శ్రీపర్వతం-22

1
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 22వ భాగం. [/box]

33

ఆ రోజు గురువారం. మార్చి నెల. మధ్యాహ్నం నాలుగు గంటలకు కూడా ఎండ తగ్గలేదు. క్లబ్బులో సాయంకాలం నాలుగన్నరకు మీటింగని నోటీసు వచ్చింది. సుబ్రహ్మణ్యేశ్వరరావు మధ్యాహ్నం సెలవు పెట్టి వచ్చాడు.

ముగ్గురూ మధ్యాహ్నం భోజనమైన తరువాత సైటులో ఒక గంట గడిపి క్లబ్బుకి చేరుకున్నారు.

కాఫీలయిన తరువాత సభ మొదలయింది. ఈనాటి సభకు శ్రీ కృష్ణమూర్తి అధ్యక్షత వహించారు. క్యురేటరు ప్రసాద్ గారు ముఖ్య వక్త.

పై ఊళ్ళనుండి ఎవరూ రాలేదు. డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు పనిమీద ఢిల్లీ వెళ్ళారు.

శ్రీ కృష్ణమూర్తి ప్రారంభోపన్యాసం చేసిన తరువాత శ్రీ ప్రసాద్ ఉపన్యాసం మొదలు పెట్టారు.

“చాలకాలం నుండి ఆచార్య నాగార్జునుడి గురించి చెప్పాలని అనుకుంటున్నాను. ఎప్పటికప్పుడు వెనుకబడింది. విషయం మూడు ఆధారాల నుండి సేకరించాను. కొన్ని సంగతులు పునశ్చరణలయాయి. కొన్ని సంగతులు ఏకీభవించాయి. కొన్ని సంగతులు నమ్మశక్యం కాకుండా ఉన్నాయి. ఇందులో ఏది పుక్కిటి పురాణమో, ఏది నమ్మదగినదో మీరే నిర్ణయించుకోండి.”

అందరూ సావధానులై వింటున్నారు. ప్రసంగం ఈ విధంగా సాగింది..

మొదటి ఆధారం ప్రకారం ఆచార్య నాగార్జునుడు తాత్వికుడు. మహాయనశాఖాచార్యుడు. క్రీస్తుశకం రెండవ శతాబ్దానికి చెందినవాడు. గౌతమబుద్ధుని బోధనలను వ్యాఖ్యానించిన బౌద్ధాచార్యులందరిలోను అగ్రగణ్యుడు. సిద్ధార్ధుని బోధనలలో నాగార్జునుడు నూతన దీప్తిని ప్రవేశ పెట్టాడు. ఇతని సిద్ధాంతాన్ని శూన్యవాదమని, మాధ్యమిక వాదమని కూడా అంటారు.

ఇతడు ఆంధ్రుడు – గుంటూరు జిల్లాలోని “వేదలి” అన్న గ్రామానికి చెందిన వాడని అంటారు. ఈ గ్రామం ఎక్కడుందో తెలియదు. ఇతడు అనేక సిద్ధాంత గ్రంథాలను రచించారు. ఇతని జీవితం ధాన్యకటకానికి (అమరావతి – ధరణికోట), శ్రీ పర్వతానికి సన్నిహితంగా ముడిపడి ఉంది.

ఇతని గ్రంథాలు చైనీస్, టిబెటన్ భాషలలో సమగ్రంగా లభిస్తున్నాయి. సంస్కృత మూలంలో అన్నీ లభించడం లేదు. బౌద్ధ ధర్మ ప్రవచనానికి శాస్త్ర పద్ధతిని ఏర్పరచి, భారతీయ తత్వ చింతనలో ప్రధాన భూమికను నిర్వహించాడు. ఇతని చింతన యొక్క ప్రభావం శంకరాచార్యుల వంటి వారిపై కూడా పడింది.

ఆచార్య నాగార్జునుడు ప్రాచీన భారతీయ దార్శనికులలో గణింపదగిన తత్వవేత్త వేద వేదాంగ పారంగతుడు. సంస్కృతంలో గొప్ప పండితుడు, బహుగ్రంథకర్త. ఇరవైకి పైగా తత్వగ్రంథాలు, వివరణలు, వ్యాఖ్యానాలు, భక్తి స్తోత్రాలు సంస్కృతంలో రచించాడు. భాను చతుష్టయములో ద్వితీయుడు. అశ్వఘోషుని తరువాత పరిగణింపబడినవాడు. తన కాలము నాటి బౌద్ధుల భిన్నశాఖల మద్యగల అంతర్గత కలహాలను నివారించి, భిన్నవాదాలను ఒక చోట చర్చించి, వాటిలోని మూల సిద్ధాంతాలను విశదీకరించడానికి కృషి చేశాడు. తన మహాయాన వాఙ్మయాన్ని సంస్కృతంలో రచించి, తన మతాన్ని తోటి వైదిక మతాల స్థాయికి తెచ్చి, గొప్ప తార్కికుడై పండితులతో తలపడి, తన వాదాన్ని స్థిరపరచుకున్నాడు. తన మతాన్ని ప్రవచించి, ప్రభోధించడం కోసమై తానే ఒక సంస్థ అయి, శ్రీ ధాన్యకటక – శ్రీ పర్వత కేంద్రాలలో రెండు విద్యా పీఠాలను నెలకొల్పి, దేశ విదేశీయ విద్యార్థులను ఆకర్షించి చిరకాలం ధార్మిక, లౌకిక విద్యావ్యాప్తిని సంకల్పించిన మేధావి.

శ్రీ ధన్యకటక మహా చైత్యాన్ని సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దే సందర్భంలో, మహాచైత్యం చుట్టూ ఒక మహా ప్రాకారాన్ని శిల్పాలంకారాలలో నిర్మింప చేసిన కార్యదక్షుడు.

ఇతడు సమకాలీన శాతవాహన చక్రవర్తిచే ఆహ్వానింపబడి, తన ధర్మ శాస్త్రాన్ని సుబోధకంగా “సుహృల్లేఖ” రూపంలో, రాజన్య మిత్రునికి శపథం చేసి, అతని చిరకాల మిత్రత్వానికి పాత్రుడయాడు.

నాగార్జునుని జీవిత విశేషాలు ఎక్కువగా తెలియవు. అసలు నాగార్జునులు ఒక్కరా, పలువురా, అన్న సంశయం ఉంది. మాధ్యమిక దర్శన ప్రవక్తయైన ఆచార్య నాగార్జునుడు, రసవాదకర్తయైన నాగార్జునుడు, తాంత్రికాచార్యులైన ఒకరిద్దరు నాగార్జునులు ఉన్నట్లు తెలుస్తున్నది.

నాగార్జునుని గ్రంథాలు అన్నీ దాదాపు లుప్తమయి, చైనా, టిబెట్టు దేశాలలో అనువాదాలుగా లభిస్తున్నాయి. వీటి పునరానువాదాలు నేడు మనకు దొరుకుతున్నాయి. ఆచార్యుని సంస్కృతవాణి సమగ్రంగా లభించడం లేదు.

క్రీస్తు శకం నాలగవ శతాబ్దం ఉత్తరార్ధంలో జీవించిన ప్రఖ్యాత బౌద్ధ భిక్షువు కుమారజీవుడు (క్రీ.శ. 344-413). మనదేశం నుండి కొనిపోయిన తొంబై ఎనిమిది బౌద్ధ గ్రంథాలను నాలుగవందల ఇరవై సంపుటాలలో చీనా భాషలోకి అనువదించాడు. అందులో ఆచార్య నాగార్జునుడి గ్రంథాలన్నీ ఉన్నాయి. అంతేకాకుండా ప్రఖ్యాత బౌద్దాచార్యులైన అశ్వఘోష, నాగార్జున, ఆర్యదేవుల జీవిత చరిత్రలను కూడ, క్రీస్తు శకం 405 ప్రాంతంలో సంగ్రహంగా రచించాడు.

కుమార జీవుడు వ్రాసిన చరిత్రను బట్టి నాగార్జునుడు దాక్షిణాత్యుడు. పుట్టుకలో బ్రాహ్మణుడు, వేదవేదాంగ పారంగతుడు – అణిమాది అష్టసిద్ధులను సాధించినవాడు. యౌవ్వనంలో స్వేచ్చావిహారియై, అదృశ్యకరిణి ప్రభావం వలన, తన ముగ్గురు శిష్యులతో అంతర్హితుడై రాజంతఃపురానికి రాకపోకలు సాగించేవాడు. ఒకనాడు అకస్మాత్తుగా పట్టుబడ్డాడు. రాజందనకు గురి అయాడు. ఆ ఆపద నుండి బయట పడినట్లైతే బౌద్ధ భిక్షువునవుతానని మొక్కుకున్నాడు. రాజు, ఏకారణం చేతనో, అతని మిత్రులను ఉరితీయించి, నాగార్జునుని విముక్తుని చేశాడు. ఈ సంఘటన అతనిలో తీవ్రమైన మనఃపరివర్తన కలిగించింది. అప్పటినుంచి అతడు బౌద్ధ భిక్షువయి, తొంభై దినాలలో త్రిపిటకాలను అధ్యయనం చేసి, ఇతర బౌద్ధ గ్రంథాల కోసం తీవ్రమైన అన్వేషణ సాగించాడు. ఆ సందర్భంలో ఒక మహానాగుడు (నాగరాజు) ఇతనిని సముద్రంలోని తమ లోకానికి తీసుకుపోయి, అక్కడ “సప్తరత్నకోసం” (గ్రంథ సంచయాన్ని) తెరచాడు. ఇందులోని వైపుల్య సూత్రాలచే (మహా ప్రజా పారమితచే) ప్రభావితుడయి, నాగార్జునుడు ఆ మహాయాన గ్రంథాలను తీసుకొనివచ్చి, పరిశీలించి, వాటి అద్యయనంలో సంతృప్తి చెంది, శేష జీవితాన్ని వాటిలోని ధర్మ సూక్ష్మాలను ప్రవచించి, ప్రభోధిస్తూ, బహుగ్రంథకర్తయై, దక్షిణ దేశంలో బౌద్ధ మత ప్రచారం చేస్తూ, మూడు వందల సంవత్సరాలు జీవించినట్లు కుమార జీవుడు పేర్కొన్నాడు.

నాగార్జునుడి చివరి దినాల గురించి ఒక సంఘటన ఉంది. అతనికి ఒక రాజన్యమిత్రుడు ఉండేవాడు. వాళ్ళిద్దరూ ఒకే సమయంలో మరణించాలని ఒడంబడిక కుదుర్చుకున్నారు. రాజుగారి కుమారుడు రాజ్యకాంక్షతో తండ్రి ఆసనాన్ని కోరి ఆచార్యుని ఆశ్రయించాడు. ఆ కారణంగా ఆచార్యుడు, అతని రాజన్యమిత్రడు, ఒకే సమయంలో ఆత్మహత్య చేసుకున్నారు. లేక ఒకరి చేతిలో ఒకరు చనిపోయారు. రాజన్యమిత్రుడు శాతావాహన వంశీయుడని, చివరి దినాలలో నాగార్జునుడు తనకోసం రాజు నిర్మించిన శ్రీ పర్వత విహారంలో నివసించాడని తెలుస్తుంది.

టిబెట్టు వారి వ్రాతల ప్రకారం, ఈ దాక్షిణాత్యబాలుడు అల్పాయుష్కుడని, అతని తల్లిదండ్రులు కుమారుని మరణాన్ని చూడలేక, అతని ఏడవ సంవత్సరంలో, ఒక మహారణ్యంలో విడిచి పెట్టారు. కాని, ఆ బాలుడు అక్కడ నుండి తప్పించుకొని, బౌద్ధ సంఘంలో ప్రవేశించి, నాలంద యందు, సరహుడు అన్న ఆచార్యుని ఆశ్రయించి, “అపరిమితాయుర్ధారణి” అన్న మంత్రాన్ని పొంది, దాని ఉపాసన చేత తన జీవితకాలాన్ని పొడిగించుకున్నాడు. పిమ్మట నలందాలోనే ఆచార్యుడుగా ఉండేవాడు.

కొందరు ఇతనిని విదర్భవాసిగా తలచారు. కాని, లంకావతార సూత్రాలలో ఇతడు దక్షిణా పథంలోని “వేదలి” వాసిగా పేర్కొనబడ్డాడు. మరి ఒక ఆధారం ప్రకారం, ఇతని జన్మస్థలం శ్రీ పర్వతానికి పూర్వదిశలోనే శ్రీ స్థానానికి పశ్చిమ దిశలో ఉన్నట్లు తెలుస్తుంది. శ్రీ స్థానం శ్రీ ధాన్యకటకానికి ప్రాచీనమైన పేరు. వేదలి ఈ రెండు ప్రాంతాలలో మధ్యలో ఉన్న గ్రామమై ఉండవచ్చు. నేడు ఇది ఏ గ్రామమో తెలియదు.

నాగార్జునుడు శ్రీ ధాన్యకటకంలని మహాచైత్యాన్ని ముఖ్యకేంద్రంగా చేసుకొని అప్పుడప్పుడు రాజుకు తత్వోపదేశం చేస్తూ సన్నిహితుడై, తన ఆధ్యాత్మిక జీవనానికి తత్వచింతనకు శ్రీ పర్వత ప్రాంతాన్ని ఎంచుకున్నాడు.

నాగార్జునుడు ధర్మోపదేశం చేసిన శాతవాహన రాజెవరు? ఆచార్యుడు రచించిన సుహృల్లేఖ గౌతమీ పుత్రుడిని ఉద్దేశించినది. రత్నావళి అనే గ్రంథం లభ్యం కాలేదు. బహుశా అది కూడా ఇటువంటిదే అయి ఉంటుంది.

నాగార్జునుడు కవివత్సలుడైన హాలుని కాలం నాటి వాడని కొందరు, గౌతమి పుత్ర యజ్ఞ శ్రీ మిత్రుడని కొందరు, కనిష్కుడని తోటివాడని కొందరు అభిప్రాయపడ్డారు.

కనిష్కుడికి సమకాలీనుడైన అశ్యఘోషుడు బౌద్ధాచార్య పరంపరలో పదమూడవ తరంవాడు. నాగార్జునుడు పదిహేనవ తరంవాడు.

కనిష్కుడి కాలంలో జరిగిన మహాసంగీతిలో మహాయానీయులు పాల్గొనలేదు.

హాలుడికి గాని, గౌతమీపుత్ర శాతకర్ణికి గాని శ్రీ ధాన్యకటకంతో ఎటువంటి సంబంధం ఉన్నట్లు పురాతత్వ శాస్త్రజ్ఞులు అంగీకరించారు.

నాగార్జునుని సమకాలీనుడు “యన్‌‌ంగు” అని హ్యూన్ సాంగ్ పేర్కొన్నాడు. అతడు సువిశాల సామ్రాజ్యధిపతి అని చెప్పడం చేత, గౌతమీ పుత్రుడే అయి ఉంటాడు.

ముఫ్పై సంవత్సరాలు సువిశాలమైన రాజ్యాన్ని అతడు పాలించాడు. అట్టి సమయంలో వైదికాచారపరుడైన యజ్ఞశ్రీ, బౌద్ధ ధర్మం గురించి వినగోరి ఆచార్యుడిని ఆశ్రయించి ఉండవచ్చు. అప్పటి నుండి ఇద్దరూ మిత్రులయారు. ఆచార్యుడు సుమారు నూరు సంవత్సరాలు జీవించి, రాజు సమక్షంలో అంత్యకాలం వరకు గడిపి ఉండవచ్చు. ఆ విధంగా నాగార్జునుడు రెండవ శతాబ్దం పూర్వార్థంలో మూడవ శతాబ్దం మొదటి పాదం వరకు జీవించి ఉండవచ్చు (క్రీ.శ. 125-225).

నాగార్జునుడు మహాయానవాది. మహాయానం ఆచార్యునికి ముందునుంచే ఉంది. ప్రతిపక్షవాదుల తీవ్ర విమర్శకు గురి అవుతునే ఉంది. నాగార్జునుడు తన వాదాన్ని రక్షించుకోవలసిన అవశ్యకత ఏర్పడింది. నాగార్జునుడు మహాయానానికి శాస్త్రీయ విస్తృత ప్రాతిపదికను కల్పించి, స్థిర పీఠం నిలిపి బహుళ ప్రచారం చేశాడు. గొప్పతార్కికుడై, పండితులతో తలపడి, తన మతాన్ని స్థిరపరిచాడు.

ఆదిలో నాగార్జునుడు మహాయాన గ్రంథాలను నాగలోకంలో మహానాగుడి నుండి సంగ్రహించాడని చెప్తారు. ఈ నాగలోకం కృష్ణానదీ ముఖద్వారం దగ్గర ఉండి ఉండవచ్చు. నాగముచిలిందుడు బౌద్ధులకు అత్యంత ప్రీతి పాత్రుడైనవాడు. నేటి మచిలీపట్నం ఆనాటి ముచిలింద నగరమై ఉండవచ్చు. గుంటుపల్లి బౌద్ధవిహారాలు ఉన్న కొండలను నాగపర్వతాలని వ్యవహరించే వాళ్ళని శాసనాలలో ఉంది. వీరాంధ్ర దేశం నాగదేశమై, రాజులు నాగరాజులుగా వ్యవహరింపబడ్డారు. ప్రజలు నాగ జాతివారు. ఆ కారణం చేత, మహాయాన మూల గ్రంథాలను అనతలసక, ప్రజ్ఞాపారమిత, సద్ధర్మపుండరీకాలను ఆచార్యుడు నాగదేశంలో సంపాదించాడు. నాగార్జునుని కాలం నాటికే బౌద్ధ సంప్రదాయాలు తీరాంధ్రంలో ముఖ్యంగా కృష్ణానదీ పరీవాహక ప్రాంతాలలో నెలకొని ఉండవచ్చు. ఏదయితేనేం, ప్రజ్ఞా పారమిత సిద్ధాంతాలు, మిగిలిన వాటిని వెనుకకు నెట్టివేశాయి.

నాగార్జునుని తత్త్వశాస్త్రానికి మూల గ్రంథమైన ప్రజ్ఞాపారమిత సూత్రాలు, ఆయన కన్నా ముందు, సుమారొక వంద సంవత్సరాలు లోకంలో ఉండి ఉండవచ్చు. ఆయన యొక్క సునిశిత మేధాశక్తి, అసమానతార్కిక పటిమ, సరళవ్యాఖ్యాన చతురత వీటివలన ఆయన సహాయానానికి ప్రసిద్ధుడైన ఆచార్యుడయాడు. ఆయన చేసిన ప్రజ్ఞాపారమిత వ్యాఖ్యానం వలన, మాధ్యమిక కారికల వలన, బౌద్ధ ధర్మ చరిత్రలో విప్లవాత్మకమైన మార్పులు వచ్చాయి. అటు పిమ్మట వచ్చిన బౌద్ధ, బౌద్ధేతర ఆలోచనా విధానాలు వాటి వలన ప్రభావితులయాయి.

నాగార్జునుడు తన గ్రంథాలలో నాస్తికత్వాన్ని నిరసించాడు. కర్మకు ఫలం కలగదని నాస్తికుడు చెప్పాడు. ఫలం కలుగుతుందని చెప్పేవాడు ఆస్తికుడు.

దానశీలము, స్పష్టమైన ధర్మ పథాన్ని అంగీకరించాలని ఆయన బోధించాడు.

అనాథులు, వికలాంగులు, వ్యాధి పీడితులు, అంధులు మొదలైన వారిని ఆదరించాలని ఆయన చెప్పాడు.

మత సహనం, మత ప్రసక్తి లేని రాజ్యపాలనను ఆయన చక్రవర్తికి ఉపదేశించాడు.

నాగార్జునుడు వ్రాసిన గ్రంథాలను పండితులు ఆరు తరగతులుగా విభజించాడు.

1. సర్వాస్తివాదాన్ని, ఇతర వైదిక వాదాలను సూక్ష్మ పరిశీలన చేసే గ్రంథాలు.

అ) మాధ్యమిక కారికలు

ఆ) విగ్రహ వ్యావర్తిని

ఇ) ఏకశ్లోక శాస్త్రం

ఈ) ద్వాదశ ముఖ సూత్రం

ఉ) శూన్యతాసప్తతి

2.వివరణ గ్రంథాలు

ఊ) ప్రతీత్యసముత్పాద హృదయ శాస్త్రం

ఋ) యుక్తి షష్ఠిక

ౠ) బోధిసత్వ పాథేయ శాస్త్రం

3.వ్యాఖ్యాన గ్రంథాలు

ఎ) మహాప్రజ్ఞా పారమిత టీకా శాస్త్రం

ఏ) దశభూమి విభాషా శాస్త్రం

ఐ) భవ సంక్రాంతి శాస్త్రం

ఒ) ఆర్యధర్మ ధాతుగర్భ శాస్త్రం

ఓ) వైదల్య సూత్ర ప్రకరణం

4.భక్తి స్తోత్రాలు – స్తనాలు

ఔ) నిరుపమ్య స్తవం

క) లోకాతీత స్తవం

ఖ) అచింత్య స్తవం

గ) స్తుత్యాతీత స్తవం

ఘ) పరమార్థ స్తవం

జ) ధర్మధాతు స్తవం

5.లేఖలు

చ) సహృల్లేఖ

ఛ) రత్నావళి

6.సూత్ర సముచ్చయం

నాగార్జునాచార్యుడివన్న మరికొన్ని గ్రంథాలు

జ) వ్యవహార సిద్ధి

ఝ) చతు స్తవం

ఇ) ఉపాయ హృదయం

ట) మహాయాన వింశకం

ఠ) ఆబుద్ధ బోధకం

డ) భవ సంక్రాంతి సూత్ర వృత్తి

ఢ) ధర్మ సంగ్రమం

ణ) ద్వాదశ భూమి విభాషా శాస్త్రం

త) రసరత్నాకరం – వైద్య గ్రంథం

నాగార్జునుడికి తత్త్వశాస్త్రంలోనే కాక రసవిద్య (వైద్యశాస్త్రం), ఖగోళ శాస్త్రం, రత్న శాస్త్రం మున్నగు వాటిలో విశేషనైపుణ్యం ఉంది.

బహుముఖ ప్రజ్ఞాశాలియైన నాగార్జునుడు బౌద్దానికి ఆరిస్టోటిల్ వంటి వాడని, మాధ్యమిక వాదానికి క్రీస్తు వంటివాడని, మహాయానానికి సెయింట్ పాల్ వంటివాడని అంటారు.

సుహృల్లేఖను క్రీస్తు శకం ఎనిమిదో శతాబ్దంలో కూడ పిల్లలు, పెద్దలు కంఠస్థం చేసేవారని చీనా యాత్రికుడు ఇత్సింగు వ్రాశాడు.

కార్లా చైత్య గృహం, సాంచీద్వారాలు, అమరావతీ మహాచైత్యం – వీటిని నాగార్జునుడు ఆంధ్ర శాతవాహన యుగానికి సమర్పించిన అమూల్యమైన ఉపహారాలు.

ఆచార్య నాగార్జునుని అమర ప్రతిభ నేటికిని బౌద్ధ ప్రపంచంలో, ముఖ్యంగా చైనా, టిబెట్టు, జపాన్లలో దేదీప్యమానంగా ఉంది. బౌద్ధ తత్వాలు వివాదగ్రస్థాలై, ఆచార విశ్వాస వైరుధ్య కలుషితాలయి, సందిగ్దావస్థలో ఉన్నప్పుడు, వాటి తత్వాలను అన్నింటిని సవిమర్శకంగా పరిశీలించి, నూతన విశ్వాసాలకు మాధ్యమిక వాదమను రూపకల్పన చేసి, ఆచార్య నాగార్జునుడు బౌద్ధ ధర్మానికి సైర్యాన్ని, నూతన విశ్వాసాన్ని కల్పించాడు.

నాగార్జునుడు బుద్ధుడి తరువాత బుద్ధుడంతటి వాడు. ఈ మహానీయుడు జీవితంలో చాలా భాగం ఆంధ్ర దేశంలో ధాన్యకటక విజయపూరి నగరాలలో గడిపి, ఇక్కడ ఒక ప్రసిద్ధమైన విద్యాపీఠాన్ని, గ్రంథాలయాన్ని, పరిశోధనాగారాన్ని నెలకొల్పి మాధ్యమిక దర్శన సృష్టి చేశాడు. నాగార్జునునికి శాతవాహణ మహారాజొకడు ఆలంబమై ఉండేవాడు.

నాగార్జునుడు లోకోత్తురుడు. ఇతడు ఒక వ్యక్తి మాత్రమే కాదు, ఇదడొక ఉద్యమం, ఒక సంస్థ, ఇతడు మహా పండితుడు, ఆచార్య శిరోమణి, చక్కని వక్త, నిరుపమ వాద ప్రతివాద కౌశల భూషితుడు, బౌద్ధ తత్త్వవేది, బహుగ్రంథకర్త, వైద్య రహస్యాలను ఎరిగినవాడు, రసాయన శాస్త్ర నిర్మాత, సిద్ధ పురుషుడు, ప్రముఖ తాంత్రికుడు, సర్వజ్ఞుడు, గురుపరంపరలో 14వ వాడు. ఆర్య, ఆచార్య, బోధి సత్య బిరుదులతో ప్రఖ్యాతుడు.

నాగార్జునులు ఎంతమంది? కొందరు ముగ్గురు, కొందరు నలుగురు ఉన్నారని అభిప్రాయపడ్డారు. ఈ పేరుతో ప్రసిద్ధులైనవారు. ఇద్దరు మాత్రమే ఉండేవారు. వారిలో, శాతవాహన యుగంలో, క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో వర్ధిల్లిన మహాయాన దార్శనికుడు బోధిసత్వ నాగార్జునుడు ఒకడు. రెండవవాడు రాసాయన శాస్త్రజ్ఞుడు. తాంత్రిక ప్రచారకుడు, వజ్రయాని అయిన సిద్ధ నాగార్జునుడు, ఏడవ శతాబ్దంవాడు.

ఆచార్య నాగార్జునుడి గురించి వివరాలను తెలిపే మొదటి ఆధారాలు అతని గ్రంథాలు. మన దేశంలో లభించు ఇంతర గ్రంథాలలో రాజు తరంగిణి, కథాసరిత్సాగరం ముఖ్యమైనవి. ఈ ఆచార్యుని గ్రంథాలన్నీ టిబెట్, చైనా భాషలలోకి అనువదింపబడ్డాయి. అవి కాకుండా క్రీస్తుశకం 405 కుమార జీవుడు అన్న అతడు ఆచార్య నాగార్జునుని చరిత్ర రచిచంచాడు. సింహళ ద్వీపంలో రచింపబడిన దీప వంశ, మహావంశాలు కూడా ముఖ్యమైనవే. ఫాహియాన్, హ్యూన్‌సాంగ్, ఇత్సింగ్ అను ముగ్గరు చైనా యాత్రికులు మన దేశానికి వచ్చి, మన బౌద్ధాచార్యుని గురించి కొన్ని ముఖ్యాంశాలను తెలుసుకొని గ్రంథస్థం చేశారు.

ఆచార్య నాగార్జునుడు దాక్షిణాత్య బ్రాహ్మణుడు. ఇతని జన్మస్థలం విదర్భనగరం అని (నేటి నాగపూరు) కొందరు, కాంచీనగరమని కొందరు అంటారు. ఇతడు జన్మచేత ఆంధ్రేతరుడైనా, తన జీవితంలో విశేషభాగం ఆంధ్రదేశంలో గడిపారు. ఆచార్య నాగార్జునుడు జీవించిన రెండవ శతాబ్దంలో ఆంధ్రదేశం చాలా విస్తరించి ఉండేది. శాతవాహన సామ్రాజ్యంలో విదిశ అంతర్భాగంగా ఉండేది. దక్షిణాన కాంచీనగరం కూడా చేరి ఉండేది.

లంకావతార సూత్రంలో, బుద్దుడే తన అనంతరం, 600 ఏళ్లకు నాగార్జునుడును భిక్షువుగా జన్మించునని చెప్పినట్లుంది.

అతని పేరు ‘నాగ’ అని, అతడు అర్జున వృక్షంకింద తపస్సు చేసి సిద్ధుడయాడని ఆ విధంగా అతడు నాగార్జునుడని ప్రసిద్ధి పొందినట్లు ఒక గాథలో ఉంది.

నాగార్జునుడికి ఏడవ ఏట ప్రబలమైన గండం ఉందని, అతడు సన్యసిస్తేనే కాని ఆ గండం తప్పదని జ్యోతిష్యులు చెప్పారు. అందుచేత అతడు సన్యసించినట్లు మరోగాథ ప్రచారంలో ఉంది. ఇది విశ్వసనీయమైనది కాదు.

నాగార్జునుడు వైదిక ధర్మం పూర్తిగా తెలిసినవాడు. కొంత కాలమైనా అతడు దీక్షతో బ్రాహ్మణ మతానుయాయియై ఉండి ఉండాలి.

చైనీయుల గ్రంథాలలో ఇతడు నిశితమైన మేధ కలవాడని, ఏకసంథాగ్రాహి అని వ్రాసి ఉంది.

పరిపూర్ణ యౌవనుడయే సరికే అతడు విద్యాపూర్ణడయాడు. ఆ కాలలో ఇతడు వ్యభిచారిగా ఉండేవాడు. రాజాంతఃపురానికి రాకపోకలు సాగించాడు. ఒకసారి పట్టుబడ్డాడు. గండం తప్పింతే సన్యసిస్తానని నిశ్చయించుకున్నాడు. ఆ మీదట పరివ్రాజకుడయాడు. అప్పుడతడు బౌద్ధమతాన్ని అవలంబించి హీనయాన శాఖలో చేరాడు. పిమ్మట మహాయానం అతనిని ఆకర్షించింది.

నాగార్జునుడు ప్రబలమైన తపస్సును చేశాడు. కాంచీపుర దేవత అయిన తారాదేవిని ఉపాసించాడు.

నలందాలో చండికను ఉపాసించి సిద్ధుడయాడని మరోగాథ ఉంది.

అప్పటికి నలందా ఇంకా ప్రఖ్యాతి చెందలేదు. అందుచేత కాంచీపురంలోనే అతడు సిద్ధుడయాడని చెప్పవచ్చు.

ఈ విధంగా అఖండమైన పాండిత్యాన్ని, అమోఘమైన తపశ్శక్తిని సంపాదించి నాగార్జునుడు దేశ సంచారం చేశాడు. చాల చోట్ల వాదోపవాదాలు చేసి విజయపరంపరను అర్జించాడు.

మహాయానంలో అభినివేశం అధికమై, ఆతత్త్వం గురించి అతడు విశేషంగా పరిశోధన చేశాడు.

అతడు బుద్ద అమితాభుని, మహానాగ బోధిసత్వుని వసత్వుని కలిసి, వారివలన తత్త్వం తెలుసుకున్నాడు మహాయానము గురించి నిశ్చయజ్ఞానము ఇవ్వగల గ్రంథాలు ఈ దేశమున లభించకపోవుట చేత నాగార్జునాచార్యుడు సముద్రపు అడుగున ఉన్న నాగలోకమునకుపోయి, అచ్చట ప్రమాణ గ్రంథములైన ప్రజాపోరమితాసూత్ర, వైపుల్య సూత్రాలనే బుద్ధధాతువులు కల కరండికను సంపాదించాడు.

ఈ నాగలోకము లంకాద్వీపమని పండితుల అభిప్రాయం. ఈ విధంగా ప్రమాణ గ్రంథాలను సంపాదించి, ఇనుమడించిన కీర్తితో నాగార్జునుడు వాటిని పరిశీలించడానికి అనువైన స్థలాన్ని గురించి ఆలోచించాడు. శాతావాహన సామ్రాజ్యాన్ని పాలించుతున్న మహారాజు ఈ పండితుని తన రాజధానికి ఆహ్వానించి తగిన సౌకర్యాలను అన్నిటిని ఒనగూర్చాడు.

శాతవాహనరాజు నాగార్జునుడు నివసించడానికి ప్రత్యేకంగా ఒక సంఘారామాన్ని నిర్మించి ఇచ్చాడు. క్రీస్తు శకం 5వ శతాబ్ది నాటి ఫాహియన్ వ్రాతలను బట్టి దీనికి పారావత విహారమని పేరు. అది అయిదు అంతస్థులు కలిగి ఉన్నది. నేల మట్టమున కల అంతస్తు ఏనుగు ఆకారముగా ఉండేది. దీనిలో 500 గదులు ఉండేవి. రెండవది సింహం ఆకృతి కలది. దీనిలో 400 గదులు ఉండేవి. మూడోది గుర్రపు ఆకారం కలది. దీనిలో 300 గదులు ఉండేవి. నాలుగవది వృషభాకృతి కలది. దీనిలో 200 గదులుండేవి. పై అంతస్తు పావురం వలె ఉండేది. ఇంకా పైన జలాశయం ఉండేది. దీని నుండి విహారంలో అన్ని చోట్లకు నీరు వచ్చే సదుపాయం ఉండేది. ఫాహియాన్ దీనిని ‘పోలోయూ’ అని పేర్కొన్నాడు.

క్రీస్తు శకం 7వ శతాబ్దంలో హ్యూన్‌సాంగ్ అన్న చైనా యాత్రికుడు ఆంధ్రదేశంలో సంచారం చేశాడు. అతడు ఆ సంఘారామాన్ని ఇలా వర్ణించాడు.

రాజధానికి 300 లీల దూరంలో ‘పోలీమో లకిలీ’ (భ్రమరగిరి) అను ఎత్తైన కొండ ఉంది. దీనిలో శాతవాహనరాజు నాగార్జునుని కోసం ఒక సంఘారామాన్ని దొలిపించాడు. దీనిలో గల కట్టడాలలో ఐదు అంతస్తుల భవనం ముఖ్యమైనది. ఒక్కొక్క అంతస్తులో విహారాలు, చతుఃశాలలు ఉన్నాయి. ప్రతి విహారంలోను మనుస్యుని గ్రంథాలు, పూర్వుల రచనలు ఉండేవి. అట్టడగు అంతస్తులో భోజనాది సామాగ్రి ఉండేది. ఉపాసకులు ఇక్కడ నివసిస్తూ ఉండేవారు, చైనా యాత్రికులు వర్ణించిన సంఘారామము పర్వతం మీద ఉండడం చేత పారావత – పర్వతానికి సంబంధించిన – నివాసమని పిలిచేవారు. ఈ పర్వత సంఘారామం శ్రీ పర్వతం మీద ఉండేదని చాలామంది అభిప్రాయ పడుతున్నారు.

ఈ విధంగా శ్రీ పర్వత సంఘారామంలో నివసించి నాగార్జునాచార్యుడు తన పరిశోధనలను సాగించాడు. ఆ పరిశోధనలు బహుముఖ్యమైనవి. నాగార్జునుడు రసాయన శాస్త్రంలో గొప్ప పండితుడు. పాదరసమును వజ్రమును శుద్ధి చేసి ఔషధాలకు ఉపయోగించి నట్లు చేశాడు. అనేక లోహాలను శోధించాడు. ఏ వస్తువునైనా బంగారంగా మార్చేయోగాన్ని కనిపెట్టాడు. ఈ పరిశోధనలు సాగించుటకు అనువైన పరిశోధనాగారము ఒకటి ఈ విహారంలో ఉండి ఉండవచ్చు. ఈ కృషికి ఫలితంగా ఇతడు రసరత్నాకరం అన్న ప్రమాణ గ్రంథాన్ని రచించాడు. నాగార్జునుడు వైద్య శాస్త్రంలో అపారమైన పాండిత్యం కలవాడు. ఇతడు అనేక మూలికల ప్రభావం తెలుసుకొని, కాయకల్ప చికిత్సను కనిపెట్టి, దానిని తాను చేసుకొని, శాతవాహనరాజునకు చేసెనట. దానివలన వాళ్లిద్దరూ సుదర్ఘీ జీవులయారు. ఈ వైద్య పరిశోధనకు ఫలితంగా సుశృతమున సంస్కరించి, కక్షపుటతంత్ర, ఆరోగ్యమంజరులను రెండు వైద్య గ్రంథాలను రచించాడు. నాగార్జునాచార్యుడు విషవైద్యంలో గొప్ప కృషి చేసి ప్రామాణికుడయాడు. నేత్ర వైద్యమున ఇతడు కనిపెట్టిన చిట్కాలు చైనాలో ప్రసిద్ధమయాయి.

అశోకుడు సర్వమానవ సౌభ్రాతృత్వమును కాంక్షించి బౌద్ధ ధర్మాలను రాళ్లమీద, స్తంభాలమీద చెక్కించి ప్రచారం చేశాడు. భగవానుడు, బుద్ధ దేవుడు సర్వ ప్రాణులయందు కరుణగలిగి నలభై సంవత్సరాలు అవిచ్ఛన్నంగా సంచారం చేసి ధర్మ బోధచేశాడు. నాగార్జున బోధిసత్వుడు సర్వమానవ బాధా నిర్వాహణ పరతంత్రుడై, తాను పరిశోధనా పూర్వకంగా కనిపెట్టిన రోగచికిత్సలను, అనేక స్థలాలలో రాళ్లపై చెక్కించి ప్రచారం చేశాడు.

నాగార్జునుని ఖ్యాతి అతని తాత్విక పరిశోధనల మూలంగా అమరమైనది. బుద్ధుని తరువాత ఇతడే, సర్వాంగసుందరంగా, యుక్తి యుక్తంగా తత్త్వాన్ని బోధించిన మహానుభావుడు. ఇతడు ప్రచారం చేసినది మాధ్యమిక వాదం లేక శూన్య వాదం.

“ఈ విశ్వం కేవలం నిజం కాదు, కేవలం మిథ్యయు కాదు, ఇది అవాంతర నిత్యం. పరస్పర సంబంధం గల కొన్ని కారణాల సంయోగం వలన ఇది నడుస్తుంది. ఈ కారణాలను ఆశ్రయించి జనులు సుఖదుఃఖాలను అనుభవిస్తున్నారు. అవాంతరత్వం ఉన్న యడల, సత్యమును, నిత్యమును కేవలంగా ఉండజాలవు. ఈ అవాంతరసత్యం పోయినట్లయితే శూన్యమే ఉంటుంది. ఇది సుఖదుఃఖరహితమైనది. ఇదియే పరమ గమ్యము” అన్నది ఈ వాదం యొక్క సారాంశము. ఇది శంకరాచార్యుడి మాయావాదానికి దోహదమొనర్చింది. ఈ విధంగా శూన్యవాదాన్ని ప్రతిపాదించిన నాగార్జునుడు తాంత్రిక మార్గంలో దేవతలను ఉపాసన చేసి, సిద్ధుడై, అద్భుత శక్తులను సంపాదించాడు.

ఆచార్య నాగార్జునుడి తార్కిక ప్రతిభ నిరుపమమైనది. ఇతని తత్త్వ శక్తి అకుంఠితము, నాగార్జునుడు రచించిన బహు గ్రంథాలలో 24 మాత్రం లభించాయి. ఇవన్నీ టిబెటన్, చైనా భాషలలోకి పరివర్తింపబడ్డాయి. వీటిలో ప్రజ్ఞా పారమితాశాస్త్ర, ప్రజ్ఞామూల శాస్త్ర టీకా, ప్రజా ప్రదీప శాస్త్ర కార్తీక, మూల మాధ్యమిక శాస్త్ర, శూన్య సిపాధి, మధ్యాంతానుగమశాస్త్ర, దశభూమి విభాసశాస్త్ర, ద్వాదశ నికాయ శాస్త్ర, వివాద సమాన శాస్త్ర, ప్రమాణ వివేచన, ఉపాస కౌశల్య హృదయ శాస్త్ర, విగ్రహవ్యావర్తినీ కారికా అన్నవి ముఖ్యమైనవి.

ఇవి కాక, ఈ ఆచార్యుడు సుహృల్లేఖ అన్న ఒక లేఖను రచించాడు. అది అతడు మిత్రుడైన శాతావాహనరాజుకు వ్రాసిన ఉత్తరం. క్రీస్తు శకం 7వ శతాబ్దంలో మనదేశానికి వచ్చిన ఇత్సింగ్ అన్న చైనా యాత్రికుడు, ఆ కాలంలో ఆ బాల వృద్ధులు ఈ లేఖను కంఠస్థం చేసేవారని వ్రాశాడు.

ఆచార్య నాగార్జునుని మరణం గురించి రెండు రకాలైన వివరాలు తెలుస్తున్నాయి. కాయ కల్పరసాయనాన్ని సేవించి ఇతడూ, శాతవాహనరాజు దీర్ఘజీవులుగా ఉండిపోయారట. ఎప్పటికి రాజు మరణించకపోవడంతో, ప్రాణాలు విసిగి, యువరాజు నాగార్జునుని దగ్గరికి వెళ్లి అతని తలను కోసి ఇమ్మని యాచించాడు. ఆచార్యుడు ఒ గడ్డిపరకలో తన శిరస్సును ఉత్తరించి ఇచ్చాడు. ఇది కల్పితమైన గాథ, మరియొక ఆధారం ప్రకారం, 60 సంవత్సరాలు దాటిన పిమ్మట ఆచార్యుడు ఒకనాడు సమాధి నుండి ధర్మ వచనాలను మాత్రమే విన్నాడట. మరునాడు అతడు సుఖావతిలో ప్రవేశించాడు. అతడు ఎప్పటికి బయటకు రాకపోవడం చేత, శిష్యులు తలుపులు పగులగొట్టిలోనికి ప్రవేశించారు. అప్పుడతని మృత దేహం వారికి కనిపించింది. ఈ వార్త తెలిసిన వెంటనే అన్ని దేశాలలోను అతనికి అతని ఆలయాలను నిర్మించి, అతనిని బోధిసత్వునిగా పరిగణించారు. బహుశా ఇది నిజం కావచ్చు.

ఈ ఆచార్య శిరోమణి క్రీస్తు శకం రెండవ శతాబ్దంలో వర్థిల్లినట్లు స్థూలంగా నిర్ణయించివచ్చు. చైనా టిబెట్ దేశాలలోని గ్రంథాలను బట్టి ఇతడు కనిష్కుడి సమకాలికుడని తెలుస్తున్నది. కనిష్కుడి ఆస్థానంలో బుద్ధఘోషుడు ప్రధానాలంకారంగా ఉన్న బౌద్ధచార్యుడు. గురుపరంపరలో నాగర్జునుడు అశ్వఘోషడుకి ప్రశిష్యుడు. నాగార్జునుని గ్రంథాలలో అశ్వఘోష కనిష్కుల ప్రశంస ఉంది. మహావంశమన్న సింహళ బద్ధ గ్రంథం, 3వ శతాబ్దం నాటి తిస్సుడన్న ఆ దేశపు రాజుకు, నాగార్జునుని శిష్యుడైన ఆర్యదేవుడు జయప్రభుని శిష్యుడని పేర్కొన్నది. ఈ ఆచార్యుని ప్రజ్ఞా మూల శాస్త్రమును, క్రీస్తు శకం 196-261 మధ్య జీవించిన హ్యూయన్‌సాంగ్ చైనా భాషలోకి అనువదించెనని తెలుస్తున్నది. దీనిని బట్టి నాగార్జునుడు క్రీస్తు శకం 196కు ముందు మరణించెనని ఊహించవచ్చు. ఒక గాథలో ఈ ఆచార్యుడు కనిష్కుని కాలం బౌద్ధ సంగీతి జరిగిన సంవత్సరములో జన్మించినట్లు ఉంది. ఆ సమావేశం క్రీస్తు శకం 130వ సంవత్సరంలో జరిగి ఉండును. ఆధునికులలో హుక్ మన్ ఇతడు 150-200 వాడని, బీన్ క్రీస్తు శకం 166-200 వాడని, లక్ష్మణరావు 137-194 వాడని నిర్ణయించారు. లక్ష్మణరావు కాల నిర్ణయం సరియైనదని అనిపిస్తుంది.

ఆచార్య నాగార్జునుడు తాను మహా విద్వాంసుడవడమే కాకుండా, దిగ్ధంతుల వంటి శిష్యులను తయారు చేశాడు. అట్టివారిలో ఆర్య దేవుడు అగ్రగణ్యుడు. ఇతనికి దేవ, కానదేవ, నేల నేత్ర అన్న పేర్లు ఉండేవి. ఇతడు 15వ బౌద్ధ గురువు. మహాయాన రహస్య వేదియైన ఇతడు చోళ, కోసల, మగధ దేశాలలో చాల తాత్త్విక వాదాలను ఒనర్చాడు. అంధ కవింద సుత్తాంతం అంటే ఇతనికి ఎక్కువ అభిమానం. ఇతడు తన శతశాస్త్ర మన్న గ్రంథాలలో, సాంఖ్యవైశాసికాలను, చిత్త విశుద్ధి ప్రకరణంలో గంగాస్నానాది విశ్వాసాలను ఖండించాడు. ఇతడు పరమత సహనం లేనివాడు. ఒక శత్రువు అతనిని హత్య చేశాడు. అతని తరువాత పేర్కొన దగిన నాగార్జునుని శిష్యుడు భావ వివేకుడు. ఇతడు ఆంధ్రుడు ధాన్యకటకానికి నైరుతి దిక్కున ఒక కొండ గుహలో ఏకాంతంగా నివసించేవాడు. మహాయాన ముక్తాహస్త శాస్త్రం, ప్రజ్ఞాలంవశాస్త్రం. సాంఖ్యతర్క జ్వాల అన్నని ఇతని గ్రంథాలు. వీళ్ళిద్దరూ కాకుండా నంద, నాగో అను మరిద్దరు శిష్యులు కూడా ఉండేవారు.

నాగార్జునుడి సమకాలీనుడైన శాతవాహనరాజు ఎవరు?

ఇది వివాదాస్పదమైన అంశం. కొందరు ఇతడు వాసిస్టీపుత్రపులోమావి అంటారు. మరికొందరు ఇతడు గౌతమీపుత్ర యజ్ఞ శ్రీ అంటారు. పులోమావి కాలానికి నాగార్జునుడు జన్మించాడా అన్న సందేహం, కలుగుతుంది. అందుచేత యజ్ఞ శ్రీ అంటారు. పులోమావి కాలానికి నాగార్జునుడు జన్మించాడా అన్న సందేహం, కలుగుతుంది. అందుచేత యజ్ఞశ్రీకే అతడు సమకాలీనుడని చెప్పవచ్చును. రాజుకి, ఈ ఆచార్యునికి గాఢమైన మైత్రి ఉండేది. అమరావతీ మహా చైత్యం, దాని చుట్టూ ఉండిన ప్రాకారం చాల శోభను కలిగించింది. ఈ ప్రాకారం చాల చలువ రాతి స్తంభాలతోను, పలకలతోను నిర్మించబడింది. ఈ స్తంభాల మీదను, పలకల మీద లోపలివైపునకు మనోహరాలైన శిల్పాలు ఉన్నాయి. ఈ శిల్పాలు క్రీస్తుశకం 2,3 శతాబ్దాలనాటివని పండితులు నిర్ణయించారు. ఈ ప్రకారం నాగార్జునుడే కట్టించాడని ఒక గాథ ఉంది.

నాగార్జునుడు రూపకల్పన చేసిన మాధ్యమిక వాదం అనేక దేశాలకు వ్యాపించింది. ఎందరో భారతీయ బౌద్దపండితులు ఈ ఆచార్యుని గ్రంథాలు చదువుకొని, ప్రాచ్యదేశాలకు వెళ్లి, మాధ్యమిక, శూన్యవాదాలను ప్రచారం చేశారు.

ప్రసాద్ కొంచెం సేపు ప్రసంగాన్ని ఆపారు.

“టిబెట్ పండితుడైన తారానాథుడు కూడ ఆచార్య నాగార్జునుని గురించి చెప్పాడు”.

ఆచార్య నాగార్జునుని మహాయానం బోధించే గురువులు అయిదు వందల మంది నలందాలో ఉండేవాళ్లు. తన స్వర్ణయోగ ప్రభావంతో అతడు చాల సంవత్సరాలు వాళ్లను పోషించాడు. తరువాత వాళ్లను దేవి చండిక పోషణలోకి మార్చాడు.

ఒకేసారి ఆ దేవత అతనిని ఆకాశంలోంచి స్వర్గలోకానికి తీసుకుపోతానంది. అతడన్నాడు. “నాకు స్వర్గానికి పోవాలన్న కోరికలేదు – ధర్మం ఉన్నంతకాలం ఈ మహాయాన సంఘాలను పోషించ వలసినదని కోరుతున్నాను”.

ఆమె నలందా విహారంలో పశ్చిమం వేపు వైశ్య మహిల ఆకారంలో స్థిరపడింది. మంజుశ్రీ ఆలయం యొక్క పెద్దరాతి గోడమీద, ఆచార్యుడు ఖడీరవృక్షం యొక్క కొయ్యను కొటాడు. అది చాల పెద్దది. ఒక మనిషిదానిని మోసుకు పోలేడు.

“ఎంతకాలం ఈ ఖడీర వృక్షం యొక్క కొయ్య నిలుస్తుందో, అంతకాలం నువ్వు ఈ సంఘాలను పోషించాలి. కొయ్య, మట్టిలో కలియనంతకాలం నువ్వే పోషణ కొనసాగించాలి”.

ఆ దేవత పన్నెండు సంవత్సరాల వరకు సంఘాలకు కావలసినవన్నీ సమకూర్చింది. కాని, ఒక కుటిల శ్రమణుడు ఆమెను మాటికి వాంఛించాడు. ఆమె జవాబు చెప్పలేదు. చివరకు ఒకసారి ఆమె అతనితో అంది – “ఈ ఖడీరవృక్షపు కొయ్య ధూళిలో కలిసినశించి పోయిన తరువాత మనం కలుసుకుందాం.” దుర్మార్గుడైన ఆ శ్రమణుడు, ఆ కొయ్యను తగులబెట్టాడు. అది కాలి బూడిద అయింది అయితేనేం ఆ దేవత మాయమయింది.

నాగార్జునుడు శ్రీ ధాన్యకటకం చైత్యానికి ప్రాకారం కట్టించాడు. ధ్యానించడం, ఆలయాలను నిర్మించడం, సంఘాలను పోషించడం, ఇతరుల క్షేమానికి పాటుపడడం, ఆర్థికుల నోళ్లు మాయించడం వంటి పనులు చేశాడు. మహాయాన వ్యాప్తికి అతడు ఎనలేని కృషి చేశాడు.

ప్రసాద్ ప్రసంగం ముగిసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here