శ్రీపర్వతం-17

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 17వ భాగం. [/box]

27

[dropcap]ఆ[/dropcap] రోజు సోమవారం. జరగవలసిన పనులు ఒక క్రమంలో జరుగుతున్నాయి. ఈ సెలవు రోజున కూడా వాళ్లు విశ్రాంతి తీసుకోడం లేదు. ఉత్తరాలు వ్రాయడం, టైపు చేసిన నోట్సు ఫైలు చేయడం, కొరియర్ అబ్బాయి తెచ్చిన ఉత్తరాలు, పత్రికలు చూడడం, సావకాశంగా మోహన్ కృష్ణానదికి పోయి స్నానం చేసి బట్టలుదుకుకొని రావడం, రెండు గంటలకు లంచి తినడం వాళ్లకు రివాజయింది.

సుబ్రహ్మణ్యేశ్వరరావుకి ఆదివారం సెలవు. సెలవునాడు అతను మాచర్ల వెళ్లి కాబోయే భార్యతో చాలా సేపు కబుర్లాడి సాయంకాలానికి హిల్ కాలనీకి తిరిగి వచ్చేవాడు. సోమవారం పదిగంటలయే సరికి లోయలోనున్న టెంట్లు చేరుకునేవాడు. మోహన్, శశికళ పనులలో మునిగి పోయినప్పుడు, జావా వండుతుంటే సహాయం చేసేవాడు. మాచర్ల నుంచి తెచ్చిన ఊరగాయలు, పచ్చళ్లు లంచికి వడ్డించేవాడు. కొరియర్‌గా ఏర్పాటు చేసిన అబ్బాయితోను, జావా మొగుడితోను కలిసి టెంట్లు చుట్టూ వేసిన హెడ్జింగు కత్తిరించేవాడు. చామంతి మొక్కలకు, నర్సరీనుండి తెచ్చిన పూల మొక్కలకు మళ్లుకట్టి నీళ్లు పోసేవాడు.

భోజనాలయ్యేసరికి మధ్యాహ్నం రెండున్నర అయింది. మూడయేసరికి ముగ్గురు మోహన్ టెంటులో కూర్చున్నాడు. వారం పొడుగునా స్కాలర్లు చెప్పిన విషయాలు వాళ్లు శ్రద్ధతో వింటున్నారు. కాని, సోమవారం నాడు మాత్రం మోహన్ కాని, శశికళ గాని మాట్లాడేవారు. మోహన్ చెప్పే విషయాలు శశికళకు తెలియవు. శశికళ చెప్పే విషయాలు అతనికి కూడా కొత్తగా ఉండేవి. ఈ ఇద్దరూ చెప్పేవి సుబ్రహ్మణ్యేశ్వరరావుకి తెలియనే తెలియవు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు మాటల సందర్భంలో అన్నాడు.

‘సిరి ఛాంతమూలుడు అగ్నిష్టోమ, వాజపేయ, అశ్వమేధాలు చేశాడని చెప్పారు. ఈ యాగాల గురించి సంక్షేపంగానో, వివరంగానో చెప్పండి”.

“వీటి గురించి నాకు కూడా తెలుసుకోవాలని ఉంది” అంది శశికళ.

మోహన్ చెప్పడం మొదలు పెట్టాడు.

అగ్నిష్టోమయాగం రెండు విధాల చేయవచ్చు. మొదటి పద్ధతిలో దీనిని దర్శపూర్ణమాస ఇష్టి మొదలైనవి చేసిన తరువాత చేయవచ్చు. రెండవ పద్ధతిలో ఈ యాగం చేయడానికి దర్శపూర్ణ మాస ఇష్టులు అక్కరలేదు. వసంత ఋతువులో త్రేతాగ్నులను నిక్షేపించి ఈ యాగం చేయవచ్చు.

వసంత ఋతువులో శుక్ల పక్ష ఏకాదశినాడు ఈ యాగం మొదలు పెట్టి అయిదు రోజులు చేస్తారు. ఈ యాగం యొక్క ముఖ్యోద్దేశం సోమలతను పిండి సోమరసాన్ని దేవతలకు అర్పించడం. ఇప్పుడు సోమతల లభించడం లేదు. కాబట్టి పూతికాలత నుండి రసం పిండుతారు.

ఈ యాగం చేయడానికి 16 మంది పురోహితులు కావాలి. ఋగ్వేదానికి సంబంధించిన వాళ్లు నలుగురు, యజుర్వేదానికి నలుగురు, సామవేదానికి నలుగురు, అధర్వవేదానికి చెందిన వాళ్లు నలుగురు ఉంటారు. ఈ పురోహితులు వంశపారంపర్యంగా ఈ వృత్తి చేపట్టినవాళ్లు. వారికిచ్చే దక్షిణాలు కూడా అదే నిష్పత్తిలో ఉంటాయి.

ఈ జ్యోతిష్టామయాగం – అంటే అగ్నిష్టోమయాగం చేసే పద్ధతి, ఇతర సోమయాగాలకు కూడా వర్తిస్తుంది. యాగం జరిగే దినాలలో ఒకనాడు సోమ రసం పిండడం జరుగుతుంది. దీనిని సుత్యాదినమంటారు. ఈ యాగం ఏ సామంతో ముగుస్తుందో ఆ ప్రకారమే దీనికి పేరు వస్తుంది. వాటిలో మొదటిది అగ్నిష్టోమం. అగ్నిష్టోమ సామం ఈ యాగం చివరను గానం చేస్తారు. ఈక్థ్య, షోడశిన్, అతిరాత్రములనేవి మిగిలిన మూడు సామాలు. వీటి చివరి దినాన అదే పేరు గల స్తోత్రంతో అవి ముగుస్తాయి.

ఈ యాగం యొక్క మొదటి రోజు సాధారణంగా వసంత ఋతువులో వచ్చే శుక్ల ఏకాదశి, యజమాని (యాగం చేసేవాడు) అభ్యుదయక కర్మతో యాగం మొదలు పెడతారు. సోమప్రవాకుడనే పురోహితుడిని ముందు ఎంచుకుంటాడు. ఇతడు వెళ్లి 16 మంది పురోహితులను కలిసి వారి అంగీకారం తీసుకుంటాడు. వారిని యజమాని తన గృహమందు మధుపర్కాలనిచ్చి సత్కరిస్తాడు. పిమ్మట యాగశాలకు పోతారు. అరణికాష్టాలతో అగ్నిని పుట్టించి యాగశాలలో హెూమకుండాలలో అగ్నిని నిక్షేపిస్తారు. యజమాని కేశ సంస్కారం జరుపుకుంటారు. తరువాత, భార్యతో కలిసి స్నానం చేస్తాడు. దీక్షణీయేష్టితో దీక్ష ప్రారంభమవుతుంది. ఔద్గ్రభణ హెమం, కృష్ణాజిన దీక్ష జరిగిన తరువాత, యజమాని దీక్షావ్రతుడైనట్లు పురోహితులు ఘోషిస్తారు. ఆ దినమే మహావీరసంభరణ యూపచ్ఛేదన కర్మలు జరుగుతాయి. యజమాని, అతని భార్య మొదటి మూడు దినాలు వ్రతక్షీరం మీదనే ఆధారపడితారు. చివరి రెండు దినాలు, హోమం చేయగా మిగిలిన పదార్థాలను భుజిస్తారు. యజమాని నియమంతో వర్తిస్తాడు.

రెండవ దినం సోమలతను అంగడిలో కొని యజ్ఞశాలకు తెస్తారు. యాగానికి వచ్చిన పురోహితులు, తమలో తాము ఎటువంటి అభిప్రాయ భేదాలు లేకుండా యాగం పరిసమాప్తి చేస్తామని శపథం చేస్తారు.

మూడవ దినం వేరువేరు శాలలు – సదస్సు, హవిర్ధానము, అగ్నీధ్రము, మార్జాలీయము, సామిత్రము, ఉత్తర వేది అన్న ఆటిని లేవనెత్తుతారు.

నాలుగవదినం అగ్నిషోమీయ ప్రణయనము గురించి, అగ్నిషోమయ పశుయాగం గురించి, సాయంకాలం వళ వస్తివారిజలం తీసుకొని రావడం జరుగుతుంది.

అయిదవ దినం చాల ముఖ్యమైనది. దీనిని సుత్యాదినమంటారు. ఉదయంవేళ, మధ్యాహ్నవేళ, సాయంవేళ వేరువేరు కార్యాలు జరుగుతాయి. సోమరసాన్ని పిండి, దానిని వేరువేరు పాత్రలలో నింపి, ప్రత్యేకమైన దేవతలకు వాటిని అర్పించడం జరుగుతుంది. వాటితో పాటు స్తోత్రపఠనం, శాస్త్ర పఠనం జరుగుతాయి. సుత్యాదినంనాడు మేకపోతును చంపి దాని శరీరభాగాలలో ప్రత్యేకమైన వాటిని పవుపురోడాశంతో హవనం చేయడం ఒక ముఖ్యకర్మ. మధ్యాహ్నం జరిగే పనులలో పురోహితులకు దక్షిణలిస్తారు. దీనిని దక్షిణ సమమంటారు. సుత్యాదినాన సోమరసాన్ని గ్రహాలకు అర్పించడం, పురోహితులు నేలను జారడం ఆనాటి ఆసక్తికరమైన విషయాలు.

యజమాని అవబృధ స్నానంచేసి, ఉద్వసనీయ ఇష్టి చేయడంలో అగ్నిష్టోమయాగం ముగుస్తుంది. అగ్నిష్టోమం చేయడానికి ద్విజుడు మాత్రమే అర్హుడు. అద్విజుడు క్షత్రియుడో, వైశ్యుడో అయితే అతనిని బ్రాహ్మణుడిగా మార్చాలి. పురోహితులలో అధ్వర్యుడు తప్ప మరొకడు ‘యాగం చేసే అతడు బ్రాహ్మణుడు, దీక్షను పొందినవాడు’ అని మూడుసార్లు ఉచ్చరించడంతో, అతడు బ్రాహ్మణుడుగా పరిగణిపంబడుతాడు.

యాగకర్త అవబృధస్నానం ఆయేవరకు శూద్రులతో కలిసి తిరుగరాదు. ఆ విధంగానే ఎవరు వచ్చినా, వారిపట్ల మర్యాదను ప్రకటించడం కోసం, యజమాని లేవడంకాని, నమస్కారం చేయడంకాని ఆచరించరాదు. నీటిలోకాని, వానలోకాని తడవరాదు. అతడు మృదువుగా భాషించాలి. నిజమే పలకాలి. ప్రాతఃకాలాన్నీ, సాయం వేళను అతడు యజ్ఞశాలలో కూర్చోవాలి, నిద్రపోరాదు.

ఇక వాజపేయ యాగం – దీనిని శరత్కాలంలో చేస్తారు. ఈ యాగాన్ని వైశ్యుడు చేయడానికి వీలులేదు. బ్రాహ్మణ క్షత్రియులే చేయాలి. వాజపేయానికి ముందు, యాగం అయిన తరువాత బృహస్పతి యజ్ఞం చేయాలి. ఈ యజ్ఞాన్ని శుక్లపక్షంలో చేయాలి. లేకపోతే జ్యోతిష్ణోమం అగ్నిష్టోమం చేయవచ్చు. ఇవేకాక ఇటువంటి యజ్ఞాలు మరేవేనా చేయవచ్చు. వీటిని పరియజ్ఞాలంటారు.

ఈ యాగానికి 17 దీక్షాదినాలున్నాయి. వాజపేయానికి సోమరసంతో పాటు సుర లేక సారాయం కూడా కొనాలి. ఈ సారాయాన్ని పొడుగుజుత్తు ఉండే నపుంసకుడి దగ్గిర, సీసం వెలగా ఇచ్చి కొనాలి. సోమరసం పిండేటప్పుడు యజమాని, అతని భార్య, పురోహితులు, బంగారపు గొలుసులు మెల్లల్లో వేసుకుంటారు. కొమ్ములులేని 17 నల్లమేకలు ఈ యాగానికి కావాలి. అవి ప్రజనన సమర్థములై ఉండాలి. వాటి శరీరభాగాలను వేరువేరు పద్ధతులలో వండుతారు. వశా ధేనువును కూడా అర్పిస్తారు. యజమాని దక్షిణల కింద 1700 గోవులు, వస్త్రాలు, మేకలు, ఆడ గొర్రెలు ఇవ్వాలి. బంగారు గొలుసులు ధరించిన 1700 శూద్రకన్యలను కూడా దక్షిణగా ఇస్తారు. సారాయిని వడకట్టుతారు. సోమరసం పిండిననాడు, అధ్వర్యుడు దేవతల కోసం సోమరసాన్ని, సారాయిని అర్పిస్తాడు. చాల రంగులున్న ఆవును బలియిస్తారు. ప్రజనన సమర్థములైన 17 నల్లమేకలు, కొమ్ములు లేని వాటిని బలియిచ్చి వాటి మాంసం రెండు భాగాలుగా వండుతారు. ఒక భాగం దేవతలకు సమం చేస్తారు. రెండవ భాగం ప్రజలకు పంచుతారు. అరణ్యంలో దొరికే నీవారధాన్యం, పదిహేడు కొలతలు వండుతారు. యజ్ఞం చేసే యజమాని 1700 ఆవులను కాని, ఆబోతులను కాని బహుమతులుగా పంచుతాడు. అదే సంఖ్యలో వస్త్రాలను, మేకలను,

ఆడ గొర్రెలను బహుమతులుగా ఇస్తాడు. అంతేకాక 1700 శూద్రస్త్రీలను కాని కన్యలను కాని బహుమతిగా అతడు దానం చేస్తాడు. ఇంకా అతడు 17 ఏనుగులను, అదే సంఖ్యలో బళ్లను, పెద్దరథాలను దానం చేస్తాడు.

అప్పుడు రథాల పందెం జరుగుతుంది.

ఆ రథాలను ఎడ్లబండ్ల మీద తెస్తారు. అధ్వర్యుడు మంత్రాలు చదువుతూ, మొదటి రథాన్ని బండి నుండి దింపుతాడు. నాలుగు గుర్రాలను రథానికి పూన్చే ముందు, వాటికి స్నానం చేయిస్తారు. లేకపోతే మంత్రజలం వాటి పై జల్లుతారు. నాలుగు గుర్రాలలో మూడింటిని పూజలకు కడతారు. నాలుగవ గుర్రం విడిగా వాటిని వెంబడిస్తుంది. మరొక పదహారు రథాలకు కూడా ఆ విధంగానే గుర్రాలను పూన్చుతారు. యజ్ఞవేదిక అంచున 17 దుందుభులలో ఒక దానిని వాయిస్తారు. మిగిలిన దుందుంభులను, ఏ మంత్రాలు చదవకుండా వాయిస్తారు. అప్పుడు క్షత్రియుడొకడు పదిహేడు అమ్ములను దూరాలకు చిమ్ముతాడు. ఆఖరున క్షత్రియుడు ఉదుంబర వృక్షశాఖను (పొడవైన రాటను) భూమిలో నాటుతాడు (పాతుతాడు)

పిమ్మట యజమాని మంత్రాలు చదివి గుర్రాలు పూన్చిన రథం ఎక్కుతాడు. అతనితో పాటు, అధ్వర్యుని శిష్యుడు, బ్రహ్మచారియైనవాడు రథం యెక్కి, యజమాని చేత మంత్రాలు చెప్పిస్తాడు. మిగిలిన 16 రథాలలో ఒకదాని పైన క్షత్రియుడేనా ఎక్కుతాడు లేక వైశ్యుడేనా ఎక్కుతాడు. సామగానం జరుగుతూ ఉంటే, యజమాని రథం ముందుకుపోతుంది. పరుగు పందాలకు లంకించుకున్న గుర్రాలను చూస్తూ, మంత్రాలు చదివి, అధ్వర్యుడు నేతిని సమం చేస్తాడు.

సోమరసం పిండిన యజ్ఞకర్త రథాల పందెంలో గెలుస్తాడు. అందరూ ఉదంబర వృక్షశాఖ చుట్టూ తిరుగుతారు. పందెం నుండి తిరిగి వచ్చిన తరువాత పురోహిత బ్రహ్మచారి రథం దిగుతాడు. మంత్రాలు చదువుతూ ఒక దుందుభిని కిందకు దింపుతాడు. మిగిలిన పదమారు దుందుభులను మౌనంగా నేలను దింపుతాడు.

యజమాని రథం దిగి, నేలను ఉంచిన అన్నాన్ని స్పృశిస్తాడు. రథానికి పూసిన మూడు గుర్రాలకు అధ్వర్యుడు అన్నం వాసన చూపిస్తాడు. తరువాత యజమాని నాలుగవ గుర్రాన్ని రథానికి పూన్చి, సంపూర్ణంగా రథాన్ని అధ్వర్యుడికి దానం చేస్తాడు. మిగిలిన పదహారు రథాలను యాగం నిర్వహించిన పదహారుగురు పురోహితులకు బహుమతిగా ఇస్తాడు.

నేష్ట అన్న పురోహితుడు యజ్ఞకర్త భార్యకు పట్టుబట్టనిచ్చి, దానిని, ఆమె కట్టిన చీరమీద గోచీవలె కట్టుకోమంటాడు.

యజ్ఞం ప్రారంభించినప్పుడు ముందుగా నాటిన పెద్ద రాటకు 17 వస్త్రాలను చుడతారు. ఆ రాట దగ్గిరికి యజమానిని అతని భార్యను తీసుకుపోతారు. అధ్వర్యుడు యూపం (యజ్ఞ వాటికలో నాటిన రాట) అనుకొని నిచ్చెన వేపిస్తాడు.

యజమాని నిచ్చెన నెక్కుతూ భార్యతో అంటాడు. “ఓ జాయ! రా! మనిమిద్దరం స్వర్గానికి నిచ్చెనకెక్కుదాం!”

“అట్లే! మనం నిచ్చెననెక్కుదాం!” అని ఆమె బదులు చెప్తుంది.

అపుడు తంపతలు మంత్రాలు చదువుతూ నిచ్చెననెక్కుతారు. యూపం చివరకు ఒక చక్రముంటుంది. యజమాని మంత్రం చదువుతూ, తన తల యూపానికి మీదుగా ఉన్నట్లు నిచ్చెననెక్కుతాడు. అక్కడ నిలబడి దిగువకు నాలుగు పక్కలకు చూస్తాడు. యూపానికి సమీపానికి కొందరు నిలబడి అశ్వత్థ పత్రాలలో కట్టిన ఒండ్రుమట్టి పొట్లాలను యజమాని వేపు విసురుతారు. యజమాని వాటిని పట్టుకుంటాడు. మంత్రం చదువుతూ పొట్లంలోని మట్టిని చూస్తాడు. అధ్వర్యుడు ఉదుంబర కాష్టంతో నిర్మించిన పీటమీద మేక చర్మాన్ని పరచి, దాని పైన బంగారు నాణెమొకటి ఉంచుతాడు. యజమానిని దాని పైన కూర్చోబెడతాడు. వండిన నీవార ధాన్యాన్ని సమం చేస్తాడు. ఉదుంబర కాష్ఠంతో చేసిన పాత్రలో వేస్తాడు. దీనినుండి గరిటతో మిశ్రమాన్ని తీసి ఏడుసార్లు హోమం చేస్తాడు. మిగిలిన మిశ్రమంతో ప్రోక్షిస్తాడు. తరువాత అధ్వర్యుడు మూడుసార్లు బిగ్గరగా యజమాని పేరును ఉచ్చరించి, ఇతడు సార్వభౌముడని ఉద్ఘోషిస్తాడు.

యాగపరిసమాప్తిలో, ఉద్వసనీయకర్మ తరువాత, యూపానికి చుట్టిన బట్టలను యజమాని అధ్వర్యుడికి దానం చేస్తాడు. యాగం చేయించిన ఇతర పురోహితుల మెడలలో వేసిన బంగారు గొలుసులను వారికే అతడు దానం చేస్తాడు.

ఈ విధంగా వాజపేయ యాగం ముగుస్తుంది.

ఇక అశ్వమేధ యాగం గురించి… ఈ యజ్ఞం చాల ప్రఖ్యాతి చెందినది. శుక్లయజుర్వేదం 22, 23, 24, 25 అధ్యాయాలలో దీని గురించి వివరంగా ఉంది.

అశ్వమేధ యజ్ఞం ఫాల్గుణ మాసంలో శుక్ల సప్తమినాడు ప్రారంభిస్తారు. యజ్ఞపూజలో బంగారాన్ని వినియోగిస్తారు. ఈ యజ్ఞం అగ్ని యొక్క మూలభూతమైన సారమని, యజమానుడి ఆయువును పరిరక్షించే కాంతి, అమృతము అని వర్ణించబడింది.

విశ్వానికి ప్రభువైన ప్రజాపతి యొక్క శరీరమే అశ్వం. అందుచేత అది శాశ్వతమైనది. మరణం లేనిది. అశ్వం రూపం ధరించిన శక్తి అశ్ అంటే వ్యాపించడం అశ్వమంటే విశ్వవ్యాప్తమైనదని అర్థం.

అశ్వం యొక్క శుభప్రదమైన గమనం విరామ మెరుగనిది. నిజంగా ఆలోచిస్తే, అటువంటి అశ్వాన్ని ఎవరూ చంపలేరు. కాని యజ్ఞంలో దానిని చంపుతారు. అగ్నికి, సోముడికి, అట్లకు, సవితకు, వాయువుకి, విష్ణువుకి, ఇంద్రుడికి, బృహస్పతికి, మిత్రుడికి, వరుణుడికి స్వాహాకారాలతో యజ్ఞం చేస్తారు. అశ్వం యొక్క సాహస కార్యాలను స్మరిస్తారు. వాటిని గౌరవిస్తూ దక్షిణలు ఇస్తారు.

విశ్వప్రేరకుడు సవిత హిరణ్యరశ్మి. అతడు అతనిని యజ్ఞంలో ముందుగా స్మరిస్తారు. యజమానుడి బుద్ధిని ఉత్తమమైనట్టిది, పవిత్రమైనట్టిది అయిన కాంతితో (వరేణ్యభర్గంతో) సునిశితం చేయమని సవితను స్మరిస్తారు. వైదికమైన అర్థమేమంటే, దేదీప్యమానంగా వెలుగొందే సవిత సర్వజ్ఞుడు, ఆత్మాన్యత్యం పొందినవారికి పరిరక్షకుడు అతడు మానవుని యందు కరుణ వహించి, నాశనం లేని సత్యం యొక్క జ్ఞానాన్ని ప్రసాదిస్తాడు. సవిత మతివిదుడు అందుచేత యజమానుడు ముందుగా సనితను శాంతింపజేస్తాడు. సవిత యొక్క స్నేహాన్ని కోరుతాడు. విశ్వదేవుల శాంతికి సహాయం చేయమంటాడు.

అధ్వర్యుడు అశ్వమేధయాగంలో అమరుడైన అగ్నిని వ్రేల్చుతాడు. అంతడు దేవతలందరికి హవిర్భాగం అందిచవలసినవాడు.

ప్రజాపతి సాక్షిగా అనుగ్రహిస్తే, పూజ్యురాలైన మాతృమూర్తి అదితి, పరహితమే ధ్యేయముగా కలది, యజమానుని పవిత్రునిగా చేస్తుంది. మహోన్నతురాలైన మాతృమూర్తి సరస్వతి యజమానిని పరిశుద్ధుడిని చేస్తుంది.

యజమానుడు ఆ విధంగా పవిత్రమైన తరువాత, సర్వాంతర్యామియైన విష్ణువును అశ్వమేధయజ్ఞాన్ని ఆశీర్వదించమని ప్రార్థిస్తాడు.

శుక్ల యజుర్వేదంలో 22వ అధ్యాయంలో ఒక దివ్యమైన మంత్రముంది. దీని అర్థమిలా ఉంటుంది.

“ఓ బ్రహ్మ! బ్రహ్మ వర్చస్వులైన బ్రాహ్మణులు మనదేశ మందు జన్మింతురు గాక! శత్రు శరీరాలను ఛేదించే బాణాలను ప్రయోగించగల పరాక్రమవంతులైన క్షత్రియులు జన్మింతురు గాక! మన ధేనువులు సమృద్ధిగా పాలన ఇచ్చుగాక! మన ఎద్దులు, బలిష్ఠములై, కాడికి పూసినపుడు అత్యధిక శ్రమను ఓర్చుగాక! మన అశ్వాలు వేగమంతములగుగాక! మన స్త్రీలు పురంధ్రులగుదురు గాక! (కుటుంబములు కలవారు) మన పురుషులు రథములపై విజయము పొందుటకై పోదురుగాక! యజమానునికి యువకుడైన పుత్రుడుండుగాక! అతడు విద్వత్సభలలో మేధావియై వర్తించుగాక! మనము కోరు వర్షములు కురియుగాక! మన వృక్షములు చక్కని ఫలముల నిచ్చుగాక! మన ప్రజలు ఆరోగ్యవంతులై, క్షేమముగా నుందురు గాక!”

ఇటువంటి ఉదాత్తమైన ఫలితాలను దృష్టిలో ఉంచుకొని పురోహితులు అశ్వమేధ యజ్ఞంలో ప్రాణాలకు, ఇంద్రియాలకు, మూడులోకాలకు, నక్షత్రమండలానికి, దిక్కులకు, జలాలకు, వాయువులకు, ధూమానికి, వర్షాలకు, మెరుపులకు, దివారాత్రాలకు, మాసాలకు, సంవత్సరానికి, ఋతువులకు, ఋతువులలో పుట్టినవాటికి, సూర్యుడికి, చంద్రుడికి, వారి కిరణాలకు, వసువులకు, రుద్రులకు, ఆదిత్యులకు విశ్వేదేవులకు, మొక్కలకు, వక్షాలకు, వృక్ష మూలాలకు, వృక్షశాఖలకు, పుష్పాలకు, ఫలాలకు స్వాహాకారాలతో హోమం చేస్తారు.

పురోహితులు అన్నానికి నైవేద్యం పెడతారు. స్వర్గలోకవాసుల ఆహారానికి నివేదన చేస్తారు. దానికి యజమానియైన సూర్యునికి నైవేద్యం పెడతారు. చివరకు ప్రజాపతికి, పురుషునికి ప్రకృతికి, అసంఖ్యాకములైన ఆకారాలతో విరాజిల్లుతున్న సృష్టికి నైవేద్యం పెడతారు. ఈ అశ్వమేధ యజ్ఞం అంటే ప్రజాపతిని పూజించడమన్నమాట. ప్రజాపతి అన్నా హిరణ్య గర్భుడన్నా ఒకటే. సృష్టింపబడిన వారిలో మొదటివాడు, వారి ప్రభువు, వారి రక్షకుడు, విశ్వాన్ని వహించవలసినవాడు, సూర్యుడు అతని శక్తి, సంవత్సరంలోని దినాలన్నీ ఆ శక్తిని ప్రదర్శిస్తాయి. ప్రజాపతి విశ్వంలో గల ప్రాణులకు పాలకుడు, ద్విపాత్తులకు, చతుష్పాత్తులకు ప్రభువు. ఆ విధంగానే రాత్రులందు అతని శక్తి స్వరూపం చంద్రుడు. భూమి అగ్ని, నక్షత్రమండలం కూడా ప్రజాపతి శక్తిని తెలుపుతాయి.

ప్రజాపతి యొక్క శక్తియే సర్వవ్యాప్తిగల ఆదిత్యుడు, స్నేహశీలి. అందుచేతనే జ్ఞానులు ఆదిత్యుడిని, అశ్వాన్ని ధ్యానిస్తారు. సూర్యుడు అంతటా సంచరిస్తూ సృష్టినంతటినీ చూస్తూ ఆకాశాన్ని కాంతితో నింపుతాడు. అతడు వాయువువలె వేగవంతుడు. శరీరతత్వ మందు జలానికి ఇంద్రుడికి చెందినవాడు. అష్టవసువులు గాయత్రీ ఛందస్సులో గానం చేస్తూ అతనికి ఆనందం కలుగజేస్తారు. ఏకాదశ రుద్రులు జగతీఛందస్సులో గానం చేసి అతనికి సంతోషం కలిగిస్తారు. ఆదిత్య అశ్వ సంబంధియైన మహాశక్తి అంతటా ప్రత్యక్షంగా కనిపిస్తుంది. ఈ మహాశక్తి తాను కోరిన శరీరం దాల్చగలడు. తనకు జరుగవలసిని పూజ, శాంతి అతడెరుగును.

ఈ విధంగా రూపొందిన అశ్వం చావులేనిది. జ్ఞానులకు, ఉత్తములకు స్వర్గలోకవాసానికి దారి చూపిస్తుంది. మానవుల దృష్టిలో ఈ అశ్వమన్నది యాగపశువు అయితే, అది అగ్ని తోను, వాయువుతోను, సూర్యునితోను సమానమైనది.

వేద ఛందస్సులైన గాయత్రి, త్రిష్టుప్, జగతి, అనుష్టుప్, బృహతి, పంక్తి, ఉప్లీః, కకుప్ అనువాటి యొక్క సంగీతం ప్రజాపతిని మనసులో నిలుపుకోడానికి సహాయం చేస్తుంది. .

అధికారం, ఐశ్వర్యం, స్వర్గసుఖం అన్నవి అశ్వమేధ యాగం చేసిన యజమానికి లభిస్తాయి. ఈ యజ్ఞాన్ని ఆధ్యాత్మిక చింతనతో దర్శించిన యజమానికి, శాంతి, హృదయానందం అనునవి కలుగుతాయి.

ఛాందగ్యోపనిషత్తులో అశ్వం గురించి వ్రాయబడింది. ఉషస్సును అశ్వం యొక్క శిరస్సుతో పోలుస్తారు. సూర్యుడు అశ్వం యొక్క చక్షువు, వాయువు అశ్వం యొక్క ఊర్పు, వైశ్వానరుడైన అగ్ని అశ్వం యొక్క విప్పిన నోరు, సంవత్సరం అశ్వం యొక్క శరీరం, ఆకాశం, విశ్వాంతరాళం, భూమి క్రమంగా అశ్వం యొక్క వీపు, ఉదరం, గిట్టలు, దిక్కులు, మూలలు అశ్వం యొక్క పక్కలు, ఋతువులు అశ్వం యొక్క అవయవాలు, నెలలు, పక్షాలు అశ్వం యొక్క కీళ్లు, ఆహెరాత్రాలు పాదాలు, నక్షత్ర మండలం ఎముకలు, ఆకాశం అశ్వం యొక్క మాంసం, నదులు నాడులు, పర్వతాలు యకృతో ప్లీహాలు, పెరిగిన వృక్షజాలం అశ్వం యొక్క జుత్తు, ఉదయించే సూర్యుడు అశ్వం యొక్క ముందు భాగం, అస్తమించే సూర్యుడు వెనుకభాగం, అశ్వం ఆవులిస్తే అది మెరుపు, అశ్వం ఒళ్లు విదల్చుతే అది ఉరుము, వర్షం అశ్వం యొక్క మూత్రం, నోటి నుండి వెలువడే స్పష్టమైన శబ్దాలు అశ్వం యొక్క సంభాషణ. పగలు, రాత్రి అశ్వం యొక్క శక్తి, సాగరం అశ్వం యొక్క జన్మస్థలం, వాజి అన్న పేరుతో అశ్వం దేవతలను మోస్తుంది. అర్వన్ అన్న పేరుతో అసురులను మోస్తుంది. అశ్వము అన్న పేరుతో మనుష్యులను మోస్తుంది.

అశ్వమేధ యాగానికి సంబంధించిన అశ్వం మరణించదు, శాశ్వతమైన బ్రతుకులో కలిసి ఐశ్వర్యవంతమైన సంపూర్ణ జీవితాన్ని పొందుతుంది.

అన్ని రకాలైన ఐశ్వర్యాలు, సుఖాలు పొందడానికి రాజు అశ్వమేధం చేస్తాడు. అశ్వమేధ యజ్ఞాన్ని ఫాల్గుణ శుక్ల అష్టమినాడు కాని, నవమినాడు కాని ప్రారంభిస్తాడు. (ఇంతకు పూర్వం ఫాల్గుణ శుద్ధ సప్తమినాడు అని చెప్పడం జరిగింది. ఇప్పుడు చెప్పినది కాత్యాయన శ్రోతసూత్రాల ప్రకారం చెప్పినది)

కొంతమంది ఆచార్యులు గ్రీష్మకాలంలో ఈ యజ్ఞం చేయవచ్చునంటారు. ఈ యజ్ఞం చేయడానికి నలుగురు పురోహితులు కావాలి. అద్వర్యుడు, సూత, ఉద్గాత, బ్రహ్మ అన్నవాళ్లు వారు. నాలుగు కుండలతో అధ్వరుయడు అన్నం వండుతాడు.

దాని పైన నేయి వేసి ముఖ్యులైన పురోహితులకు సమర్పిస్తాడు. యజమాని, ఒకొక్క ముఖ్య పురోహితుడికి నాలుగువేల ఆవులను కాని, అదే సంఖ్యలో బంగారు నాణాలు కాని దక్షిణగా ఇస్తాడు. అన్నం పై వేయగా మిగిలిన నేతిని అధ్వర్యుడు పన్నెండు లేక పదమూడు అరత్నుల పొడుగు (బారల పొడుగు) గల త్రాటికి రాసి, భద్రంగా ఉంచుతాడు. అధ్వర్యుడు నిష్కవిలువగల బంగారు ఆభరణం యజమాని శరీరం మీద వేస్తాడు. మాటలను ఆడవద్దని యజమానిని ఆదేశిస్తాడు. ఈ విధంగా అతడు పురోహితులకు దక్షిణులు ఇచ్చే వరకు మౌనం వాక్సంయమం పాటించాలి. అప్పుడు రాజుగారి నలుగురు భార్యలు ఆభరణాలను ధరించి వస్తారు.

మహిషి, వావాత, పరివృత్త, పాలాగలి అని వారి పేర్లు. ప్రతి భార్య నూరుమంది చెలికత్తెలతో వస్తుంది. మహిషి యొక్క నూరుగురు చెలికత్తెలు రాజపుత్రికలు, వావాతను అనుసరించే వారు క్షత్రియకన్యలు. పరివృక్తవెంట నూరునుండి సూతకుటుంబాల నుండి, గ్రామీణుల నుండి వచ్చిన కన్యలు, ఈ సూతుడు క్షత్రియుడికి బ్రాహ్మణ స్త్రీ యందు జన్మించినవాడు. నాలుగవ భార్య పాలాగలి వెంట క్షాత్ర సంగ్రహీతుల కన్యలు నూరు మంది, క్షాత్రుడనగా లెక్కలు వ్రాసేవాడు. సంగ్రహీతుడు రథికుడు.

యజమాని తూర్పు ద్వారం నుండి యజ్ఞశాలను ప్రవేశిస్తాడు. సాయంకాలం అగ్న్యాధానం జరిపి, బ్రహ్మచర్యాన్ని పాలిస్తూ, గార్హ్యపత్న్యాగ్నికి పశ్చిమంగా, వావాత తొడల మధ్య, ఉత్తర దిక్కుగా శిరస్సు నుంచి పడుకుంటాడు. మిగిలిన భార్యలు కూడా వారికి సమీపంలో పడుకుంటారు.

మరునాడు ఉదయం అగ్ని కార్యమైన తరువాత బ్రహ్మకు నిష్కాభరణాన్ని దానం చేస్తాడు. గతదినం తన శరీరం మీద వేసుకున్న నిష్కాభరణాన్ని అధ్వర్యుడికి దానం చేస్తాడు. అధ్వర్యుడు గత దినం నేయి రాసిన తాడు తెచ్చి, దానితో గుర్రాన్ని కట్టవచ్చా అని యజమాని నడుగుతాడు.

యజమాని అనుజ్ఞ తీసుకొని పలు రంగులు కల గుర్రాన్ని ఆ త్రాటితో బంధిస్తాడు. ఆ గుర్రం బాగా పరుగెత్తగలది (జవసమృద్ధమైనది). దానిని రథానికి దక్షిణం వేపు పూన్చుతే, ఉత్తరంవేపు పూన్చడానికి దానికి సరియైన గుర్రం మరొకటి ఉండకూడదు. ఆ గుర్రం వేల వేయి ఆవులు దాని ఫాలం మీద నీలపు గరుతు ఉండాలి. ఆ గుర్రం ముందు భాగంలో నల్లగను, వెనుక భాగంలో తెల్లగాను ఉండాలి.

అధ్వర్యుడు గుర్రాన్ని నిలుకడీ నీరున్న చోటికి తీసుకుపోయి మంత్రాలు చదువుతూ దానిపై నీటిని ప్రోక్షిస్తాడు. అయోగవుడనే వాడిని అంటే శూద్రుడికి వైశ్యస్త్రీకి జన్మించిన వానిని కళ్ల దగ్గర నాలుగు నక్తపుగురుతుల కల ఒక కుక్కను చంపమని, ఆజ్ఞాపిస్తాడు. కొంతమంది ఆచార్యులు, అపవితమైన స్త్రీని కుక్కను చంపడానికి నియోగించాలని అంటారు. ‘అయోగవుడు’ కాని, కులట కాని, కుక్కను సిధ్రకకాష్ఠంతో చేసిన రోకలిని ఉపయోగించి చంపాలి.

ఒక తొట్టెలో నీళ్లుపోసి, చంపిన కుక్క శరీరాన్ని ఆ నీటిలో తేలవేసి, గుర్రం కడుపు కింద ఉంచుతారు. తరువాత మంత్రాలు చదువుతారు. హోమం చేస్తారు. యజ్ఞవేదికకు దక్షిణ దిశలో కూర్చున్న బ్రాహ్మణుడొకడు, తాను రచించిన మూడు గాథలను, ఉత్తర మందర స్వరంలో చదువుతాడు. యజ్ఞకర్తను, అతడు చేసి దానాలను ప్రశంసిస్తూ ఆ గాథలు రచింపబడ్డవి. క్షత్రియుడొకడు రాజుగారి విజయాలను వర్ణిస్తూ, ధృతి సమాలలో గాధలను చదువుతాడు.

అప్పుడు అధ్వర్యుడూ, యజమానీ ఇద్దరూ గుర్రం కుడిచెవిలో మంత్రమొకటి చదువుతారు.

గుర్రానికి యౌవనదశ దాటిపోతే (గతయౌవన అయితే), దానిని నూరు గుర్రాల మధ్య ఈశాన్య దిశలో విడిచి పెట్టాలి.

రాజు భార్యలతో వచ్చిన చెలికత్తెల సంఖ్యలోనే, ఆ నాలుగు జాతులలోనే రక్షకులను నియమించి, వారిని గుర్రాలను చూడమని ఆదేశిస్తారు. ఆ రక్షకులు కవచాలు తొడుక్కుంటారు. ఖడ్గాలు ధరిస్తారు. ధనుర్థారులు వరాఉ, శూలాలను పట్టుకున్న వాళ్ళు.

ఈ యాజ్ఞశ్వాన్ని ఆడగుర్రాలకు దూరంగా ఉంచాలి. జలాశయాలలో అది మునగకుండా చూడాలి.

అశ్వాన్ని రక్షించేవారు, తమకు దారిలో ఎదురైన బ్రాహ్మణుడితో, తమ పోషణకు ఆహారం సమకూర్చుమని చెప్తారు. అతనికి అశ్వమేధయాగం గురించి తెలియకూడదు.

రక్షకులు రాత్రివేళలో విశ్రాంతి తీసుకోవలసివస్తే రథకారుల గృహాలలో విడిది చేయాలి.

“గుర్రాన్ని విజయవంతంగా కాపాడి, పట్టాభిషేకానికి యోగ్యులు కావలసింది” అనని అధ్వర్యుడు రక్షకులైన రాజుపుత్రులతో అంటాడు.

అపుడు అధ్వర్యుడు సూతని పిలిచి పారిప్లవనకథనం చేయమంటాడు. పురాణకథలలో రాజు పేరును సాహసకృత్యాలకు చేర్చి చెప్పమంటాడు. పారిఫ్లవకథనం తరువాత, యజమానిని పొగడుతూ, అతనిని రాజర్షులతో పోలుస్తూ, వీణలు వాయించి పాటలు పాడతారు.

అధ్వర్యుడు, అటు పిమ్మట, దక్షిణాగ్నికి, 49 ప్రక్రమ హెూమాలను చేస్తాడు.

సూర్యాస్తమయం తరువాత, నేతితో నాలుగు ధృతి హెూమాలను చేస్తాడు.

వావాత తొడల మధ్య రాజు పడుక్కోడం, సావిత్రక చరువును అర్పించడం, ఉత్తర మంద్రస్వరంలో సామగానం, పారిప్లవకథనాన్ని వర్ణించడం, ధృతి సమాలను చేయడం ఇవన్నీ ఒక సంవత్సరం పాటు జరిపించాలి.

కొంతమంది ఆచార్యులు ఈ యజ్ఞ కార్యాలను ఒక పక్షం దినాలు కాని, ఒక నెల దినాలు కాని, మూడు నెలలు కాని, ఆరు నెలలు కాని, చేయవచ్చునని సెలవిచ్చారు.

వీణలను వాయించిన వారికి, గాథలను పాడినవారికి నూరుగోవులను రాజుయిస్తాడు.

మహాత్ములైన రాజర్షులతో రాజును పోలుస్తూ అతని ప్రశస్తిని దీక్షణీయ ఇష్టివరకు గానం చేస్తారు.

దీక్షాంతం నుండి ఉపవసధా దినంవరకు, గాయకులు రాజును వివిధ దేవతలతో సరిపోల్చి గానం చేస్తారు. పశుయాగాల నుండి సుత్యదినాల వరకు రాజును ప్రజాపతితో పోలుస్తారు. చివరకు కూడా అతనిని ప్రజాపతి సముడంటారు.

యజ్ఞాశ్వానికి దెబ్బలు తగిలితే చరువులతో హోమాలు చేస్తారు. చరువు అంటే హెూమద్రవ్యం హోమద్రవ్యం వండే కుండకు కూడా చరువంటారు. మూడు సవితృ-ఇష్టుల తరువాత వీటిని చేస్తారు.

యజ్ఞ పశువు, ముక్కు నుండి కారే శ్లేష్మతో బాధపడితే, అధ్వర్యుడు పూషకు చరువు సమర్పిస్తాడు. కళ్ళకు రోగం కలిగితే సూర్యుడికి, గుర్రం నీటిలో పడి మరణిస్తే వరుణుడికి, ఆయుధం చేత దెబ్బతింటే వైశ్వానరుడికి, అశ్వం దారితప్పి కనిపిచకపోతే ద్వావా పృథివికి, పాలసమం వాయువుకి, సూర్యుడికి చరువు – ఈవిధంగా అన్నీ ఒక ఇష్టలోనే జరిపిస్తారు.

అశ్వంకాని మరొక ఆడ గుర్రానికి గర్భం కలిగిస్తే, అధ్వర్యుడు వాయువు కొరకు క్షీర హెమం చేస్తాడు.

అశ్వమేథం ఏడు రోజుల దీక్ష.

డాక్టర్ మోహన్ ఇంతవరకు చెప్పి ఆగిపోయాడు.

బాగా చీకటి పడింది. చలనం లేకుండా వింటున్నవారు, శశికళ కుర్చీలలో లేచారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here