[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 26వ భాగం. [/box]
36
[dropcap]“ఎ[/dropcap]క్కడ ఎలా మొదలు పెట్టాలో తెలియడం లేదు” అన్నాడు మోహన్.
“మీరు ఏవిషయం గురించి చెప్పాలనుకుంటున్నారు?” శశికళ అడిగింది.
“చెప్పేదేదో కొంచెం మొదటినుంచి మొదలు పెడితే బాగుంటుంది” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
లోయలో చలి తగ్గిపోయింది. మాఘమాసం వెళ్ళిపోయింది. శిశిరం ప్రవేశించడంతో చెట్ల ఆకులు రాలడం ప్రారంభించాయి.
“వజ్రయాన దేవతలను పరిచయం చేయాలనుకుంటున్నాను” అన్నాడు మోహన్.
“బుద్ధుడి నుంచి మొదలు పెట్టండి” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.
రాత్రి చాలా ప్రశాంతంగా ఉంది. నడినెత్తికి చంద్రుడు వచ్చాడు. చేమంతుల పూత అయిపోయింది.
మోహన్ చెప్పడం మొదలు పెట్టాడు :
బుద్ధుడు, పూర్వాచారపరాయణుల సమాజం ప్రవేశపెట్టిన సర్వాన్ని సవాలు చేశాడు. వారి కులవ్యవస్థను, వారి తాత్విక విచారాలను అన్నిటిని ప్రశ్నించాడు.
బుద్ధుడు పూర్వాచారపరాయణుల సమాజానికి చెందినవాడో లేదో నిర్ణయించడం కష్టం. అతని జీవితం గురించి చెప్పిన సాంప్రదాయకమైన గ్రంథాలలో అతడు క్షత్రియుడని చెప్పబడింది. అతడు కపిలవస్తువుకు చెందినవాడు. పూర్వాచారపరాయణుల ప్రభావానికి వెలుపల ఉంది అది. దాని చుట్టూ వ్రాత్యుల తెగలున్నాయి. దీనిని బట్టి బుద్ధుడు వ్రాత్యుల వంశంలో నిజంగా జన్మించాడని, దానినే క్షత్రియవంశమని పురాతన సాహిత్యంలో అన్నారని తెలుస్తుంది. పురాతన వంశాలలో క్షత్రియులు ద్విజులు – దశవిధ సంస్కారాలకు పాత్రులైనవారు. కాని మనకు లభించే బుద్ధుడి జీవితం యొక్క వివరాలలో ఈ పది సంస్కారాల గురించి లేదు, అన్నిటికన్న ముఖ్యమైన ఉపనయన సంస్కారం గురించి కూడా లేదు. ఈ యజోపవీత ధారణ వ్రాత్యునికి, పూర్వాచార పరాయణుడైన ద్విజుడికి కల భేదాన్ని విశదీకరిస్తుంది. ద్విజుడు ఉపనయన వయస్సును దాటిపోయినట్లైతే ద్విజుడికన్న తక్కువైన వ్రాత్యుని స్థితికి దిగజారిపోతాడని మనుసంహితతో ఉంది.
అత ఊర్థ్వం త్రయోప్యేతే యథాకాలమ సంస్కృతాః
సావిత్రీ పతితా వ్రాత్యా భవన్త్యార్యవిగర్షితాః
ఈ వివరాలను బట్టి బుద్ధుడు చట్టబద్ధంకాని వ్రాత్యుడై ఉంటాడని తెలుస్తుంది. కాని, తరువాత తరాల రచయితలు అతనిని క్షత్రియుడిగానే నిర్ణయించారు. అతని బోధనలను సరిగా అర్థం చేసుకోడానికి, చట్టబద్ధంకాని వ్రాత్యుడతడని మనం గ్రహించవలసి ఉంటుంది. ముఖ్యంగా మూర్ఖపు పట్టుదలతో ప్రకటించిన అతని అభిప్రాయాలు, వ్రాత్యమనస్సును, వ్రాత్యతత్వాన్ని సూచిస్తాయి.
లలిత విస్తరంలో బుద్ధుడి జీవితకథ చెప్పబడి ఉంది. బుద్ధుడి తల్లిదండ్రులు శాక్యవంశస్థులు, కపిలవస్తువును పాలించినవారు. బౌద్ధమతాన్ని స్థాపించినవారిలో అతడు మొదటివాడు కాడు. అతనికి పూర్వం ఆరుగురు బుద్ధులు, విపశ్య, శిఖ, విశ్వభు, క్రకుచ్ఛంద, కనకముని, కశ్యప – ఈ ఆరుగురు బుద్దులు గౌతమ బుద్ధునికన్న ముందువారు. గౌతమ బుద్ధుడు ఏడవవాడు – బుద్ధుడి మహాపరినిర్వాణం క్రీస్తు పూర్వం 483లో సంభవించింది. ఎనిమిదవ బుద్ధుడైన మైత్రేయుడు, గౌతమ బుద్ధుని మహాపరినిర్వాణం అయిన 4000 సంవత్సరాలకు భూమిపై అవతరిస్తాడు.
గౌతమ బుద్ధుడు భూమిమీద అవతరించి ఒకే జన్మలోనే జ్ఞానోదయం పొందలేదు. నిజానికి గౌతమబుద్ధుడు చాలవందల జన్మలు, పునర్జన్మలు ఎత్తేడని, ప్రశంసాపాత్రమైన మహాకార్యాన్ని ప్రతిజన్మలోను ఆచరించాడని జాతక కథలలో చెప్పారు. అతడు 83 సార్లు సన్యాసిగాను, 58 సార్లు రాజుగాను, 43 సార్లు వృక్ష దేవతగాను, 26 సార్లు మతబోధకుడుగాను, 24 సార్లు మంత్రిగాను, 24 సార్లు పురోహితుడుగాను, 24 సార్లు అగ్రవారసుడుగాను, 23 సార్లు సద్వంశసంజాతుడుగాను, 22 సార్లు పండితుడు గాను, 20 సార్లు ఇంద్రుడుగాను, 18 సార్లు మర్కటంగాను, 13 సార్లు వర్తకుడు గాను, 12 సార్లు ధనికుడుగాను, 12 సార్లు కోడిపెట్టగాను, 10 సార్లు లేడిగాను, 10 సార్లు సింహంగాను, 8 సార్లు బాతుగాను, 6 సార్లు ఏనుగుగాను, 5 సార్లు గరుడడు గాను, 4 సార్లు గుర్రంగాను, 4 సార్లు చెట్టుగాను, 3 సార్లు కుమ్మరిగాను, 3 సార్లు అంటరాని వాడుగాను, 2 సార్లు చేపగాను, 2 సార్లు మావటివాడుగాను, 2 సార్లు ఎలుకగాను, 1 సారి వడ్రంగి గాను, 1 సారి కమ్మరిగారు, 1 సారి కప్పగాను, 1 సారి కుందేలు గాను జన్మలను ఎత్తాడు. ఈ జన్మలన్నింటిలోను, బౌద్ధమతాన్ని స్థాపించిన గౌతమబుద్ధుడు ఒకటిగాని, అంతకు మించికాని సత్కార్యాలు చేశాడు. ఉపకార బుద్ధి, స్వార్థ త్యాగం, పరాక్రమం, జ్ఞానం, మైత్రి, దాతృత్వం ఆ సత్కార్యాలకు చెందినవి. ఆ సంఖ్యాకమైన పూర్వజన్మలలో చేసిన సత్కార్యాలకు ఫలితంగా గౌతమ బుద్ధుడికి జ్ఞానోదయం కలిగింది. సంసార చక్రం నుండి విముక్తి లభించింది.
గౌతమ బుద్ధుడి చిన్నతనపు పేరు సిద్ధార్థుడు. రాజధాని నగరమైన కపిలవస్తువుకు సమీపంలో ఉన్న రమణీయమైన ఉద్యానవనంలో అతడు జన్మించాడు. అతని తల్లి, అతడు జన్మించిన ఏడు రోజుల తరువాత మరణించింది. తరువాత హిమాలయాలనుండి ఒక ఋషి, అసితుడు, వచ్చి, అతని 32 ముఖ్య లక్షణాలను, 80 ఉపలక్షణాలను పరిశీలించి, ఆ బాలుడు పెద్దవాడయితే, గృహజీవితానికి కట్టుబడితే, సార్వభౌముడవుతాడని అన్నాడు. అతడు సర్వసంగపరిత్యాగి అయితే పరిపూర్ణమైన జ్ఞానసిద్ధి కలుగుతుందని భవిష్యత్తును సూచించాడు.
కొంతకాలం తరువాత సిద్ధార్థుడు, గురువు విశ్వామిత్రుడి దగ్గరికి విద్య నేర్చుకోడానికి వెళ్ళాడు. ఆ సరికే సిద్ధారునికి 64 లిపులలో ప్రావీణ్యమున్నట్లు అతడు తెలుసుకున్నాడు. తనకన్న తన శిష్యుడికే హెచ్చు వచ్చుననుకున్నాడు. బాలుడు వేగంగా వేదాలలో ఉపనిషత్తులలో సంపూర్ణ విజ్ఞానం పొందాడు. చాలా పూర్వాచార పరాయణుల శాస్త్రాలు నేర్చుకున్నాడు. అతనికి రాజధాని నగరానికి తెచ్చి, శాక్యదండపాణి కూతురైన గోపనిచ్చి పెళ్లి చేశారు. అతనికి మొదటి శిశువు జన్మించిన శుభదినాన్ని, సౌందర్యరాశి, యువకుడు అయి సిద్ధార్థగౌతముడు, రాజకుమారుడు, సింహాసనానికి ముఖ్య వారసుడు సన్యసించాడు. ఒంటరిగా, ఎవరూ తోడులేకుండా, మానవ జాతికి విముక్తి కలిగించే శాశ్వత సత్యాన్ని అన్వేషించడానికి తల పెట్టాడు. ఈ సన్యాసానికి కారణమైన పరిస్థితుల గురించి లలిత విస్తరంలో ఈ విధంగా ఉంది.
ఒక దినాన్న గౌతముడు నగరం పరిసరాలలో ఉద్యానవనాలకు పోయి అక్కడ అందమైన వృక్షాలను, చూడాలని నిశ్చయించాడు. అప్పుడు ఒక వీథిలో, అతనికళ్ళ ముందు వార్థక్యం వలన క్షీణించిన ముసలివాడొకడు కనిపించాడు. అతని చర్మం ముడతలు పడింది. వెంట్రుకలు లేకుండా బట్టతల కనిపించింది. అతని పళ్ళు ఊడిపోయాయి. అతని శరీరం బలహీనత వలన వంగింది. వణుకుతున్న అతని అవయవాలకు దండమొకటి ఆధారమయింది. అటువంటి ముదుసలి ఒకడు రాజకుమారుడి దృష్టిలో పడ్డాడు. గౌతముడు తన రథసారథిని ముసలివాని గురించి చెప్పమన్నాడు. చైత్యన్యం కల ప్రాణులన్నిటికి సర్వసాధారణంగా ఈ అదృష్టమే పడుతుందని సారథి అన్నాడు. జన్మించిన ప్రాణి మరణించక తప్పదని అతడు అన్నాడు.
కొద్ది సేపటిలో మరొక విచిత్రమైన దృశ్యం సిద్ధార్థుడి కంటబడింది. బాటమీద నిలుకడ లేకుండా నడుస్తున్నాడతడు. రోగం చేత అతని శరీరం పాలి పోయింది. బాధతోను, దుఃఖంతోను అతడు క్షీణించి పోయాడు. అతడు ఊపిరి తీసుకోడానికి కష్టపడుతున్నాడు. అతడు రోగి అని, రోగం అందరికి సర్వసామాన్యమని సారథి చెప్పాడు.
మరికొద్ది సేపటిలో పాడెమీద మోసుకుపోతున్న శవమొకటి గౌతముడి కంటపడింది. అతడు సారథిని అడిగాడు.
“పక్కమీద పడుక్కొని, వింతయైన బట్టలు ధరించిన ఇతడెవడు? ఇతని చుట్టూ ఉన్న జనులెందుకు ఏడుస్తున్నారు? విచారిస్తున్నారు?”
“ప్రభువా! దీనిని మృత శరీరమంటారు. అతని జీవితం ముగిసిపోయింది. అతని శరీరానికి అందం కాని, ఆకారం కాని లేదు. అతడు ఎండి పడిపోయిన చెట్టుతోను, రాతితోను సమానం. అతడు శిథిలమైన గోడవలె, పడిపోయిన ఆకువలె ఉన్నాడు. అతడు ఇకమీద తన తండ్రిని కాని, తల్లిని కాని, సోదరుడిని కాని, సోదరిని కాని చూడలేదు. అతని దేహం చచ్చిపోయింది. నీ శరీరం కూడా ఈ స్థితికి చేరుకుంటుంది.”
ఉత్తముడైన రాజకుమారుడు దీనిని భరించలేకపోయాడు. గట్టిగా అరచాడు.
ధిక్ యౌవనేన జరయా సమభిదృతేన
ఆరోగ్య ధిక్ వివిధ వ్యాధి పరాహతేన
ధిక్ జేవితేన పురుషో న చిరస్థితేన
ధిక్ పండితస్య పురుషస్య రతిస్రసంగైః
యది జర న భావేయా నైవవ్యాధిర్నమృత్యుః
తదపిచ మహదుఃఖం పంచస్కంధం ధరంతే
కింపున జరవ్యాధి మృత్యునిత్యానుబట్టిః
సాదు ప్రతినివర్త్య చింతయిష్యే ప్రమోచం
(లలిత విస్తరం నుండి)
యౌవనం నింద్యమైనది – ముసలితనం దానిని వెంటాడుతున్నది.
ఆరోగ్యం నింద్యమైనది. చాలా రోగాలతో అది ప్రమాదానికి లోనవుతున్నది.
జీవితం నింద్యమైనది – జీవితం శాశ్వతమైనది కాదు.
పండితులు నిందించదగినవారు – వారు రతిప్రసంగాలు చేస్తుంటారు.
రోగాలు, ముసలితనం, మృత్యువు లేకపోయినా, పంచస్కంధాలు గొప్ప బాదను కలిగిస్తాయి. మనను విడువకుండా ముసలితనం, రోగాలు, మృత్యువు మనకు నిరంతరం సన్నిహితులుగా ఉంటే చెప్పేదేముంది? కాబట్టి నేను గృహానికి మరలిపోయి మానవ జాతికి వీటినుండి విముక్తి కలిగించడానికి ప్రయత్నిస్తాను.
మరునాడు, సిద్ధార్థుడు ఇటువంటి ఆలోచనలో ఉండగా అతనికొకడు కనిపించాడు. అతడు తూచి అడుగులు వేస్తున్నాడు. తల బోడిగా ఉంది. సన్యాసుల దస్తులు ధరించాడు. కుడి భుజం మీద వస్త్రమేది లేదు. అతని కుడి చేతిలో దండముంది. ఎడమ చేతిలో భిక్షాపాత్ర ఉంది. ఇతడు ఇతరుల ఔదార్యం మీదనే ఆధారపడ్డవాడు. అతడు తన ఆకలిని, శారీరకమైన కోరికలను నియంత్రణలో ఉంచుకుంటాడు. ఎవరికి హాని చేయడు. అందరికి మంచినే చేస్తాడు. అందరిపట్ల దయగలిగి ఉంటాడు. ఈ విధంగా రథసారథి అతని గురించి గౌతముడికి చెప్పాడు.
రాజకుమారుడు ఆ మనుష్యుడిని పిలిచి అతని గురించి చెప్పమన్నాడు. సన్యాసి ఈ విధంగా తన గురించి చెప్పుకున్నాడు.
“నేను ఇల్లు వాకిలి లేని సన్యాసిని. నేను ప్రపంచాన్ని పరిత్యజించాను. బంధువులను, స్నేహితులను విడిచి పెట్టాను. నేను ముక్తిని కోరుకుంటున్నాను. సకల ప్రాణుల ముక్తిని కోరుతున్నాను. ఎవరికి నేను హాని చేయను.”
రాజకుమారుడు వెంటనే రాజభవనానికి మరలిపోయాడు. ప్రపంచాన్ని పరిత్యజించడానికి తండ్రి అనుమతిని కోరాడు. కాని రాజు అటువంటి అనుమతిని ఇవ్వలేదు. పైగా అతని పై కాపుదలను ఉధృతం చేశాడు. ఆకర్షణీయమైన పరిస్థితులను కల్పించాడు. రాజకుమారుడి మనస్సు ఆధ్యాత్మికమైన ఆలోచనలవైపు పోకుండా ప్రయత్నం చేశాడు. కాని రాజపుత్రుడి సంకల్పం దృఢతరమయింది. అతడు ప్రపంచాన్ని పరిత్యజించాడు. భార్యను, శిశువును, తండ్రిని, బంధువులను విడిచి పెట్టాడు. సంపదలను ఐహిక సుఖాలను త్యజించాడు. పరివ్రాజకుడుగా మారిపోయాడు. ఒకచోటునుంచి మరొకచోటికి తిరిగాడు. ప్రఖ్యాతులైన తత్త్వవేత్తలను కలిశాడు. వారికింద కొంతకాలం అధ్యయనం చేశాడు. కాని అతడు కోరినది లభించలేదు. బాధిపీడితులైన మానవులకు ఏవిధంగా ముక్తి లభిస్తుందో ఎవరూ అతనికి చెప్పలేకపోయారు. అతడు చాలా గొప్ప నిరాశకు లోనయాడు. నిజం తెలుసుకోడానికి ప్రయత్నించాడు. ఆత్మావలోకనం వలన, ధ్యానం వలన, తన శరీరాన్ని తానే బాధకు లోనుచేయడం వలన, కఠోర నియమాలను ఆచరించడం వలన నిజాన్ని తెలుసుకోదలచాడు. అతడు గయ సమీపంలో ఉన్న ఉరువిల్వానికి వెళ్ళి ప్రయత్నం చేశాడు. ఐదుగురు సన్యాసులతో తీవ్రమైన అస్ఫానక సన్యాసాన్ని, దానితో ఆరు సంవత్సరాల ఉపవాస దీక్షను, కఠోర నియమాలతో ఆచరించాడు. ఎత్తుగా ఉన్న ఆసనంమీద, పద్మాసనంలో, ఎండకు, వానకు, మంచుకు, చలికి శరీరాన్ని అర్పించి, ప్రతిదినం తినవలసిన ఆహారాన్ని ఒక్క బియ్యపు గింజకు పరిమితం చేసి, ఆరు దీర్ఘ సంవత్సరాలు తపస్సు సాగించాడు. అతని శారీరక మానసిక శక్తులు పూర్తిగా ఉడిగి పోయాయి. చివరకు అతడు ఒకదినం తెలివితప్పి పడిపోయాడు. అతనికి ఎటువంటి మానసిక శాంతి లభిచంలేదు. దివ్యజ్ఞానం కలగలేదు. అతడు తన తప్పును తెలుసుకున్నాడు. సహజమైన మార్గంలో ఆహారం తీసుకున్నాడు. అప్పుడతనికి సత్యం తోచింది. అసంఖ్యాకములైన జన్మల చక్రం నుండి స్వేచ్ఛ లభించాలంటే, అత్యధికమైన నియమాలకు శరీరాన్ని హింసించడం వలన కాని, అత్యథికంగా ఐహిక సుఖాలకు లోనవడం వలన కాని జరగదు. మధ్యేమార్గాన్ని అనుసరించడం వలన అది సాధ్యమవుతుంది. అతడు ఇంకా ధ్యానించాడు. బౌద్ధంలో కార్యకారణ సంబంధమనే పన్నెండు కొక్కాల గొలుసును కనుగొన్నాడు. ప్రాపంచిక దుఃఖాలకు అంతిమ కారణం అవిద్య అని తెలుసుకున్నాడు. పన్నెండు కొక్కాల గొలుసు పద్ధతిలో అది కోరికలను పెంచుతుంది. క్రమంగా బుద్ధుడికి సత్యం గోచరించింది. ప్రపంచంలోనిదంతా వాస్తవంకానిది, అంతా చైతన్య పదార్థం కాదు. నిర్వాణ మొక్కటే ప్రశాంతమైనది. అతడు నాలుగు సమున్నతమైన సత్యాలను తెలుసుకున్నాడు. నిర్వాణానికి దారితీసే అష్టగుణ సమున్నత మార్గాన్ని తెలుసుకున్నాడు. బుద్ధుడు ఈ సిద్ధాంతాలను తోటి మానవలకు బోధించడానికి దృఢంగా నిశ్చయించుకున్నాడు. ఈ ప్రయోజనాన్ని దృష్టిలో ఉంచుకొని వారణాసికి సమీపంలో ఉన్న మృగదావం వెళ్ళాడు. అక్కడ మొట్టమొదటిసారిగా చాలా కాలమయి అతనిని విడిచివెళ్ళిపోయిన, ఉరునిల్వకు చెందిన మిత్రులకు బోధించాడు.
మొదటి ధర్మప్రసంగం, దర్మ చక్రప్రవర్తన లేక ధర్మం చక్రం యొక్క వర్తుల భ్రమణం అన్నది. మొదటి సారి ఋజుప్రవర్తన యొక్క చక్రాన్ని ప్రపంచంలో దొర్లించడం. అటు పిమ్మట అతడు భారతదేశంలో ఉత్తర ప్రాంతాలలో సంచరించి ప్రజలను బౌద్ధంలోకి మార్చాడు. బౌద్ధ సంఘాలను నెలకొల్పాడు. వాళ్లు ఈ సూత్రం పఠించిన తరువాత సంఘంలోకి చేర్చుకున్నాడు.
బుద్ధం శరణం గచ్ఛామి – ధర్మం శరణం గచ్ఛామి – సంఘం శరణం గచ్ఛామి.
కులం, మతం అన్న భేదం కాని, స్త్రీ పురుషులన్న బేదంకాని పరిగణించకుండా సంఘం అందరికొరకు తెరువబడింది. వేరు వేరు మఠాలు, సన్యాసులకు సన్యాసినులకు ప్రత్యేకించబడ్డాయి. కుప్పలుగా గృహస్థులను లౌకిక సోదరులుగా స్వీకరించాడు. ప్రశాంతమైన స్వర్గాన్ని అందరికోసం స్థాపించడమే బౌద్ధం యొక్క విజయానికి కారణం.
గొప్ప సామాజికమైన మార్పుకు బుద్ధుడు కారణమయాడు. బ్రాహ్మణుల పూర్వాచార పరాయణత్వాన్ని గొప్పగా నిరసించినవాడు అతడు. అతని మతానికి కులం అవరోధం కాదు. అతడు సంస్కృతాన్ని కాదని ప్రజల భాషలో బోధించాడు. అతడు వేదాల అధికారాన్ని తృణీకరించాడు. అతని మతంలో దేవుడికి స్థానం లేదు. అతని మతానికి చట్టబద్ధమైన ఉత్తరువులేమీ లేవు.
దానిని ముందుకు నడిపే సంస్థలు ఏవీలేవు. అయినా, బుద్ధుడు ఒక యుగానికి చెందినవాడు. అందుచేత అతడు పూర్తిగా, ఆ కాలంలో వ్యాప్తిలో ఉన్నమూఢ విశ్వాసాలకు అతీతుడు కాలేకపోయాడు. తాత్వికమైన చింతనలు సతర్కంగా ఆ కాలం నాటివి నిర్ధారణ కాలేదు. అతని మతం రమారమి హేతువాదం పైనే అధారపడింది. అతడు తన అనుయాయులకు తన సిద్ధాంతాలను సవాలు చేయడానికి, పరీక్షించడానికి అవకాశమిచ్చాడు. వేదాల అధికారాన్ని సవాలు చేసిన వారిని, బ్రాహ్మణులు బహిష్కరించారు. అతడు ఆ విధంగా చెయ్యలేదు. సహజంగా ఈ సనాతన సమాజం వాళ్ళు బుద్ధుడిని ప్రోత్సహించలేదు, అతనిని పూర్వాచార పరాయణత్వానికి విరోధిగా పరిగణించారు. శూద్రులుగా మారలేని అధికసంఖ్యలో ఉన్న వ్రాత్యులు ఆదిమ వాసులు – వీరితోనే బుద్ధుడు తృప్తి చెందాడు. వాళ్ళు సనాతన బ్రాహ్మణమతం దగ్గరికి కూడా చేరడానికి అవకాశం లభించలేదు. ఈ కారణం చేతనే అతడు సంస్కృతాన్ని విడిచి, ప్రజల భాషలోనే బోధించాడు. సులభగ్రాహ్యమైన గ్రంథాలేవీ, అతడు తన నిర్ణయాలను, తాత్విక పద్ధతులను వివరిస్తూ, రచించలేదు. అతడు మౌఖికంగా సర్వం ఉపదేశించాడు. అతని మరణానంతరం వాటిని శిష్యులు సేకరించారు. వాటినే బౌద్ధ త్రిపిటకాలంటారు. అతడు, జీవించి ఉన్న కాలంలో, భిన్నమైన రీతులలో వేరు వేరు వ్యక్తులకు, భిన్నమైన మనస్తత్వం కలవారికి, భిన్నంగా విషయం అర్థం చేయసుకునే వారికి బోధించాడు. అందుచేతనే అతని బోధనలలో, ఒకే విషయంపై పరస్పర విరుద్ధమైన అభిప్రాయాలు కలుగుతాయి.
పునర్జన్మల గురించి, సంసార చక్రం గురించి వివరణాపూర్వకమైన సిద్ధాంతాన్ని రుజువు చేయకుండానే అతడు స్వీకరించాడు. ఆ విధంగానే మోక్షాన్ని నిర్ధారింపబడిన విషయంగా అతడు పరిగణించాడు. ఆ ప్రకారమే కర్మసిద్ధాంతాన్ని కూడా స్వీకరించాడు. అతడు సులభమార్గాలలో ముక్తిని సంపాదించడానికి కఠోర నియామాలను అవలంబించడం వలన, సన్యాసం వలన, ధ్యానం వలన వీలవుతుందని విశ్వసించాడు. అతడు వాటిని తన నూతన మతం యొక్క పద్ధతిలో ప్రవేశపెట్టి తనవారికి బోధించాడు. అతని కాలంలో ప్రజలు అసందర్భమైన మూఢ విశ్వాసాలలో మునిగి, సులభమైన దగ్గిర దారుల గుండా ముక్తిని కోరుకునేవారు. మంత్రాలను అభ్యసించడం వలన, ఆత్మనిగ్రహం వలన, మరికొన్నింటిని ఆచరించడం వలన వారు ముక్తిని కోరుకునే వారు. ఆ అభ్యాసాలలో కొన్ని రోత పుట్టించేవిగాను, కొన్ని అసహ్యంగాను ఉండేవి. మంత్రాలను ప్రజలు విరివిగా ఉపయోగించేవారు. వాటిని అభ్యసించే వారికి అద్భుత శక్తులు లభిస్తాయని వారు నమ్మేవాళ్ళు. బుద్ధుడు చాలా తెలివైన నిర్వాహకుడు. ప్రజా బాహుళ్యంలో ఇటువంటి మనస్తత్వం ఉండడం అతనికి అనుకూలించింది. ఈ మంత్రయుక్తమైన అభ్యాసాలను పూర్తిగా అతడు తన మతంలో కాదనలేదు, అతడు స్వయంగా వాటిని నమ్మాడో లేదో చెప్పడం కష్టం. మత స్థాపకుడైన బుద్ధుడు జ్ఞానులైన వారి మనస్థితి తెలుసుకొని, మరుచటి జన్మకు, మోక్షానికి ఆశలు కల్పించడమే కాకుండా, సుదూరమైన మోక్షం గురించి, మరుసటి జన్మయొక్క లాభాలను గూర్చి తెలియని సామాన్యులను కూడా దృష్టిలో ఉంచుకొన్నాడు. ఈ రెండవ తరగతి సామాన్య ప్రజలను సంతృప్తి పరచడం గురించి, బుద్ధుడు ఏదో విధమైన మంత్రాలను, ధారణులను, ముద్రలను, మండలాలను ప్రవేశపెట్టాడు. ఈ జన్మలోనే సంపదలు పొందదలచేవారు వీటిని అభ్యసించి సంతృప్తి పొందుతారని అతడు భావించాడు.
బ్రహ్మజాల సుత్తంలో చాలా హెచ్చుగా విద్యలు, లేక రహస్య శాస్త్రాల గురించి చెప్పబడింది. ఇవి బుద్ధుడి కాలంలో ఉండేవి. ఇవి తిరచ్ఛనమైనవి, లేక వక్రమైనవి అని బుద్ధుడు ఖండించాడు.
ఆ కాలంలో చాలా విద్యలు ప్రచారంలో ఉండేవి. బుద్ధుడి అభిప్రాయంలో ఇతర విద్యలు తిరచ్చిన్నమైనవి కావు. వక్రమైనవి కావు. ఏ నిందకు అవి చెందినవి కావు. ఇటువంటి రహస్యమైన విద్యలను బుద్ధుడు తన మతంలో ప్రవేశ పెట్టాడు.
దీఘనికాయంలో బుద్ధుడు చెప్పాడు. “ఈ రహస్యమైన అభ్యాసాలను నేను ఏవగించుకుంటాను. ఈ అభ్యాసాలలో ప్రమాదముంది. ఇవంటే నాకు సిగ్గు వేస్తుంది.”
బుద్ధుడు బోధించిన మతం అసంఖ్యాకమైన మార్పుల ద్వారా సాగి వజ్రయానంగా మారింది. దీని తత్వమే వింతైనది, వింతైన సిద్ధాంతాలు, వింతయేన ఆచారాలు, అభ్యాసాలు దీని ప్రత్యేకత. వజ్రయానం లేక తాంత్రిక బౌద్ధంలోకి మొదటితరం బౌద్ధం మారిపోయింది. ముఖ్యంగా మూడు అంశాలు బౌద్ధం యొక్క పతనానికి దారి తీశాయి. బుద్ధుడు నిర్వాణం చెందని కాలంనుండి 13వ శతాబ్దంలో మహమ్మదీయులు భారత దేశం మీద దాడి జరిపిన వరకు ఈ క్షీణదశ క్రమంగా శతాబ్దాల తరబడి సాగింది. బౌద్ధుల నిర్వాణం నుండి మహా సుఖ సిద్ధాంతం వెలువడింది. దౌర్బల్యానికి ప్రాథమిక కారణమిది. ఇది మతం యొక్క బలాన్ని నీరసపరచిన మొదటి కారణం. సంఘసభ్యులను అసహజమైన నియమాలకు, కఠోరమైన నిబంధనలకు, క్రమశిక్షణకు వెలివేయడం రెండవ కారణం. సంఘ సభ్యులు కొంతవరకు వాటి పట్ల శ్రద్ధ వహించారు. అటుతరువాత వాటిని పాటించలేకపోయారు. బుద్ధుడు కూడా ఈ విధంగానే ఆచరించాడు. మూడవ కారణం కరుణ సిద్ధాంతం. ప్రతి ప్రత్యేక బుద్ధుడు తన సర్వస్వం త్యాగం చేయాలి. తనను, తన సౌఖ్యాన్ని తన కుటుంబాన్ని, బిడ్డలను, బాధలకు లోనయిన మానవజాతి యొక్క నిర్వాణం గురించి త్యాగం చేయాలి. ఇది సమాన్యప్రజలలో హెచ్చుగా వ్యాప్తి చెందింది. దీని ఫలితం – ఇతరులను నిర్వాణ పథంలోకి కొనిపోయే మొక్కుబడి కేవలం ఆచార ప్రాయంగా మిగిలింది. ఇంకా అన్యాయం ఏమి జరిగిందంటే, మత గురువులు దీని చాటున ఘోరమైన పాపాలను చేయడం, దుర్నీతికి పాల్పడడం జరిగింది.
వజ్రయానం ఎప్పుడు ఉద్భవించిందో చెప్పడం కష్టం. మౌలికమైన బౌద్ధంలో తాంత్రిక బౌద్ధం యొక్క బీజాలు, ముద్రలు, మంత్రాలు, మండలాలు, ధారణులు – వీటి రూపంలో ఆ సరికే ఉన్నాయి. యోగం, సమాధి ప్రపంచంలో సౌఖ్యాన్ని, అభివృద్ధిని పొందడానికి ఆధారంగా భావించారు. బుద్ధుడి కాలంలో అసందర్భమైన మూఢ విశ్వాసంతో భారతదేశం కూరుకొని పోయింది. సర్వమానవులకు సమ్మతమైన మతాన్ని నెలకొల్పడం బుద్ధుడి అభిమతం. అటువంటి సందర్భంలో అతడు ఇటువంటి అభ్యాసాలకు పూర్తిగా నిషేధించాడని ఊహించలేము. అతని అనుయాయులు చాలమంది సౌఖ్యాన్ని, సౌభాగ్యాన్ని ఈ ప్రపంచంలో తొందరగా పొందడానికి, బుద్ధుడు చెప్పిన పద్ధతిలో ఆత్మనాశనం చేసుకొని నిర్వాణం పొందడానికి సుముఖులు కాలేకపోయారు. తన శిష్యులలో అటువంటి వారికి బుద్ధుడు మంత్రాలు, ముద్రలు, ధారణులు, యోగం, సమాధి అన్నవి ప్రసాదించాడు. బుద్ధుడి కాలంలోనే అటువంటి శిష్యులు కొంతమంది మహాశక్తులు పొంది అద్భుతాలను ఆచరించేవారు. తరువాత దశలో తాంత్రిక బౌద్ధం, ఆర్యమంజుశ్రీ మూల కల్పంలో చెప్పబడినట్లు, అభివృద్ది చెందింది. ఇది చాలా ప్రాచీనమైనది. దీనిగురించి వైపుల్య సూత్రాలలో చెప్పబడింది. వైపుల్య సూత్రాలు క్రీస్తుశకం 4 లేక 5వ శతాబ్దంలో నామరూపాలు లేకుండా పోయాయి. మూడు సంపుటాలుగా వచ్చిన ఈ వైపుల్య సూత్రాలలో ముద్రలు, మండలాలు, మంత్రాలు దేవతల గురించి వీటిలో వర్ణించిన మహిమా సంపదను చూసి మనం ఆశ్చర్య చకితులవుతాము. క్రీస్తుశకం 2 లేక 3వ శతాబ్దంలోనో, అంతకు పూర్వం, బుద్ధుడి కాలంనుండో ఉండి అవి ఉండవచ్చు. మంజుశ్రీ మూలకల్పంలో ఉన్న సంగతులు అంతకుపూర్వం ఉన్న అటువంటి సాహిత్యం బాగా తెలిసిన తరువాతనే బోధ పడతాయి. మంజుశ్రీ మూలకల్పం తరువాత వజ్రయానం పెంపు చెందడానికి కారణమైన గ్రంథం గుహ్యసమాజ తంత్రం లేక తథాగత గుహ్యకము – దీనినే అష్టాదశ పటలమని కూడా అంటారు. ఈ గ్రంథంలో తొలిసారిగా వజ్రయానం గురించి, ఐదుగురు ధ్యానిబుద్ధుల గురించి ఐదుబుద్ధ కుటుంబాల గురించి చెప్పబడింది. వజ్రయాన సంబంధియైన మండలం గురించి వివరింపబడింది. తాంత్రికులు చేసే చాలా పనులు బహిరంగంగా తెలిస్తే, చాలమంది దిగ్బమ చెందుతారు. అంటే, ఇవి రహస్యంగా తొలి దశలో ఆచరించబడేవి. గుహ్య సమాజం తంత్రంలో చాలా అభ్యాసాలు వెంటనే నలుగురికి తెలియవలసినవి కావు. వీటిని ప్రజలు స్వీకరించడానికి ముందుగా తగినంత ప్రయత్నం చేయాలి. ఆ విధంగా తంత్రాలు ప్రత్యేక వ్యక్తుల చేతులలోకి పోయి, చాలా రహస్యమైన పద్ధతిలో, గురుశిష్య పరంపరలో, మరొక 300 సంవత్సరాల తరువాత ప్రచారంలోకి వచ్చాయి.
(సశేషం)