Site icon Sanchika

శ్రీపర్వతం-21

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 21వ భాగం. [/box]

32

[dropcap]కృ[/dropcap]ష్ణమూర్తి ఉపన్యాసం మొదలు పెట్టి ఎంత సేపయిందో!

మోహన్, శశికళ, సుబ్రహ్మణ్యేశ్వరరావు సైటునుంచి వచ్చేసరికి కొంచెం ఆలస్యమయింది. కృష్ణమూర్తి చాల ఉత్సాహంతో చెప్తున్నారు.

“మీ అందరితోను ఇంతకు పూర్వమే మనవి చేసుకున్నాను. నాకు, ఈ బౌద్దానికి ఎన్నో జన్మల సంబంధముందని. బుద్ధుడి తరువాత ఆ మతాన్ని ముందుకు తీసికెళ్ళిన వాళ్ళలో అశోకుడు ప్రముఖమైనవాడు. అశోకుడంటే ఎంత గౌరవమో, ఆయన కూతురు సంఘమిత్ర అన్నా నాకు అంత అభిమానమే. చక్రవర్తి ప్రియదుహిత సామాన్య స్త్రీ వలె సర్వం పరిత్యజించి బౌద్ధమత ప్రచారానికి సింహళం వెళ్ళింది.

ఈ రోజు వీళ్ళిద్దరి గురించి మీకు చెప్తాను.

అశోకుడి గురించి గంటల తరబడి చెప్పవచ్చు. కాని నా ఉపన్యాసాన్ని అతని జీవితంలో కొన్ని ముఖ్యఘట్టాలకు పరిమితం చేసి, ఆంధ్ర దేశంతో అతనికి గల సంబంధాన్ని కొంచెం వివరంగా చెప్తాను. ముందు ఎర్రబడి శాసనాల గురించి చెప్తాను.”

ఆంధ్ర దేశంలో గుంటకల్లుకు సమీపంలో ఎర్రగుడి దగ్గిర అశోకుడి రాతి మీద చెక్కించిన శాసనాలు నేటికి నిలిచి ఉన్నాయి. వీటిని ఎలా కనుగొన్నారో, ఎప్పుడు కనుగొన్నారో కృష్ణమూర్తి వివరంగా చెప్పారు.

ప్రతి సోమవారం, సెలవునాడు, ఈ మధ్య ఉవన్యాసాలు జరుగుతున్నాయి. ఉత్సాహంతో యువ శాస్త్రజ్ఞులు విషయం బాగా అధ్యయనం చేసి, చదివిన దానికి చూసినవి అన్వయించి విశదంగా చెప్తున్నారు. కృష్ణమూర్తి కథనం.

“కర్నూలు జిల్లా పత్తికొండ తాలూకాలో, జిల్లా దక్షిణపు సరిహద్దుకు సమీపంలో,

తాలూకా ముఖ్యపట్టణమైన గుత్తికి ఎనిమిదిమైళ్ళు ఉత్తరంలో, గుత్తి – పత్తి కొండ రోడ్డు మీద ఆరు పెద్ద రాతి బండలున్నాయి. గుత్తి దక్షిణ రైల్వే మద్రాసు – రాయచూరు రైలు దారిలో ఉంది. రాతి బండలున్నకొండకు ఏనకొండ (ఏనుగుల కొండ) లేక నల్ల ఎనకొండ అని పేరు. కాని అక్కడ ఏనుగు ఆకారంలో ఉన్న కొండలేవీ లేవు. అశోకుడి శిలా శాసనాలున్న ధౌళి, గిర్నార్, కాల్సీ అన్నచోట్ల ఏనుగు ఆకారం కనిపిస్తుంది. ఇక్కడ ఏమీ లేదు.”

“1928వ సంవత్సరం చివరిదశలో, కలకత్తాలో, జువాజికల్ సర్వే ఆఫ్ ఇండియాకు చెందిన అధికారి, విలువైన ఖనిజాల కోసం అన్వేషిస్తూ, ఈ ప్రాంతాలకు వచ్చాడు. అతడు ‘దేవానా…. పియదశి’ అన్న శాసనంలోని వాక్యం గుర్తించి, అవి మౌర్యాశోకుడి శాసనాలని నిశ్చయానికి వచ్చాడు. ఈ విధంగా శ్రీ ఘోష్ మొదలు పెట్టిన పని, చేతులు మారుతూ చివరకు 1957 జనవరి, ఎపిగ్రాషియా ఇండికాలో శ్రీ డి.సి. సర్కార్ గారిచే సమగ్రంగా ప్రచురింపబడింది. అంటే ఈ మధ్యనే వెలుగులోకి వచ్చింది. పరిష్కృతమైనది కాదు. (రెండు రాజశాసనాలే అందులో వచ్చాయి)

ఈ రాజ శాసనాలలో కొన్ని లఘు శాసనాలు కొన్ని సంపూర్ణ శాసనాలు. అక్షరాలు రమారమి రెండంగుళాలు ఎత్తు ఉండి బ్రాహ్మీలిపిలో చెక్కబడ్డాయి. ఒక వింత పరిస్థితి వ్రాతలో కనిపిస్తుంది. కొన్ని పంక్తులు ఎడమనుండి కుడికి వ్రాస్తే, కొన్ని పంక్తులు ఖర్ణోష్టీ లిపి వలె కుడి నుండి ఎడమకు వ్రాసి ఉన్నాయి. కొన్ని పంక్తులు వేరుచోట్ల వ్రాయబడ్డాయి. ఈ చెక్కిన శిల్పి బహుశా వాయువ్య దిశ నుండి వచ్చినట్లు తెలుస్తుంది. కొన్ని శాసనాలు తరువాత చేర్చబడినట్లు కనిపిస్తాయి. రాజశాసనాలలో కొన్ని లఘురాజశాసనాలు మరికొన్ని సమగ్రమైనవి. లఘు రాజశాసనాల భాష మాగధి మైసూరు ప్రాంతాలలో వాడే భాష. లఘు రాజ శాసనాల భాషకు సమగ్ర శాసనాలకు వాడే భాషలో భేదముంది. లఘు శాసనాల ముందుగా అక్కడ చేర్చినవి. సమగ్ర శాసనాలు అటు తరువాత చేర్చినవి. భాషలో ఈ భేదం కనిపిస్తుంది.”

కృష్ణమూర్తి ఒక క్షణం ఉపన్యాసం ఆపారు. గ్లాసులోని మంచినీళ్ళు తాగి తిరిగి చెప్పడం ప్రరంభించారు.

“లఘురాజ శాసనాలు రెండు.”

మొదటిది ఇలా నడుస్తుంది.

“దేవతలకు ప్రియమైన వాడు ఈ విధంగా చెప్తున్నాడు నేను ఉపాసకుడినయి రెండున్నర సంవత్సరాలు దాటింది.

నేను ఒక సంవత్సరం పాటు ధర్మాన్ని ఆచరించడానికి గాని, ప్రచారం చేయడానికి గాని శ్రద్ధ వహించలేదు.

ఒక సంవత్సరం పైగా నేను సంఘంతో దగ్గర సంబంధం ఏర్పరుచుకున్నాను. ధర్మం గురించి చాల శ్రద్ధ చూపిస్తున్నాను.

ఈ కాలంలో దేవుళ్ళలో కలియని మనుష్యులు ఇప్పుడు వారిలో కలుస్తున్నారు.

ధర్మప్రచారం గురించి నేను పడిన శ్రమకు ఇది ఫలితం. ఈ ఫలితం కేవలం ధనికులే పొందవలసినది కాదు.

శ్రద్ధ వహిస్తే బీదవాడు కూడా ఈ ఫలితాన్ని పొందుతాడు. మహాస్వర్గం అతనికి ప్రాప్తిస్తుంది.

అందుకోసమే బహిరంగంగా ఈ ప్రకటన చేయబడింది.

బీదవారు, ధనికులు శ్రద్ధతో ధర్మాన్ని పాటించడానికి ప్రచారం చేయడానికి శ్రద్ధ చూపించి, నా సామ్రాజ్యానికి సరిహద్దుల కావలనున్నవారికి విషయం తెలిసి, అది ఒకటిన్నర రెట్లు, రమారమి, వృద్ధి చెంది వ్యాపిస్తుంది.

ఈ బహిరంగ ప్రకటన నేను 256 దినాలు దేశసంచారంలో ఉన్నప్పుడు వెలువడింది.”

ఇక రెండవ లఘు శిలాశాసనం ఇలా ఉంది. ఈ విధంగా దేవానాం ప్రియుడు చెప్తున్నాడు. “నీకు దేవతలకు ప్రియమైనవాడు బోధించిన విధంగా ఆచరించవలెను.

రజ్జుకుడను అధికారిని ఈ విషయం గురించి నువ్వు ఆజ్ఞాపించవలసింది.

అతడు తనవంతుగా జన పదాలలో ఉండే ప్రజలను వారి అధికారులైన రాష్ట్రికులను క్రింది మాటలతో ఆజ్ఞాపిస్తాడు.

తల్లిదండ్రులకు విధేయత చూపవలెను.

పెద్దలకు విధేయత చూపవలెను.

ప్రాణికోటిపై దయ చూపవలెను.

సత్యము పలుకవలెను.

ధర్మం యొక్క ఈ లక్షణాలను ప్రచారం చేయవలెను.

ఈవిధంగా దేవతలకు ప్రియమైన వాడి ఆజ్ఞలను అందించవలెను.

ఈ ఆజ్ఞలను గజారోహకులకు, వ్రాతలు వ్రాసే కరణీకులకు, రథికులకు ఆచార్యులైన బ్రాహ్మణులకు అందజేయవలసింది.

ఆ విధంగా సంప్రదాయ బద్దంగా అంతేవాసులకు బోధించవలసింది.

ఈ ఆజ్ఞ విధేయతతో పాటించ దగినది. ఆచార్యుని యందు ఏ గౌరవముందో అది ఈ పనిలోని ఉంది.

మళ్ళీ చెప్తున్నదేమంటే, ఈ ఆజ్ఞలో ఇమిడిన సూత్రం, సరియైన విధంగా ఆచార్యుడు తన మగ బంధువుల మధ్య, స్త్రీ బంధువుల మధ్య ప్రచారం చేయవలసింది.

ఈ ప్రకారం, ఆచార్యుని బంధువులు, తమ శిష్యులకు ఈ విషయాన్ని ప్రాచీన సంప్రదాయాన్ని అనుసరించి, ప్రచారం చేయవలసింది.

మీరు, మీ శిష్యులను సరియైన మార్గంలో బోధించినట్లయితే మూల విషయ అత్యధికంగా వారిలో వృద్ధి చెందుతుంది. ఈ విధంగా దేవానాం ప్రియుడు ఆజ్ఞాపిస్తున్నాడు.”

“అశోకుడు బిందుసారుడి కొడుకు. క్రీ॥పూ॥ 273 నుండి క్రీ॥పూ॥ 236 వరకు, అంటే 37 సంవత్సరాలు రాజ్యం పరిపాలించాడు.”

బిందుసారుడు మౌర్య చంద్ర గుప్తుడి కొడుకు. అతడు క్రీ॥పూ॥ 300 నుండి క్రీ॥పూ॥ 273 వరకు పాలించాడు. బిందుసారుడికి కూడా చాణక్యుడు కొంత కాలం మంత్రిగా సహాయం చేశాడు.”

సుబ్రహ్మణ్యేశ్వరరావుకి ఏదో సందేహం వచ్చి ఉపన్యాసకుడి దృష్టిని ఆకర్షించడానికి చెయ్యి ఎత్తాడు.

“ఏమిటి మీ సందేహం” కృష్ణమూర్తి అతనిని అడిగారు.

“బిందుసారుడు, బింబి సారుడు ఒకరేనా?” రావు అడిగాడు.

“లేదు. వాళ్ళిద్దరూ వేరు వేరు వ్యక్తులు. బింబిసారుడు బుద్ధుడి కాలంనాటి వాడు. వారణాసి అతని రాజధాని. అతని తరువాత రమారమి రెండు వందల సంవత్సరాల తరువాత వాడు బిందుసారుడు. ఇతడు మౌర్యచంద్రగుప్తుడి కొడుకని ముందుగనే చెప్పాను”.

“ధన్యవాదాలు”

కృష్ణమూర్తి తిరిగి చెప్పడం మొదలు పెట్టారు.

బిందుసారుడు తన తండ్రి నుంచి పొందిన విశాలమైన సామ్రాజ్యాన్ని అవిచ్ఛన్నంగా కాపాడాడు.

బౌద్ధుల కథనం ప్రకారం రాజకుమారుడైన అశోకుడిని అతని పద్దెనిమిదివయేట, అవంతి రాష్ట్రానికి రాజ్యపాలకుడిగా బిందుసారుడు పంపించాడు. విదిశ దాని రాజధాని.

తక్షశిలలో ప్రజలు తిరగబడ్డారు. దానిని అణచివేయడానికి బిందుసారుడు తన పుత్రుడు అశోకుడిని అక్కడికి పంపించాడు. అతడు తక్షశిల సమీపించగనే, ప్రజలు ముందుగా అతనిని కలిసి వివరంగా చెప్పారు.

“మేము రాజకుమారుడికి విరుద్ధంగా లేము. రాజైన బిందుసారునికి కూడా వ్యతిరేకంగా లేము. మమ్మల్ని హీనంగా చూసే దుష్టమంత్రులంటే మాకు సరిపడదు.”

అశోకుడు ఆ విధంగా ప్రశాంతంగా ఉన్న నగరం ప్రవేశించి ఖశ రాజ్యానికి తన పాలన విస్తరించాడు.

బిందుసారుడికి అశోకుడే కాక ఇంకా కొంతమంది కొడుకులు కూతుళ్ళు ఉండేవారు. ఈ విషయం అయిదవ శిలాశాసనంలో ఉంది. దివ్యావదానంలో ఒక ఇద్దరి పేర్లు, సుసీముడు, విగతాశోకుడని చెప్పడం జరిగింది. సింహళ రాజ చంద్రలలో సుమనుడని, తిష్యుడని వాళ్ళ పేర్లు పేర్కొన్నారు.

అశోక మహా చక్రవర్తి క్రీస్తు పూర్వం 273 నుండి 236 వరక 37 సంవత్సరాలు రాజ్యపాలన చేశాడు. అతడు భారతదేశ చరిత్రలో చాల గొప్పవాడు. అతని సామ్రాజ్యం విస్తరించిందని చెప్పడంలో అతిశయోక్తి లేదు. మనిషిగా అనతి శీలం, అతడు పాటించిన ఆదర్శాలు, అతడు అవలంబించిన రాజ్యపాలనా సూత్రాలు ఇవన్నీ అతనిని మహామనీషిగా తీర్చాయి.

అశోకుడు తన చరిత్రను సహజమైన శిలలమీద శాసనాలుగా చెక్కించాడు, ఏక శిలాస్తంబాల మీద చెక్కించాడు. లోహస్తంభాలను అతడు తయారుచేయించాడు. నిర్మాణ కౌశలాన్ని, సాంకేతిక నైపుణ్యాన్ని, కొనియాడదగిన ఈ స్మారక భవనాలు జ్ఞాపకార్థం నిర్మించిన కట్టడాలు ఈ నాటికి కూడా నిలిచే ఉన్నాయి. ఈ శాసనాలను పాళీ భాషలోను, సంస్కృతంలోను చెక్కించారు. ఇవి అతని జీవితం గురించి, అతడు చేసిన పని గురించి మనకు తెలియజేస్తాయి. ఈ విధంగా రాజ శాసనాలను, తన ఆదర్శాలను నలుగురికి తెలియజేయడానికి, తన సాహసకార్యాలను లిఖిత పూర్వంగా పరీక్షంచడానికి అశోకుడు ప్రయత్నించాడు. పెర్షియాకు హిందూదేశానికి సాంస్కృతికంగాను, వ్యాపార రీతులలోను సన్నిహితమైన సంబంధముండేది. పెర్షియన్ చక్రవర్తులు డేరియస్ 1 వంటి వారు ఈ విధంగానే శాసనాలు చెక్కించారు.

అశోకుడి శాసనాలలో ముఖ్యమైనవాటిని మూడు తరగతులుగా విభజించవచ్చు.

పధ్నాలుగు శిలా శాసనాలు ఈ శాసన సముదాయాన్ని ఎనిమిది వేరు వేరు ప్రదేశాలలో చెక్కించారు. వీటిలో రెండు శాసన సముదాయాలను వేరుగా ఉన్న శాసనాలతో మార్చడం జరిగింది. ధౌలి, జౌగడా అన్న చోట్ల ఇవి ఈ విధంగా మరొక సమూహంతో మార్పు చెందాయి. ఈ రెండు స్థలాలు కళింగ దేశంలో ఉండడం నుంచి వీటిని కళింగ శాసనాలన్నారు.

చిన్న శిలా శాసనాలు రెండు శాసనాల జత యిది. వీటిలో ఒకదానిని పది వేరు వేరు చోట్ల చెక్కించారు.

ఏడు స్తంభశాసనాలు – ఈ సమూహాన్ని తోప్రాలో ఉన్న స్తంభం మీద చెక్కించారు. ఆ స్తంభం ఇప్పుడు ఢిల్లీలో ఉంది. ఈ శాసనాలలో ఆరు వేరు వేరు విషయాల పైన ఉన్నాయి. అని ముందు చెప్పిన వాటివలె ప్రత్యేకమైన వర్గాలకు చెందవు.

యుగాలుగా రాతిపై నిలిచిన ఈ శాసనాలు అశోకమహా చక్రవర్తి జీవితాన్ని పునర్నిర్మాణం చేయడానికి, అతని పాలన గురించి తెలుసుకోడానికి చాల విలువైన వివరాలను తెలియజేస్తాయి. చాలా సంఘటనల గురించి ఇవి చెప్పకపోయినా, అతడు ఏ పద్ధతులను అవలంబించాడో, ఏ విధాలైన చట్టాలను ప్రవేశపెట్టాడో, ఏ ఘనమైన నీతి సూత్రాలవలన, ఉన్నతమైన ఆదర్శాల వలన ప్రభావితుడయాడో చెప్తాయి. వీటిలో అతని ఆత్మకథ వ్యక్తమవుతుంది.

ఈ శాసనాలలో అశోకుడి తొలి జీవితం గురించి ఏమీలేదు. కాని, బౌద్ధ గ్రంథాలలో ఈ విషయం లభిస్తుంది. దివ్యావదానంలోను, సింహళ రాజ చరిత్రలలోను, ఈ విషయం కొంతవరకు లభిస్తుంది. ఈ గ్రంథాలలో అశోకుడు క్రూరుడని, తండ్రి మరణానంతరం సింహాసనం కోసం తొంభై తొమ్మిదిమంది సోదరులను సంహరించాడని ఉంది. ఇది ఎంతవరకు నిజమో తెలియదు. బౌద్ధమతాన్ని స్వీకరించక పూర్వం అశోకుడు క్రూరమైన వాడని, బౌద్ధం స్వీకరించిన తరువాత సాధువుగా వర్తించాడని చెప్పడానికే ఈ గ్రంథాలలో అలా వ్రాసి ఉందని అంటారు. ఈ రాజ చరిత్రలలో, అశోకుడు రాజయిన నాలుగు సంవత్సరాల తరువాత పట్టాభిషక్తుడయాడని ఉంది. శాసనాలలో అశోకుడి జీవితం గురించి చెప్పిన సంఘటనలు, అతడు పట్టాభిషిక్తుడైన తరువాత చెప్పినవే. కాబట్టి ఈ విషయం చారిత్రకంగా నమ్మదగినది.

అశోకుడు రాజ్యపాలనకు వచ్చిన తరువాత పట్టాభిషిక్తుడవడానికి నాలుగు సంవత్సరాలు ఎందుకు పట్టిందో, సింహళ గ్రంథాలలో చెప్తారు. రాజ్యం చేజిక్కించుకోడానికి అతడు రక్తపాతంతో కూడిన సంఘటనలను ఎదుర్కోవలసి వచ్చిందని కొందరి అభిప్రాయం. కాని, సింహళ గ్రంథాలు మాత్రం అశోకుడు నాలుగు సంవత్సరాల తరువాత ఏక ఛత్రాధిపత్యం వహించి అటుపిమ్మట పట్టాభిషిక్తుడయాడని చెప్తాయి. అశోకుడి మనుమడు దశరథుడు. అతడు వేయించిన శాసనంలో కూడా, అశోకుడు రాజైన నాలుగు సంవత్సరాల తరువాత పట్టాభిషిక్తుడయాడని ఉంది.

రాజ్యాన్ని చేజిక్కించుకోడానికి అశోకుడు హత్యలు చేయించాడని అనడం సరికాకపోవచ్చు. కాని బౌద్ధ సంప్రదాయం ప్రకారం, సింహాసనం కోసం అశోకుడు రాధాగుప్తుడి సహాయంతో తన సవతి తమ్ముడు సుసీముడితో పోరాడాడని, రాజ్యం లభించిన తరువాత అశోకుడు రాధాగుప్తుడిని ముఖ్యమంత్రిగా నియమించాడని తెలుస్తుంది. ఇందులో ఎంత వరకు నిజముందో తెలియదు. తన నాలుగవ శిలా శాసనంలోను, అయిదవ శిలా శాసనంలోను, బంధువులపట్ల క్రూరంగా ఉండడాన్ని అశోకుడు ఖండించాడు. తన సోదరుల గురించి, సోదరీమణుల గురించి అతడు శ్రద్ధ వహించాడు. అందుచేత అతడు తన సోదరులను సంహరించి రాజ్యాన్ని చేపట్టాడన్నది నిజం కాదని తెలుస్తుంది.

లఘు శిలా శాసనంలో తప్ప మిగిలిన వాటిలో అశోకుడిని దేవానాంపియ, పియదశి (దేవానాం ప్రియ, ప్రియదర్శిన్) అని పేర్కొనడం జరిగింది. దేవానాం ప్రియుడన్నది రాజులకు సామాన్యంగా వాడేది. ప్రియదర్శి అన్న బిరుదును అతని తాతగారు ఉపయోగించారు. ఆ కాలంలో భారతదేశపు మహా చక్రవర్తిని కూడా రాజు అనే సంబోధించేవారు.

అశోకుడు రాజపుత్రుడి దశనుండే పరాక్రమాన్ని, రాజతంత్ర కుశలతను కలిగినవాడు. మొదట అతడు ఉజ్జయనీ రాజ్య పాలకుడుగా ఉండేవాడు. తక్షశిల రాజ్యపాలకుడుగా తరువాత నియుక్తడయాడు. తక్షశిలలో అతడు తిరుగుబాటును అణచివేశాడు. దివ్యావదానం అన్న బౌద్ధ గ్రంథంలో అతడు ‘స్వశ’ దేశాన్ని (ఖశదేశాన్ని) జయించాడని ఉంది. కాని, శాసనాల బట్టి, ఒక్క కళింగ దేశాన్ని జయించడం గురించి మనకు తెలుస్తున్నది. అశోకుడు తన పట్టాభిషేకమైన తొమ్మిదవ సంవత్సరంలో కళింగ దేశం జయించాడు.

కళింగులు అశోకుని దండయాత్రను చాల దృఢంగా ఎదుర్కొన్నారు. పదమూడవ శిలా శాసనంలో యుద్ధం యొక్క ఘోరాలు సంగ్రహంగా వర్ణింపబడ్డాయి.

ఒక లక్ష ఏభైవేలమందిని బందీలుగా పట్టుకున్నారు. లక్షమందిని చంపివేశారు. దానికి కొన్ని రెట్ల మంది మరణించారు. కళింగాన్ని అశోకుడు పూర్తిగా జయించాడు. ఆగ్నేయ భాగంలో అశోకుడి రాజ్యానికి మంచి భద్రతగల సరిహద్దు ఏర్పడింది. ఈ విజయం అతనిలో సామ్రాజ్య కాంక్షను పెంపొందించలేదు. రాజులు ఒక విజయం పొందిన తరువాత సహజంగా మరొక దానికి ఎగబ్రాకుతారు. కానీ, కళింగ విజయం అశోకుడిలో సంపూర్ణమైన మానసిక పరివర్తనాన్ని తెచ్చింది. అశోకుడి గొప్పదనం ఇందులోనే ఉంది.

సంప్రదాయం ప్రకారం అశోకుడిని పూజనీయుడైన ఉప గుప్తుడు బౌద్దానికి మార్చాడు. కళింగ యుద్ధం ముగిసిన కొద్దికాలంలోనే ఈ పని జరిగింది. శాసనాలలో ఈ విషయం దృవపడింది. యుద్ధం వలన కలిగే బాధలకు అశోకుడు వాస్తవమైన పశ్చాత్తాపాన్ని వ్యక్తం చేశాడు. అతడు వాడిన భాష హృదయానికి తాకుతుంది. అశోకుడే ఆ శాసనాలను రచించాడని అంటారు.

కళింగ యుద్ధంలో అధిక సంఖ్యలో ప్రజలను చంపివేశారు. ఆ విధంగానే చాలామందిని ఖైధీలుగా పట్టుకున్నారు. వాటి మాట అటుంచి, చాలామంది ఉత్తములైన పురుషులు, స్త్రీలు ఈ దారుణాల వలన శారీరకమైన హింసను, మృత్యువును పొందారు. లేక మరో విధంగా చెప్పాలంటే ప్రియమైన వారి నుండి బలవంతంగా దూరమయారు. ఏ వ్యక్తికైనా, ఈ ఘోరాలు తాకకపోయినా, అతని స్నేహితులు, పరిచయస్తులు, సహచరులు, బంధువులు ఈ దురదృష్టానికి లోనయారు. ఈ విధంగా ఆ వ్యక్తి హింసకు లోనయేవాడు. కళింగాన్ని జయించినందుకు అశోకుడు పశ్చాత్తాపం చెందాడు.

‘యుద్ధంలో చంపినవారు, మరణించినవారు, కళింగలో పట్టుబడినవారు వీరిలో నూరవ వంతైనా, లేక వేయవ వంతైనా చాలు ఈ దినం దేవానాం ప్రియుడు, దానిని విచారించవలసిన సంగతిగా పరిగణిస్తున్నాడు’.

పవిత్రమైన ఇటువంటి భావనకి మించినదేదీ లేదు. ప్రపంచంలో, విజయం పొందిన చక్రవర్తి ఎవడూ ఈ విధంగా తన మనోభావం ప్రకటించలేదు. అశోకుడికి ఇటువంటి పవిత్రమైన ఉద్దేశం కలగడంతో సరిపోలేదు. అతడు రెండు ఉదాత్తమైన నిర్ణయాలను తీసుకున్నాడు.

వాటిలో మొదటిది భావికాలంలో అన్ని ప్రకారాల యుద్ధాన్ని త్యజించడం.

‘ఎవరేనా తనకు అపకారం చేసినా దేవానాం ప్రియుడు దానిని భరించవలసినంత వరకు భరిస్తాడు.’

అటుపిమ్మట అందరి హితమే కోరడం అతని ధ్యేయమయింది. ఆటవికుల పట్ల కూడా అతడు అలాగే వ్యవహరించాడు. మంచిపనులు చేయమని వాళ్ళను ఉద్బోధించాడు.

మంచి పనులు చేయమని అశోకుడు చేసిన ఉద్బోధ రెండవ నిర్ణయానికి పునాది అయింది. అతడు ధర్మాన్ని బోధించాడు. తన ప్రజల మధ్యనే కాకుండా, ప్రపంచంలోని అందరి ప్రజలకు అతడు తన ధర్మబోధను ప్రచారం చేశాడు. ఈ విధంగా జనానీకం ‘అహింస, ఆత్మనిగ్రహం, అందరి యందు సమభావం కల నడవడి, సాధుస్వభావం’ అన్న ఉత్తమ గుణాల ఆశీస్సులను పొందమని అతడు తన బోధనలలో ప్రచారం చేశాడు.

ఈ నిర్ణయాలను అవలంబించడంలో అతడు మనఃపూర్వకంగా కృషి చేశాడు. వాటిని ఆచరణలో పెట్టాడు. ఈ సంగతులు అతని శాసనాల వలన తెలుస్తాయి. అతడు ఆయుధాలతో విజయం సాధించడాన్ని విడిచి పెట్టాడు.

దానికి బదులు ధర్మంతో విజయం సాధించడమే లక్ష్యంగా పెట్టుకున్నాడు. తన వారసులను కూడా ఈ మార్గంలోనే నడవమని అతడు ఉత్తర్వులు జారీ చేశాడు. అశోకుడు తన నియమాలకు బద్ధుడై అటుపిమ్మట మరే యుద్ధం చేయలేదు.

అశోకుడు బౌద్ధమతంలోని సత్ప్రవర్తన వేపు ఆకర్షితుడయాడు. బౌద్ధమత తత్త్వం వేపు అతని మనసు పోలేదు. బౌద్ధమతం ప్రచారం చేసే ఉదారమైన కార్యాలపట్ల, పవిత్ర భావనల పట్ల అతడు శ్రద్ధ చూపించాడు. బౌద్ధాన్ని స్వీకరించిన ఒక సంవత్సరం వరకు అతడు మతవ్యాప్తి కోసం ప్రయత్నం చేయలేదు. అటుపిమ్మట అతడు భిక్షువుల సంఘాలకు వెళ్ళివారిని దర్శించాడు. వారితో సహజీవనం సాగించాడు. తరువాత అతడు ధర్మ ప్రచారానికి పూనుకున్నాడు. అతడు ప్రచారం చేసిన ధర్మానికి బౌద్ధమే పునాది. కాని, ఆ ధర్మం వివ్వజనీనమైనది. సర్వ మానవాళికి అమోదయోగ్యమైనది.

అశోకుడు బౌద్ధం స్వీకరించవచ్చు, కాని, బౌద్ధ భిక్షువుగా మారాడా అన్న విషయం మీద భిన్నాభిప్రాయాలున్నవి. అతడు బౌద్ధ భిక్షువుగా మారినట్లు సింహళ గ్రంథాలు చెప్తాయి. కొంత మంది అతడు రాజుగా సంఘాన్ని దర్శించి, బౌద్ధ మతం మీద తనకు గల విశ్వాసాన్ని బహిరంగంగా ప్రకటించాడని అంటారు. ఇత్ సింగ్ తాను స్వయంగా, బౌద్ధ సన్యాసి వేషంలో ఉన్న అశోకుడి విగ్రహాన్ని చూసినట్లు చెప్తాడు. అశోకుడు సంఘంలో ఒక సంవత్సరం ఉన్నాడు కాని, భిక్షువుగా దీక్ష తీసుకోలేదని కొందరంటారు.

అశోకుడు భిక్షువయితే రాజ్యం ఎవరు పాలించారని కొందరడుగుతారు. తాత్కాలికంగా అశోకుడు సింహాసనం విడిచి సంఘంలో గడిపాడని అనుకోవచ్చు.

ఏదయితేనేం, అప్పటినుండి చాలా పట్టుదలతో బౌద్ధ ధర్మ ప్రచారం కోసం అశోకుడు పాటు పడ్డాడు.

బౌద్ధ ధర్మ బోధన గురించి మత ప్రచారక సంఘాలను అతడు ఇతర రాష్ట్రాలకు, విదేశాలకు పంపించాడు. స్వయంగా అతడు ఈ పనికోసం అన్ని చోట్లకు వెళ్ళాడు. ధర్మవ్యాప్తి కోసం ఇతరులు ఆ విధంగా ఆచరించడానికి మార్గదర్శకుడయాడు. శాసనాలలో ఈ దయాపూర్ణమైన కార్యాల గురించి ఉంది. ఈ పనులు చేస్తున్నా అతడు రాజ్యపాలనను అశ్రద్ధ చేయలేదు. అతని నైతిక దృష్టి ఉత్తమ శ్రేణికి చెందినది. అందుచేత రాజకార్యాల పట్ల నూతనమైన అభిప్రాయం అతనికి కలిగింది. చాల ఉదాత్తమైన ఆదర్శాన్ని అతడు ముందున పెట్టుకున్నాడు. ‘మనుష్యులందరూ నా బిడ్డలు. నా పిల్లలకు అన్ని విధాలుగా క్షేమం, సౌఖ్యం ఈ లోకంలోనే కాక మరే ప్రపంచంలోను కోరుతాను. ఆ విధంగానే అందరు మనుష్యులు ప్రవర్తించాలని నా అభిలాష’.

ప్రజల నైతికమైన, ఆధ్యాత్మికమైన అభ్యున్నతికి శ్రద్ధ తీసుకున్నట్లే, ప్రాణుల భద్రతకి, ఆస్తుల రక్షణకి సరియైన పద్ధతులను అతడు అవలంబించాడు. రాజధర్మం, అతని దృష్టిలో, చాల విశాలమైనది. నైతికమైన, భౌతికమైన మంచితనం ప్రజల క్షేమాన్ని పరిరక్షించవలసినది. అతని దృష్టి తన, రాజ్యాన్ని దాటి చాలా దూరం వరక ప్రయాణం చేసింది. నాలుగవ శిలా శాసనంలో, తన రాజ్యపాలనను చేయడానికి అతడు సర్వసన్నద్ధుడని, ఉత్సాహంతో కోరి చేయవలసినవాడని ఉంది. ‘ప్రపంచమంతటి క్షేమం నాకు గణనీయమైనది. దాని వేళ్ళు ఈ వ్యాపారాన్ని శ్రమతోను, త్వరగాను నిర్వహించడంలో లోతుకు పాతుకున్నాయి. అందుచేత, నేను ఈ విధంగా చేశాను. అన్ని వేళలయందు, అన్ని స్థలాల యందు, నేను బోజనం చేస్తున్నా, అంతఃపురంలో ఉన్నా, అభ్యంతరమందిరంలో ఉన్నా, పశుశాలలో ఉన్నా, గుర్రంమీద స్వారి చేస్తున్నా, లేక ఉద్యానవనంలో ఉన్నా, ప్రజల కష్టసుఖాలు వార్తాహరులు నాతో చెప్పుకోవచ్చు.

నిర్విరామంగా పడే శ్రమకు, అతడు ఏ విధమైన ప్రతిష్ఠను కోరుకోలేదు. అది తన ప్రజలకు చేయవలసిన సామాన్యమైన విధి అని అతడు భావించాడు. ‘సకల ప్రపంచం యొక్క క్షేమం కన్న వేరే ఉన్నతమైన విధిలేదు’. అని రాజశాసనంలో ఉంది. ‘నేనాపాటి శ్రమపడినా – అది దేనికోసం? ఈ ప్రాణుల నుండి ఋణవిముక్తి పొందడానికి కొంత మందిని నేనే సుఖపెడితే, మరో ప్రపంచంలోని వాళ్ళు స్వర్గానికి పోతారు, ఇంత ఉన్నతమైన, భావాన్ని ఏ రాజు ఉద్ఘోషించలేదు. అశోకుడు దీనిని రాతిపై చెక్కించాడు.

‘ఈ భావన చాలా కాలం నిలిచి ఉండాలి. నా కొడుకులు, మనుమలు, ముని మనుమలు ఈ విధంగా నన్ను అనుసరించి సకల ప్రపంచం యొక్క క్షేమాన్ని పాటిస్తారు.’

మౌర్య సామ్రాజ్యాన్ని చంద్రగుప్తుడు స్థాపించాడు. దాని గురించి అశోకుడి శాసనాలు వివరంగా చెప్తాయి. ఆ శాసనాలలోని వివరాలే కాక, ఆ శాసనాలు లభించిన స్థలాలు కూడా అశోకుడి సామ్రాజ్య విస్తరణ గురించి చెప్తాయి. ఈ శాసనాలలో తన ప్రజలకు అశోకుడిచ్చిన సందేశాలు, చేసిన చాటింపులు ఉన్నాయి. వేరు వేరు రాష్ట్రాలలో, జనసమ్మర్థమున్న ప్రదేశాలలో వీటిని ప్రతిష్ఠించారు. కొన్ని, రాష్ట్రాల సరిహద్దులలో ఉన్నాయి. వేరు వేరు దిక్కులలో ఉన్నాయి. ఈ పధ్యాలుగు శిలాశాసనాలలో ఒక రెండు షహబాజ్‌ఘర్ లోను, మాన సేహాలోను, వాయవ్య మూలలో సరిహద్దుల దగ్గర ఉన్నాయి. ఒకటి ఉత్తరంలో టాక్స్ నది యమునా నదిలో కలిసిన సంగం దగ్గిర, కాల్సీ దగ్గిర ఉంది. నాలుగవది కాథియవాడ్‌లో గిరినార్ దగ్గిర ఉంది. అయిదవది బొంబాయి రాష్ట్రంలో రానాజిల్లాలో సోపారాలో ఉంది. పూరి జిల్లాలో ఉన్న ధౌలి దగ్గిర ఆరవది ఉంది. ఏడవది ఒరిస్సాలో గంజాం జిల్లాలో ఉన్న కౌగడలో ఉంది. ఎనిమిదవది కర్నూలు జిల్లాలో ఉన్న ఎర్రగుడిలో ఉంది. ఒక అశోకశాసనం వాయువ్యపు సరిహద్దు రాష్ట్రమైన తక్షశిలలో అరామిక్ భాషలో లభించింది. మరొకటి తూర్పు ఆఫ్ఘనిస్థాన్‌లో ఉన్న జలాలాబాద్‌లో దొరికింది.

దక్షిణాన్న అతని సామ్రాజ్య విస్తరణ గురించి మూడు లఘు శిలా శాసనాల సముదాయం వలన తెలుస్తుంది. మైసూరు, చితల్‌దుర్గ జిల్లాలో ఇవి లభించాయి. దేశమద్యంలో గల అతని సామ్రాజ్యం గురించి లఘు శిలాశాసనాల వలన తెలుస్తుంది. ఈ శాసనాలు జబల్‌పూర్ జిల్లాలోని రూపనాథ్ దగ్గిర, రాజస్థాన్‌లో గల బైరాత్ జిల్లాలోను, బీహార్‌లో ససరామ్ లోను, రాయచూర్ జిల్లాలోని మస్కీలోను, నిజాము రాజ్యంలో కోపబల్ తాలూకాలో గవిమత్, పాల్కిగుండు అన్న చోట్లలోను, చివరకు కర్నూలు జిల్లాలో ఎర్రగుడి దగ్గర ఉన్నాయి.

స్తంభశాసనాలలో కొన్నింటిని బౌద్ధయాత్రికుల మార్గాన్ని నిర్దేశిస్తూ ప్రతిష్ఠించారు. బౌద్ధుల పవిత్రస్థలాలకు పోయే దారిలో, ఒక దాని తరువాత ఒకటి, ఇవి కనిపిస్తాయి, లౌరియా అరరాజ్, రామ్ పూర్వా, నందనఘర్, నిఛివా అన్న యాత్రా స్థలాలు బుద్ధుడి జన్మ సారమైన లుంబినికి పోయే దారిలో ఉన్నాయి. మరికొన్ని శాసన స్తంభాలు ఉత్తర భాగంలో, అంబాలా, మీరట్ జిల్లాలో ఉన్నాయి. అలహాబాద్ సమీపంలో కౌశాంబిలోను, సారనాథ్ దగ్గిర, సాంచీ దగ్గర ఉన్నాయి.

అశోకుడి సామ్రాజ్యం ఉత్తరాన సరిహద్దు ప్రాంతాల వరకు, దేశంలో చాల భాగం విస్తరించింది. దక్షిణాన స్వతంత్రమైన సరిహద్దు రాజ్యాలు ఉండేవి. చోళులు, పాండ్యులు, కేరళ పుత్రులు, సాతియపుత్రులు వీరి రాజ్యాలు, తామ్రపర్ణి వరకు ఉండే దేశభాగం, పశ్చిమాన గ్రీకురాజు అంతియకుడి రాజ్యం, ఇవి స్వతంత్రంగా ఉండేవి.

చోళ సామ్రాజ్యం తూర్పువేపు ఆర్కాట్ నుండి తిరుచిరాపల్లి వరకు, పాండ్యుల రాజ్యం రామనాడ్, మదుర, తిరునల్వేలి, దక్షిణ తిరువాస్కూరు వరకు, కేరళ పుత్రుల రాజ్యం దక్షిణ కనరా, కూర్గు, మలబారు, ఉత్తర తిరువాన్కూరు, మైసూరులో దక్షిణ భాగం వరకు విస్తరించాయి. ఇవన్నీ స్వతంత్ర రాజ్యాలు.

పదమూడవ శిలా శాసనాన్ని బట్టి రాజ్యంలో కొన్ని గిరిజన ప్రాంతాలు స్వయం పరిపాలనా విధానాన్ని అనుసరించినట్లు తెలుస్తుంది.

‘రాజుగారి రాష్ట్రాలలో యవనులు, కాంభోజులు, నాభకులు, వంశ క్రమానుగతంగా వస్తున్న భోజపాలకులు, ఆంధ్రులు, పారిందసులూ, వీరందరూ ధర్మ సంబంధమైన విషయాలలో దేవానాం ప్రియుని బోధలను అనుసరిస్తారు.

యవనులు, కాంభోజులు వాయువ్య రాష్ట్రం లోనివారు. భోజులు బరార్ వారో, పశ్చిమ సముద్ర తీర ప్రాంతంలోని వారో, ఆంధ్రులు కృష్ణ, గోదావరి నదుల మధ్యనున్న తీర ప్రాంతాన్ని ఆక్రమించినవారు. మిగిలిన వారిని గుర్తించడం కష్టం. పదమూడువ శిలా శాసనంలో ఆటవ్యుల గురించి ఉంది. బహుశా వీరు కళింగానికి చుట్టుపట్ల ఉన్న అడవులలో వారు. గిరిజన పాలనలో రాష్ట్రికులు, పిటేనికులు కూడా ఉన్నారు.

అశోకుడి సామ్రాజ్యం అటు పెషావరు, ఇటు మైసూరు ఒరిస్సాల వరకు వ్యాప్తి చెందింది. చంద్రగుప్తుడి కాలంలో ఈ మహా సామ్రాజ్య పాలన సక్రమంగా జరగడానికి అన్ని ప్రయత్నాలు జరిగాయి. స్థానిక పరిపాలనా క్రమాన్ని వేరు వేరు పరిమాణాలలోను, స్థాయిలలోను నిర్వహించడం జరిగింది.

రాజు తమ్ముడు ఉపరాజు, అశోకుడి సోదరుడు ఇటువంటివాడు. యువరాజు అతనికి సహాయం చేస్తాడు. రాధా గుప్తుడు ఇటువంటి వాడు. కుమారులు లేక ఆర్యపుత్రులు అన్న రాజకుమారులు రాజుకి పరిపాలనలో సహాయం చేస్తారు. వీరు దూరంగా ఉన్న రాష్ట్రాలలో రాజ్యపాలకులుగా నియమితులవుతారు. రాజభక్తితో నమ్మకంగా పనిచేస్తారు. ఇటువంటి రాజ్యపాలకులు తక్షశిల, ఉజ్జయిని, తోసలి, సువర్ణ గిరులలో నియమింపబడినట్లు శాసనాలలో ఉంది. అశోకుడి కుమారుడు కుణాలుడు తక్షశిల రాజ్యపాలకుడని దివ్యావదానంలో వ్రాసి ఉంది. చీనా యాత్రికుడు ఫామియాన్ కుణాలుడినే గాంధార రాష్ట్రపు రాజ్యపాలకుడు ధర్మవివర్ధనుడిగా సంప్రదాయం చెప్తుందని వ్రాస్తాడు.

రాజ్యపాలకుల తరువాత రాష్ట్ర పాలకులు వస్తారు. వీరిని ప్రాదేశికులని శాసనాలు పేర్కొన్నాయి. జూనాగఢ్ రుద్రమన్ శాసనం క్రీ.శ. 150 నాటిది. అందులో మౌర్య సామ్రాజ్యంలోని ఇద్దరు రాష్ట్ర పాలకుల పేర్లున్నవి. చంద్రగుప్తుని ఆధిపత్యం కింద పశ్చిమ భారతం లేక సౌరాష్ట్రానికి పుష్య గుప్తుడు రాష్ట్రీయుడని (రాష్ట్ర పాలకుడని), ఆ విధంగానే అశోకుని క్రింద రాజు తుషాస్ఫుడని పేర్కొనబడింది.

రాజుకి, ఆ ప్రకారమే రాజ్యపాలకులకు, రాష్ట్ర పాలకులకు పరిషత్తులుండేవి. కౌటిల్యుడి అర్థశాస్త్రంలో ఇటువంటి పరిషత్తుల గురించి ఉంది. మంత్రులు, ఉన్నతోద్యోగుల నిర్వహించే సభలనే పరిషత్తులంటారు.

ప్రాదేశికుల తరువాత మూడు తరగతుల ఉన్నతోద్యోగుల గురించి శాసనాలలో ఉంది. రాజూకులు, యుతులు, మహా మాత్రులు ఈ మూడు తెగలవారు. రాజూకుడు చాలాలా ప్రముఖమైన అధికారి, లక్షల కొలది ప్రజలపై ఆధిపత్యం వహించవలసినవాడు, బహుమతులు ప్రదానం చేయడానికైనా, శిక్షలను వేయడానికైనా అధికారం కలవాడు. వీరు, ప్రజల నైతిక జీవనానికి, ఐహికమైన సౌభాగ్యానికి సంబంధించిన విషయాలపట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపించడానికి నియుక్తులైన వారు. అశోకుడు వీరి గురించి చాలా తన శాసనాలలో వ్రాయించాడు. తన బిడ్డను, తెలివితేటలున్న వారి యొక్క సంరక్షణకు అప్పగించి, ఏ విధంగా మనుష్యుడు నిబ్బరంగా ఉంటాడో, ఆ విధంగానే నేను ఈ రాజాకులను జనపదుల క్షేమం కోసం సౌఖ్యం కోసం నియమించాను? బహుశా ఈ రాజూకులు మండలాధికారులుగా, నేటి జిల్లా మేజిస్ట్రేటుల హోదాలో, ఉండి ఉంటారు.

యుతులు, వీరినే కౌటిల్యుని అర్థశాస్త్రం యుక్తులు అని పేర్కొంది. వీరు, అనుయాయులు, ఉపయుక్తులు, బహుశా మండల కోశాధికారులై ఉంటారు. వీరు రాజుగారి ఆస్తులను కాపాడుతూ, వచ్చిన ఆదాయాన్ని స్వీకరించి, ఖర్చు పెట్టి, జమా ఖర్చులు వ్రాసేవారు.

అశోకుడు పట్టాభిషిక్తుడైన 14వ సంవత్సరంలో ప్రత్యేక శాఖలకు ముఖ్యాధికారులుగా మహా మాత్రులను నియమించాడు. ఈ కొత్త తరగతి అధికారులను ధర్మ మహా మాత్రులని అంటారు. వీరు మతపరమైన విమర్శకులు లేక న్యాయ సంచాలకులుగా వ్యవహరించేవారు. వారిని అన్ని తెగల నుండి బౌద్ధులు, బ్రాహ్మణులు, ఆజీవకులు, రిధ్రంధులు, వీరినుండి, పరివ్రాజకులను గృహస్తులను కూడా నియమించేవారు. ధర్మాన్ని స్థాపించడం, ధర్మసాధనకు కృషి చేయడం, ధర్మానికి అంకితమైన వారి క్షేమాన్ని సౌఖ్యాన్ని పరిరక్షించడం వీరి ముఖ్య విదులు. యవనులలోను, కాంభోజులలోను, గంధారులలోను, మిగిలిన ప్రజలలోను, శీలవంతులైన వారిని, ప్రత్యేకంగా ఉపాధి కోసం పనిచేసేవారు, నిరాశ్రయులు, వృద్ధులు అయిన వారి క్షేమం కోసం, సుకం కోసం వారు శ్రద్ధాసక్తులు చూపించేవారు.

స్త్రీల ప్రయోజనాలను చూడడానికి స్త్రీ – అధ్యక్ష – మహా మాత్రులను నియమించాడు. రాష్ట్రం సరిహద్దులను కాపాడడానికి అంతమహా మాత్రులను నియుక్తులను చేశాడు. నగర పాలనకు ముఖ్యాధికారిగా నాగరకుడు లేక నగర వ్యవహారకుడు, మంత్రి వలె ఉన్నత పదవిలో, లేక మహా మాత్రుడి స్థాయిలో ఉన్నవాడిని నియమించాడు. ఇవికాక మరికొందరు విశిష్టాధికారులు, శాఖలు ఉండేవి. చక్రవర్తి యొక్క విదేశ వ్యవహారాలను చూడడానికి రాయబారులుగా దూతలను నియోగించేవారు, వారు పనిచేయడానికి విదేశాలకు వెళ్ళేవారు. రహస్య సమాచార శాఖను గూఢ పురుషులు నిర్వహించేవారు. రాజు ప్రత్యేకంగా ప్రతివేదకులన్న విలేఖరులు లేక సమాచారమందజేసే వారి పై ఆధారపడేవాడని ఒక శాసనంలో ఉంది. వీరు ప్రజల స్థితిగతులను పల్లె ప్రాంతాలగురించి బాగా తెలుసుకొని రాజుకు నివేదించేవారు. అందుచేత వీరు రాజును అన్ని వేళలయందు, అన్ని చోట్ల చూడడానికి అర్హులుగా ఉండేవారు.

ఒక ప్రముఖమైన ప్రత్యేకాధికారి గురించి చెప్పవలసి ఉంది. అతని పేరు ప్రజభూమికుడని పన్నెండవ శిలా శాసనంలో ఉంది. ప్రజల సౌకర్యం కోసం రాజ్యంలో చేసిన ఏర్పాటులు వీటిని ప్రజమనే వారు కూపములు లేక ఉదపానములు, మంచి నీళ్ళు ప్రజలకు లభించే చోట్లు, ఉద్యానాలు లేక పూలతోటలు నీడనిచ్చే మర్రిచెట్లు, మామిడి తోపులు, యాత్రికుల విశ్రామగృహాలు ఇవన్నీ రహదారుల పక్కను ప్రతిష్ఠించబడ్డవి. రెండవ శిలా శాసనంలో ప్రభుత్వము లతాగుల్మాలను పెంచే తోటల గురించి (బొటానికల్ గార్డెన్స్) ఉంది. ప్రజలకు పశువులకు అవుసరమైన ఔషధాలను తయారుచేయడానికి పనికివచ్చే ఓషధీ లతలను వాటిలో పెంచేవారు. ఈ లతలను అవసరమైతే పై దేశాల నుండి దిగుమతి చేసుకునేవారు. ఆయుర్వేద వైద్యం ఔషధాలకు, మూలాలకు, ఫలాలకు లోటు కలిగి మందులు తయారు చేయడానికి ఆటంకం కలుగకుండా అన్ని ప్రయత్నాలు జరిగేవి. మానవులకు పశువులకు కలిగే రుగ్మతలనుండి స్వాస్థ్యం పొందడానికి చాలా విస్తృతమైన వైద్య సదుపాయాలు చేసేవారు. ఏనుగుల పెంపకానికి ప్రత్యేకమైన అడవులుండేవి. వీటిని నాగవనాలనేవారు. హస్త్య ధ్యక్షుడు అనే అధికారి పర్యవేక్షణలో ఈ పని నిర్వహింపబడేది.

అశోకుడి సామ్రాజ్యానికి సరిహద్దులలో ఉండే ఆదివాసులు, ఆటవికులు అతని పాలన క్రిందకు రారు. వారు ధర్మాన్ని ఉల్లంఘించకుండా ఉండడానికి అతడు వారిపట్ల కఠినంగా వ్యవహరించినా, కొన్నిటియందు నిబంధనలు సడలించి, రాజీమార్గంలో వెళ్ళేవాడు.

అశోకుడు తన పరిపాలనలో ఒక కొత్త పద్ధతి ప్రవేశపెట్టాడు. ప్రతి అయిదేళ్ళకు, మూడేళ్ళకు అనుసంయానము లేక ఉన్నతాధికారుల పరిభ్రమణాన్ని వాడుకలోకి తెచ్చాడు. ప్రాదేశికులు, రాజూకులు, యుతులు, మహామాత్రులు ఈ పరిధిలోకి వస్తారు. వారు దైనం దినం చేసే పరీక్షలకు అతిరిక్తంగా ధర్మవ్యాప్తి చేయవలసి ఉండేది. ఈ విధంగా ధర్మం యొక్క సందేశం రాజ్యంలో బహూదూర ప్రాంతాలకు కూడా వ్యాపించడానికి అవకాశం కలిగేది. మహా మాత్రులు, ప్రజలకు న్యాయం సరిసమానంగా, సమర్థవంతంగా జరిగినది లేనిది, క్రింది ఉద్యోగుల చేతులలో ఎవరూ నిరంకుశత్వానికి బలికాకుండా ఉండడం, అనే విషయాలను స్వయంగా పరిశీలించి సంతుష్టులవలసి వచ్చేది.

ధర్మం యొక్క మూల సూత్రాల గురించి నైతిక జీవితాన్ని లేక ధార్మిక జీవితాన్ని గురించి బోధనలు చేసి, తన ప్రజల నైతికోద్ధరణకు అశోకుడు పాటుపడ్డారు. మతం, దానము వలెనే, గృహమందే ప్రారంభమవాలి. తల్లిదండ్రులతోను, పెద్దలతోను, గురువులతోను ఉన్నతమైన పదవులలో ఉన్నవారితోను, వయసులో పెద్దవారితోను, ఎవరిపట్ల మనం విధేయులుగా ఉండాలో వారందరితోను సత్సంబంధాలు పాటించడం, కుటుంబ జీవితంలో అలవరచుకోవలసినది. గురువులపట్ల శిష్యులు భక్తి తత్పరులుగా వర్తించాలి. సామాజిక జీవితంలో ఎదురయే సన్యాసులను, బ్రాహ్మణులను, శ్రమణులను, అన్ని స్థాయిలలోను బంధువులను, స్నేహితులను పరిచయస్తులను, సహచరులను, పనివాళ్ళను, తమపై ఆధారపడేవాళ్ళను, బీదవారిని, బాధపడే వారిని గృహస్తు దయగా చూసి ఆదరించాలి. చివరిగా సన్యాసుల పట్ల, స్నేహితుల పట్ల, సహవాసుల పట్ల, బంధువుల పట్ల ఉదారంగా, దానబుద్ధితో వ్యవహరించాలి.

ఈ విధంగా గృహంలో మొదలైన మత జీవనం, నైతిక జీవనం, క్రమంగా ఇల్లు దాటి జన సముదాయాలకు చేరుకున్నాయి. అశోకుడు తన పన్నెండవ శిలా శాసనంలో అన్ని మతాలను సహిష్ణుతతో చూడడమే కాకుండా ఒక మతం వారు ఇంకొక మతం వారిని గౌరవించాలని వ్రాయించాడు. తన కాలంలో వచ్చే మతపరమైన సమస్యలకు అతడు పరిష్కార మార్గాలను కూడా నిర్దేశించాడు. (1) అన్ని మతాల సిద్ధాంతాలు మూలమందు సమానమన్న ప్రతిపత్తిని ప్రోత్సహించడం, (2) అన్ని మతాలు ఒకటే అన్న ఈ విషయాన్ని ఆచరణలో పెట్టడం కోసం ఇతర మతాలను, జాతులను విమర్శించకుండా ఉండడం దీనినే వాచగతి అని శాసనంలో పేర్కొన్నారు. (3) మతపరమైన సభలలో చిన్న మతాల పైన వ్యాఖ్యానాలను ఒకచోట చేర్చడం దీనినే సమన్యాయమని అంటారు (4) ఇతర మత గ్రంథాలను అధ్యయనం చేసి బహుశ్రుతులుగా రాణించడం అశోకుడు కోరాడు. దీనికి అనుగుణంగా అశోకుడు అన్ని తెగల వారిని గౌరవించి, వారికి బహుమతులు ఇచ్చేవాడు. బరాబర్ పర్వత గుహలను ఆజీవకులకు అంకితమిచ్చి అశోకుడు తన మత సహిష్ణుతను నిరూపించుకున్నాడు.

అన్నిటి కన్న మిన్నగా అశోకుడు, మనుషులపట్ల పశువులపట్ల, అహింసను పాటించడానికి బద్ధకంకణుడయాడు. ఈ విషయమే చాలా శాసనాలలో అతడు పేర్కొన్నాడు. సకల జీవకోటి యొక్క పవిత్రతను గుర్తించమని అతడు వక్కాణించాడు. రాజకుటుంబం యొక్క భోజనం కోసం అపరిమితమైన జంతువధ జరిగేది. దానిని ఒక లేడి, రెండు నెమళ్ళ వరకు పరిమితం చేసి అటు తరువాత జంతు మాంసం పూర్తిగా మానవేయడం జరిగింది. ఈ అహింసా సిద్ధాంతం ఆహారానికి, వ్యక్తుల ప్రత్యేక జీవితానికి అనుసంధానించకుండా రాజకీయాలకు అంతర్జాతీయ సంబంధాల వరకు విస్తరించడం జరిగింది. అశోకుడు యుద్ధం ఉపశమనం లేని సంపూర్ణమైన కీడుగా ఘోషించాడు. సామ్రాజ్య విస్తరణకు అతడు బల ప్రయోగం చేయడానికి బదులు ధర్మాన్ని విస్తరింపజేసి ప్రజలను నైతిక జీవనానికి ప్రేమతో మార్చడానికి అంకితమయాడు. ఆ విదంగా సైనికుల దండయాత్రలకు బదులుగా శాంతి ప్రచారానికి రాయబారులుగా దూతలను విదేశాలకు మానవసేవకై పంపించాడు. యుద్దాల భేరీఘోష సమసిపోయి ధర్మఘోష అంతటా వినవచ్చింది. చరిత్రలో అశోకుడు శాంతి, విశ్వాసౌభ్రాతృత్వం ప్రచారంలో అగ్రగామిగా నిలిచాడు. తన కాలానికే కాకుండా, ఆదర్శాలను ఆచరణలో పెట్టడానికి కొట్టుకుంటున్న నేటి కాలానికి కూడా అతడు మార్గదర్శకుడయాడు.

అశోకుడు తన అహింసా సిద్ధాంతం వలన, శాంతియుతమైన రాజకీయాల వలన, భారత దేశమంతటిని తన ఏలుబడిలోకి ఏకరాట్‌గా తీసుకోలేదు. ఆటవ్యులను, చిన్న చిన్న రాష్ట్రాలను ఆయన పట్టించుకోలేదు. తన రాష్ట్రాలన్నిటిలోను ఒక విధమైన రాచరికాన్ని అతడు ఆమోదించాడు. మహా వంశం ప్రకారం, మూడవ బుద్ధ సంగీతి (ధర్మ మహాసభ) అశోకుని కాలంలో అతని రాజధాని పాటలీపుత్రంలో మొగలీపుత్ర తిస్సుడి అధ్యక్షతలో (ఉపగుప్తుడి అధ్యక్షతలో అని కొన్ని గ్రంథాలలో) జరిగింది. ఈ మహాసభ వేరు వేరు దేశాలకు మత ప్రచారకులను పంపించింది.

మధ్యంతికుడు కాశ్మీర గంధార దేశాలకు, మహారక్షితుడు యవన దేశానికి (గ్రీకు దేశానికి), మజ్జిముడు హిమాలయ ప్రాంతాలకి, ధర్మరక్షితుడు (ఇతడు యవనుడు) అపరాంతకానికి, మహా ధర్మ రక్షితుడు మహారాష్ట్రకు, మహాదేవుడు మహిషమండలానికి (మైసూరుకి), రక్షితుడు వనవాసికి (ఉ త్తర కనరాకు), శోణుడుని ఉత్తరుడిని సువర్ణ భూమికి (బర్మాకి) మహేంద్రుడు మొదలగు వారిని లంకకు (సింహళానికి) మతప్రచారకులుగా పంపించడం జరిగింది.

విదేశాలకు పంపిన వారు మత ప్రచారమే కాకుండా, మానవ సేవను చేయడానికి నియుక్తులయారని అశోకుడు తన శాసనాలలో తెలియజేశాడు. కొంతమంది ప్రచారకులు అంటియోకస్ థియోస్ అన్న సిరియా రాజును ఈజిప్టు, మాసిడోనియా, సైరిని, కోరింట్లను, పాలించే గ్రీకు రాజులను కూడా దర్శించారు. వారు అశోకుడి అహింసా సందేశాన్ని, మానవులకు పశువులకు రోగ నివారణ చేసే పద్ధతులను కూడా తమతో తీసుకుపోయారు. ప్రచారకులు పోయిన దేశాలలోనే కాకుండా, ఆ దేశాల ద్వారా ఇతర దేశాలకు కూడా ధర్మం వ్యాపించిందని అశోకుడంటాడు.

ఇతర విధాలుగా కూడా అశోకుడు ధర్మాన్ని కఠోర నియమాలతో పాటించేవాడు. అతడు సంపూర్ణంగా అహింసావాది. ప్రజా బాహుళ్యంలో జరిగే వినోదాలను, పందాలను, ముఖ్యంగా నెత్తుర్లు కారే జంతువుల పందాలను, వాటిని చంపి మాంసం తినవలసిన ఆటలను, జంతువుల మధ్య జరిగే పోటీలను రద్దుచేశాడు. మతం పేరిట జరిపే జతు బలులను తొలగించాడు. రాజుల వినోదమైన వేటను పూర్తిగా రద్దు చేశాడు. రాజ కుటుంబాలు జరిపే విహార యాత్రకు బదులు, ధర్మ యాత్రలను ప్రవేశ పెట్టాడు. ఈ దర్మయాత్రలు బుద్ధగయ లేక లుంబిని వంటి పవిత్ర స్థలాలకు పోవడమే కాకుండా, ఉపేక్షింపబడి అందుబాటులో లేని గ్రామాలకు ఉద్యోగం మీద వెళ్ళి అక్కడ లక్షలలో ఉన్న మూగజనానికి, రాజు శ్రద్ధ తీసుకోవలసినవాళ్ళకు, ధనాన్ని, నీతిబోధను బహుమతులుగా యివ్వడానికి ఉపయుక్తమయేవి. రాజు నడిచిన తోవ, ఉత్తమ పాలనాధికారులకు, మహా మాత్రులకు, రాజ్యపాలకులైన రాజకుమారులకు అనుసరింపదగినది. వీరు నియమిత కాలాలలో సామాజిక సేవకు రాజచారులుగా (అనుసంయానముగా) పల్లె ప్రజల దగ్గరికి పోయి, వారికి నైతికమైన సందేశాలను, కష్టంలో నివృత్తికొరకు సహాయాలను అందజేసేవారు.

అశోకుడు తన 26వ పాలనా సంవత్సరంలో, ప్రత్యేకమైన ప్రాణుల వధను, హింసను నిషేదిస్తూ చట్టాన్ని ఒకటి అమలు పరిచాడు. మానవుడికి ఉపయోగపడని ప్రాణులు, ఆహారానికి గాని సేవకుకాని పనికిరాని జంతువులు, పక్షులు, చిలుకలు, అడవి బాతులు, గబ్బిలాలు, చీమలు, తాబేళ్ళు, ఉడుతలు, ముళ్ళ పందులు, బల్లులు, ఖడ్గ మృగాలు, పావురాళ్ళు, సేవకు ఉపయోగపడనివి, తినుటకు పనికి రానటువంటివి అయిన చతుష్పాత్తులను, రక్షింపబడిన ప్రాణులుగా, అనుల్లంఘ నీయములుగా (అవధ్యలుగా) ప్రకటించడం జరిగింది. ఈ అశోకుడి రక్షిత ప్రాణుల జాబితాను బట్టి, సాధారణ ప్రజలు మాంసాహారం తీసుకోడం విషయంలో, రాజ కుటుంబీకులకు విధించిన నిషేధం పాటించలేదని తెలుస్తుంది. ఈ చట్టంలో మరికొన్ని నిషేధాలను వివరించడం జరిగింది. ఊకలోగాని, పొట్టులోగాని బతికిన కీటకాదులంటే, దానిని కాల్చరాదు, బ్రతికిన ప్రాణులు నివసించే అడవులను దహించరాదు. జీవమున్నవారు జీవమున్న వాటిమీద బతకకూడదు. సంవత్సరంలో, ప్రత్యేకించబడిన 56 దినాలలో, చేపలను చంపడంకానీ, అమ్మడం కాని, తినడం కాని చెయ్యకూడదు. కొన్ని పవిత్ర దినాలలో పశువులకు విత్తులు కొట్టడం కాని, గుర్రాలకు గురుతు కోసం వాతలు పెట్టడం కాని చేయరాదు. సంవత్సరానికి ఒకసారి, రాజుగారి జన్మదినం నాడు ఖైదీలను విడుదల చేసేవారు. మరణ శిక్ష విధించిన నేరస్తులకి మూడు రోజుల గడువు ఇచ్చేవారు. దీనిని బట్టి మరణ దండన వంటి శిక్షలను అశోకుడు కొన్ని వాస్తవ కారణాల వలన తొలగించలేకపోయాడని మనికి తెలుస్తుంది. దిగువ తరగతి జంతువుల జీవితానికిచ్చిన ప్రాధాన్యత మానవ జీవితానికి ఇవ్వలేదని అనుకోవచ్చు. మానవుడికి మంచిని చెడ్డను గుర్తించే జ్ఞానముంది, అతడు మూగవైన తెలివి తక్కువ ప్రాణులకంటే మెరుగైనవాడు. అందుచేత మరణ శిక్షను పొందిన హంతకులంటే జంతువులు రక్షింప దగినవి.

తన కళాత్మకమైన వ్యాసంగంలోను, దాని వలన పొందిన సత్పలితాలలోను అశోకుడు అందరికన్న ముందుగా పరిగణించవలసిన వాడు. అతడు చేసిన కొత్త మార్పులలో చాలా గొప్పది కర్రకు, ఇటుకకు బదులుగా రాతిని ఉపయోగించడం. అతడు పలురకాలైన కళాత్మకమైన భవనాలతోను, కట్టడాలతోను దేశాన్ని అలంకరించాడు. నగరాలను, రాజ భవనాలను, స్తూపాలను విహారాలను, గుహాలయాలను ఏక శిలా స్తంభాలను నిర్మించడంలో అశోకుడు కుశలుడు.

పాటలీపుత్రంలో అశోకుడి రాజ భవనాన్ని చూసి, దానిని మానవులు నిర్మించలేదని, అది దేవతల నిర్మాణమని ఫాహియాన్ అభిప్రాయపడ్డాడు. దేవతలే రాళ్ళు పేర్చారని, గోడలను ద్వారాలను లేవనెత్తారని, లోపల చెక్కడాలను, శిల్ప నిర్మాణాన్ని తీర్చారని అతడు వ్రాశాడు. ఏ మానవ హస్తం ఆ విధంగా భవనాన్ని నిర్మించడం సాధ్యం కాదని అతడు వ్రాశాడు.

అశోకుడు 84,000 స్తూపాలను లేక విహారాలను నిర్మించాడని అనుశ్రుతంగా వస్తున్నది. అతని సామంతరాజులు 84,000 పట్టణాలలో, భారతదేశమంతటా, ప్రత్యేకంగా ఎంపిక చేసిన చోట్లలో నిర్మాణం కావించారని అంటారు. బుద్ధుడు శారీరక ధాతువు నిక్షేపించిన ఎనిమిది స్తూపాలను తెరచి, ఆస్తి నిక్షేపాలను, తాను నిర్మించిన 84,000 స్తూపాలలో, పంచిపెట్టాడు. కనకముని అన్న పూర్వబుద్ధుడి స్తూపం, రెండు రెట్లుగా పెంచి అశోకుడు పునర్నిర్మాణం చేశాడని కూడా అంటారు. అశోకుడు ముందు నిర్మించిన దాని చుట్టూ, తరువాత కాలంలో సాంచీ మహా స్తూపం నిర్మాణం జరిగిందని చెప్తారు. దావ్యివదానంలో అశోకుడి స్తూపాలు కొండలంత ఎత్తుగా ఉండేవని వర్ణించారు.

అశోకుడి శిలా స్తంభాలను అంత నున్నగా ఎలా చేశారని నేటి సాంకేతిక నిపుణులు ఆశ్చర్యపోతారు. ఇంగ్లీషు పర్యాటకులు టామ్ కోర్యెట్, విట్టేకర్లు వాటి నున్నదనం చూసి, అవి ఇత్తడితో చేసినవని భావించారు. ఛాప్లెస్ టెరీ అవి చలువ రాతితో చేసినవన్నాడు. బిషప్ హెబర్ వాటిని పోత పోసిన లోహంతో చేసినవని అన్నాడు. స్తంభాల ఉపరి భాగంలో వృషభాలు, సింహాలు చెక్కారు. శిల్పంలోను, శైలిలోన సునిశితమైన చెక్కడంలో అవోకుడి శిలా స్తంభాలు ప్రత్యేకమైనవి. ఏకాండీగా ఉన్న శిలలనుండి 30 అడుగుల ఎత్తుగల స్తంభాలను మలచడం సాధారణమైన పనికాదు. చునార్ పర్వతాలనుండి ఈ రాళ్ళను చెక్కి పాటలీ పుత్రం కర్మాగారానికి తెచ్చేవారు. ఒకొక్క శిల ఏభై టన్నుల బరువుంటుంది. అక్కడనుండి, దేశంలో అయిదారు వందల మైళ్ళు దూరమున్న చోట్లకి వీటిని రవాణా చేసేవారు. అంబాలాకి సమీపంలో ఉన్న తోప్రానుండి ఒక శిలాస్తంభాన్ని ఢిల్లీకి సుల్తాన్ ఫిరూజ్ షా తుగ్లక్ తరలించాడు. ఈ స్తంభాన్ని 42 చక్రాలు గల శకటం మీద 8,400 మనుష్యులు లాక్కొని వెళ్ళారని ఒక ఉర్దూ గ్రంథంలో ఉంది. మరొక గ్రంథం ప్రకారం క్రీ.శ. 1370లో, మొదట ఏనుగులను ఉపయోగించారని, తరువాత 20,000 మనుష్యులు యమునానది గట్టు వరకు మోసుకుపోయాని, యమునానది మీద పడవలపైన తీసుకుపోయి, నది దాటించిన తరువాత ఫిరోజ్ బాద్ దగ్గిర జుమ్మా మసీదు దగ్గిర దానిని ప్రతిష్ఠించారని ఉంది. మీరట్ నుండి మరోక స్తంభాన్ని ఫిరోజ్ షా ఢిల్లీకి తరలించాడు. ఈ స్తంభాలను చెక్కడం, దూర ప్రదేశాలకు పంపి, ప్రతిష్ఠించడం మౌర్యుల కాలం నాటి శిల్పుల నైపుణ్యం, సాంకేతిక నిపుణుల అనుభవం మనకు తెలియజేస్తాయి.

మౌర్యుల ఇంజనీర్లు నీటి పారుదల కోసం చేసిన ఏర్పాటులు మెచ్చుకోదగినవి. జునాగఢ్ లేక గిరినార్ సమీపంలో రైవతక పర్వతం, ఊర్జయత్ పర్వతాల మీద, సుదర్శనమన్న జలాశయాన్ని నిర్మించారు. చంద్రగుప్త మౌర్యుని కాలంలో నిర్మించిన ఈ తటాకాన్ని అశోకుడు బాగు చేయించాడు, కాలువలు తవ్వించారు, కుళ్ళిన పదార్థాలు చేరకుండా అడ్లు కట్టారు.

అశోకుడి శిలా శాసనాలలో అతని సోదరుల గురించి, సోదరీ మణుల గురించి, ఇతర బంధువుల గురించి, రాజ భవనంలో ఉన్నవారి ప్రస్తావించడం జరిగింది. అతడు తనవారి కందరికి సుఖశాంతులను క్షేమాన్ని అభిలషించాడు. వారిలో కొంతమంది పాటలీపుత్రంలో స్థిరపడ్డారు. మరికొంతమంది ప్రధాన నగరాలలో నివసించారు. ఒక స్తంభ శాసనంలో అశోకుడికి చాలా మంది రాణులు, పుత్రులు ఉండేవారని చెప్పబడింది. ఒక చిన్న స్తంభ శాసనంలో అతని రెండవ భార్య పేరు కారువాకి అని, ఆమె పుత్రుని పేరు తీవరుడని పేర్కొనబడింది. సాహిత్య గ్రంథాలలో అశోకునికి నలుగురు రాణులని ఉంది. అశోకుడి జ్యేష్టపుత్రుడు మహేంద్రుడని, అతని పెద్ద కూతురి పేరు సంఘమిత్ర అని కొన్ని గ్రంథాలలో ఉంది. వీరిద్దరు అతని పెద్ద భార్య శాక్య కుమారికి జన్మించిన వారని వాటిలో ఉంది. అశోకుడు మహేంద్రుడిని, సంఘమిత్రను దూరంగా ఉన్న సింహళానికి బౌద్ధ మత ప్రబోధకులుగా పంపించాడు. కొన్ని గ్రంథాలలో మహేంద్రుడు అశోకుడి సోదరుడని ఉంది.

సారనాధ్, సాంచీ శాసనాలలో బౌద్ధసంఘాలకు రాజు అధిపతి అని ఉంది. భిక్షువులు, భిక్షువులు ఉండే సంఘంలో చీలికలు ఏర్పడే సూచనలు కనిపించాయి. శాసనాలు ఈ చీలికలను గర్హించి తగిన శిక్షలు ఘోషించాయి. ఈ చీలికల గురించి ఆలోచిస్తే, సంఘాలలోను, లేక విహారాలలోను చాలా హెచ్చు సంఖ్యలో భిక్షువులను కట్టుదిట్టంలో ఉంచవలసి వచ్చేది. సంఘంలో కలిగే విభేదాలకు కారణమైన వదంతులను సమూలంగా నాశనం చేయడం మహామాత్రుల విధులలో ఒకటి.

అశోకుడు క్రీ.పూ. 273లో సింహాసనం అధిరోహించాడు. అతడు 37 సంవత్సరాలు పరిపాలన చేశాడు. అతని పరిపాలన క్రీ.పూ. 236 లో అంతిమయింది.

అశోకుడి కాలంలో బౌద్ధలలో భిక్షువులు, భిక్షుణులు ఉపాసకులు, ఉపాసికలు ఉండేవారు.

భిక్షుణి, భిఖుని, భిచ్చుని – ఈ పదాలు కేవలం బౌద్ధ సన్యాసినులకు సోదరిణులకు, యోగినులకు మాత్రం వర్తిస్తాయి. కొన్ని ప్రత్యేకమైన సందర్భాలలో వీరిని సమనికలు లేక పరజతికలు అని పేర్కొంటారు.

అశోకుని శాసనాలలో బౌద్ధ సంఘ విభజనకు, ధర్మ విభేదాలకు భిక్షుణులు భిక్షువులతో సమానమైన అధికారాలు కలిగిన వారని తెలుస్తుంది.

సంఘమిత్ర సింహళానికి ధర్మబోధ కోసం వెళ్లింది. మహా వంశంలో, దీప వంశంలో ఈ విషయం ప్రస్తావించబడింది. ఆ విధంగా శాసనాలలోను, గ్రంథాలలోను భిక్షుణుల గురించి వివరించబడింది.

అశోకుడి కుమారుడు మహేంద్రుడు, కుమారి సంఘమిత్ర అశోకుడి ఏడువ పాలనా సంవత్సరంలో ధర్మం స్వీకరించి భిక్షువుగాను, భిక్షుడిగాను మారిపోయారు.

సంఘమిత్ర ఉపాజ్ఞాయా (ఉపాధ్యాయ) ధర్మపాల, ఆచార్య అయసాల.

భిక్షు మహేంద్ర, భిక్షుణి సంఘమిత్ర తేరవాదానికి చెందిన వాళ్ళు. అశోకుని 19వ లేక 20వ పాలనా సంవత్సరంలో మరొకపది మంది సమర్థులైన భిక్షుణులతో హిందూ దేశం నుండి సింహళం వెళ్ళారు. ‘అపుడు సింహళాన్ని దేవానాం పియతిస్స పాలించేవాడు. సంఘమిత్ర మొదలైన వాళ్ళు అనూరాధ పురంలో త్రిపిటకాలను బోధించారు. అక్కడి భిక్షుణీ విభాగాన్ని స్థాపించారు. రాజకుమారి అనుల, తన పరివారంతో సంఘమిత్ర నుంచి ధర్మబోధను విని సంఘంలో చేరింది. మరికొందరు భిక్షుణులు సంఘమిత్రనుండి ఉపసంపదను (సంఘంలో చేర్చుకోనడానికి ఇచ్చేదీక్ష) స్వీకరించారు.

సంఘమిత్ర తన భిక్షుణీ సంఘంతో ఉపాసిక విహారమన్న పేరుగల భిక్షుణీ ఉపస్సయ (ఉపాశ్రయం)లో నివసించేది. అందులో 12 గృహాలు ఉండేవి.

సంఘమిత్రకు, మిగిలిన భిక్షుణులకు అనుకూలంగా ఉండేటట్లు, రాజుదేవానాం పియతిస్స, థిపారామం చుట్టూ ఒక భిక్షుణీ ఉపాశ్రమం కట్టించాడు. దాని పేరు పెట్టాళ్ళక విహారం.

అశోకుడి తరువాత, భిక్షుణుల గురించి మనకు సాంచీ స్తూపం, బారహత్ స్తూపం, బుద్ధగయలోని స్తంభాలమీద లిఖించిన శాసనాలు వీటిలో తెలుస్తుంది.

ఈ శాసనాలలో ఆనాటి భిక్షణుల గురించి కొన్ని ముఖ్యమైన విషయాలు లభిస్తాయి.

భిక్షుణులను మామూలుగా, గౌరవ నామాలు చేర్చకుండా భిక్షుణులనో, బిచ్చునులనో పిలిచేవారు. కాని, భిక్షువులను మాత్రం భదంత, భయంత, అయ (ఆర్య), భదంతయ మొదలైన గౌరవప్రదమైన పేర్లు చేర్చి పిలిచేవారు.

ఒక అనుభవం కల భిక్షుణి కింద అనుభవం తక్కువగా ఉన్న భిక్షుణులు శిష్యురాండ్రుగా ఉండేవారు. లేకపోతే భిక్షువులకింద భిక్షుణులు శిష్యురాండ్రుగా చేరేవారు. కాని భిక్షుణి కింద భిక్షువు ఛాత్రుడుగా చేరిన ఉదంతం ఎక్కడాలేదు.

సంఘంలో చేర్చుకున్నప్పుడు భిక్షుణుల పేర్లు మార్చేవారు. కొంత మంది పేర్లు మార్చకుండా ఆ విధంగానే ఉంచేవారు.

వాళ్ళ పేర్లు మారితే, అరహదాసీ (అరహద్దాసి), అరహదినా (అర్మద్ధత్తా) ఇషిదతా, ఇషిదినా (ఋషిదత్తా), ఇసిదాసి, గోతమీ, జితమితా (జితమిత్రా), దిగనాగా (దిజనాగా),

ధమరక్షితా, ధమసిరి, బుధ రఖితా, సంఘ రఖితా, సంఘ పాలితా – ఈ విధంగా ఉండేవి.

వారి పేర్లు మారకపోతే – దేవభాగా, చండా, కాడీ, చిరాతీ (కిరాతీ), యఖీ, సగరినా, గిరిగుతా, పుసా (పుష్య), అసభా (ఋషభా) గడా (గండా), వాసవ, రతిని, సిరి, సిహ, సురియా – ఈ ప్రకారం ఉండేవి.

ఉజేని (ఉజ్జయిని), కాకండి, కాచుపధ (కాంచపథ లేక కాంచీపథ), కాపిసిగాను, కురమ, కురర, కురరగర, చుదఠీల, తుంచివన, నందినగర, లేముట, బోజకట, మదలచ్చికట (మండలాక్షికట), మహింసతి (మహిష్మతి), మోరగిరి, వాఘమత, వాడి వాహన, విదిశ – ఈ నగరాలతో భిక్షుణులకు సంపర్కముండేది.

బుద్ధ గయలోని శాసనాలలో, రాజు ఇంద్రాగ్ని మిత్రుడు పట్టమహిషి కూరంగి అని ఒకదానిలో ఉంది. మరొక పదిహేను శాసనాలలో అయాకురంగి (ఆర్యాకురంగి) అని ఉంది. బౌద్ధ శాసనాలలో అయ్యా లేక అయిరా (ఆర్యా) అనేది అర్హతపదవి పొందిన వ్యక్తి పేరుకి ముందుండే గౌరవ నామం. దీనిని బట్టి కురంగి బిక్షుణి సంఘంలో చేరి, కాలం గడిచి, ముదుసలిగా ఆమె ఆర్యగా మారినట్లుంది.

జున్నారు శాసనంలో ఒక బౌద్ధ గుహలో లభించిన దానిలో – ధర్మోత్మరీయ శాఖకు చెందని భిక్షుణుల కోసం, భిక్షుని ఉపసయ (భిక్షుణీ ఉపాశ్రయ) నిర్మింపబడినట్లుంది. మధురలో, హువిష్కుడి కాలంలో, ఒక శాసనం వెలువడింది.

అందులో భిక్షుణి బుద్ధమిత్ర సోదరి కూతురు, భిక్షుని ధనము గురించి ఉంది. ఆమె మాధుర వణక (మధురావన) లో బుద్ధ ప్రతిమను ప్రతిష్ఠించినట్లుంది. ఆమెకు త్రిపిటకాలు తెలుసు. ఆమె, భిక్షుబల శిష్యురాలు. అతనికి త్రిపిటకాలు క్షుణ్ణంగా వచ్చు. ఈ భిక్షువు యొక్క యశస్సు శ్రావస్తి, సారనాథ్‌ల వరకు వ్యాపించింది.

అమరావతిలో భిక్షుణులకు సంబంధించిన శాసనాలు ఎనిమిది లభించాయి. అక్కడ ఉన్న బౌద్ధ సమాజంలో భిక్షువులు, భిక్షుణులు, ఉపాసకులు, ఉపాసికలు ఉండేవారు.

భిక్షుణులను సమణికులు, పవజితికలు అని కూడా పిలిచేవారు.

ఆ శాసనాలన్నిటిలోను భిక్షుణులు దాతలుగా పేర్కొనబడ్డారు.

ఒక శాసనంలో బుధా అన్న భిక్షుణి పేరు కనబడుతుంది. అమె థెర ఛేతియ వందక భదంత బుధి యొక్క సోదరి.

రెండు శాసనాలలో, ఇద్దరు థేరసాదువుల శిష్యురాండ్రుగా ఇద్దరు భిక్షుణుల పేర్లు కానవస్తాయి. వాళ్ళు స్థానీయులు. బుధ రఖిత, తేర భదంత బుధ రక్షితుడి శిష్యురాలు. అరహత అయిర బుధరక్షితుడు శిష్యురాలు నంద.

మరొక శాసనంలో కెవురూరకు చెందిన పవజతిక (ప్రవ్రాజిత) వస్తా (వశ్య) అన్న ఆమె పేరు కనిపిస్తుంది.

ఫాహియాన్ మధుర గురించి వ్రాసినప్పుడు అక్కడ ఉన్న భిక్షుణులు గురించి ఉదహరించాడు.

“భిక్షుణులు ఆనందుడి ప్రసాదాన్ని గౌరవిస్తారు. ఎందుచేతనంటే, అతడే గౌతమ బుద్ధుడిని ప్రార్థించాడు. స్త్రీలను సంఘంలోకి తీసుకోమని, శ్రమణేరులు రాహులుడిని పూజిస్తారు.”

గుప్త సంవత్సరం 230 (క్రీస్తు శకం 549-50) నాటి శాసనంలో (సంస్కృత శాసనంలో) శాక్య భిక్షుణి జయభట్టా, యశో విహారంలో దానం చేసినట్లుంది.

7వ శతాబ్దంలో ఇత్ సింగ్ ఇలా వ్రాశాడు.

“భారత దేశంలో భిక్షుణులు చీనా దేశపు భిక్షుణుల కంటె భిన్నమైన వాళ్ళు. వాళ్ళు భిక్షమెత్తుకొని, పేదరికంలో సామాన్య జీవితం సాగిస్తారు”.

మాలతీ మాధవంలో భవభూతి కామందకి అన్న పరివ్రాజికను ప్రవేశపెడతాడు. ఆమెకు అవలోకిత, బుద్ధ రక్షిత, సౌదామిని అన్న ముగ్గురు శిష్యురాండ్రు ఉంటారు.

సుబందుడు తన వాసవదత్తలో తారాదేవికి భక్తురాలైన భిక్షుకి గురించి చెప్తాడు. ఆమె ఎర్రటి బట్టలు ధరిస్తుంది.

భిక్షుకీవ తారానురాగ రక్తాంబరధారిణీ

భవభూతి బౌద్ధ భిక్షుణులను దక్షిణా పథంలోని శ్రీపర్యతానికి సంబంధించిన వాళ్ళని, వాళ్ళు సన్యాసినులని, కాషాయాంబరాలు ధరించి పిండపాతం మీద జీవించే వాళ్ళని చెప్తాడు.

చీర చీవర పరిచ్చదా

తథాకరగుప్త ఆ తరువాత వాడు. అతడు వజ్రయానం లేక అగ్రణయ మహాయానం గురించి చెప్తూ, భిక్షువులకు భిక్షుణులకు, శ్రమణేరికలకు, ఉపాసకులకు ఉపాసికలకు ధర్మబోధ జరుగుతుండేదని వ్రాశాడు.

ముస్లిమ్ దండయాత్రకు ముందే 9-10 శతాబ్దాల సరికే, ఈ భిక్షుణీ శాఖ అంతరించి పోయింది.

కృష్ణమూర్తి ఉపన్యాసం ముగిస్తూ అన్నారు.

“అశోకుడి గురించి కొంచెం విపులంగా చెప్పినా, సంఘమిత్ర గురించి, భిక్షుణుల గురించి పరిచయం మాత్రమే చేశాను. బుద్ధ భగవానుడు అనుగ్రహిస్తే మరొకసారి వీరిగురించి ఇంకా వివరాలు చెప్తాను”.

అప్పటికే బాగా చీకటి పడింది. పెట్రోమాక్సు లైట్లు ఎప్పుడో వెలిగించారు.

సభికులు లేచి తమతమ నివాసాలకు వెళ్ళిపోయారు.

(సశేషం)

Exit mobile version