీద, కిటికీ చట్రాలమీద, స్తంభాల అడుగుభాగాలమీద పైభాగాల మీద ఒక్క అంగుళం మేర కూడా విడిచి పెట్టకుండా చిత్రాలంకరణ చేశారు. మానవరూపాలు, విపరీతమైన రూపాలు కల అర్ధమానవులు, వింతవింత దుస్తులతో చక్కగా అలంకరింపబడి, నాట్యం చేస్తూ, చేతులతో చప్పట్లు చరుస్తూ, లేకపోతే పెద్ద పానపాత్రల నుండి మధువును చప్పరిస్తూ, వాళ్ల పొడవాటి నాసికలు మధువులో మునుగుతూ ఆ చిత్రాలలో కనిపిస్తాయి. పక్షులు, జంతువులు నయనాందకరమైన పద్ధతులలో అలంకరణకు ఉపయోగింపబడ్డాయి. కొన్ని భంగిమలు హాస్య జనకములై ఉన్నాయి. ఈ పశుపక్షులు సుఖంగా సర్దుకుంటున్నాయి. క్రీడిస్తున్నాయి. సరసాలాడుతున్నాయి. అందమైన గుబురులలో మనసుకువచ్చిన ఫలాలు, పుష్పాలు అమరి ఉన్నాయి. ఆభరణాలు రేఖాగణిత పద్ధతులలో అందంగా తీర్చబడ్డాయి. స్వస్తిక వంటి చిహ్నాలు నిరవధికంగా చిత్రించబడ్డాయి.

పదిహేడవ విహారంలో ఒక హాస్య చిత్రముంది. పేరాశ గల బ్రాహ్మణుడి చిత్రమది. అతని రూపురేఖలు అసహ్యకరమైనవి. మేకగెడ్డం వంటి గెడ్డం, విరిగిన పళ్లు, బట్టతల మీద కొద్దిగా వెంట్రుకలు, అతి వినయంగా కనిపించే ప్రవర్తన.

అంతేకాక మరుగుజ్జుల చిత్రాలు కూడా ఈ కోవకు చెందినవే.

మారుడి సైన్యం కూడా హాస్యాస్పదంగా చిత్రిపంబడింది.

రెండవ విహారం, లోపలి మందిరంలో, ఇద్దరు పాత్ర వాహకులు, విదేశీయులు చిత్రించబడ్డారు. లోపలికి పోయిన దవడలు, పలుచటి గెడ్డాలు వీరి ప్రత్యేకతలు.

పశుపక్షుల చిత్రాలలో హంస, మయూరం చాలా భావస్ఫూర్తితో సహజంగా చిత్రింపబడినవి. శ్రీఘ్రగమనం కల లేళ్లు, వాటి ముఖాలలో సాధుత్వం. గుర్తిపందగినవి కోతులు, కొండముచ్చులు పెంకిగా అల్లరిచేస్తూ కనిపిస్తాయి. గుర్రాలు విలాసంగా అడుగులు వేస్తునో, దౌడు తీస్తునో మెడలు చాచి కనిపిస్తాయి. వాటి చెవులు పొట్టివి వాటి ముట్టెలు ఉత్తమజాతిని సూచిస్తాయి. ఏనుగులు పెద్ద శరీరభాగాలతో, ఠీవిగల నడకతో చిత్రింపబడ్డాయి. భీకరమైన మూపులు గల ఆబోతులు మెడలు వంచి పోరాడుతున్నవి. ఈ విధంగా ఎన్నో ప్రాణులు సజీవాకృతిలో చిత్రితమయాయి.

అజంతా చిత్రాలు చాల కౌశలంతో రచింపబడ్డాయి. సంప్రదాయబద్ధంగా, చైతన్యవంతంగా, రచింపబడ్డాయి. హృదయాహ్లాదకరమైన ఆకారాలలోను, చిత్ర విచిత్ర వర్గాలలోను చిత్రింపబడ్డాయి. మానవత్వపు విలువలు సంపూర్ణంగా కలిగినవీ చిత్రాలు. మానవుని వృత్తిని, శీలాన్ని అతని ప్రాపంచకపు జీవితంలో ఈ చిత్రాలు చూపించాయి. విషయసుఖాలు తరచుగా నాశనానికి, దుస్సహైన సంఘటనలకు దారితీస్తాయని ఇవి సూచిస్తాయి. త్యాగశీలమే నిర్వాణానికి ముఖ్యం. విశ్వజనీయమైన ప్రేమ, కరుణ ఇవి మానవుల పట్లే కాదు పక్షులమీద, జంతువుల మీద, సరీసృపాలమీద ఉండడమే ముఖ్యమని ఈ చిత్రకారులు నిరూపించారు. చిత్రకారులు విషయసుఖాలు, ఆధ్యాత్మికమైన ఆనందానికి సమభావంతో ప్రాధాన్యమిచ్చారు.

ఇంతవరకు డాక్టర్ మోహన్ అజంతా చిత్రాల గురించి సుదీర్ఘమైన ఉపన్యాసం చేసి మౌనం వహించాడు.

ఆ సరికి చీకటి, లోయను బాగా ఆక్రమించుకొంది. ఆనాడు బహుళ ద్వాదశి, సిద్దుల దరి నుండి చలిగాలి తీవ్రంగా వీస్తున్నది. దూరాన్న పుల్లారెడ్డి గూడెంలో చలిమంటలో, వంట పొయ్యలలో మంటలో కనిపిస్తున్నాయి.

ముగ్గురూ టెంట్ల వేపు నడిచారు, శశికళ టార్చితో దారి చూపిస్తూ ఉంటే.

(సశేషం)

Exit mobile version