శ్రీపర్వతం-25

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 25వ భాగం. [/box]

35

[dropcap]ఈ[/dropcap] మధ్యనే జరిగింది. ఒకనాటి ఉదయాన నిద్రలేచి మంచం దిగగానే మంచం ఇనుపరాడ్లకు కట్లపాములు చుట్టుకొని కనిపించాయి. మోహన్ మంచానికి నాలుగు, శశికళ మంచానికో ఆరు కనిపించాయి. అప్పటికే బాగా వెలుతురు వచ్చింది. ఇంతలో మరో నాలుగు కూడా మూలలకు కనిపించాయి.

“ఇవేమీ చెయ్యవు – నిన్న, సాయంకాలం చేసి టెంట్లకు కొద్ది దూరంలో పుట్టలు తవ్వారు – బహుశా అందులోనివి నలుపక్కలకు చెదిరిపోయినట్లున్నాయి” అంది జావా.

“పాముకి విషమున్నా, లేకపోయినా, దానిని చూడగానే భయం కలుగుతుంది. తవ్వకాలలో చాల పాములు, మండ్రగబ్బలు కనిపించాయని అమరావతిలోని ఆర్కెలాజికల్ సూపరింటెండెంటు కృష్ణారావుగారు ఒకసారి చెప్పారు. మన సుబ్రహ్మణ్యేశ్వరరావు కూడా తాను ఒకసారి పడగున్న పాముని నాగార్జున కొండమీద చూశానని, అది విషసర్పం కాదని చెప్పాడు. ఈ ప్రాంతాలలో పాములుండడం సహజమే – కాని మనం వాటి మధ్యను నివసించడం భీతి కలిగిస్తుంది.”

జావా మొగుడు ఏదో సంగతి కనుక్కోడానికి టెంట్లకు వచ్చాడు. అక్కడి పరిస్థితులను చూసి అతను కూడా చలించాడు.

“మెగ్యా! వీటి బాధనుంచి తప్పించడానికి ఏదేనా మార్గముందా?” మోహన్ అడిగాడు.

మెగ్యా క్షణం ఆలోచించి అన్నాడు:

“తవ్వకాలలో వస్తువులేవీ దొరక్కపోయినా, రెండు నెలలకింద, ఇక్ష్వాకుల పొరవరకు తవ్వినప్పుడు అక్కడ ఎండిన రెమ్మలు, ఆకులు, మొక్కలు కనిపించాయి. వాటిని రోడ్డుకి అవతల ఉన్న పుట్టమీద పోయించాను. అప్పుడొక ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. పుట్టలోని పాములు, బహుశా ఇటువంటివే అనుకుంటాను, గుంపులుగా బయటికి పారిపోయాయి. ఇప్పటికి కూడా కొన్ని ట్రెంచిలనుండి ఈ విధంగా మొక్కలు, రెమ్మలు ఆకులు వస్తున్నాయి. వాటిని మన ఆవరణ చుట్టూ పోయిస్తే, పాముల బెడద ఉండదు.”

మోహన్, శశికళ ఆలోచించారు.

“ప్రస్తుతానికి, ఈ పాముల నన్నిటిని బయటకు పంపు. అంతవరకు ఏ పని చేయడానికి అవదు. ఆలస్యం చెయ్యకుండా ఆ మొక్కలను, రెమ్మలను తెచ్చి ఫెన్సింగు చుట్టూ పోయించు. ఫలితం మనకు వెంటనే తెలుస్తుంది” అన్నాడు మోహన్.

తరువాత మెగ్యా గోనె సంచీ ఒకటి తెచ్చి దానిలోకి ఆ పాములన్నీ పంపించాడు. రెండు టెంట్లు, మధ్య నడక, బాత్‌రూమ్, అన్నీ జాగ్రత్తగా గాలించి చూశాడు. మరో రెండు పాములు కనిపించాయి. వాటినన్నిటిని గోనెలో పట్టుకుపోయి ఫిరంగిమోటు మీద విడిచాడు. ఆ సాయంకాలానికి మూడు తట్టలతో ఎండిన మొక్కలను తెచ్చి ఆవరణ చుట్టూ, కంచె మొదలున పోయించాడు. ఆ విధంగా మరో నాలుగు రోజులు ఎండిన మొక్కలను చుట్టూ పోయించాడు.

ఎండలు క్రమంగా ముదురుతున్నాయి. ప్రతిదినం మోహన్, శశికళ సైటుకు పోతున్నారు. సోమవారం నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు వస్తే అతనితో ఈ సంగతంతా చెప్పారు. అతను చాల ఆశ్చర్యపోయాడు.

“మీరు హైదరాబాదులో ఒక లేబరేటరీకి వీటిని పరిశీలించమని పంపిచారు కదా, ఏదైనా జవాబు వచ్చిందా?” సుబ్రహ్మణ్యేశ్వరరావు అడిగాడు.

“ఇంకా రాలేదు. రేపు కొరియరు కుర్రాడి ద్వారా ఉత్తరం పంపుతాను” అన్నాడు మోహన్.

“ఈ మొక్కలు ఏవయితేనేం, రమారమి 1800 సంవత్సరాల తరువాత కూడా తమ ప్రభావాన్ని చూపించుతున్నాయి” అన్నాడు రావు.

ఈ సంఘటన జరిగి పదిరోజులేనా జరగలేదు. మరొక ఆశ్చర్యకరమైన సంగతి సంభవించింది. ఆ రోజు ఉదయం మోహన్, శశికళ టిఫిన్ తిని ఎనిమిది గంటలకు సైటుకి వెళ్ళిపోయారు.

జావా తన పని పూర్తి చేసుకొని పన్నెండు గంటలకు టెంటు తెర దగ్గరగా లాగి వెళ్ళిపోయింది.

టెంట్లు చిన్న మైదానం మధ్యను ఉన్నాయి. రమారమి మూడు ఫర్లాంగుల దూరంలో లంబాడీ తండా ఉంది. టెంట్ల ఆవరణకున్న గేటు వెదురు బద్దలతో కట్టినది. ఆదెప్పుడు తెరచే ఉంటుంది. ఆ రోజు ఎండ కొంచెం హెచ్చుగానే ఉంది.

మాట్లాడుకుంటూ మోహన్, శశికళ టెంట్లు చేరుకున్నారు. మోహన్ టెంటు లోంచి, మధ్యనడవను దాటి శశికళ తన టెంటులోకి వెళ్ళవలసింది. ఒక్కసారిగా ముందు టెంటు వెనుక ద్వారం దగ్గర ఆగిపోయింది.

“హలో! మోహన్” ఆమె మెల్లగా పిలిచింది.

చొక్కా గుండీలు విప్పుకున్న మోహన్ తొందరగా ఆమెవేపు నడిచాడు. నడవలో, ఇటుకలు తాపిన దారిలో ఒక చిరుతపులి పడుక్కుంది.

అతను శశికళ వేపు చూశాడు.

శశికళ తండ్రిగారు పోలీస్ ఇనస్పెక్టర్ జనరల్‌గా ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఆయన ఒక జోడుగుళ్ళ తుపాకి కూతురి కోసం లైసెన్స్ తీసుకొని ఇచ్చాడు. కానీ అది ఆమె టెంటులో ఉంది. తూటాలు నింపి చిరుతపులిని కాల్చవచ్చు. కాని రెండు టెంట్ల మధ్య చిరుతపులి సావకాశంగా కూర్చుంది. గోలెం నిండా ఎప్పుడు జావా నీళ్ళు నింపి ఉంచుతుంది. నాలుగో వంతు నీళ్ళు తగ్గినట్లున్నాయి. అంటే చిరుతపులి తాగింది.

ఇద్దరు ముందు టెంటులోపలికి వచ్చారు.

“ఇది వాటి రాజ్యం. దీనిలోకి మనుషులు వచ్చి వాటిని అడవుల్లోకి తరిమేశారు” అన్నాడు మోహన్.

“దీనిని బయటకు పంపడమెలా?” అంది శశికళ.

“దారులన్నీ తెరచి, బయటనుండి పెద్ద చప్పుడు చేస్తే అది వచ్చినట్లే వెళ్ళిపోతుంది.”

వాళ్ళకేమీ టెంటులో చప్పుడు చేయడానికి కనిపించలేదు. ఒక పక్కకు నీళ్ళు కాచుకునే సిల్వర్ గిన్నె మీద మూగ కనిపించింది. దానిని పట్టుకొని, ఒక కర్రముక్కతో, టెంటు వెనకాతల, మోహన్ గట్టిగా కొట్టడం మొదలు పెట్టాడు.

కొద్ది సేపటిలో చిరుతపులి కేక పెట్టి, వచ్చినదారినే బయటకు నడిచి ఫిరంగి మోటు కొండల వేపు వెళ్ళింది. ఇంతలో లంబాడీ తండావేపు పనుల నుండి వస్తున్న పనివాళ్ళ కేకలు పెట్టి, వెంటబెట్టగా, అందరూ చూస్తుంటే పరుగందుకొని అడువులలో మాయమయింది.

పదిరోజులకింద పాములు, ఈ రోజు చిరుతపులి వాళ్ళిద్దరినీ కొంచెం భయపెట్టాయి. ట్రెంచిలలో తీసిన మొక్కలు, రెమ్మలు టెంట్ల ఆవరణ చుట్టూ వేస్తే పామన్నది అటువేపు మరిరాలేదు.

సాయంకాలం సుబ్రహ్మణ్యేశ్వరరావు వస్తే అతనితో సంగతంతా చెప్పారు. మరునాడు ప్రసాద్ గారిని కలిసి చిరుతపులి సంగతి చెప్పారు.

“ఈ ప్రాంతాలలో, నెలకో, రెండు నెలలకో లోయలోకి చిరుతపులులు రావడం జరుగుతున్నది. పెద్దపులి ఎప్పుడూ రాలేదు. తోడేళ్ళు, నక్కలు అప్పుడప్పుడు కనిపిస్తాయి. ఇక పాములు, మండ్ర గబ్బల సంగతి చెప్పనే అక్కరలేదు. వీటన్నిటిని ఎదుర్కొని పనిచేస్తున్నామంటే, మనమంతా చాల ధైర్యవంతులమే – క్రమక్రమంగా, తవ్వకాలు ముగిసిన తరువాత, కృష్ణవేణీ జలాలు లోయనంతటిని ముంచెత్తుతే ఒకనాటి విజయపురి ఏమవుతుందో తెలియదు. కృష్ణవేణి గర్భంలో నగరం శాశ్వతంగా నిద్రపోతుంది. మనమందరం పడిన శ్రమలు, తవ్వకాలలో మనం బయట పెట్టిన ఇక్ష్వాకుల సంస్కృతి చరిత్రపుటలలో చిరస్థాయిగా నిలుస్తాయి” అన్నారు ప్రసాద్, భావోద్వేగంతో.

ఇక్కడి స్కాలర్లందరూ ఆ విధంగానే అనుకుంటారు. ఎవరూ చేయలేని మహత్కార్యం నెరవేరుస్తున్నామని భావిస్తారు. ఇక్ష్వాకుల చరిత్రలో, బౌద్ధమత వ్యాప్తిలో విజయపురి పేరు శాశ్వతంగా నిలుస్తుంది. ఆ ఘనత ఈ మహానుభావులదే.

తరువాత సోమవారం నాడు కొరియరు అబ్బాయి వచ్చాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావు వచ్చాడు. మధ్యాహ్నం భోజనాలయిన పిమ్మట కొంచెం సేపు విశ్రమించి ముగ్గురూ పుష్ప భద్రస్వామి ఆలయంవేపు నడిచారు. ఆసరికి ఎండతగ్గింది. నది గట్టున కూర్చొని మాటలాడుకున్నారు.

మోహన్ సంభాషణ ప్రారంభించాడు.

“కలకత్తా టంకశాలకు జేము ప్రిన్సెప్, ఎస్సే మాస్టరుగా ఉండేవాడు. అతడు ఏషియాటిక్ సొసైటీ ఆఫ్ బెంగాలుకు 1833 నుండి 1840 వరకు సెక్రెటరీగా పనిచేశాడు. అతడు బ్రాహ్మీలిపిని మొదటిసారిగా చదవడం కనుగొన్నాడు. 1834 నుండి 1837 వరకు శ్రమపడి సాధించాడు. జేమ్సు ఫెర్గుసన్, భరాతదేశంలో, పురాతత్త్వ శాఖలో ప్రపథమంగా ముందు నడిచాడు. తరువాత జేమ్స్ బర్జెస్, జాన్ మార్షల్ ఈ ఇద్దరూ పురాతత్వ పరిశోధనను క్రమబద్ధం చేశారు. 1920 ప్రాంతాలలో బర్జెస్ వృత్తినుండి విరమించిన తరువాత ఈ పరిశోధన మందగించింది. 1944-48 సంవత్సరాలలో ఈ పరిశోధనను ప్రణాళికాబద్ధంగా ఆధునికం చేసిన ఘనత మార్టిమర్ వీలర్‌కి లభిస్తుంది. మన నాగార్జున కొండలోయలో తవ్వకాలను, వీలర్ దొర ఛాత్రులు డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యంగారు అత్యద్భుతమైన రీతిలో నిర్వహిస్తున్నారు. ఈ మధ్యనే వారిని మరొక చోటికి బదిలీ చేయడం విచారించదగిన విషయం. వారీ ఒక్కరి చేతిమీద ఇన్ని సంవత్సరాలు సాగిన తవ్వకాలు చివరిదశలో మరొకరి యాజమాన్యంలోకి వెళ్ళిపోవడం కష్టమనిపిస్తుంది. ఇది నా అభిప్రాయం. ప్రభుత్వం ఏ దృష్టితో చేసిందో నేను చెప్పలేను.”

అందరూ కొంచెం సేపు మౌనంగా ఉండిపోయారు. తరువాత సుబ్రహ్మణ్యేశ్వరరావు అడిగాడు.

“మనకు క్రీస్తుశకం గురించి తెలుసు – విక్రమ శకం గురించి, శాలివాహన శకం గురించి చెప్పండి.”

“తప్పకుండా చెప్పాను” అన్నాడు మోహన్. మోహన్ చెప్పడం మొదలు పెట్టాడు.

రెండు శకాలు పురాతన కాలం నుండి భారత దేశంలో వ్యాప్తి చెందాయి. ఒకటి విక్రమ సంవత్సరం, రెండవది శతాబ్దం. విక్రమ సంవత్సరం క్రీస్తు పూర్వం 58వ సంవత్సరంలో ప్రారంభమయింది. శతాబ్దం క్రీస్తుశకం 78తో మొదలయింది. ఈ ఆధారాలు అస్పష్టంగా ఉన్నాయి. ఈ విషయం గురించి చాల సిద్ధాంతాలు ప్రచారంలో ఉన్నాయి.

పురాతన భారతీయ పాలకులు తమ పాలనా సంవత్సరాలను శాసనాదులలో ఉదహరించారు. ఏ శకం ప్రచారంలో లేకపోవడం చేత ఆ విధంగా చేయవలసి వచ్చినట్లు మనం నమ్మవచ్చు. ఒక శకానికి చెందిన సంవత్సరాలను గుర్తుంచకోడం సైథోపార్థీయన్ల పాలనతోను, కుషానుల పాలనతోను అమలులోకి వచ్చింది.

తక్షశిల, 78వ సంవత్సరపు శాసనంలో ఉదహరించిన మాసం పార్థియన్లది. వానోసెస్, అన్నరాజు, అంతకు పూర్వమున్న సంవత్సరాలను (అవి క్రీస్తుపూర్వం 248 సంవత్సరాలు) త్యజించి, తన పాలనతో మొదలయిన శకాన్ని క్రీస్తు పూర్వం 58 నుంచి పరిగణనలోకి తీసుకోడం జరిగింది. ఈ విధంగా వానోనెస్ రాజు సింహాసనం అధిరోహించడం చారిత్రక యుగారంభంగా నిలిచింది.

సైథో పార్థియన్ శకం, క్రీస్తు పూర్వం మొదటి శతాబ్దంలో, వానోనెస్ రాజ్యానికి రావడంతో మొదలయింది. ఇది విక్రమ సంవత్సరమే – క్రీస్తు పూర్వం 58లో కృత యుగమని మాల్వా తెగవారు పేర్కొన్నారు. తొలిదినాలలో మాల్వాతెగలు పంజాబులో నివసించేవి. పాశ్చాత్యుల ఒత్తిడి కింద వారు రాజపుటానికి వలస పోయారు. గ్రీకు, సైథో పార్టియన్ విజేతలకు లొంగిపోయారు. నగరమండపం (పురాతన మాల్వానగర ప్రాంతాలకు), పాత జయపూర్ రాష్ట్రానికి తరలిపోయారు. పర్యవసానంగా వారు, మధ్య భారతంలోని మాల్వాకు తమ పేరును ప్రసాదించారు. ఆ ప్రాంతాలలో ఈ శకం పరిగణన లోకి వచ్చింది. మాల్వా నాయకుడు ‘కృత’ అన్న అతని పేరుతో కూడ దీనిని పిలవడం జరిగింది. మధ్యభారతంలో, పశ్చిమ భారతంలోను, విక్రమ సంవత్సరానికి ప్రతిస్పర్థిగా సైథో – పార్టియన్ శకం, శక – రాజుల పరిపాలనలో, క్రీస్తు పూర్వం 78లో మొదలైనది, క్రీస్తు శకం 5వ శతాబ్దంలో రెండవ చంద్రగుప్త విక్రమాదిత్యుడు వారిని జయించే వరకు కొనసాగింది.

సంప్రదాయం విక్రమసంవత్సరం స్థాపకుడైన విక్రమాదిత్యుడి గురించి మూడు విధాలుగా చెప్తుంది. ఒక తరగతి ప్రకారం, వేతాళపంచవింశతిలోని కథలు, ద్వాత్రింశత్ పుట్టాలికా కథలు, అటువంటివే అయిన ఇతర పుస్తకాలను మనం పరిగణనలోకి తీసుకోవచ్చు. ఆ గ్రంథాలు అతని అతిమానుషమైన గుణగణాలను, హృదయానికి సంబంధించిన వాటిని, ముఖ్యంగా అతని దాతృత్వాన్ని విద్యాపోషణను, సాహిత్యంలో రత్నాలవంటి నవరత్నాలలో అతనికి గల సంబంధాన్ని వర్ణిస్తాయి. వీటికి ఏవిధమైన చారిత్రక సత్యం లేదు. విక్రమాదిత్యుడు ఆదర్శవంతుడైన మహారాజుని, అతని మరణానంతరం కూడా అవి కొనియాడేయి. బహుశా విక్రమాదిత్యులు ఒకరికంటే హెచ్చో ఏమో! అతని సభకు చెందిన కవులు, అందరూ ఒక కాలానికి చెందినవారు కారు. బృహత్ కథలో విక్రమార్కుని సాహసాలు చెప్పబడ్డాయి. రెండవతరగతికి చెందిన వివరాలు విక్రమాదిత్యుని సాహస కార్యాలను, బృహత్కథ సాహిత్యం నుండి వచ్చిన వాటిని మనకు ప్రసాదిస్తాయి.

జైన సాహిత్యంలోని సంప్రదాయాలు దీనికి భిన్నమైనవి. జైనుల ప్రామాణిక గ్రంథాలకు చెందినవి, మేరుతుంగుని థేరావళికి చెందినవి ఒక రకమైనవి. జైనమత చరిత్రలో కాలకాచార్యుల కథానానికి సంబందించినవి రెండవ రకమైనవి.

మేరుతుంగుడు, అవంతీరాజైన ప్రద్యోతుని పరిపాలన గురించి, నందుల గురించి, మౌర్యుల గురించి, పుష్యమిత్రుడి గురించి చెప్పినపిమ్మట ఉజ్జయిని రాజ్యం గురించి ఈ విధంగా చెప్పాడు.

“తరువాత భానుమిత్ర, బాలమిత్రుల పాలన 60 సంవత్సరాలు సాగింది. నభవాహనుడు 40 సంవత్సరాలు పాలించాడు. తరువాత గర్ధభిల్లుని వంశము 152 సంవత్సరాలు అధికారంలో ఉంది. గర్ధభిల్లుడు 13 సంవత్సరాలు పరిపాలన చేసిన తరువాత శకరాజులు గర్ధభిల్లుని దేశ బహిష్కృతుడిని గావించి 4 సంవత్సరాలు పాలించారు. విక్రమాదిత్యుడు గర్ధభిల్లుని పుత్రుడు, ఉజ్జయిని రాజ్యాన్న గెలిచి, విక్రమ శకాన్ని ప్రారంభించి 60 సంవత్సరాలు పాలించాడు. అతని వారసులు వరుసగా 40, 11, 14, 10 సంవత్సరాలు పాలించారు. అపుడు శకసంవత్సరాలు మొదలయాయి.

కాలకాచార్యుని కథ శకుల గెలుపును వివరంగా చెప్తుంది.

“కాలకాచార్యునికి సరస్వతి అన్న సోదరి ఉండేది. ఆమె మఠంలో చేరింది. ఉజ్జయని రాజైన గర్ధభిల్లుడు ఆమె సౌందర్యానికి మోహించి ఆమెను బలాత్కరించాడు. కాలకాచార్యుడికి కోపం వచ్చింది. అతడు సింధునది పశ్చిమానికి పోయి, షోవో (శక) ముఖ్యుడితో కొన్నాళ్ళు వసించాడు. ఆ శకముఖ్యుడికి జ్యోతిషం పై చాల మక్కువ. కాలకాచార్యుడు ఆ విధంగా అతనిని ప్రభావితుడిని చేశాడు. క్రమంగా, అతనిని, అతని క్రింద పనిచేస్తున్న మరొక 95 మంది ముఖ్యులను కాలకాచార్యుడు గర్ధభిల్లుని రాజ్యంపై దండయాత్రకు పురికొల్పి, తను కూడా వాళ్ళను చేరి, సింధురాష్ట్రం మీదుగా గుజరాత్ మీదుగా ప్రయాణం చేసి ఉజ్జయిని మీద దండయాత్ర చేశాడు. ఉజ్జయిని పడిపోయింది. శకులు తమ ఆధిపత్యాన్ని మాల్వాపై సాధించారు. 17 సంవత్సరాల తరువాత గర్ధభిల్లుని పుత్రుడు విక్రమార్కుడు, శకులను పారద్రోలి తన రాజ్యాన్ని తిరిగి పొందాడు. గగ్గల్లుని ఓడించిన తరువాత కాలకాచార్యుడు, తన సోదరిని విడిపించి, ప్రతిష్ఠానపురంలోని శాతవాహనుని సభకు వెళ్ళిపోయాడు”.

పైన చెప్పిన కథ ఇతర గ్రంథాలలోను, ఈ సంఘటనను ఉదహరించిన కొన్ని గాథలలోను కూడా లభిస్తుంది. ఇంకా కొన్ని గ్రంథాలలో విక్రమార్కుడు గతించిన 135 సంవత్సరాలకు, తిరిగి శకులు విక్రమ పుత్రుడిని (విక్రమార్కుడి కొడుకో, వంశంలో వాడో) పారద్రోలి, రాజ్యా న్ని గెలుచుకున్నారు”.

జైన సంప్రదాయాలు చారిత్రక నేపథ్యం కలవి. తారీకులలో కొంచెం వ్యత్యాసమున్నా, విషయం చారిత్రక సత్యాలను వివరిస్తుంది.

శకులను జయించిన విక్రమాదిత్యుడు క్రీస్తుపూర్వం 58వ సంవత్సరం నాటివాడే కాదో మనకు సరియైన సాక్ష్యాలు లేవు.

విక్రమార్కుని ఉదంతం సంప్రదాయబద్దమైనది, మామూలుగా తోసిపుచ్చ వలసినది కాదు.

విక్రమ సంవత్సరం మొదలైన తరువాత 500 ఏళ్ళ వరకు దానిని కేవలం సంవత్సరం అని పిలిచారు. క్రీస్తుశకం అయిదవ శతాబ్దంలో దానిని మాలవుల శకంగా పలిచారు. ఎనిమిదవ శతాబ్దంలో మాలవ ప్రభువుల శకంగా పిలిచారు. మొదటిసారిగా ఒక శాసనంలో విక్రమసంవత్సరం 898గా పేర్కొన్నారు. విక్రమశకం స్థాపకుడు విక్రమాదిత్యుడే అయితే, రమారమి వేయి సంవత్సరాల వరకు అతని పేరే ఉదాహరించక పోడం ఆశ్చర్యం కలిగిస్తుంది.

శకసంవత్సరాల విషయంలో ఇటువంటిదే జరిగింది. శకుల శకం ప్రారంభమైన వేయి సంవత్సరాల వరకు, దానిని మొదలు పెట్టిన రాజు గురించి ప్రస్తావన జరగలేదు.

శకులను జయించి, క్రీస్తు పూర్వం 58వ సంవత్సరంలో విక్రమార్కుడు తన విజయం ప్రతిష్ఠించి, విక్రమశకం ప్రారంభించాడని మనం నిర్థారించవచ్చు.

ఇక శక సంవత్సరం గురించి – ఒక సిథియన్ రాజు తన రాజ్య పాలన మొదలైన సంవత్సరాన్ని శక సంవత్సరంగా పేర్కొన్నాడు. లేక అతని తరువాత రాజులు, తమ పూర్వుడు పాలనకు మొదలు పెట్టిన సంవత్సరాన్ని పరిగణనలోకి తీసుకొని ఉండవచ్చు. శకం స్థాపించిన సిథియన్ రాజు ఎవరో వివాదస్పదంగా మిగిలింది. శక సాత్రపులు పశ్చిమ భారతాన్ని పాలించిన తొలినాళ్ళ నుండి ఈ శకం వాడుకలో ఉంది. కనిష్కుడు క్రీస్తు శకం 78 ప్రాంతాలలో వర్థిల్లినాడంటే అతడే శక సంవత్సరాల ప్రారంభకుడని నిశ్చయింపవచ్చు. కాని ఈ విషయంలో చాల అభిప్రాయబేధాలున్నాయి.

విక్రమ సంవత్సరం, శకసంవత్సరం ప్రారంభకులేవరో నిర్ధారణ కాకపోయినా, సంవత్సరాల తరబడి వాటిని ప్రజలు ఉపయోగించారు.

మోహన్ ప్రసంగం ముగించాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here