శ్రీపర్వతం-19

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 19వ భాగం. [/box]

29

[dropcap]ఫి[/dropcap]బ్రవరి నెల చలిక్రమంగా తగ్గుతున్నది. లోయలో తవ్వకాలు చాలా ముమ్మరంగా సాగుతున్నవి. చాలా కొత్త కొత్త వస్తువులు పైకి వస్తున్నది.

మోహన్, శశికళ తమలో రోజు రోజుకి పెరుగుతున్న నిరుత్సాహాన్ని చాలా ఓర్పుతో ఎదుర్కొంటున్నారు. అంతవరకు ఏవీ బయటపడలేదు. పని ఒక గాడిలో పడింది.

ఆ రోజు సోమవారం. మధ్యాహ్నం భోజనాలయిన తరువాత ముగ్గురూ కొద్ది సేపు విశ్రాంతి తీసుకున్నారు. ముందు టెంటులో సావకాశంగా కూర్చున్నారు. శశికళ చెప్పడం మొదలు పెట్టింది.

“క్రీస్తు పూర్వం వేయి సంవత్సరాల క్రింద ఏర్పడిన గ్రీకు సంస్కృతి, నిజానికి అయిదు సంస్కృతుల మిశ్రమం. క్రీటన్, మైసీనియస్, అకియన్, డోరియన్, ప్రాక్ దేశాల సంస్కృతుల సమ్మేళనమది.”

“అకేయన్ సమాజం పితృపాలనా వ్యవస్థకు చెందుతుంది. తండ్రిది నిరంకుశమైన అధికారం. ఈ అధికారాన్ని స్త్రీ సౌందర్యం, కోపం అన్నవి ఇంకా పదును బెడతాయి. ఈ సమాజంలో పితృప్రేమ ఎత కఠోరమైనదో విచారిస్తే మనక తెలుస్తుంది. సూత్రప్రాయంగా, కుటుంబ వ్యవస్థలో తండ్రి సర్వాధికారి. అతను ఎంతమంది ఉంపుడుకత్తెలనైనా ఉంచుకోవచ్చు. వాళ్లను తన అతిథులకు సమర్పించుకోవచ్చు. అతను తన బిడ్డలను, ఎండకు వానకు పర్వతశిఖరాలపై విడిచి చంపవచ్చు. దేవతల దాహం తీర్చడానికి వారిని బలిచేయవచ్చు.”

“ఈ పితృపాలనా వ్యవస్థకు ఇన్ని అధికారులున్నా, ఆ సమాజం మాత్రం పశుప్రాయమైనది కాదు, నిజానికి, ఆకేయన్ పురుషుడు వివేకమున్నవాడు. గృహిణి చేసే ఉపన్యాసాలను ఓర్పుతో వింటాడు. తన బిడ్డలయందు అనురక్తుడుగా వ్యవహరిస్తాడు.”

“ఆ రోజుల్లో వధువును కొనుక్కునేవాళ్లు. ఎద్దులనుకాని, వాటికి సమానమైన విలువ గల వాటిని కాని, పెళ్లికాబోయేవాడు పిల్ల తండ్రికి సమర్పించేవాడు. వధువులను పశుసంపద తెచ్చే పడుచులని ఒక కవి వ్రాశాడు. వివాహమహోత్సవం కుటుంబం అంతటికీ సంబంధించినది. మతపరమైనది. అతిధులు మస్తుగా తింటారు. నాట్యం చేస్తారు. నోటికొచ్చినట్లు వాగుతారు.”

“కాగడాల వెలుతురులో పెళ్లికూతురుని నగర వీధులలో ఊరేగిస్తారు. పెండ్లి పాటను గొంతెత్తి పాడతారు. యువకులు నాట్యంలో సుళ్ళు తిరుగుతారు. వారిలో నేర్పుకలవాళ్లు వేణువులను వీణలను వాయిస్తారు.”

“పెళ్లి కాగానే తన ఇంటికి స్త్రీ యజమానురాలవుతుంది. ఎంతమంది పిల్లలను కంటే అంత గౌరవ మామెకు లభిస్తుంది. నిజంగా, ప్రేమ అన్నది, వివాహమయిన తరువాతే పురుషులకు సంప్రాప్తమవుతుంది. స్త్రీ పురుషుల శరీరాలు కలియడం బహుశా ముఖ్యకారణం కాకపోవచ్చు. చాలా కాలం ఇంటి పనులలో ఇద్దరూ కలిసి పాటుపడడమే దీనికి కారణమంటారు.”

“హెూమర్ కావ్యాలలో మనక కనిపించే స్త్రీ విశ్వాసపాత్రమైనది. కాని ఆమె భర్త మాత్రం నమ్మదగినవాడుకాడు. హెూమర్ రచనలలో ముగ్గురు జారిణులున్నారు. క్లైటేమ్‌నెస్ట్రా, హెలెన్, ఆఫ్రడైటీ వీరిని మినహాయిస్తే, ఆ కాలంలో కుటుంబమన్నది ఒక సంపూర్ణమైన సంస్థ. హృదయాహ్లాదకరమైనది. చక్కని గృహిణులు, వినయవంతులైన బిడ్డలు కలది. స్త్రీలు పిల్లలను కనే తల్లులుగానే కాక, శ్రమపడే పనివాళ్లుగా కూడా వ్యవహరించేవారు. వాళ్లు తిండిగింజలను తిరగళ్లలో విసురుకునేవాళ్లు. ఉన్ని వడికి, వేసి, జరీపని చేసేవాళ్లు. బట్టలు కుట్టుకునేవాళ్లు కారు. వాళ్లు ధరించే దుస్తులు కుట్టులేనట్టివే. సాధారణంగా మగవాళ్లు వంట వండేవాళ్లు. ఈ కాయకష్టాలలో స్త్రీలు బిడ్డలను కని, పెంచేవాళ్లు. మగవాళ్లకు తగిలిన గాయాలను మాన్పేవాళ్లు. వాళ్ల తగువులను తీర్చేవాళ్లు. బిడ్డలకు, మంచి మర్యాదలు, నీతులు, జాతి సాంప్రదాయాలను బోధించేవాళ్లు.”

“ఆ కాలం పిల్లలకు చదువులు లేవు. వ్రాతకోతలు లేవు. పదాలు, వ్యాకరణం, పుస్తకాలు ఇవేమీలేవు. ఆడపిల్లలకు గృహసంబంధమైన కళలు నేర్పేవాళ్లు. మగపిల్లలను యుద్ధం కోసం, వేట కోసం తయారుచేసేవాళ్లు. అంతేకాక వాళ్లు చేపలు పడతారు. ఈదుతారు. పొలాలు దున్నుతారు, వలలు పన్నుతారు, జంతువులను అదుపులోకి తీసుకుంటారు. బాణాలు విడిచి పెడతారు. బల్లాలు గురి చేసి విసురుతారు.”

“ఆ కాలంలో న్యాయరక్షణ సరిగా లేనట్టుంది. జీవితంలో ఆకస్మికంగా సంభవించే పరిస్థితులను ఎదుర్కోడం, ఆత్మరక్షణ చేసుకోడం మగపిల్లడు నేర్చుకుంటాడు. పిల్లలలో జ్యేష్ఠుడు వయసు వచ్చిన వాడైతే, తండ్రి లేని సమయాలలో కుటుంబానికి అధికారిగా ప్రవర్తిస్తాడు. కుటుంబంలోని మనుషులు మారవచ్చు. కాని, కుటుంబం మాత్రం స్థిరంగా ఉంటుంది. శతాబ్దాల తరబడి గృహజీవితం నియమబద్దంగా ఉండకపోతే పాలించే మంచి ప్రభుత్వమున్నా ప్రయోజనం లేదు.”

శశికళ ఇంతవరకు చెప్పింది.

ఈ మధ్య సుబ్రహ్మణ్యేశ్వరరావు సెలవులు పెట్టి తరుచు వీళ్లిద్దరితో కాలం గడుపుతున్నాడు. కృష్ణలో మునిగిపోయే సుందర నగరం గురించి తెలుసుకోవాలనే తపన అతనిలో రోజురోజుకి పెరుగుతుంది.

ఒకనాడు సాయంకాలం ముగ్గురూ సైటులో కూర్చున్నారు. చాలా విషయాలు చర్చించారు. అంచనా ప్రకారం తవ్వకాలన్నీ 1960 సంవత్సరం అంతానికి పూర్తికావాలి.

నాగార్జున కొండలోయలోను, పరిసర ప్రాంతాలలోను నిర్వాసితులైన వాళ్లకు ప్రత్యామ్నాయంగా నివాసస్థలాలు ఇవ్వడం జరుగుతోంది. 1956 నుండి ఈ పని కోసం ఒక స్పెషలు కలెక్టరును నియమించారు. అతనికి సిబ్బందిని సమకూర్చారు. ముందు ఏ ఏ భూములను స్వాధీనం చేసుకోవాలో, ఏయే గ్రామాలను ఖాళీ చేయించాలో అంచనా వేశారు. నాగార్జునసాగరం డామ్ నిర్మాణం పూర్తయిన తరువాత జలాశయంలో 594 అడుగులు ఎత్తువరకు నీటిమట్టం పెరుగుతుంది. కృష్ణానదికి వరదలు వచ్చినప్పుడు నీటిమట్టం ఈ ఎత్తుకు పెరుగుతుంది.

జలాశయం, అంటే నాగార్జున సాగరం, 110 చదరపుమైళ్లు వైశాల్యం గల భూమిని ఆక్రమిస్తుంది. దీని వలన 4,824 కుటుంబాలు ఇళ్లు వాకిళ్ళు విడిచి పెట్టి వెళ్లిపోవాలి. రమారమి 24,400 మంది ప్రజలను 44 గ్రామాలనుండి తరలించాలి. జలాశయం యొక్క విస్తీర్ణతను పరిగణిస్తే నీటిలో మునిగిపోయే గ్రామాల సంఖ్య చాలా తక్కువే. నలగొండ జిల్లాలో మిరియాల గూడ, దేవరకొండ తాలుకాలు, మహబూబ్‌నగర్ జిల్లాలోని ఆచంపేట తాలుకాలో కృష్ణానదికి ఎడమభాగంలో కల భూములు, కృష్ణానదికి కుడిభాగంలో గుంటూరు జిల్లా పలనాడు తాలుకాలోని భూములు, ఈవిధంగా జలాశయంలో చేరిపోతున్నాయి. పట్టాలున్న పంట భూమికే కాకుండా, ఇళ్లు, కట్టడాలు అన్నీ ప్రభుత్వం వారు స్వాధీనం చేసుకున్నారు. అన్నింటికీ ధరలు చెల్లించారు.

నిర్వాసితులైన ప్రజలందరికి పునరావాసం కల్పించడానికి 24 కేంద్రాలు స్థాపించారు. అటువంటివి 9 కేంద్రాలు కృష్ణానదికి కుడివేపున గుంటూరు జిల్లాలోను, మిగిలినవి నలగొండ జిల్లాలోను స్థాపించారు. కొండలమీద, వాలుగానున్న భూములలోను ఈ కేంద్రాలను ఎంపికచేశారు. చెంచులు, లంబాడీలు వారి వారి వృత్తులకు అనుకూలంగా ఈ కేంద్రాలలో జీవించవచ్చు. పశువుల మందలను, గొర్రెల మందలను హాయిగా వాళ్లు మేపుకోవచ్చు. పుల్లారెడ్డి గూడెం నుండి 149 కుటుంబాల వాళ్లు, రమారమి 740 మంది, లంబాడీ గూడెం నుండి 72 కుటుంబాలు అంటే 318 మంది నిర్వాసితులవుతున్నారు. ఎవరికి కావలసిన పునరావాసిత కేంద్రాలు వాళ్లు ఎంచుకుంటున్నారు. మంచి స్థలాలు చూసుకొని కొద్దిమంది అప్పుడే కొత్త చోట్లకు వెళ్లిపోయారు. ఈ విధంగా ఇల్లు కట్టుకోడానికి, పంటలు పండించుకోడానికి 35 వేల ఎకరాల వరకు భూమిని ప్రభుత్వం ప్రత్యేకించింది.

లోయలో తవ్వకాలు ఇంకా పూర్తి కాలేదు. లంబాడీ గూడెం వాళ్లు చాలమంది తవ్వకాలలో పనిచేస్తున్నారు. వాళ్లకు కొత్త చోట్ల పనిదొరుకుతుందా? అక్కడ భూములు బాగా పండుతాయా? మందలను మేపుకోడానికి అనువుగా ఉంటాయా? అన్నీ సమస్యలే. మీనం మేషం లెక్కబెడుతుంటే మంచి జాగాలన్నీ చెయ్యి జారిపోతాయని, ముందు వెళ్లినవాళ్ళు తమకు నచ్చిన చోట్లను ఎంచుకొని, ఇళ్ల పాకలో వేసుకోవచ్చని, లోయను విడిచి పెట్టకతప్పనప్పుడు తొందరగా వెళ్లిపోతేనే మంచిదని పడుచువాళ్లు తొందరపడుతున్నారు. తమ భూములమీద, ఇళ్ల మీద మమకారం విడువలేని పెద్ద వాళ్లు, రేవు రేపని వెళ్లిపోయే రోజు వెనుక పెడుతున్నారు. అర్థరాత్రికి తెలివివస్తే, పాదాలు మోపిన నేలకు దండం పెట్టి, కళ్లనీళ్లు పెట్టుకుంటున్నారు.

నీళ్లు జలాశయంలోకి వచ్చి, ఈ ప్రాంతాలు మునిగిపోయే వరకు వాళ్లు ఉండవచ్చు. ఆ ప్రాంతాల జీవితానికి అలవాటు పడ్డవాళ్లు. మరో రోజు అక్కడ గడిపినా అదృష్టమనే భావిస్తున్నారు.

కాని, ఆరోజు పెద్ద అలజడి వచ్చిపడింది. కుర్రాళ్లందరూ కొత్త జాగాలకు వెంటనే వెళ్లిపోవాలని ఒక నిశ్చయానికి వచ్చారు. వాళ్లు పెద్దవాళ్ల మెడలు వంచారు. లోయలో ఇరవై ఎకరాల భూములున్న వాళ్లకు కొత్త చోట పన్నెండు ఎకరాల పంట భూములిస్తున్నారు. ఇల్లు కట్టుకోడానికి 750 రూపాయలిస్తున్నారు. సామాను పట్టుకుపోడానికి లారీలు ఏర్పాటు చేశారు. లారీలు దొరక్కపోతే, మైలుకింత ఖర్చని ఇస్తున్నారు. ఇవన్నీ, చూసుకొని, మోహన్ దగ్గర పనిచేస్తున్న జుట్టు పూర్తిగా పనిలోకి రావడం మానేసింది.

మోహన్‌కి మతిపోయింది. తవ్వకాలలో అనుభవమున్న పనివాళ్లు మధ్యంతరంలో వెళ్లిపోతే ఏంచేయడం?

“వెంటనే వెళ్లి సుబ్రహ్మణ్యేశ్వరరావుని తీసుకురండి. అతనే వీళ్లకు సమాధానం చెప్పి ఒక దారికి తీసుకొస్తాడు” అంది శశికళ.

మోహన్ ఎవరిదో సైకిలు తీసుకొని ప్రాజెక్టు ఆఫీసుకు పోయి సుబ్రహ్మణ్యేశ్వరరావుని కలిశాడు.

“మనం పని మొదలు పెట్టి మూడు నెలలవుతున్నది. ఇంతలో అవాంతరమా? స్పెషల్ కలెక్టరుగారు, వారి రెవెన్యూ ఇనస్పెక్టర్లూ నాకు బాగా తెలుసు. ఈ సమస్యకు నేను పరిష్కారం కనుక్కుంటాను” అన్నాడు రావు.

ఇద్దరూ వెంటనే లంబాడీ గూడానికి తిరిగివచ్చారు.

పనివాళ్లూ, జావా టెంట్లముందున్న ఆవరణలో, చదును చేసిన నేలమీద కూర్చున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు మరికాలం వ్యర్థం చేయలేదు.

గూడానికి పెద్దాడొకడున్నాడు. అతని పేరు పోతులయ్య. అతనిని పిలిపించాడు రావు.

“పోతులయ్యా! మీరంతా కొత్తచోటికి ఎప్పుడు పోతున్నారు?” అడిగాడు రావు.

“ఒక నెల్లాళ్లలో” అన్నాడు పోతులయ్య.

“మీకు కొత్త భూములెక్కడిచ్చారు?”

“మేమింకా ఎంచుకోలేదు”.

“మీరెక్కడుంటారు, నలగొండ జిల్లాలోనా, గుంటూరు జిల్లాలోనా?”

ఒకరి ముఖాలు ఒకరు చూసుకున్నారు. ఎక్కడికి పోవాలో వాళ్లకే తెలీదు.

“నలగొండ జిల్లాలో పదిహేను పునరావాస కేంద్రాలున్నాయి. మీకు, మీ పశువులకు సరిపడే జాగాలు చూసుకోండి. స్పెషల్ కలెక్టరుగారు నాకు బాగా తెలుసు. మీరు కోరిన చోటే స్థలం ఇప్పించే ఏర్పాటులు చేస్తాను.”

వాళ్లలో వాళ్లు మాట్లాడుకున్నారు. కాని, ఏం ప్రయోజనం? ఎటువంటి నిశ్చయానికి వాళ్లు రాలేకపోయారు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు చొరవ తీసుకొని, వాళ్ల సమస్యకు తానే ఒక దారి చూపించాడు.

“ఇక్కడ తవ్వకాలలో మీ అందరికీ మంచి కూలి ముడుతోంది. మీరు పోయే కొత్త చోట్లలో ఇంతకూలి దొరకదు. కాబట్టి, పని ఉన్నంతకాలం ఇక్కడే ఉండండి”..

అతని మాటలు పూర్తికాకుండా పోతులయ్య అన్నాడు.

“దొరా! మరి మంచి చోట్లు పోవా?”

“పోతులయ్యా! నువ్వు ముందుపోయి ఖాళీగా ఉన్న మంచి జాగాలు, మీకు సరిపోయేవి చూసుకురా. ఆ పని పూర్తవడానికి ఒక నెల్లాళ్ళు పడుతుంది. రాతకోతలకు మరో నెల్లాళ్ళు వేసుకో. తరువాత మీరు జాగాలు ఆక్రమించుకోండి. కొద్దిమంది పెద్దవాళ్ళను అక్కడుంచండి. ఇళ్ల స్థలాలకు చుట్టూ కంచెకట్టి మొక్కామోడి వేసుకొండి. మిగిలినవాళ్లు ఇక్కడ పనులయిపోగానే మీ దగ్గరికి వస్తారు. ఆ విధంగా కొత్త జాగాలు దొరుకుతాయి, కూలి కూడా కిడుతుంది.”

“దొరా! ఈ చోటు విడవాలని లేదు. ఏం చేయడం?”

“అదే మరి! నీకేం, రెక్కలు కట్టుకొని వెళ్లిపోతావు, కొత్త చోటుకి. మరి దేవుళ్ల సంగతి ఆలోచించావా? 19 దేవాలయాలు నీటిలో మునిగిపోతాయి. నువ్వు వెళ్లిపోడానికి ఏ ఆర్బాటమూ లేదు. ఈ దేవాలయాలన్ని తిరిగి నిర్మాణం జరగాలి. శాస్రోక్తంగా దేవుళ్లను తరలించాలి. ఏలేశ్వరంలోని ఏలేశ్వరస్వామి ఆలయం మాధవస్వామి ఆలయం, కృష్ణానది ఎడమగట్టున కట్టడానికి నిశ్చయమయింది. ఇది తప్పదు. కొన్ని లక్షల ప్రజలకు ఈ జలాశయం అన్నం పెడుతుంది. అందుచేత మనవంతు సుఖాన్ని త్యాగం చేయాలి.”

పోతులయ్య తల ఊపాడు. ఆ మధ్యాహ్నం అందరూ మామూలుగా పనిలోకి వెళ్లారు.

“మరో మూడు నెలల్లో తవ్వకాలు పూర్తవుతాయి. అప్పటివరకు పనివాళ్లకోసం మరి చూసుకోనక్కరలేదు” అన్నాడు రావు.

“తరువాత?” మోహన్ ప్రశ్నించాడు.

“మోహన్ హైదరాబాదుకి…. నేను న్యూఢిల్లీకి” అంది శశికళ నవ్వుతూ.

శశికళ కళ్లలోకి చూస్తూ ఉండిపోయాడు మోహన్.

1956లో మొదలైన ఈ పునరావాస కార్యక్రమం 1969 వరకూ సాగుతూనే ఉంది.

30

సావకాశంగా ఏవైనా మాట్లాడుకోడానికి సోమవారాలే అనుకూలించేవి. ఆ వేళ బట్టలుతుక్కోడం, వ్రాసిన నోట్సు ఫైలు చేయడం, కొరియర్ అబ్బాయి తెచ్చిన కూరలు, తినుబండారాలు సద్వినియోగం చేయడం జరిగేది.

వారంలో మిగతా రోజులలో నిర్విరామంగా పనిచేయడం వాళ్లకు అలవాటయింది. సోమవారం సుబ్రహ్మణ్యేశ్వరరావు రావడంతో ఏవో కొత్త సంగతులు పైకివచ్చేవి.

మాఘమాసం అయిపోవస్తున్నది. గురువారంనాడు చతుర్దశి ఆ రోజు లోయలో ఏ పనులు జరగవు. ఉపవాసాలున్నవాళ్లు, పూజలు చేసుకునేవాళ్ళు, మాచర్ల పోయివచ్చేవాళ్లు ఈ విధంగా పనివాళ్లు సెలవు దినం వినియోగించుకుంటారు. కొంతమంది స్కాలర్లు సెలవు పెట్టి వెళ్లిపోయారు.

మధ్యాహ్నం భోజనాలయేసరికి రెండు గంటలయింది. ఒక గంట సేపు విశ్రాంతి తీసుకొని, వాళ్లు ముగ్గురూ అష్టభుజస్వామి ఆలయం వేపు నడిచారు.

ఒకచోట, నది ఒడ్డున కూర్చున్నారు. శ్రీపర్వతం వేపు నుండి, అంటే సిద్ధులదరి నుండి చలిగాలి కొంచెం జోరుగానే వేస్తున్నది. సూర్యుడి అస్తమయకిరణాలలో వేడిలేదు. మందమైన వెలుగుతప్ప.

శశికళ, మోహన్ స్వెట్టర్లు తొడుక్కున్నారు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు బోరవిడిచి నడిచాడు, చలిని లక్ష్యం చేయకుండా.

ఏమో మాటలు అయిన తరువాత సుబ్రహ్మణ్యేశ్వరరావు ఒక ప్రశ్న వేశాడు.

“వైదిక విద్యావిధానం గురించి చెప్పమన్నారా, లేక బౌద్ధ విద్యావిధానం గురించి చెప్పమన్నారా?” అడిగాడు మోహన్.

“వైదిక విద్యావిధానం గురించి ఏదో కొంచెం తెలుసు. బౌద్ధ విద్యావిధానం గురించే చెప్పండి” అంది శశికళ.

“మీకు ప్రాథమిక విద్య గురించి చెప్పడం కన్న ఉన్నత విద్య గురించి చెప్తే బాగుంటుంది. గురుకులాలు దేశం అంతటా ఉన్నాయి. కాని ఉన్నత విద్యకోసం వారణాసి, తక్షశిల వంటివి చాలా తక్కువగా ఉన్నాయి. అక్కడ చెప్పే విద్య ప్రత్యేకమైన విభాగాలకు చెందినది. దీని గురించి చెప్తాను”.

“మీరు ఏది చెప్పినా వినడానికి సిద్ధంగా ఉన్నాను” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“తక్కసిల అంటే తక్షశిల. చాలా ప్రఖ్యాతి చెందిన విద్యాకేంద్రం. దేశంలో వేరువేరు ప్రాంతాలనుండి, దూరదేశాలనుండి తక్షశిల పండితులను ఆకర్షించింది. అక్కడికి చాలా దూరంలో ఉన్న వారణాసి నుండి, రాజగృమం (రాజగృహం) నుండి, మిథిల నుండి, ఉజ్జయిని (ఉబ్లేని) నుండి, కోసల నుండి, మధ్యదేశం నుండి, శివి నుండి, కురుదేశం నుండి, ఉత్తరాన్నకల రాజ్యాల నుండి ఛాత్రులు వచ్చేవారు.”

“అక్కడి ఆచార్యుల వలననే తక్షశిలకు ఆ కీర్తి వచ్చింది. వారు ప్రపంచ విఖ్యాతులు. సాధికారంగా విషయాన్ని బోధించగలరు. ప్రత్యేకమైన పరిశోధనలు జరిపినవాళ్లు శాస్త్రాలలో నిష్ణాతులు.”

“అక్కడ, ఒక ఆచార్యుని దగ్గిరికి క్షత్రియ యువకులు, బ్రాహ్మణ యువకులు, భారతదేశం అన్ని భాగాలనుడి విద్య నేర్చుకోడానికి వచ్చేవారు.”

“కొంతమంది ఛాత్రులు తమ స్వగ్రామాలలో పాక్షికంగా నేర్చుకున్న విద్యను పూర్తి చేసుకోడానికి తక్షశిల వచ్చేవారు. వాళ్లు అన్ని తరగతులకి, అన్ని జాతులకు చెందినవాళ్లు.”

“తక్షశిలకు దేశంలో ఉన్న విద్యాలయాలన్నీ అనబంధ సంస్థలుగా ఉండేవి. ఈ విధంగా తక్షశిల మహావిద్యా కేంద్ర మయింది. కేంద్ర విశ్వవిద్యాలయములు, జ్ఞాన సముపార్జనలో ప్రపంచమంతటికి మూర్ధన్యమై విలసిల్లింది.”

రావు, శశికళ చాలా శ్రద్ధతో వింటున్నారు.

మోహన్ తన ప్రసంగం సాగించాడు.

“వేయి మైళ్ల దూరంలో ఉన్న తక్షశిలకు తమ పుత్రులను పంపిన తల్లిదండ్రులు, సరియైన విద్యాభోదనకు ఎంతగా ప్రయత్నించే వారో మనకు తెలుస్తుంది. ఈనాడు తల్లిదండ్రులు విదేశాలకు తమ పిల్లలను పంపించడం ఇటువంటిదేనని మనం భావించవచ్చు.”

“ఆ రోజుల్లో ప్రయాణ సౌకర్యాలు లేవు. పిల్లలు తమ చదువులు ముగించుకొని గృహాలకు తిరిగిరావడం అదృష్టమేనని తల్లిదండ్రలు భావించేవాళ్లు.”

“తక్షశిల ఉన్నత విద్యాకేంద్రం. అక్కడికి పోయేవారు విద్యను ముగించడానికేగాని ప్రారంభించడానికి కాదు. విద్యార్థులను సాధారణంగా పదహారో ఏటే అక్కడికి పంపించేవారు. కాబట్టి ప్రాథమిక విద్యకు వారు వెళ్లలేదని మనకు తెలుస్తుంది. కళాశాల లేక విశ్వవిద్యాలయంలో చెప్పే విద్యకే అది కేంద్రం. నేటి విశ్వవిద్యాలయాలలో ఛాత్రులు ప్రవేశించే వయసుకి ఇది సరిపోతుంది.”

“తక్షశిలలోని ఆచార్యులు విద్యాబోధనకు చెల్లించవలసిన రుసుము ముందుగనే స్వీకరించేవారు. ఇది వేయి నాణాలు. ఈ శుల్కం ధనరూపంలో చెల్లించేవారు. ఆ విధంగా చెల్లించలేనివారు సేవారూపంలో చెల్లించేవారు.

చాలామంది విద్యార్థులు రెండవ పద్ధతిలోనే చదువుకునేవారు. ఈ ఛాత్రులు పగటిపూట గురు సేవ చేసి, రాత్రివేళ శాస్త్రాలను అధ్యయనం చేసేవారు. ఒక గురుకులంలో అయిదు వందల మంది బ్రాహ్మణ ఛాత్రులుండేవారు. వారిలో కొంతమంది తమ గురువుకోసం, వంట చెరకు అడవులనుండి తెచ్చేవారు. కొంతమంది విద్యార్థులు పగలూరాత్రీ విద్యను నేర్చుకోడానికి నిశ్యచించినప్పుడు, వాళ్లు బీదవాళై ఉన్నప్పుడు, విద్యను పూర్తిచేసిన తరువాత, గురుదక్షిణ చెల్లించడానికి ఆచార్యుల అనుమతి పొందేవారు. ఆ విధంగా ఒక విద్యార్థి చదువు పూర్తి చేసి, గురుదక్షిణ కోసం, గంగానది దిగువ దేశాలవరకు యాచిస్తూ వెళ్లాడు. ఆ దక్షిణ “ఏడునిష్కాలు” అంటే కొన్ని తులాల బంగారమన్నమాట. దీనిని బట్టి ఆ రోజులలో గురుదక్షిణ బంగారం రూపంలో చెల్లించేవారని మనకు తెలస్తుంది.”

“బ్రాహ్మణ విద్యావిధానంలో బ్రహ్మచారియైన శిష్యుడు స్నాతకుడయి, విద్యార్థి దశ గడిచిన తరువాత గురుదక్షిణ చెల్లించేవాడు”.

“ప్రజలు విద్యకోసం ఏమైనా విరాళాలు యిచ్చేవారా?” రావు ప్రశ్నించాడు.

“వారణాసిలో జగత్ ప్రసిద్ధి చెందిన ఒక గురువు దగ్గిర అయిదువందల మంది ఛాత్రులుండేవారు. నగర ప్రజలు బీదవిద్యార్థులకు ఆహారమిచ్చి ఉచితంగా వాళ్లు విద్య నేర్చుకోడానికి సహకరించేవారు. ఉదారులైన గృహపతులు అప్పుడప్పుడు కొంతమందిని భోజనానికి ఆహ్వానించేవారు. అయిదు వందలమంది ఛాత్రులను, తక్షశిలలో, గ్రామీణ కుటుంబ మొకటి భోజనాలకు ఆహ్వానించింది. ఆ విధంగా గ్రామమంతా వంతులు వేసుకొని, ఆచార్యులకు, ఛాత్రులకు నిత్యభోజనాలకు అవకాశం కలిగించేవారు”.

“ప్రభుత్వం అనండి, రాజులనుండి విద్యా వేతనాలు ఇచ్చేవారా?” శశికళ అడిగింది.

“వారణాసి నుండి తక్షశిల చదువుకోడానికి రాజపుత్రులను పంపించేటప్పుడు, వారికి సహచరులుగా రాజుద్యోగుల పుత్రులను పంపించేవారు. వారికి ప్రభుత్వం విద్యార్థి వేతన మిచ్చేది. ఆ విధంగా కాకుండా, బీదవిద్యార్థులను తక్షశిలకు పంపినప్పుడు, వారణాసి మహారాజు వ్యయాన్ని భరించేవాడు.”

“విద్యకింద చెల్లించిన రుసుములో ఆచార్యులకెంత ముట్టేది” రావు అడిగాడు.

“వేయి నాణాలు విద్యకోసం చెల్లించిన రుసుమయితే, చదువు చెప్పిన ఆచార్యునికి ఏమీ చెందేది కాదు. ఈ ధనం చెల్లించిన ఛాత్రుల పోషణకు అంటే వసతికి భోజనానికి, ఇతర అవసరాలకు సరిపోయేది. ఆచార్యుల ఇంట్లో ఉన్న ఛాత్రులకే ఇది వర్తిస్తుంది.

“విద్యార్థులు ఆచార్యులతో విధిగా నివసించాలా?” శశికళ అడిగింది.

“అటువంటి నిర్బంధమేదీ లేదు. పగటిపూట చదువుకునే విద్యార్థులు కూడా ఉన్నారు. వారణాసి రాజకుమారుడైన జుమ్హా వేరే యిల్లు తీసుకొని ఉండేవాడు. ‘ఒకరాత్రి అతడు పాఠాలయిన తరువాత నిజగృహానికి చీకటిలో బయలుదేరాడు’ అని ఒక చోట చెప్పబడింది. వివాహితులు లేక గృహస్థులు కూడా ఛాత్రులుగా పగటిపూట చెప్పే విద్యను నేర్చుకునేవారు. ఈ సందర్భంలో ఒకటి రెండు ఉదాహరణలు చెప్తాను.

“పల్లెటూరికి చెందిన ఒక బ్రాహ్మణుడు వారణాసిలో ప్రసిద్ధి చెందని ఒక ఆచార్యుని దగ్గిర మూడు వేదాలు, పద్దెనిమిది శాస్త్రాలు నేర్చుకున్నాడు. పిమ్మట తనకుండే ఆస్తులను చూసుకోడానికి చదువు చాలించి, పెళ్లి చేసుకొని గృహస్థుడయాడు. అయితే అతడిని పైనుండి వచ్చి చదువుకోడానికి అనుజ్ఞనిచ్చారు.

కాని, అతడు దినానికి రెండు మూడుసార్లు మాత్రం ఆచార్యుడి బోధనలు వినడానికి రాగలిగేవాడు. అతనెప్పుడు పాఠశాలకు పోదామనుకున్నా అతని భార్యకు రోగం ముంచుకొని వచ్చేది.”

“మరొకరి విషయంలో కూడా ఇలాగే జరిగింది. విదేశాల నుండి ఒక పడుచు బ్రాహ్మణుడు, వారణాసిలో ఒక ఆచార్యుని దగ్గర చేరాడు. అక్కడ చదువుకుంటున్న కాలంలో అతడొక స్త్రీని ప్రేమించి, ఆమెను తన భార్యగా చేసుకున్నాడు. అతడు వారణాసిలో కాపురమున్నా, వారానికి రెండు మూడుసార్ల కన్న ఆచార్యుని దగ్గిరికి చదువుకు రాలేకపోయాడు. భార్యతో వేగలేక, ఆమెతో బాధలుపడి, ఆచార్యుని సేవకు వెళ్లడమే మానుకున్నాడు. ఏడెనిమిది రోజుల తరువాత ఒకసారి అతను చదువుకు వచ్చాడు. ఆచార్యుడు అప్పుడతనికి విద్యను బోధించాడు. రాను రాను ఆ బ్రాహ్మణ యువకుడు భార్య చేసిన ప్రలోభాలకు లొంగడం మానేశాడు. భార్య కూడా భర్తను వేధించడం మానివేసింది.

“అటువంటిదే మరొక ఉదాహరణ. తన దుష్టభార్య కారణంగా ఒక విద్యార్థి చదువులు సాగించలేకపోయాడు.”

“ఇంకా మరో ఆసక్తికరమైన సంగతి. వారణాసిలో ఒక గురువు వద్ద 500 మంది శిష్యులుండేవారు. వారిలో ఒకరిని ఆచార్యుడు తన కూతురిని పెళ్లాడడానికి యోగ్యుడని ఎంచుకున్నాడు”.

“ఈ చదువులకు ప్రవేశార్హత అంటే ఏమైనా ఉందా?” రావు అడిగాడు.

“ఒకే గురువు దగ్గిర అయిదు వందలకు మించకుండా విద్యార్థులు చదువుకునేవారు. వాళ్లు సమాజంలోని అన్ని తరగతులకు అన్ని జాతులకు చెందినవారు. భిన్నమైన సాంఘిక సాంప్రదాయాలకు చెందినవారు. బ్రాహ్మణ యువకులు, క్షత్రియ యువకులు వీళ్ళు హెచ్చుమంది విద్యార్థులుగా చేరేవారు. దూరదూరాల రాజ్యాల నుండి వచ్చిన రాజకుమారులుండేవారు. ధనికుల పుత్రులు, ఉన్నత పదవులలో ఉన్న వారి పుత్రులు చుదువుకు వచ్చేవారు. వాళ్ళే కాక వర్తకుల పుత్రులు, దర్జీల పిల్లలు విద్యకోసం గురువులను ఆశ్రయించేవారు. ఒక ఆచార్యుడు, కడకు జాలరులకైనా దర్మం బోధిస్తానని, తనకేవీ అరమరికలు లేవని ఘోషించాడు. ఛండాలురకు మాత్రం ఛాత్రులుగా చేరే అవకాశం లేదు.

“ఉజ్జయినీ నివాసులైన ఇద్దరు ఛండాలబాలురు, జన్మ తమకు ప్రసాదించిన దౌర్భాగ్యానికి విచారించి అనుకున్నారు – మనం చండాలురుగా విద్యను నేర్చుకోలేము. మన పుట్టుకను దాచిపెట్టి, యువ బ్రాహ్మణుల వేషాలలో శక్తశిలకు పోయి అక్కడ విద్యను అభ్యసించుదాము – అని. ఆ విధంగా వాళ్లు ఒక ఆచార్యుని సమీపించి విద్య నేర్చుకున్నారు. వారిలో ఒక విద్యార్థి చదువులలో విజయం కూడా సాధించాడు. కాని వాళ్లు, ఒక విందులో దొరికిపోయారు. గ్రామవాసి ఒకడు విద్యార్థులకు విందు చేసినప్పుడు, చండాలురభాషను ఏమరచి మాట్లాడడంలో వాళ్ళు బయటపడ్డారు. వెంటనే వాళ్లను బహిష్కరించారు.”

“ఆచార్యులు తమకు తోచిన విద్య చెప్తే, విద్యార్థులు అదే నేర్చుకోవాలా, లేక తాము కోరిన విద్యన నేర్చుకోడానికి వారికి అవకాశముండేదా?” శశికళ ప్రశ్నించింది.

“చండాలురు తప్ప అన్ని కులాలవారు విద్య నేర్చుకున్నా, సాంప్రదాయకంగా చెప్పే వృత్తి విద్యలే కాక కొంతమంది ఇతర విద్యలను కూడా నేర్చుకునేవారు. ఒక బ్రాహ్మణ బాలుడు భవిష్యత్తులో జరిగే సంగతులను తెలుసుకునే విద్యను (భవిష్యద్దర్శనం) తన గురువు దగ్గిర నేర్చుకొని, అటుపిమ్మట వారణాసికి సమీపంలో గల అరణ్యాలలో వేటకాడుగా స్థిరపడ్డాడు. మరొక గౌరవనీయుడైన బ్రాహ్మణ కుమారుడు, ఇంద్రజాల విద్యను మిగిలిన విసయాలకు అతిరిక్తంగా నేర్చుకున్నాడు. మరొకడు లలిత కళలను నేర్చుకొని, చివరకు ధనుర్విద్యయందు నైపుణ్యం సాధించాడు. మరొక బ్రాహ్మణ విద్యార్థి వశీకరణ విద్య నేర్చుకున్నాడు. మరొక బ్రాహ్మణ ఛాత్రుడు విజ్ఞానశాస్త్రాన్ని అద్యయనం చేశాడు. ఇంకొకడు మూడువేదాలు, పద్ధెనిమిది వేదాంగాలను అభ్యసించాడు.”

“విద్య నేర్చుకునే ఛాత్రులు, గొప్పవారు, బీదవారు వేరు వేరుగా” రావు వాక్యం పూర్తి చెయ్యకుండా మోహన్ ఆపాడు.

“సమాజంలో వివిధ వర్గాలకు చెందిన యువకులు, భిన్న జాతులకు కులాలకు చెందినవారు, తమ విభాగాలను, ఎరత్యేకతలను సామ్యవాద పద్ధతిలో, నేర్చుకున్న విద్యలో మిళితం చేశారు. రాజకుమారులు, ఉన్నత వంశస్థులు, వర్తకులు, బట్టలు కుట్టేవాళ్లు, తమ విద్యకయే ఖర్చు ఇచ్చుకోలేక ఇతరుల విరాళాల మీద చదువుకునే బీద విద్యార్థులు అందరూ భుజాలు భుజాలు రాసుకొని, ఒకే పాఠశాలలో, ఒకే గురువు దగ్గిర విద్యను అభ్యసించేవారు. బీద విద్యార్థులు ప్రతిదినం, పాఠశాల కోసం శ్రమాయకమైన పని చేయవలసి వచ్చేది. నిజాయితీగా పడిన శ్రమ వారి కొక ఉన్నత పదవి ప్రసాదించి, రాజపుత్రుల మొదలైన ధనిక వర్గంతో సమానమైన ప్రతిపత్తిని కల్పించేది. ఈ రకమైన హెచ్చుతగ్గులన్నీ, క్రమశిక్షణతో కూడిన కొన్ని సామాన్యమైన పరిస్థితులకు అందరూ బద్దులవడంచేత, కనిపించేవి కావు. వారణాసి రాజవంశానికి చెందిన ఒక యువకుడు తన తండ్రి ఇచ్చిన ఒంటిఅట్టల చెప్పులు, తాటాకుల గొడుగు, గురుదక్షిణకు వేయినాణాలు పట్టుకొని తక్షశిల చేరుకున్నాడు. ఆ ధనంలో అతడు ఒక్క నాణెం కూడా తన స్వంత ఖర్చులకు వినియోగించుకోలేదు. ఆ విధంగా రాజకుమారుడు కూడా బీదవాడుగనే, సంపదకు దూరమయి, పాఠశాలలోకి అడుగు పెట్టాడు.”

“పై విషయమే వారణాసి రాజకుమారుడైన జున్హా కథ నుండి తెలుస్తుంది. అతడు, రాత్రి వేళ, చీకట్లో, ఒక బ్రాహ్మణుడిని ఢీకొని, అతని చేతిలోని భిక్షాపాత్రను, ప్రమాదవశాత్తు పగులగొట్టాడు. దానికి పరిహారంగా, ఒక భోజనానికయే ఖర్చును రాజపుత్రుడు చెల్లించాలని తీర్మానించాడు. అపుడు రాజకుమారుడు బ్రాహ్మణుడితో అన్నాడు.”

“నీకిప్పుడు ఒక భోజనానికియే వెల కూడా నేనివ్వలేదు. కాని, నేను జున్హాని, రాజపుత్రుడిని. కాశీరాజు కుమారుడిని. నేను రాజ్యనికి అధిపతినైన తరువాత, నువ్వు వచ్చి ఆ డబ్బు అడగవలసింది.”

“దీనిని బట్టి, తాను ఇష్టపడినట్లు ఖర్చు పెట్టడానికి రాజపుత్రుడికి సైతం ధనం లేదు. రాజకుమారులు చేసిన నేరాలు, శిక్షలు లేకుండా దాటిపోయేవి కావు.”

“ఒకసారి ఒక ధినక శిష్యుడు మిఠాయి అమ్మేవాడి బుట్ట నుండి, వెల చెల్లించకుండా, కొంతమిఠాయి తీసుకున్నాడు. ఈ సంగతి ఆచార్యుడి దృష్టికి వచ్చింది. అతడు ఇద్దరు కుర్రాళ్లను పిలిచి, ఆ పడుచువాడిని రెక్కలు పట్టుకొని తీసుకొనిపోయి వీపు మీద మూడు సార్లు కొట్టించాడు. మరెప్పుడూ అటువంటి పని చేయకుండా శాసించాడు.

“పురాతన రాజులు తమ పుత్రులకు విద్యాభ్యాసం, కఠినమైన క్రమశిక్షణ రెండూ మేళవించేవారు. ఇది ప్రజాపాలన పద్ధతికి బలమైన ప్రయోగమని భావించేవారు. ‘ఈ ప్రకారం చేయడం వలన వాళ్లు తమ గర్వం, తాము గొప్ప వాళ్లమనే భావన విడిచి పెట్టగలరని నమ్మేవారు.”

“విద్యార్థులకిచ్చే ఆహారమెలా ఉండేది?” రావు ప్రశ్నించాడు.

“విద్యార్థులకిచ్చే ఆహారం సాధారణమైనది, ఉదయపు భోజనానికి వరినూకజావ, ఒక పరిచారిక, గురువు గారింట తయారు చేసేది. ఎవరేనా భోజనానికి పిలిచినప్పుడు విద్యార్థులకు చెరకు, చెరకు పాకం, పెరుగు, పాలు లభించేవి”.

“విద్యార్థుల జీవితం సుఖంగా ఉండేదా, లేక….” అడిగింది శశికళ.

“విద్యార్థుల జీవితం ఇతర విధాలుగా కష్టంగానే ఉండేది. అడవుల నుండి వంటచెరకు తేవడం వారి నిత్య విధి. వారి నడవడి చాలా అదుపులో ఉండేది. నదికి స్నానానికి పోవలసి వచ్చినా గురువుగారితోనే వెళ్లాలి కాని, వేరుగా వాళ్లు వెళ్లకూడదు.”

“అన్ని వర్ణాలవారికి కలిపి చదువు చెప్పేవారా?” రావు ప్రశ్నించాడు.

“అన్ని జాతులకు కలిపి విద్య నేర్పే కళాశాలలతో బాటు, ప్రత్యేకమైన వర్ణాలవారికి వేరువేరు కళాశాలలుండేవని తెలుస్తుంది. కేవలం బ్రాహ్మణ విద్యార్థులే, అయిదువందల మంది, ఉన్న గురువులున్నారు. కొంతమంది గురువులు బ్రాహ్మణ, క్షత్రియ ఛాత్రులనే నేర్చుకొనేవారు. తక్షశిలలో ఒక గురువు దగ్గిర రాజపుత్రులే చదువుకునేవారు. అటువంటి గురువులు ఆనాడు భారతదేశంలో నూటొక్కరు ఉండేవారు. తరువాత కురుభూముల నుండి వచ్చిన ఒక గురువు, వారణాసి నుండి వచ్చిన మరొక గురువు వారిని చేరారు.”

“అయిదు వందల మంది విద్యార్థులకు ఒక్క గురువు చదువు చెప్పడం సాధ్యం అవుతుందా?” శశికళ అడిగింది.

“ఇంతమందికి ఒకే గురువు శిక్షణ ఇవ్వడం సులువైన పనికాదు. గురువుగారికి సహాయకులుగా ఉప ఆచార్యులు, షిఠ్టి ఆచార్యులు నియమింపబడేవారు. చాలమంది పాత విద్యార్థులను ఆ పనికి నియోగించేవారు. అనుభవమున్న విద్యార్థులు గురువుగారికి సహాయం చేసేవారు. తక్షశిలలోని ఒక గురువు వారణాసి వెళ్తూ తన ముఖ్య శిష్యుడని తనకు బదులుగా పాఠశాల నడపమని ఇలా అన్నాడు.

“నా బిడ్డా! నేను ఇల్లు విడిచిపోతున్నాను. నువ్వీ అయిదు వందల విద్యార్థులకు చదువు చెప్పవలసింది.” – ఈ విధంగా అనుభవం సంపాదించిన పాతశిష్యులు ఆచార్య పదవిని స్వీకరించడానికి యోగ్యులుగా తయారయేవారు. కురుదేశం నుండి సుతసోముడనే రాజకుమారుడు అందరికన్న ముందు వాడవడం నుంచి, తన అనుచరులకే గురువై, చదువు వేగాంగా పూర్తిచేశాడు. అతని స్నేహితులు క్రమంగా విద్యనేర్చుకున్నారు.”

“అందరు విద్యార్థులకు ఒక్కసారే చదువు చెప్పేవారా?” రావు అడిగాడు.

“విద్యార్థులకు అనుకూలంగా ఉండేటట్లు ప్రతిదినం, వేరువేరు వేళలలో తరగతులు నిర్వహించేవారు. బీద విద్యార్థులు పగటి పూట శ్రమపడి రాత్రివేళలలో చదువుకునేవారు.

“గురుదక్షిణ పూర్తిగా చెల్లించిన విద్యార్థులను ఇంటికి పెద్ద కొడుకుల్లా ఆదరించి విద్య నేర్పేవారు. వెలుగున్న ప్రతిదినం, అదృష్టం కలిసివచ్చే దినాన వారికి విద్యా భోదన జరిగేది”.

“విద్యార్థులు సాధారణంగా ఎప్పుడు చదువు ప్రారంభించేవారు?” శశికళ అడిగింది.

“కోడికూతతో విద్యార్థులు చదువు మొదలు పెట్టేవాళ్లు. వారణాసిలో అయిదు వందల మంది ఛాత్రులున్న పాఠశాలలో ఒక కోడి ఉండేది. అది వారిని మేలు కొలిపేది. ఒకసారి ఆ పెంపుడు కోడి చచ్చిపోయింది. దాని స్థానంలో కొత్తదాన్ని తెచ్చారు. అది శ్మశానంలో పెరగడం చేత, దానికి కాలంగాని, ఋతువులుగాని తెలియవు. అది అర్ధరాత్రిని, వేకువను కూడా కూసేది. కోడికూతతో అర్ధరాత్రిని లేచిన బ్రాహ్మణబాలురు చదువు ప్రారంభించేవాళ్లు. ఉదయమయే సరికి అలసిపోయి, చదువుమీద దృష్టి నిలవలేకపోయేవారు. పగటిపూట కూడా కోడి కూస్తుంటే, వాళ్లు శాంతంగా పాఠాలు చదువుకోడానికి వేళ దొరక్కుండా పోయింది. ఆ విధంగా ఆ కోడి పగలూ రాత్రి కూసి వాళ్ల చదువులను, ఆపివేసింది. వాళ్లా పక్షిని పట్టుకుపోయి పీక నులిపి చంపారు”.

“చదువుకు ఇంకెవరేనా సహాయం చేసేవారా?” శశికళ అడిగింది.

“తిత్తిరిపక్షులు వేదమంత్రాలను వల్లించడానికి శిక్షణ పొంది, విద్యార్థులకు సహాయం చేసేవి. తిత్తిరి జాతకంలో ఈ సంగతి ఉంది.”

“ఆ రోజుల్లో విద్య అంతా ముఖతః చెప్పేవారటకదా?” రావు ప్రశ్నించాడు.

“ఆ కాలలో ఛాత్రుల చేత పుస్తకాలు చదివించేవారు. ప్రాథమిక విద్యార్థులకు వ్రాత నేర్పేవారు. ఒక పడుచు బానిస తన చిన్నయజమానితో పలకలు మోసుకుపోయేవాడు. ఆ విధంగా ఆ చిన్నవాడు వ్రాత నేర్చుకున్నాడు.”

“తక్షశిల కళాశాలలో ఏయే విద్యలు నేర్పేవారు?” శశికళ అడిగింది.

“సాధారణంగా తక్షశిలకు వచ్చే విద్యార్థులు తమ విద్యను పూర్తి చేసుకోడానికి వచ్చేవారు. మూడువేదాలు, పద్దెనిమిది శిల్పాలు (కళలు) పూర్తిచేసేవారు. ఒకొక్కప్పుడు కేవలం వేదాలే పూర్తి చేసేవారు. లేక కేవలం కళలే నేర్చుకునేవారు. వేదాలలో విద్య సాహిత్యపరమైనది. కళలకు సంబంధించినది శాస్త్ర విద్య లేక సాంకేతిక విద్య”.

“మత పరమైన విద్య ఉందా?” రావు అడిగాడు.

“మూడు వేదాల గురించి చదువులు జరిగేవి. అధర్వవేదం ఆనాటి ప్రణాళికలో లేదు. వేదాలు కంఠస్థం చేయవలసిందే. తక్షశిలలో ఒక ఆచార్యుడికి పెదవుల నుండి అయిదు వందలమంది బ్రాహ్మణ విద్యార్థులు వేదం నేర్చుకున్నారు. బోధసత్వుడికి మూడు వేదాలు కంఠతా వచ్చు. ఇవేకాక, ‘పవిత్ర గ్రంథాలు’ అని, ‘ధర్మం’ అని అప్పుడప్పుడు వింటాం. ఇవి బౌద్ధుల పవిత్ర సాహిత్యమని గ్రహించాలి. వినయాలలోను, సూత్రాలలోను నిష్ణాతుడైన వాడిని పండితుడని పిలుస్తారు.

“తక్షశిల కళాశాలలో ఈ కళలు నేర్పేవారు.”

1) గజవిద్య – హత్తిసూత్త

2) మంత్ర విద్య

3) మృతిచెందిన వారిని బతికించేవిద్య – సంజీవకరణి

4) మృగయావిద్య – వేట

5) జంతువుల అరుపులను తెలుసుకునే విద్య

6) విలువిద్య – ఇస్సద్ధ నిప్ప

7) భవిష్యదర్శనం

8) వశీకరణ విద్య

9) సాముద్రిక విద్య

10) వైద్య విద్య – ఓషధీశాస్త్రం

వీటిలో ఒకే శాఖలో మాత్రమే ఛాత్రులు నిష్ణాతులయేవారు.

“విషయాలన్నీ సూత్రపరంగా, అంటే థీరీ మాత్రమే చెప్పేవారా, లేక ప్రయోగపరమైన శిక్షణ కూడా ఉండేదా?” శశికళ అడిగింది.

“ఈ శాస్త్రాలలో సూత్రపరంగాను, ప్రయోగపరంగాను శిక్షణ ఇచ్చేవారు. ఒక విషయం మీద గరపిన విద్య, ప్రయోగాల చేత అనుసంధానించడం జరిగేది. ఓషధీశాస్త్రంలో, ప్రయోగాత్మకమైన విద్యలో, మొక్కలను ప్రప్రథమంగా అద్యయనం చేసి, వాటిలో ముందుకు పనికివచ్చే వాటిని కనిపెట్టడం జరుగుతుంది. ఈ విషయం జీవకుడి విద్యాభ్యాసానికి చెందిన కథలో ఉంది. మిగిలిన శాఖలలో ప్రయోగాత్మకమైన విద్య చాత్రులకే విడిచి పెట్టేవారు.”

“ఒక బ్రాహ్మణ విద్యార్థి ధనుర్విద్యలో ప్రత్యేకమైన శిక్షణ పొందాడు. తన కళను ప్రయోగాత్మకంగా ప్రదర్శించడానికి అతను ఆంధ్రదేశం వరకు పోవలసివచ్చింది.”

“మగధరాజపుత్రుడొకడు తక్కసిలలో (తక్షశిలలో) అన్ని శాస్త్రాలలోని నిష్ణాతుడై, పట్టణాలు, గ్రామాలు, భూమి నంతటిని పరిభ్రమించి, తను చదివిన శాస్త్రాలు నిత్యజీవితంలో ఎలా అనుసరిస్తారో, గ్రామాలలోని ఆచారాలు ఎలా ఉంటాయో తెలుసుకున్నాడు.”

“ఇలాగే చాలమంది.”

“ఒక విద్యార్థి తక్కసిలలో కళలు నేర్చుకొని, స్వస్థలమైన వారణాసి చేరుకొని, తన తల్లిదండ్రుల ఎదుట వాటిని ప్రదర్శించాడు.”

“జీవకుడు తక్కసిలలో తన విద్య పరిసమాప్తి చేసుకొని శస్త్ర చికిత్సలు విజయవంతంగా నిర్వహించాడు. ఆ కష్టతరమైన శస్త్ర చికిత్సలు అతనికున్న పూర్వానుభవాన్ని, అతను చేసిన పూర్వ ప్రయోగాలను తెలియజేస్తాయి.”

“తక్షశిలలో ప్రత్యేకమైన పాఠశాలలు ఏవి ఉండేవి?” రావు ప్రశ్నించాడు.

“తక్షశిలకు చెందిన ఆచార్యులు శాంతికాలపు కళలయందు, యుద్ధకళలయందు మహావిఖ్యాతులు.”

“విధిగా, విద్యకి అనుష్టానం ముఖ్యమని ఆనాటి భావన-వైద్యవిద్యకు వృక్షశాస్త్రం అంటే మొక్కలను పరిశీలించడం తప్పనిసరియైనది.”

“తక్షశిలలో వైద్యకళాశాలలు, ధర్మశాస్త్రాన్ని బోధించే కళాశాలలు, యుద్ధవిద్యను బోధించే కళాశాలలు ఉండేవి.”

“వైద్యకళాశాల భారతదేశం అంతటిలో అత్యుత్తమమైనది. జీవకుడు ఇక్కడివాడే. ధర్మశాస్త్రం చెప్పే కళాశాలకు ఉజ్జయిని నుండి కూడా ఛాత్రులు వచ్చేవారు. సైనిక కళాశాలలు చాలా ప్రఖ్యాతమైనవి. నూట ముగ్గురు రాజపుత్రులు అక్కడి ఛత్రాలే ధనుర్విద్యకు మరీ ప్రాధన్యముండేది”.

“ఈ విద్యలకు ఆఖరిమజిలీ అంటూ ఏదేనా ఉందా?” శశికళ అడిగింది.

“విద్యకు ఆఖరి మజిలీ విదేశయాత్ర. దేశంలోని ఇతర రాష్ట్రాలలోను, ప్రపంచంలోను, ప్రజల అలవాట్లను ఆచారాలను తెలుసుకోడానికి పట్టభద్రులు పోయేవారు.  భోగభాగ్యాలలో పెరిగిన విద్యార్థులకు ఈ యాత్ర తప్పనిసరిగా ఉండేది. విద్యార్థి దేహాన్ని దృఢతరం చేయడమే కాకుండా, ప్రయాణం చేసేటప్పుడు కలిగే కష్టాలను ఓర్చుకోడానికి ఈ ప్రయాణాలు సహకరిస్తాయి. అందుకోసమే రాజవంశంలోని వాళ్లను, ధనవంతుల బిడ్డలను చాలా దూరదేశాలకు పంపేవారు. విదేశాలలో వింతయైన పరిస్థితులలో జీవించడంవలన మానవత్వం వారిలో పెరిగి, తాము గొప్పవాళ్లమనే గర్వం తగ్గిపోయేది. చక్కని ప్రజాస్వామ్య పద్ధతులు నేర్చుకోడానికి ఈ విదేశయాత్ర చాలా ముఖ్యంగా ఉపకరించేది”.

డాక్టర్ మోహన్ ఇంతవరకు చెప్పి తన ప్రసంగం ఆపివేశాడు.

ముసురుకుంటున్న చీకట్లో అలవాటు ప్రకారం దారి చూసుకుంటూ ముగ్గురూ టెంట్లు చేరుకున్నారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here