Site icon Sanchika

శ్రీపర్వతం-15

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 15వ భాగం. [/box]

25

[dropcap]“బు[/dropcap]ద్ధుడి కాలంలోను, అంతకు పూర్వం, వివిధ మతాలకు చెందిన వారు ఆత్మౌన్నత్యం కోసం, వేరు వేరు, అసహ్యకరమైన రహస్య కర్మలు చేసేవారని బౌద్ధుల సూత్ర గ్రంథాలలో ఉంది. పాలీ భాషలోనున్న ఈ విషయాలను పరిశీలిస్తే ఇవి తాంత్రిక పద్దతులని నిశ్చయమవుతుంది. బుద్దుడు ‘పంచ-కామ-గుణ-డిట్ట-ధమ్మ-నిబ్బాణ వాదం’ గురించి చెప్తాడు. దీని నుండి ఒక విషయం తెలుస్తుంది. పంచేద్రియాలు ఇచ్చే సుఖంలో పూర్తిగా నిమగ్నతను పొందినపుడే ఆత్మ, నిర్వాణం పొందుతుంది.”

మోహన్ ఇంతవరకు చెప్పి శశికళ వేపు, సుబ్రహ్మణ్యేశ్వరరావు వేపు చూశాడు.

సోమవారం మధ్యాహ్నం భోజనానంతరం, విశ్రాంతి తీసుకున్న తరువాత వాళ్లు ముగ్గురూ టెంట్ల బయట కుర్చీలు వేసుకొని మాట్లాడుకుంటున్నారు.

ఎవరు ఏ విషయం గురించి చెప్తారో ముందుగా తెలియదు. ఆ రోజు, మనసుకు నచ్చిన విషయం, శశికళ కాని మోహన్ కాని చెప్తే, సుబ్రహ్మణ్యేశ్వరరావు బుద్దిగా వింటాడు. శశికళ తను మాట్లాడవలసి వచ్చినపుడు, వ్రాసిన నోట్సు తెచ్చుకుంటుంది, మరెవరేనా చెప్తే పుస్తకం తెచ్చుకొని నోట్సు వ్రాస్తుంది.

శశికళ, పుస్తకం తెచ్చుకొని, సావధానంగా కూర్చుంది. సుబ్రహ్మణ్యేశ్వరావు కొత్త విషయం వినడానికి ఆసక్తుడయారు.

మోహన్ చెప్పడం సాగించాడు.

ఒక తెగకు చెందిన శ్రమణులు, బ్రాహ్మణులు, కాముకమైన కర్యాలు చేయడం తప్పుకాదని చెప్పారు. ఈ విషయం ‘మజ్జమనికాయం ఛుల్లధమ్మసమాదానసుత్తనికాయం’లో ఉంది. అంతేకాక ఈ తెగవారు వయసులో ఉన్న యోగినులు లేక భిక్షుణుల సాహచర్యంతో ఏ విధంగా కామోపభోగాలు అనుభవించేవారో వర్ణింపబడింది. ఇది తాంత్రికమైన చర్య అవునో కాదో వివరించలేదు. కథావత్థులో స్త్రీ పురుష మైధునం దర్మకార్యమని, మతపరంగా విశిష్టమైనదని చెప్పబడింది. అంతేకాక, కొంతమంది వీర్యాధికత కలిగించడానికిగాని, లేక నిర్వీర్యులను చేయడానికి గాని ఔషధాలను యిచ్చి, కాముక క్రీడలను నేర్పేవారని ఉంది.

బ్రాహ్మజాల మత్తంలో కొంతమంది దేవతలు కాముక వ్యాపారం వలన కలుషితులయినారని ఉంది. ఇంకా కొంతమంది మునులు లేక బ్రాహ్మణులు, ఇంద్రియభోగాలను సంపూర్ణంగా అనుభవించడం వల్ల నిర్వాణం చెందగలమని పలికారు.

మాగందియనుత్తంలో మాగందియుడు బుద్ధుడిని ‘భ్రూణహా’ అంటే పిండాన్ని సంహరించేవాడు అని నిందిస్తాడు.

అభికామాన్ స్త్రియాన్ యాశ్చ గమ్యాన్ రహసియాచితః

నో పైతి స చ ధర్మేషు భ్రూణహేతి ఉచ్యతే బుధైః

ఈ విధంగా బుద్ధుడికి అపవాదం అంటగట్టారు.

ఇంతవరకు మోహన్ చెప్పిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వరరావు చేయెత్తి మాట్లాడదలచినట్లు సంజ్ఞ చేశాడు.

“మీరు తంత్రం గురించి చెప్తున్నారని నేననుకుంటాను. విషయాన్ని వివరంగా చెప్పమని కోరుతున్నాను” అన్నాడు రావు

“మేము మధ్య మధ్య ప్రశ్నలు వేస్తాం. మీరు సంస్కృత శ్లోకాలు చెప్పేటట్లయితే నింపాదిగా చెప్పండి, వ్రాసుకోవాలి” అంది శశికళ.

“అన్ని మతాలకు చెందిన తంత్రాలున్నాయా?” రావు అడిగాడు.

“నాలుగు మతాలకు చెంది తంత్రాలు వ్యాప్తిలో ఉన్నాయి. శాక్తతంత్రాలు, శైవతంత్రాలు, వైష్ణవతంత్రాలు, బౌద్ధతంత్రాలు” అన్నాడు మోహన్.

“ఇవన్నీ వేదాలనుండి వచ్చాయా?” శశికళ అడిగింది.

“లేదు, ఈ తంత్రసాహిత్యం అవైదికమైనది. చాల రహస్యమైనది. వేదాలలోని మంత్రాలు రహస్యమైనవి కావు. ఈ తంత్రాలను ఆగమాలంటారు” అన్నాడు మోహన్.

“బౌద్ధంలో కూడా తంత్రాలున్నాయిని ఇప్పుడే వింటున్నాను. చాల ఆశ్చర్యం వేస్తున్నది. బుద్ధుడు మారుడి మాయలనుండి తప్పించుకున్నాడు. అతడు సర్వసంగపరిత్యాగియై గృహస్తులకు దూరంగా విహారాలలో ఉన్నాడు. ఈ తంత్రాలు పంచ’మ’కారాలతో కూడినవి. నాకేమీ అర్థం అవడం లేదు. కొంచెం వివరంగా చెప్పండి” అన్నాడు సుబ్రహ్మణ్యేవ్వరరావు.

మోహన్ క్షణం ఆలోచించి అన్నాడు.

మీకు ముందే చెప్పాను. బుద్ధుడి కాలంలో ఈ తాంత్రికాచారాలు వ్యాప్తిలో ఉండేవి ఎంతవరకు బౌద్ధం హీనయానపథంలో నడిచిందో అంతవరకు పరిస్థితి నియమబద్ధంగా నడిచింది. మహాయానపథానికి బౌద్ధం అలంబమైనప్పుడు చాల మార్పులు జరిగాయి. ఇవి తాంత్రికాచారాలకు దారితీశాయి. తంత్రం నీతిదాయకమైనది కాదు. ఇది నీతికరమైనది కాదు, అవినీతికరమైనది కాదు. ఇది శృంగారపరమైనది. ఇది ఒక శాస్త్రం అనవచ్చు. బహుశా ఇది శాస్త్రం కాకపోవచ్చు. వ్యక్తి యొక్క నైతిక భావనలు కాని, నైతిక జీవనానికి సంబంధించిన ప్రవర్తనకాని, తంత్రం పరగణించదు. వ్యక్తులు ఏవిధంగా ప్రవర్తించాలి అన్ని విషయం తంత్రానికి అనవసరం. దీనికి ఆదర్శాలకు సంబంధంలేదు.

నైతికమైన ప్రవర్తన వ్యక్తులను తక్కువ చూపు చూస్తుంది. ఎవరు కూడా ఆదర్శప్రాయులుగా బ్రతకలేదు. ప్రతి నైతిక విధానం నువ్వు తప్పు చేస్తున్నట్లు చెవిలో పోరుతుంది. కాబట్టి నువ్వు ఆదర్శప్రాయుడిగా జీవించలేవు. ఈ అధర్మమనేది భవిష్యత్తులో ఉంది. వర్తమానంలో నువ్వు నీలాగే ఉంటావు. మంచి వాళ్లతో సరిపోల్చుకుంటుంటావు. నువ్వెప్పటికి సంపూర్ణంగా దోషివి కాకుండా బ్రతకలేవు. అందుచేత నువ్వు తప్పు చేసినట్లు భావిస్తావు. ఆత్మనిందకు పాల్పడతావు.

ఒక్క విషయం ముఖ్యంగా చెప్పాలి. తంత్రం ఆత్మనిందను ఆమోదించదు.

జీవితాన్ని సహజంగా స్వీకరించమని తంత్రం చెప్తుంది. ఆనందంగా ఉండడంలో తప్పేముంది? నిజంగా చెప్పాలంటే అన్ని నీతిబోధలు సుఖసంతోషాలకు శత్రువులు.

తంత్రం నిజాయితీగా బ్రతకమని చెప్తుంది. నీపట్ల నువ్వు నమ్మకంతో ప్రవర్తించు, నువ్వు ఆనందంగా ఉండడం చెడ్డపని కాదు. అది మంచిది, అదేమీ పాపం కాదు. ఆనందంగా ఉండడం ఒక విశిష్టమైన ఉత్తమగుణం కలిగి ఉండడం.

తంత్ర మనేది శాస్త్రం సత్యాన్ని ముందుగా తెలుసుకోమని తంత్రం చెప్తుంది. తనను తాను తెలుసుకోమంటుంది. ఇప్పుడే వెంటనే నైతికమైన విలువలను కాని, ఆదర్శాలను కాని సృష్టించుకోవద్దని అంటుంది. వర్తమానాన్ని తెలుసుకో ఏం జరుగుతుందోనని ఆలోచించకు. వర్తమానం గురించి మాత్రమే ఆలోచించు. ఎప్పుడైతే వర్తమానం నీకు అవగత మవుతుందో, దానిని మార్చడానికి ప్రయత్నించు, అపుడే నీకు రహస్యం తెలుస్తుంది.

తంత్రం అన్న పదం ‘తన్’ అన్న ధాతువు నుండి వచ్చింది. జ్ఞానము దేనిచే విస్తరిస్తుందో దానినే తంత్రమంటారు. దానిని నమ్ముకున్న భక్తులను అది కాపాడుతుందని మరో అర్థముంది.

తన్యతే విస్తర్యతే జ్ఞానం అనేది ఇది తంత్రమ్.

తంత్రమంటే ఏదైనా పద్దతి, సిద్ధాంతము, సూత్రము లేక భావపరిణామము, శాస్త్రము అని సాధారణమైన అర్థంలో చెప్తారు. కాని, ప్రత్యేకంగా దీని గురించి చెప్పేటప్పుడు, ఆగమము అని దీనిని పేర్కొన్నప్పుడు, తంత్రమంటే సుఖానికి ఆధారమని, విడుదలకు మార్గమని చెప్తారు.

సంప్రదాయకమైన అర్థంలో తంత్రమంటే, ఆథ్యాత్మిక విషయాల మీద రహస్యంగా సాగించే ఉద్యమం. దీనివలన అతిమానుషమైన, లేక దివ్యమైన లక్ష్యాన్ని చేరుకొని, ఈశ్వరునిలో ఐక్యమవడం సిద్ధిస్తుంది.

అయితేనేం, తంత్రము అనేది, ధ్యానము, అనుష్ఠానము, ఆధ్యాత్మిక సూత్రసముదాయము మున్నగువాటి గురించి చెప్పే అవైదికరచన.

తంత్రం ఒక అయిదు విషయాల గురించి వివరిస్తుంది. సృష్టి, ప్రళయం, దేవతలను అర్చించడం, షట్కర్మసాధనం, నాలుగు విధాలుగా ధ్యానం చేయడం వీటి గురించి తంత్రం చెప్తుంది.

తాంత్రిక సాహిత్యాన్ని మూడు రకాలుగా వివరించారు. ఆగమ, తంత్ర, యమలములు వీటి పేర్లు.

ఆగమానికి ఏడు లక్షణాలు – ఆగమం ప్రపంచం యొక్క సృష్టిని, విధ్వంసం అంటే ప్రళయాన్ని వర్ణించాలి. దేవతలను అర్చించడం, సాధనలను అభ్యసించడం, పురశ్చరణ, షట్కర్మలను ఆచరించడం, నాలుగు విధాలుగా ధ్యానించడం అనేవి ఆగమ లక్షణాలు.

తంత్రం సృష్టివర్ణనతో ప్రారంభమౌతుంది. ప్రళయవర్ణన, మంత్రం యొక్క నిర్వచనం, అంతస్తులకు అనుగుణంగా దేవతలను వర్గీకరించడం, పుణ్యతీర్థాలను వర్ణించడం, నాలుగు ఆశ్రమాలకు చెందిన మానవ జీవితం గురించి చెప్పడం, బ్రాహ్మణులకు సరియైన స్థానం నిర్దేశించడం, జీవుడి గురించి ప్రస్తావించడం, యంత్రం గురించి నిర్వచించడం, దేవతల పుట్టుక, కల్పతరు వర్ణన, వినువీథిలో నక్షత్ర రాశులను గుర్తించడం, పురాణకథలను చెప్పడం, ప్రపంచం గురించి చెప్పడం, వ్రతమన్న పదం యొక్క నిర్వచనం, శుచి, అశుచుల భేదం, హరచక్రవర్ణన, స్త్రీ పురుషుల శరీరాల మీద శుభాశుభాలను తెలిపే గురుతులు, రాజు ఆచరించవలసిన విధులు, బహుమతిని ఇంకొకరికి ఇవ్వడంలో గల ఘనత, ఆనాటికి దేశంలో వ్యాప్తిగాంచిన మతం గురించి చెప్పడం, లౌకిక వ్యవహార దక్షత, ఆధ్యాత్మిక విషయాల గురించి తెలుసుకోడం ఇవన్ని తంత్రంలో వివరంగా ఉంటాయి.

యామలానికి ఏడు లక్షణాలు – ప్రపంచవర్ణన, నక్షత్రరాశుల వర్ణన, అనుష్ఠానాలు, దైనందిన విధులు, కామసూత్ర జ్ఞానం, వర్ణానికి జాతికి గల భేదం గుర్తించడం, ఆ కాలానికి దేశంలో వ్యక్తిలోగల మతం వీటి గురించి యామలం చెప్తుంది.

తంత్రాలు 64 అంటారు. మిగిలిన తంత్రాలు వేరు వేరు కాలాలలో పుట్టాయి. ఇవి ప్రయోజనకారులు కావు. చెడ్డ వాళ్లు వాటిని తమ ప్రయోజనాలకు వాడుకుంటారు.

తంత్రాలకు సంబంధించిన సమాచారాన్ని చాల చాల రహస్యంగా ఉంచుతారు. అనుష్ఠానాలను అభ్యసించడం, తంత్ర విధులను నిర్వర్తించే సాంకేతిక పద్ధతి, విధులను నిర్వర్తించడం ఇవన్ని చాల నిష్ఠగా, కఠోరమైన దీక్షతో ఆచరించవలసినవి. చాలా అసహ్యకరమైనవి. విధులను సరిగా అర్థం చేసుకోకపోతే ఆ తతంగమంతా తాగుబోతుల గోష్ఠిగా దిగజారుతుంది. ఎవరయితే కామానికి, ఉద్రేకానికి అతీతమైన స్థితిని చేరుకుంటారో వారే తంత్ర విధులను సక్రమంగా ఆచరించగలరు. ఈ స్థితికి చేరుకోలేని వారు తంత్రాన్ని దుర్వినియోగం చేస్తారు. అందుచేతనే తాంత్రికులు తమ చర్యల గురించి ఎవరికీ తెలియనీయరు. ఏ కొద్దిమందికో దీని గురించి తెలుస్తుంది. వారికి తంత్రం యొక్క తత్త్వం తెలుస్తుంది. తంత్రం గురించి లోతులకుపోయిన జ్ఞానవేత్తలు వీరే.

నేపాలు దేశంలో తాంత్రిక విధులను అభ్యసిస్తారు. వాటిని పెంపు చేస్తారు. అక్కడివారి దగ్గిర అసంఖ్యాకంగా తంత్ర సాహిత్యం మీద చేతివ్రాత పుస్తకాలున్నాయి. ధారిణులు వాటిలో ప్రముఖస్థానాన్ని ఆక్రమిస్తాయి. ధారిణుల రహస్యం నేపాలు దేశీయులకు తెలుసు. మామూలు మనుషులకు ఇవి కవచాలుగా లేక తావీదులుగా పనిచేస్తాయి. ధారిణులు మనకు సంభవించే దోషాలను పరిహరించి, కోరిక కోరికలను తీర్చుతాయి. కలియుగంలో ఆగమాలు చూపించే మార్గం వలననే మానవుడు మోక్షం పొందుతాడు. వేదాలు ఎటువంటి వంటే విషంలేని సర్పాలు.

మానవుడు చేసే పనులలో నిష్కామకర్మ ఆత్మవిముక్తికి, వైరాగ్యానికి దారీ చూపిస్తుంది. సకామకర్మ సంసారబంధానికి దారి తీస్తుంది. ప్రాపంచక సౌఖ్యాలకు అది నిలయం. వైరాగ్యానికి, సుఖానికి గల వైరుధ్యం వీటిలో గోచరమవుతుంది.

కామియైన పురుషుడు ఏమిటి కోరుతాడో తెలుసా?

రూపం దేహి జయందేహి యశోదేహి ద్విషో జహి

భ్యాఆర్యం మనోరమాం దేహి మనోవృత్యానుసారిణీం.

అర్గలాస్తోత్రము.

ఓ తల్లీ! నాకు చక్కని రూపం ప్రసాదించవలసింది. విజయం అనుగ్రహించవలసింది. నా శత్రువులను నాశనం చేయవలసింది. నా మనసునకు అనుకూలంగా ప్రవర్తించే అందమైన భార్యను ఇవ్వవలసింది.

భోగము, ముక్తి అన్నవి వేరని తంత్రం చెప్పదు. అందుకు భిన్నంగా భోగము, ముక్తి అన్నవి ఒకదానిలో నొకటి అంతర్లీనమైనవని తంత్రం చెప్తుంది. బోగము వలన పురుషుడు జీవితాన్ని సంపూర్శంగా దర్శించగలడని, ముక్తి జీవితాన్ని పరమోన్నత స్థితికి చేరుస్తుందని విజ్ఞులు చెప్తారు.

తాంత్రికమతం సర్వభారతమందు వ్యాప్తి కలది. ఈ మతాన్ని, అన్ని గొప్ప హిందూ మతాలు, అన్ని శాఖలు తమలో జీర్ణించుకున్నాయి. క్రీస్తు శకం పదవ శతాబ్దికి ముందు భారతదేశంలోగల మూడు మతాలు ఒకదానితో మరొకటి సరిపడని హిందూ మతం, బౌద్ధమతం, జైనమతం ఈ మతాలు తాంత్రిక మతం నుండి ఆచారాలను, లైంగిక సంబంధియైన యోగకర్మలను తమలో ఇముడ్చుకున్నాయి.

నగ్నంగా నున్న ప్రతి స్త్రీ ప్రకృతి యొక్క అవతారమే సాధనలో ఆమె శక్తిగా మారుతుంది. శక్తితో జరిగిన సంభోగం ఒక పూజావిధి. దానిలో పాల్గొన్న స్త్రీ పురుషుల జంట దివ్యత్వాన్ని పొందుతుంది.

ప్రకృతి, కర్మను ఆచరించలసినది. సృష్టి చేయవలసినది, పోషించవలసినది. పురుషుడు గొప్పవాడు, చాల ముఖ్యమైనవాడు, నిశ్చలమైనవాడు, దీర్ఘంగా ఆలోచించవలసినవాడు. ప్రకృతి కర్మను ఆచరించడం చేత, ప్రమాదం ఎదురయినప్పుడు ఆమెను సమీపిస్తారు.

తాంత్రికమతం బౌద్ధంలోకి ప్రవేశించిన తరువాత కొత్త కొత్త భావనలు, సిద్ధాంతాలు తలెత్తాయి.

బౌద్ధ తంత్రాలు, తంత్రమతంలో గల రెండు పద్ధతులపై అభివృద్ధిని చెందాయి. అవి పూజావిధానాలు, యోగసాధన అన్నవి. ఈ రెండు సాధారణంగా మిళితమై ఉంటాయి. క్రియాతంత్రం, చర్యాతంత్రం అన్నవి పూజావిధానాల గురించి వివరించాయి. యోగతంత్రం, అనుత్తర తంత్రం అన్నవి యోగసాధన గురించి చెప్పాయి.

తాంత్రికమతం వ్యాప్తి చెందుతున్నప్పుడు, క్రీస్తుశకం రెండవ శతాబ్దంలో ఇద్దరు దేవతా మూర్తులు బౌద్ద మతంలోకి ప్రవేశించారు. ఒకరు ప్రజా పారమిత. రెండో దేవత తార. ప్రజ్ఞాపారమిత పరమోత్తమైన జ్ఞానం యొక్క అవతారం. తార, ఆదివాసులైన భారతీయుల దేవత. ప్రజ్ఞాపారమితను హిందుదేవతలలోకి చేర్చుకోలేదు. కాని, తార మాత్రం ధ్యానం చేసే ముఖ్యమైన దేవతగా హైందవ దేవతా మూర్తులలోను, తాంత్రిక కర్మలలోను, స్థానం ఏర్పరచుకుననది. ‘యా కాళీ సా తారా’ – ఎవరిని కాళి అని పిలుస్తారో ఆమెయే తార. వామభావంతో ఈమె ఆరాధింపబడుతున్నది.

తంత్రాలకు మూలం ఉపనిషత్తులలో ఉందంటారు. ఛాందగ్యోపనిషత్తు, వామదేవ్య సామం స్త్రీ సంభోగాన్ని సూచిస్తుంది. బృహదారణ్యకోపనిషత్తులో కూడా స్త్రీ సంభోగం, వాజపేయ యాగమంత గొప్పదని చెప్పబడింది. మహావ్రతం జరిపేటప్పుడు, బ్రహ్మచారీ, యజ్ఞం జరిగే స్థలంలో, పుంవ్చలితో రమిస్తాడు.

అశ్వమేధ యాగంలో పట్టమహిషి ఈ కార్యాన్ని మూకాభినయం చేస్తుంది. రాజుగారి నలుగురు భార్యలను నలుగురు పురోహితులకు అర్పించడం ఈ విషయాన్నే ధ్రువపరిస్తుంది.

మోహన్ ఇంతవరకు చెప్పాడు. కొంచెం విశ్రాంతి కోసం ముగ్గురూ ఒక క్షణం తిరిగి వచ్చి, కాఫీలు తాగి, తిరిగి కూర్చున్నారు.

“చీనాచారమని ఈ సందర్బంలో అంటుంటారు. దాని గురించి కొంచెం వివరంగా చెప్పండి” అన్నాడు రావు.

“మధ్యయుగంలో చీనా దేశమంటే తిబెత్తుగాను, మహాచీనమంటే నేటి చీనాదేశాన్ని గుర్తించేవారు. కొన్ని ఆచారాలను, అనుష్టానాలను చీనాచారములని మహానిర్వాణతంత్రంలో చెప్పబడింది.”

“బుద్దుడు చీనా దేశంపోయి మైథునాన్ని అభ్యసించాడు. ఈ అభ్యాసమే అతనిని మారుని జయించేటట్లు చేసింది. ఈ విధానమే అతనిని సర్వజ్ఞునిగా తీర్చింది.”

“ఒకసారి మహర్షి వశిష్టుడు బుద్ధుని రూపంలోనున్న విష్ణువును దర్శించడానికి, తారా దేవి పూజాక్రమం తెలుసుకోడానికి వెళ్లాడు. అతడు మహాచీనాన్ని ప్రవేశించి, వేయిమంది గణికలచే సేవింపబడుతున్న పరమబుద్ధుడిని దర్శించాడు. మహాముని ఆశ్చర్యచకితుడయాడు.”

“ఈ పద్దతి వేదాచార విహీనమైనది, నాకిది సమ్మతము కాదు” అన్నాడు మహాముని.

ఇంతలో ఆకాశవాణి పలికింది.

“నీకే గాని నా కృప అవసరమయితే, నువ్వు చీనాచారాలను పాటించి నన్ను పూజించవలసింది”.

తరువాత బుద్దుడు అతనితో అన్నాడు.

“స్త్రీలు దేవతామూర్తులు, స్త్రీలు మన జీవితం, స్త్రీలు అలంకారాలు. ఎప్పుడూ వారిని మనసులో నిలుపుకోవలసింది”.

హఠయోగం కూడా ఈ విధంగానే చెప్తుంది.

“మహాసుఖాన్ని పొందడానికి స్త్రీ సంభోగం. వీర్య విసర్జనతో అది ముగియరాదు.”

“తంత్రం గురించి తెలుసుకున్నది, తాంత్రిక పూజా విధానాలు చాల రహస్యంగా కాపాడవలసినవి. అందుకోసమే తాంత్రికపదాల పరిభాష చాల భిన్నంగా ఉంటుంది.”

అపుడు శశికళ అడిగింది. “నాడులని వేటిని పిలుస్తారు?”

“తంత్రాలలో నాడి అన్నపదం గురించి సరిగా చెప్పడం కష్టం. మామూలు అర్థంలో, ఆయుర్వేద గ్రంథాలలో చెప్పిన నాడులు, నెత్తురు ప్రవహించే నాళాలు. మానవ శరీరంలో మూడున్నరకోట్ల నాడులున్నాయని ఈ గ్రంథంలో ఉంది.”

“తాంత్రిక వాజ్మయంలో, ఇడ, పింగళ, సుషున్ను అన్న నాడులు చాల ముఖ్యమైనవి. శరీరంలో కుడిభాగాన్ని సూర్యభాగమని, ఎడమభాగాన్ని చంద్రభాగమని అంటారు. ఇడ అన్న నాడి ఎడమ భాగంలోను, పింగళ అన్న నాడి కుడి భాగంలోను ఉంటాయి. వాటి రెండింటి మధ్యను సుషున్నునాడి ఉంది. వక్షఃస్థలం యొక్క ఎడమభాగం, అడుగునుండి, ఎడమ యొక్క చెలమ వరకు, విల్లువలె ఇడానాడి ఉంటుంది. కుడి అండం నుండి కుడి ముక్కు చెలమవరకు, ధనువు వలె వంగి సుషుమ్ననాడి ఉంటుంది. ఇడానాడి శంఖంవలె, చంద్రుడి వలె ధనలాతి ధవళంగా ఉంటుంది. పింగళనాడి తెల్లదనంతో కూడిన ఎరుపురంగులో ఉంటుంది. చంద్రుడు ఇడానాడిలోను, సూర్యుడు పింగళనాడిలోను ఉంటారు.”

“నుషుమ్ననాడిలో మూడు గుణాలు అంటే సర్వ, రజస్, తమో గుణాలుంటాయి. సత్వగుణం అధికంగా ఉండే సుషుమ్ననాడిని వజ్రనాడి అంటారు. రజోగుణం అధికంగా ఉంటే చిత్రినీనాడి అని, తమోగుణం విస్తారంగా ఉంటే బ్రహ్మనాడి అని అంటారు.”

“యంత్రం అంటే ఏమిటి?” రావు ప్రశ్నించాడు.

“యంత్రాలు రెండు విధానాలు. ఒకటి నేల మీద రచించవలసినది. ఈ యంత్రం పెద్దది. దీని సహాయం వలన దేవతలను పూజిస్తారు. రెండవది భూర్జపత్రాల పైన, లేక రాగి రేకులపైన వ్రాసినది. ఇది రక్షకు ఉపయోగపడే మంత్ర శక్తి గల తాయెత్తు.”

“పంచమకారాలంటే ఏమటి?” శశికళ ప్రశ్నించింది.

“తాంత్రిక పూజకు ముఖ్యమైన అయిదు విధులను పంచమకారాలంటారు. ఈ అయిదు విధానాల పేర్లు, ప్రతి ఒకటి, ‘మ’ అన్న అక్షరంతో మొదలవుతాయి. అందుచేత వీటిని పంచమకారాలంటారు. అవి మద్యము, మాసంము, మత్స్యము, ముద్ర, మైథునము. తాంత్రిక సాథకుడు ఈ పంచమకారాలను పాటిస్తాడు. మహానిర్వాణ తంత్రంలో పంచమకారాలగురించి ఈ విధంగా ఉంది.

“శక్తిని ఈ పంచమకారాలను లేకుండా పూజిస్తే, అది అభిచార పూజ అవుతుంది. ఇటువంటి అభిచార పూజ దెబ్బ తీస్తుంది. నాశనం చేస్తుంది. కాని, ఏ మహిమ, లేక శక్తిని తాంత్రికుడు కోరుతాడో, అది మాత్రం లభించదు. ఇటువంటి పూజ వలన అడుగడుగున ఆటంకాలు ఎదురవుతాయి. బీడు పడ్డ నేల మీద విత్తనం నాటితే ఏ విధంగా మొలవదో ఆ విధంగా ఈ పంచమకారాలు లేని శక్తి పూజ నిష్ఫలమవుతుంది.”

“హఠయోగంలో చక్రాలని ఉన్నాయి. వాటి గురించి చెప్పవలసింది” అన్నాడు రావు.

“వీటిని షట్చక్రాలన్నారు. ఇవి సామాన్య శక్తులకు అతీతమైన శక్తిని ప్రసాదించే చక్రాలు. ఈ ఆరు చక్రాలు శరీరంలోని వెన్నుపాము మీద ఉంటాయి. అవి (1) మూలధార చక్రం (2) స్వాధిష్ఠాన చక్రం, (3) మణిపూర చక్రం (4) అనాహత చక్రం (5) విశుద్ధ చక్రం (6) ఆజ్ఞా చక్రం అన్నవి.”

“మూలాధార చక్రం వెన్నుపాము అడుగుభాగాన్న, జననేంద్రియానికి అపామార్గానికి మధ్యనుంటుంది. నాలుగు దళాలున్న ఎర్రతామరపూవు వలె ఇది ఉంటుంది.”

“రెండవది స్వాధిష్ఠాన చక్రం – ఇది పురుష జననాంగం మొదట ఉంటుంది. ఆరు రేకలు కల సిందూరపు వర్ణంలో కల తామరపూవు వలె ఉంటుంది.”

“మూడవది మణిపూర చండ్రం – ఇది నాభి స్థానంలో ఉంటుంది. ఇది పది దళాలు కలం నీలిరంగు తామరపూవు ఆకారంలో ఉంటుంది.”

“నాలుగవది అనాహత చక్రం. ఇది హృదయభాగంలో ఉంటుంది. ఇది ప్రాణం, లేక, జీవాత్మకు పీఠం. ఇది పన్నెండు బంగారు దళాలు కల అరుణపద్మాకృతిలో ఉంటుంది.”

“విశుద్ధ చక్రం ఆరవది. ఇది కనుబొమ్మల మధ్యను రెండు దళాలు కల తెల్ల తామరపూవు ఆకారంలో ఉంటుంది. ఇది పరమ శివుని స్థానం.”

“ఈ చక్రాలన్నిటికీ పై భాగంలో, శిరసుపైన సహస్రార చక్రం ఉంటుంది. సహస్ర దళ పద్మాకారంలో ఇది ఉంటుంది. కాని, ఈ పద్మంలోని దళాలన్నీ వెనుకకు తిరిగి ఉంటాయి. సహస్రారం, పరమ పురుషుడైన బ్రహ్మకు స్థానం. దీనినే బ్రహ్మస్థానం లేక బ్రహ్మరంధ్రమని అంటారు.”

“తాంత్రికులందరూ ఒకే తెగకు చెందినవారా?” సుబ్రహ్మణ్యేశ్వరరావు తిరిగి ప్రశ్నించాడు.

“తాంత్రికులలో రెండు తెగలవారున్నారు. ఒకరు కౌలులు, రెండవవారు కాపాలికులు.”

“కుల మార్గాన్ని అనుసరించే సాదకులను కౌలులంటారు. శివునికి శక్తికి కల సంబంధంలో, చివరకు ఇరువురు లీనమవడమే దీని లక్ష్యం. అంటే పరమాత్మతో జీవాత్మ లీనమవడమన్న మాట. ఈ చివరి ఘట్టం చేరడానికి పంచేంద్రియాలు తమ తమ విదులను పోగొట్టుకుంటాయి. అప్పుడు మనస్సు దృష్టితో లీనమవుతుంది. దీనిని చేరడానికి అనుసరించిన దారిని కౌలమార్గమని, ఆచరించే విధులను కౌలకర్మలని అంటారు. అతి మానుషమైన శక్తులను పొందడానికి పూజా విధానాలు, ధ్యాన పద్ధతులు కూడా పాటించవలసి ఉంటుంది. కుండలిని సహస్రార చక్రాన్ని కలిసిన తరువాత బ్రహ్మరంధ్రం నుండి, అన్నిటికన్న పైనున్న పద్మం నుండి అమృత బిందువులు పడతాయి. చాల కఠినమైన సాదన. ఈ కౌలుల ముఖ్యకార్యమని అంటారు.”

“కాపాలికుడంటే మానవకపాలాన్ని చేతిలో ధరించినవాడని అర్థం. ఈ రకమైన ఆరాధనా పద్ధతికి చెందినవారు మానవకపాలాన్ని అలంకారంగా ఉపయోగించడమే కాకుండా, దీనిని భిక్షాపాత్రగను, త్రాగుటకు ఉపయోగించే గిన్నెగాను వినియోగిస్తారు. ఈ మతారాధకులు ప్రజలనుండి దూరంగా ఉంటూ, వారి సాధనలను శ్మశానాలలో కానీ, పాడుపడిన చోట్లలో కాని ఆచరించడం వలన ఈ మతం ఎవరికీ అంతుబట్టకుండా ఉంటుంది. కాపాలికులను మహావ్రతులని, మహాభైరవాను శాసన పరమ సిద్ధాంతులని, లేక సోమసిద్ధాంతులని పిలుస్తారు.”

“కాపాలికులు కాముకమైన కార్యాలలో పాల్గొంటారు. నరమేధాలు చేసి, నరమాంసాన్ని తీసుకుంటారు. వీరు మంత్ర జపం పట్ల, మంత్రాల మీద ఉండి పూజచేయడం పట్ల, శ్రద్ధ చూపించరు. పార్వతివలె సుందరంగానున్న యోగినితో సంభోగించి, శివత్వం పొందడమే వీరి ధ్యేయం. ప్రబోధచంద్రోదయ నాటకంలో కాపాలికులు మధువు పైన, మదిరాక్షులపైన మనసు నిలుపుతారు కాని, యంత్రం మీద గాని, మంత్రం మీద కాని శ్రద్ధ చూపించరని ఉంది. వీళ్లనే అఘోరాలని పిలుస్తారు.”

“తాంత్రిక మంతం దేశవ్యాప్తంగా ఉన్నది. ఇతర దేశాలలో మాతృ – ఆరాధనా పద్ధతి దీనికి సాటియైనదని భావించవచ్చు.”

“తంత్రం మానవుడి గురించి ముఖ్యంగా చెప్తుంది. మానవ శరీరాన్ని కొనియాడుతుంది. తంత్రం ఈ విధంగా చెప్తుంది.”.

“ఈ శరీరంలోనే గంగా యమునలున్నవి. ప్రయోగ వారణాసీ క్షేత్రాలున్నవి. దీనియందే సూర్యచంద్రులున్నారు. పీఠాలు, ఉపపీఠాలు దీనిలోనే ఉన్నవి. ఈ శరీరం కంటే పుణ్యక్షేత్రంకాని, ఆనందనిలయం కాని వేరొకటిలేదు.”

యోగినీతంత్రంలో ఈ విధంగా ఉంది.

“పరమపురుషుడు ఈ దేహమందు ఆనందస్వరూపుడై వసిస్తాడు. పరమానందం ఈ శరీరంలో నివసిస్తుంది”.

“పంచమకారాలలో మద్యానికి ప్రత్యామ్నాయంగా కొబ్బరి నీరు తీసుకోవచ్చునని యోగినీతంత్రం చెప్తుంది.”

“అదే తంత్రం మైథునానికి వినియోగించవలసిన స్త్రీ గురించి చెప్తుంది. ఆమె సాధకుని వర్ణానికి చెందవచ్చు లేక అంతకు తక్కువ వర్ణానికి చెందవచ్చు. ఈ నియమం గృహస్థాశ్రమవాసియైన సాధకుడికి అన్వయిస్తుంది. సాధకుడు అవధూత అయినట్లయితే అతడు బియ్యంతో తయారయిన అన్ని రకాల మద్యాలను సేవించవచ్చు. మత్స్య భక్షణ చేయవచ్చు. అతడు జంతుమాంసాన్ని, భూచరములైన పక్షులు, ఖేచరములైనవి వీటి మాంసాన్ని భుజించవచ్చు. ముద్ర విషయంలో ఎటువంటి తేడా లేదు. అవధూత మాతృయోనిని విడిచి, మిగిలిన స్త్రీలందరితో రమించవచ్చు. కాని, అతడు కన్యను విడిచి పెట్టాలి. పన్నెండు సంవత్సరాల ప్రాయం నుండి అరవై సంవత్సరాల ప్రాయం వరకు ఉన్న స్త్రీలు, స్వయంగా రతియందు గల కోరికను వెలబుచ్చగలరు. అవధూత, బ్రాహ్మణ క్షత్రియ వైశ్యజాతులకు చెందిన స్త్రీలతో రమించవచ్చు. కాని, కొన్ని పరిస్థితులలో ఈ మూడు వర్ణాల స్త్రీలను కూడా అవధూత రమించవచ్చు. ఆ విధంగా అవధూత తన మేనమామ కుటుంబానికి చెందని స్త్రీలతో కూడా భోగించవచ్చు.”

“తాంత్రికుడు ఆరు కర్మలను సాధించగలడు. వీటిని షట్కర్మలంటారు. శాంతిని, వశ్యాన్ని (లోబరచుకోవడం), స్తంభనాన్ని (చలనం లేకుండా చేయడం), విద్వేషణాన్ని (ఇతరుల యందు ద్వేషం కలిగించడం) ఉచ్చాటనాన్ని (ప్రతిస్పర్దిని నాశనం చయడం), మారణాన్ని (చంపడాన్ని) సాధకుడు సాధించగలడు.”

“శాంతివశ్యస్తంభన విద్వేషణోచ్చాటన కర్మలకు వాణి, రమ, జ్యేష్ఠ, మాతంగి, కులకామిని, దుర్గ, భద్ర కాళి అన్న ఎనమండుగురు దేవీ మూర్తులను పూజించాలి. వీటిని దేవాలయమందు కాని, నిర్జనమైన గృహమందు కాని ఆచరించవచ్చు. కాని, మారణ కర్మ మాత్రం శవం మీద జరపాలి. ఈ కర్మను చేసేటప్పుడు వ్యాఘ్రచర్మాన్ని ధరించాలి. లేకపోతే ఎర్రటి పట్టుబట్టను కట్టుకోవాలి. అన్నిటికంటే దిగంబరుడుగా వ్యవహరించడమే ఉత్తమమైనది.”

“ఈ షట్కర్మలను ఆచరించడానికి ఆరురకాల సురలు కావలసి ఉంది. వీటి గురించి శక్తులుగా ఆరాధించవలసిన స్త్రీలు ఈ విధంగా ఉన్నారు.”

“శాంతికి పద్మినీజాతి స్త్రీ, విద్వేషణానికి శంఖినీ జాతి స్త్రీ, స్తంభానానికి హస్తినీ జాతి స్త్రీ, మారణానికి డాకినిని వినియోగించాలి.”

“ఈ విధంగా మీకు తంత్రాలను పరిచయం చేస్తున్నాను. బౌద్ధ తంత్రాల గురించి విపులంగా చర్చించవలసి ఉంది. శ్రీపర్వతంపై నాగార్జునుడు తన జీవితంలో చరమాధ్యాయాన్ని గడిపాడు. బౌద్ధతంత్రాలు శ్రీపర్వతం పైన ఉద్భవించాయని కొందరి అభిప్రాయం. ప్రస్తుతానికి బాగా పొద్దుపోయింది. మరొకసారి వివరిస్తాను”.

మోహన్ తన ప్రసంగాన్ని ముగించాడు.

దీర్ఘంగా నిట్టూర్చి శశికళ లేచింది. ఆమె కొంతవరకే నోటు చేసుకుంది. తరువాత వింటూ అన్నీ మరిచిపోయింది.

సుబ్రహ్మణ్యేశ్వరరావు కూడా కొంత సేపు మౌనంగా ఉండి, కుర్చీ నుండి లేచి ఆవరణ వెలుపలికి నడిచాడు.

(సశేషం)

Exit mobile version