Site icon Sanchika

శ్రీపర్వతం-16

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 16వ భాగం. [/box]

26

[dropcap]ఎం[/dropcap]డలు క్రమంగా ముదురుతున్నాయి.

సైటులో తవ్వకాలు ప్రతిదినం జరుగుతునే ఉన్నాయి. ఎటువంటి వింత వస్తువూ బయటపడడంలేదు. ట్రయల్ ట్రెంచ్ లలో ఏవీ లభించనపుడు, వెంటనే ఆ సైటును విడిచి పెట్టవలసింది. చేస్తున్న పని మందకొడిగా ఉంది. ఎవరికీ ఉత్సాహం కలగడం లేదు. ఒక్క ఆరు నెలలు ఏ మార్పూ లేకుండా తవ్వకాలు సాగించి, ఏవీ దొరక్కపోతే, జండా ఎత్తేయాలని వాళ్ళు అనుకుంటున్నారు. కాని, ఫలితమీయని పని కింద నిధులను ఎందుకు వ్యయం చేశారని ప్రభుత్వ మడుగుతే ఏం జవాబు చెప్పగలరు? నాగార్జున సాగర్ లో సైటు మునిగిపోవడం తథ్యం . అప్పు కూడా దానితో మునిగిపోతుందా!

నిరాశా జనకాలైన ఆలోచనలు ఏవిధంగాను సహకరించవని వాళ్లు తెలుసుకున్నారు. దేవుడి మీద భారంవేసి, పని చేయడానికి వాళ్లు నడుం కట్టారు.

ఏది ఎలా ఉన్నా, నాగార్జున కొండలోయలో జరిగిన తవ్వకాలను, ప్రతి అంగుళం క్షుణ్ణంగా పరిశీలన చేసిన తరువాత వాల్ల సందేహాలు వాటంతట అవే మాయమయాయి. అదొక దివ్యమైన అనుభవం. ప్రభుత్వం నియమించిన ఎక్సవేషన్ ప్రాజెక్టు వారికి, తమకు భేదం లేదని వాళ్ళు గుర్తించారు. కొత్త కొత్త విషయాలు వారం వారం వాళ్లకు తెలుస్తున్నాయి.

స్కాలర్లు తాము కనుగొన్నవి అతి శ్రద్ధతో చెప్తున్నారు. ఈ అనుభవం అపూర్వమైనది. మరెక్కడా లభించనది. ప్రభుత్వ మిచ్చిన అప్పుకు జవాబు చెప్పవచ్చు. కాని ఈ అవకాశం మాత్రం విడిచి పెట్టరాదు.

అదే దీక్షతో వాళ్లిద్దరూ పనిచేస్తున్నారు.

శశికళ టైపు చేసిన నోట్సు పెరిగి పోతున్నాయి. వీటిని ఒక క్రమంలో అన్వయించే సరికి చాలకాలం పడుతుంది. తవ్వకాలు ముగిసినా ఈ పని మాత్రం ముగియదు.

ఇవాళ సాయంకాలం కార్తికేయ శర్మ ప్రసంగిస్తారు.

సరిగా మూడు గంటలకి శర్మ చెప్పడం మొదలు పెట్టారు.

“విజయపురిలో బ్రాహ్మణ దేవాలయాల నిర్మాణం కొంచెం ఆలస్యంగానే జరిగింది. మీ అందరికీ తెలుసు. కృష్ణానది ఇక్కడ ఉత్తర ముఖంగా పారుతున్నది అని. నది కుడివేపు గట్టున, ఈ బ్రాహ్మణ దేవాలయాలు, ఈ చివరినుండి ఆ చివరి వరకు కనిపిస్తాయి.”

“మనకు తెలిసిన మేరకు విజయపురిని నలుగురు ఇక్ష్వాకురాజులు పరిపాలించారు. సిరి చాంతమూలుడి కాలంలో కాని, సిరి వీరపురుష దత్తుడి కాలంలో కాని, బ్రాహ్మణ దేవాలయం ఒక్కటి కూడా నిర్మింపబడలేదు.”

“మూడవ ఇక్ష్వాకురాజు, సిరి ఏహువల ఛాంతమూలుడి కాలంలో మొదటి బ్రాహ్మణ దేవాలయం, లోయలో ఉత్తరభాగాన్న నిర్మింపబడింది. బహుశా దక్షిణ భారతదేశంలో ప్రప్రథమంగా నిర్మింపబడిన బ్రాహ్మణ దేవాలయం ఇదే కావచ్చు. కాని, చెప్పుకోదగ్గ విశేషమేమంటే, ఇది ఆభీర వసుషేణుడి ముప్పదవ పాలనా సంవత్సరంలో నిర్మింపబడినదని అక్కడ లభించిన శాసనంలో ఉంది. ఇక్ష్వాకు రాజుల పేరు ఒకటి కూడా శాసనంలో లేదు. ఆభీరుల మంత్రి ఈ అష్టభుజస్వామి ఆలయాన్ని నిర్మించాడని ఉంది. ఇది సంస్కృత శాసనం.

ఏహువల ఛాంతమూలుడి కాలంలో సంస్కృతం రాజభాషగా ఉన్నతపదవి నధిష్టించింది. బ్రాహ్మణ దేవాలయ సముదాయాలలో లభించిన శాసనాలలో ఛందోబద్ధమైన సంస్కృత శ్లోకాలున్నాయి. అంతవరకు లోయలోని శాసనాలు ప్రాకృతంలో వచ్చాయి. కాబట్టి, ఈ మార్పు ప్రత్యేకంగా చెప్పుకోదగ్గది.

ఇక్ష్వాకులు సూర్యవంశరాజులు. సగర, దిలీప, అంబరీషులు, శ్రీరామచంద్రుడు వీరి వంశం వారేనని ప్రఖ్యాతి చెందిన ధ్వజస్తంభశాసనంలో ఉంది. వీరు శివారాధకులని ఈ ఆలయాలు ధృవపరుస్తాయి.

ఈ ఆలయాలు చాల వరకు కృష్ణానది కుడి గట్టున, దుర్గానికి దగ్గరగా, రాజభవనాలకు సమీపంగా ఉన్నాయి. ఇవన్నీ ఇటుకతో కట్టబడినవి. అలంకరించవలసిన చోట్లలోను, స్తంభాలకు, దూలాలకు, వాసాలకు రాతిని ఉపయోగించారు. గోడలను చాల దృఢంగా కట్టారు. గోడలు మూడడుగుల నుండి పన్నెండు అడుగుల వరకు మందంగా ఉన్నాయి. గోడల పైభాగాలకు చెక్కసున్నం చేశారు. కొన్నిచోట్ల రంగులు పూశారు. కొన్ని దేవాలయాల ప్రాకారాలకు చిత్రాలున్నాయి. కొన్ని చోట్ల నేలలపై కడపరాతి పలకలు చాల జాగ్రత్తగా కోసి, నునుపు చేసి అతికారు. చాల వాటిలో నేలభాగం ఇటుకలు పేర్చి పైన గచ్చు చేశారు. తవ్వకాలలో పెంకులు కాల్చే ఆవాలు, సున్నం దంచే గోళాలు బయటపడ్డాయి. పెద్ద ఆలయాల ఆవరణలో ఇవి కనిపించాయి.

పుష్పభద్రస్వామి ఆలయం పునాదులు తవ్వుతుంటే, గజపృష్ఠాకారంలో ఉన్న గర్భగృహం అడుగున ఒక పెద్ద కుండ కనిపించింది. దీని పై ఒక రాతి మూత ఒత్తుగా కప్పి ఉంది. కళాపకర్షణ విధి ఆగమ, శాస్త్రానుసారంగా జరిగిందని దీని వలన ఋజువవుతుంది. సాధారణంగా గర్భపాత్రను రాగితో తయారుచేసి, ద్వారానికి కుడివైపున, మొదట ఇటుక వరుసతో స్థాపిస్తారు. మరకతాలు, వజ్రాలు మొదలైనవి, బంగారం వెండి వంటి విలువైన లోహాలు, ముత్యాలు మొదలైన అమూల్యమైన వస్తువులను పాతి పెట్టడం గర్భవిన్యాసంలో ఒక భాగం. ప్రతిమను స్థాపించినపుడు, రత్న విన్యాసం జరుగుతుంది. కాని గర్భ విన్యాసంలోని, కళాన్యాసంలోను వారు శాస్త్రీయ పద్ధతులనే అవలంబించారు.

బ్రాహ్మణ దేవాలయాలు ఆకారంలోను, కొలతలలోను బౌద్ధ దేవాలయాలను పోలి ఉన్నాయి. బ్రాహ్మణ దేవాలయ నిర్మాణంలో చిన్నమార్పులు జరిగాయి. విగ్రహప్రతిష్ఠ ధ్వజస్తంభస్థాపన మొదలయిన విధులను అనుకూలంగా ఇవి మార్చబడ్డాయి.

బ్రాహ్మణ దేవాలయాలు దీర్ఘచతురస్రాకారంగా (ఆయతాస్త్రంగా) గజపృష్ఠాకారంగా (వృత్తాయతంగా), చతురస్రాకారంగా నిర్మింపబడ్డాయి. లోపల ప్రతిష్ఠించినబడిన దేవతని బట్టి, ఈ ఆకారాలు మారలేదు. ఒక గర్భాలయం కలవి, రెండు గర్భాలయాలు కలవి, రెండు వృత్తాయత గర్భాలయాలున్నవి, దీర్ఘ చతురస్రాకారంలోను వృత్తాయతంగాను కలిసిన గర్భాలయాలు కనిపిస్తాయి. సైటు 64లో ఒక పెద్ద దేవాలయ సముదాయం ఉంది. ప్రాకారానికి తగులుతున్న వేదికల మీద చిన్న చిన్న గుడులు నిర్మించారు.

ఆలయాలలో ప్రాసాదాకృతి గలవి ప్రత్యేకంగా పేర్కొనదగినవి. ఇవి మేడల వంటివి ముందు భాగంలో స్తంభాలపై నిలిపిన మండపాలు ఉంటాయి. నోడగీశ్వరస్వామి ఆలయంలో లభించిన శాసనాన్ని బట్టి వీటిని దేవకులాలంటారని తెలుస్తుంది. (సైటు 127) సైటు 126 లోని దానిని స్థలము లేక థలమని పిలుస్తారు.

ఈ ఆలయాల శాశ్వత పోషణకు అక్షయ నీవిని యిచ్చి, కొన్ని సంస్థలకు ఆ పని అప్పగించారు.

ఈ ఆలయాలలో మూడు భాగాలుంటాయి. ఒకటి గర్భగృహం, రెండవది అంతరాళం లేక అర్థ మండపం, మూడవది ముఖమండపం లేక ఎదురుగా స్తంభాలుండే మండపం. అదే రేఖలో ధ్వజస్తంభాన్ని ప్రతిష్ఠిస్తారు. ముఖమండపంలోనే నందిపీఠముంటుంది. కొన్ని ఆలయాలలో స్తంభాల మండపాలను, గర్భగృహాలుగా మార్చారు. ఈ విదంగా సైటు 99 లో గల సర్వదేవాలయంలో జరిగింది. పుష్పభద్ర, నవగ్రహ, యుక్ష, కార్తికేయ ఆలయాలలో గర్భగృహాలు బౌద్ధుల స్తూపచైత్యాలవలె గజపృష్ఠాకారం లేక వృత్తాయుతంగా నిర్మింపబడ్డాయి. బ్రాహ్మణ దేవాలయాలలో దేవుడి కళ్యాణం జరపడానికి, ఉత్సవాలు జరపడానికి, నాలుగు స్తంభాల మద్యను వేదికను లేపి, ఆవరణ కల్పించడం జరిగింది. వీటిని ‘మండపిక’లు అనవచ్చు.

అష్ట భుజస్వామి ఆలయంలో (సైటు 29), పుష్పభద్ర స్వామి ఆలయంలో (సైటు 34) చిత్రాలు చెక్కబడిన స్తంభాలు రెండు లభించాయి. ఇవి పొడువుగా, అష్టభుజాకారం గల స్తంభాలు, ఇవి చిత్రాలు చెక్కబడి అలంకృతమైనవి. ఈ స్తంభాలు కల మండపాలు రాజసభలకు, దేవత యొక్క రంగ వైభవాలకు ఉపయోగించేవారు కాబోలు.

సైట్లు 64, 82 వీటిలో గల ఆలయ సముదాయాలలో చిన్న చిన్న గుడులున్నాయి. వీటిలో దీర్ఘ చతురస్రాకారంలోను, చతురస్రాకారంలోను, వృత్తాకారంలోను వేదికలున్నాయి. బహుశా ఈ ఆవరణ దేవతల కొరకు భక్తులు కట్టించిన గుడులు కావచ్చు. ఆకాలంలో బహు దేవతారాధన ఉండేది. అష్టపసువులు, యక్షులు, కుబేరుడు, నాగులు, నవగ్రహదేవతలు. ఈ ఉపదేవతలను పూజించేవారు.

సాధారణంగా ఆలయాల ముఖాలు నదివేపుకు తిరిగి ఉండేవి.

జల ముఖాలుగా, పశ్చిమ ముఖాలుగా ఉండేవి. అవి నదికి దూరంగా ఉంటే తూర్పు ముఖంగా ఉండేవి.

సైట్లు 99, 34 ల సర్వదేవాలయంలోను, పుష్పభద్రస్వామి ఆలయంలోను, గర్భగృహాలలో దేవతా విగ్రహానికి సమీపంలో దీపస్తంభాలుండేవి.

యక్ష-కుబేరాలయంలో సింహద్వారం దగ్గర మానస్తంభం ఉంది. ధ్వజస్తంభాల చివరున కేతువులు లేక లాంఛనాలు ఉంటాయి. పెద్ద ఆకారంలో ఎత్తుగా ఉంటాయి. ఈ స్తంభాలు. అష్ట భుజస్వామి ఆలయంలోను, పుష్ప భద్రస్వామి ఆలయంలోను, నోడగీవ్వరస్వామి ఆలయంలోను ఇవి లభించాయి. ఈ స్తంభాలు చాల బలంగా ఉన్నాయి. అడుగుభాగం వృత్తాకారంలోను, మధ్యభాగం అష్టభుజాకారంలోను, మీది భాగం చివరకు వాలుగల వర్తుల స్తంభాకారంలోను ఈ ధ్వజస్తంభాలు ఉండేవి. ఇటుకలతో కట్టిన ఎత్తైన వేదికల మీద వీటిని లేపేవారు. ఇటువంటి స్తంభాలు బౌద్ధచైత్యాలలో కూడా కనిపించాయి. బహుశ్రుతీయ విహారంలో ఒకటి లభించింది. వీటిపై ఉన్న శాసనాలను బట్టి, ఇవి ప్రప్రథమంగా లభించినవని తెలుస్తుంది.

నాగార్జునకొండ లోయలో లభించిన బ్రాహ్మణ దేవాలయాలలో మరొక ఆసక్తికరమైన సంగతి బయటపడింది. ఆలయాలకు సమీపంగా, ఆలయం యొక్క సామాను నిలువ చేసే గదులు, పురోహితులు ఇతర ఆలయ సేవకులు నివసించే గృహాలు నిర్మింపబడ్డాయి. ఇవి చతురస్రాకారంలోకాని, దీర్ఘచతురస్రాకారంలోకాని ఉన్నాయి. బౌద్ధుల విహారాలలో ఇటువంటి గదులే ఉన్నాయి. ఈ ఆలయాలు విశాలమైన ఆవరణలలో, చుట్టూ గోడలుండి, దేవుడికి ఎదురుగా కాని, నదికి ఎదురుగాకాని, పుష్కరిణికి ఎదురుగాకాని, ముఖ్య మార్గాలవేపు కాని తెరిచిన ద్వారాలతో కనిపిస్తాయి. వీటిలో దేవునికి ఎదురుగా తెరిచిన ద్వారాలు అలంకృతమై పెద్దవిగా ఉన్నాయి.

చాల బ్రాహ్మణ దేవాలయాలు కృష్ణా నదీతటాన్న ఉండడం చేత వరదలలో గట్లు కోరుకుపోయి, ఆలయానికి నష్టం కలగకుండా, దాపుగా నీటిలోకి కట్టిన రాతి గోడలు బయటపడ్డాయి.

బౌద్ధుల కట్టడాలతో సరిపోలిస్తే, బ్రాహ్మణ దేవాలయ సముదాయాలలో, ఆలయంపైన అలంకరించిన శిల్పాలు లేవనే చెప్పుకోవాలి. గోడలలో తాపిన స్తంభాలు లేవు. పునాది గోడల అడుగుభాగంలోకూడా ఏవీ ప్రత్యేకంగా కనిపించవు. ఇటుకలతో కట్టిన అడుగుభాగంలో, నిరలంకృతమై సాధారణంగా కనిపించే గోడ పై భాగం జగతి బయటపడ్డాయి. ఆలయాల వెలుపలి గోడలకు కడప రాతి పలకలు తాపారు. ముఖ్య ద్వారాల దగ్గిర, మండపాల దగ్గిర, చిన్న పిట్ట గోడతోనున్న మెట్లున్నాయి. మెట్లకు ఇరుపక్కల కట్టిన స్తంభాలమీద మకరాలు, గజముఖాలు చెక్కబడ్డాయి. చంద్రకాంత శిలను ముందుమెట్టుగా ఉపయోగించారు.

పై కప్పుల నుండి కారే నీళ్లు పోయే ఏర్పాటులు చాల చోట్ల కనిపిస్తాయి. శిలాస్తంభాలు కల కొన్ని మండపాలను బయటికి తీసినప్పుడు, కూలిపోయిన పైకప్పులు కాలిపోయి ధ్వంసమైనట్లు తెలుస్తుంది. దీనిని బట్టి, కొన్ని ఆలయాలు పైకప్పులు కర్రవాసాలతోను, పూరీ గడ్డి నేతితోను ఉన్నట్లు రుజువవుతుంది.

సర్వదేవాధివాసంలో (సైటు 99) పూజాపాత్రలు ధూపానికి హారతికి ఉపయోగించిన గరిటెలు, పూవులుంచే పళ్లాలు, విభూతి ఉంచే ఘటాలు లభించాయి. ఆలయాలలో పూజలు గొప్పగా జరిగినట్లు వీటిని బట్టి తెలుస్తుంది. పూజా పాత్రలు వెండితోను, బంగారంతోను చేసినవి. ఆగమశాస్త్రంలో చెప్పినట్లు లోతుగా ఉండే పాత్రలివి. వీటిపైన గోప్యమైన గురుతులు షట్కోణం, మద్యబిందువు కలిగి ఉన్నాయి. ఇవి శివ-శక్తి చిహ్నాలు. అభిషిక్తజలం లేక పాదతీర్థాన్ని భక్తులకు ఇవ్వడం కోసం, ప్రత్యేకమైన శంఖాలు, కన్నాలు కలవి లభించాయి. అష్టభుజస్వామి ఆలయంలో అటువంటి శంఖాలు ఆరు దొరికాయి. నాగార్జున కొండ లోయలోనున్న శైవాలయాలలో నిత్యాభిషేకం, అర్చన, తర్లీ ప్రసాదాలను పంచడం, విభూతిని పంచడం ఆచారంగా ఉండేవి.

అంతే కాక, దేవుళ్లకు నిత్యపూజలు, ప్రత్యేకమైన పూజలు, ప్రతి సంవత్సరం చేసే ఉత్సవాలు జరిగేవి. వారికి కళ్యాణాలు, సాధారణమైన ఉత్సవాలు జరిగేవి. వీటికోసం కంచుతోను, రాతితోను చేసిన విగ్రహాలుండేవి. పుష్కరుణులలో ‘తెప్పోత్సవాలు’ జరిగేవి. సైటు 122 లో తెప్పకులం పెద్ద చెరువు రాతితో కట్టినది బయటపడింది. రాజులు వారి కుటుంబాలు, ఈ ఉత్సవాలలో పాల్గొనేవారు. కుపాలు అంటే చిన్ననూతులు, నాపులంటే పెద్ద నూతులు, లేక దిగుడు బావులు ఇవి సైటు 57 లోను, సైటు 64 లోను కనిపించాయి. యక్ష కుబేరుడి ఆలయంలో (సైటు 64) ఒక దిగుడుబావి ఉంది. దాని పేరు మహానంద.

బ్రాహ్మణ దేవాలయ సముదాయాలలో కార్తికేయుడు ముఖ్యదేవత. చాల ఆలయాలు మహాసేనుడికి సంబంధించినవి. మొదటి ఇక్ష్వాకు ప్రభువైన ఛాంతమూలుడు మహాసేన పరిగృహీతుడని శాసనాలలో ఉంది. కార్తికేయుడు లేక మహాసేనుడు శ్రీ పర్వతస్వామి కావచ్చు. కార్తికేయుడి విగ్రహాలు చిన్నవి కంచుతో చేసినవి ఇక్కడ వెలువడ్డాయి. రాజులు ధనికులు, కార్తికేయుడిని పూజించేవారని దీనిని బట్టి తెలుస్తుంది.

ఆరు కార్తికేయ శిలావిగ్రహాలు, ప్రత్యేకమైన ఒక కంచు విగ్రహం, ఇది పూజకు ఉత్సవాలకు ఉపయోగించేది నాగార్జునకొండ త్రవ్వకాలలో, దేవాలయాలలో లభించాయి. దొరికిన అన్ని విగ్రహాలకు రెండు చేతులే ఉన్నాయి. విగ్రహం కుడిచేతిలో దండముంది. ఎడమచేయి కటి ప్రదేశంలో కుక్కుటాన్ని పట్టుకున్నట్లుంది. ఈ విగ్రహాలకు యజ్ఞోపవీతం లేదు. చాళుక్యులు, పల్లవులు కొలిచిన కార్తికేయ విగ్రహాలకు యజ్ఞోపవీతముంది.

ఈ కంచు విగ్రమం కుమారస్వామిది. అప్పటికి ఆయనకు ఉపనయనం కాలేదు కాబోలు. ఈ విగ్రహానికి ఒక చేతిలో విల్లు, కుడిచేతిలో అమ్ము ఉన్నాయి. మొదటి ఈ విగ్రహం సిద్ధార్థుడిదని భావించారు. తరువాత కోదండరాముడిదన్నారు. ఈ విగ్రహం సైటు 57లోనున్న కార్తికేయుడి ఆలయానికి సమీపంలో దొరికింది. సైటు 58 ఈ ఆలయానికి సమీపంలో ఉంది. అక్కడ కంచు, ఇత్తడి మొదలైన లోహాలతో పనిచేసేవారి నివాసాలు, వారి కర్మాగారాలున్నాయి. ఆలయాలలో బంగారు, వెండి, రాగి వీటితో తయారుచేసిన పాత్రలు, బంగారు వెండితో చేసిన ఆభరణాలు వాడేవారని సైటు 99, 34లో జరిగిన తవ్వకాలలో బయటపడింది.

సైటు 82లో బయటపడ్డ ఆలయంలో కార్తికేయుడు సమ భంగస్థితిలో నిలబడి ఎడమ చేతిలో కుక్కుటాన్ని పట్టుకున్నాడు. ఈ విగ్రహం గర్భాలయం మధ్యన లభించింది. ఈ ఆలయం దుర్గానికి నైరుతి దిక్కున ఉండే కోట బురుజుకు సమీపంలో ఉండేది. ఈ దేవసేనాపతిని విజయపురి నగర దేవతగా భావించవచ్చు.

సైటు 82లో మరొక కార్తికేయుడి విగ్రహం దొరికింది. విరిగిన మరొక విగ్రహం సైటు 64లో దొరికింది.

కార్తికేయుడికి చాల ఆలయాలున్నాయి. అతని యందు ఇక్ష్వాకులకు అమిత భక్తి అని వెల్లడవుతుంది.

విజయపురి ఇక్ష్వాకులు తొలుత అయోధ్యలో ఉండి, ఉత్తర దిక్కునుండి దక్షిణ కోసల మీదుగా నాగార్జునకొండకు వలస వచ్చి ఉండవచ్చు.

సైటు 123లో కార్తికేయుడి శిరస్సు ఒకటి దొరికింది.

సైటు 39లో సమభంగస్థితిలో నిలుచున్న దేవసేన విగ్రహం లభించింది. ఇది భారతదేశంలో లభించిన దేవసేన విగ్రహాలలో మొదటిది. కంకణాలు, కేయురాలు, ప్రకోష్ఠవలయాలు మొదలైన బాహు భూషణాలతో, చాల వరుసలున్న కంఠహారాలతో ఈ దేవి అలంకరింపబడింది. ఈ విగ్రహం కటి భాగమందు మూడు మేఖలలున్నాయి. దిగువనున్న మేఖలకు ముత్యాల వరుసలున్నాయి. ఈ విగ్రహం ముణుకుల కింది భాగం విరిగి పోయింది.

సైటు 34 లో పుష్పభద్రస్వామి ఆలయముంది. ఇక్కడ విగ్రహమేదీ లభించలేదు. రమారమి నాలుగడుగులు ఎత్తున్న సున్నపురాతి లింగం అక్కడ దొరికింది. దాని పైన దేవతామూర్తిని కర్రతో తయారుచేసి ఉండవచ్చు. కాలగర్భంలో అది కలిసిపోయింది.

నోడగీవ్వర స్వామి ఆలయ సముదాయంలో ఒక స్తంభాల మండపంలో చాల బాణలింగాలు, ఎత్తుగానున్న వేదిక మీద లభించాయి.

సున్నపురాతి నంది విగ్రహాలు, త్రిశూలం, యక్షుడు, సైటు 64 లో కుబేర యక్షుని విగ్రహం, మూడు విద్యాధర ప్రతిమలు తవ్వకాలలో లభించాయి.

సైటు 17లో నిలువెత్తు హారీతి విగ్రహం లభించింది. తల్లి తన చేతులలో శిశువును ఎత్తుకుంది. ఎత్తుగానున్న పీఠం మీద కూర్చుని కాళ్ళు వేల వేసుకుంది. విగ్రహం యొక్క పై భాగం మాత్రమే లభించింది. అక్షయనీవిగా, శాశ్వతంగా దీపం వెలిగించడానికి ఎవరో దానం చేసినట్లు శాసన మొకటి చెప్తుంది. ఆలయం పక్కను లక్కగాజులు, దంతపు గాజులు హెచ్చు సంఖ్యలో లభించాయి. బ్రాహ్మణ దేవాలయాల పరిసరాలలో ఈ రకం గాజుల పరిశ్రమ ఉన్నట్లు తెలుస్తుంది.

మరొక హారీతి విగ్రహం సైటు 56 లో లభించింది. ఈ విగ్రహం ఉన్నతమైన పీఠం మీద ప్రలంబపాదయై కూర్చుంది. ఈ విదమైన హారీతి ఆరాధన ఇక్ష్వాకుల తరువాత కాలంలోను కొనసాగినట్లు తెలుస్తుంది.

సైటు 125 లో మాతృదేవతా విగ్రహమొకటి బయటపడింది. 1940వ సంవత్సరంలో శ్రీ కే. రామమూర్తి అన్న అతను ఈ విగ్రహాన్ని కనుగొన్నారు. అప్పుడతను ఆర్కిలాజికల్ డిపార్ట్‌మెంటు సూపరెంటిండెంట్ దక్షిణశాఖ మద్రాసు వారి క్రింద పనిచేసేవారు. అతను నాగార్జునకొండ ఆర్కిలాజికల్ మ్యూజియంకి అధిపతి. తెల్లటి పాలరాతిమీద చెక్కిన విగ్రమం అవయవ విహీనమైన, నాగార్జున కొండ ఉత్తరపు వాలులో కనిపించింది. నదికి సమీపంగా నున్న చెత్తకుప్పలో ఈ శిల్పం కప్పబడింది. శ్రీయుతులు రామమూర్తిగారికి చాల స్తంభాలున్న పెద్ద మండపం యొక్క అవశేషాలు కనిపించాయి. ఈ మండపం యొక్క చివరన ఈ విగ్రహం పడివుంది. విగ్రహం యొక్క మీది భాగంకోసం వెతికినా ప్రయోజనం లేకపోయింది.

ఈ శిలా విగ్రహం నగ్నంగా ఉన్న స్త్రీ మూర్తిది. కడుపు క్రింద భాగమే ఆ విగ్రహంలో మిగిలింది. నగ్నంగానున్న అడుగు భాగం కొంచెం పరికించి చూస్తే, ఆ విగ్రహం యొక్క కడుపు, పూవులతో, లతలతో అలంకరింపబడిన పేర్ల ఘట్టాన్ని పోలి ఉంది. మేఖల క్రింద భాగంలో స్త్రీ జననాంగం చాల పెద్దదిగా కనిపిస్తుంది.

ఏహువుల ఛాంతమూలుని రాణి, మహాదేవి ఖందువుల తయారు చేయించిన విగ్రహమిది. విగ్రహం అడుగు భాగంలో ఒకే ఒక పంక్తిలోని శాశనముంది. తన భర్త, పుత్రుల యొక్క దీర్ఘాయువు కోసం, క్షేమం కోసం దానిని ఆమె నిర్మింపచేసింది.

‘సిద్ధమ్ మహాదేవియ అవిధవాయ జీవపుతాయ మహారాజు సిరి – ఏహువల ఛాంతమూలపతియా ఖందువులాయ కారితాతి’ –

అన్న శాసనం ప్రకృతంలో ఉంది. మహాదేవి ఖందువల ఈ విగ్రహాన్ని తయారు చేయించింది. ఆమె అవిధవ – జీవపుత్ర అనగా ఆమె భర్త ఏహువల ఛాంతమూల మహారాజు సజీవుడని, ఆమె పుత్రులు జీవించియున్న వారని ఈ శాసనం అర్థమిస్తుంది. ఇటువంటి విగ్రహాలను లజ్జ గౌరీదేవి విగ్రహాలుగా

భావిస్తారు. మనకు లభించిన విగ్రహం యొక్క పై భాగం మాత్రం లభించలేదు. పెండ్లయిన ఆడ పిల్లలు గర్భధారణ కోసం నగ్న మాతలను పూజిస్తారట.

సైటు 125 లో ఒక స్త్రీ విగ్రహం లభించింది. వైభవంగా అలంకరింపబడిన విగ్రహమది. ఆ విగ్రహానికి శిరస్సు, కాళ్ళు విరిగిపోయాయి. ఈ విగ్రహం శృశానస్థలంలో లభించింది. చేతులు ఒక దానిపై ఒకటి అడ్డుగా ఉన్నాయి. భుజాలకు అంగదాలు, చేతులకు గాజులు, కంకణాలు, మెడలో కంటె మొదలైన అలంకారాల వలన ఆమె రాజకుటుంబానికి చెందిన స్త్రీ అని తెలుస్తుంది. ఆమె జడపాయల చివరలను కుచ్చులున్నాయి. కుచ్చుల పైన చిన్న కిరీటం, ఒక పువ్వు మొదలైనవి ఉన్నాయి.

పైన చెప్పిన విగ్రహానికి సమీపంలో అటువంటి విగ్రహమే మరొకటి లభించింది. ఈ విగ్రహం అంతగా అలంకరింపబడలేదు. నీవీ బంధం స్ఫుటంగా కనిపిస్తుంది. పెద్ద చీరమడత తొడలను కప్పుతున్నది. అంచులు పెద్దవిగా ఉన్నాయి. కుడిచేయి పైకి లేచి ఉంది. ఆ చేతికి మూడు అంగదాలున్నాయి. ఎడమ చేయి కటిపై ఉంది.

సైటు 126లో, ఒక స్త్రీ నిచ్చెన దిగుతున్నట్లు ఉన్న విగ్రహమొకటి లభించింది. ఇది చక్కని శిల్పం. విలాసినియైన వనిత, బహుశా ఆమె రాణి కావచ్చు. భర్త పోయిన స్త్రీ, నిచ్చెన దిగి చితిలోకి దూకడానికి ప్రయత్నిస్తున్నది. చితికి నాలగు పక్కలను మంటలు పూకి లేస్తున్నాయి. ఆమె తపస్విని కావచ్చు. ఆమె జుత్తు జడలు కట్టింది. ఆ జడలు శిఖగా చుట్టి కుడివైపున ఉన్నాయి. ఆమె శరీరం మీద ఆభరణాలు ఏవీ లేవు. కనీసం చూడామని కూడా లేదు. ఆమె చిన్నబట్ట కట్టుకుంది. ఇక్ష్వాకుల రాజకుటుంబానికి చెందిన మహిళ సతీ సహగమనం చేస్తున్నట్లుంది. శ్మశానంలో లభించిన ఈ విగ్రహం మహాదేవి సిరివమ్మ భట్టగా పోల్చవచ్చు. ఈమె ఏహువల ఛాంతమూలుని పట్టపురాణి. రాజు రుద్రపురుషదత్తుని తల్లి. ఆమె జ్ఞాపకార్థం చాయాస్తంభం ప్రతిష్ఠించబడింది. ఈ స్మారక స్తంభం యొక్క పై భాగం, అర్ధవృత్తాకారంగా ఉన్నది. సైటు 13 లో లభించింది. (ఇది విశ్రాంతి గ్రహం). ఈ భాగం మీద ఒక చిత్రం చెక్కబడి ఉంది. రాజభవనంలో రాణి ఒక మంచం మీద కూర్చొని, ఒక చేతిలో అద్దం పట్టుకొని, తన ఆకారాన్ని దానిలో చూసుకుంటూ, తన శరీరం పై ఉన్న ఆభరణాల నన్నింటిని తీసి వేస్తున్నది.

ఇక్ష్వాకుల రాజులలో నాలుగవవాడైన వాసిష్టీపుత్ర రుద్ర పురుష దత్తుని అయిదవ పాలనా సంవత్సరంలో నోడుకసిరి అన్న అతడు భగవాన్ హలంపురస్వామి ఆలయానికి భూమిని దానం చేసినట్లు ఒక శాసనంలో పేర్కొనబడింది. ఈ హలంపురస్వామి, మహబూబ్ నగర్ జిల్లాలో, అలంపూర్ లో నున్న బాల బ్రహ్మేశ్వరుడంటారు. ఈ నోడుకసిరి, ఏహువల చాంతమూలుని రాజసభకు చెందిన ప్రముఖ రాజోద్యోగి కావచ్చు. సైటు 127లో ఉన్న నోడగీశ్వరస్వామి ఆలయానికి ఇతనే ముఖ్యపోషకుడు కావచ్చు. అందచేతనే ఈ ఆలయానికి నోడగీశ్వరస్వామి పేరు వచ్చింది.

నాగార్జున కొండలోయలో నున్న బ్రాహ్మణదేవాలయంలో అష్టభుజస్వామి ఆలయం మొట్టమొదట నిర్మింపబడింది. ఇది కృష్ణానదీ తీరాన్న, లోయకు ఈశాన్యదిక్కున, మూడు భాగాలుగా నిర్మింపబడింది. దీర్ఘ చతురస్రాకారంగా ఉన్న దీని చుట్టూ ప్రహారీగోడ ఇటుకలతో నిర్మిపంబడింది. రెండువందల ముఫ్పై అడుగుల పొడవు, నూట నలభై అయిదు అడుగుల వెడల్పు గల స్థలంలో ఈ ఆలయం నిర్మింబడింది. ఈ నిర్మాణం చాల దశలలో జరిగినట్లు తెలుస్తుంది. ఆలయంలో మొదటి భాగం తొలిదశలో నిర్మింపబడింది. ఈ భాగం నది గట్టుకు సమీపంలో ఉంది. మూడు వరుసలలో ఉన్న 36 స్తంభాలు కల మండపమిది. ఈ మండపం చుట్టూ ఇటుక గోడ ఉంది. పొడువుగా ఉన్న నడవలు కల ఈ భాగం నదికి అభిముఖంగా ఉంది. రెండవ దశలో ఈ ఆలయాన్ని కొంతవరకు ప్రజలు ఆక్రమించారు. ఒక దీర్ఘ చతురస్రాకారంలో ఉన్న ఒక ఆవరణ గురించి పథకం వేశారు. ఆవరణ వెడల్పు రమారమి నలభై అయిదడుగులు, పొడవు అరవై అడుగులు. ఈ రెండవ భాగం నాలుగు వేపుల గదుల వరుసలు కలిగి, ఉత్తరాన్న పెరడు ఉన్నట్లు నిర్మించబడింది. ఈ గదులన్నీ తొమ్మిదడుగుల వెడల్పు ఉన్నాయి. వీటి పొడువులు మాత్రం వేరువేరుగా ఉన్నాయి. పశ్చిమం వేపునన వరుసలో ఒకొక్క గది తొమ్మిదడుగులు వెడల్పు, ముప్పయి యేడడుగులు పొడవు కలిగి ఉంది. తూర్పు వరుసలో ఉన్న ప్రతి గది తొమ్మిదడుగులు వెడల్పు, నలబై రెండడుగుల పొడుగు ఉంది. ఉత్తర దక్షిణాలకున్న వరుసలలో ఒకొక్క గది తొమ్మిదడుగుల వెడల్పు, ఇరవై నాలుగడుగుల పొడవు ఉంది. ఈ ఆలయ సముదాయానికి దక్షిణాన్న ఇటుకలతో కట్టిన ఒక గది ఉంది. దాని పొడవు ఇరవై నాలుగు అడుగులు, వెడల్పు ఇరవై రెండడుగులు బహుశా దీనిని వంటగదిగా ఉపయోగించేవారు కాబోలు. పెరటి భాగంలో ఇటుకలతో కట్టిన కుండీలు, కనిపించాయి. బహుశా వీటిని నీరు నిలువచేసుకోవడానికి ఉపయోగించి ఉంటారు. మండపంలో ఒక కుండీ ఉంది. దీనిని సున్నం దంచడానికి ఉపయోగించినట్లు తెలుస్తుంది. ఈ మండపం నదికి సమీపంలో ఉండడం చేతను, నదిలోకి దిగడానికి మెట్లుండడం చేతను, ఇది యాత్రికులకు వండుకోడానికి, బస చేయడానికి ఉపయోగించినట్లుంది. ఈ భాగానికి ఆనుకొని, తూర్పు భాగంలో పెద్ద ఆలయసముదాయం నిర్మింపబడింది. గర్బాలయం ఏభైనాలుగు అడుగుల పొడవు, ముప్పయి రెండడుగుల వెడల్పు ఉంది. దీని ఎదుట ఒక స్తంభాల మండపముంది. ఒకొక్క స్తంభం పదహారడుగుల పది అంగుళాల ఎత్తుంది. అటువంటివి 28 స్తంభాలున్నాయి. ఈ స్తంభాల మండపానికి ఉత్తరంగా ఒక దేవాలయముంది. దీని గర్భగృహం గజపృష్ఠాకారంలో ఉంది. రమారమి ఇరవై అడుగులు పొడవు, తొమ్మిదడుగులు వెడల్పు కలిగి ఉంది. దీనికి ఎదురుగా 16 స్తంభాల ముఖమండపం, ఇరవై ఎనిమిదడుగుల పొడవు, ఇరవై ఆరడుగుల వెడల్పు కలిగి ఉంది. ఈ రెండు గర్భాలయాలు పిట్టగోడలున్న మెట్ల వరుసలతో కప్పబడ్డాయి. కడపరాతి పలకలను చంద్రకాంత శిలాఫలకాలను మెట్లకు అతికారు. ఈ రెండు ఆలయాల చుట్టూ ఇటుక గోడల వరుసలను లేపారు.

ముఖమండపం గల ఆలయం, గజపృష్ఠాకారం గల గర్భాలయంతో, తూర్పు ముఖంగా ఉంది. గర్భగృహం దగ్గిర మంగళ సూచకంగా, పూర్ణ కలశాలను చెక్కిన రెండు ఫలకాలను అమర్చారు. గర్భగృహంలో ఏ విగ్రహాన్ని ప్రతిష్ఠించినట్లు లేదు.

స్తంభాల మండపం, దానికి పడమట గల రెండు ఆలయాలు శిథిలమయాయి. ఆ శిథిలాల మీద, తరువాత కాలంలో రాతిగోడ కట్టినట్లుంది. ఈ గోడ, మొదటి దశలో వేసిన పునాదులను బయట పెడతున్నది. 28 స్తంభాలు కల మండపాన్ని ఆలయంగా మార్చినట్లు తెలుస్తుంది. ఈ స్తంభాలలో నాలుగింటికి చుట్టూ గోడలు లేపి గర్భగృహంగా తీర్చారు. ఇటువేపు అటువేపు దీర్ఘచతురస్రాకారపు గదులు, ఆ గదుల చివర, చిన్న ఇరుకుగా ఉన్న గర్భగృహాలను నిర్మించారు. ఈ గర్భగృహానికి ఎదుట వర్తులంగా ఉన్న రాతి వేదిక మీద ధ్వజస్తంభం లేవనెత్తారు. ఇటువంటి ధ్వజస్తంభమే పుష్పభద్రస్వామి ఆలయంలో లభించింది. ఇటుకతో నిర్మించిన ఈ పూజాగృహం వెలుపల, తవ్వకాలలో, శాసన ఫలకమొకటి దొరికింది. ఈ పలకమీద ఈ ఆలయం అష్టభుజస్వామికి అంకితమీయబడింది.

తూర్పు దిక్కున చతురస్రంగాను, దీర్ఘ చతురస్రంగా ఉన్న వేదికలు, ఇటుకతో కట్టినవి లభించాయి. వీటి ప్రయోజన మేమిటో ఇంకా తెలిసిరాలేదు.

ఈ ఆలయం ఆవరణకు వెలుపల, ముఖ్య ద్వారానిక కుడి చేతి వేపు, 12 స్తంభాల మండపమొకటి బయటపడింది. దీని చుట్టూ గోడ ఉంది. ఈ మండపమెందుకో తెలియదు.

సైటు 127 నోడగీశ్వరస్వామి ఆలయం దాని సమీపంలో, నాగార్జున కొండ వాయువ్య భాగమందు, కొండవాలులో, భవన సముదాయం బయటపడింది. దీనిని ఇక్ష్వాకుల దహన భూమిగా పోల్చారు. ఇక్కడో దీర్ఘ చతురస్రాకారపు దేవగృహముంది. దాని పొడవు నలబై ఏడడుగులు, వెడల్పు పది అడుగులు. ఇటుకతో కట్టినదిది. ఇది శిథిలస్థితిలో బయటపడింది. ఇక్కడ ఉన్న శివలింగం, ప్రతిష్ఠించిన చోటున లేదు. దూరంగా ఉంది. ఈ దేవగృహానికి ఎదురుగా ధ్వజస్తంభం పన్నెండడుగుల ఎత్తున ఉంది. దీని అడుగుభాగం ఒక వేదికకు తగిలి ఉంది. ఇక్కడ నొక శాసనం దొరికింది. ఏహువల ఛాంతమూలుని కాలం నాటిది. ఆ శాసనంలో ఆ ఆలయాన్ని దేవకులమనని పేర్కొనడం జరిగింది. నది ఉత్తరపు వంపులో వేదికను స్థాపించినట్లు అందులో ఉంది. శ్మశానాలలో శివాలయాలను కట్టించడం ఆచారం దహనక్రియ తరువాత శివలింగాన్ని చూడడం ఆనవాయితీ.

సైటు 126లో పెద్ద స్తంభాల మండపమొకటి బయటపడింది. దీనిలో కూర్చోడానికి ఏర్పాటులున్నాయి. ఈ మండపంలో బాణలింగాలు ఒక చివరను పాతి ఉన్నాయి. అడ్డుగోడలున్న మండపముంది. ఇది రాజవంశంవారి శ్మశానంగా గుర్తింపబడింది. అక్కడ ఒక యువతి శిల్పం లభించింది. ఆమెకు నీవీ బంధం మాత్రమే ఉంది. ఆమె శరీరం పై ఆభరణాలు కానీ, చేతులకు గాజులు కాని లేవు. జుత్తు పక్కకు ముడివేసి ఉంది. ఆమె నిచ్చెననుండి క్రిందనున్న నాలుగు అగ్నులలోనికి దిగుతున్నది. ఇది సతిని లేక ఆత్మాహుతిని సూచిస్తున్నది. అక్కడ రెండు కడపరాతి పలకల మీద లభించిన శాసనంలో ‘స్వమేధము’ అని ఉంది. అనగా ఆత్మాహుతి అని అర్థం. ఆమె వామాచారానికి సంబంధించిన అవైదికమైన తపస్సు చేస్తున్నదని, అందుకే శ్మశానంలో ఈ విగ్రహముందని కొంత మంది అభిప్రాయపడుతున్నారు.

సైటు 34 లో పుష్పభద్రస్వామి ఆలయం బయట పడింది. నాగార్జున కొండ వాయువ్య భాగంలో ఇది ఉంది. కృష్ణానది అక్కడ ఉత్తరం వేపు తిరుగుతుంది. ఈ దేవాలయానికి ఎదురుగా రాజ కుటుంబాల వారు స్నానాలు చేసే ఘట్టముంది. రాతి పలకలు తాపిన ఈ స్నానఘట్టం ఈ ఆలయంలో ఒక భాగమయి ఉంటుంది.

ఈ ఆలయ సముదాయం చుట్టూ ఇటుక గోడ ఉంది. ఈ గోడకు నాలుగు వేపుల ద్వారాలు ఉన్నాయి. పడమటి వేపుననది సింహద్వారం. దీని నుంచి పైకిపోతే స్నానఘట్టం ఎదురవుతుంది. ఉత్తరానికి, తూర్పుకి చిన్న దారులున్నాయి.

ఈ ఆలయం తొలిదశలో నిర్మింపబడింది. గర్భగృహం, ముఖమండపం, ధ్వజస్తంభం ఒకటి కొకటి సరిగా అనుసంధానించబడి ఉన్నాయి. చుట్టూ ప్రాకారముంది.

గర్భగృహం గజపృష్ఠాకారంలో ఉంది. దాని నేల కడపరాతి పలకలతో తాపబడింది. ముందు మెట్టు చంద్రకాంత శిలతో నిర్మింపబడింది. అభిషేకజలాన్ని పట్టడానికి ఆలయం దక్షిణ భాగంలో ఒక కుండిక ఉంది. గర్భగృహంలో శివలింగముండేది. సున్నపురాతితో చేసిన శివలింగం మరొక చోట లభించింది. వంపుగా ఉన్న చోట ద్వారా పాలకుల విగ్రహాలను, దీపస్తంభాలను నిలిపారు. ముఖమండపం చతురస్రంగా ఉంది. దానికి 16 స్తంభాలున్నాయి.

గర్భగృహం పైకప్పు దొప్పదేరి ఉంది. చతుశ్శాల పైకప్పు బల్లపరుపుగా ఉంది. ముఖమండపంలో చివరి వరుస స్తంభాల పరిధిలో చిన్న చదరపు గది ఉంది. బహుశా ఇది ఉత్సవ మండపమయి ఉంటుంది.

పశ్చిమ ద్వారానికి సమీపంలో, ఇటుకలతో కట్టిన పెద్ద ధ్వజస్తంభం లేపబడింది. ఇది అడుగుభాగంలో వర్తులంగాను, మధ్యభాగంలో అష్టభుజాకారంగాను, మీది భాగం వాలుగాను ఉంది. ఈ స్తంబం మీద శాసనమొకటి లభించింది.

ధ్వజస్తంభం పైన ఉన్నశాసనం నిర్దుష్టమైన సంస్కృత భాషలో, పది పంక్తులలో చెక్కబడింది. ఈ ఆలయం దేవకులమని, అందలి దేవుడు పుష్పభద్రస్వామి అని అందులో ఉంది. ఆలయంలో నందీశ్వరుని విగ్రహం చిన్నదొకటి లభించింది.

దక్షిణపు గోడనానుకొని చతురస్రాకారంలో ఉన్న మూడు గదులవరుస బయటపడింది. బహుశా ఈ గదులు అర్భకుల వసతికో లేక సామాను నిలువ చేయడానికో అయి ఉంటాయి.

ఈ ఆలయం ధ్వజస్తంభం మీద ఉన్న శాసనం గ్రీష్మఋతువులో, మొదటి పక్షంలో, నవమినాడు, ఏహువల ఛాంతమూలుని 16వ పాలనావత్సరంలో, మహారాజకుమార ద్వితీయ వీరపురుష దత్తునిచే ఆలయం ప్రతిష్ఠింపబడినట్లు చెప్తుంది. ఈ ద్వితీయ వీర పురుషదత్తుడు పట్టమహిషి కుపణశ్రీ కి, ఏహువల ఛాంతమూలుడికి పుత్రడు. ఇతడు మహా సేనాపతి అని, హారీతిపుత్రుడని శాసనంలో పేర్కొనబడింది. తండ్రి తరపువారికి, తల్లి వంకవారికి, ఈ రెండు గోత్రాల వారి విజయం కొరకు, వారి దీర్ఘాయువు కొరకు, ఈ ఆలయం అంకితమీయబడింది. ‘ప్రదకటము’ అన్న పేరుగల గ్రామం బహుశా ఇది నేటి పుట్ల గూడెం కావచ్చు ఆలయంలో జరిగే నిత్య సేవల కొరకు శాశ్వతంగా దానమీయబడింది. తండ్రి వంశం యొక్క ప్రవర, తల్లి వంశం యొక్క ప్రవర దీనిలో చెప్పబడ్డాయి.

సగర – దిలీప-అంబరీష-యుధిష్ఠిర తుల్యధర్మవిజయస్య –

రామస్యేవ సర్వజనాభి రామస్య-ఇక్ష్వాకూణాం – శ్రీ యహవల ఛాంతమూలస్య –

అని శాసనం అయిదవ పంక్తిలో ఉంది.

సైటు 123 లో, పుష్పభద్రస్వామి ఆలయానికి ఉత్తరాన చిన్న ఆలయసముదాయం బయటపడింది. ఈ ఆలయం కార్తికేయుడికి అంకితమీయబడింది. ఇది మధ్య శతాబ్దాలలో దెబ్బతింది. కార్తికేయుని శిరస్సు మాత్రం ఈ స్థలంలో లభించింది. ఈ ఆలయ సముదాయం నాగార్జునకొండకు నైరుతి దిక్కున ఉంది. మహాసేనుడు, లేక కార్తికేయుడు దుర్గాన్ని రక్షించేదేవత.

సైటు 122లో ఒక పెద్ద చెరువు బయటపడింది. రమారమి మూడు వందల అడుగుల పొడవు, రెండు వందల నలభై అడుగుల వెడల్పు, పదిహేను అడుగుల లోతుగల ఈ చెరువు రాతితో కట్టబడింది. బహుశా ఇది తెప్పకులమయి ఉంటుంది. సంవత్సరం సంవత్సరం జరిగే ఉత్సవాలకు, పుష్పబద్రస్వామి ఆలయానికి, కార్తికేయుని దేవాలయానికి ఉపయోగించేది.

సైటు 98, సైటు 99లో సర్వదేవాధివాసం అన్న ఆలయ సముదాయం బయటపడింది. ఛందోబద్ధమైన సంస్కృత శ్లోకాలలో రచింపడిన ఒకే రకమైన శాసనం, ఆరులేక ఏడు చోట్ల చెక్కబడింది. రాజన్ ఏహువల ఛాంతమూలుని 11వ పాలనా సంవత్సరంలో ఈ ఆలయం ప్రతిష్ఠింపబడింది. ఏడు శాసనాలు, ఏడు కార్తికేయ ఆలయాలకు సంబంధించినవి, ఇవన్నీ ఏహువల ఛాంతమూలుని 11వ సంవత్సరంలో, నదీతటాన నిర్మింపడినది.

ఈ శాసనం యొక్క మంగళాంతంలో ‘సర్వదేవాది’ అని ఉంది. ఈ ఆలయం అందరు దేవుళ్ళకు చెందింది. ఉత్సవాల సందర్భంలో నదీతీరాన్ని గల ఈ ఆలయం అందరు దేవుళ్లకు తాత్కాలికమైన వసతిగా ఉండేది.

ఈ ఆలయ సముదాయాన్ని రాజాధికారులు కట్టించారు. వారు ఇక్ష్వాకుల కొలువులో ఉండేవారు. ఈ దేవాలయ సముదాయంలో మూడు పెద్ద విభాగాలున్నాయి. మొదటి రెండు విభాగాలను దేవీప్రాసాదం, కుమారప్రాసాదం అంటారు. వీటిని రాజుగారి తాతగారు అనిక్కి కట్టించారు. అతను మహాసేనాధిపతి. చాల యుద్ధాలలో విజయం పొంది ఖ్యాతి వహించాడు. పలు అంతస్తులు గల ఈ ఆలయాన్ని తలవరవరమని అంటారు. ఈ కార్తికేయ ప్రాసాదాన్ని గండిపుత్రడు, సతలవరవరుడు, కట్టించాడు. అతని పేరేదో తెలియదు. ఏలి లేక ఏలికశ్రీ దానిని పూర్తి చేశాడు.

“ఏలిశ్రీ శ్రీవిశాలం శుభమతి రకరోత్”

అని శాసనంలో ఉంది. శ్రీవిశాలం అంటే పలు అంతస్తులు కల భవనం. దీనికి మండపాలు, ‘భద్రము’ అనబడే ముందువసారా ఉన్నాయి. ఈ ఆలయం ఏవిధంగా నిర్మింపబడింది. ఈ శాసనంలో ఉంది. అంతేకాక, ఏహువల ఛాంతములుని వరకు రాజకుటుంబంవారి పురోగతి కూడా ఈ శాసనం చెప్తుంది. ఏలికసిరి దీనిని సర్వదేవులకు శ్రీవిశాలంగా చేశాడు.

ఈ సర్వదేవాధివాసం నదీతటాన్న ఉంది. నాగార్జున కొండ లోయలో వెలువడిన భవనాలన్నిటిలోను ఇది చాల గొప్పది. ఈ ఆలయం రెండు దశలలో నిర్మింపబడింది. మొదటి దశలో ఒక స్తంభాల మండపాన్ని లేపారు. దీనినే ప్రాసాదం అంటారు. ఇది రెండు అంతస్తులలో ఉంది. కింది అంతస్తు తూర్పు వేపుంది. ఇది 32 స్తంభాల మండపం. రమారమి డెబ్బై మూడడుగుల పొడవు. ముప్పై ఏడడుగుల వెడల్పు ఉంటుంది. ఈ మండపానికి ఈశాన్యదిశగా ఉన్న మూలలో రెండు వరుసల స్తంభాల మద్య గోడలు అడ్డుగా కట్టి, ఇరవై మూడడుగుల పొడవు, ఇరవై రెండుడులు వెడల్పు గల పూజామందిరంగా రూపొందించారు. దీనిని వాయువ్యంగా ఉన్న మూలలో నాలుగడుగులు వ్యాసం కల ఒక వృత్తాకారవేదిక ఉంది. దీని మీద పంచాధిష్ఠానాలు, అంటే అయిదు దిమ్మలున్నాయి. పంచాధిష్ఠానాల మీదనున్న పైకప్పు కడపరాతి పలకలతో ఉంది. ఏ దేవుళ్ల విగ్రహాలో ఉంచడానికి ఈ వేదికను నిర్మించారు. దీనికి తూర్పున ఒకదారి, పడమట ఓ దారి ఉన్నాయి. పూజాగృహంలో మరొక వేదిక ఉంది. గోడకు తాపవలసిన విగ్రహం దానం మీద ప్రతిష్ఠించాలని కట్టినట్లున్నారు.

దీనికి పశ్చిమాన ఎత్తుగానున్న చోట మరొక స్తంభాల మండపం నిర్మించారు. దీని పొడవు రమారమి అరవై తొమ్మిది అడుగులు, వెడల్పు ముఫ్పై నాలుగు అడుగులు. దీని నేల ఎత్తుగా ఉంది. ఈ మండపాన్ని చేరడానికి దిగు మండపం నుండి మెట్లున్నాయి. మెట్ల పక్కను పిట్టగోడ ఉంది. మెట్లు చంద్రకాంత శిలాఫలకాలు, కడపరాతి పలకలు తాపినవి. ఈ మండపాన్ని నదివేపు పొడిగించారు. దిగువనున్న నేలను మూడు దశలలో ఎత్తు చేశారు. మొదటి దశలో పెంపుచేసిన భాగం రమారమి 50 అడుగుల వెడలుప, 69 అడుగుల పొడవు ఉంది. దీని పైకప్పు రాతిపలకతో చేసినది. పైకప్పు బరువును తీసుకోడానికి ఆధారంగా స్తంభాలు లేవనెత్తారు. రెండు స్తంభాలను మూడు స్తంభాలను కలిపి కట్టారు. ఇది నది ఒడ్డున ఉండడం చేత వరదలు వచ్చేటప్పుడు దెబ్బతినే అవకాశముంది. అందుచేత, నదివేపు ఒక గోడకట్టడమే కాకుండా మండపాన్ని కూడా నింపి దిట్టం చేశారు.

ఈ మండపానికి ఉత్తర దక్షిణాలలో మెట్ల వరుసలను లేపి మీది అంతస్తుకు పోడానికి ఏర్పాటు చేశారు. ఉత్తరాన ఉన్న స్తంభాల మండపానికి పోవడానికి, మూలను ఒక చూరుకింద రెండు మెట్లు కట్టారు.

ఈ మండపానికి దక్షిణాన్న మరొక మండపముంది. దీనిలో 16 స్తంభాలున్నాయి. ఇది రమారమి 32 అడుగుల చౌకం. దీనికి ఎదురుగా, తూర్పుదిక్కున, దిగువ భాగంలో ఒక ఇటుక కట్టడముంది. దీని పొడవు 51 అడుగులు. వెడల్పు 40 అడుగుల 6 అంగుళాలు. దీనికి బలమైన రాతి గోడ కట్టరు. ఈ కట్టడం బాగా శిథిలమయింది. దీనిలో, ఒక దీర్ఘచతురస్రాకారంగా నున్న పూజాగృహం, 18 అడుగుల పొడవు, 10 వెడల్పు కలిగి ఉంది. దీని ముందు నిడువుగా ఉన్న గది ఒకటుంది. ఇది 20 అడుగుల పొడవు, అరున్నర అడుగుల వెడల్పు ఉంది. ఈ గది చివరలను చిన్నగదులున్నాయి.

పశ్చిమాన ఎత్తుగానున్న చోట నిర్మించిన స్తంభాలమండపానికి ఉత్తరాన మరొక స్తంభాల మండపముంది. దీని పొడవు అరవై మూడడుగులు, వెడల్పు అరవై అడుగులు. దీనిలో 56 స్తంభాలున్నాయి. కొన్ని రెండుగా, కొన్ని మూడుగా దగ్గిరగా కట్టారు. ఈ మండపం నైల పై కడపరాతి పలకలు తాపారు. రెండేసి, మూడేసి స్తంభాలను చేర్చి కట్టడం వలన, ఇది రెండంతస్తుల ప్రాసాదమని తెలుస్తుంది. రెండు మండపాల మధ్యనున్న స్థలం నుండి మొదట అంతస్తుకు మెట్లు కట్టారు. రెండవదశ నిర్మాణంలో, మండపాన్ని తూర్పు పడమరలవేపు పెంపు చేశారు. రెండవదశలో, 23 అడుగుల వెడల్పు, 68 అడుగుల పొడవు కలిగిన మండపాన్ని పశ్చిమం వేపు చేర్చారు. అక్కడ నుండి నదిలో దిగడానికి ప్రత్యేకంగా మెట్లు కట్టారు. తూర్పువేపు ఉత్తరంవేపు కూడా దీనిని పెంపు చేశారు. తూర్పువేపు పెంపుచేసిన భాగంలో 30 స్తంభాలు గల మండపముంది. ఒక మండపం నుండి మరొక మండపానికి చంద్రకాంత శిలలతోను, కడపరాతి పలకలతోను మెట్లుకట్టారు. ఈ మండపం లేక ప్రాసాదం యొక్క స్తంభాలమీద శాసనాలు చెక్కిన వలకాలను అమర్చారు. వాటి పై దాతల పేర్లున్నవి. ఈ ఆలయ సముదాయంలోను, బైట, వృత్తాకారంలోను, చతురస్రాకారంలోను ఉన్న వేదికలున్నాయి. ఉత్సవ దినాలలో అక్కడికి తెచ్చే దేవతామూర్తులకోసం వాటిని నిర్మించారు. అభిషేకజలం పైకిపోవడానికి కాలువలు కట్టారు. ఆ వేదికలలో ఒకదాని దగ్గర ఒక ఘటం దొరికింది. అందులో నిత్యపూజకు ఉపయోగించే పాత్రలు లభించాయి. ఒక బంగారు గిన్నె, మూడు వెండిగిన్నెలు, అయిదు పళాలు, ఒక ధూపహారతి అందులో ఉన్నాయి.

సైటు 97లో గజపృష్ఠాకార దేవాలయాలు బయటపడ్డాయి. ఈ భవనసముదాయం దుర్గానికి పడమటి దగ్గర, కృష్ణానది గట్టున ఉంది. నాలుగు దశలలో నిర్మాణం జరిగినట్లు తెలుస్తుంది. మొదటి దశలో ఇటుకతో కట్టిన చుట్టుగోడ మధ్యను ఎనభై ఆరడుగులు చౌకంగా ఉన్న స్థలముంది. ఈ స్థలంలో పడమటివైపు గజపృష్ఠాకార గర్భగృహముంది. ఈ పూజాగృహానికి ఎదురుగా ఒక వృత్తాకార వేదిక ఉంది. రెండవ దశలో, ఈ ఆవరణ మధ్యభాగంలో 72 స్తంభాలు గల మండపమొకటి నిర్మింపబడింది. ఈ మండపం, మొదటి దశలో నిర్మిపంబడిన గర్భగృహానికి, ఇటుపక్క అటు పక్క రెండు పూజాగృహాలు, ఒకటి వర్తులాకారంలోను రెండవది గజపృష్ఠాకారంలోను నిర్మింపబడ్డాయి. ఈ పూజా గృహాల వెలుపలి భాగాలలో చిత్రాలంకృతమైన తోరణాలు నిర్మింపబడ్డాయి. ఇవి రాతికట్టుగల వేదికలపై అమర్చి ఉన్నాయి. తూర్పు ద్వారానికి సమీపంలో స్తంభాల మండపం మధ్యభాగంలో ఇటుకతో నేలను తాపినదిది. దీనిలో గల దేవతలెవరో తెలియదు.

మూడవ దశ నిర్మాణంలో మరికొన్ని పూజావేదికలను మండపంలో కట్టారు. ఆవరణకు బయట, రాతితో కట్టిన గడులు కనిపిస్తాయి. 72 అడుగులు పొడుగు, 51 అడుగుల వెడల్పు గల ఆవరణలో ఇవి నిర్మింపబడ్డాయి. తరువాత నిర్మింపబడిన కట్టడాలు శిథిలమయ్యాయి.

అక్కడ స్తంభాల మీద చెక్కిన యాత్రికుల పేర్లను బట్టి, వీటిని శైవసంభంధమైన ఆలయాలుగా పరిగణించవచ్చు. ఇక్ష్వాకుల ఆరాధ్యదైవం కార్తికేయుడు. ఈ దేవుడిని రాజులు ప్రతిదినం పూజించేవారు.

సైటు 82లో కార్తికేయ దేవాలయం ఒకటి బయట పడింది. పెద్దకుందేళ్ల గుట్ట వాలులో, కోట బురుజుకి నైరుతి దిశగా ఈ ఆలయ సముదాయముంది. ఈ సముదాయంలో స్తంభాల మండపాలో రెండు, ఉత్తర దిక్కున నివాస గృహాల వరుస ఒకటి ఉన్నాయి. ఈ కట్టడాలు నది గట్టున ఉండడం చేత వరదల నుండి రక్షణ కోసం నది వైపునున్న పిట్టగోడ దిట్టం చేయబడింది. ఈ ఆలయం యొక్క అధిష్ఠాన మండపం పొడవు ఏభై ఏడు అడుగులు, వెడల్పు నలభై అయిదడుగుల ఆరంగుళాలు, ఇది ఎత్తుగా, ఇటుకలతో కట్టబడింది. దాని మధ్యభాగం రాళ్లతోను, నది నుంచి వచ్చేగులక రాళ్లతోను నింపారు. పక్కగోడలు దిట్టంగా కట్టబడ్డాయి.

ఎత్తుగా నిర్మించిన ఈ వేదికపైన, తొలిదశలలో పదిహేను అడుగులు చేకంగల పూజామందిరాన్ని నిర్మించారు. పిమ్మట, ముందు భాగాన్ని పెంచారు. ఇటుకతో కట్టిన రెండు పూజా మందిరాలు ఈ వేదికకు ఇటుపక్క అటు పక్క కట్టారు. ఆలయం నుండి అర్చకుల యిళ్లకు చిన్నదారి ఉంది. ఈ పూజామందిరాలకు ముందుభాగం అరవై ఏడడుగుల పొడవు, 62 అడుగుల వెడల్పుగలది. దానిలో ఒక 36 స్తంభాల మండపముంది. ముఖ్యద్వారం తూర్పువైపున ఉంది.

ఈ మండపం నుండి పడమట ఉన్న పూజా గృహాలకు దారి ఉంది. పూజాగృహాలలో దేవతా విగ్రహాల కోసం వర్తులంగా ఉన్న వేదికలను నిర్మించారు. ఈ ఆవరణలో ఆగ్నేయమూలకు తొమ్మిదిన్నర అడుగుల చౌకంగా ఉన్న గది ఉంది. దీనిని ఎందుకు కట్టారో తెలియదు. సున్నపురాతిలో తయారు చేసిన కార్తికేయుడి విగ్రహం సమభంగస్థితిలో నిలబడి ఉంది. కార్తికేయుడు ఎడమ చేతితో కుక్కుటాన్ని పట్టుకున్నాడు. రెండవ చేయి విరిగిపోయింది. అక్కడే మరొక కార్తికేయుని విగ్రహం దొరికింది. దీని  తల, మొండెం మాత్రమే లభించాయి. శిరస్సుకి ఉష్ణీషముంది.

ఈ ఆలయ సముదాయానికి ఉత్తరంగా నివాసగృహమొకటి వెలువడింది. అది బౌద్ధుల విహార పద్ధతిలో కట్టబడింది. బహుశా ఆలయంలో పనిచేసిన వాళ్ళు అక్కడ నివసించి ఉంటారు.

సైటు 83లో దీర్ఘ చతురస్రాకారంగా నిర్మింవబడిన దేవాలయాలున్నాయి. దుర్గానికి నైరుతి దిశలో కృష్ణానది గట్టుమీద మరొక దేవాలయ సముదాయముంది. ఈ కట్టడాలు శిథిలావస్థలో లభించాయి. వీటిని మూడు దశలలో నిర్మించినట్లు తెలుస్తుంది. మొదటి దశలో ఒకస్తంభాల మండపం, దానికి పడమటివేపు పూజాగృహం నిర్మితమయాయి. మండపానికి 24 స్తంభాలున్నాయి. దీని చుట్టూ ఆవరణ ఉంది. దీనికి ఎదురుగా, తూర్పు దిక్కున మండపిక (చిన్నమండపం) ఒకటి ఉంది. మండపంలో ఒక భాగాన్ని ఎత్తుచేశారు. ఈ కట్టడం కృష్ణానది వరదలలో మునిగినట్లుంది. అందుచేత, రెండవదశలో, ఎత్తుచేసిన మండపంమీద, గజపృష్ఠాకారంలో ఉన్న పూజాగృహాన్ని, తూర్పువేపు ముఖమున్నట్లుగా నిర్మించారు. ఈ పునర్నిర్మాణంలో మొదటి దశలో నిర్మింపబడిన ఆలయం కప్పబడిపోయింది. దాని జాగాలో రెండు తోరణాలను లేవదీశారు.

పూర్వదశలో నిర్మింపబడిన కల్యాణమండపం కొట్టివేసి, దాని మీద, కట్టడమొకటి, మూడవ దశలో లేపారు. భూమిలో చిన్న కొట్టుకట్టి, దానికి మెట్లు దింపారు. ఈ కొట్లో సరుకు నిలువచేసే జాడీలు, నీటి కుండలు మొదలైనవి కనిపించాయి. ఆలయానికి సంబంధించిన విలువైన సామగ్రి దాచడానికో, లేక తపస్సు చేసుకోడానికో ఈ గది ఉపయోగించినట్లు తెలుస్తుంది.

మండపం పైకప్పు కడపరాతి పలకలతో కట్టినది ముఖ్యమండపానికి తగులుతూ చిన్న స్నానకుండిక ఉంది. దానిక నైరుతి దిశను రెండు గదులున్నాయి. వీటిలో ఒకదాని యందు, విశాలంగానున్న అరుగొకటి మంచం వలె పడుకోడానికి ఉపయోగించేది ఉంది. ఈ గదులకు పడమటను ఒక గోయి ఉంది. ఇసుక మొదలైన వస్తువులతో దీనిని నింపి, నీటిని పీల్చుకోడానికి (Soakpit) దీనిని ఉపయోగించారు. ఈ ప్రాంతాలలో చాల పెంకు ముక్కలు దొరికాయి. అందుచేత ఈ నివాసగృహాల పైకప్పులకు పెంకులు నేసినట్లు తెలుస్తుంది.

సైటు 84లో మండపంలో కూడిన ఆలయ సముదాయం బయటపడింది. పెదకుందేళ్ల గుట్టకు దక్షిణాన, గుట్టదిగువ భాగంలో, కొండపైనున్న బౌద్ధ విహారానికి సమీపంలో ఒక ఆలయ సముదాయం లభించింది. మండపానికి 24 స్తంభాలున్నాయి. దీనికి దక్షిణాన పూజాగృహముంది. ఈ ఆలయ సముదాయం ఉత్తరముఖంగా ఉంది. మట్టితోను, ఇటుకతోను కట్టిన పూజాగృహం 32 అడుగులు పొడవు, 15 అడుగుల వెడలుప ఈ పూజాగృమం మధ్యన ఒకవేదిక ఉంది. వేదికకు చంద్రకాంత శిలమెట్టుగా ఉంది. స్తంభాలపై సగం తామరపూవు చెక్కిన శిల్పాలున్నాయి. ఇక్కడ శాసనమేది దొరకలేదు. విగ్రహం కూడా లభిచంలేదు. బహుశా నగరరక్షక దేవత ఇందులో ఉండి ఉంటాడు.

సైటు 77లో కార్తికేయుడి ఆలయం ఉంది. ఇది కృష్ణానది ఒడ్డున ఉంది. వరదనీదరు లోపలికి ప్రవేశించకుండా ఆవరణ ఉంది. ఒక 24 స్తంభాల మండపం, దీర్ఘచతురస్రాకారపు పూజాగృహం ఉన్నాయి. ఈ పూజా గృహాన్ని ఎత్తైన వేదిక మీద, స్తూపాలలో వలె, నిర్మించారు. పూజాగృహానికి పోవడానికి చంద్రకాంతశిల మెట్టుగా ఉంది.

నేలకు, పైకప్పుకు కడపరాతి పలకలు వాడారు. ఈ కట్టడాన్ని నిర్మించడానికి నాలుగు రకాల ఇటుకలు, వేర్వేరు కొలతలు గలవి ఉపయోగించారు. ఆవరణ గోడ వరదలకు దెబ్బతిన్నది. ఆవరణకు వెలుపల, ఉట్లేషమున్న విగ్రహం శిరస్సు దొరికింది. బహుశా లోపలి దేవుడి శిరసు కావచ్చు. ఈ ఆలయంలో శాసనమేది లభించలేదు. ఇది ఇక్ష్వాకుల కాలం నాటిదిగా భావించవచ్చు.

సైటు 78లో నవగ్రహ దేవాలయం బయటపడింది. నది కుడి గట్టుపైన ఈ దేవాలయముంది. 89 అడుగుల వెడల్పు, 127½ అడుగుల పొడవు గల స్థలం చుట్టూ గోడ కట్టారు. ముఖద్వారం తూర్పువేపున ఉంది. ఆవరణకు మరి మూడు ద్వారాలున్నాయి. పడమటి నున్న ద్వారం కొంచెం చిన్నది. పడమటకు పోతే ఒక నూయి, అక్కడ నుంచి నది వస్తాయి.

పడమటి వేపు ఒక మండపముంది. దీని పొడవు ఎనభై ఏడడుగుల ఏడంగుళాలు, 17 అడుగుల 10 అంగుళాలు వెడల్పు. ఈ స్తంభాల మండపంలోంచి వెళ్తే ఎత్తుగా లేపిన వేదిక, లేక అదిష్ఠానం ఉంది. ఈ వేదికకు అడుగున సున్నపురాతితో చెక్కిన శిల్పాలు, మరుగుజ్జు పిట్టగోడ ఉన్నాయి. ఈ గజ పృష్ఠాకార గర్భగృహాలకు రెండుదారులున్నాయి. ఒకటి తూర్పుకు, రెండవది దక్షిణానికి ఉన్నాయి. తూర్పువేపున దారి పూర్తిగా దెబ్బతింది. దక్షిణపు వేపు ఇటుకతోను, చంద్రకాంత శిలతోను కట్టిన మెట్లున్నాయి.

ఈ స్థలంలో ఈ పిట్టగోడకు చెందిన చాలా శిల్పశకలాలు లభించాయి. చూరురాయి, లేక ఉష్ణీషముపై చాల చిత్రఫలకాలు ఉన్నాయి. ఈ ఫలకాల మీద జంతువులు, సింహాలు, ఒంటె, రెక్కలున్న సింహాలు, వరాహాలు, చేపలు మొదలైనవున్నాయి. నిలువుగా నున్న స్తంభాలమీద అర్ధపద్మాలున్న ఫలకాలున్నాయి. ఒక వర్తులఫలకం మీద రెండు మేకలున్నాయి. మరొక దానిమీద గరుడశిల్ప ముంది. ఇక్కడ లభించిన శిల్పాలలో, ఒక మహిళ యొక్క శరీరభాగం కనిపించింది. ఆమె శరీరం పై యజ్ఞోపవీతముంది. ఆమె మకరంపై కూర్చున్నట్లు కాళ్ళు పెనవేసుకుంది. అమరావతిలో కూడ ఇటువంటి శిల్పమే లభించింది. ఇది గంగాదేవి మూర్తి అనుకోవచ్చు. మరొక శిల్పంలో ఎద్దుబుర్ర గల మరుగుజ్జు కనిపిస్తాడు. పెద్ద బొజ్జ గల యితనెవరో పోల్చడం కష్టం.

ముఖ్యమైన పూజా గృహానికి ఎదురుగా 48 స్తంభాల మండపం ఒకటి ఉంది. ముఖ్యద్వారానికి సమీపంలో, మధ్యవరుస స్తంభాలున్న చోట, ఎత్తైన వేదిక లేపబడింది. ఇది బహుశా కళ్యాణ మండపం లేక ఉత్సవ మండపంగా భావించవచ్చు. స్తంభాలను నాలుగడుగుల లోతున పాతారు. స్తంభాలు రమారమి తొమ్మిదడుగుల ఎత్తున్నవి. ఈ స్తంభాలపై అర్ధపద్మాకారమున్న శిల్పఫలకాలతో అలంకరించారు. కొన్ని ఫలకాల పై జంతువుల బొమ్మలున్నవి. మండపం పైకప్పు రాతి పలకలతో నిర్మించారు.

గజపృష్ఠాకార గర్భగృహం చుట్టూ కొన్ని వేదికలను కట్టారు. ఈ దేవాలయంలో యక్షిణీ చిత్రాలున్నాయి. ఈ వేదికలు తొమ్మిది ఉండడం చేత, ఈ ఆలయాలు నవగ్రహాల కొరకు నిర్మంచినట్లు భావించవచ్చు.

సైటు 67లో మధ్యయుగాలకు చెందని శివాలయం వెలువడింది. ఆలయంలో కొన్ని రాతిలింగాలు లభించాయి. కార్తికేయ, యక్షవిగ్రహాలు లభించాయి. ఇవి చాల పెద్దవి.

సైటు 64 లో యక్ష – కుబేర ఆలయ సముదాయం బయటపడింది. ఈ ఆలయాలు పెద్దకుందేళ్ల గుట్టకు, ఎద్దనమోటుకు మధ్యను, లోయకు నైరుతి దిక్కున ఉన్నాయి. ఈ ఆలయ సముదాయంలో మూడు కట్టడాలున్నాయి. అవి నాలుగు వందల డెబ్బై అడుగుల వెడల్పు, నాలుగు వందల ఎనభై అడుగుల పొడవు గల స్థలంలో ఉన్నాయి. దీని చుట్టూ ఇటుక గోడ కట్టబడి ఉంది. దీని ముఖ్య ద్వారం తూర్పువేపున ఉంది. ఈ స్థలంలో ముఖద్వారానికి ఎదురుగా, ముఖ్యదేవాలయం ఉంది. ఈ కట్టడంలో మునయ గర్భగృహం, ఎత్తైన వేదికమీద కట్టబడింది. దాని ముందు ఒక స్తంభాల మండపముంది. ఈ ముఖ్యాలయం చుట్టూ ఒక చుట్టుగోడ ఉంది.

రెండవ ఆలయ సముదాయం, ముఖ్యాలయానికి దక్షిణాన ఆవరణలో ఉంది. దీనిని ముఖ్యాలయం నుండి, పైనుండి చేరవచ్చు. ఈ ఆలయం పశ్చిమ ముఖంగా ఉంది నాలుగు దశలలో దీని నిర్మాణం జరిగింది.

ముఖ్యాలయం ఎత్తైన వేదిక మీద నిర్మింపబడింది. దీని పొడవు రమారమి ఇరవై అడుగులు, వెడల్పు 12 అడుగులు. దీని గోడ 3 అడుగుల మందం కలది. ఆలయం చుట్టూ ప్రదక్షణాపధం కడపరాతి పలకలతో తాపబడింది. ఆలయం చేరడానికి మెట్లు వరుస ఉంది. వర్తులాకారంగా ఇటుకతోను, కడపరాతి తోను కట్టిన అడుగుమెట్టుంది. పూజా గృహానికి వెలుపలను, వేదికమీద చిన్నవర్తులాకార వేదికలు, దీర్ఘ చతురస్రాకారపు వేదికలు నున్నగా తీర్చి నిర్మించారు. ఈ గజపృష్ఠాకార గర్భగృహం గోడ పై భాగం దళసరిగా చెక్కసున్నం చేయబడింది. వేదికకు వెలుపల ఒక

గోయి, ఇసుకతో నింపినది ఉంది. గర్భగృహం నుండి వచ్చే కాలువ దీనిని కలుస్తుంది. అభిషేక జలం ఈ కాలువ గుండా గోతిలో పడుతుంది.

ఈ గజపృష్ఠాకార గర్భగృహం వెలుపల విరిగిన విగ్రహమొకటి లభించింది. ఈ విగ్రహానికి పెద్ద బొజ్జ ఉంది, పైకి పొడుచుకు వచ్చిన పళ్ళు, ఉబ్బిన కనుగుడ్లు, మొలకు నాగ ఉదార బంధం ఉన్నవి. దీనితో పాటు మరో మరుగుజ్జు విగ్రహం, విరగిన విగ్రహపు ముక్కలు దొరికాయి. ఈ చిన్న విగ్రహం యక్షుడిదై ఉంటుంది. మరొక ఫలకం మీద భైరవుడు చెక్కబడి ఉన్నాడు.

ముఖమండపానికి 64 స్తంభాలున్నాయి. పూజా గృహానికి ఎదురుగానున్న మూడు వరుసల స్తంభాలను కప్పుతూ ఒక ఎత్తైన వేదిక నిర్మింపబడింది. దీనికి మెట్ల వరుసలు తూర్పున, పశ్చిమాన ఉన్నాయి. మండపస్తంభాలు పలకలుగా ఉన్నాయి. నున్నగా నున్నాయి.

ఈ పెద్ద ఆలయ సముదాయానికి ఉత్తరాన, ఒక తటాకముంది. సహజస్థితిలోనున్న రాతిని ఇరవై అడుగులోతుకు తవ్వారు. అడుగుభాగం అరవై ఏడడుగుల చౌకముంది. నాలుగువేపుల మెట్ల వరుసలున్నాయి. ఇది దధిసారమన్న పేరు గల వాపి, అష్టభుజస్వామి ఆలయ శాసనంలో పేర్కొనబడిన మహానంద అన్నవాపి ఇదే కావచ్చు. ఆలయానికి వచ్చిన రాజులు దీనిని బాగు చేయించారు. ఈ పవిత్రమైన తటాకం చుట్టుపట్లనున్న దేవాలయాలలో జరిగే వార్షికోత్సవాలకు జరిగే వార్షికోత్సవాలకు, ఇతర అర్చనలకు ఉపయుక్తమయేది.

యక్ష-కుబేర-ఆలయ సముదాయం యొక్క దక్షిణం వేపు ఒక మార్గముంది. ఇది మరొక ఆలయ సముదాయానికి దారితీస్తుంది. ఈ కట్టడాలు నాలుగు దశలలో జరిగినట్లు తవ్వకాలలో తెలిసింది. మొదటి నిర్మాణంలో దీర్ఘచతురస్రాకారమైన గర్భగృహం, దానిలో 3 అడుగుల 4 అంగుళాలు వెడల్పు, 4 అడుగులు పొడవు గల వేదిక ఉంది. దీని ఎదురుగా 16 స్తంభాల మండపముంది. దీని మధ్యను ‘మండపిక’ ఉంది. ఈ ఆలయం మాత్రం పశ్చిమముఖంగా ఉంది. ఈ మండపంలో ఎనిమిదడుగుల అయిదంగుళాల వెడల్పు, 44 అడుగుల 6 అంగుళాల పొడవు గల గదులున్నాయి. వీటి గోడలు 2 అడుగుల మందంలో ఉన్నాయి. నైరుతి దిక్కున గల మూలలో, 10 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు ఉ౦ది, తొట్టె ఆకారంలో గల గోయి ఉంది. లోపల చెక్కసున్నం చేసి ఉంది. ఉత్తరాన మండపానికి దారి ఉంది.

ఈ స్తంభాల మండపం శిథిలమయి ఉంది. దీని స్తంభాలు నున్నగా ఉండి, అర్ధపద్మాకారాలు కల శిల్ప ఫలకాలు, మరికొన్ని వింత మృగాల శిల్పాలను కలిగి ఉన్నాయి. వీటిపై పలకల మీద శాసన శకలాలున్నాయి. ఒక పలక మీద ‘సిహవర్మె’ అన్న పేరు కనిపిస్తుంది.

రెండవదశలో పూజాగృహం పూర్తిగా కప్పి, బాగా ఎత్తుచేసి దానిమీద కట్టడం నిర్మించారు. ఎత్తు 46 అడుగుల 9 అంగుళాలు చేసి, దానిమీద 61 అడుగుల 7 అంగుళాలు పొడవు, 40 అడుగుల 6 అంగుళాల వెడల్పు గల దీర్ఘచతురస్రాకారపు ఇటుక కట్టడాన్ని లేపారు దీని పైన నాలుగు స్తంభాల మండపానికి అధిష్ఠానాన్ని నిర్మించారు. దక్షిణంవేపు, ఈ వేదికను చేరడానికి మెట్లున్నాయి. ఈ మండపం అంతటను కడపరాతి పలకలను తాపారు. ఈ మండపం వెనుకనే, నలభై అడుగుల ఏడంగుళాల పొడవు, పదిహేనడుగుల ఆరంగుళల వెడల్పు గల ఒక దీర్ఘ చతురస్రాకారపు గదిలో, చిన్న వేదికలను నిర్మించారు. ఇటుకతో కట్టి, పైన కడపరాతి పలకలు తాపారు. ఇక్కడనొక విరిగిన శాసనభాగం లభించింది.

… వసుసంఘాత్

 ….. సింమావతిస్థ

… అష్ట భుజస

…దేవపురపదిః లయ

క..రః…. మాసి భయ

ఈ వసుసంఘ మేమిటో, సింహావతి ఏమిటో తెలియదు – అష్టభుజ స్వామి గురించి తెలుసు – దేవపుర మెక్కడిదో?….

ఒక విరగిన శిల్పఫలకం ఇక్కడ లభించింది. కార్తికేయుడి వాహనమైన నెమలి, దాని కాళ్ల మీద గల సర్పం అవి అయి ఉంటాయి. దేవుడి విగ్రహభాగం లేదు.

సైటు 39లో దేవసేన ఆలయం బయటపడింది. పెద్దకుందేల్ల గుట్ట  ఆగ్నేయపు వాలులలో, దుర్గం యొక్క ప్రాకారానికి పక్కనే, ఒక ఆలయ సముదాయం ఉంది. ఈ సముదాయం కార్తికేయుని భార్య అయిన దేవసేనకు అంకితమీయబడింది. గర్భగృహం దీర్ఘ చతురస్రాకారంగా, 26 అడుగుల తొమ్మిద అంగుళాల పొడవు, 18 అడుగుల 3 అండుళాల వెడల్పుతో ఉంది. దీని ఎదుటనో 36 స్తంభాల మండపం ఒకటుంది. 57 అడుగుల 6 అంగుళాల చౌకంలో ఉంది. ఇక్కడ లభించిన విగ్రహం దేవసేన విగ్రహంగా గుర్తింపబడింది. ఆగ్నేయ మూలనున్న ఆలయంలో గల దేవసేన నగర రక్షక దేవతయై ఉంటుంది.

సైటు 57 లో కార్తికేయుని ఆలయం బయటపడింది. నదికి దూరంగా, దుర్గం యొక్క తూర్పు ద్వారానికి సమీపంలో ఉన్ననివాస గృహాల మధ్యను ఈ ఆలయముంది. ఈ ఆలయాన్ని బాగా కొల్ల గొట్టారు. ఈ ఆలయంలో అయిదు వేదికలు, వాటి పైన ప్రతిష్ఠించిన దేవతామూర్తుల విగ్రహాలు, దెబ్బతిన్నవి, బయటపడ్డాయి. ఈ దేవాలయ సముదాయమున్న ఆవరణలో ఒక వాపి కనబడింది. ఈ నూతిలో ఒక విరిగిన స్తంభం కనిపించింది. దీనిపై ఒక శాసనముంది. ఇది మాఠరీప్తుర సిరివీర పురుషదత్తుని 24వ పాలనా సంవత్సరంలో వెలువడినది. ఇందులో ఆ రాజు శ్రీపర్వతాధిపతి అని పేర్కొనబడ్డాడు. ఈ చోటు నుండి ఒక చిన్న కంచువిగ్రహం, కార్తికేయుడికి చెందినది లభించింది. దీని గురించి ఇంతకుముందు చెప్పడమయింది. ఇది మూడంగుళాలకు కొంచెం హెచ్చుగా ఉంది. సైటు 58కి కొద్ది గజాల దూరంలో, పడమటివేపు ఒక స్వర్ణకారుని దుకాణం బయటపడింది. అచ్చులు, రకరకాల నగిషీలు, మూసలు కనిపించాయి. హెచ్చుగా ఇక్ష్వాకుల నాణాలు దొరికాయి. ఇక్ష్వాకుల నాటి విగ్రహాలు తయారు చేసే కళ ఈ కంచు బొమ్మలో చక్కగా తెలుస్తుంది.

సైటు 35 లో నాగార్జున కొండ ఆగ్నేయపు వాలులో, మహీశాసన విహారానికి సమీపంలో ఒక బ్రాహ్మణ దేవాలయముంది. ఈ దేవాలయానికొక గజపృష్ఠాకార గర్భగృహం, 24 స్తంభాల ముఖమండపం ఉన్నాయి. ఈ ఆలయంలో ఈశాన్యమూలలో దుర్గ రక్షణ చేసే దేవత ఉండి ఉండవచ్చు.

సైటు 110 లో, తెల్లరాల్ల బోడు వెనుక ఒక చతురస్రాకార మండపముంది. ఇది తూర్పుకు ముఖమున్నది. దీని మధ్యనొక వేదికమీద బాణలింగముంది.

సైటు 75లో మధ్యయుగానికి సంబంధించిన ఆలయ సముదాయముంది. ఇది లోయ లోపలి భాగంలో ఉంది. అక్కడో శివలింగముంది. ఈ ఆలయం చుట్టూ ఒక పొలముంది. తవ్వకాలలో ఈ చోట చాలా గోతులు బయటపడ్డాయి. వాటిలో చితాభస్మం, ఎముకలు దొరికాయి. కాబట్టి దీనిని మధ్యయుగంలో శ్మశానంగా ఉపయోగించి ఉంటారు. దీనికి ఉత్తరాన శివాలయం ఉండడం చేత తప్పక ఇది శ్మశానమే అయి ఉంటుంది. ఇక్కడ దొరికిన శివలింగం సహజమైనదని, నదిలో దొరికినదని చెప్తారు.

సైటు 31లో ఒక శివాలయముంది. నాగార్జున కొండ తూర్పువాలులో ఇది ఉంది. దీనికి 16 స్తంభాల ముఖమండపం ఉంది. దాని మధ్యనొక వేదిక, కళ్యాణాలకు, ఉత్సవాలకు ఉపయోగింపబడుతున్నట్లు తెలుస్తుంది. ఇక్కడ నాగ-ప్రతిమలు, పీఠం పైనున్న శివలింగాలు ఇవి ఇక్ష్వాకుల తరువాత కాలం నాటివని తెలుస్తుంది.

సైటు 17లో ఒక హారీతి ఆలయం, ఫిరంగి మోటు పై వాలులో ఉంది. దీనికి ఆరుబయట రంగస్థలి నుండి మెట్లున్నాయి. సున్నపురాతితో చెక్కిన హారీతి విగ్రహం, మొండెం లేనిది, బయట పడింది. దీని చుట్టూ, లక్క గాజులు, దంతపు గాజులు దొరికాయి.

సైటు 56లో లోయకు రావలసిన దారిలో, అనుపు దగ్గిర, మరొక హారీతి ఆలయం బయటపడింది. సున్నపురాతి విగ్రహం, ప్రలంబపాదాలతో ఉన్నది. హారీతి విగ్రహమని తెలుస్తుంది.

కార్తికేయశర్మగారి ఉపన్యాసం ముగిసింది. అప్పటికే చాలా రాత్రయింది. ఆయన అష్టభుజస్వామి ఆలయం గురించి అప్పుడప్పుడు చెప్పడం జరిగింది. ఈ విధంగా నాగార్జునకొండలోయ లోని బ్రాహ్మణ దేవాలయాల గురించి వివరంగా వాళ్లకు తెలిసింది. ఈ ఆలయాలకు సంబంధించిన శాసనాలను అధ్యయనం చేసి, ఇక్ష్వాకుల నాటి పరిస్థితులను తెలుసుకోవాలి.

శర్మగారు చాల వివరాలు, కొలతలు చెప్పారు. ఇవన్నీ అవసరమా అన్న ప్రశ్నకు ఆయనే జవాబు చెప్పారు. ఈ కొలతలు, ఆలయాల వివరాలు ఇవ్వడంచేత వాటి ఆకారాన్నీ పరిధినీ ఊహించుకోడానికి సులువవుతుందని ఆయన చెప్పారు.

ఆకాశం చాలా నిర్మలంగా ఉంది. చల్లని గాలి రివట వీస్తున్నది. శశికళ టార్చి పట్టుకొని మందు నడుస్తుంటే మిగిలిన ఇద్దరూ అనుసరించారు.

(సశేషం)

Exit mobile version