శ్రీపర్వతం-14

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 14వ భాగం. [/box]

24

[dropcap]“కిం[/dropcap]దటి సారి మీకు 1955-56 సంవత్సరాలలో తవ్వకాలలో బయటపడిన వాటి గురించి చెప్పాను. ఇంకా మరి నాలుగు సంవత్సరాల వివరాలు చెప్పాలి. ఇవి మీకు ముందు ముందు బాగా పనికి వస్తాయి” అన్నారు ప్రసాద్.

శశికళ నోట్ పుస్తకం తెరచి కూర్చుంది. సుబ్రహ్మణ్యేశ్వరరావు, మోహన్ సావధానులై వినడానికి కూర్చున్నారు.

ప్రసాద్ చెప్పడం మొదలు పెట్టారు.

నాగార్జునకొండ తవ్వకాలలో బౌద్ధమతానికి చెందిన అవశేషాలే కాక ఆదిమానవులకు చెందిన అవశేషాలు కూడా లభించాయి. శ్రీ సౌందరరాజన్ ఈ లోయలో ఆదిమానవులు నివసించినట్లు కనుగొన్నారు. నల్లరాళ్ల బోడుకు నైరుతిదిశ నుండి మ్యూజియంకు వెళ్లే రోడ్డుకి పడమర వరకు నియోలిథిక్ జోన్ ఉంది. భూలధమ్మగిరికి నైరుతి దిక్కున గల ఏటవాలు ప్రదేశాలలో మెగాలిథిక్ అవశేషాలు బయటపడ్డాయి.

మీరు ఇక్ష్వాకుల కాలంనాటి చారిత్రకావశేషాల గురించి తవ్వకాలు జరుపుతున్నారు. కాబట్టి ప్రస్తుతానికి ఆదిమానవులను విడిచి పెడదాం.

మూడవ సంవత్సరం, అంటే 1956-57 లో కూడా తవ్వకాలకు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారే నాయకత్వం వహించారు. శ్రీ కె.వి. సౌందరరాజన్, శ్రీవల్లభశరణ్, డాక్టర్ ఎ.సి.రేలు వారి ఆధ్వర్యంలో పనిచేశారు. మేమందరం ఉండనే ఉన్నాం.

కొత్తగా బయటపడిన వాటిలో వైదికకర్మకాండలు జరిపే కట్టడాలు చాల ముఖ్యమైనవి. వీటి చుట్టు ప్రాకారం ఉంది.

సంస్కృత భాషలో ఉన్న రెండు శాసనాలు లభించాయి. మొదటిది ఏహువల ఛాంతమూలుడి పదహారవ పాలనా సంవత్సరంలోను, రెండవది అతని ఇరవై నాలుగువ పాలనా సంవత్సరంలోను వెలువడ్డాయి.

మొదటి శాసనం పుష్పభద్రస్వామి ఆలయంలో ధ్వజస్తంభం మీద చెక్కినది. ఈ ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తూ ఆలయం యొక్క శాశ్వతమైన పోషణ కొరకు ఒక గ్రామాన్ని దానం చేసినట్లు దానిపై ఉంది. ఈ శాసనంలో ఏహువల ఛాంతమూలుడికి, అతని రాణి కుపణసిరికి జన్మించిన రెండవ వీరపురుష దత్తుడి పేరుంది. ఇతడు, బహుశా, రుద్రపురుష దత్తుడికి రాజసోదరుడు కావచ్చు.

రెండవ సంస్కృత శాసనం బుద్ధచైత్యంలోని కుడ్య శిల్పఫలకం మీద చెక్కబడి ఉంది. ఈ శాసనంలో చైత్యగృమంలోని బుద్ధ విగ్రహాన్ని శ్రేష్ఠి, కుమారనంది ప్రతిష్ఠ చేసినట్లుంది.

ఈ సంవత్సరం జరిపిన తవ్వకాలలో ఒక విషయం స్పష్టమయింది. విజయపురిలోయలో, పశ్చిమభాగంలో ఉన్న బ్రాహ్మణ దేవాలయ సముదాయం, బౌద్ధుల కట్టడాలు ఒక నిర్దిష్ట పద్ధతిలో కట్టారు. నదికి ఉత్తరభాగంలో, ప్రాకారం లోపలనున్నటి ప్రదేశంలో కలిపి, బ్రాహ్మణ దేవాలయాలు, కర్మకాండ జరిపే కట్టడాలు కనిపిస్తాయి. లోయ మధ్యను, మిగిలిన చోట్ల ఎన్నో బౌద్ధ విహారాలు కనిపిస్తాయి. దీనిని బట్టి, ఇక్ష్వాకు రాజులు సహజంగా బ్రాహ్మణ మతాభిమానులని తెలుస్తుంది.

నది పక్కనున్న ప్రదేశంలో, ముఖ్యమైన స్నానాల రేవుకు దక్షిణంగా, పెద్ద ఇటుకలతో కట్టిన గట్టు కనిపిస్తుంది. ఇది ‘యు’ ఆకారంలో ఉంది.

మొదటిదశ తవ్వకాలలో దీనిని పడవల రేవని భావించారు. తవ్వకాలు ఇంకా సాగిన తరువాత, ఇది కార్తికేయుడికి అంకిత మీయబడిన ఆలయంగా గుర్తించారు. అక్కడ స్తంభాలపై చెక్కిన శాసనాలను బట్టి ఈ విషయం తెలుస్తుంది. ఆ శాసనాలలో ‘చండ-శక్తి-కుమార’ అన్న పేరు కనిపిస్తుంది. బహుశా అతడే ఈ ఆలయాన్ని నిర్మించాడేమో! ఈ కట్టడంలో ‘ఎల్’ ఆకారంలో స్తంభాలున్న మండప భాగమొకటి కనిపించింది. ఈ మండపం యొక్క దిగువతలం దక్షిణ ముఖంగా ఉంది. దానిలో పెద్ద పెద్ద వేదికలున్నాయి. బహుశా ఇది ప్రధానమైన గర్భగృహమయి ఉండాలి. పై అంతస్తుకు పోవడానికి పిట్టగోడకట్టిన మెట్ల వరుస ఉంది.

ఈ కార్తికేయాలయానికి దక్షిణంగా, రెండు వందలగజాల దూరంలో, ఒక మండపం, స్తంభాలు బయటపడ్డాయి. కొన్ని స్తంభాలమీద శాసనభాగాలు కనిపించాయి. మరికొన్ని స్తంభాలమీదనున్న శాసనాలు బాగా గాలి పట్టిపోయాయి. ప్రాకృతభాషా శాసనాల వ్రాతకట్టు గవ్వలవలె కనిపిస్తుంది. వీటిని షెల్స్ కారెక్టర్సంటారు. ఇటువంటి వ్రాతకట్టు ఘంటసాల, జగ్గయ్యపేట, శాలిహుండాం శాసనాలలో లభిస్తుంది.

ఈ మండపానికి దక్షిణంగా, రెండు ఫర్లాంగుల దూరంలో, స్తంభాలున్న మరొక భవన సముదాయం బయటపడింది. దీనికి చుట్టూ ప్రాకారముంది. ఈ కట్టడాలలో విరిగిన వేదికలు, మోండాలు, కార్తికేయుని విగ్రహం యొక్క శిరోభాగం లభించాయి. అక్కడ బయటపడ్డ విగ్రహాలలో సమభంగస్థితిలో నిలుచున్న కార్తికేయుడి విగ్రహమొకటి ఉంది. ఇది ఒక అడుగు పది అంగుళాల ఎత్తులో ఉంది. ఈ విగ్రహం యొక్క ఎడమచేయి వంపుగా ఉండి, కుక్కుటాన్ని ధరించినట్లు కనిపిస్తుంది.

నదీతటం పైన కార్తికేయ విగ్రహాలు తరచు కనిపిస్తాయి. కార్తికేయుడి ఆలయాలు ఎన్నో ఉన్నాయి. లోయ మధ్యలో మరికొన్ని దేవాలయాలలో కార్తికేయుడి విగ్రహాలున్నాయి. ఇక్ష్వాకులు కార్తికేయుడిని ఆరాధించేవారని ఇవి ఋజువు చేస్తాయి. ఇక్ష్వాకుల తరువాత చాళుక్యులు కొంతకాలం విజయపురిలో ఉండి ఉండవచ్చు. వాళ్లు కూడా కార్తికేయుని ఆరాధకులే.

చుట్టూ ప్రాకారమున్న స్థలంలో, మధ్యభాగాన, యజ్ఞయాగాది కర్మలు జరిపించిన కట్టడాలు బయటపడ్డాయి. వీటి చుట్టూ ఉన్న ప్రహారీగోడలు బ్రహ్మాండమైనవి. ఈ గోడలకు దాపులున్నాయి. గోడల వెడల్పు 54 అడుగులు – గోడ మీదను, మధ్యనుంచి పోయే దారి 18 అడుగులు వెడల్పుంది.

ఈ కట్టడాలలో, మధ్యనొక స్నానకుండముంది. దీనిని ఇటుకలతో కట్టారు. ఇది 27 అడుగుల పొడవు, 27 అడుగుల వెడల్పు, 8 అడుగుల 6 అంగుళాలు లోతు కలది. కుండికలో దిగువకు పోడానికి నాలుగు మెట్ల వరుసలున్నాయి. అడుగుభాగం 6 అడుగుల 4 అంగుళాల చదరం.

ఈ స్నానకుండానికి ఏడడుగుల ఎత్తులో ఒక కాలువ ఉంది. కొద్ది దూరం, ఈ కాలువను నాలుగు వేపులా కప్పారు. అటు పిమ్మట ఈ కాలువ నది వరకు పోతుంది. దాని మీద రాతి పలకలు కప్పారు. ఈ కుండికలో ఒక నిర్ణీతమైన ఎత్తువరకు నీరుంటుంది. ఆ ఎత్తుకు మించి నీరు పోస్తే, అది కాలువగుండా నదిలోకి పోతుంది. ఈ ఎత్తు, ఆనాటి ఇక్ష్వాకు నృపతుల ఎత్తును సూచిస్తుంది. ఈ కుండిక అశ్వమేధయాగం చేసిన యజమాని, యాగం సమాప్తి చెందిన తరువాత, ఆఖరున చేసే అవబృధ స్నానానికి ఉపయోగిస్తుంది. ఈ కుండిక అశ్వమేధానికి సంబంధించినదని తెలుపడానికి నిదర్శనంగా, దీనికి 30 అడుగుల దూరంలో, ఆవరణ లోపల, జంతువుల ఎముకలు కనిపించాయి. ఇవి ఒక గుర్రానికి, ఒక మేకకు సంబంధించినవి.

అవబృధ స్నాన కుండికకు దక్షిణంగా మరొక కట్టడం బయటపడింది. దీనిని ఇటుకలతో కట్టారు. ఇది రెండు అంతస్తులలో నిర్మింపబడింది. పైన, అడ్డుకొలతలు, 18 అడుగుల పొడవు, 12 అడుగుల వెడల్పు. ఇది తాబేలు ఆకారంలో ఉంది. ఈ ఆకారం యొక్క తల పశ్చిమ ముఖంగా ఉంది. దీని లోతు 4 అడుగుల 6 అంగుళాలు. దీనిని కూర్మచేతి అంటారు. అడుగుభాగాన, నీరు పైకి పోయే కాలువ ఒకటుంది. దీని యొక్క చిన్నకొలతలు, ప్రత్యేకమైన ఆకారం చూస్తే ఇది స్నానం చేయవలసిన కుండం కాదని తెలుస్తుంది. దీనిని కూర్మచేతిగానో, లేక కూర్మకుండంగానో భావించవచ్చు. యాగానికి అవుసరమైన నీరు, బహుశా, దీనిలో నింపుతారేమో!

ఈ ప్రాకారానికి వెలువలను, బౌద్ధుల విహారాలు రెండు బయటపడ్డాయి. ఇవి ఒకదానికొకటి పక్కను చాలా శ్రమతో కట్టినట్లున్నారు.

ఒక విహారంలో 36 అడుగులు వ్యాసం కలిగి, 8 అడ్డకమ్ములు కలిగిన స్తూపం, చక్రాకారపు పునాదుల మీద కట్టబడినది ఉంది. దీనిని ఇటుకలతో కట్టారు. దాని ఆవరణకు బయట, నాలుగు చివరలలోను చిన్న పూజాస్తూపాలున్నాయి. దీనికి దక్షిణ భాగంలో విహారం నిర్మింపబడింది. దీనికి నాలుగువేపుల గదుల వరుసలున్నాయి. వాటి మధ్య నొక స్తంభాల మండపముంది.

ముఖ్యస్తూపానికి పడమటను ఒక బుద్ధచైత్యముంది. అక్కడ శిల్పాలు చెక్కిన దూలం ఒకటి లభించింది. దీని పొడవు 8 అడుగుల 6 అంగుళాలు, వెడల్పు 4 అడుగుల 8 అంగుళాలు, దాని మందం 7.5 అంగుళాలు. ఈ దూలం బుద్ధ విగ్రహం ఉన్నవేదికకు ముఖపీఠంగా ఉంది. దానిమీద సంస్కృత భాషలో ఉన్న శాసన మొకటి బ్రాహ్మీలిపిలో ఉంది. ఏహువల ఛాంతమూలుడి 24వ రాజ్యపాలనావత్సరం నాటిది ఆ శాసనం. ఆ దూలం మీద, చతురస్రపు పలకలమీద బుద్దుడి జీవితంలోని ముఖ్యఘట్టాలను లోతుగా చెక్కారు. వాటి మధ్య మిథునశిల్పాలను చెక్కారు.

ఈ విహారాన్ని అనుకొని ఉన్న రెండవ విహారంలో కూడా ఒక స్తూపం ఉంది. దీని పునాదులు చక్రాకారంలో, 4 అడ్డకమ్ములు కలిగి ఉన్నాయి. ఈ విహారం ‘యు’ ఆకారంలో ఉంది. విహారం యొక్క అంగణంలో (మండువాలో) ఒక నలుచదరపు పూజా మందిరముంది. దానిలో తామరపూవు పీఠంగా బుద్ధ ప్రతిమ ఒకటి ఉంది. కాని, దానిలో అర్ధభాగం మాత్రమే లభించింది.

కుందేళ్ల గుట్టకు దక్షిణంగానున్న కొండ ప్రాంతంలో తవ్వకాలు జరిపారు. అక్కడ, రెండు ముఖ్యమైన సైట్లు బయటపడ్డాయి. అందులో ఒకటి విహారభవన సముదాయం. దానితో ఒక స్తూపం కూడా బయటపడింది. విహారం ‘యు’ ఆకారంలో ఉంది. మనుష్యులు అందులో, రెండు దశలలో నివసించినట్లు తెలస్తుంది. ఆ విహారంలో ఒక స్తంభాల మండపం, రెండు పూజామందిరాలు లభించాయి. బుద్ధ విగ్రహాలలో సగం భాగాలు మాత్రం బయట దొరికాయి.

రెండవ ముఖ్యమైన సైటు, చెక్కసున్నంతో కట్టిన గట్లు కల చెరువు. ఇది 100 అడుగులు చదరం. చెరువును ఆనుకొని ఒక గజపృష్ఠాకార చైత్యం బయటపడింది. చెరువును ఆనుకొని, ఎదురుగా ఒక 100 స్తంభాల మండపం బయటపడింది. పై రెండు స్థలాలకు తగులుతూ నివాసగృహమొకటి బయటపడింది.

దీనిలో, మూడు దశలలో, ప్రజలు నివసించారు. ఈనివాస గృహానికి పక్కనే ఒక స్తంభాల మండపం వెలువడింది. దానిలో శాసనశకలాలు లభించాయి. అవి, మూడు, నాలుగు శతాబ్దాలకు చెందినవి. ఇవన్నీ 487 అడుగుల చదరపు స్థలంలో దృఢమైన ఆవరణం మధ్యను నిర్మింపబడి ఉన్నాయి. ఈ ఆవరణకు తూర్పున ఒకే ద్వారముంది.

ఈ సంవత్సరం బైటపడిన వాటిలో స్తంభాల మండపం గల ఒక సైటు పేర్కొనదగినది. ఈ మండపంలో నాలుగు ఛాయాస్తంభాలు అంటే స్మారకస్తంభాలు లభించాయి. వాటి పై శిల్పాలు చెక్కిన ఫలకాలు, శాసనశకలాలు ఉన్నాయి. ఛాయాస్తంభాలపై ఉన్న శాసనాలలో, అవి యుద్ధనాయకుల స్మారక చిహ్నాలని ఉంది. ఆ యుద్ధనాయకులను రథికులని పిలుస్తారు. తొలి ఇక్ష్వాకుల యుద్ధాలలో ఆ యోధనాయకులు పాల్గొని ఉండవచ్చు. వీరపూజ ఆ నాటికి ఉందనడానికి ఈ ఛాయాస్తంభాలే నిదర్శనాలు.

ఈ సంవత్సరం తవ్వకాలలో చిన్న చిన్న వస్తువులు తక్కువగా దొరికాయి. నాణాలు, పూసలు, ఎర్రమట్టితో చేసిన కుండబొమ్మలు, రాగి వస్తువులు, ఇనుముతో చేసిన వస్తువులు, చెక్కసున్నంతో తయారయిన వస్తువులు లభించాయి. కొన్నిటి మీద లతలు చిత్రింపబడి ఉన్నాయి. ఇవికాక కొన్ని బంగారు ఆభరణాలు లభించాయి.

దొరికిన నాణాలలో రెండు రోమన్ జారీలు. ఒకటి రోము పాలించిన టైబిరియస్‌ది. అతడు క్రీ.శ. 16వ సంవత్సరం నుండి 37వ సంవత్సరం వరకు రాజ్యం చేశాడు. రెండవది మార్కస్ అరిలియస్ అత్తగారు, పెద్ద ఫాస్టినా రాణిది. ఈమె అంటోనిపయస్ యొక్క పట్టపురాణి. ఈ రెండవ నాణెం క్రీస్తుశకం 141 సంవత్సరం తరువాత ప్రచారంలోకి వచ్చింది.

సీసపు నాణాల మీద ఇక్ష్వాకురాజులు చాంతమూలుడు, విరపురిసదతుడు వీరి ముద్రలున్నాయి.

రాగినాణాలన్నీ శాతవాహన ప్రభువులకు చెందినవే. వాటిమీద పులోమావి, యజ్ఞశాతకర్ణి. శాతకర్ణి వీరి పేర్లున్నాయి.

భూమితలం మీద విజయనగరరాజు రెండవ హరిహరుడికి చెందిన చిన్న వెండినాణాలు రెండు, మధ్యయుగానికి చెందినవి బైటపడ్డాయి.

వివిధ ప్రాంతాల నుండి చాల ఎర్రమట్టి బొమ్మలు లభించాయి. అవి మిథునాల రూపంలోను వైశ్రవణుడు, హారతి, కార్తికేయుడు వీరి రూపాలలోను, మాతృదేవత ఆకారంలోను లభించాయి. గుర్రాలు, ఏనుగులు, ఆబోతులు, పిల్లకు పాలిస్తున్న కోతి, సింహం ముఖం ఈ బొమ్మలన్నీ లభించాయి. తల ఎత్తుకొని బోరగిలపడుకున్న ఆబోతు చెక్కిన శిల్పఫలకం, క్రీడా శకటికలు, మకరకుండలాలు, ఉజ్జయినీ గురుతుగల ముద్ర, స్వస్తిక చిహ్నం గల ముద్ర, తామరగింజలుంచే పాత్రలు మొదలైనవి లభించాయి. నాణాలను ముద్రించే మూసలు దొరికాయి. ఇవి గౌతమీపుత్ర శాతకర్ణి ముద్రలు కల నాణాలకు చెందినవి.

లోహంతో చేసిన వస్తువులలో ఒక కంచువిగ్రహం గురించి చెప్పవలసి ఉంది. రాజకుమారుడు సిద్ధార్థుడు విల్లును ఎక్కు పెట్టినట్లు, ఆ భంగస్థితిలో ఉన్నట్లు ఈ విగ్రహం తెలుపుతుంది. ఇక్ష్వాకుల సాంప్రదాయ కళారీతులలో తయారయిన విగ్రహమది. శిరోవేష్టము, ధరించిన వస్త్రాల మడతలు ఈ విషయాన్ని ధృవీకరిస్తాయి.

తరువాత క్యూరేటర్ ప్రసాద్ 1957-58 సంవత్సరాలలో బయటపడ్డ వాటి గురించి వివరించారు.

ఈ సంవత్సరం 1200 ఎకరాల స్థలంలో తవ్వకాలు జరిగాయి. డాక్టర్ ఆర్. సుబ్రహ్మణ్యంగారు నాయకత్వం వహించారు. శ్రీ కె. సిన్హా, శ్రీ ఎమ్.డి. ఖరే, శ్రీ హెచ్. సర్కార్, శ్రీ రఘువీర్ సింగ్, శ్రీ అబ్దుల్ వహీద్ ఖాన్లు సహాయం చేశారు.

పోలియోలిథ్‌లు, మైక్రోలిథ్‌లు, నియోలిథ్‌లు, వాటితో సంబంధమున్న నియోలిథ్ సమాధులు బయటపడ్డాయి.

చరిత్ర రచనకు సహకరించే ముఖ్యమైన సైట్లు కొన్ని బయటపడ్డాయి. ఇక్ష్వాకుల కాలానికి చెందిన దుర్గం లేక కోట బయటపడింది. దీని చుట్టూ ఉన్న బ్రహ్మాండమైన ప్రహారీగోడలు, కందకం, కోటలోకి ప్రవేశించవలసిన ద్వారాలు, సైనికులు కవాతు చేసే మైదానం పేర్కొనదగ్గవి. మూడవ శతాబ్దిలో ఇక్ష్వాకులు ఎటువంటి రాజధాని నగరం నిర్మించారో వీటివల్ల తెలుస్తుంది. మరొక అద్వితీయమైన కట్టడం క్రీడాంగణం. ఇది దీర్ఘ చతురస్రాకారంలో ఉంది. దుర్గానికి వాయువ్యదిశను, పుష్పభద్రస్వామి ఆలయానికి నాగార్జునకొండ దిగువ భాగానికి మద్యను ఇది ఉంది.

దుర్గం అసమాన చతుర్భుజాకారంలో ఉంది. దీని పొడవు 3000 అడుగులు, వెడల్పు 2000 అడుగులు. దుర్గం యొక్క పడమటి ప్రాకారం కృష్ణానది కుడిగట్టుకు 350 అడుగులు దూరంలో ఉంది. ఈ గోడ దక్షిణాన 170 అడుగులు ఎత్తున పెద్ద కుందేళ్ల గుట్ట మీదనుంచి పోతుంది. సమతల ప్రదేశంలో ఈ గోడ ఎత్తు 16 అడుగులు. తవ్వకాలలో, పడమటినున్న గోడకు, తూర్పున ఉన్న గోడకు అడ్డుగా ట్రెంచిలు తవ్వారు. అప్పుడు, ఈ గోడ రెండు దశలలో నిర్మింపబడినట్లు తెలిసింది.

మొదటిదశలో, ఈ గోడ మట్టితో నిర్మింపబడింది. పునాదుల దగ్గర దాని మందం 80 అడుగులుంది. సహజమైన నేలపొర మీద నిర్మింపబడింది. కాని, పడమటను కృష్ణానదివేపున గోడ మాత్రం, పూర్వం ఎవరో నివసించిన స్థలం మీద, వంటపొయ్యల మీద కట్టినట్లుంది.

రెండవదశలో నిర్మించిన గోడ కాల్చిన ఇటుకలతో కట్టినది. ఈ గోడ 9 అడుగుల మందం నుంచి 14 అడుగుల మందం వరకు ఉంది. పెదకుందేళ్ల గుట్టపైన కట్టిన గోడకు పక్కనే కందకం లేదు. మిగిలిన మూడు వేపుల గోడపక్కనే కందకముంది. దీని లోతు 14 అడుగులు. ఆ కందకం వెడల్పు 74 అడుగులు నుంచి 132 అడుగుల వరకు ఉంది. ఈ ప్రహారీకి తూర్పువేపున ఒక ప్రధాన ద్వారం, పడమటివేపు ఒక ప్రధాన ద్వారం ఉన్నాయి. ఉత్తరం వేపు, తక్కువ వెడల్పు గల ద్వారమొకటి ఉంది. బహుశా ఇది అత్యవసర పరిస్థితులలో పైకిపోవడానికి ఉపయోగించేవారేమో! తూర్పువేపు ద్వారానికి సమీపంలో సైనికులు కవాతు చేసే మైదానముంది. అక్కడు గుర్రపుశాలలున్నాయి. చక్కగా చెక్కసున్నం చేయబడిన నీటికుండీ ఒకటి వాటికి సమీపంలో ఉంది. పడమటనున్న ప్రధాన ద్వారం 17 అడుగుల వెడల్పు ఉంది. కిందటి సంవత్సరం తవ్వకాలలో వెలువడిన అశ్వమేథస్థలానికి ఇది దగ్గిరగా ఉంది.

ప్రహారీ కట్టక పూర్వం ఉన్న దశకు, కట్టిన తరువాత దశకు సంబంధించిన మట్టి వస్తువులు పరిశీలించారు. ఈ రెండు దశలూ ఇక్ష్వాకుల పాలనకు చెందినట్లు నిర్ధారణ అయింది. పడమటి వేపు, తూర్పు వేపు కట్టిన గోడలను అడ్డంగా తవ్విన తరువాత ఒక విషయం తెలిసింది. గోడకు వెలుపల కట్టిన ఆలయాలు, విహారాలు మొదలైనవి, ప్రహరీ పూర్తిగా కట్టిన తరువాత నిర్మించినవి. చుట్టూ తవ్విన కందకంలో, రెండోదశలో ఇటుక గోడ నిర్మించినప్పటి రాళ్ళు, తొక్కు మొదలైనవి 8 అడుగుల ఎత్తు వరకు పడిఉన్నాయి.

ప్రహారీకి పక్కన, తూర్పు దిక్కున ఉన్న కట్టడాలలో ఒక బౌద్ధ విహారముంది. ఇక్ష్వాకు రాజు ఏహువల చాంతమూలుని ఇరవైనాలుగవ పాలనా సంవత్సరంలో ప్రతిష్ఠాపింపబడిన బుద్ధ విగ్రహమొకటి, కిందటి ఏడు తవ్వకాలలో లభించింది.

తవ్వకాలలో, ప్రహారీ రెండవ నిర్మాణదశ తరువాత పొరలో వీరపురుషదత్తుడికి, ఏహువుల ఛాంతమూలుడికి చెందిన నాణాలు బయటపడ్డాయి. ఆ కాలానికి చెందిన మట్టి పాత్రలు, ఎర్రమట్టి బొమ్మలు కూడా లభించాయి.

క్రీడాంగనం నాలుగు దిక్కులకు విస్తరించి ఉంది. దాని మద్యను క్రీడారంగం ఉంది. 309 అడుగుల పొడవు, 259 అడుగుల వెడల్పు, 15 అడుగులలోతు కలది క్రీడాంగణం నాలుగు వేపులా రెండడుగులు వెడల్పు కలమెట్ల వరుసలు పైకిపోతాయి. పశ్చిమాన ఒక మండపముంది. ఇవన్నీ కాల్చిన ఇటుకలతో కట్టినవే. పై మెట్ల వరుసకు తగులుతూ, నాలుగు పక్కలా 11 అడుగులు వెడల్పు గల తిన్నె నిర్మించారు. దక్షిణవేపు నుండి క్రీడారంగంలోకి దిగడానికి మెట్లున్నాయి. 6 అడుగుల వెడల్పున్న ఈ మెట్ల వరుసలు, సమానమైన దూరంలో నిర్మింపబడ్డాయి. ఈ మెట్ల చివరలను కర్రరాటలుకాని, రాతిపలకలు కాని దూర్చడానికి కన్నాలున్నాయి. లోపలికి దిగవలసిన ఈ మెట్లు, కూర్చోవలసని మిగిలిన అరుగులు కన్న చిన్నవి. చిన్నవి లోనికి దిగే మెట్లని, వెడల్పుగానున్నవి ప్రేక్షకులు కూర్చునే ఆసనాలని తెలుస్తుంది.

పశ్చిమాన, మధ్య భాగంలో మండపమొకటి ఉంది. మూడు దశలలో ఇక్కడ నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. మొదటి దశలోను, రెండవదశలోను, నేలమీద చౌకంగాను దీర్ఘ చతురస్రాకారంగాను తవ్విన కన్నాలు కనిపిస్తాయి. పైకప్పును మోసే స్తంభాలకోసం ఇవి తవ్వినట్లు తెలుస్తుంది. విరిగిన పెంకు ముక్కలు, అడ్డపు దూలం ముక్కలు అంతటా కనిపించడం చేత పైకప్పు ఉండేదని నిశ్చయమవుతుంది. మొదటిదశలో నిర్మించిన మండపం 84 అడుగుల పొడుగు, 39 అడుగుల వెడల్పుంది. రెండవదశలో నిర్మించిన మండపం 69 అడుగుల పొడవు, 33 అడుగుల వెడల్పుంది. మూడవదశలో నిర్మించినది. 50 అడుగుల పొడుగు, 44 అడుగుల వెడల్పుంది. మూడవదశలో నిర్మించిన మండపం చుట్టూ ఒక గోడ ఉంది. దానికి పడమర వేపు ఒకద్వారముంది. మూడవదశలో నిర్మాణమైన కట్టడాల శిథిలాల మీద 9 అడుగుల ఎత్తువరకు నల్లటి బురద కప్పింది. దానిమీద 10 నుండి 12 అడుగుల మందంతో ఇసుక మేటవేసి అన్నిటినీ కప్పింది. క్రీడాంగణానికి ఉత్తరంవేపున గోడలోంచి 2 అడుగుల వెడల్పున్న కాలువ, క్రీడారంగంలోని వాన నీరు బయటికి పోడానికి తవ్వబడింది.

లోయ దక్షిణ భాగంలో, కృష్ణానది గట్టున, ఈ చివరనుండి ఆ చివరవరకు మతసంబంధమైన కట్టడాలు, మతానికి సంబంధించిన కట్టడాలు బయటపడ్డాయి. వీటిలో ఒక భవన సముదాయం, 200 అడుగుల పాడుగు, 150 అడుగుల వెడల్పు కల ఆవరణలో ఉంది. ఆవరణ చుట్టూ ఇటుకలతో కట్టిన గోడ ఒకటుంది.

ఈ భవన సముదాయంలో స్తంభాల మండపమొకటి ఉంది. నాలుగు చతురస్రాకారపు వేదికలు, రెండు అష్టభుజాకార వేదికలు ఉన్నాయి. రెండు గజపృష్ఠాకారపు ఆలయాలు కనిపిస్తాయి. ఈ మండపం యొక్క దక్షిణ భాగం పెంపు చేయబడింది. నాలుగువేపుల గదుల వరుసలు గల శయనశాల ఇక్కడ బయట పడింది. ఈ సైటు నుండి అత్యుత్తమమైన శిల్పాలు లభించాయి. మిథునాలు, వృషభాలు, వృశ్చికాలు, మల్లయుద్ధం చేసే వీరులు. మొదలైనవి ఈ శిల్పాలలో ఉన్నాయి. ఇవన్నీ ఇక్ష్వాకుల కాలానివే.

పైన చెప్పిన భవనసముదాయం సమీపంలో ఒక విహారం బయటపడింది. గదుల వరుసలు మూడువేపుల ఉన్నాయి. మురుగునీరు పైకిపోయే కాలువ, ఒక స్నాన గృహం, ఒక శౌచస్థానం ఒక మూలనున్నాయి.

ఆ పరిసరాలలోనే అష్ట భుజాకారంలో గల మరొక దేవాలయం బయటపడింది. దీనిని పాతయిటుకలతో నిర్మించారు. చుట్టూ రాతిగోడ ఉన్న ఆవరణలో ఈ దేవాలయముంది. పురాతనమైన వస్తువులేవీ ఇక్కడ లభించలేదు. ఇక్కడ దొరికిన మట్టి పాత్రలను బట్టి, ఈ ఆలయం ఇక్ష్వాకుల కాలం చివరి దశకు గాని, లేక తరువాత కాలానికి కాని చెందినట్లు తెలుస్తుంది. దీనికి సమీపంలో చాల గోతులున్నాయి. వాటిలో జంతువుల అవశేషాలు, ఎర్రమట్టి బొమ్మలు, గాజుపూసలు, తిరగళ్లు, రోడ్లు, రోకళ్లు, మట్టి కుండలు లభించాయి.

ఇంకా వీటికి తూర్పువేపు ఇటుకలతో కట్టిన జలాశయ మొకటి వెలువడింది. లోపలికి దిగడానికి మెట్ల వరుసలున్నాయి. దీనికి తగులుతూ నివాస గృహమొకటి బయటపడింది. దీనిలో, రెండు దశలలో, మనుష్యులు నివసించారు. ఈ ఇళ్లు పుట్టగూడెం సమీపంలో, నదిగట్టున, కనిపిస్తాయి. ప్రతి ఇంటికి మూడు గదులున్నాయి. మూడు గదులకు తగులుతూ ముందువరండా ఉంది. శాతవాహనుల కాలంలో నాగార్జున కొండలోయలో ఇటువంటి గృహాలే ఉన్నాయి.

గోతులున్న స్థలానికి కొద్ది దూరంలో మధ్యయుగం తొలిదినాలకు చెందిన శివాలయమొకటి బయటపడింది. ఆలయం ఇటుకతో కట్టబడింది. నేలను రాతిపలకలు తాపారు. గోడలకు చక్కగా చెక్కసున్నం చేశారు. ఈ ఆలయం పైకప్పును నాలుగు కర్రస్తంభాలమీద నిలబెట్టారు. పైకప్పు పెంకుతో నేసినది. చిన్న శుద్ధిస్నాన కుండం ఒకటి బయటపడింది. దానికి ఆలయం గదుల నుండి కాలువ ఒకటి వచ్చి కలుస్తుంది. ఈ ఆలయంలో చాలా రాతి లింగాలు దొరికాయి.

ఈ శివాలయానికి 50 అడుగులు పశ్చిమాన దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఇటుక కట్టడమొకటి బయటపడింది. దీని చుట్టూ బలమైన రాతిగోడ ఉంది. ఈ ఆవరణ పొడవు 250 అడుగులు. దీనికి తగులుతూ మరొక భవన సముదాయముంది. ఇక్కడ కూడా కర్రస్తంభాల మీద నిలిచిన పైకప్పగల మండపం ఉందినట్లు తెలుస్తుంది.

ఈ సంవత్సరం లభించిన బౌద్ధుల కట్టడాలలో విహారమొకటి ఏహువల ఛాంతమూలుని 8వ పాలనా సంవత్సరంలో చెక్కిన స్తంభశాసనంలో, ఈ విహారం అపరమహావినశేలీయులకు చెందినదని తెలుస్తుంది. ఈ విహారం, దుర్గానికి తూర్పున 300 గజాల దూరంలో ఉంది. ఈ విహారంలో 43 అడుగులు వ్యాసం గల స్తూపం, ఒక స్తంభాల మండపం, దానికి మూడు పక్కల గదులు కల విహారం, రెండు పూజాస్తూపాలు కల స్తూతచైత్యం, ఛిన్నాభిన్నమైన అంగాలు కల బుద్ధ విగ్రహం లోపల కల బుద్ధ చైత్యం బయటపడ్డాయి. స్తూపానికి చుట్టూ ఒక గోడ ఉంది. ఈ గోడకి తూర్పున ద్వారముంది. స్తూపానికి తగులుతూ, పల్లంలోనున్న కొండ చరియలో రాతితో కట్టిన నివాసగృహాలు బయటపడ్డాయి.

ఈ విహారం ఉన్న చోట, దేనిని తాకకుండా, ఇటుకలతో కట్టిన కాలువ ఒకటి బయటపడింది. ఇది 48 అడుగుల పొడుగుంది. తూర్పు పడమరలకు పోతుంది. 10 అడుగుల 6 అంగుళాల పొడవు, 5 అడుగుల 4 అంగుళాలు వెడల్పు గల వేదిక నుండి ఈ కాలువ బయలుదేరుతుంది. వేదిక ఇటుకలతో కట్టబడింది. ఈ వేదిక పైన, మందంగా నున్న రాతిగోడ కట్టబడి ఉంది. కొండల నుండి దిగువకు పారే వాననీరు పల్లపు చోట్ల ఉన్న ముఖ్యమైన భవనాలను ముంచకుండా ఈ గోడ అడ్డుపడి, నీటిని మరొక దారికి పంపుతుంది.

కృష్ణానది కుడిగట్టున, నాగార్జున కొండ దిగువభాగాన, దుర్గానికి ఉత్తరాన, ఒక మండపం బయట పడింది. దీనిని 48 సున్నపు రాతిస్తంభాలమీద లేపారు. ఈ మండపం యొక్క నేలమీద రాతిపలకలు పరిచారు. చెక్కసున్నం గోడకు ఆనుకొని ఒక రాతి అరుగుంది. ఇది గోడ పొడవున కట్టబడింది.

ఇక్కడ కొన్ని మట్టి పాత్రలు దొరికాయి. అవి ఇక్ష్వాకుల కాలంనాటివి. నునుపు చేసిన నల్లమట్టి కుండలు, నునుపు చేయనివి, ఎర్రమట్టి కుండలలో నునుపు చేయనివి, ఎరుపు నలుపు మిశ్రమాల మట్టి కుండలు లభించాయి. నీరు జల్లుకునేవి, ప్రత్యేకమైన అంచులు కలవి కొన్ని, రోమన్ పాత్ర నిర్మాణ పద్ధతిని తెలియజేస్తాయి.

ఈ సంవత్సరం లభించిన పురావస్తువులలో ఎర్రమట్టి బొమ్మలు, రకరకాల పూసలు, ఇనుముతోను రాగితోను గవ్వలతోను చేసిన వస్తువులు, గాజుతో చేసిన చేతి గాజులు, శాసనాలు చెక్కిన పలకలు, నాణాలు మొదలైనవి ఉన్నాయి.

శిల్పాలకు చెందిన వాటిలో ఉబ్బెత్తు కుడ్యశిల్పాలు, సంపూర్ణంగా చెక్కిన విగ్రహాలున్నాయి. ఉబ్బెత్తు కుడ్య శిల్పాలలో, కుండ్రని ఫలకాలు, చూరున తాపిన దూలల మీద నాట్య మాడుతున్న మరుగుజ్జులు, మల్లయుద్ధపు దృశ్యాలు, ద్వారపాలురు, యుద్ధదృశ్యాలు, పూర్ణకుంభాలు, జంతువులు చెక్కబడి ఉన్నాయి.

సంపూర్ణంగా చెక్కిన బుద్ధ విగ్రహాలు, కార్తికేయుని విగ్రహాలు లభించాయి. ఇవికాక, మామూలు ఎత్తుకు మించిన యక్షుని విగ్రహం ఒకటి దొరికింది.

మొదటి ముగ్గురు ఇక్ష్వాకు రాజుల సీసపు నాణాలే కాక, కొన్ని రకాల ముద్రలు, రాజముద్రికలు, నాణాలు తయారు చేసే అచ్చులు ఈ సంవత్సరం లభించాయి. నాణాలు తయారు చేసే ఒక అచ్చులో త్రిశూలం, మానవ శిరస్సు చెక్కబడి ఉన్నాయి. రోమన్ నాణాల పద్దతిలో ఈ విధంగా చెక్కినట్టున్నారు.

క్యూరేటర్ ప్రసాద్ ప్రసంగం ఆపారు. కాఫీలు తెప్పించుకొని సావకాశంగా తాగిన తరువాత ప్రసాద్ అన్నారు.

“ఇంకా రెండు సంవత్సరాల తవ్వకాల చరిత్ర మీకు చెప్పవలసి ఉంది. ఈ సెషన్లో పూర్తి చేదామా, లేక మరోసారి.”

“మీకు శ్రమలేక పోతే ఈ సెషన్లోనే పూర్తి చేయండి. మరో సెషన్‌కి కొత్త విషయం మీద మాట్లాడవచ్చు” అంది శశికళ.

“అయితే వినండి” ప్రసాద్ చెప్పడం సాగించారు.

1958 – 59 సంవత్సరంలో మరొక 1800 ఎకరాలలో తవ్వకాలు జరిగాయి. నాగార్జున కొండ ఎక్సవేషన్ ప్రాజక్టువారు ఈ పని చేశారు. డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యంగారి నాయకత్వంలో శ్రీ ఎమ్.డి. ఖరే, శ్రీ హెచ్. సర్కార్, శ్రీ అబ్దుల్ వహీద్ ఖాన్, శ్రీ రఘుబీర్ సింగ్ పనిచేశారు. శ్రీ టి.ఎస్. రామచంద్రన్ గారు మార్గదర్శకత్వం వహించారు.

ఆదిమానవుల ఖనన స్థలాలను విడిచి పెడితే, ఇక్ష్వాకుల కాలానికి చెందిన శ్మశానం, అష్టభుజస్వామి ఆలయం, వెడల్పుగా ఉన్న వంటకాలువ, 36 స్తంభాలు కల మండపం వీటిలో ముఖ్యమైనవి.

9వ నంబరు స్తూపం దగ్గిర జరిపిన తవ్వకాలలో ఒక బౌద్ధుల కట్టడం వెలువడింది. దీని నిర్మాణం నాలుగు దశలలో జరిగింది. మూడవదశలో చేసిన నవకర్మనిర్మాణం ఏహువల ఛాంతమూలుని 9వ పాలనా సంవత్సరంలో జరిగింది. స్తూపం యొక్క ఒక భాగం నుండి లభించిన శాసనశకలం మీద ‘కుమార సిరి-వీర’ అని చెక్కబడింది. కాబట్టి ఈ కట్టడం సిరివీరపురుష దత్తుడి కాలంలో కూడా ఉన్నట్లు తెలుస్తుంది. ఈ స్తూపాన్ని తాకుతూ మరొక స్మారక స్తూపం లభించింది. ఇది ప్రత్యేకమైనది. దీని పునాదుల కేంద్రం స్వస్తిక చిహ్నంతో ఉంది.

ఆరుబయట రంగస్థలానికి పడమటి దిక్కున ఒక నివాస గృహం బయటపడింది. దీనిని ఇటుకలతో కట్టారు. దీనిలో నాలుగు గదులున్నాయి. నాలుగు గదులకూ తగులుతూ ముందు భాగంలో ఒక వరండా ఉంది. ఈ గృహ సముదాయం కప్పడిపోతే, దాని మీద మధ్య యుగం తొలి దశలకు సంబంధించిన కట్టడమొకటి లేచింది. దీనిలో ఇనుపతుక్కు (ధాతుమలం), ఎర్రమట్టితో చేసిన గొట్టాలు, మట్టి రంగు కుండలు లభించాయి. దీనికి సమీపంలో ఒక సున్నపు బట్టి ఉంది. గుండ్రంగా కట్టినరాతి కట్టడమిది. దీనికి నాలుగు పక్కలను సన్నపటి దారులున్నాయి.

ఈ సంవత్సరం తవ్వి తీసిన బౌద్ధుల కట్టడాలలో ఒకటి రాతితో కట్టిన స్తూపం. దీనితో పాటు మరో నాలుగు పూజాస్తూపాలు కూడా వెలువడ్డాయి. స్తూపం యొక్క పైభాగం శిల్పఫలకాలతో అలంకరించబడింది. ఈ స్థలం నుండి లభించిన ఒక రాతి దూలం మీద ఉబ్బెత్తు శిల్పం చెక్కబడింది. ఆ శిల్పంలో వెస్సంతర జాతకముంది. మరొక శాసనంలో ‘విచయపురి’ అని ఉంది. బహుశా యిది విజయపురి కావచ్చు.

మిగిలిన బౌద్ధుల కట్టడాలలో ఒక చైత్యగృహం, నాలుగు అడ్డకమ్ములు గల చక్రపు పునాదిపై లేచిన స్తూపం, ఒక సంపూర్ణమైన విహారం, మూడు వరుసల గదులున్న మరొక విహారం, ఒక పదహారుస్తుంభల మండపం వీటిలో ముఖ్యమైనవి.

చైత్యగృహానికి దక్షిణం వేపు ఒక గదుల వరస ఉంది. ఇది మంచి స్థితిలోనే లభించింది.

నాలుగు అడ్డకమ్ములు గల చక్రపు పునాది గల స్తూపానికి ఆయక వేదికలున్నాయి. పునాది మద్యభాగం చతరస్రాకారంగా ఉంది. దీనితో కలిసిన విహారం సంపూర్ణంగా ఉండి, చుట్టూ గోడ కట్టిన ఆవరణలో ఉంది.

ఈ సంవత్సరం తవ్వకాలలో 36 స్తంభాలు కల మండపం ఒకటి బయటపడింది. ఇది ఇటుకతో కట్టిన చావడిని అనుకొని ఉంది. బహుశా ఇది సరకులమ్మే దుకాణం కావచ్చు. ఈ చావడిలో కొలత కొలిచే చిన్న పాత్రలు కూడా లభించాయి.

లోయకు ఈశాన్యమూలలో, కృష్ణానది గట్టున, పొడవుగా ఉన్న మండపాల వరుసలమీద మధ్యయుగానికి చెందిన భవనాల పునాదులు బయట పడ్డాయి. తవ్వకాలు జరుగుతుంటే ఒక రాతి పలక మీద శాసనమొకటి లభించింది. ఈ శాసనం, అభీరరాజు, వాసిష్టీపుత్ర వసుషుడి తొమ్మిదవ పాలనా సంవత్సరంలో వెలువడింది. అక్కడ అష్టభుజస్వామి కర్రవిగ్రహం ప్రతిష్ఠించబడింది.

ఆ శాసనంలో మహాతలవర, మహాగ్రామిక, మహాదండ నాయక, కౌశిక గోత్రజుడైన శివశేవుడి పేరు, సంజయపురికి చెందని యవన రాజపుత్రులు అవంతికి చెందిన శక రుద్రదమనుడి పేరు, వనవానదేశానికి చెందిన విష్ణురుద్ర శివలానంద శాతకర్తి పేరు ఉన్నాయి. వీరందరూ ఆలయ ప్రతిష్ఠలో పాల్గొన్నవారుగా, వసుషేణుడి రాజ్యంలో దానాలు ఇచ్చిన వారుగా భావించవచ్చు.

ఈ స్థలంలో లభించిన కట్టడాలలో మూడు దేవతా మందిరాలున్నాయి. వాటిలో ఒక దానికి ఎదురుగా ధ్వజస్తంభముంది. పేర్లు చెక్కిన రెండు శంఖాలు ఆ స్థలంలో లభించాయి. ఒక దానిమీద పీఠం, చెండవదానిమీద చక్రం, దాని యిరుపక్కల అంకుశం, ఛత్రం చెక్కబడి ఉన్నాయి. అక్కడ దొరికిన శాసనాలలో ఒకటి ‘భగవతో అష్టబుజ సామిస’ అని ఉంది. మరొకటి ‘దక్షిణకనసర’ అని ఉంది.

ఈ ప్రాంతాలనుండి ఒక బంగారు పళ్లెం దొరికింది. దాని మీద ఒక ఉన్నత వంశజాతుడు, చేతితో తామరపూవు పట్టుకొని పూజ చేస్తున్నట్లు చెక్కబడి ఉంది.

నాగార్జున కొండ యొక్క ఉత్తరదిశలో, పల్లపు ప్రాంతంలో కృష్ణానది గట్టున శ్మశానం యొక్క అవశేషాలు బయట పడ్డాయి. బహుశా, ఈ శ్మశానంలో మూడు భాగాలున్నాయి. వీటిలో కూర్చోడానికి ఆసనాలున్నాయి. మూలలలో బాణలింగాలు పాతి ఉన్నాయి. మండపాలకు అడ్డుగోడలున్నాయి. అక్కడ లభించిన ఒక శిల్పంలో, మహిళ ఒకతె నిచ్చెనమీద నిలబడి నిప్పులోకి దూకుతున్నట్లు కనిపిస్తుంది. బహుశా ఈ చోట సతీసహగమనం చేసేవారేమో! దీనికి కొంచెం పడమరలో, కొంచెం ఎత్తుగానున్నచోట మరొక మండపం బయట పడింది. ఇది కూడా స్తంభాల మీద లేచినదే. వైభవోపేతంగా అలంకరింపబడి, మంచె మీద పడుక్కున్న మహిళ యొక్క శిల్పం ఈ స్థలంలో లభించింది. అంత్యక్రియలకు ఉపయోగించే చాల పెద్ద బానలు కూడా ఇక్కడ లభించాయి. మూడవ భాగంలో శిథిలమైన శివాలయ మొకటి, దాని ఎదుటనో ధ్వజస్తంభం వెలువడ్డాయి. ఏహువల ఛాంతమూలునికి చెందిన శాసనమొకటి అక్కడ లభించింది. అందులో ఆ దేవుడి పేరు భాగేశ్వరుడని ఉంది.

ఇక్ష్వాకుల కాలానికి చెందిన పంటకాలువ ఒకటి తవ్వకాలలో బయట పడింది. ఈ కాలువ 30 అడుగుల వెడల్పు, 6 అడుగుల లోతు ఉండి తూర్పునుండి పడమరకు పారుతున్నది. రెండు పక్కలను వాలుగా ఉన్న గట్లున్నాయి. ఈ కాలువ వేయి అడుగుల వరకు సాగినట్లు కట్టిన గట్ల వలన తెలుస్తుంది. కాలువకు దక్షిణం వైపున రెండు మండపాలు వెలవడ్డాయి. ఒకటి చతుశ్శాల, రెండవది 16 స్తంభాల మండపం.

దుర్గంలోపల సైనికుల నివాసాలు కొన్ని కొన్ని సాధారణ గృహాలు వెలువడ్డాయి. వాటి నిర్మాణక్రమం చాల ఆసక్తికరమైనది. ఇది కోట బురుజువలె ఉంది. దీని గోడ 6 నుండి 7 అడుగుల ఎత్తున ఉండి, వెడల్పు 3 నుండి 1 అడుగులలో ఉంది.

అశ్వమేధ ఘట్టమున్నచోటుకి తూర్పు వైపు విస్తరించిన స్థలంలో చాలా నివాసగృహాలు బయట పడ్డాయి. వీటిచుట్టూ ఇటుకతో కట్టినప్రహారీ ఉంది. దీనిని బట్టి ఇవి రాజభవనాలని, దుర్గంలో ఒకచోట వాటిని ప్రత్యేకంగా నిర్మించారని తెలస్తుంది.

తవ్వకాలలో ఒక సంగతి స్పష్టంగా తెలిసింది. లోయలో రక్షణ కోసం కట్టిన నాలుగు అడ్డుగోడలు బయటపడ్డాయి. మొదటి గోడ లోయలో ప్రవేశించే మార్గంపై తూర్పు దిక్కున ఉంది. రెండవది ఆర్కియాలజీ దృష్టిలో చాలా ముఖ్యమైనది. ఇది ఇక్ష్వాకుల దుర్గాన్ని చుట్టి ఉంది. ఈ గోడ యొక్క వంపు ఒకటి 300 అడుగుల దగ్గిర ఉంది. రెండవది 400 అడుగుల దగ్గర ఉంది. ఈ వంపుల మధ్యనున్న స్థలంలో ఇక్ష్వాకుల రాజభవనాలు నిర్మింపబడ్డాయి. రక్షణ కోసం కట్టిన ఈ అడ్డుగోడను అడ్డుగా కోస్తే కొన్ని సంగతులు తెలిసాయి.

మొదటి దశలో ఎత్తుగా పాసిన మట్టి, కంకరలదిబ్బ మాత్రమే ఉండేవి. ఈ దిబ్బకు వెలుపలి వేపు కందక మొకటి ఉంది. ఇది దక్షిణం వేపు మాత్రం లేదు. మిగిలిన మూడు దిక్కులను ఉంది. దక్షిణాన్న పెదకుందేళ్ల గట్టుమీద నుంచి ఈ గోడ పోతుంది.

రెండవ దశలో, మొదటి దశలో పోసిన మట్టి దిబ్బమీద గోడనొకటి లేవనెత్తారు. ఈ గోడను ఇటుకతో కట్టారు. దీని వెడల్పు 11 అడుగులు. ఈ గోడ దృఢంగా ఉండడానికి వెలుపల రాళ్లు పాతారు. లోపల కూడా, అడుగువాలులో, పునాదులను దిట్టం చేశారు. ఈ గోడకు పడమటి వేపు ఒక ట్రెంచి తవ్వితే, ఈ అడ్డుగోడకు మరమ్మత్తు జరిగాయని తెలిసింది.

మూడవ అడ్డుగోడ సిద్దులదరి కొండ మీద నిర్మింపబడింది.

నాలుగవ అడ్డుగోడ మధ్యయుగంలో కట్టబడింది. ఇది నాగార్జునకొండ అంచున చుట్టూ నిర్మింపబడి ఉంది. ఈ ఆవరణను మూడు మండలాలుగా విభజించి గోడలు కట్టారు. దీనికి ఆరు ద్వారాలున్నాయి. ద్వారాలను చేరడానికి మెట్లు కట్టారు. అవి లేని చోట ఏటవాలుగా దిబ్బలున్నాయి. 1959-60 సంవత్సరంలో, అంటే ఈ సంవత్సరంలో, నాగార్జున కొండ ఎక్సవేషన్ ప్రాజెక్టు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారి నాయకత్వాన కొనసాగుతున్నది. శ్రీ హెచ్. సర్కార్, శ్రీ రఘుబీర్ సింగ్, శ్రీ అబ్దుల్ వమీద్ ఖాన్లు సహాయకులుగా పని చేస్తున్నారు. శ్రీ టి.ఎన్. రామచంద్రగారు మార్గదర్శకులు ఉన్నారు.

ఈ సంవత్సరం చరిత్రకు సంబంధించిన అవశేషాలు కొద్దిగా మాత్రమే లభించాయి.

లోయ అన్ని భాగాలలోను రాతి కట్టడాలు బయటపడ్డాయి. కొన్ని ఇవి దుర్గానికి తూర్పుభాగంలో, అధికంగా కేంద్రీకృతమై ఉన్నాయి. ఇవి నివాసగృహాలుగా తెలుస్తుంది. చాలా గృహాలకు బదులు, వాటి ఆవరణగా నున్న గోడలు మాత్రమే లభించాయి. అంటే ఇల్లు లేదు, కాంపాండు వాలు మాత్రమే ఉందన్నమాట. వీటిలో పెద్ద ఆవరణ పొడవు 250 అడుగులు, వెడల్పు 200 అడుగులు.

దుర్గానికి తూర్పు వేపున ఉన్న స్థలంలో, అన్ని సదుపాయాలతో ప్లాన్ చేసిన పట్టణం నిర్మింపబడినట్లు తెలుస్తుంది. శాసనాలలో చెప్పిన విజయపురి పూర్వదిశాభాగం ఇదే కావచ్చు. ఈ పట్టణ భాగంలో వెడల్పైన వీధులు, సందులు, ఇరుకు సందులు కనిపిస్తాయి. వీధులు 25 అడుగుల వెడల్పుగా ఉన్నాయి. సందుల వెడల్పు 15 అడుగులు, ఇరుకు సందులు 8 అడుగుల వెడల్పు ఉన్నాయి.

ముఖ్యమార్గం, లేక రాజ మార్గం నగరాన్ని రెండుగా విభజిస్తుంది.

ఈ కట్టడాలు ఇక్ష్వాకుల కాలానికి చెందినవే అని అక్కడ దొరికిన కుండల వల్ల, ఎర్రమట్టి బొమ్మలవల్ల, పూసల వల్ల, లోహపు సామగ్రివల్ల, మొదటి ముగ్గురు ఇక్ష్వాకు రాజులకు చెందిన చాల సీసపు నాణాల వల్ల నిశ్చయంగా తెలుస్తుంది. ప్రతియింటి ఆవరణలోను సరుకులని నిలవచేసే పెద్దజాడీలు దొరికాయి. ఈ జాడీలు వరుసలుగా అమర్చి ఉన్నాయి.

ఈ గృహాలలో ఒకటి స్వర్ణకారునిది. ఇక్కడ ఎర్రమట్టి మూసలు, ఒక గీటు రాయి, ఇనుప గూటం, ఎర్రమట్టితోను, రాతితోను చేసిన తూకపురాళ్ళు, ఎర్రమట్టి గాజులు, చెవి పోగులు, ఆభరణాలు తయారు చేయడం కోసం ఉపయోగించే దీర్ఘచతురస్రాకారపు పోతదిమ్మలు లభించాయి.

ఈ ప్రాంతంలోనే బయటపడిన మరొక గృహంలో ఒక నిధి దొరికింది. ఒక చిన్న కుండలో తొమ్మిది వందల ఇక్ష్వాకుల నాణాలను పోసి పాతిపెట్టారు.

ప్రసాద్ గారి అభిభాషణ ముగిసింది.

చీకటి దట్టంగా ఉంది. నాగార్జున కొండవేపు నుండి చల్లటిగాలి వీస్తున్నది.

నలుగురూ లేచి నిలుచున్నారు.

“ఇంతవరకు మీకు సవిస్తరంగా తవ్వకాలలో లభించిన వాటి గురించి చెప్పాను. వీటిని అన్వయిస్తే ఈ ఇక్ష్వాకుల విజయపురి మీ మనో నేత్రాలకు దర్శన మిస్తుంది”.

అందరూ దీర్ఘంగా నిశ్వసించి ఎవరి బసలకు వాళ్లు బయలుదేరారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here