శ్రీపర్వతం-24

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 24వ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]పుడు అతనికొక ఆలోచన కలిగింది:

“కులపుత్రులు, ఈ బోధనకు, మతానికి చెందినవారు, చలి వలన బాధను పొందితే, చలికి భయపడితే, వారు మూడు దుస్తులు వేసుకోవచ్చు. ఈ విధంగా భిక్షువుల దుస్తులను మూడింటికి పరిమితం చేస్తే బాగుంటుంది.”

తరువాత బుద్ధుడు భిక్షువులకొక మతపరమైన ఉపన్యాసమిచ్చి వారితో ఈ విధంగా అన్నాడు:

“నేను మహామార్గంలో పోతుండగా నాకొక ఆలోచన కలిగింది. నేను మీకు మూడు దుస్తులను ధరించడానికి అనుమతిస్తున్నాను. రెండు చోట్లు చిరిగిన కటి వస్త్రం, ఒక చుట్టు తిరిగిన పైన ధరించే దుస్తు, ఒక చుట్టు తిరిగే కింద ధరించే దుస్తు – ఈ మూడు దుస్తులకు మిమ్మల్ని పరిమితం చేస్తున్నాను.”

కటి వస్త్రాన్ని సంఘటి అంటారు. దానిని మొల చుట్టూ చుట్టుకుంటారు. ముందుకు వెనకకు చుట్టుకుంటారు. మేఖల దాని పైన కట్టుకుంటారు. కింది భాగంలో ధరించేదానిని అంతరవాసకము అంటారు. దీనిని నడుమునుండి మణమల కింద వరకు కట్టుకుని అంచు దోపుకుంటారు. పైన ధరించే దుస్తును ఉత్తరా సంఘం అన్నదానిని, నడుము నుండి చీల మండల వరకు చుట్టుకొని, తరువాత కొంగును వీపు మీద నుండి, కుడి పిరదు మద నుండి ఎడమభుజం మీద నుండి ముందుకు వ్రేలాడడం కాని, లేక మరల కుడి భుజం చుట్టూ తిరిగి వీపు మీద వేలాడేటట్లు ధరిస్తారు.

ఉదకశాటిని శ్రమణులు, భిక్షువులు ధరిస్తారు. దీనిని స్నానం చేసినప్పుడు ఉపయోగిస్తారు. భిక్షువులు ధరించేది చిన్నదిగా ఉంటుంది.

మూడు బట్టలకన్న హెచ్చుగా మరో మూడు ఉంచుకోకూడదని బుద్ధుడు శాసించాడు.

ఒకసారి మూడు దుస్తులు ఆనందుడికి లభించాయి. బుద్ధుడి ఆజ్ఞ ప్రకారం ఈ దుస్తులను ఆనందుడు ధరించడానికి వీలు లేదు. సారిపుత్తుడికి వాటిని ఇవ్వాలనుకున్నాడు. ఆ సమయానికి సారిపుత్తుడు అక్కడ లేడు. మరో తొమ్మిది రోజుల తరువాత అతడు వస్తాడు. ఆనందుడు ఆ విషయం బుద్దుడితో చెప్తే, పదిరోజుల వరకు వాటిని ఆనందుడు తనతో ఉంచుకోవచ్చని భగవానుడు చెప్పాడు.

భిక్షువులకు అధికంగా బట్టలు దొరకేవి. వాటిని బట్టలు లేనట్టి భిక్షువులకిమ్మని బుద్ధుడు చెప్పాడు.

ఒకప్పుడు, వైశాలి నుండి వారణాసికి బుద్ధుడు చేరుకొని మృగదాయంలో ఆశ్రమంలో బస చేశాడు. అక్కడ ఒక భిక్షువు యొక్క అంతరవాసకం చిరిగిపోతే, ఆ భిక్షువు దానికి మూసిక వేసి కుట్టాడు. దానిని బుద్ధుడు ఆమోదించాడు.

కొత్తది, లేక రమారమి కొత్తది అయిన సంఘాతిని రెండు మడతలతోను, అంతరవాసకన్నా, ఉత్తరాసంఘాన్ని ఒక్కొక్క దానిని ధరించవచ్చని, చాలా కాలం ధరించితే నాలుగు మడతల సంఘాతిని, రెండు మడతల అంతరవాసకాన్ని, రెండు మడతల ఉత్తరాసంఘాన్ని ధరించవచ్చని బుద్ధుడు ఆదేశించాడు. పెంట కుప్పలనుండో, శ్మశానాల నుండో చింకి బట్టలను ఏరి తెచ్చుకోమన్నాడు. దుకాణాల నుంచి కత్తిరించిన పీలికలను తెచ్చుకోమన్నాడు.

వారణాసిలో తాను కోరినంతకాలం ఉన్న తరువాత బుద్ధుడు శ్రావస్తికి ప్రయాణమయాడు. అక్కడికి చేరిన తరువాత జేతవనంలో ఆనాధపిండకుడి ఆరామంలో నివసించాడు. మిగారుడి తల్లి అయిన విశాఖ బుద్దుడిని దర్శించింది. బుద్ధుడు ఆమెకు ధర్మోపన్యాసం చేశాడు. అప్పుడామె అతనితో అంది:

“ప్రభువా! రేపటి భోజనం మీరు, భిక్షు సంఘం, నేను వండినని భుజించవలసిందని కోరుతున్నాను.”

భగవానుడు మౌనంగా ఆ కోరికను అంగీకరించాడు.

ఆ సమయంలో, రాత్రి చాలా వరకు గడచిన తరువాత, గొప్ప గాలి వాన నాలుగు ద్వీపాలలోను చెలరేగింది. అపుడు బుద్ధుడు భిక్షువులతో అన్నాడు:

“జేతవనంలో వర్షం కురుస్తుంది. ఆ విధంగా ప్రపంచమంతా కురుస్తున్నది. ఓ భిక్షువులారా! ప్రపంచమంతటిలోను వర్షం కురియడానికి ఇదే ఆఖరుసారి. ఈ గొప్ప గాలి వానలో మీరందరు స్నానం చేయవలసింది”.

భిక్షువులు అందుకు సమ్మతించారు. దుస్తులన్నీ విడిచి, వారందరూ వర్షంలో స్నానమాడారు.

మిగారుడి తల్లి, విశాఖ, మదురమైన భోజనం, గట్టిది, మృదుమైనది. రెండూ సిద్ధం చేసి, బానిస పిల్లను ఆజ్ఞాపించింది:

“నువ్వు ఆరామానికి వెళ్ళు. వేళ ఎంతయిందో వారికి చెప్పు. అయ్యలారా! సమయమయింది. భోజనం సిద్ధంగా ఉంది.”

బానిస పిల్ల ఆరామానికి పోయింది. అక్కడ, ఆమె, దుస్తులన్నీ విడిచి వానలో తుడుస్తున్న భిక్షువులను చూసింది, వారిని చూసి ఆమె అనుకుంది

“వీళ్ళు ఆరామంలోని భిక్షువులు కారు. వీళ్ళు దిగంబర సన్యాసులు. వర్షంలో స్నానం చేస్తున్నారు.”

ఆమె వెళ్ళి ఈ సంగతి విశాఖకు చెప్పింది.

మెగారుడి తల్లి విశాఖ విద్యావంతురాలు. అనుభవం కలది, తెలివితేటలుకలది. “పూజనీయులు వర్షంలో స్నానం చేయడానికి దుస్తులు విడిచి పెట్టి ఉంటారు. ఈ తెలివితక్కువ పిల్ల ఆరామంలో భిక్షువులు లేరని, దిగంబర సన్యాసులు వర్షంలో స్నానం చేస్తున్నారని భావించింది.”

ఆమె మళ్ళా బానిస పిల్లను పంపించింది.

అప్పుడు ప్రతి ఒక్క భిక్షువు స్నానం పూర్తిచేసి, దుస్తులు ధరించి, తమ తమ గదులలోకి వెళ్ళిపోయారు. ఆరామంలో ఎవరూ కనిపించలేదు. బానిస పిల్ల ఈ సంగతి విశాఖతో చెప్పింది.

బుద్ధిమంతురాలైన విశాఖ ఈ విషయం ఊహించుకుంది. మళ్ళా బానిస పిల్లను ఆరామానికి పంపి భోజనం సిద్ధంగా ఉన్నదని ప్రకటించమంది.

భగవానుడు భిక్షువులతో అన్నాడు: “ఓ భిక్షువులారా! భిక్ష పాత్రలను తీసుకొని అంగీలు ధరించి సిద్ధంగా ఉండండి. భోజనసమయం సంప్రాప్తమయింది.”

భిక్షువులు తయారయారు. బుద్ధుడు అంతరవాసకాన్ని ధరించి, భిక్షపాత్రను గైకొని, అంగీ పైన వేసుకొని, తృటికాలంలో, విశాఖ ఉన్న భవనం చేరుకున్నాడు. భగవానుడు తన కోసం వేసిన ఆసనం మీద కూర్చున్నాడు. అతని తరువాత భిక్షు సంఘం కూర్చుంది.

అపుడు విశాఖ అంది:

“తథాగతుల శక్తి సామర్థ్యాలు ఆశ్చర్యకరమైనవి, ఊహకు అతీతమైనవి. వరదలు మోకాలిబంటి ప్రవహిస్తున్నా, నడుము వరకు ప్రవహిస్తున్నా ఒక్క భిక్షువు పాదాలు కూడా తడియ లేదు, వేసుకున్న అంగీలు తడియలేదు”.

ఆమె సంతోషించి, హృదయంలో ప్రశంసించి, స్వయంగా బుద్ధుడికి, అతని భిక్షు సంఘానికి మధుర భక్ష్యాలు వడ్డించింది. బద్దుడు భోజనం ముగించి చేతులు. భిక్షుపాత్ర కడుక్కొన్న తరువాత, ఆమె భగవానుడితో ఇలా పలికింది:

“భగవానుడిని నేనొక ఎనిమిది వరాలు కోరుకుంటాను.”

“వరాలేవో తెలుసుకోకుండా తథాగతులు ప్రసాదించరు.”

“నేనడిగే ఆ వరాలు సవ్యమైనవి, అవి అభ్యంతరకమైనవి కాను.”

“అయితే చెప్పు విశాఖ.”

“ఓ ప్రభువా! నా జీవిత పర్యంతం, వర్షాకాలం కోసం, భిక్షు సంఘానికి దుస్తులను సమకూర్చుతాను. వచ్చే భిక్షువులకు ఆహారం సమర్పిస్తాను. వెళ్ళిపోయే భిక్షువులకు ఆహారం ఇస్తాను. రోగులకు భోజనం పెడతాను. రోగులను చూచుకునేవారికి భోజనం పెడతాను. రోగులకు ఔషధాలు ఇస్తాను. నిరంతరంగా గంజిని సమకూర్చుతాను. భిక్షుణులకు స్నానానికి అవసరమైన బట్టలను సమకూర్చుతాను.”

“ఏ పరిస్థితి పురస్కరించుకొని, ఓ విశాఖ, తథాగతిని ఈ వరాలు కోరుతున్నావు?”

“ఓ ప్రభువా! నా బానిస పిల్లను, భోజనం సిద్ధంగా ఉందని, భిక్షువులను రమ్మని చెప్పమని పంపించాను. ఆమెకు అక్కడ వస్త్రాలు విడిచి పెట్టిన దిగంబర సన్యాసులు కనిపించారని చెప్పింది. ప్రభువా! నగ్నత్వం అపవిత్రమైనది, అసహ్యమైనది, ఇటువంటి పరిస్థితిని నా దృష్టిలో ఉంచుకొని, నా జీవిత పర్యంతం వర్షాకాలానికి సరిపడిన దుస్తులను సంఘానికి ఇవ్వాలని సంకల్పించాను.”

“ప్రభువా! సంఘానికి వచ్చే భిక్షువు సరియైన దారిలో రాలేక, ఎక్కడ భిక్ష దొరుకుతుందో తెలియక ఇబ్బంది పడతాడు. నేను కాని అటువంటి వారికి భిక్షనిస్తే, చోటు తెలిసిన భిక్షువు తిన్నగా ఇక్కడికే వస్తాడు. ఈ పరిస్థితి దృష్టిలో ఉంచుకొని, సంఘానికి నా జీవిత పర్యంతం, రాబోయే భిక్షువులకు ఆహారం ఇవ్వడానికి నేను సంకల్పించాను.”

“ప్రభువా! బైటికి పోయే భిక్షువు, భిక్ష కోసం వెతుక్కుంటే, తాను పోవలసిన చోటికి వెళ్ళవలసిన బిడారం చేరుకోడానికి వీలుపడక ఉండిపోతాడు. నేను కాని అటువంటి భిక్షువుకు ఆహారం సమకూర్చితే, అతను సకాలంలో బిడారంతో వెళ్ళగలడు. ఈ స్థితిని నా దృష్టిలో ఉంచుకొని నా జీవిత పర్యంతం వెళ్ళే భిక్షువులకు ఆహారం సమకూర్చడానికి నిశ్చయించాను.”

“ప్రభువా! రోగంతో బాధపడుతున్న భిక్షువుకు సరియైన ఆహారం లభించకపోతే అతని రోగం హెచ్చుతుంది. రోగులకు యోగ్యమైన ఆహారం నేను సమకూర్చితే, అతని రోగం హెచ్చదు. లేకపోతే అతడు చనిపోతాడు. ఈ పరిస్థితిని దృష్టిలో ఉంచుకొని, సంఘానికి నా జీవిత పర్యంతం సేవచేయు సంకల్పించాను.”

“ప్రభువా! రోగియైన భిక్షువును చూస్తున్న అతడు, రోగికి ఆహారం తెచ్చి ఇచ్చేసరికి చాలా వేళ గడుస్తుంది. అతడు తన భోజనం సమకూర్చుకునే అవకాశం లభించదు. నేను కాని ఇటువంటి భిక్షువుకి భోజనం సమకూర్చుకునే అవకాశం లభించదు. నేను కాని ఇటువంటి భిక్షువుకి భోజనం సమకూర్చితే, అతను తన భోజనం మానుకోవలసిన అవసరముండదు. ఇది నా దృష్టిలో ఉంచుకొని, నా జీవిత పర్యంతం ఇటువంటి సేవకు నిశ్చయించాను.”

“ప్రభువా! రోగంతో ఉన్న భిక్షువునకు సరియైన ఔషధాలు లభించకపోతే, అతని రోగం హెచ్చుతుంది. లేక అతడు చనిపోవచ్చు. నేను సమకూర్చిన ఔషధాలు అతడు సేవిస్తే అతని రోగం హెచ్చదు, అతడు చనిపోవడు. ఈ పరిస్థితిని నేను దృష్టిలో ఉంచుకొని, సంఘానికి నా జీవిత పర్యంతం సేవ చేయడానికి నిశ్చయించాను.”

“ప్రభువా! భగవానులు అంధకవిందంలో ఉన్నప్పుడు గంజి యొక్క ప్రయోజనాల గురించి వివరించారు. ఆ ప్రయోజనాలను నేను దృష్టిలో ఉంచుకొని నా జీవిత పర్యంతం సంఘానికి నిరంతరంగా గంజిని సమకూర్చడానికి నిశ్చయించాను.”

“ప్రభువా! అచిరావతి నదిలో భిక్షుణులు గణికలతో కలసి ఒక పావంచా మీద, నగ్నంగా స్నానం చేసేవారు. గణికలు భిక్షుణులను చూసి ఎగతాళి చేసేవారు. ‘ఓ మహిళలారా! మీరు వయసులో ఉండగా బ్రహ్మచర్యాన్ని పాటించడంలో అర్థం లేదు. ఇంద్రియ భోగాలు అనుభవించవలసినవి కదా. వయసు మళ్ళిన తరువాత బ్రహ్మచర్యాన్ని పాటించండి. ఆ విధంగా రెండు విధాలుగా మీరు సుఖాన్ని పొందుతారు. అప్పుడు భిక్షుణులు కలవరపడ్డారు. ప్రభువా! స్త్రీకి నగ్నత్వం అపవిత్రమైనది, ఏవగింపు కలిగిస్తుంది, అసహ్యకరమైనది. నేను ఈ సంగతిని దృష్టిలో ఉంచుకొని, నా జీవిత పర్యంతం భిక్షుణులకు స్నానం చేయడానికి దుస్తులను సమకూర్చడానికి నిశ్చయించాను”.

“ఓ విశాఖా! తథాగతుని నుండి ఈ ఎనిమిది వరాలు కోరడం వలన నీకేమి ప్రయోజనం చేకూరుతుంది?” బుద్ధుడు అడిగాడు.

ఆమె ఇట్లు జవాబు చెప్పింది:

“ఓ ప్రభువా! వేరు వేరు చోట్ల వర్షాకాలం గడిపిన భిక్షువులు భగవానుని చూడడానికి వస్తారు. వారు భగవానుని అడుగుతారు. ‘ప్రభూ! ఇటువంటి అటువంటి భిక్షువు చనిపోయాడు. అతడు ఎక్కడ పునర్జన్మ పొందుతాడు? అతని భవితవ్యం ఎలా ఉంటుంది? అపుడు భగవానుడు, చనిపోయిన భిక్షువు సంఘంలో చేరడం వలన కలిగే ఫలితాలను అనుభవించుతున్నాడని, లేక అతడు స్కందగా పదవికి లేక అనాగామినుల పదవికి, లేక అర్హతుని పదవికి చేరుకున్నాడని చెప్తారు. నేను వారి దగ్గరికి పోయి అడుగుతాను, ‘అయ్యలారా! ఆ సోదరుడు అంతకు పూర్వం శ్రావస్తిలో ఉన్నాడా?’ – వారు కాని అతడు శ్రావస్తిలో ఉండేవాడని చెప్తే, తప్పకుండా వర్షాకాలంలో ఉంటాడని, లేక వెళ్లిపోయే భిక్షువులకు నేనిచ్చే ఆహారం గ్రహించి ఉంటాడని, లేక, రోగులకిచ్చే ఆహారం తీసుకొని ఉంటాడని, లేక రోగుల సేవ చేసేవారికి నేనిచ్చే ఆహారం తిని ఉంటాడని, రోగులకు నేనిచ్చే ఔషధాలను సేవించి ఉంటాడని,లేక నిరంతరంగా నేను సమకూర్చిన గంజిని తాగి ఉంటాడని నేనొక నిశ్చయానికి వస్తాను. ఈ విషయం నాకు జ్ఞాపకం వచ్చినప్పుడు సంతోషం నాలో కలుగుతుంది. నేనావిధంగా ఆనందిస్తే నా కాయం శాంతిని పొందుతుంది. ఆ విధమైన శాంతి కలగడం చేత పరమ సంతృప్తి కలుగుతుంది. ఆ సంతృప్తి నా హృదయంలో విశ్రాంతిని నెలకొల్పుతుంది. నా నైతికమైన భావనకు ఇది అభ్యాసమవుతుంది. నా నైతికమైన శక్తులకు అభ్యానమవుతుంది, ఏడు విధాలైన జ్ఞానాన్ని పొందడానికి అభ్యాసమవుతుంది. ఓ ప్రభువా! నిన్ను ఈ ఎనిమిది వరాలిమ్మని కోరడానికి ఇదే కారణం.”

“బాగు! బాగు! ఓ విశాఖా! తథాగతుని నుండి, ఎనిమిది వరాలను పొందడానికి ఈ ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకొని నవ్వు కోరావు”.

భగవానుడు, మిగారుని తల్లి అయిన విశాఖతో అన్నాడు:

“జీవితంలో ఋజు ప్రవర్తనకలది, తథాగతుని ఛాత్రురాలు, అయిన ఏ స్త్రీ అయినా, హృదయంలో ఆనందించి, అత్యాశను అధిగమించి, ఆహార పానీయాలను, శోకాన్ని నాశనం చేసి, పరమ సుఖాన్ని కలిగించే వాటిని బహుకరిస్తే, ఆమెకు స్వర్గలోక జీవితం లభిస్తుంది. అవినీతి, అపరిశుభ్రత లేని మార్గం మీద ఆమె ప్రవేశిస్తుంది. మంచితనానికి యత్నం చేస్తే ఆమె సుఖిస్తుంది. రోగం లేకుండా ఆమె స్వర్గలోక కాయంలో చాలాకాలం ఆనందిస్తుంది”.

భిక్షువులను, విశాఖ చెప్పిన వాటినన్నిటిని, ఆమోదించమని బుద్ధుడు చెప్పాడు.

విశాఖ ఒకసారి ఇచ్చిన బట్టను ముఖం తుడుచుకోడానికి బుద్ధుడు అంగీకరించి, భిక్షువులను అటువంటి బట్టను స్వీకరించమన్నాడు. పూజ్యుడైన ఆనందుడి స్నేహితుడు, రోగుడు అన్న మల్లుడు ఉండేవాడు. అతనికి చెందిన నారబట్ట, ఒకదానిని అతడు ఆనందుని దగ్గిర ఉంచాడు. ఆనందుడికి అటువంటిది అవసరమయింది. ఆ సంగతి భిక్షువులు బుద్ధునితో చెప్పారు.

బుద్ధుడు ఈ విధంగా వారితో అన్నాడు:

“భిక్షువులారా! మీ దగ్గిర నమ్మకంగా ఉంచిన వస్తువును మీకు ఆ వ్యక్తి ఇవ్వదలచినప్పుడు, అతనిలో ఈ అయిదు ఉత్తమ గుణాలను గుర్తించవలసింది. అతడు ఉత్తముడైనవాడు, మీతో బాగా పరిచయమైన వాడయి ఉండాలి, అందరూ అతనిని కొనియాడాలి, సజీవుడై ఉండాలి. మీరు వస్తువును తీసుకుంటే అతడు సంతుష్టుడై ఉండాలి.”

భిక్షువులకు – మూడు దుస్తులు నిత్యం ధరించడానికి, వర్షాకాలానికి సరిపడే దుస్తులు, చాప, పక్కమీద పరుచుకునే దుప్పటి, పుళ్లరసినీ తుడుచుకునే గుడ్డ, ముఖం తుడుచుకునే గుడ్డ, నీళ్లు వడకట్టుకునే గుడ్డ, సంచులకింద ఉపయోగించే గుడ్డ – ఇవి నిత్యం ఉండవలసినవి.

ఒకప్పుడొక భిక్షువు అంధకవనంలో తన ఉడువులను దాచుకొని, సంఘాతితోను, అంతరవాసకంతోను, ఒక గ్రామానికి భిక్షుకుపోయాడు. బుద్ధుడు దీనిని ఆమోదించలేదు. అతడు బట్టలు విడిచి ఉండడానికి ఈ అయిదు కారణాలు చెప్పాడు.

“ఓ భిక్షువులారా! ఈ అయిదు పరిస్థితులలోను మీకు ఉడుపును అంటే సంఘాతిని, మీరు విడువవచ్చు, రోగంతో ఉన్నప్పుడు, వర్షాకాలంలోను, నదిని ఈ గట్టునుండి ఆ గట్టుకు దాటునప్పుడు, విహారము గడియ పెట్టి తాళం వేసినప్పుడు, కఠిన అన్న వ్రతం చేస్తున్నప్పుడు సంఘాతిని విడిచి పెట్టవచ్చు – ఇటువంటి పరిస్థితులలోనే అంతరవాసకాన్ని, ఉత్తరాసంఘాన్ని విడిచి పెట్టవచ్చు.

“ఈ విధంగానే వర్షాకాలపు దుస్తుల విషయంలో, రోగంతో ఉన్నప్పుడు, సరిహద్దు దాటి ప్రయాణం చేయవలసి వచ్చినప్పుడు నదిని దాటునప్పుడు, విహారం మూసి ఉంచినప్పుడు, వర్షాకాలపు దుస్తులు తయారయి సిద్ధంగా లేనప్పుడు – వాటిని విడిచి పెట్టవచ్చు.”

“భిక్షువు మరణిస్తే, అతని దుస్తులు, భిక్షా పాత్ర సంఘానికి చెందుతాయి”.

ఒకసారి బుద్ధుడున్న చోటికి ఒక భిక్షువు దిగంబరంగా వచ్చాడు. అతడన్నాడు.

“ప్రభువు, భగవానుడు, పనులలోను, మాటలలోను మిత స్వభావం కలిగినవాడు, సంతృప్తి చెందినవాడు, దుష్టత్వాన్ని నాశనం చేసేవాడు, కామవాంఛలను దులుపుకున్నవాడు, ఆశ్రిత రక్షణ శీలం కలవాడు, పూజ్యభావం కలవాడు, చురుకైనవాడు, ఇటువంటివాడిని చాల విధాలుగా ప్రశంసించాడు. ఈ దిగంబరత్వం చాల విధాలుగా మిత స్వభావానికి సంతృప్తికి చాల వరకు దారి తీస్తుంది. దుష్టత్వాన్ని నాశనం చేస్తుంది – కామవాంఛలను అణగదొక్కుతుంది, దయాళువుగా ఉండడానికి ఉపయోగిస్తుంది. పూజ్యభావాన్ని పెంపొందింపజేస్తుంది, నిరంతరప్రయత్నానికి అనుకూలిస్తుంది. ఈ స్థితిని భగవానుడు ఆమోదించి నట్లయితే, దిగంబరత్వాన్ని అందరు భిక్షువులకు నిర్దేశించవలసింది.”

బుద్ధుడు అభిక్షువును మందలించి అన్నాడు:

“ఓ మూర్ఖుడా! ఈ పని కుటిలమైనది, యుక్తమైనదికాదు, శ్రమణుడు చేయవలసినది కాదు, ఉచితమైనదికాదు, దీనిని ఆచరించకూడదు, తీర్థీయులు చేసినట్లు ఓ మూర్ఖుడా, దిగంబరత్వాన్ని నువ్వెట్లు ఆమోదిస్తావు? సాధారణ జనులను మతంలోకి మార్చడానికి ఇది అనుకూలించదు.”

తరువాత బుద్ధుడు భిక్షువులకు దిగంబరత్వం నిరాకరించాడు. ఆ విధంగానే దర్భలతో చేసిన దుస్తులను. చెట్టు బెరడతో చేసినవాటిని, ఆకులతో చేసినవాటిని, వెంట్రుకలతో చేసిన వాటిని, అడవి మృగం చర్మంతో చేసినవాటిని, గుడ్లగూబ ఈకలతో చేసినవాటిని, లేడి చర్మంతో చేసిన వాటిని గర్హించాడు.

ఆ కాలంలో ఛబ్బగ్గీయ భిక్షువులు పూర్తిగా నీలంరంగులో ఉన్నవి, తేలిక పసుపురంగులో ఉన్నవి, ముదురు ఎరుపురంగులో ఉన్నవి, గోధుమ రంగులో కలవి, నలుపురంగులోని, గోదుమరంగులో పసుపుగా ఉన్నవి లేక గాడమైన పసుపురంగులో ఉన్నవి అయిన దుస్తులను ధరించేవారు. వాటికి అనుబంధంగా చిన్నలంగావంటి దానిని వేసుకునేవారు. తిరితక వృక్షం యొక్క బెరడుతో చేసిన దుస్తులు ధరించేవారు. తలపాగాలు పెట్టుకునేవారు.

ప్రజలు వారి బట్టలు చూసి కోపగించుకున్నారు. గొణుగుకున్నారు, చికాకుపడ్డారు, వాళ్లన్నారు:

“ప్రపంచంలో సుఖాలకు లోనయి జీవిస్తున్నట్లు ఇది ఉంది.”

ఈ సంగతి బుద్ధుడితో వాళ్ళు చెప్పారు.

బుద్ధుడు అటువంటి రంగుటబట్టలనుకొని, చిత్రమైన దుస్తులను కాని ధరించకూడదని నిషేధించాడు.

మోహన్ ఇంత వరకు చెప్పాడు.

భిక్షువుల ఆహార విహారల గురించి స్పర్శించి విడిచి పెట్టాడు. అప్పటికే రాత్రి చాల గడిచింది.

***

మరునాడు అదే సమయానికి అతడు భిక్షుణుల గురించి చెప్పడం మొదలు పెట్టాడు.

భిక్షుణులు గురించి క్షుల్ల వర్గంలో ఉంది. భిక్షుణుల విధులేవో అందులో వివరింపబడింది.

ఆ సమయంలో పూజ్యుడైన బుద్ధుడు కపిలవస్తువులో శాక్యులతో నిగ్రోధారామంలో ఉండేవాడు. బుద్ధుడున్న చోటికి, అతనిని పెంచిన మహాప్రజాపతి గోతమి వెళ్లి, అక్కడ చేరిన తరువాత భగవానుని శిరసును నేలకు తాకగా వంచి, ఒక పక్కను నిలబడింది. అలా నిలబడి ఆమె బుద్దుడితో ఇలా అంది:

“ప్రభువా! స్త్రీలు గృహాలను పరిత్యజించి, తథాగతుడు ప్రకటించిన సిద్ధాంతానికి, క్రమశిక్షణకు లోనయి, సన్యాసం స్వీకరించడానికి మీరు అనుమతించవలసింది.”

“చాలు గోతమీ! స్త్రీలకు ఈ విధంగా సన్యాసం స్వీకరించడానికి అనుమతి లభించదని చెప్తున్నాను.”

మహా ప్రజాపతి రెండవసారి, మూడవసారి ఈ విధంగానే కోరగా బుద్ధుడు అదే విధంగా బదులు పలికాడు.

మహా ప్రజాపతి విచారించింది. బుద్ధుడికి వంగి నమస్కరించి కన్నీళ్లు కారుతుంటే అక్కడ నుండి వెళ్లిపోయింది.

కపిలవస్తు నుండి భగవానుడు వైశాలికి వెడలిపోయాడు. అక్కడ, మహావనంలో కూటాగార భవంతిలో నివాసం ఏర్పరచుకున్నాడు.

మహా ప్రజాపతి తన జుత్తు కత్తిరించుకొంది, కాషాయవస్త్రాలు ధరించింది – కొంతమంది శాక్యవంశానికి చెందిన స్త్రీలు వెంటరాగా వైశాలికి ప్రయాణం చేసింది. ఆమె వైశాలి చేరిన తరువాత మహావనం లోని కూటాగార భవంతికి వెళ్లింది. ఆమె పాదాలు పొంగి, ధూళితో నిండి పోయిన శరీరంతో, విచారంతో, ఏడుస్తూ కళ్లనీళ్లు కారుతుంటే, కూటాగారభవనం యొక్క మొగసాలలో నిలబడింది.

పూజ్యురాలైన ఆమెను చూసి ఆనందుడు అడిగాడు:

“కళ్లనీళ్లు కారుతుంటే, విచారంతో దుఃఖిస్తూ అక్కడ మొగసాల వెలుపల ఏల నిలుచున్నావు?”

“ఆనందుడా! ప్రభువు, భగవానుడు, స్త్రీలు ఇళ్లను విడిచి తాను ప్రకటించిన సిద్ధాంతానికి, క్రమశిక్షణకు లోనయి సన్యాసం స్వీకరించడానికి అనుమతించలేదు.”

అపుడు బుద్ధుడిని సమీపించి, నమస్కరించి ఒక పక్కను కూర్చొని అతనితో ఆనందుడు అన్నాడు.

“ప్రభువా! మహా ప్రజాపతి గోతమి మొగసాల వెలుపల నిలబడింది. ఆమె పాదాలు పొంగి పోయాయి – శరీరం ధూళితో నిండి పోయింది. విచారంతో ఆమె దుఃఖిస్తూ కళ్ల నీళ్లు కారుస్తూ ఉంది. భగవానుడు తాను ప్రకటించిన సిద్ధాంతానికి, క్రమశిక్షణకులోనయి, సన్యాసం స్వీకరించడానికి స్త్రీలను అనుమతించలేదని ఆమె బాధపడుతున్నది. ప్రభువా! అన్నీ బాగుంటే, స్త్రీలను అనుమతిస్తే ఆమె కోరినట్లు చేయవలసింది.”

“చాలును ఆనందా! ఆ విధంగా అనుమతించడం లేదని తెలుసుకోవలసింది.” ఆనందుడు రెండోసారి, మూడోసారి బుద్దుడిని ప్రార్థించాడు, కాని అటువంటి ప్రత్యుత్తరమే అతనికి లభించింది. ఆనందుడు మరొక విధంగా బుద్ధుడిని అడిగాడు.

“ప్రభువా! స్త్రీలు ఇళ్లు విడిచి సన్యాసం స్వీకరిస్తే, భగవానుడు చెప్పిన సిద్ధాంతానికి క్రమశిక్షణకు లోబడి ఉన్నట్లయితే, వారికి, ఆ విధంగా మారినందుకు, ఫలితం లభిస్తుందా? వారు రెండవ పథానికి, మూడవ పథానికి లేక అర్హత పదానికి అర్హులవుతారా?”

“ఆనందా! వారు వాటిని చేరుకోగలరు.”

“అయితే, ప్రభువా, స్త్రీలు వాటికి అర్హులైతే ఒక విషయం ఆలోచించ వలసింది – మహా ప్రజాపతి గౌతమి భగవానుడికి గొప్ప సేవ చేసింది. పినతల్లిగా, దాదిగా ఆమె అతనిని పెంచింది. అతనికి పాలిచ్చింది. అతని తల్లి చనిపోయిన తరువాత, తన చనుబాలు ఇచ్చింది. అన్నీ బాగుంటే, సిద్దాంతం ఇల్లు విడిచి, క్రమ శిక్షణకు లోనయి, సన్యాసం స్వీకరించడానికి ఆమెకు అనుమతిని ఇవ్వవలసింది”.

“అయితే, ఆనందా, మహా ప్రజాపతి, ఈ ఎనిమిది ముఖ్య సూత్రాలను స్వీకరిస్తే దానిని ప్రారంభోపదేశంగా పరిగణంచవచ్చు.”

“ఆ ఎనిమది ముఖ్య సూత్రాలు ఈ విధంగా ఉంటాయి:”

“భిక్షుణిగా ఆమె వంద సంవత్సరాలుగా ఉన్నా, భిక్షువును చూడగానే అతనికి నమస్కరించాలి, అతని ఎదుట లేచి నిలబడాలి, అతని ఎదుట మోకరిల్లాలి, భిక్షువు పట్ల నిర్వర్తించవలసిన విధులన్నీ, అప్పుడే ఉపదేశం పొందినట్లు గౌరవించాలి, సన్మానించాలి, విధులను పాటించాలి – ఆమె జీవిత పర్యాంతం ఈ విధంగానే నడుచుకుంటూ ఉండాలి. అతిక్రమించకూడదు.

“భిక్షుణి, భిక్షువులేని మండలంలో, వర్షాకాలంలో గడపరాదు.”

“ప్రతి పక్షంలోను భిక్షుసంఘం నుండి భిక్షుణి రెండు విషయాలను తెలుసుకోవాలి. ఉపోసదా కర్మకాండ ఏ తిథిని జరుగుతుందో తెలుసుకోవాలి. భిక్షువు ఏ విధిని వచ్చి మత ప్రభోదం చేస్తారో తెలుసుకోవాలి.”

“వర్షాకాలం గడిపిన తరువాత భిక్షుణి పవారణను పాటించాలి – పవారణ అంటే ఆమె ఏ తప్పులు చేసిందో తెలియజేయాలి – భిక్షు సంఘం ముందు ప్రకటించాలి. చూసిన సంగతులు, వినిన సంగతులు, ఏ సంగతుల గురించి సందేహిస్తుందో వాటిని తెలియజేయాలి.”

“తీవ్రమైన నేరం చేసిన భిక్షుణి మానత్తా క్రమశిక్షణకు లోనుకావాలి. భిక్షు సంఘంపట్ల, భిక్షుణీ సంఘంపట్ల ఇది జరగాలి.”

“భిక్షుణి ఏ సాకు మీదనైనా భిక్షువులను దూషించకూడదు.”

“ఇప్పటి నుంచి, భిక్షుణులు భిక్షుణులను అధికారికంగా హెచ్చరించరాదు, కాని భిక్షువులు మాత్రం భిక్షుణులను అధికారికంగా హెచ్చరించవచ్చు.”

“ఆనందా! ఈ ఎనిమిది ముఖ్య సూత్రాలను మహా ప్రజాపతి గోతమి పాటిస్తే అది ఆమె యొక్క ప్రారంభోపదేశంగా పరిగణిపంబడుతుంది.”

ఆనందుడు మహా ప్రజాపతి దగ్గరికి వెళ్లి, భగవానుడు చెప్పిన ఎనిమిది ముఖ్య సూత్రాలను తెలియజేశాడు.

“ఆనందా! పురుషుడు కాని స్త్రీకాని, యౌవనంలో, స్నానం చేసిన తరువాత, ఏ విధంగా రెండు చేతులతోను పద్మాలమాలను కాని, మల్లెల దండనుకాని, ఆతిముక్తక పుష్పాలమాలను కాని, స్వీకరించి, దానిని శిరస్సు పై ధరిస్తాడో, ధరిస్తుందో, ఆ విధంగానే నేను కూడా ఈ ఎనిమిది ముఖ్య సూత్రాలను శిరసుపై ధరిస్తాను. వీటిని ఎప్పుడూ అతిక్రమించను.”

ఆనందుడు బుద్ధుడిని సమీపించి అన్నాడు.

“ప్రభువా! మహా ప్రజాపతి గోతమి ఎనిమిది ముఖ్య సూత్రాలను శిరసావహించింది. ఆ విధంగా భగవానుని పినతల్లి ఉపసంపద అన్న ప్రారంభోపదేశాన్ని స్వీకరించింది.”

“ఆనందా! గృహస్త జీవితం విడిచి పెట్టి తథాగతుడు ప్రకటించిన సిద్ధాంతానికి, క్రమశిక్షణకులోనయి, స్త్రీలు సన్యాసం స్వీకరించకుండా ఉన్నట్లయితే, అప్పుడు స్వచ్ఛమైన మతం చాల కాలం నిలిచి ఉండేది. ఉత్తమమైన ధర్మం వేయి సంవత్సరాల వరకు దృఢంగా ఉండేది. కాని, ఆనందా, ఇప్పుడు స్త్రీలు ఆ అనుమతిని పొందినారు. కాబట్టి స్వచ్చమైన మతం చాల కాలం నిలువదు. ఉత్తమమైన ధర్మం ఐదువందల సంవత్సరాలు కట్టుదిట్టంగా నిలుస్తుంది. ఆనందా, ఏ గృహాలలో చాల మంది స్త్రీలు, కొద్దిమంది పురుషులు ఉంటారో ఆ ఇళ్లను చోరులు సులువుగా దోచుకుంటారు. ఏ సిద్ధాంతానికి, క్రమశిక్షణకి స్త్రీలు లోనయినా, గృహ జీవితాన్ని విడిచి సన్యాసం స్వీకరించినా, ఆ మతం చాల కాలం నిలువదు. బాగా పెరిగిన వరి పైరు, చెరకు పంట, ఏ విధంగా పంటను నాశనం చేసే శిలీంధ్రానికి లొంగి నాశనమవుతాయో, ఆ విధంగానే ఆ మతం కూడా చాలా కాలం నిలిచి ఉండదు. పెద్ద సరస్సులోని నీరు పైకి పోకుండా ఏ విధంగా మానవుడు గట్టుకడతాడో, ఆ విధంగానే నేను కూడా ముందే ఊహించి, భిక్షుణులకు ఈ ఎనిమిది ముఖ్య సూత్రాలను వాళ్లు జీవిత పర్యంతం అధిగమించకుండా, నిర్దేశించాను.”

తరువాత మహాప్రజాపతి తక్కిన శాక్య స్త్రీల గురించి అడిగింది. ఆమెకు బుద్ధుడు బోధించాడు – భిక్షుణులు భిక్షువుల నుండి ఉపసంపద ప్రారంభోపదేశం పొందవచ్చును.

అపుడు శాక్యస్త్రీలు మహాప్రజాపతి గోతమితో అన్నారు.

“నువ్వు ఉపసంపద ప్రారంభోపదేశం పొందలేదు, మేము కూడా పొందలేదు. భిక్షుణులు భిక్షువుల నుండి ఉపసంపదను పొందవలెనని బుద్ధుడు అంటున్నాడు.”

“ఏ క్షణాన్ని మహాప్రజాపతి గోతమి అష్టముఖ్యసూత్రాలను శిరసుపై ధరించిందో, అదే ఆమెకు ఉపసంపద ప్రారంభోపదేశం” అన్నాడు బుద్ధుడు.

తరువాత భిక్షుణుల పట్ల భిక్షువుల ప్రవర్తన గురించి బుద్ధుడు చెప్పాడు.

“ఓ భిక్షువులారా! మీరు స్త్రీలను చూసి వంగి నమస్కరించకూడదు. వారి ఎదుట లేచి గౌరవపురస్పరంగా నిలబడకూడదు. చేతులు వారివైపు జోడించకూడదు. తక్కువ స్థితిలోనివాడు పై అధికారిపట్ల పాటించవలసిన విధులను ఆచరించరాదు.”

భిక్షుణులు భిక్షువుల వలె ధర్మ సూత్రాలను నేర్చుకోవాలి. విషయాన్ని అనుసరించి నేర్చుకోవాలి. గౌతమి బుద్ధుడిని అడిగింది.

“భగవాన్! నాకు ధర్మాన్ని సంక్షిప్తంగా బోధించవలసింది. సిద్ధాంతాన్ని విన్నతరువాత నేను ఒంటరిగా, ఏకాంతంగా, శ్రద్ధతో, పట్టుదలతో, దృఢ నిశ్చయింతో ఉండడానికి వీలవుతుంది.”

“నువ్వు ఏ సిద్ధాంతాలను నమ్మినా, అవి కామానికి దారితీసి శాంతికి భంగం కలిగిస్తాయో, గర్వానికి దారితీసి ప్రగాఢభక్తిని కాదో, హెచ్చుగా కోరుకుని తక్కువకు కాదో, సంఘాన్ని ప్రేమించడానికి దారితీసి ఒంటరితనానికి కాదో, సోమరితనాన్ని ప్రేరేపించి పట్టుదలకు ఆటంకమవుతుందో, తీరని కోరికకు దారితీసి సంతృప్తికి దూరమవుతుందో వీటినన్నిటిని ఓ గోతమి, మనసులో ఉంచుకో అది ధర్మంకాదు, వినయం కాదు, అది ఆచార్యుని బోధన కాదు. వీటికి భిన్నమైన గుణాలు కలిగినవాడు అదే ధర్మం, అదే వినయం, అదే ఆచార్యుని బోధన.”

ఆ దినాలలో పాటిమోక్షం భిక్షుణులకు చెప్పలేదు. ఆ సంగతి వాళ్ళు – బుద్ధుడికి తెలిపారు.

బుద్ధుడు భిక్షువులను భిక్షుణులకు పాటిమోక్షం వినిపించమని ఆదేశించాడు. భిక్షువులు భిక్షుణులున్నచోటికి పోయి పాటిమోక్షం వినిపిస్తుంటే ప్రజలు కోపం చెందారు. “వాళ్లు తమ భార్యలైనట్లు, వాళ్లు తమ ఉంపుడు కత్తెలైనట్లు వ్యవహరిస్తున్నారు. కలిసి సుఖంగా ఉంటారు కూడా!” అని అన్నారు.

బుద్ధుడికీ సంగతి చెప్పారు. భిక్షుణులు ఉండే చోటికి పోయి పాటిమోక్షం చదవకూడదన్నాడు. భిక్షుణులకు పాటిమోక్షం భిక్షువులను వాళ్లకు నేర్పమని బుద్ధుడు ఆదేశించాడు.

ఆ కాలంలో భిక్షుణులు తాము చేసిన తప్పులను ఒప్పుకొనడం చేసేవాళ్ళు కాదు. ఆ విధంగా తప్పులు ఒప్పుకోకపోడం దుఃఖకారణమని బుద్ధుడన్నాడు కాని, వాళ్లకు ఏ విధంగా తమ తప్పులు ఒప్పుకోడమో తెలియదు. బుద్ధుడు భిక్షువులతో వాళ్ళకు తప్పులను ఒప్పుకోడం చెప్పమన్నాడు, మరి వాళ్లు తమ తప్పులను భిక్షువులకు నివేదించమన్నాడు.

ఆదినాలల్లో భిక్షువును మార్గంలో చూసినా, లేక ఒక చివర మూయబడిన వీధిలో చూసినా, నాలుగు దారులు కలిసే కూడలిలో చూసినా, భిక్షుణులు భిక్షాపాత్రను నేల మీద ఉంచి, దుస్తులను బుజం మీద సరిచేసుకొని, మణమల మీదకు వంగి, చేతులు జోడించి చాపి, తమ తప్పును తెలియజేసుకునేవారు. ఇది చూసిన ప్రజలు గర్హించారు. బుద్ధుడు భిక్షుణులను భిక్షుణులకే తప్పులు నివేదించమని ఆదేశించాడు. ఏ విధంగా భిక్షుణులు వాటిని స్వీకరించడమో తెలియజేయమని భిక్షువులను బుద్ధుడు ఆదేశించాడు.

ఆ దినాలలో భిక్షుణుల పట్ల క్రమశిక్షణా కర్మాలను అమలు పరచేవారు కారు. వాటిని అమలు పరచమని బుద్ధుడు భిక్షువులకు చెప్పాడు.

భిక్షుణులు మార్గమధ్యంలో దారుల కూడలిలో, ఒకవైపున కప్పిన వీథిలో భిక్షువు కనపడగనే, దుస్తులను సవరించుకొని, భిక్షాపాత్ర నేల నుంచి, మోకాళ్ల మీద కూర్చొని, చేతులు జోడించి, అది సరియైన వేళగా భావించి, క్షమాపణ వేడుకునేవారు. ప్రజలు ఇది చూసి గర్షించారు. బుద్ధుడు క్రమశిక్షణా కర్మలను, వాటి చర్యలను భిక్షుణులకే భిక్షుణులు నివేదించాలని ఆదేశించాడు.

ఆ కాలంలో భిక్షుణి సంఘంలోని భిక్షుణులు, ఒకరితో ఒకరు కలహించి తగువులాటలాడి ఒకరినొకరు కొట్టుకొని విభేదాలు తీర్చుకోలేక పోయేవారు. బుద్ధుడు భిక్షువులను ఆ తగవులు తీర్చమన్నాడు.

ఉత్సలవర్ణ అన్న భిక్షుణి శిష్యురాలు, బుద్దుడిని అనుసరించి ఏడు సంవత్సరాలు గడిపింది. కాని ఆమె బుద్ధుడు చెప్పిన విషయాన్ని మరచి పోయేది. భిక్షువులను వినయాన్ని భిక్షుణులకు నేర్పమని బుద్ధుడు ఆదేశించాడు.

బుద్ధుడు వైశాలి నుండి శ్రావస్తి వెళ్లాడు. జేతవనంలో అనాధపిండకుడి వనంలో బసచేశాడు.

ఆ సమయంలో చబ్బగ్గీయ భిక్షువులు కుళ్లునీళ్లను భిక్షుణుల మీద జల్లేవారు. ఆ విధంగా భిక్షుణులు తమను ప్రేమిస్తారని వాళ్లు భావించారు. భిక్షువులు అటువంటి పని చేయకూడాదని బుద్ధుడు నిషేధించాడు. ఆ విధంగా ప్రవర్తించినట్లయితే భిక్షుణీ సంఘం అతనికి నమస్కరించ కూడదు.

ఆ కాలంలో ఛబ్బగ్గీయ భిక్షువులు, తమ శరీరాల నుండి గాని, తొడల మీదగాని, రహస్యమైన అంగాల మీదకాని దుస్తులు తొలగించి భిక్షుణులకు వాటిని చూపించేవారు. లేకపోతే పోకిరీ కబురులు చెప్పేవారు. లేకపోతే వారితో తిరిగేవారు. భిక్షుణులు తమని ప్రేమిస్తారని వాళ్లు భావించేవారు. ఈ సంగతి బుద్ధుడికి ఇతర భిక్షువులు నివేదించారు. భిక్షుణుల పట్ల ఆ విధంగా ప్రవర్తించకూడదని నిషేధించాడు. భిక్షుణీ సంఘం అట్టి భిక్షువుకు నమస్కరించరాదని ప్రకటించాడు.

ఛబ్బగ్గీయ భిక్షుణులలో ఎవరేనా ఆ విధంగా ప్రవర్తిస్తే ఆమెను విహారంలోకి రాకుండా బహిష్కరించమన్నాడు.

కాని వాళ్ళు దానిని అంగీకరించలేదు. అపుడు బుద్ధుడు వాళ్లకి మత ప్రబోధం చేయవద్దని అన్నాడు.

ఆ విధంగా బహిష్కరింపబడిన భిక్షుణికి ఉపోసధ అనుగ్రహించడం న్యాయమా అని భిక్షువులు బుద్ధుడిని అడిగారు. ఆమెపై విచారణ పూర్తయే వరకు ఉపోసధను అనుగ్రహించ కూడదని అతడు అన్నాడు.

ఆ సమయంలో పూజ్యుడైన ఉదాయి అన్నభిక్షువు కొంతమందిని నిషేధించి పై గ్రామానికి ప్రయాణమై వెళ్లిపోయాడు. భిక్షుణులు పూజ్యుడైన ఉదాయి ఆ విధంగా చేసినందుకు, కోపగించుకున్నారు. బుద్ధుడికి ఈ విషయం తెలియజేశారు. మత ప్రబోధాన్ని బహిష్కరించిన భిక్షువు విహారాన్ని విడిచి మరొక చోటుకి వెళ్లిపోకూడదన్నాడు.

ఆ కాలంలో మూర్ఖులు, అనర్హులు అయిన భిక్షువులు ఏ కారణం లేకుండా భిక్షుణులకు మతబోధన నిషేధించారు. అటువంటి మూర్ఖుడు, అనర్హుడు అయిన భిక్షువు ఆ పని చేయకూడదని బుద్ధుడు అన్నాడు. మతబోధనను కొంతమంది భిక్షుణులకు నిషేధించి, వారి నేరాన్ని విచారించని భిక్షువులను బుద్ధుడు తప్పుబట్టాడు.

ఒక సమయంలో భిక్షుణులు మత ప్రబోధానికి పోలేదు. ఆ విధంగా చేయరాదని బుద్ధుడు శాసించాడు. ఆ విధంగా చేసిన వాళ్ల పై చర్య తీసుకోమని చెప్పాడు.

ఆ దినాలలో భిక్షు సంఘం కలిసికట్టుగా మత ప్రబోధానికి పోయింది. ప్రజలు కోపగించారు. గొణుగుకున్నారు. “వాళ్లు భార్యల వలె, ఉంపుడుగత్తెల వలె పోతున్నారు. అందరూ కలిసి వినోదిస్తారు” అన్నారు.

నలుగురయిదుగురిని మించి మతోపన్యాసానికి పోరాదని బుద్ధుడు శాసించాడు. వాళ్ళు ఒక భిక్షువు ఎదుట దుస్తులు సరిచేసుకుని, మోకాళ్లపై కూర్చుని, చేతులు జోడించి ఈ విధంగా చెప్పాలి. “భిక్షుణీ సంఘం భిక్షు సంఘం పాదాలకు నమస్కరించి మత బోధనకు రావలసిందని భిక్షు సంఘానికి నివేదిస్తున్నాము.”

“అపుడు పాటిమోక్షాన్ని వర్ణించవలసిన భిక్షువు అడగాలి – ఎవరేనా భిక్షువు భిక్షుణులకు మత ప్రబోధం చేయడానికి నిర్ణయింపబడ్డాడా?” ఏ భిక్షువైనా నిర్ణయింపబడితే, భిక్షుణీ సంఘం అతని దగ్గరికి పోవలసిందని చెప్తాడు.

ఏ భిక్షువు నిర్ణయింపబడకపోతే, పాటిమోక్షం చదివే అతడు ఆ విధంగా నిర్ణయింపబడకపోతే, ఏ పూజ్యడు భిక్షుణులకు మత ప్రబోధం చేయగలడు? అటువంటి భిక్షువుకు ఎనిమిది గుణలుండాలి. అటువంటి వాడి దగ్గరికి భిక్షుణీ సంఘం వెళ్ళాలి. ఆ విధంగా ఎవరూ లేకపోతే భిక్షుణీ సంఘం మతమందు విశ్వాసం ప్రకటించి శాంతి వహించాలి.

కొంతమంది మతప్రభోదం చేయడానికి అంగీకరించలేదు – ఆ విధంగా నిరాకరించ కూడదని బుద్ధుడు శాసించాడు.

బుద్దిహీనుడైనవాడు మతప్రబోధానికి తగడు. రోగంతో ఉన్న భిక్షువు, ప్రయాణం మీద వెళ్లిన వారు తగరు.

అరణ్యంలో నివసిస్తున్నభిక్షువు, సమయాన్ని, స్థలాన్ని నిర్దేశించి మత ప్రబోధం చేయవచ్చును.

అంగీకరించి మత ప్రబోధం చేయకపోయినట్లయితే దుఃఖానికి పాలవుతాడు.

ఆ కాలంలో మత బోధనకు భిక్షుణుల నిర్ణీతమైన స్థలానికి రాలేదు… వాళ్లు నేరం చేసినట్లు పరిగణింపబడతారు.

ఆ కాలంలో భిక్షుణులు పొడవాటి మేఖలలు ధరించేవారు. పెద్దకటి వస్త్రాన్ని కుచ్చెళ్ళు వచ్చినట్లు కట్టుకునేవారు. ప్రజలు దానిని చూసి గర్హించారు. బుద్ధుడు దానిని నిషేధించాడు. ఒకసారి నడుము చుట్టు, కుచ్చెళ్లు లేకుండా కటి వస్త్రం భిక్షుణులు ధరించవలసిందని ఆదేశించాడు.

ఆ కాలంలో భిక్షుణులు నార చీరలతో, తోలుతో, జడు వేసిన తెల్లటి వస్త్రంతో, కుచ్చెళ్లు పోసిన నూలుబట్టతో – ఈ విధంగా చాల చాల విధాలుగా కుచ్చెళ్లు పెట్టిన వాటిని ధరించేవారు. ఇటువంటివేవి ధరించరాదని బుద్ధుడు నిషేధించాడు.

ఆ కాలంలో భిక్షుణులు ఎద్దు దవడ ఎముకతో వీపు రుద్దుకునేవారు. చేతులు రుద్దుకునేవారు, పిక్కలు రుద్దుకునేవారు. తొడలు రుద్దుకునేవారు. దీనిని ప్రజలు నిరూపించారు. భిక్షుణులు ప్రపంచసుఖాలకు లోనవుతున్నారని అన్నారు. బుద్ధుడు దీనిని నిషేధించాడు.

ఆ కాలంలో ముఖాలకు లేపనాలు రుద్దుకునేవారు, సున్నం పూసుకునేవారు. ఎర్రటి పాషాణాన్ని ముఖానికి పూసుకునేవారు. ముఖానికి, శరీరానికి అంగరాగం రాసుకునేవారు. వీటన్నిటిని బుద్ధుడు నిషేధించాడు.

కళ్ల వెనుక బుగ్గల మీద మకరికా పత్రాలు దిద్దుకునేవారు. కిటికీల నుండి తొంగిచూసేవారు, సగం తెరిచిన తలుపు దగ్గర నిలబడేవారు, నాట్యాలు చేసేవారు, గణికుల సాహచర్యంలో ఉండేవారు. మధుశాలను నడిపేవారు. జంతువధ చేసేవారు. మగబానిసలను, ఆడబానిసలను సమకూర్చి పెట్టేవారు, పరిచారికలను పరిచారకులను ఏర్పాటు చేసేవారు. జంతువులను తెచ్చేవారు, పూవులమ్మే వ్యాపారం, విత్తనాలు అమ్మడం చేసేవారు, మంగలిపొదె పట్టుకునేవారు. ఈ పనులన్నీటిని బుద్ధుడు నిషేధించాడు.

నీలిరంగులో ఉన్న దుస్తులను, తేలికపాటి పసుపుపచ్చని వాటిని, ముదురు ఎరుపు రంగులో ఉన్నవాటిని, నలుపువాటిని, గోదుమరంగు పచ్చరంగులో ఉన్నవాటిని, ముదురు పసుపుపచ్చరంగులో ఉన్న వాటిని భిక్షుణులు ధరించరాదు. చినిగిన పీలికలతో తయారు చేయని పావడలను వేసుకోరాదు. పొడువుగా ఉన్న పావడలను వేసుకోరాదు. వాటిపై పువ్వులను కుట్టినా, పాముపడగలను కుట్టినా ధరించరాదు. కంచుకాలను ధరించరాదు. తిరితకమనే మొక్క యొక్క నారతో తయారు చేసిన దుస్తులను వేసుకోరాదు.

భిక్షుణి చనిపోయిన తరువాత ఆమె వస్తువులు ఆమెకింద పరిచర్య చేసిన వారికి చెందుతాయి. లేని పక్షంలో భిక్షుణీ సంఘానికి చెందుతాయి.

భిక్షుణి, దారిలో దుర్బలుడైన భిక్షువును భుజంతో పొడవకూడదు. అతనికి దూరంగా తొలగి నడవాలి.

ఒకసారి ఒక స్త్రీ భర్త దూరదేశంలో ఉండగా, తన ఉపపతి వలన గర్భం ధరించింది. నెలలు నిండకుండా ఆమె ప్రసవించింది. ఆ పిండాన్ని తన స్నేహితురాలైన ఒక భిక్షుణికి ఇచ్చి దూరంగా పారివేయమంది. భిక్షుణి దానిని తన భిక్షాపాత్రలో వేసుకొని వెళ్లిపోయింది. దారిలో ఒక భిక్షువు ఆమెకు ఎదురై, ఆచారప్రకారం తనకు దొరికిన తొలి భిక్షను ఆమె ఇవ్వదలిచాడు. కొంత తర్జన భర్జన తరువాత అతనికి నిజం తెలిసింది. అటువంటి పనిచేసినందుకు అతడు భిక్షుణి పై కోపగించుకున్నాడు. బుద్ధుడితో చెప్పాడు – భిక్షువు కనిపించగానే అతనికి భిక్షాపాత్రను చూపించాలని, పిండాన్ని భిక్షాపాత్రలో తీసుకుపోకూడదని బుద్ధుడు శాసించాడు.

ప్రజలు హెచ్చుగా ఆహారాన్ని భిక్షువులకు ఇచ్చారు. భిక్షువులు ఉపయోగించగా మిగిలిన దానిని భిక్షుణుల కిమ్మని బుద్ధుడు చెప్పాడు.

ఒకసారి భిక్షుణులు తమకు పరుపులను ఎరువిమ్మని భిక్షువుల నడిగారు. పరుపులు ఋతుస్రావంతో తడిసిపోయాయి. బుద్ధుడు ఆ సమయాలలో భిక్షుణులను కౌపీనం, మొలత్రాడు దరించమని ఆదేశించాడు.

ఒక స్త్రీకి ఉపసంపదను అనుగ్రహించేటప్పుడు ఈ క్రింది విధంగా ప్రశ్నించమని బుద్ధుడు అదేశించాడు.

  1. నీకు ఏ విధమైన అంగవైకల్యం ఉంది? (అవి పదకొండు విధాలు)
  2. నీకు ఈ రోగాలు ఉన్నాయా? అవి కుష్ఠురోగం, కురుపులు, పొడి కుష్ఠరోగం, క్షయరోగం, మూర్ఛరోగం.
  3. నీవు మానవ జాతికి సంబంధించిన దానివేనా?
  4. నువ్వు స్త్రీవేనా?
  5. నువ్వు స్వేచ్ఛాచారిణినా?
  6. నీకు అప్పులు లేవుకదా?
  7. నువ్వు రాజుగారి సేవలో లేవు కదా?
  8. నీ తండ్రి, నీ తల్లి నిన్ను అనుమతించారా?
  9. నీకు ఇరవై సంవత్సరాలు నిండాయా?
  10. నీకు భిక్షుణి ధరించవలసిన దుస్తులు, భిక్షాపాత్ర ఉన్నాయా?
  11. నీ పేరేమిటి?
  12. నిన్ను సంఘానికి ఎవరు ప్రతిపాదిస్తున్నారు?

ఒక్కొక్కప్పుడు భిక్షువులు వేసే ప్రశ్నలు ఇబ్బంది కలుగజేస్తే, ఉపసంపదకు వచ్చిన భిక్షుణుల మనస్సు వికలమయి, సందిగ్ధమయి, వాళ్ళు – జవాబు చెప్పలేకపోయేవారు. బుద్ధుడు భిక్కునీ సంఘం వారే ఈ పని చెయ్యాలని నిర్దేశించాడు. భిక్కునీ సంఘంలో వాళ్లు విద్యలేని వాళ్లే. సమర్థులు కాకపోవడం జరిగింది. యోగ్యులైన భిక్షుణులే ఈ పని చేయమని బుద్ధుడు ఆదేశించాడు.

భిక్షుణికి ఉపసంపదను అనుగ్రహించేటప్పుడు ఆమెను భిక్షు సంఘం దగ్గరికి తీసుకుపోవాలి. దుస్తులు సరిచేసుకొని భిక్షు సంఘం ముందు మోకరిల్లాలి. చేతులు జోడించి చెప్పాలి “అయ్యలారా! నా పేరు ఇది. ఒక వంక ఫలానా వారి నుండి భిక్షుణీ సంఘం నుండి, నాలో లోపాలు లేవని నిర్ధారింపబడి, సంఘాన్ని నాకు ఉపసంపదను ప్రసాదించమని వేడుకుంటున్నాను. సంఘం నన్ను ప్రాపంచక జీవితం నుండి ఉద్ధరించి, నా పై కరుణ చూపవలసింది. రెండవసారి నేను ప్రార్థిస్తున్నాను – మూడవసారి ప్రార్థిస్తున్నాను. తరువాత, భిక్షు సంఘంవారు, నీడను కొలిచి, ఏ ఋతువో, ఏ తిధౌ, దినంలో ఏ భాగమో, అది ఏ విధంగా గుణించడమో చెప్పడం చేయవలసింది.”

ఒకప్పుడు భిక్షుణులు భోజనశాలలో, ఎవరే ఆసనంపై కూర్చోడం అన్న విషయంపై వాదులాడుకునేవారు. ఆ సంగతి బుద్దునికి నివేదించారు. ఎవరు వయస్సులో అధికులో, వారిలో ఎనిమిది మంది క్రమంగా ముందు ఆసనాలలో కూర్చోవలసిందని, మిగిలినవారు వారు వచ్చిన క్రమంలో కూర్చోమని బుద్ధుడు ఆదేశించాడు. ఇది కేవలం భోజనశాలకే చెందినదని బుద్ధుడు విశదీకరించాడు.

ఆ కాలంలో భిక్షుణులు పవారణ మానివేశారు – బుద్ధుడు వాళ్ల మీద చర్య తీసుకోమన్నాడు.

భిక్షుణులు, భిక్షు సంఘంలో పవారణ నిర్వహించలేదు. దానిని బుద్ధుడు గర్హించాడు.

భిక్షుణులు, భిక్షువులను ఉపోసథ, పవారణ, మత ప్రబోధం వంటి కార్యక్రమాలను చేయకుండా చేశారు – వారిని ఆజ్ఞాపించారు – వారిని హేళన చేశారు – ఏదో ఒక నేరానికి గాను హెచ్చరించారు – వారు ఏ విధమైన నేరం చేశారో జ్ఞాపకం తెచ్చుకోమన్నారు – భిక్షుణులు ఈ విధంగా ప్రవర్తించడం గర్షించడం. ఆ చర్యకు విలువ లేదన్నాడు బుద్ధుడు.

ఆ కాలంలో చబ్బగ్గీయ భిక్షుణులు, ఆవులను పూన్చిన బళ్లలో మధ్యనొక ఎద్దును కూడా పూన్చిన వాటిలో ప్రయాణం చేసేవారు. రెండు ఎడ్లమధ్యను ఒక ఆవును కూడా పూన్చడం జరిగేది – ప్రజలు కోపగించుకున్నారు. “ఇది గంగోత్సవమా, మహీ ఉత్సవమా – అటువంటి ఉత్సవాలలో ఇటువంటి వేడుక జరుగుతుంది”.

బుద్ధుడు భిక్షుణులను బండి మీద పోవడాన్ని నిషేదించాడు. రోగంతో ఉండే భిక్షుణి మాత్రం బండి మీద వెళ్లడానికి అనుమతించాడు. ఒకప్పుడు బండికుదుపు హెచ్చయి భిక్షుణికి బాధ కలిగింది. అప్పుడు పల్లకీమీద గాని, నలుగురు మోసే కూర్చీమీద కాని ప్రయాణం చేయడానికి అనుమతించాడు.

ఆ కాలంలో అడ్డకాశి అన్న పేరుగల గణిక, బౌద్ధ మతాన్ని స్వీకరించింది. సంఘంలో సంపూర్ణమైన సభ్యత్వం పొందడం కోసం శ్రావస్తిలో ఉన్న బుద్దుడి దగ్గరికి పోదామనుకుంది. కాని పతితులైన పురుషులు ఆమె దారికి అడ్డుపడ్డారు. ఈ సంగతి ఆమె తెలుసుకొని బుద్ధుడికి సందేశం పంపించింది.

“ఉప సంపదను స్వీకరించాలని నేను కోరుతున్నాను. నేను ఏవిదంగా చేస్తే అది సాధ్యపడుతుంది?

బుద్ధుడు భిక్షువులతో అన్నాడు:

“ఓ భిక్షువులారా! ఉపసంపద ప్రారంబోపదేశాన్ని భిక్షుణులకు సందేశం ద్వారా అనుగ్రహించవచ్చు.”

అపుడు వాళ్లు ఒక భిక్షువును ఆ పని చేయడానికి పంపించారు. కాని బుద్ధుడు అంగీకరించలేదు. ఉపసంపద గురించి ఒక శిష్యురాలిని, ఒక ప్రారంభకుడిని ఒక ప్రారంభకురాలిని, ఏమీ తెలియని, యోగ్యతలేని భిక్షుణికి సందేశమిమ్మని పంపించారు. కాని బుద్ధుడు వారి నెవరిని అంగీకరించలేదు.

ఒక విద్యావంతురాలు, సామర్థ్యం కలిగినది అయిన భిక్షువుని ఉపసంపద ప్రారంభం చేసే పనికి సందేశం తీసుకొని వెళ్ళమన్నాడు బుద్ధుడు.

ఆ సమయంలో కొంతమంది భిక్షుణులు అరణ్యంలో ఉండగా, కొందరు పతితులు వాళ్లను బలాత్కరించారు. భిక్షుణులు అరణ్యాలలో నివసించరాదని బుద్ధుడు నిషేధించాడు.

ఒకప్పుడు గర్భం ధరించిన స్త్రీ భిక్షుణీ సంఘంలో చేరింది – ఆమెకు తాను గర్భం ధరించిన సంగతి తెలియదు. తరువాత గర్భస్థ శిశువు కదలడం మొదలు పెట్టింది ఆ సంగతి బుద్ధుడికి తెలిసింది.

శిశువుకు బాగా జ్ఞానం వచ్చే వరకు తల్లితో ఉండవచ్చని బుద్ధుడు అనుమతించాడు.

మగ పిల్లడయితే ఏం చేయడమో ఆమెకు తెలియలేదు. ఇతర పురుషులతో వర్తించినట్లే ఆమెను వ్యవహరించమన్నాడు, మరో భిక్షుణిని సమాయం చెయ్యమన్నాడు.

చాల పెద్ద నేరం చేసిన భిక్షుణికి, సహాయంగా మరొక భిక్షుణిని, శిక్ష అనుభవించే కాలంలో తోడు ఉండమన్నాడు.

సంఘాన్ని వదిలి పెట్టి, కాషాయ వస్త్రాలను విసర్జించిన భిక్షుణి తిరిగి సంఘంలో చేరవస్తే స్వీకరించవద్దన్నాడు.

భిక్షుణులు ఆవిరిపట్టే స్నానశాలలో నీళ్లు పోసుకోకూడదన్నాడు. ప్రవాహానికి ఎదురుగా స్నానం చేయరాదన్నాడు.

ఒకసారి భిక్షుణులు, మగవాళ్లు కూడా స్నానం చేసేచోట జలకమాడారు. మగవాళ్లు వాళ్లను చెరచారు – అటువంటి చోట్ల భిక్షుణులు స్నానం చేయకూడదని బుద్ధుడు ఆదేశించాడు.

మోహన్ కొంచెం సేపు మౌనం వహించాడు. “భిక్షువులు భిక్షుణులకన్న అధికులన్నట్లు బుద్ధుడు నిరూపించాడు. ఇది నాకు సమ్మతం కాదు” అంది శశికళ.

“అది ఆ కాలం నాటి ఆచారం – కొన్ని కొన్ని సందర్భాలలో స్త్రీలు స్వతంత్రంగా వ్యవహరించి మోసపోయారు. బుద్ధుడు వీటి నన్నిటిని ముందుగానే ఆలోచించి శాసించాడు” అన్నాడు మోహన్.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here