Site icon Sanchika

శ్రీపర్వతం-18

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 18వ భాగం. [/box]

28

[dropcap]ప్ర[/dropcap]తి గురువారం మధ్యాహ్నం మూడు గంటలకు వాళ్లు మ్యూజియంకు వెళ్లేవారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు ఒంట గంట అయ్యేసరికి టెంట్లను చేరుకునేవాడు. అతను వచ్చిన పావుగంటకే మోహన్, శశికళ సైటు నుండి వచ్చేవారు. జావా కుక్కరులో వండి ఉంచినవి ముగ్గురు వడ్డించుకొని తినేవారు. ఒక అరగంట విశ్రాంతి తీసుకొని, సరిగా మూడయ్యేసరికి మ్యూజియంలో ఉండేవారు.

ఆరోజు వాళ్ళు వెళ్లేసరికి క్యూరేటర్ ప్రసాద్ లేరు. ఆయన తొందర పనిమీద గుంటూరు వెళ్ళారు. తక్కిన స్కాలర్లలో ఎవరు కూడా అక్కడికి రాలేదు.

కొన్ని శిల్పఫలకాలను, ప్రసాద్ గారి అసిస్టెంటులు సబ్బుతో కడిగి, పొడిగా తుడిచి, బెంచీల మీద ఉంచారు. ఆ ఫలకాల మీద జాతక కథలు, బుద్ధుడి జీవితంలో కొన్ని ఘట్టాలు, చెక్కబడ్డవి. ఉబ్బెత్తు కుడ్యశిల్పాలవి.

శశికళ చేతి సంచీలోంచి భూతద్దం తీసి, ప్రతీ శిల్పఫలకాన్ని చాల జాగ్రత్తగా పరిశీలించింది. మోహన్ కూడా కొన్నింటిని శ్రద్ధగా పరికించాడు. రావు కూడా వాటిని బాగా చూసి భూతద్దాన్ని శశికళకు ఇచ్చి వేస్తూ అన్నాడు.

“పవిత్రమైన బుద్ధ జీవిత ఘట్టాలను చెక్కిన ఆంధ్రశిల్పులు ఒకొక్కచోట చాల స్వతంత్రంగా వ్యవహరించారు. శృంగారానికి బౌద్దానికి అమడల దూరం. ఆచార్యుల పర్యవేక్షణలో శిల్పులు పనిచేసినట్లు తెలుస్తుంది. బుద్ధుడి జీవితంలోని ఘట్టాలను చెక్కిన పెద్ద ఫలకాల పైన, రెండు పెద్ద చిత్రాలకు మధ్య, దివ్యమైన మిదున చిత్రాలను వాళ్ళు చెక్కారు. దీని గురించి కొంచెం వివరంగా చెప్తారా?”

శశికళ మోహన్ ముఖంలోకి చూసింది.

మోహన్ ఒక్క క్షణం ఆలోచించాడు.

“మనకు ఈ లోయలో లభించిన ఉత్తమ శిల్పాలన్నీ బౌద్ధ స్తూపాలనుండే లభించాయి. బ్రాహ్మణ దేవాలయ సముదాయాల నుండి చాల కొద్ది శిల్పాలు మాత్రమే దొరికాయి. వాటిలో కూడా ఎటువంటి పురాణ కథలు కాని, చక్రవర్తుల చరిత్రలు కాని లేవు. ఈ ప్రాంతాలలో, మొదటివి మహాచైత్యం నిర్మింపబడింది. శాతవాహనుల కాలంలో ఏ బౌద్ధ విహారాలు కట్టారో తెలియదు. ఇక్ష్వాకుల రాజైన వీరపురుష దత్తుడి అరవ పాలనా సంవత్సరంలో ఈ విహార నిర్మాణ కార్యక్రమం తిరిగి మొదలయింది. ఆంధ్రశిల్పులు తమ కౌశలాన్ని ప్రదర్శించే అవకాశం లభించింది.”

“ఈ శిల్ప రచన బౌద్ధాచార్యల పర్యవేక్షణలో జరిగింది. ఈ మిథున చిత్రాలను చెక్కడానికి వారు శిల్పులను అనుమతించారా?” రావు అడిగారు.

“మనకు ఇప్పటికి ఇరవై తొమ్మిది మిథున శిల్పాలు లభించాయి. బహుశా, బౌద్ధులు వీటిని చూసి చూడనట్లు ఊరుకున్నారేమో!” అంది శశికళ.

“ఈ మిథున శిల్పాలు భార్యాభర్తలకు సంబంధించినవి కాకపోవచ్చు. దంపతుల శృంగారాన్ని ఈ విధంగా ప్రదర్శించరు. ఆ కాలంలో బహుభార్యాత్వముంది, వేశ్యలున్నారు. గణికలున్నారు. ఉత్సవాలలో వారి నాట్యం విధిగా ఉండేది. ఐశ్వర్యవంతులైన శ్రేష్ఠులు, బలపరాక్రమాలు కల వీరపురుషులు ఉండేవారు. ఆ కాలంలోనే వాత్సాయనుడి కామసూత్రాలు ప్రచారంలోకి వచ్చాయి. అందుచేత శృంగార భావాలు కల శిల్పులు చాలా సహజంగా ప్రేయసీప్రియులను, జాతకకథల మధ్య, బుద్ధుడి జీవితఘట్టాల మధ్య చెక్కారు. ఆ చిత్రాలు చాలా రమణీయంగా ఉండడంచేత, ఎవరూ వాటిని కాదనలేదు. భక్తి శ్రద్ధలతో పెద్ద చిత్రాలు చెక్కిన శిల్పులు సరదాగా చెక్కిన దివ్యమైన మిథున చిత్రాలను ఆచార్యులు తోసిపుచ్చలేదు. బుద్ధ ప్రతిమలను విరుగ గొట్టిన ప్రబుద్ధులు వీటి జోలికి పోలేదు” అన్నాడు మోహన్.

“ఏ కాలంలోనైనా వ్యభిచారం ఉంటున్నట్లే కనిపిస్తుంది. ఈ విషయం గురించి కొంచెం వివరంగా చెప్తారా?” రావు అడిగాడు.

“మీకు చాల విషయాలు తెలుసు. వాత్సాయనుడి కామ సూత్రాలు అందరికీ అందుబాటులోనున్నాయి. అందులో వైశికాధికరణం అన్న అధ్యాయమొకటుంది. దానిలో వేశ్యావృత్తి గురించి వివరంగా ఉంది” అన్నాడు మోహన్.

“నాకు అంతగా జ్ఞాపకం లేదు. మరెవరూ ఈ విషయం గురించి వ్రాయలేదా?” రావు అడిగాడు.

“దామోదరగుప్త కుట్టనీమతం అన్న కావ్యం రచించాడు. అందులో కొన్ని సంగతులు ఆసక్తికరంగా ఉంటాయి”.

తరువాత మోహన్ చెప్పటం మొదలు పెట్టాడు.

***

కాశ్మీర ప్రభువు జయాపీడడుడు. అతని ప్రధానమంత్రి దామోదరగుప్త. బౌద్ధుల వారణాసి లేక హిందువుల కాశీ ఈ నగరం చాల పురాతనమైనది. కాశీలో వేశ్యల జీవితాన్ని లోతుగా అధ్యయనం చేసి విశ్లేషించాడు దామోదరగుప్త.

కుట్టనీ లేక కుట్టినీ అన్న పదానికి వ్యుత్పత్తి ఇలా చెప్తారు. ‘కుట్టయతి నాశయతి స్త్రీణాం కులమ్ ఇతి కుట్టనీ’ అఏల మరొకటి ‘కుట్ట స్త్రీణాం కులనాశౌ కర్తవ్యతయా అస్తి అన్యాః’

కుట శబ్దానికి కైతవమని అర్థం. కుట్టనీకర్మ అంటే మోసం. దీని ద్వారా నాయకుడికి నాయికకకు సంయోగము సుగమమవుతుంది. శంభవి, మాధవి, అర్జుని, కుంభదాసి, గణేరుక, రంగదాసి అన్నవి కుంటెనకత్తెకు పర్యాయపదాలు.

కామాచారానికి వేశ్యావృత్తికి లక్ష్యభేదాలున్నాయి. కామాచారమందు శారీరకసౌఖ్యం ప్రధానమైనది. వేశ్యావృత్తియందు ధనార్జన ముఖ్యమైనది.

‘వేమమర్హతి వేశేన దీవ్యతి ఆచరతి, వేశేన పణ్యయోగే, జీవతి నా ఇతి వేశ్యా’ డబ్బు కు వ్యభిచరించేది అని అర్థం. వేశ్య అన్నపదానికి రండ, వారస్త్రీ, గణిక, క్షుద్ర, వూల, లజ్జి బంధుర, కుంభ, వర్వటి, భోగ్య, భుజిష్య, వారవధువు, నగర వధువు, పతురియు, పణ్యాంగన, రూజాజేవ, శాలభంజిక, స్మరవీదిక, ఖానగి, ఝుర్ఘర, కామరేఖ, వారవిలాసిని, భండహాసిని మొదలైనవి పర్యాయాలు. నారీజన బేధాల గురించి బ్రహ్మవైవర్త పురాణంలో చెప్పబడింది.

స్త్రీలలో మొదటిది పతివ్రత, రెండవది కులట, మూడవది ధరిణి, నాలుగవది పుంశ్చలి వేశ్య, అయిదవది యుగ్మి, ఆరవది సప్తమమందు ఉదర్ధ్య, అష్టమమందు మహావేశ్య, ఆఖరి ఆమె అన్ని జాతులకు అంటరానిది.

గణ రాజ్యాలయందు రాజపురుషులతోను, దనికులతోను సంబంధం గల సుందరీమణులను గణికలంటారని కొందరు చెప్తారు. వైశాలీనగరానికి చెందిన ఆమ్రపాలి గణభోగ్య ‘నాయాధమ్మకహా’లో చంపా నగరంలో గల గణిక గురించి చెప్పబడింది. ఆమె ఆరవది నాలుగు కళలలోను నిష్ణాత. శృంగారకళ యందు దక్షురాలు. ఆమెకు చాల భాషలు తెలుసు. ఎన్నో భాషలలో ఆమె మాట్లాడగలదు. గణికలు రాజులకు చామరధారిణులుగా కూడా వ్యవహరిస్తారు.

కథా సరిత్సాగరంలో ఇటువంటి వేశ్యల గురించి చెప్పబడింది. తాము ఎన్నిక చేసిన నాయకులనే స్వీకరించేవారు. బహు భోగ్యలుగా వ్యవహరించడానికి వారు అంగీకరించలేదు. దనం కోసమని వారు ఆత్మ గౌరవాన్ని పణం పెట్టలేదు. పాటలీపుత్రానికి చెందిన కోశ, ఉపకోశ అన్నవారు ఇటువంటి గణికలే. ఉజ్జయినిలోని దేవదత్త కూడా ఇటువంటిదే. ప్రతిష్ఠానపురదాసి మదనమాల కూడా వైభవపూర్ణమైన జీవితం గడిపినదే.

దాసి అంటే కాముకి అని, అందరిని భర్తలుగా కోరేదని కుట్టనీమతంలో దామోదరగుప్త చెప్తాడు. దాసి అంటే వేశ్యగా తీసుకోవచ్చునేమో!

దేవదాసికి వేశ్యావృత్తితోనే సరిపోదు. దేవాలయాలలో సేవాకార్యం కూడా ఈమె నెరవేర్చవలసి ఉంటుంది.

గణికగా రాణించడానికి కుంటెనకత్తె ఒక ముఖ్యమైన సలహాయిస్తుంది. ఏ పురుషుడికి కూడా హృదయాన్ని సమర్పించకూడదు. ప్రేమలో పడకూడదు. ఎందుచేతనంటే వీటి పరిణామాలు గణికకు నష్టమే కలుగజేస్తాయి. అందుచేత ధనరహితుడైన వ్యక్తిని తిరస్కరించాలి. అధిక సంపదగలవానిని గౌరవించాలి. అతను ధనార్జన కోసమే సృష్టించబడ్డాడు.

ఒకప్పుడు పురుషుడు దరిద్రుడైనా అతనిని ప్రేమించే గణికలు లేకపోలేదు. రూపాజీవ అయినా వసంత సేన దరిద్రసార్ధ వాహకుడైన చారుదత్తుడిని ప్రేమించింది. ఈ విధంగానే కుట్టనీమతం కావ్యంలో, హారలతా సుందర సేనులు కథలో, గణికయైన హారలత సుందరసేనుడిని ప్రేమించి అతని వెంటబడుతుంది. యౌవనంలో ప్రేమలో పడిన గణిక, వయస్సు మీరిన తరువాత చాల కష్టాలను ఎదుర్కోవలసి వస్తుంది. ఆమె వీధులలో తిరిగి బిచ్చమెత్తుకుంటుంది.

సంస్కృత దశ రూపకంలో ‘భాన’మన్న ఒక రూపకవిశేషముంది. దీనిలో గణికాజీవనం చర్చించబడుతుంది. చతుర్భాణి అన్నది ఇటువంటి ప్రసిద్ధ గ్రంథము. క్షేమేంద్రుని సమయ మాతృక, దశోపదేశం, నర్మమాల, కళావిలాసము అన్న కావ్యాలలో గణికాజీవనం గురించి వివరంగా ఉంది. జల్హణుడి ముగ్ధోపదేశం కూడా ఇటువంటిదే.

వారణాసిలో మాలతి అన్న గణిక ఉండేది. కాముక జనుల హృదయాలను హరించడానకి ఆమె అసమర్థ అయి, వికరాల అన్న కుంటెనకత్తె దగ్గరికి పోయి, విటులను ఆకర్షించే ఉపాయాలను అడిగింది. వికరాల, మాలతి యొక్క సౌందర్యాన్ని ప్రస్తుతించింది. భట్టపుత్రుడన్న అతనిని ఆకర్షించడానికి ప్రయత్నించమంది. భట్టపుత్రుని సత్కరించమని మాలతికి చెప్పి, ఈ కథ వినిపించింది.

కుసుమపురం, అంటే పాటలీపుత్రం. అక్కడ పురందరసేనుడనే బ్రాహ్మణుడుండేవాడు. అతని కుమారుడు సుందరసేనుడు. అతడు తన మిత్రడు గుణపాలితుడితో కలిసి, దేశాటనం చేస్తూ అర్బుతాచలం, అంటే ఈనాటి అబూపర్వతం చేరుకున్నాడు. ఈ పర్వత సౌందర్యానికి సుందరసేనుడు మోహితుడయాడు. అక్కడ ఒక ఉద్యానవనంలో అతనికి హారలత అన్న సుందరి ఎదురయింది. ఆమె గణిక. తొలి చూపులలోనే ఒకరినొకరు ప్రేమించుకున్నారు. సుందరసేనుడు ఒక సంవత్సరం పాటు ఆ గణికతో సుఖంగా గడిపాడు. గుణపాలితుడు, తనకు ఇష్టం లేకపోయినా, మిత్రునికోసం అతనితో పాటు ఉండిపోయాడు. ఇంతలో సుందరసేనుడు తండ్రి దూత ద్వారా ఒక ఉత్తరం పంపించాడు. కొడుకు చేస్తున్న పనిని అతడు గర్హించాడు. వెంటనే వచ్చి కుటుంబభారాన్ని భుజాలమీదికి ఎత్తుకోమన్నాడు. తండ్రి ఆజ్ఞను పాలించి, సుందరసేనుడు మిత్రుడితో కలిసి స్వగృహానికి బయలుదేరాడు. వియోగవిహ్వాల అయిన హారలత అతని వెనుక కొంచెం దూరం పోయింది. నగరం దాటిన తరువాత ప్రియురాలిని వీడ్కోలు చెప్పి, సుందరసేనుడు కొంత దూరం ముందుకుపోయాడు. వెనుకనుండి వస్తున్న బాటసారిని అతడు హారలత గురించి అడిగాడు. ఆ పథికుడు, ఎవరో మహిళ, చెట్టుకింద, కదలిక లేకుండా పడి ఉన్నదని చెప్తాడు. హారలత ప్రాణాలు విడిచి పెట్టిందని తెలుసుకొని, సుందరసేనుడు వెనుకకు వచ్చి ఆమె మృతదేహాన్ని చేరుకుంటాడు. నెత్తీనోరు కొట్టుకొని చాలాసేపు విలపిస్తాడు. చివరన ఆమె శరీరాన్ని అగ్ని సంస్కారం చేసి, సన్యాసం పుచ్చుకొని వెళ్ళిపోతాడు.

ఈ కథను భట్టపుత్రుడనికి చెప్పమని వికరాల మాలతికి బోధించింది. ఈ కథ వింటే అతడు ఆమె యందు విశ్వాసం పెంచుకుంటాడని చెప్పింది. ఎప్పుడైతే అతడు మాలతి యందు అనురక్తుడవుతాడో, అతనిలో ఈర్ష్యను కలిగించే మాటలు ఆడాలి. ఎప్పుడైతే ఆమెను గాఢంగా ప్రేమిస్తాడో, అప్పుడు తల్లితో కలిసి మిథ్యాకలహాన్ని లేపాలి. డబ్బు ఖర్చు పెట్టేవాళ్లను విడిచి పెట్టి, ఇటువంటి వాడి వెనుక ఎందుకు పడ్డావని తల్లి కోపిస్తుంది. గణికలకు అనురాగం పనికిరాదు. ఆమె తల్లి మాటలను మన్నించదు. తనకున్న దాంతో ప్రియుడికి అర్పించడానికి నిశ్చయించినట్లు చెప్పి, కామవర్థకములైన ఉపచారాలతో అతనిని సేవిస్తుంది.

ఇంతచేసినా విటుడు ప్రభావితుడు కాకపోతే, చోరులు తన నగలన్నీ దోచుకున్నారని ఆమె చెప్పవలసిందని వికరాల బాధిస్తుంది. ఈ యుక్తి విఫలమయితే, ఒక వర్తకుడితో రహస్యంగా చెప్పి, అతనిచేత కుదువబెట్టిన ఆభరణాలను డబ్బిచ్చి వెంటనే విడిపించుకోవాలని చెప్పించాలి. అప్పుడు గణిక, తన దగ్గర డబ్బు లేదని, కుదువబెట్టిన నగలను, హారాలను అమ్మి, అప్పిటికీ ఋణం తీరకపోతే, తరువాత ఇవ్వగలదని చెప్పాలి.

ఈ కుయుక్తులన్నీ వ్యర్థమయితే, ప్రియునితో గణిక ఈ విధంగా చెప్పాలి.

“నువ్వు జబ్బు పడినప్పుడు అమ్మవారికి పూజ చేయిస్తానని మొక్కుకున్నాడు. కాని, సామగ్రి లేకపోవడం చేత పూజ చేయించలేకపోయాను. మొక్కు తీర్చలేదని మనసులో బాధపడుతున్నాను.”

ఈ ఉపాయాలతో విటుడిని తన గుప్పిటిలో గణిక ఉంచుకోవాలి. తరువాత అతనిని వదిలించుకునే ప్రయత్నాలు చేయాలి. ఎన్ని చెప్పినా ఆ పశువు అర్థం చేసుకోకపోతే అప్పుడు అతనితో అనాలి.

“నువ్వంటే నా హృదయం చాలా సంతోషిస్తుంది. కాని, ఏం చేయను? మా అమ్మ మాట తోసివేయలేను కదా! అందుచేత కొన్ని దినాలపాటు నువ్వు నన్ను విడిచి వెళ్లిపో! నువ్వు తిరిగి వచ్చిన తరువాత ఇద్దరం ప్రపంచాన్ని ఏలుదాం!”

అతడలా గణికను విడిచి కొంతకాలం తరువాత ధనం సంపాదించి తిరిగివస్తే అతనితో పూర్వం వలెనే ప్రవర్తించాలి.

ఈ సందర్భంలో వికరాల మరోకథ చెప్పింది.

సింహభట మహారాజుగారి కుమారుడు సమర భటుడు. అతడు తన పరివారంతో కాశీ విశ్వనాథుని దర్శనానికి వెళ్లాడు. అటు పిమ్మట నగరంలో ఉన్న వేశ్యలను, సంగీతాచార్యులను, వణగ్జనులను, ఇతర వృత్తులలో ఉన్న వారిని కలుసుకున్నాడు. వారణాసిలోని సంగీత పద్ధతుల గురించి తనకు నృత్యం నేర్పిన ఆచార్యుని అడిగాడు. ఆచార్యుడు ణికాజనం యొక్క వ్యాపారం గురించి చాల ఉదాహరణలు చెప్పి, హర్షుని ‘రత్నావళి’ నాటకంలో అభినయం చేసే వారిలో, మంజరి అన్న పేరుగల గణికను పరిచయం చేశాడు. రాజపుత్రడు ఆమెను నేత్ర దండంతో స్పృశించాడు.

సమర భటునితోనున్న అతని మంత్రి, వేశ్యలను నిందిస్తూ బంధకితో పోవడాన్ని ప్రశసించాడు.

తన భార్య యందు అనురక్తుడై ఉంటే అది సంతానం కోసం. దానిని అలింగనం చేసుకోవడం వ్యాధి నుండి శయనం పొందడానికి.

కాని, పరకీయతో అనుభవించినదే సుఖం – ఆ సుఖం చాల శ్రమపడితే కాని లభించదు.

మంజరి తల్లి మంత్రి మాటలను సతర్కంగా ఖండించింది.

నర్తకాచార్యుడు, ‘రత్నావళి’ లో ఒక అంకాన్ని చూడమని రాజపుత్రుని ప్రార్థించాడు. దానికి అతను అంగీకరించాడు. అందులో మంజరి చేసిన నాట్యాన్ని అతను చాలా ప్రశంసించాడు. ఆమె పట్ల అనురక్తుడయ్యాడు. తత్పలితంగా ఆ గణిక అతనిని తన వివిధ విలాసాలతో బంధించి అతని సర్వస్వం దోచుకుంది. అతనిని చర్మంతోను, ఎముకలతోను విడిచి పెట్టింది.

ఈ కథను వికరాల మాలతికి వినిపించి అంది:

“కాముకుని ధనం హరించడానికి నేను ఏ ఉపాయాలను చెప్పానో వాటిని యోగించి, నువ్వు మహత్వమైన సంపదను పొందగలవు.”

మాలతి ఈ ఉపదేశాన్ని విని, వికరాల చరణాలను స్పృశించి, సంతుష్టురాలై తన గృహానికి మరలిపోయింది. దామోదరగుప్త కావ్యం చివరను ఈ విధంగా వ్రాశాడు.

“ఈ వాక్యాన్ని ఎవరయితే చదువుతారో, వింటారో, వాళ్లు ఎప్పుడూ విటుల చేత, వేశ్యల చేత, ధూర్తుల చేత, కుంటెన కత్తెల చేత వంచితులు కారు.”

భరతుడు తన నాట్యశాస్త్రంలో గణికలు, రూపశీలగుణాన్వితలని చెప్తాడు.

బౌద్ధుల పాలీ సాహిత్యంలో గణిక జనపదకళ్యానిగా పరిగణింపబడింది.

కుట్టనీమతం కావ్యంలో మొదటి నుండి చివరివరకు వేశ్యల దైనందిన జీవితం గురించి దామోదరగుప్త చెప్పాడు.

కుట్టని, కుట్టనీ గృహంలో కల జనసముదాయం, కాముకులు, కాముకుల వైభవ విలాసాలు, కాముకుడిని వదిలించుకోడానికి చేసే విభిన్న ఉపాయాలు, చౌర్యం, మాతృకలహం, పురుషోపచారాలు, వియోగం, తిరిగి కలుసుకోవడం, వక్రోక్తి ప్రయోగం, లలితోక్తులు, ఈ కావ్యంలో పుష్కలంగా లభిస్తాయి.

ఇంతవరకు చెప్పి మోహన్ ఆపివేశాడు. అప్పటికే చీకట్లు దట్టమయ్యాయి.

మ్యూజియం ఎటెండెంట్లు తలుపులు మూయడానికి తొందరపడుతున్నారు.

వాళ్లు ముగ్గరూ టెంట్ల వేపు నడిచారు. టెంట్లలో దీపాలు వెలిగించింది జావా.

వంట పూర్తి చేసుకొని ఆమె లంబాడీ తాండవేపు వెళ్లింది.

కాళ్ళు కడుక్కొని బట్టలు మార్చుకొని, శశికళ ముందు టెంటుకు వచ్చింది.

“నేను చెప్పిన గణికావృత్తాంత భారతదేశానికి సంబంధించినది. గ్రీకు గణిక గురించి శశికళ చెప్పవలసి ఉంది” అన్నాడు మోహన్.

“భోజనాల తరువాత చెప్తారా?” రావు అడిగాడు. ఆమె కాదనలేకపోయింది. గ్రీకు గణిక గురించి ఆమె చాలా చదివింది.

భోజనాలయిన తరువాత వాళ్లు ముగ్గురూ మండుటెంటులో కూర్చున్నారు. శశికళ చెప్పడం మొదలు పెట్టింది.

“ఈ విషయం ఎక్కడ మొదలు పెట్టాలో నాకు తోచడంలేదు. గ్రీకు వ్యభిచారం గురించి చాలా గ్రంథాలలో ఉంది. అందుబాటులో ఉన్న పుస్తకాల నుండి, అరుదుగా లభించే గ్రంథాలలోంచి కొన్ని విషయాలు చెప్తాను.”

***

పురాతన కాలం నుంచీ గ్రీకులు వ్యభిచారం గురించి అరమరికలు లేకుండా చర్చించారు. డబ్బుతో కొనగల స్త్రీలను ‘హిటైరా’ అంటే గణికలు అని పిలిచేవారు. దీనికి సరియైన అర్థం, జీవిత భాగస్వాములు లేక స్నేహితులు అని. ఈ వీనస్ పుత్రికలు గురించి చాలా వ్రాశారు. చాలా చెప్పుకున్నారు. గ్రీకు సాహిత్యంలో, ఈ గణికలు, ప్రజల రహస్య జీవితంలో నిర్వహించిన పాత్ర గురించి విపులంగా లిఖింపబడింది. కొరింత్, ఏథెన్సు నగరాలలో జరిగే వ్యభిచారం గురించి హెచ్చుగా గ్రంథాలలో లభిస్తుంది.

లూషియన్ రచించిన ‘గణికల సంభాషణలు’ అన్నగ్రంథం చాల హాస్యంతో కూడినది.

డబ్బు కోసం శరీరమమ్ముకున్న స్త్రీలను గ్రీకుల స్నేహితులుగా, సహచరులుగా పిలిచి, వ్యభిచారిణులు అన్న నీచమైన పదాన్ని పరిహరిస్తారు. ఈ వేశ్యలకు నిఘంటువులలో చాల ముదక మాటలున్నాయి. వాటిలో మాంసం కోసం కత్తి, అనుసంధానక రాణి, వాడలలో పనిచేసేది, బజారుమనిషి, వెంటబడి పరుగెత్తేది, పడకటింటి వస్తువు అన్న పేర్లున్నాయి. వేశ్యలు పురుషులను ఆకర్షించి, తరువాత వారిని తరిమివేస్తారని మరొకరు చెప్పారు, ‘వేశ్యవలె నిందించడం’ అన్నసామెత వాడుకలోకి వచ్చింది. వీళ్లను పాచికలంటారు. జూదంలో ఏ ప్రకారం పాచికలను ముందు చేతిలోకి తీసుకొని పారేస్తారో, వేశ్యలను కూడా ఆ విధంగా పావులవలె విసిరివేస్తారని అభిప్రాయం. ఆఫ్రోడైటీ యొక్క గుర్రపు పిల్లలని కూడా వేశ్యలను పిలుస్తారు. వేశ్యమాతలకు, కుంటనకత్తెలకు, అటువంటి వారికి గ్రీకు భాషలో చాలా పేర్లున్నాయి.

వేశ్యాగృహాలలో ఉండే వ్యభిచారిణులను సమాజంలో చాల నీచమైన స్థితిలో ఉన్న వాళ్లుగా పరిగణిస్తారు. వాళ్లను గణికలని పిలువరు. వాళ్లను రంకుటాళ్లనే పిలుస్తారు. సోలాన్ అన్న అతడు ఏథన్సు నగరంలో వ్యభిచారగృహాలను ప్రప్రథమంగా నెలకొల్పాడు.

ఈ వ్యభిచార గృహాలలో తేలికయైన దుస్తులలోనో, నగ్నంగానో వేశ్యలు కనిపిస్తారు. పురుషులు తమకు నచ్చిన వారిని ఎన్నుకొనేవారు. ఒక హాస్యరచనలో ఇలా ఉంది.

“సంగీత ప్రియులు, డుబ్బు గుంజే పిట్టవేటగాళ్ళ, దుస్తులు తొడిగిన వీనస్ గుర్రపు పిల్లలు, వరుసగా నిలుచుంటారు. వారి పలుచని వస్త్రాలలో శరీరాలు కనిపిస్తుంటాయి. ఎరిడేనస్ నది యొక్క పవిత్ర జలాలలో నిలిచిన దేవ కన్యలవలె వాళ్లు కనిపిస్తారు. వాళ్ల నుండి నువ్వు సౌఖ్యాన్ని కొనుక్కోవచ్చు. తక్కువ డబ్బు వెచ్చించి మనసారా వాళ్లను, ఏ హానీ లేకుండా, అనుభవించవచ్చు”.

మరొక ప్రహసనంలో ఇలా ఉంది.

“నిషిద్ధమైన పడక కోసం దొంగతనంగా ఎవడు పోతాడో, అతడు మనుష్యులలో సుఖం లేనివాడు కదా! కాంతివంతమైన ఎండలో నగ్నంగా నిలబడే ఆ అమ్మాయిలను చూస్తూ….”

ఇంకొక ప్రహసనంలో, ఒక కవి, ఖరీదు చేసే గణికల వెంట, వెలయాల్ల వెంటపోయే వాళ్ళను ఇలా నిందిస్తాడు.

“మన నగరంలోని యువకులు ఘోరాతిఘోరమైన పని చేస్తున్నారు. ఈ పని మరి సహించలేం, వేశ్యా గృహాలలో అందమైన యువతులే కనిపిస్తారు. వాళ్లను చూడడానికి అభ్యంతరం లేదు. వివృతవక్షలై, పలుచని దుస్తులలో, ఎండలో వాళ్లు ప్రదర్శన జరుపుతారు. ఏ పురుషుడైనా, తనకు నచ్చిన ఆమెను ఎంచుకోవచ్చు. పలుచని వారిని, వలంపటివారిని, వర్తులంగా ఉన్నవారిని, సన్నపటివారిని, వంకరలు పోయినవారిని, పడుచువారిని, ముసులివారిని, మధ్యరకపు కొలతలలోనున్న వారిని, పరిణతులైనవారిని, వీళ్లను పొందడానికి నిచ్చెనెక్కి గోడగెంతి రహస్యంగా చేరనక్కరలేదు, కిటికీలోంచి దూరనక్కరలేదు, గడ్డి బళ్లలో దాక్కొనిలోనికి పొనక్కర్లేదు. ఈ వనితలు బలవంతంగా నిన్ను లోపలికి లాక్కుపోతారు. పెద్దవాళ్ళను “ఏం నాయనా!” అంటారు. చిన్నవాళైతే ‘ఏం తమ్ముడూ!’ అంటారు. లేకపోతే ‘ఏం కుర్రాడా!’ అంటారు నువ్వు ఎవరినైనా పొందవచ్చు ఏ హానీ కలుగదు. చాలా తక్కువ డబ్బుతో, పగలైనా, సాయంకాలమైనా సుఖాన్ని కొనుకోవచ్చు.” ,

వేశ్యాగృహంలోకి వెళ్లడానికి ఒక రెండు రూపాయలు చాలు. ప్రవేశించడానికి అయ్యే రుసుము కాక, వేశ్యకు ఒక బహుమతి కూడ, ఆమె కోరిన మేరకు, ఇవ్వవలసి ఉంటుంది.

వేశ్యాగృహాన్ని నడిపే యజమాని, ప్రభుత్వానికి ప్రతి సంవత్సరం కప్పం కట్టాలి. దీనిని వెలయాలి పన్ను అంటారు. ఈ పన్నును వసూలు చేయడానికి ప్రత్యేకమైన అధికారులను నియమిస్తారు. ఆమె కివ్వవలసిన పైకం కూడా వాళ్ళే నిర్ణయిస్తారు. సమాజంలో మంచి, మర్యాదలు వీళ్లు కాపాడతారు. తగవులు తీర్చుతారు.

రేవు పట్టణాలలో, వాటికి సమీపంలో ఉన్న గ్రామాల్లో ఈ వేశ్యాగృహాలుండేవి. ఏథెన్సు నగరంలో ఈ విధంగానే ఉన్నాయి.

గ్రీకు రచయితలు వేశ్యాగృహాల గురించి అంతగా చెప్పలేదు. వాటిలో ఉండే వస్తువుల గురించి, గృహాలంకరణ గురించి చెప్పలేదు. కాని, రోమన్ల పాంపే నగరంలో, వేశ్యావాటికలో, యువజనులు విహరించే చోట, ఇప్పటికీ అశ్లీలమైన చిత్రాలు గోడలమీద కనిపిస్తాయి. శాసనాలు మనకీ విషయాలు తెలియజేస్తాయి.

రోమన్ వేశ్యాగృహాలు దుర్గంధాన్ని చిమ్ముతాయని, పరిశుభ్రంగా ఉండవని కొందరు వ్రాశారు. మహారాణి మెస్సాలినా ఇటువంటి గృహంలో వ్యభిచరించిందని ఆమెను దుయ్యబట్టారు.

వేశ్యగృహంలో చాలా గదులుంటాయి. ప్రతి గది వెలుపల గోడమీద ఆ గదిలో ఉండే వేశ్య పేరు, ఆమె స్వీకరించే వెల కూడా వ్రాసే ఉంటాయి. వేశ్యకు చెల్లించవలసిన ధనం ముందుగానే చెల్లించాలి. ఈ గృహాలను సాయంకాలం నాలుగు తరువాతనే తెరుస్తారు. యువకులు తమ పని పాటలను మానేసి రాకుండా ఈ కట్టుదిట్టం చేశారు.

విటుడు లోనికి వచ్చిన తరువాత గది తలుపు వేసి, గదిలో మనుషులున్నారని తెలియజేస్తూ చీటీ అంటించేవారు.

ఈ ‘ఆనందనిలయం’ గోడల మీద శృంగార చిత్రాలుండడంలో అబ్బురం లేదు.

ఒక విఖ్యాతపురుషుడు ఒకసారి వేశ్యాగృహాన్ని దర్శించి అన్నాడట.

“ఇక్కడ యువకుల కామం పరవళ్లు తొక్కుతుంది. నరాలలో ఉడుకురక్తం ప్రవహిస్తుంది. ఈ గృహాలలో యువకులు కామం తీర్చుకోకపోతే, వివాహితులైన పెద్దింటి స్త్రీల వెంట వీరు పడేవారు.”

ఆ కాలపు బజారు వనితలకి ఇప్పటివారికి భేదంలేదు. అటువంటి స్త్రీ యొక్క పాదరక్ష ఒకటి తవ్వకాలలో లభించింది. దాని మడమమీద ‘నావెంట రావలసింది’ అని ఉంది. ఆమె వెనుకకు పోయే పురుషుడు, నేలమీద పడే ఆ గురుతును చదువుకొని, ఆమె వేశ్య అన్న నిర్ధారణకు వస్తాడు.

ఒకసారి హెర్మియాన్ అన్న యువతి దగ్గిరికి ఆస్కిపైడిస్ వెళ్లాడట. ఆమె మొల చుట్టూ పులదండ చుట్టి ఉంది. దానిలో ఈ మాటలు కుట్టారు.

‘నన్నెప్పుడూ ప్రేమించు. కాని, నన్ను ఇతరులు కోరితే ఈర్ష్య చెందకు’.

తప్పకుండా ఆమె మామూలు వేశ్యకాదు. ఈవిడ గణిక అయి ఉంటుంది.

వీదుల్లో తిరిగే వెలయాళ్ళు, విటులను తమ యిళ్లకు తీసుకుపోయేవారు. కాకపోతే అద్దె గదులకు తీసుకుపోయేవారు. చీకటిగా ఉండే వీధి మూలలోనో, ఎత్తైన పురాతన భవనాల్లోనో, స్నానశాలలోనో తమ శరీరాలను అర్పించుకునేవారు. పూటకూళ్ళ యిళ్లలోను, సత్రవులలోను, విశ్రాంతి గృహాలలోను వాళ్లు తల దాచుకునేవారు.

గ్రీకు గణిక మామూలు బజారు మనిషి కాదు. సమాజంలో చాలా ఎత్తున ఉండే మనిషి గ్రీకుల అంతరంగిక జీవితంలో ఆమెకు చాల ముఖ్యమైన స్థానముంది. మామూలు వేశ్యలకు చదువు అంతగా అలవడదు. చాలామంది గణికలు విద్యాసంస్కారం కలవాళ్లు, సంభాషణా చాతుర్యం కలవాళ్ళు. ప్రఖ్యాతులైన సేనాధిపతులను, రాజనిపుణులను, సాహితీవేత్తలను, కళాకారులను వాళ్లు ఆకర్షించగలరు. వారి అనురాగాన్ని నిలుపుకోగలరు. సునిశితమైన తెలివితేటలను, విషయ సౌఖ్యాలను మిళితం చేసి, ప్రముఖులను ఆకట్టుకుంటారు. ఈ గుణాలను ఆనాటి గ్రీకులు ఆరాధించేవారు. ప్రఖ్యాతులైన గ్రీకుల జీవితాలపై గణికల ప్రభావమున్నట్లు చరిత్రకారులు చెప్తారు. అలెగ్జాండ్రియా నగరంలో చాల సుందరమైన భవనాలకు ప్రఖ్యాతులైన వేణువూదే వారి పేర్లు, గణికల పేర్లు పెట్టారు. దేవాలయాలలోను, ప్రభుత్వ భవనాలలోను విఖ్యాతులైన సేవాపతులు శిలావిగ్రహాల పక్కను రాజకీయవేత్తల శిలా విగ్రహాల పక్కను గణికల విగ్రహాలు ప్రతిష్ఠించేవారు.

పాంపే నగరంలో ఒక వేశ్యాగృహంలో… నిజానికది వేశ్యా గృహంకాదు, అది మిఠాయి తయారు చేసే వాడి యిల్లు… అందులో ఖాతాదారులు కోసం వేశ్యలను ఉంచేవారు. అటువంటి గృహంలో ఒక శాసనం లభించింది. అది ఈ విధంగా ఉంది.

“ఇక్కడ సుఖం ఇల్లు కట్టుకొని ఉంది.”

కొరింత్ నగరం పడవలరేవులో ఈ వాక్యమే నిలువెత్తుగా వ్రాసి దర్శించినా అతిశయోక్తి కాదు. కొరింత్ వ్యభిచారానికి పుట్టినిల్లు. ఇక్కడ స్వేచ్చాచారిణుల ప్రభావానికి లోబడని వాడు లేడు. ఈ సుడిగుండం, ఖరీదైన సుఖాల సుడిగుండంలో పడినవాడు పేరు ప్రఖ్యాతులు, ఆరోగ్యం, సంపద పోగొట్టుకొనడంలో ఆశ్చర్యం లేదు. దీని నుండే ఒక లోకోక్తి వ్యాపించింది.

కొరింత్ నగర ప్రయాణం ప్రతి మనుషుడికి లాభించదు. కామదేవుని పూజారిణులు అసంఖ్యాకంగా నగరంలో సంచరించేవారు. రెండు రేవు పట్టణాల మధ్యనున్న జిల్లాలో వేశ్యాగృహాలు కొల్లలుగా ఉండేవి. అన్ని రకాల వ్యభిచారిణులు వీధులలో సంచరించేవారు. ఇక్కడ ఒక వీనస్ ఆలయం (వీనస్ అన్నా ఆప్రొడైటీ అన్నా ఒకే దేవత) ఉంది. ఈ ఆలయంలో అవివాహితుల మధ్య ప్రేమ, గణికాజనం యొక్క గొప్ప చాతుర్యం వర్థిల్లాయి. దీనిలో వేయిమంది గణికలు, లేక దేవాదాసీలు ఉండేవారు. వాళ్లు ఈ చోట వ్యాపారం నడుపుతూ, స్నేహితులను పలకరించేవారు.

పెద్ద రాతిపలకలతో కట్టిన ఆఫ్రొడైటీ దేవాలయం దూరం నుంచి, సముద్రంలో, తూర్పు నుంచి కాని, పడమటి నుంచి కాని, రేవుకు వచ్చే నౌకలన్నిటికీ కనిపిస్తుంది. వేయిమంది దేవాలయ కన్యలు అతిథులకు స్వాగతమిచ్చిన ఆ చోట, ఇప్పుడొక టర్కిష్ మసీదుంది.

క్రీస్తుపూర్వం 464వ సంవత్సరంలో ఒలింపాయలోని గ్రీకు ప్రజలు గొప్ప క్రీడలను నిర్వహించారు. కొరింత్ నగరానికి చెందిన క్సెనోఫర్ అనే తెసలాస్ పుత్రుడు, ఉన్నత వంశానికి చెందిన ధనిక యువకుడు. ఇతడు క్రీడలలో విజయం పొందాడు. ఈ విజాయాన్ని వర్ణిస్తూ పిండార్ అన్న కవి ఒక గీతం వ్రాశాడు. విజయన్ని పొందిన క్రీడాకారుడు జ్యూస్ దేవుడి ఆలయానికి దండలను సమర్పించడానికి పోయినప్పుడు గీతం రచించిన కవి ఎదుట, ప్రజలు దానిని గానం చేసేవారు. ఆ క్సెనోఫర్ కష్టతరమైన క్రీడలలో పాల్గొనే ముందు మొక్కుకున్నాడు. అతనికి గాని క్రీడలలో విజయం లభిస్తే నూరుమంది కన్యలను దేవాలయంలో సేవలు చేయడానికి సమర్పించుకుంటానన్నాడు. ఒలింపియన్ గీతం రచించిన పిండార్, ఒక పాట కూడా వ్రాశాడు. దానిని దేవాలయంలో గణికలు పాడతారు. పాట ననుసరించి నాట్యం చేస్తారు. ఈ గణికలు ఇంతటి గౌరవం ఎప్పుడూ పొందలేదు. వారికిచ్చిన గౌరవం గ్రీకు ప్రజలకీ అర్థమవుతుంది. దురదృష్టవశాత్తు, ఈ పాట యొక్క మొదటి భాగం మాత్రమే మనకు లభించింది.

‘ఐశ్వర్యవంతమైన కొరింత్ నగరంలో అధికంగా ప్రజలు కోరే కన్యలారా! వేడికోలుకు వశమయే అనుయాయులారా! మీ కళ్లను కారే బంగారు కన్నీళ్లు సుగంధాన్ని చిమ్ముతాయి. ప్రేమకు దేవమాతయైన ఆఫ్రోడైటీని చేరడానికి మనసా మీరు చేసే ప్రయత్నాలు ఫలించుగాక! ఆమె దేవలోకం నుండి మధురంగా మిమ్మల్ని మన్నిస్తుంది. తరుణమైన యవ్వనంలో, ప్రేమ ప్రసాదించే సుఖాలను మీరు అనుభవించాలని ఆమె కోరుతున్నది….. ఓరాణి, తోటకు క్సెనోఫర్ నూరుమంది కన్యలను, తన మొక్కు తీర్చుకోడానికి తీసుకొని వచ్చాడు.’

ఏ విధమైన ఆక్షేపణలు లేకుండా వ్యభిచారానికి ప్రజలలో అంతటి ఉన్నత స్థానమున్నప్పుడు, దాని గురించి సాహిత్యంలో వివరంగా ఉండడంలో తప్పేముంది?

గణికల గురించి విశిష్టమైన సాహిత్యం గ్రీకులలో అందుబాటులో ఉంది. అటువంటి గ్రంథాలలో ‘గణికల సంభాషణ’ ఒకటి. గణికల రంగు రంగుల జీవితాన్ని గురించి, వారి భిన్నమైన అంతస్తుల గురించి లూషియన్ రచించిన పుస్తకం చాలా ముఖ్యమైనది.

‘తెలుసుకోవలసిన సంగతులు’ అన్న గ్రంథాన్ని మాఖన్ రచించాడు. అతడు క్రీస్తుపూర్వం 300-260 సంవత్సరాలలో జీవించాడు. అలెగ్జాండ్రియా నగరంలో జీవితాన్ని గడిపాడు. రాజగృహంలో తలెత్తిన ప్రచారాల గురించి, ముచ్చట్ల గురించి అందులో వ్రాశాడు. ఈ గ్రంథంలో గణికల గురించి ముఖ్యంగా చెప్పాడు. ఎథీనియాస్ అన్న రచయిత తన ‘విద్యావంతుల కొక విందు’ అన్న గ్రంథంలో గణికల గురించి చాలా వివరాలు ఇచ్చాడు.

క్లెప్ సైడ్రా అన్న ప్రహసననాయిక, విటుడికి ఆనందాన్ని నీటి గడియారంవలె యిస్తుంది. గడియారంలో నీరు కారిపోగానే ఆమె, తానిచ్చే సుఖాన్ని ముగిస్తుంది.

మెనాండర్ అన్న రచయిత తన ప్రహసనంలో థాయి అన్న గణికను పరిచయం చేస్తాడు. గ్రీకు వేశ్యలలో ఆమె చాల పై అంతస్తులో ఉన్న తారు. ఏథెన్సు నగరనివాసిని యైన థాయి అలెగ్జాండరు మహాప్రభువు యొక్క ఉంపుడుకత్తె. తమ సౌందర్యాలను రాజకీయాలకు దురుపయోగం చేసిన గణికలలో ఈమె ఒకతే. అలెగ్జాండరు క్రీస్తు పూర్వం 331లో గౌగమేలా యుద్ధంలో పెరిషియన్లను ఓడించాడు. డేరియస్ రాజు పారిపోయి ప్రాణాలు రక్షించుకున్నాడు. అలెగ్జాండరు బాబిలోను ప్రవేశించాడు. సుసా నగరాన్ని స్వాధీనం చేసుకున్నాడు. తరువాత పెరిష్యాకు పాత రాజధానియైన పెర్సిపాలిసను ప్రవేశించాడు. అక్కడ అతడు విజయం పొందిన సందర్భంలో తాగుబోతులతో విందు జరుపుకున్నాడు. అందులో గణికల బృందమొకటి పాల్గొంది. వారిలో అందరికన్న అందమైన థాయి ఉంది. మద్యపు మత్తూ కామమూ పురుషుల రక్తాన్ని కాగినట్లు చేస్తే, థాయి అలెగ్జాండరు చక్రవర్తితో గట్టిగా చెప్పింది. అతను పొందిన విజయాలు శాశ్వతంగా నిలిచేటట్టు చేయమంది. పెరిషియన్ రాజ భవనాన్ని అతడు అగ్నికి ఆహుతి చేసి, పెరిషియన్లు చేసిన పాపాలకు బదులు తీర్చుకోమంది. పెర్షియన్లు క్సెరెక్సెస్ కాలంలో ఏథెన్స్ నగరంలోగల ఆలయాన్ని, పవిత్రమైన స్థలాలను దమించింనదుకు అలెగ్జాసండరును ప్రతీకార చర్య తీసుకోమంది. రాజుగారితో విజయోత్సవంలో పాల్గొంటున్న తాగి మత్తెక్కిన యువకులు, పెద్దగోల చేస్తూ ఈ ప్రతిపాదనను అమోదించారు. ఈ ఘోరమైన ఆలోచనను అతనిపై రుద్దారు. వెంటన పాటలు పాడుతుండగా, వేణువులు మ్రోగుతుండగా, సన్నాయిలు వాయిస్తుండగా కాగడాలు పట్టుకొని వాళ్లు రాజభవనానికి పోయారు. క్రోధంలో రెచ్చిపోతూ థాయి ఈ ఉత్సవం ముందు నడిచింది. ఈ భవనం మీద తొలి కాగడా అలెగ్జాండరు విసిరాడు. థాయి రెండవ కాగడా విసిరింది. తరువాత అన్నివేపుల నుండి కాగడాలు ఎగిరి భవనం మీద పడ్డాయి. కొద్దికాలంలోనే, ఆ అద్భుతమైన భవనం అగ్నిజ్వాలల సముద్రంగా మారింది.

అలెగ్జాండరు మరణానంతరం, అతని ఉంపుడుగత్తె, గణిక అయిన థాయి ఈజిప్టు రాజైన మొదటి టాలెమీని వివాహమాడి మహారాణి పదవికి ఎదిగింది.

గణికలు కావ్యసాహిత్యంలో ముందంజ వేసినవారని గ్రీకు వాత్సాయనుడు ఓవిడ్ అంటాడు. అందాల పెద్దింటి తరుణులు ఈ విషయం గమనించమని అతను చెప్తాడు.

ఏథెన్సు నగరవాసిని లమియా. డిమిట్రియస్ కాలంలో చాలా ప్రఖ్యాతి చెందని గణికలలో ఈమె ఒకతె. ఈమె వేణువు వాయించేది. దీని వలన నలుగురిలో పలుకుబడి, సంపద సంపాదించింది. ఆమె సికోనియలో శిథిలమైన చిత్రకళా భవనాన్ని పునర్నిర్మాణం చేయించి నగరవాసులకు బహుకరించింది. గ్రీకు గణికలలో ఇటువంటి ఉదారమైన కార్యాలు చేసినవాళ్లు లేకపోలేదు.

లాయి అన్న పేరుతో ఇద్దరు గణికలుండేవారు. వారిలో పెద్దామె కొరింత నగరంలో ఉండేది. ఆమె ఎంత సౌందర్యంతో అంత ఆశపోతు. ప్రఖ్యాతి చెందిన తాత్వికుడు ఆరిస్టిప్పస్ ఆమె ఆరాధకులలో ఒకడు. గ్రీసుదేశపు ప్రజలు ఆమె వాకిటిలో తచ్చాడారని అనడంలో అతిశయోక్తి లేదు.

చిన్న లాయి సిసిలీలో జన్మించింది. ఆమె మరొకరితో కలిసి థెసలీ పోతే, కొంతమంది స్త్రీలు ఆమె సౌందర్యాన్ని చూడలేక, ఈర్ష్యతో ఆమెను చంపివేశారు. లాయి పేరున చాలా కథలు ప్రచారంలో ఉన్నాయి.

అప్పటికి లాయి గణికగా రూపొందలేదు. కన్నెగా ఉండేది. కొరింత్ సమీపంలో ప్రఖ్యాతి చెందిన ఊట ఉంటే, దాని నుండి నీళ్లు తేడానికి ఆమె వెళ్లింది. ఆమె కూజాను నింపి, భుజాలమీద ఉంచుకొని గృహానికి మరలిపోతుంటే ఆమె సుందరమైన ఆకారాన్ని అపెల్లెస్ చూశాడు. అతడు గొప్ప చిత్రకారుడు. ఆ యువతి యొక్క అద్భుతమైన సౌందర్యాన్ని కళాదృష్టితో దర్శించడానికి అతనికి వీలుకాలేదు. తొందరలోనే అతడు పానగోష్ఠిలో పాల్గొనే తన స్నేహితులకు ఆమెను పరిచయం చేశాడు. వాళ్లు గుసగుసలాడారు. మగవాళ్ల పానగోష్ఠిలో కన్నెపడుచు ఏం చేయగలదని ఎగతాళి చేశారు. గణిక నొకతెను తెస్తే బాగుండునని వాళ్లన్నారు. అపెల్లెస్ బదులు పలికాడు.

“స్నేహితులారా! కొద్ది కాలంలోనే ఈమెను గణికగా తీరుస్తాను. అప్పుడు మీరు ఆశ్చర్యపోకండి”…

లాయి యొక్క సుందరమైన వక్షం ప్రత్యేకంగా ఖ్యాతి చెందింది. దగ్గిరనుండి, దూరాల నుండి వచ్చిన చిత్రాకారులు దివ్యమైన ఆమె వక్షాన్ని శాశ్వతంగా తమ చిత్రాలలో ప్రదర్శించడానికి ఆమె ఇంటి ముందు గుమిగూడేవారు.

తాత్వికుడు అరిస్టిప్పస్ లాయితో సంబంధం పెట్టుకున్నాడని తరచు స్నేహితులు మందలించేవారు. అటువంటి తరుణంలో ఒకసారి అతనన్నాడు.

“లాయి నాది! కాని, నేనామెవాడిని కాదు”

ప్రతి సంవత్సరం, పొసిడన్ ఉత్సవానికి, రెండు నెలలపాటు, అరిస్టిప్పస్ లాయీతో ఏజినా ద్వీపంలో ఉండేవాడు. అతనికి చాల మంది పనివాళ్ళుండేవారు. వాళ్ల మీద ఒక అధికారి ఉండేవాడు. తన యజమాని లాయి కోసం చాలా ధనం వ్యయం చేస్తున్నాడని, మనుష్యద్వేషియైన డయోజినస్ ఏమీ ఖర్చు పెట్టకుండానే ఆమె సుఖాలను పొందుతున్నాడని అతను అన్నాడు. అప్పుడా వేదాంతి అన్నాడు.

“లాయిని అనుభవించడం కోసం నేను ఉదారంగా వ్యవహరిస్తున్నాను. మరొకరు ఆమెను అనుభవించకుండా ఆపడానికి నేనాపని చేయలేదు”.

డయోజినస్‌కి ఇటువంటి ఉదాత్తమైన అభిప్రాయాలు లేవు. ఒకసారి అతను కోపం తెచ్చుకొని, అరిస్టిప్పన్‌తో ముదుక మాట అన్నాడు.

“బజారు మనిషితో ఎందుకంత సన్నిహితంగా ఉంటున్నావు? నువ్వు మానవద్వేషివేనా కావలసింది లేకపోతే ఆమెతో సంబంధమేన కట్టి పెట్టుకోవాలి.”

దానికి అరిస్టిప్పన్ జవాబు చెప్పాడు.

“తనకు ముందు, మనుషులు నివసించిన గృహంలో నివసించడం తప్పంటావా?”

“ముమ్మాటికి తప్పుకాదు” అన్నాడు డయోజినస్

“చాల మంది ప్రయాణం చేసిన నావలో మరొకరు ప్రయాణం చేయకూడదా?”

“ఆ పనీ తప్పుకాదు”

“అటువంటప్పుడు, చాలమంది, అంతకుపూర్వం అనుభవించిన స్త్రీతో, మరొకరు నివసించడం కూడా తప్పుకాదు”.

ఫ్రైని థెస్సియా పట్టణం నుండి వచ్చింది. ఆమె చాలా చాలా అందమైనది. చాలా ఖ్యాతి చెందినది. అన్నిటినీ మించి ఏథెన్సు నగరంలో గల గణికలందరిలోను చాలా ప్రమాదకరమైనది. ఒక హాస్యకవి, ఆమెను, నావ యజమానిని అతని నావను సమూలంగా కబళించే ఛారిబిడ్స్‌తో సరిపోల్చాడు.

అద్భుతమైన ఆమె సౌందర్యం ఆమెకు చరిత్రలో శాశ్వతమైన స్థానం కల్పించింది. ఇదే కాదు మరొక అపవాదు కూడా ఆమె పేరును శాశ్వతంగా చరిత్రలో నిలిపింది. ఫ్రైని న్యాయస్థానంలో దోషిగా నిలబడింది. ప్రఖ్యాతి గాంచిన మహావక్త, హైపరీడ్స్ ఆమె తరపున వాదిస్తున్నాడు. ఒక పరిస్థితిలో వ్యాజ్యం ఓడిపోయేటట్లు కనిపించింది. అపుడు అకస్మాత్తుగా ఒక విషయం అతని మనసులో మెరిసింది. అతడు తన అందమైన వాది యొక్క వక్షః ప్రదేశం పైనున్న దుస్తులను చింపివేసి, మెరుస్తున్న ఆమె వక్షో విలాసాన్ని అందరికీ ప్రదర్శించాడు. న్యాయాధిపతులు, దేవత ఎడల అపచారం చేస్తున్నామని భయపడి, ఆప్రొడైటీ యొక్క ఎడల అపచారం చేస్తున్నామని భయపడి, ఆఫ్రోడైటీ యొక్క ప్రవక్త, అర్చకురాలు అయిన ఫ్రైనిని చంపడానికి సాహసించలేకపోయారు.

ఫ్రైని శరీరం చాల అందమైనది. ఆమెను నగ్నంగా చూడడానికి వీలయ్యేది కాదు. బహిరంగంగా ఉండే స్నానశాలలకు ఆమె ఎప్పుడూ పోలేదు. కాని, గ్రీకు ప్రజలందరూ ఒకసారి సముద్ర తీరంలో జరిగే పోసిడన్ ఉత్సవానికి పోతే, ఫ్రైని తన దుస్తులన్నీ విడిచి, జుత్తు ముడివిప్పుకొని అందరూ తన సౌందర్యం చూస్తూ ఉండగా సముద్రంలోకి నగ్నంగా ప్రవేశించింది. చిత్రకారుడు ఆ పెల్లెస్ ‘సముద్రంలోంచి వస్తున్న ఆఫ్రోడైటి’ అన్నచిత్రానికి ఈ సన్నివేశాన్ని ఉపయోగించుకున్నాడు. ప్రఖ్యాతి చెందిన చిత్రకారుడు ప్రాక్సిటిలెస్, ఫ్రైనిని ఆధారంగా చేసుకొని ‘స్నిడనికి చెందిన ఆఫ్రోడైటీ’ అన్నచిత్రం రచించాడు.

ఫ్రైని శిల్పియైన ప్రాక్సిటెలెతో ఉండేది. అతని శిల్పాలలో ఏవి సుందరమైనవో తెలుసుకోడానికి ఆమె ఒక యుక్తి పన్నింది. శిల్పితో ఆమె ఉన్నప్పుడు సేవకుడొకడు పరుగెత్తుకొని వచ్చి, చిత్రశాలకు నిప్పంటుకుందని, కొన్ని శిల్పాలు ఇంకా కాలిపోలేదని చెప్పాడు. “సెటైర్, ఈరోస్ అన్న శిల్పాలు నాశనమైతే, నా శిల్పాలన్నీ పోయినట్టే లెక్క అన్నాడతను. ఫ్రైని తానే ఈ చమత్కారం చేసినట్లు చెప్పింది. ఏ నష్టమూ కలుగులేదని అతనిని శాంతింప జేస్తుంది. ప్రాక్సిటిలె ఆనందంలో ఆమెనొక శిల్పం ఎంచుకోమన్నాడు. దానినతడు ఆమెకు బహుమతిగా ఇస్తానన్నాడు. ఆమె ఈరోస్ శిల్పాన్ని ఎన్నుకుంది. కాని దానిని ఆమె తన కోసం ఉంచుకోలేదు. తన స్వస్థలమైన థెస్సియాలోనుని ఈరోస్ ఆలయానికి ఆ విగ్రహం అంకింతం చేసింది. అప్పటినుంచీ, ఒక వంద సంవత్సరాల వరకు, ప్రజలు ఈరోస్ ఆలయాన్ని విడువకుండా దర్శించారు. ఆ కాలంలో కళాకారులు గణికలకు తమ శిల్పలను బహూకరించేవారని మనకు దీనిని బట్టి తెలుస్తుంది. ఆ శిల్పాలు ఈనాటికి కూడా అద్భుతంగానే మనకు కనిపిస్తాయి. అటువంటి నిధులను గణికలు దేవతలకు అంకింతం చేయడం ఎంత గొప్పపని! దాత తన పేరుకోసం ఈవిధంగా కళాఖండాలను దానంచేసి ఉండవచ్చునని మనం అనుకుంటాం. ఆమె ఏ పేరు కోసం తాపత్రయపడలేదు. ఆమె చేసిన మరో ఘనకార్యం ఈ అభిప్రాయాన్ని ధృవపరుస్తుంది. ఫ్రైని తన స్వస్థలమైన థెబీస్ నగరం చుట్టుగోడలను తిరిగి కట్టించింది. ఈ గోడలమీద ప్రజలు ఒక శాసనం చెక్కిస్తేనే ఆ పని చేస్తానంది. ఆ శాసనం ఏమిటంటే, ‘అలెగ్జాండరు కూల్చినవీ గోడలు గణికయైన ఫ్రైని, వీటిని తిరిగి కట్టించింది’ ఫ్రైని చేసిన పని, ‘బంగారపు పునాదులు వేయడం’ అని గ్రంథకర్తలు ఘోషించారు.

థెస్పియా ప్రజలు ఈరోస్ శిల్పాన్ని ఆమె బహూకరించినందుకు తమ కృతజ్ఞతలు తెలుపుకోదలచారు. శిల్పి ప్రాక్సిటెలెస్‌ని, ఫ్రైని విగ్రహం తయారు చేయమని నియోగించారు. ఆమె విగ్రహాన్ని బంగారంతో అలంకరించమన్నారు. దానిని డైల్పీలో, చలువరాతి వేదికమీద, ఆర్చిడామస్ ఫిలిప్పన్ విగ్రహాల మధ్య ప్రతిష్ఠించారు. ఎవరూ ఈ పనికి అభ్యంతరం తెలుపలేదు. కాని, దుష్టబుద్ది క్రేట్స్ మాత్రం, ఫ్రైని శిలా విగ్రమం గ్రీసు దేశపు అవమానానికి స్మారకచిహ్నమన్నాడు. మరోసారి, ఏథెన్సులో మంచి మర్యాద తెలియని యువకులు, జ్ఞానీ ఉత్తమశీలుడూ అయిన క్సెనో క్రాట్సు, ఫ్రైని సౌందర్యానికి పశువవుతాడని పందాలు కాశారు. విందొకటి జరుగుతుంటే, చాకచక్యంతో ఆ ధర్మశీలుడి పక్కను ఆమె కూర్చోబెట్టారు. క్సెనో క్రాట్స్ ఆ సరికే ద్రాక్షాసవం బాగా పానంచేశాడు. సౌందర్యవతియైన గణిక తన విలాసాలను ప్రదర్శించింది. ఉద్రేకం కలిగించే మాటలంది. అతనిని స్పృశించి, రెచ్చగొట్టడానికి ప్రయత్నించింది. అజ్ఞాని యొక్క బలమైన మనోనిశ్చయం ముందు ఆ వెలయాలి మోహచేష్టలు బలం లేకుండా పోయాయి. తరువాత ఆమె పరిహాసపూర్వకంగా, తనకున్న సౌందర్యం, సంస్కారం ఒక ముసలివాడి ముందు, అందులోకి సగం వరకు తాగుడుమత్తులోన్ను అతని ముందు, నిరర్థకాలయాయని అనేది. ఆమె తన వివేకాన్ని కోల్పోలేదు. పందెం వేసిన యువకులు ఆమె ఓడిపోయిందని, డబ్బు చెల్లించమని అన్నారు. కాని ఆమె ఆ వెలను ఇవ్వడానికి నిరాకరించింది. ఈ పందెం రక్తమాంసాలు కల పురుషుడికి వర్తిస్తుందని, దీనికి చలించని శిలావిగ్రహానికి చెందదని ఆమె వాదించింది.

గ్రీకు గణికలు తెలివితేటలు, వాక్ చమత్కృతి గలవాళ్లు సామాజికమైన విషయాలు బాగా తెలిసిన వాళ్లు. అందుచేతనే రాష్ట్రంలోని ప్రముఖులు గణికలతో సంపర్కానికి వెనుదీయలేదు. ఎవరూ వారిని నిందించలేదు.

పెరిక్లిస్ వివాహితుడు. అతనికి భార్య, పిల్లలు ఉన్నారు. అతడు చాలా శక్తివంతుడైన రాజకీయనాయకుడు. ప్రపంచంమంతటా విఖ్యాతి చెందినవాడు. అంతటివాడు, అస్సాసియ అన్నగణిక యొక్క ప్రేమకు తపించాడు. అస్పాసియా మిలేటలో జన్మించింది. చిన్నతనమప్పుడే ఆమె ఏథెన్సు నగరానికి వచ్చింది. ఆమె తన సౌందర్యంతోను, బుద్ధికుశలతతోను, సమాజం యొక్క మర్యాదలు తెలియడంతోను, నలుగురిలో పేరుపొంది, తన గృహంలో ముఖ్యులైన పురుషులను సమావేశపరిచేది. సోక్రటీస్ కూడా ఆ సమావేశాలలో పాల్గొనేవాడు. పెరిఫెస్ తన భార్యకు విడాకులిచ్చి అస్పాసియాను వివాహమాడాడు. దీనితో ఆమెపై రాజకీయ ప్రభావం చాలా హెచ్చింది. పెరిక్లిస్ అస్పాసియాను వివాహమాడాడని సాకు జెప్పి అతని ప్రత్యర్థులు అతనిపై దాడి చేశారు. రాజకీయాలలో స్త్రీలు పాల్గొనరాదని, ఎక్కడో ఏథెన్సు నుండి వచ్చిన స్త్రీ పనికిరాదని, అవినీతికి తావైన చోటునుంచి వచ్చిన స్త్రీ అసలే పనికిరాదని ప్రజలు వాదించారు. పెరిక్లిస్‌కి అస్పాసియాకు జరిగిన వివాహం చెల్లదన్నారు. ఆమె ఉంపుడకత్తి అవుతుందే కాని భార్య కాదన్నారు. కవులు తమ ప్రహసనాలలో ఆమెను నీచంగా పేర్కొన్నారు. ఆమె మీద చాలా అపవాదాలను మోపారు. తన భర్తకు స్వేచ్ఛా చారిణులను ఆమెకు కుదురుస్తుందని అన్నారు. ఆమె ఒక వ్యభిచారగృహాన్ని నడిపేదని మరొకరు వ్రాశారు. గ్రీసుదేశం యొక్క మహాయుద్ధానికి అస్పాసియా యొక్క ‘ఆనందనిలయం’ కారణమని కొందరు చరిత్రకారులు చెప్తారు. కొంతమంది తాగుబోతులు మెగరా వెళ్లి అందమైన సిమెథా అన్న వేశ్యను హరించారు. అపుడు మెగరా నగరవాసులు కోపంతో రెచ్చిపోయి, ప్రతీకారంగా అస్పాసియాకి చెందని ఇద్దరు వేశ్యలను ఎత్తుకుపోయారు. ఈ విధంగా, గ్రీసు జాతికి చెందిన ముగ్గురు బజారు స్త్రీల వలన యుద్ధం మొదలయింది. బలింపియన్ వీరుడైన పెరిక్లిస్ గర్జించాడు. మెరుపులు మెరిశాడు. గ్రీసుదేశాన్ని సంక్షోభంలో ముంచాడు. తాగుబోతులు వదిలినట్లు, చట్టాలను అమలు పరిచాడు. మెగారియన్లు తన భూమి మీద, తన బజారులలో, సముద్రంమీద, ముఖ్య భూమిమీద ఉండడానికి వీలులేదన్నాడు. అస్పాసియా అపవిత్రురాలని, తార్పుడు కత్తె అని ఆమె మీద నిందలు మోపితే, పెరిక్లిస్ ఆమె తరపున వాదించి, ఆమెను శిక్షనుండి విడిపించాడు. పెరిక్లిస్ మరణాంతరం ఆమె తక్కువకులంలో జన్మించిన లైసిక్లిస్‌ను వివాహమాడింది. ఈ పెళ్లితో అతని పలుకుబడి చాలా హెచ్చింది.

ఏథెన్సు నగరపు గణిక యూరోపా, ఆమెకు ఒక డ్రాక్మా (అంటే రెండు రూపాయలు) చెల్లిస్తే, చాలునట, ఆమె తన అతిధులను సంతృప్తి పరిచేదట. గణికను ఒకరు ‘నా పడక్కి చేరిన దుష్టమృగం’ అంటే, ఇంకొకరు ‘ఆఫ్రోడైటీ వారసురాలు, సుఖాన్ని పక్క పైకి తెస్తుంది’ అనేవారు. వారికి ఆదాయం అంత హెచ్చుగా రాదు.

గణికలు అంగరాగాలను చాల హెచ్చుగా ఉపయోగించేవారు. వయసులో ఉన్న విటులు గణికల దగ్గరికి పోయేటప్పుడు మంచి దుస్తులను జాగ్రత్తగా ఎంచుకునేవారు. జుత్తువంపులు తిరిగినట్లు దిద్దుకునేవారు. గోళ్లను కత్తిరించుకొని రంగువేసుకునేవారు. ప్రత్యేకంగా ఊదారంగా గల దుస్తులను ధరించేవారు.

సౌందర్య పోషణకు స్త్రీలు వాడే వస్తువుల గురించి ఒకరు విపులంగా చెప్పారు. కత్తెరలు, అద్దాలు, రంగు సోడా, కృత్రిమమైన జుత్తు, ఊదారంగు, పేలికలు, పట్టీలు, రిబ్బన్లు, ఎరుపురంగు, తెల్లరంగు, గోరింట, చేతుల మరకలు తుడుచుకోడానికి ఉపయోగించే స్పాంజి వంటి పదార్థము, వక్షానికి కట్టుకునే పట్టీలు, పిరదులకు కట్టుకునే పట్టీలు, పలుచని మేలిముసుగులు, మెడలో వేసుకునే గొలుసులు, కాటుక, మెత్తటి ఉన్ని దుస్తులు, తలకు పెట్టుకునే రింగులు, విలువైన రాళ్ళు పొదిగిన హారాలు, చెవి తమ్మెలు, ద్రాక్షపళ్ల గుత్తుల ఆకారంలోని చెవిపోగులు, కంకణాలు, బాహుపురులు, అందెలు, కాలికి ధరించే గొలుసులు, వ్రేలి ఉంగరాలు, అందాన్ని పెంపొందించే పలుచని ముద్దలు, జుత్తు ముడికి ఆధారంగా పెట్టుకొనేవి, విలువైన రాళ్లు, హారాలు – ఇంకా చాలా చాలా ఉపకరణాలు పేర్ల అర్థమే మనకు తెలియదు. ఇటువంటివన్నీ గణికలు వాడేవారు.

గణికలు తమ సౌందర్యం పెంపొందించుకోడానికి ప్రయత్నాలు చేసేవారు. అంతేకాక తమ నడవడిలో చాల చాకచక్యం చూపించేవారు. పురుషుల బలహీనతలను తెలుసుకొని, చాలా తెలివితేటలతో వాటిని డబ్బుకింద మార్చుకునేవారు. ప్రొపర్టియస్ అన్నకవి వ్రాసిన కావ్యం చాలా ప్రసిద్ధి చెందింది. అందులో ఒక కుంటెనకత్తె ఒక యువతికి ఉద్బోధిస్తుంది. ప్రియుడి నుండి ఏ విధంగా డబ్బురాబట్టడమో అమె చెప్తుంది. అన్నిటికన్నా ముఖ్యంగా గణిక భక్తి విశ్వాసాలు తెలియనట్టుగా ప్రవర్తించాలి. అబద్దమాడడం, కపటంగా నటించడం తెలిసి ఉండాలి. వినయంగా ఉన్నట్లు కనిపించకూడదు. ఇతర ప్రియులున్నట్లు నటించాలి. పురుషుడిని సందేహంలో ముంచి, అతనిలో ఈర్ష్య రగులుకునేటట్లు చేయాలి. ఒకప్పుడు ప్రియుడు భరించలేక కోపంతో జుత్తు పీకినా పరవాలేదు. గణికకు డబ్బు సంపాదించడానికి ఇంకా వీలు కలుగుతుంది. అతడిని వేధించడానికి, పర్వదినాలని చెప్ప దగ్గరికి చేరనీయకూడదు. గణిక తన శరీరం మీది రక్కులను మరొక ప్రియుడు చేసినవని చెప్పాలి. ఇంటి కాపలావాడు కేవలం ధనికులను మాత్రమే లోనికి అనుమతించాలి. బీదవాళ్లకు తలుపులు తెరువరాదు, సైనికులు, నావికులు చాల మొరటువాళ్ళు, కాని వాళ్ల నుండి బాగా డబ్బు రాబట్టవచ్చు. బానిసలు డబ్బు చూపిస్తేనే కాని అనుమతించవద్దు. కవుల నుండి గణికలకు ఏమి దొరుకుతుంది? వాళ్లను ఆకాశానికి ఎత్తినట్లు వర్ణిస్తే ఏం ప్రయోజనం? వాళ్లు గణికకు బహుమతిల్వివలేరు. ముఖం మీద చర్మం ముడతలు పడనంతవరకు గణిక ధనం ఆర్జించవలసిందే. యౌవనం తొందరగా మాయమవుతుంది. దానిని ఆమె సద్వినియోగం చేసుకోవాలి.

***

ఇక్కడితో శశికళ ప్రసంగం ఆపింది. కొంచెం సేపు మౌనంగా ఉండి మళ్ళా అంది “గ్రీకు గణిక గురించి చెప్పడానికి ఇంకా ఎంతో ఉంది. ప్రస్తుతానికి ఈ పరిచయం చాలు.”

అప్పటికే రాత్రి చాలా గడిచింది.

(సశేషం)

Exit mobile version