Site icon Sanchika

శ్రీపర్వతం-20

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 20వ భాగం. [/box]

31

[dropcap]త[/dropcap]వ్వకాలలో మధ్యాహ్నం ఒంటి గంటవరకు ఉండి, శశికళ, మోహన్, లంచి తరువాత, మూడు గంటల నుండీ, వారంరోజులలో రెండు మూడు దినాలు మ్యూజియంలో హాజరవుతున్నారు. సుబ్రహ్మణ్యేశ్వరరావు కూడా ఆ సమయానికి ఏదో విధంగా అక్కడికి చేరుకుటున్నాడు.

రాత్రి వీళ్ళతోనే ఉండి ఉదయమే వెళ్లిపోతున్నాడు.

ఒకసారి కృష్ణమూర్తి, ఒకసారి వర్మ, ఒకసారి ప్రసాద్, ఒకసారి కృష్ణారావు చెప్తున్నారు.

శశికళ చాల శ్రద్ధతో, ప్రాచీన భారత చరిత్రలో కొన్ని సంఘటనలను వింటున్నది. విన్నవాటిని రాత్రికి రాత్రి టైపు చేస్తున్నది. ఆవిడ టేబిలుమీద టైపు చేసిన కాగితాలు గుట్టలుగా పేరుకుంటున్నాయి. సోమవారంనాడు ఆమె వాటిని వేరుచేసి ఫైళ్ళలో ఉంచుతుంది. ఒక నిమిషం కూడా వ్యర్థం చెయ్యకుండా ఆమె శ్రమిస్తున్నది.

ఎంత ప్రయత్నించినా మోహన్ మాత్రం నిరాశ నుండి దూరం కాలేకపోతున్నాడు. ప్రతి ఉదయం ఉత్సాహంగా పనికి వెళ్ళడం, సాయంకాలానికి నిస్పృహతో తిరిగి రావడం జరుగుతున్నది. ప్రసాద్ గారి పరిచయంతో కార్యక్రమాలలో మార్పు వచ్చింది. ఇప్పుడు అతనికి, తాను చేస్తున్న తవ్వకాలలో ఏవీ బయటపడలేదని, చింతలేదు. ప్రభుత్వంవారు జరుపుతున్న తవ్వకాలలో వెలువడిన పురావస్తు సంచయాన్ని చూసి, వాటి వివరాలు తెలుసుకొని అతడు పులకించిపోతున్నాడు.

ఈ అనుభవాలన్నింటినీ అక్షర రూపంలో పెడతున్న శశికళ మరీ ఆనందాన్ని పొందుతున్నది.

ఇక సుబ్రహ్మణ్యేశ్వరరావు సంగతి ఇంతవరకు అతడు విన్నవి వేరు – గైడ్లు చెప్పినవి, వీళ్ళు వాళ్ళు అనుకుంటున్నవి విన్నాడు. ఇటువంటి లోతైన ప్రసంగాలు అతడు వినలేదు. చరిత్రను పుక్కిట బట్టిన అగస్యులు వీళ్ళు.

“మీకు బుద్ధుడి గురించి చెప్పడానికి బదులు ఆనాటి దేశ పరిస్థితుల గురించి చర్చించాను. బహుశా అవి కూడా మీరు తెలుసుకోదగినవే” అన్నారు కృష్ణమూర్తి,

అందరూ తలలూపారు. తరువాత ఆయన బుద్ధుడి గురించి చెప్పారు.

సూర్యవంశజులైన ఇక్ష్వాకులలో శ్రీరామచంద్రుడు జన్మించాడు. బుద్ధుడు కూడా ఇక్ష్వాకుడే. అందుకే కాబోలు, కృష్ణానది ప్రవహించే దిగువ భాగంలో పరిపాలన జరిపిన ఇక్ష్వాకులకు బుద్దుడంటే ద్వేషం లేదు. వాళ్ళు బ్రాహ్మణ మతాభిమానులు. యజ్ఞయాగాదులు చేసిన వారు. దేవాలయాలను కట్టించినారు. కాని, నిరీశ్వర వాదియైన బుద్ధుడి మతాన్ని, అ మత ప్రచారాన్ని వాళ్ళు సహించారు. వారి పట్టపు రాణులు బౌద్ధమత ప్రభావితులై, భిక్షుసంఘం కోసం ఎన్నో దానాలు చేశారు. ఇటువంటి మత సామరస్యం చరిత్రలో మరెక్కడా కనిపించదు.

గౌతముడి మరో పేరు సిద్ధార్థుడు. ఇతడు లుంబినీవనంలో క్రీస్తుపూర్వం 566లో జన్మించాడు. భారతదేశంలో ఒక మూల లుంబినీ వనంలో గౌతముడు జన్మించిన చోట, అశోకుడి రుమ్మిండేయి స్తంభ శాసనం ఉంది. రుమ్మిండేయి అంటే లుంబిని. దీనియొక్క శిథిలాలు నేపాలు సరిహద్దుకు నాలుగు మైలులోపున ‘పదర’ గ్రామానికి సమీపంలో ఉన్నాయి. గౌతముడి తండ్రి శుద్ధోదనుడు. శాక్యవంశానికి చెందిన రాజు ప్రముఖుడు. శాక్యుల రాజధాని కపిల వస్తువు. శాక్యుల తాత తండ్రులు సాకేతపురం నుండి వచ్చి కపిల ఋషి ఆశ్రమం దగ్గిర స్థిరపడ్డారని అంటారు.

గౌతముడు ఏడు రోజుల శిశువుగా ఉన్నప్పుడు అతని తల్లి మాయాదేవి మరణించింది. మాయాదేవి సోదరి మహా ప్రజాపతి గౌతమి. అమె గౌతముడిని పెంచి పెద్దచేసింది. గౌతముడు జన్మించేముందు అద్భుతమైన సంఘటనలు సంభవించాయని చెప్తారు.

హిమాలయాలలో నివసించే అసితుడనే ఋషి, కొత్తగా జన్మించిన బిడ్డకు తన నమోవాకములు సమర్పించడానికి వచ్చాడు. గౌతముడు బోధలు వినడానికి తాను బ్రతికి ఉండనని అతడు విచారించాడు. తన శిష్యుడు నాలకుడిని, నూతన ప్రవక్తకు శిష్యుడు కావలసినదని నొక్కి నొక్కి చెప్పాడు.

గౌతముడి గురించి చెప్పిన తొలి గ్రంథాలలో, అతని తొలి తరగతి చదువుల గురించి కాని శిక్షణ గురించి కాని కనిపించదు. లలితవిస్తరంలో ఈ విషయాలు వివరంగా వ్రాయబడ్డాయి. గౌతముడి విద్యాభ్యాసం గురించి, అస్త్ర విద్యలో అతనికి గల అత్యధిక ప్రావీణ్యత గురించి, రాజపుత్రులకు అవసరమైన ఇతర విద్యలలో అతనికి గల నేర్పు గురించి ఆ గ్రంథంలో విపులంగా ఉంది. ఉన్నత వంశంలో పుట్టిన రాజపుత్రులకు విలాస జీవితం అందుబాటులో ఉంటుంది. గౌతముడు కూడా చీకూ చింతా లేకుండా జీవితాన్ని ఆనందంగా గడిపి, గృహస్థుడుగా స్థిరపడ్డాడు. బద్ద కచ్చన అన్న ఆమెను (యశోధరను) పెండ్లాడాడు. లలితవిస్తరంలో గౌతముడి భార్య గోప అని, శాక్యదండపాణి పుత్రిక అని ఉంది. ఈ బద్ధకచ్ఛన శాక్యసుప్ప బుద్ధుడి కుమార్తె. దేవదత్తుని చెల్లెలు. గౌతముడికి ఈ వివాహం వలన రాహులుడనే పుత్రుడు కలిగాడు.

గౌతమునికి పరివాహిక జీవితంపై మనసు కలగడానికి నలుగురు కారణమని తరువాత వచ్చిన గ్రంథాలలో చెప్పబడింది. ఒక ముసలివాడు, ఒక అంగవికలుడు, ఒక సన్యాసి, ఒక శవం – ఈ నలుగురు అతని జీవితంలో ముఖ్యమైన మార్పు తెచ్చినవారు. నర్తన చేసే యువతులు అసహ్యకరమైన భంగిమలలో నిద్రిస్తున్నప్పుడు ఇతడు చూసి ప్రాపంచిక సౌఖ్యాలపై విసుగు చెందాడు.

కాని, సుత్తనిపాతంలోను, అరియ పరియేషణ సుత్తంలోను ఈ కారణాలు చర్చించబడలేదు. ప్రాపంచిక సుఖాలనుండి వైదొలగడానికి గృహజీవితం ఆటంకాలతో కూడినదిని, కల్మషమైనదని, గౌతముడు గ్రహించాడు. సన్యాసి జీవితంలో అడ్డులు లేవని, అది స్వతంత్రమైనదని అతడు భావించాడు. అందుచేత అతడు ప్రపంచంనుండి విశ్రాంతి తీసుకొని, ఆలోచనల యందు కాని, మాటలలో కాని, పనులలో కాని తప్పు చేయకుండా ఉండాలని నిశ్చయించాడు. ఇరవై తొమ్మిది సంవత్సరాల వయసులో గౌతముడు రాత్రివేళ రహస్యంగా రాజభవనం విడిచి, తన గుర్రం కంఠకం మీద వెళ్ళిపోయాడు. రాజపుత్రుడు ధరించే వలువలను విసర్జించాడు. పరివ్రాజక జీవితాన్ని అవలంబించాడు.

అతడు చాల గ్రామాలు దాటి వైశాలీ నగరం చివరకు చేరుకున్నాడు. ఆ నగరం సివారులలో ఆచార్య ఆరాడ కాలాముడు నివసించేవాడు. గౌతముడు అతని ఆశ్రమంలో కొంత కాలం ఉన్నాడు. ధ్యానంలో ఏడవస్థితి అయిన ‘ఆంకిం న్యాతనం’ అన్నదానిని సాధించాడు. ఈ స్థితికి చేరుకున్నవారికి దేనిపైనను కోరిక ఉండదు. అక్కడ అంతా శూన్యమే. ఆ ఆరాడ కాలాముడు సాంఖ్యవేదాంతాన్ని నమ్మిన వాడని బుద్ధ చరితంలో ఉంది. సిద్ధార్థుడు కపిలవస్తువు నుండి వచ్చినవాడు. కాబట్టి అతనికి సాంఖ్య సిద్ధాంతం గురించి కొంత తెలిసి ఉంటుంది. తన జ్ఞానాన్ని అభివృద్ధి చేసుకోడానికి అతడు ఆరాడ కాలాముడికి శిష్యుడయాడు. కాని, సాంఖ్య సిద్ధాంతం వలన అతడు తృప్తి చెందలేదు. ఈ విషయం మనకు స్పష్టంగా తెలుస్తుంది. అతడు ఆరాడుడి ఆశ్రమం విడిచి రాజగృహానికి వెలుపల నివసిస్తున్న రుద్రక రామపుత్రుడనే మరొక గురువును ఆశ్రయించాడు.

ఈ గురువు దగ్గరికి పోతున్నప్పుడు గౌతముడు పాండవ పర్వతం మీద బింబిసారుడిని కలిశాడు. రాజపుత్రుడి జీవితాన్ని విడిచి పెట్టవద్దని అతడు గౌతముడికి నచ్చజెప్పాడు. వినయంగా గౌతముడు బింబిసారుడి అభ్యర్థనను నిరాకరించి రుద్రకుడి ఆశ్రమానికి పోయి అతనికి శిష్యుడయాడు. ఈ గురువు ధ్యానంలో అత్యధికమైన స్థితికి చేరుకున్నాడే కాని, అంతిమమైన ముక్తి పొందే స్థితికి చేరలేదని అతడు గ్రహించాడు. అందుచేత రుద్రకుడిని విడిచి పెట్టాడు.

అటు పిమ్మట అయిదుగురు బ్రాహ్మణ తపస్వులతో కలిసి కఠోరమైన సాధనలు చేశాడు. ఒక దినం గౌతముడు, మరణించే స్థితికి చేరుకున్నాడు. అప్పుడతడు, ఈ తీవ్రమైన సాధన వలన కలిగే మానసిక శ్రమకు శరీరం తట్టుకోడానికి సరిపడ్డ ఆహారం మాత్రమే తీసుకోడానికి నిశ్చయించాడు. ఆ కారణం చేతనే బ్రాహ్మణ స్నేహితులు అతనిని విడిచి వెళ్ళిపోయారు. పిమ్మట అతడు ఉరువలే గ్రామంలో, రావి చెట్టు కింద కూర్చున్నాడు. అపుడు సుజాత అన్నగొల్ల పిల్ల అతనిని వృక్షకుడని (వృక్ష దేవత అని) భావించి, అతనికి పాలు తెచ్చి ఇచ్చింది. పుష్టి కలిగించే ఈ ఆహారాన్ని అతడు స్వీకరించి, స్థిరాసనంలో కూర్చొని ధ్యాన మగ్నుడయాడు. జ్ఞానం లభించేవారకు కూర్చున్నచోటునుండి లేవకూడదని దృఢంగా నిశ్చయించాడు. మారుడి ప్రలోభానికి లోనయే భయం లేకుండా, తన శక్తుల యందు అతడు విశ్వాసముంచి, కదలకుండా కూర్చున్నాడు.

అరియ పరియేస సుత్తంలో బుద్ధుడి చరిత్ర ఉంది. అందులో సుజాత పాలు యిచ్చినట్లు కాని, తపస్సులో సల్పిన ప్రయోగాల గురించి కాని లేదు. మజ్జిమ నికాయంలో అతడు తపస్సులో వివిధ ప్రయోగాలు చేసినట్లుంది.

అరియ పరియేస సుత్తంలో గౌతముడు, రుద్రకుడి ఆశ్రమం విడిచి పెట్టిన తరువాత ఉరువిల్వ గ్రామం వెళ్ళాడని, అక్కడొక చక్కని చోటు, నదీజలాలు ఒడ్లను తాకుతున్న చోటు, ఒకటి కనుగొన్నాడని ఉంది. ఆ చోట అతడు కూర్చొని, చాల శ్రమకు లోనయి, చివరకు సత్యాన్ని తెలుసుకున్నాడు. ఆ విధంగా అతడు బుద్ధుడయాడు. అంటే జ్ఞాని అయాడు. అతడు అంతర్దృష్టిని, జ్ఞానాన్ని పొందాడు. తను పరిపూర్ణంగా మోక్షం సంపాదించినట్లు, పునర్జన్మ లేనట్లు అతడు నిర్థారితంగా తెలుసుకున్నాడు. ఏడు వారాలు తనకు కొత్తగా లభించిన జ్ఞానాన్ని స్మరిస్తూ అతడు ఆనంద సాగరంలో ఓలలాడాడు.

తాను గ్రహించిన సత్యం చాల నిగూఢమైనదని, సూక్ష్మమైనదని, విశాల ప్రపంపచానికి దానిని తెలియజేయడం వలన ప్రయోజనం లేదని అతడు భావించాడు.

ఏడుదినాలు, ఉరువేల గ్రామంలో, నెరంజరానది గట్టున ఉన్నబోధి వృక్షం క్రింద, సంబుద్ధుడైన గౌతముడు, ఎటువంటి అంతరాయం లేకుండా

మోక్షానందం అనుభవించాడు. అటు పిమ్మట, రాత్రి తొలియామంలో బుద్ధ భగవానుడు పద్మాసనంలో కూర్చొని, తన మనస్సును కారణ పరంపరపై నిలిపాడు. క్రమపద్ధతిలోను, విలోమ పద్ధతిలోను, దానిని స్మరించాడు.

అజ్ఞానం నుండి సంస్కారాలు జన్మిస్తాయి. సంస్కారాలనుండి చైతన్యం, చైతన్యం నుండి నామరూపాలు, నామరూపాల నుండి షడింద్రయ ధర్మాలు (పంచేంద్రియాలు, మనస్సు), షడింద్రియ ధర్మాల నుండి స్పర్శ, స్పర్శ నుండి తృష్ణ నుండి అనురాగము, ……….. …….. మరణము, దుఃఖము, రోదనము, బాధ, దైన్యము నిరాశ సంభవించుతవి. ఈ విధంగా బాధల సముదాయం ప్రభవిస్తుంది.

“అజ్ఞానాన్ని నాశనం చేస్తే సంస్కారాలు నాశనమవుతాయి. సంపూర్ణంగా కామం లేకుండా ఉంటేనే అజ్ఞానాన్ని నాశనం చేయడానికి వీలవుతుంది. సంస్కారాలను నాశనం చేస్తే చైతన్యం నాశనమవుతుంది. చైతన్యాన్ని నాశనం చేస్తే నామరూపాలు నశిస్తాయి. షడింద్రియ ధర్మాలను నాశనం చేస్తే స్పర్శ నాశనమవుతుంది. స్పర్శ నాశనమయితే ఇంద్రియానుభవం నశిస్తుంది. ఇంద్రియానుభవం నశిస్తే తృష్ణ నశిస్తుంది. తృష్ణ నశిస్తే అస్తిత్వము లేక ఉనికి నశిస్తుంది. ఉనికి నశిస్తే పుట్టుక నశిస్తుంది. పుట్టుక నశిస్తే వార్థక్యం, మృత్యువు, దుఃఖం, రోదనం, దైన్యం, నిరాశ నశిస్తాయి. ఈ విధంగా బాధల సముదాయం అంతమవుతుంది”.

బుద్ధుడు దీనిని తెలుసుకొని ఆ సందర్భంలో ఒక పవిత్రమైన అభిభాషణ చేశాడు. తీవ్రమైన తపస్సు చేసే బ్రాహ్మణుడికి వస్తువుల నిజమైన స్వభావం స్పష్టంగా తెలిస్తే అతని సందేహాలన్నీ తొలగిపోతాయి. ఎందుచేతనంటే, స్వభావమెటువంటిదో, దానికి కారణమెటువంటిదో అతడపుడు గ్రహిస్తాడు.

రాత్రి మధ్యయామంలో బుద్ధుడు కారణ పరంపరపై మనస్సు నిలిపాడు. క్రమ పద్ధతిలోను, విలోమ పద్ధతిలోను అతడు దానిని మననం చేశాడు. ఆ తరుణంలో, మొదటిసారివలెనే అతడు పావనమైన అభిభాషణ చేశాడు.

రాత్రి మూడవ యామంలో కూడా ఆ విధంగానే మననం చేసి బుద్ధుడు ప్రవచించాడు.

“వస్తువుల నిజస్వభావం కఠోరతపస్సు చేసే బ్రాహ్మణుడికి స్పష్టంగా అవగతమయితే, మారుడి బంధువులను తోసిపుచ్చి, ఆకాశాన్ని కాంతితో నింపే సూర్యుడివలె అతడు ప్రకాశిస్తాడు.”

బుద్ధుడు ఏడు దినాల తరువాత బోధి వృక్షమూలం నుండి లేచి అజపాలమనే వటవృక్షం దగ్గరికి వెళ్లాడు. మర్రి చెట్టును సమీపించి, కాళ్ళు ముడుచుకొని, పద్మాసనంలో దాని మొదట కూర్చుండి మరో ఏడుదినాలు మోక్షానందం అనుభవించాడు.

క్రోధస్వభావంగల బ్రాహ్మణుడొకడు అపుడు బుద్ధుడి దగ్గరికి వచ్చాడు, అతనిని అభినందించాడు. వినయంగా మాట్లాడాడు. సమీపంలో నిలబడి ఈ విధంగా అతనితో పలికాడు.

“గౌతమా! దేనిచేత మానవుడు బ్రాహ్మణుడవుతాడు? అతడు బ్రాహ్మణుడనడానికి ఏ గుణగణాలు అవసరం?”

అపుడు బుద్ధుడు పవిత్రమైన భాషణ చేశాడు.

“ఏ మానవుడైతే తననుండి పాపాలను తొలగించుకుంటాడో, అహంకారం లేనివాడో, అశుచికాడో, వేదవిద్యా సంపన్నుడో, పవిత్ర విధులను నెరవేరుస్తాడో, అతనిని న్యాయసమ్మతంగా బ్రాహ్మణుడు అని పిలువవచ్చు. అతడు ఋజు స్వభావం కలవాడై, ప్రపంచంలో కొనియాడబడతాడు”.

బుద్ధుడు ఏడు దినాలు ధ్యానం నుండి అజపాల వటవృక్షం విడిచి, ముచులింద వృక్షం దగ్గరికి వెళ్ళాడు. ఆ చెట్టుకింద పద్మాసనంలో కూర్చొని, నిరంతరాయంగా ఏడు దినాలు మోక్షానందం అనుభవించాడు.

అపుడు, ఆ కాలంలో, మహామేఘ మొకటి ఆకాశం మీద తోచింది. ఏడు దినాలవరకు వర్షం కురిసింది. చలిగాలులు వీచాయి. గాలి వానలు లేచాయి. అంధకారం ఆవరించుకుంది. నాగరాజు ముచలిందుడు తన నివాసం నుండి పైకి వచ్చాడు. బుద్ధుడి దేహాన్ని తన శరీరంతో ఏడుసార్లు చుట్టుకున్నాడు. తన విశాలమైన పడగను బుద్ధుడి శిరసుపై పట్టాడు.

“భగవానుడికి చలి తగులకుండుగాక, భగవంతుడికి వేడి తగులకుండుగాక! ఈగల బాధ, జోరీగల బాధ ఉండకుండు గాక! ఎండ, గాలివానలు తాకకుండుగాక! సరీసృపాలు స్పృశించకుండుగాక!” అని తనలో భావించుకున్నాడు.

ఏడు దినాల తరువాత ముచలిందుడికి మేఘాలులేని ఆకాశం కనిపించింది. బుద్ధుడి దేహాన్ని చుట్టులుగా కప్పిన తన శరీరాన్ని అతడు వదులు చేశాడు. సర్పరూపం విడిచి, యువకుడి వలె బుద్దుడి ఎదుట నిలిచాడు. చేతులు జోడించి భగవానుడికి నమస్కరించాడు.

బుద్దుడు అంతా గమనించి అతనితో పవిత్రమైన వాక్యాలు పలికాడు.

“ఆనందంతో నిండిన వాడి ఏకాంత సమయం సుఖమయమగుగాక! నిజం తెలుసుకున్నవాడు, నిజం దర్శించేవాడు సుఖింతురుగాక! ప్రపంచంలో అసూయనుండి విముక్తుడైన వాడు సుఖించుగాక! కామంనుండి విడువబడ్డవాడు, అన్ని కోరికలకు అతీతుడైనవాడు సుఖింతురుగాక! అహంకారం వలన కలిగే గర్వాన్ని త్రోసిపుచ్చే వాడు సుఖించుగాక! ఇది నిజమైన మహాసుఖం!”

ఏడు దినాలు ముచలింద వృక్షం క్రింద బుద్ధుడు ధ్యానంలో కాలం గడిపి, పిమ్మట రాజాయతన వృక్షం దగ్గరికి వెళ్ళాడు. దానిని సమీపించి, పద్మాసనంలో ఆ వృక్షమూలం దగ్గిర కూర్చొని, నిరాటంకంగా ఏడు దినాలు మోక్షానందం అనుభవించాడు.

ఆ సమయంలో, ఉక్కుల (ఉత్కళ) దేశం నుండి ప్రయాణం చేస్తూ తపుస్సుడు, భల్లికుడు అన్న ఇద్దరు వర్తకులు అక్కడికి వచ్చారు. ఈ వర్తకులకు క్రిందటి జన్మలో బంధువైన వాడోడు, దేవతగా మారిపోయాడు. అతడు వాళ్ళతో ఇలా అన్నాడు.

“ఉన్నత వంశానికి… బుద్ధుడున్నాడు. అతడిప్పుడే సంబుద్ధుడయాడు. మీరతనిని సమీపించి, భగవంతుడికి మీ భక్తిని ప్రదర్శించవలసింది. అతనికి అప్పాలు, తేనె సమర్పించండి. ఈవిధంగా చేస్తే చిరకాలం మీకు శుభం కలుగుతుంది. భగవంతుడి ఆశీస్సులు లభిస్తాయి!”

వర్తకులు తపుస్సుడు, భల్లికుడు అప్పాలను తేనెనె తీసుకొని, బుద్ధుడున్న చోటుకి వెళ్ళారు. అతనిని సమీపించి భక్తితో నమస్కరించారు. అతని పక్కనే నిలబడి వాళ్ళు అతనిని సంబోధించారు.

“ఓ ప్రభువా! భగవానుడా! మేము తెచ్చిన అప్పాలను, తేనెను స్వీకరించవలసింది. అందువలన మాకు శుభం, ఆశీస్సులు లభిస్తాయి.”

అపుడు బుద్ధుడనుకున్నాడు.

“తధాగతులు తమచేతులతో ఆహారం స్వీకరించరు. నేను ఏవిధంగా వీరినుండి అపూపాలను, మధువును తీసుకోగలను?” అపుడు నాలుగు దిక్కులకు చెందిన దిక్పాలురు మహారాజ దేవతలు బుద్ధుడి మనసులో కలిగిన సందేహాన్ని దివ్యదృష్టితో తెలుసుకున్నారు. నాలుగు దిక్కులనుండి నాలుగు రాతితో చేసిన పాత్రలను తెచ్చి అతనితో అన్నారు.

“ప్రభువా! భగవానుడా! వీటియందు అప్పాలను, తేనెను స్వీకరించవలసింది”.

బుద్ధుడు రాతితో చేసిన భిక్షా పాత్రలను, కొత్త వాటిని, స్వీకరించి, వాటియందు అప్పాలను తేనెను తీసుకున్నాడు. వాటిని ఆరగించాడు.

బుద్ధుడు భిక్షా పాత్రలను స్వయంగా కడిగాడు, చేతులు కడుక్కున్నాడు. అపుడు వర్తకులిద్దరూ భగవానుడి పాదాలకు నమస్కరించి అతనితో అన్నారు.

“భగవంతుని మేము శరణు వేడుకుంటున్నాము. ధర్మాన్ని శరణు వేడుకుంటున్నాము. నేటి నుండి, మేము బ్రతికినన్నినాళ్ళు భగవానుడు మిమ్మల్ని శిష్యులుగా అనుగ్రహించవలసింది. అతనిని మేము శరణు వేడుకుంటున్నాము”

వీరిద్దరే ప్రపంచంలో మొట్టమొదటిసారి ఉపాసకులుగా, బుద్ధుడి శిష్యులుగా మారినవారు. ఆనాటికి సంఘం ఇంకా నెలకొనలదు. అందుచేత వారు త్రిరత్నాలకు బదులు, బుద్ధం శరణం గచ్ఛామి, ధర్మం శరణం గచ్ఛామి అన్న రెండు రత్నాలను ఉచ్చరించి బౌద్ధమత ఉపాసకులుగా మారారు.

ఏడుదినాల తరువాత తపస్సునుండి బుద్ధుడు లేచి రాజాయతన వృక్షం నుండి అజపాల వట వృక్షం చేరుకొని, దాని మొదట కూర్చున్నాడు. అతడు ఒంటరిగా ఉన్నాడు. ధ్యానంలో నిమగ్నుడయ్యాడు. అపుడు అతనికొక ఆలోచన కలిగింది.

“నిగూఢమైన ఈ సిద్ధాంతాన్ని నేను లోతులకు పోయి చూశాను. ఊహించడానికి, అర్థం చేసుకోడానికి ఈ సిద్ధాంతం కృష్ణమైనది. ఇది హృదయ శాంతిని కలిగిస్తుంది. ఇది ఉచ్చస్థితియందు ఉన్నట్టిది. తర్కం వలన సాధ్యం కానది, దుర్గ్రాహ్యమైనది. కేవలం బుద్ధిమంతులకే తెలియదగినది. మరొక విధంగా ఆలోచిస్తే, జనులు కోరికలకు దాసులు, కోరికల పైననే మనసు నిలిపినవాళ్ళు, కోరికలయందే ఆనందం పొందేవాళ్ళు. కార్యకారణ పరంపర వీళ్ళకి బోధపడడం కష్టం. సంస్కారాలను తుదముట్టించడం గురించి వీళ్ళు తెలుసుకోడం కష్టం. ఉపాధులను వదిలించుకోడం, కోరికను నాశనం చేయడం, కామం లేకుండా ఉండడం, మనశ్శాంతి అనగా నిర్వాణం ఇవన్నీ వీరికి అర్థం కానివి. నేనీ సిద్ధాంతాన్ని బహిరంగంగా ఇప్పుడు ఘోషిస్తే, నా బోధలు ప్రజలకు అర్థం కాకపోతే, నాకు శ్రమే మిగులుతుంది. లోకం పైన చిరాకు కలుగుతుంది.

అపుడు బుద్ధుడి మనసులో, అంతకు పూర్వం వినని శ్లోకాలు తోచాయి.

“నేను చాల శ్రమలు పడి ఈ సత్యాన్ని సంపాదించాను. నాకిది చాలు! దీనిని నేనెందుకు బహిరంగంగా చాటాలి? కామంతోను, ద్వేషంతోను మతులు పోగొట్టుకున్న వాళ్ళకు ఈ సిద్ధాంతం సులువుగా బోధపడదు. కామ పీడితులైన ప్రజలు, అంధకారం చుట్టుకున్న వారై, మనసుకు ఏవి ప్రతికూలమైనవో గ్రహించలేరు. వారికీ సిద్ధాంతం దుర్గ్రాహ్యమై, నిగూఢమై, సూక్ష్మమై ఉండడం చేత, వారు దీనిని చూడలేక పోతారు.”

బుద్దుడు ఈ విషయం గురించి చాల ఆలోచించాడు. అతని మనస్సు, ఈ సిద్ధాంతాన్ని బోధించడానికి విముఖతతో ఊరకుంది.

అపుడు, బ్రహ్మసహాంపతి, బుద్ధుడి మనసులో జనించిన ఆలోచనను దివ్యజ్ఞానంతో తెలుసుకొని, తనలో అనుకున్నాడు.

“పవిత్రుడైన తథాగతుని యొక్క మనస్సు, సమ్మాసంబుద్దుని మనస్సు, శాంతి వహించి లోకానికి ధర్మం బోధించకపోతే, ఈ ప్రపంచం, అయ్యో! నాశనమవుతుంది. అయ్యో! ఈ లోకం ధ్వంసమవుతుంది.”

అపుడు బ్రహ్మసహాంపతి బ్రహ్మలోకం నుండి అదృశ్యుడయాడు. బలమైనవాడు చేయి చాచి వెనక్కు లాక్కొనేటంత వ్యవధిలో బ్రహ్మ బుద్ధుని ముందు కనిపించాడు.

బ్రహ్మ సహాంపతి, ఒక భుజాన్ని కప్పినట్లు తన ఉత్తరీయం సరిచేసుకున్నాడు. కుడి ముణుకు భూమికి తగిలినట్లు వంగాడు. బుద్ధుడివేపు తిరిగి, చేతులు జోడించి నమస్కరించాడు, భగవానుడితో అన్నాడు. “ప్రభువా! భగవానుడు ధర్మాన్ని బోధించుగాక! సమ్యన్ సంబుద్ధుడు ధర్మాన్ని బోధించుగాక! లోకంలో కొంతమంది యొక్క మనో నేత్రాలపై ధూళి ఇంకా పడలేదు. కాని, వాళ్ళు ధర్మం వినకపోతే ముక్తిని పొందలేరు. వీళ్ళు ధర్మాన్ని అర్థంచేసుకోగలరు”. – పిమ్మట బ్రహ్మసహాంపతి మళ్ళా పలికాడు.

“ఇంతవరకూ మగధ దేశంలో వ్యాప్తమైన ధర్మం అపవిత్రమైనది. కాలుష్యం పొందిన మనుష్యులు ఆలోచించినదది! కాని, ఇప్పుడు నువ్వు అమరత్వానికి తలుపులు తెరువవలసింది. నిష్కళంకుడువైన నువ్వు కనిపెట్టిన ధర్మాన్ని వాళ్ళకు వినిపించవలసింది.”

“పర్వత శిఖరంమీద, పెద్దరాతి పైని నిలుచున్న మనుష్యుడు తన చుట్టూనున్న మనుష్యులను గమనించలేకపోవచ్చు. ఆ విధంగా, ఓ బుద్ధుడా! సత్యం యొక్క అత్యున్నతమైన భవనాన్ని ఎక్కిన నువ్వు, కిందికి చూడకపోతే ఎలా? ఓ సర్వసాక్షి! నువ్వు కిందకు చూడు. బాధలలో మునిగిన వాళ్ళను, పుట్టుకతో చావుతో కొట్టుకుంటున్న వాళ్ళను చూడు. నువ్వు బాధనుండి ముక్తిని పొందిన వాడివి.”

“ఓ వీరుడా! లేవవలసింది. విజయం పొందిన వాడా! ప్రపంచమంతటిని తిరుగు యాత్రికుల బృందానికి నువ్వు నాయకుడవు, నువ్వు ఋణవిముక్తుడవు. భగవానుడు ధర్మం బోధించుగాక! లోకంలో దానిని అర్థంచేసుకోగలవారు ఉంటారు”. –

అపుడు బుద్ధుడు, తనకు కలిగిన ఆలోచనను బ్రహ్మకు చెప్పాడు. ధర్మాన్ని బోధించడానికి తన విముఖతను స్పష్టంచేశాడు.

బ్రహ్మ రెండోసారి చెప్పాడు. కాని, బుద్ధుడు సమ్మతించలేదు. బ్రహ్మ మూడోసారి చెప్పాడు. బుద్ధుడు బ్రహ్మదేవుని ప్రార్థన విన్నాడు.

ప్రాణికోటిని, లోకాన్ని దయార్ద్ర హృదయుడై బుద్ధుడు చూశాడు. సర్వం దర్శించే బుద్ధనేత్రంతో భగవానుడు చూశాడు. ఎవరి మనో నేత్రాలు మాలిన్యంతో నలుపెక్కలేదో, వారిని చూశాడు. ఎవరి దృష్టి ధూళితో నిండి ఉందో వారిని చూశాడు. సూక్ష్మ బుద్ధిగల వారిని చూశాడు, మందబుద్ధులను చూశాడు. ఉత్తమ స్వభవం కలవారిని చూశాడు. నీచ స్వభావం కలవారిని చూశాడు. ఎవరికి బోధించడం కష్టమవుతుందో వారిని చూశాడు. వారిలో కొంత మందికి భవిష్యత్తులో ఎదురయ్యే కష్టాలు తెలుసు, వారికి పాపమంటే తెలుసు.

పద్మాకరంలో నీలకమలాలు, శ్వేతపద్మాలు, నీటిలో పుట్టి, నీటిలో పెరిగి, నీటి పై భాగానికి రాలేక నీటి అడుగునే విస్తరించినట్లు, ఆ విధంగానే కొన్ని నీటి మట్టం వరకు పెరిగి నిలిచినట్లు, మరికొన్ని నీటిలోనే పుట్టి, పెరిగి, పైకిలేచినట్లు, వాటిని నీరు తాకనట్లు ఆ విధంగా భగవానుడు లోకాన్ని బుద్ధ నేత్రంతో చూశాడు. ఆ ప్రకారం వారినందరినీ చూసి బుద్ధుడు బ్రహ్మ సహాంపతితో అన్నాడు.

“చెవులుండి వినవలసిని వాళ్ళందరికి స్వర్గ ద్వారాలు బాగా తెరచుకున్నాయి. అక్కడికి చేరదలచిన వాళ్ళు విశ్వాసంతో ముందుకు రావలసింది. మధురమైన ఉత్తమ ధర్మాన్ని జనులకు బోధిస్తాను. వాళ్ళను నిరాశాపరులను చేసి, అలియబెట్టను”. –

అపుడు బ్రహ్మసమాంపతికి అంతా అర్థమయింది.

“భగవానుడు నా ప్రార్థనను అంగీకరించాడు. ధర్మాన్ని బోధించడానికి అతడు సమ్మతించాడు.”

బ్రహ్మ, బుద్ధుడి ముందు వినయంగా వంగాడు. భగవానుడు కుడివేపు ఉన్నట్లుగా ప్రదక్షిణ చేశాడు, వెంటనే అదృశ్యడయాడు.

ఇంతవరకు చెప్పి కృష్ణమూర్తి ప్రసంగం ఆపివేశారు.

(సశేషం)

Exit mobile version