శ్రీపర్వతం-29

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 29వ భాగం. [/box]

[dropcap]పె[/dropcap]ట్రీ తాను తవ్వకాలు జరుపుతున్న చోటనే రాజ భవనం ఉందని ఒక నిశ్చయానికి వచ్చాడు. ఎందుచేతనంటే, ఆ ప్రాంతంలో జరిపిన తవ్వకాలలో లభించిన మట్టి పాత్రల ముక్కలు, దేవాలయంలో ఉపయోగించే మట్టి పాత్రల ముక్కల కన్నా భిన్నంగా ఉన్నాయి. ఈ రాజు భవనం ఉండే జాగాలో మూడు రకాల వస్తువులు బయట పడ్డాయి. ఇటుక కట్టడాల భాగాలు, ఇసుక రాతి స్తంభాల అడుగు భాగాలు, రాతి గోడల పునాదులు ఈ విధంగా బయటపడ్డాయి. రాజు భవనానికి దక్షిణంగా చాలా పెద్ద హాలు ఒకటి బయట పడింది. దీని పొడవు నూట నలభై మీటర్లు, వెడల్పు డెబ్బై ఏడు మీటర్లు – ఆ హాలులో 542 స్తంభాల శిథిలాలు బయట పడ్డాయి. దీనికి ఆగ్నేయం వేపు చాలా ద్రాక్షరసం నిలువచేసే జాడీలు, నూనె పోసుకునే జాడీలు వెలువడ్డాయి. చాలా జాడీల మీద ‘రెండు’ అంకె చెక్కబడి ఉంది. బహుశా ఇవి అఖేనటేన్ రెండవ పాలనా వత్సరానికి చెందినవి కావచ్చు. ఈ హాలుకి ఈశాన్యపు మూలను చాలా సామాను గదులున్నాయి. మిగిలిన వస్తువులతో పాటు, నీలంగా ఉన్న పాత్రల ముక్కల మీద అఖేనటేన్, నెఫర్ టిట్టీల పేర్లు ఉన్నాయి. ఈ భవనం వెలుపలి భాగం చాలా ముఖ్యమైనది. రాజమార్గానికి పడమట వేపు రాజ భవనం ఉంది, తూర్పు వేపు రాజ దంపతుల ప్రత్యేక భవనాలున్నాయి. రాజభవనాన్ని, ఈ ప్రత్యేక మందిరాలకు వెళ్ళడానికి రాజ దంపతులు మధ్యనున్న రాజమార్గం పైన నడిచి దాటనక్కరలేదు.

రాజ దంపతుల ప్రత్యేక మందిరాలు ఒక ఆవరణలో దగ్గిర దగ్గరగా ఉన్నాయి. వాటిలో ఒక పెద్ద పడక గది బయట పడింది. దాని నుండి అలంకారం చేసుకునే గదికి, స్నానాల గదికి, వేరుగా నున్న మరుగు దొడ్డికి ద్వారాలున్నాయి. చిన్నపిల్లలను ఆడించే మండపం ఒకటి, దానితో పాటు దాదుల నివాసగృహాలు బయటపడ్డాయి.

పురాతత్త్వ పరిశోధకుడికి రెండు ముఖ్య గుణాలుండాలి. మొదటిది పట్టుదల, రెండవది చక్కగా ఊహించడం.

కార్టర్ పనిచేస్తున్న ఆలయం, పూర్వం అటెన్‌కి అంటే సూర్య దేవుడికి అర్పింపబడింది. ఈ ఆలయం, తూర్పువేపు తిరిగి ఉంది. ఎనిమిది వందల మీటర్లు పొడవు, రెండు వందల డెబ్బై అయిదు మీటర్లు వెడల్పు గల స్థలం చుట్టూ దానిగోడ ఉంది. ఇది కేవలం ఆలయమే కాదు, కొత్త మతానికి కేంద్రం కూడా. చాలా పెద్ద స్తంభాల మండపం ఒకటి ఉంది. దాని వెనుకను ఆరు పక్కగదులున్నాయి. అయిదు తోరణాలు ఆ గదులను వేరు చేస్తున్నాయి. ప్రతి గది వెనుకను విందు జరిపే పెద్దగది ఉంది. ఆలయం

యొక్క గర్భగృహానికి ఎదురుగా పశువులను వధించే గృహమొకటి ఉంది. ఆవరణగా కట్టిన గోడను ఒక చోట కొట్టివేసి అక్కడో మండపం కట్టారు. రాజు ఈ మండపంలో కూర్చొని ప్రజల నుండి నుండి కానుకలను స్వీకరించేవాడు.

పట్టు విడువకుండా కార్టర్ పనిచేశాడు. అతని శ్రమ ఫలించింది. సీజను అయేసరికి అతడు పదిహేడు ముఖ్యమైన వస్తువులను కనుగొన్నాడు. దొరికినవి శకలాలయినా, అవి మాత్రం చాలా విలువైనవి.

అఖేనటేన్ విగ్రహం యొక్క పన్నెండు భాగాలు, నెఫర్ టిట్టీ విగ్రహానికి చెందిన అయిదు భాగాలు అవి. 1891 – 92 సంవత్సరాలలో టెల్ ఎల్ అమర్నా దగ్గిర జరిగిన తవ్వకాల బట్టి, కొన్ని చారిత్రకమైన విషయాలను ఊహించడానికి వీలయింది. ఫిండర్స్ పెట్రీ వాటి మీద ఒక పుస్తకం రచించాడు.

నాలుగో అమినోఫిస్ రాజు నెఫర్ టిట్టీని పెళ్ళాడినట్లు ఒక చలువరాతి పాత్రమీద నున్న శాసనంలో ఉంది. నగరం చుట్టూ, హద్దులు నిర్ణయించే రాతి పలకల మీద నెఫర్ టిట్టీ అఖేనటేన్ భార్య అని ఉంది. కొన్ని ఫలకాల మీద ఆ దంపతులకు ఒక కూతురని ఉంది. కొన్నిటి మీద యిద్దరు కూతుళ్ళని ఉంది. మరో రాతి పలకమీద ముగ్గురు కుమార్తెలని ఉంది. వీటిని బట్టి పెట్రీ ఈ విధంగా ఊహించాడు.

నాలుగో అమినోఫిస్, అఖేనటేన్లు సూర్యుడిని ఆరాధించేవారు. ప్రతి ఒక్కడి భార్య పేరు నెఫర్ టిట్టీ అనే ఉంది. ఇద్దరికీ ఇద్దరు కూతుళ్ళున్నారు. ఈ రాజులిద్దరికి ఒకే సింహాసనం పేరుంది. వాళ్ళిద్దరూ మాస్ట్ లేక నిజాన్ని గౌరవించేవాళ్ళు. ఒకరు అయిదేళ్ళు పరిపాలించారు. రెండవ అతడు ఆరో సంవత్సరం నుండి పాలించాడు.

అఖేనటేన్ స్త్రీయో, పురుషుడో, నపుంసకుడో పెట్రీ నిర్ధారించలేకపోయాడు. అమర్నాకు కొద్ది దూరంలో ఉన్న రాజుగారి సమాధిలో వాళ్ళ దేహాలు లేవు. అది ఖాళీగా కనిపించింది. అఖేనటేన్ చాలా స్థూలంగా ఉండేవాడు. అతని భార్య యొక్క రూపం కన్న అతనిది భిన్నంగా కనిపిస్తుంది.

పెట్రీ వాదన ప్రత్యేకంగా పేర్కొనదగినది.

ఈజిప్టు రాజైన అఖేనటేన్ చాలా భార్యాసక్తుడు. ఏ స్మారక భవనం పైన అతని బొమ్మను చూసినా, అతడెప్పుడూ తన భార్యతోనే కనిపిస్తాడు. ఆమె రథంలో అతని పక్కనే పోతుంది. అతడు ప్రజల ఎదుటనే ఆమెను చుంబిస్తాడు. ఆమెను తన ముణుకుల పై నాట్యమాడిస్తాడు. అతని కుటుంబం క్రమంగా వృద్ధి పొందింది. అమర్నాలో ఒక విగ్రహం యొక్క తల దొరికింది. దానిని బట్టి అతనికి పురుషుడి పోలికలే ఉన్నట్లు తెలుస్తుంది. ఆ పోలికలు కొంత వింతగా ఉంటాయనడంలో సందేహం లేదు.

చరిత్ర ఏవిధంగా నిర్మింపబడుతుందో హోవర్డ్ కార్టర్‌కి అపుడు తెలియవచ్చింది.

మహా పురాతత్వ శాస్త్రవేత్త అయిన పెట్రీతో రాత్రి తరువాత రాత్రి కార్టర్ కూర్చొని, అతడు చెప్పేవి శ్రద్ధగా వినేవాడు. అతనితో విషయం చర్చించేవాడు, ఆన్వయించేవాడు, సిద్ధాంతీకరించేవాడు. దీపం పూర్తిగా ఘనమయిన వరకు శ్రమపడేవాడు. ఆ సరికి అర్ధరాత్రి దాటిపోయేది. కంబళిలో దూరి అతడు పడుక్కోడానికి ప్రయత్నిస్తే కుక్కలు మొరగడం వినిపించేది. అమర్నా సరిహద్దులలో ఉన్న పర్వతాలలో ఆ శబ్దం ప్రతిధ్వనించేది. పగలల్లా విపరీతమైన ఎండ కాసేది. రాత్రి, క్రమంగా చలి అంతటినీ తన ఒడిలోకి తీసుకుంటూ ఉంటే, అతడు గడగడ వణికిపోయేవాడు. మరునాడు యథా ప్రకారం సంభాషణలలో భాగాలు వినిపించినట్లుండేవి. బొమ్మలు అతని ముందు ప్రాణం పోసుకునేవి, మాయమయేవి, మరొక కాంతి కిరణంలో తిరిగి పైకొచ్చేవి, అతనిని పరికించేవి. ఆ పదిహేడేళ్ళ కుర్రాడు వాటిని విడిచి వేరుగా ఉండలేనని అనుకునేవాడు.

ఆ ఇసుక భుముల్లో, ధూళి ధూపరితమైన స్థలాలో, పురాతన శిలా విన్యాసంలో, తవ్వకాలు జరిపి, వాటిని చరిత్రలోకి మార్చడం కన్న చక్కని పని ఏముంది? మూడు వేల సంవత్సరాల నుండీ ఎవరూ పట్టుకోని జాడీని వెలికి తీసినప్పుడు, మూడువేల సంవత్సరాల వరకూ ఎవరికంటనూ పడని శాసనాన్ని బహిర్గతం చేసినప్పుడు కలిగే ఉద్రేకానికి మించిన దేముంది?

పెట్రీ తన అనుచరుడి హృదయంలో రేగిన అగ్నిని గుర్తించాడు.

కార్టర్, పెట్రీ కలిసి అఖేనటేన్ జీవితంలోని ముఖ్యమైన సంగతులను రికార్డు చేశారు.

క్రీస్తు పూర్వం 1364వ సంవత్సరంలో, పన్నెండేళ్ళ ప్రాయమప్పుడు అఖేనటేన్ సింహాసనమెక్కాడు. 1360లో, అఖేనటేన్‌కి పదహారు ఏళ్ళున్నప్పుడు నెఫర్ టిట్టీని వివాహమాడాడు. ఆ సంవత్సరమే అటిన్ ఆరాధన, అంటే సూర్యుడిని పూజించడం మొదలయింది. ఆ ఏడే నెఫర్ టిట్టీకి కూతురు పుట్టింది. ఆమె పేరు మెరీ టాటేన్. అతనికి 17 ఏళ్ళు వచ్చేవరకు, అంటే 1359 వరకు, నాలుగవ ఎమినోఫిస్ అన్న పేరు ఉండేది. ఆ సంవత్సరంలోనే అతడు పేరు మార్చుకొని, అఖేనటేన్ అన్న పేరు పెట్టుకున్నాడు. 1358లో అతనికి రెండో కూతురు జన్మించింది. ఆమె పేరు మేకీ టాటేన్. అతడు ఇరవై సంవత్సరాల ప్రాయంలో నున్నప్పుడు అతనికి మూడవ కుమార్తె కలిగింది. అతనికి 22 సంవత్సరాలప్పుడు నాలుగో కూతురు, 24 సంవత్సరాలప్పుడు అయిదో కూతురు, 26 సంవత్సరాలప్పుడు ఆరవ కూతురు జన్మించారు. ఏడవ కూతురు 1348లో జన్మించింది. 1347లో అతనికి స్మెఖరే అన్న ఆమెతో సంబంధం ఏర్పడింది. అఖేనటేన్ ముఫ్పై సంవత్సరాల ప్రాయంలో చనిపోయాడు.

ఆధునికుల పరిశోధన ప్రకారం చాలవరకు ఈ సంవత్సరాలు సరిపోయాయి. ఈ కొత్త పరిశోధనలో అతడు మూడవ కూతురిని పెళ్ళి చేసుకున్నట్లు తెలిసింది. ఆమెయే తరువాత టుటన్ ఖమూన్ రాజుకి భార్య అయింది.

అఖేనటేన్ తరువాత ఎవరు సింహాసనం ఎక్కారో చాలా కాలం తెలియలేదు. ఆ ఫారోను అందరూ విడిచి పెట్టారు. చరిత్రలో అతను చాలా కాలం మరువబడిన ఫారోగానే నిలిచిపోయాడు.

పదిహేడేళ్ళ కార్టరు ఈ మరువబడిన ఫారోను వెదకడానికి కృత సంకల్పుడయాడు. ఏదో అదృష్టం కలిసివస్తే అతనిని కనుగొనవచ్చునని పెట్రీ అన్నాడు.

కార్టర్ తొందరగా ఈ సంగతి మరచిపోయాడు. ఒకనాటి సాయంకాలం, పెట్రీ ఆ రోజు లభించిన వస్తువులను చూస్తూ, తన అసిస్టెంటుకి ఒక ఉంగరం చూపించాడు. అది ఒక సీల్ రింగు, ముద్రాంగుళీయకం – దానితో లక్కమీద సీలు వేస్తారు. దాని మీద ఒక రాజు పేరు కనిపించింది. దానిని ‘టుట్ – అంక్ – అమున్’ అని అతడు చదివాడు.

అతడే మరువబడిన ఫారో – టుటన్ ఖమూన్. అమర్నాలో కొన్ని సీలు రింగులు దొరికాయి. వాటిలో కొన్నిటిమీద ‘టుటన్ ఖమూన్’ పేరుంది. అతని తరువాత అమర్నాను పాలించిన ఫారో ఎవరో తెలియలేదు.

తరువాత కాలంలో జరిగిన తవ్వకాలలో ఒక సంగతి తెలిసింది. టుటన్ ఖమున్ రాజు పాలించిన తరువాత అఖిటటెన్ రాజధానిలో ప్రజలు నివసించలేదని పరిశోధకులు అభిప్రాయపడ్డారు. ఒక తరం వరకు ఈజిప్టియన్ సామ్రాజ్యానికి కేంద్రమై, అఖిల సంపదలతోను సర్వాంగ సుందరంగానున్న అఖిటటెన్ నగరాన్ని ధ్వంసం చేసి నేలమట్టం గావించారు.

ఎండాకాలం మొదలవుతుంటే తవ్వకాలు అపేశారు. పెట్రీ లండన్ వెళ్ళిపోయాడు. అతనికో ఈజిప్టాలజీ ఆచార్య పదవిని ఖాళీగా ఉంచారు. కార్టర్, మరికొన్ని వందల కిలోమీటర్ల దూరంలో, నైలునది ఎగువ భాగంలోనున్న లగ్జర్ పట్టణానికి వెళ్ళిపోయాడు.

హోవర్డ్ కార్టర్ ఒక ఆరు సంవత్సరాలు నవిలీ కింద పనిచేశాడు. అపుడు శాస్త్రీయ పద్ధతిలో చాలా నిశితమైన పని నేర్చుకున్నాడు.

లగ్జర్‌కి సమీపంలో ఒక రాళ్ళగని ఉంది. అక్కడ తవ్వకాలు జరిపితే ఒక ఆలయం బయటపడింది. నేటికి కూడా అది పర్యాటకులను ఆకర్షిస్తుంది.

రాజుల లోయలేక వాలీ అఫ్ కింగ్స్ నైలునది ఎగువు భాగంలో ఉంది. ప్రపంచంలో గల సుందర భూమి భాగాల్లో అది ఒకటి. ఆ లోయను చూసిన వాళ్ళు ఆనందంతో ఉబ్బి తబ్బిబ్బవుతారు. పైకి చూస్తే అది ఎడారి ప్రదేశం – రాళ్ళు – ధూళి – చుట్టూ ఎరువు గోధుమ రంగులలో కొండల వరుసలు – లోయ మధ్యనున్న పల్లపు భాగం మధ్యాహ్నవేళ నిప్పు కొలిమివలె ఉంటుంది. నైలునది దానికి కొద్ది దూరంలో ఉంది. కాని, ఆ లోయ పైకి చల్లని గాలి రివట అయినా వీచదు. ఇక్కడ గాలి కూడా కదలదు. ఈ లోయలో దయ్యాలు తిరుగుతాయని ఈజిప్షియన్లు అంటారు. అక్కడి సమాధులను దొంగలు కొల్లగొట్టారు. వాటి ద్వారాలు తెరచే ఉన్నాయి. నక్కలు, ఎడారి గుడ్ల గూబలు, గబ్బిలాలు వాటిలో తల దాచుకుంటాయి. అయినా, వాటి గొప్పదనం తగ్గలేదు. ఇప్పటికి ప్రజలు రాజులలోయ అని దానిని గౌరవంగా చూస్తారు. ఇక్కడి సమాధులను కొన్నింటిని, క్రీస్తు పూర్వం 900 సమీపంలో, ఓసొర్‌కాన్ పరిపాలనలో తెరచి, వాటిలో అర్చకురాండ్రును పాతి పెట్టారు.

హోవర్డ్ కార్టర్ అక్కడికి ఇనస్పెక్టరుగా వెళ్ళేవాడు. అతడు చాలా తవ్వకాలలో పాల్గొని ఆశ్చర్యకరమైన విషయాలను వెల్లడించాడు.

ఎర్ల్ వేర్నర్ వోతో కలిసి కార్టర్ మరికొన్ని తవ్వకాలు జరిపాడు. చాలా కొత్త వస్తువులను వెలికి తీశాడు. అతడు కనుగొన్న వాటిలో అన్నిటికన్న చాలా గొప్పది, ఫారో టుటన్ ఖమున్ సమాధి.

1922 సంవత్సరం నవంబరు తొలిరోజులలో కార్టర్ ఈ సమాధిని కనుగొన్నాడు. ఆ సరికి కార్నర్ వాన్ అన్ని ఆశలు విడిచి పెట్టాడు. మొదటి ప్రపంచ సంగ్రామం తరువాత తవ్వకాలకు నిధులు కొరత ఏర్పడింది.

నవంబరు ఒకటో తారీకున త్వవకాలు మొదలయాయి. మూడో తారీకున కార్టర్ పనికి వెళ్ళే సరికి ఎవరూ పనిచేయకుండా కూర్చున్నారు. పనివాళ్ళ ఫోర్‌మాన్, అతనిని ఒక పునాది గోడదగ్గరికి తీసుకుపోయాడు. ఆ గోడను తవ్వితే లోపలికి ఒక మెట్టు కనిపించింది. ఆ రోజు మర్నాడు మధ్యాహ్నం వరకు తవ్వకాలు జరిగిన తరువాత, లోపలికి దిగడానికి పన్నెండు మెట్లు బయటపడ్డాయి. ఒక ద్వారం యొక్క పై భాగం వెలువడింది. దాని తలుపు సీలు వేసి ఉంది. సీలుమీద మంత్ర ముద్ర ఉంది. ఒక గుంటనక్క, తొమ్మిది మంది ఖైదీలు ఆ ముద్రలో ఉన్నారు. దాని మీద మరొక ముద్ర కూడా ఉంది.

కార్టర్ చాలా తొందర పడ్డాడు. పనివాళ్ళను పక్కకు తోసేసి తానే సుత్తి, సేవం పట్టుకున్నాడు. ఆ తలుపు పై భాగంలో ఒక దూలం అమర్చారు. అది తలుపులను తెరువకుండా అడ్డుతుంది. దానికింద, గోడలో చేయి దూరడానికి సరిపడ్డ కన్నం చేశాడు. లోనికి ఒక టార్చిలైటు దూర్చి, కొంచెం కాళీగా ఉన్న కన్నం పై భాగంలోంచి లోపలికి చూశాడు.

అప్పుడతను చూసినది చాలా నిరాశాజనకంగా ఉంది. కాని, అతని ఆలోచనలలో ఎక్కడో ఆశాకిరణం మెదిలింది. ద్వారానికి లోపలి భాగంలో, పైనుండి కిందివరకు పనికి మాలిన చెత్తనిండి ఉంది. బహుశా, దొంగలెవరూ లోపలికి ప్రవేశించకుండా, కట్టడం నిర్మాణంలో వచ్చిన రాళ్ళతోను రప్పలతోను ఆ చోటు నింపినట్లుంది. ఇంతలో చీకటి పడింది. రాత్రిపూట దొంగలెవరూ లోనికి ప్రవేశించకుండా మళ్ళా ఆ మెట్లను కప్పించాడు. మరునాడు లగ్జర్ పట్టణానికి పోయి, లార్డ్ కర్నార్ వాన్‌కి టెలిగ్రాము యిచ్చాడు.

కార్నర్ వాన్, అతని కుమార్తె 1922, నవంబరు 23వ తారీకున అక్కడికి చేరుకున్నారు.

పని వెంటనే మొదలయింది. పదహారు మెట్లు బయటపడ్డాయి. అపుడు సూర్యుడి గురుతు, పేడు పురుగు ముద్ర కనుల పడ్డాయి. అవి టుటన్ ఖామున్ ముద్రలే.

కాని, ఆ ఆనందం ఎంతకాలమో నిలువలేదు. లోపలికి వెళ్ళే దారిని కప్పుతూ ఒక గోడ ఉంది.

1922, నవంబరు 25వ తారీకున, ద్వారాన్ని కప్పుతూ కట్టిన గోడను కూల్చివేశారు.

ఆ మరునాడు మధ్యాహ్నం మూడు గంటలకు రెండవ తలుపు కనిపించింది. అక్కడ కూడా టుటన్ ఖామున్ ముద్రలు కనిపించాయి.

కార్టర్ ఆ మూసిన ద్వారం ఎడమవైపు మీది భాగంలో సేనాం మోపాడు. తరువాత నిమిషాలు, గంటలు కలలో వలె గడిచిపోయాయి. అది అతని జీవితంలో దివ్యమైన దినం.

మొట్టమొదట కార్టర్‌కి ఏమీ కనిపించలేదు. అతడు పైన చేసిన కన్నం లోంచి ఒక యినుప గజం లోనికి తోశాడు. దానికి ఏదీ అడ్డు తగలలేదు. అంటే ఆ గది ఎటువంటి చెత్తతోను నిండి ఉండలేదు. లోపలినుండి విషవాయువులు వచ్చి దీపం ఆరిపోతుందని అతడు భయపడ్డాడు. ఆ గదినుండి పైకి వస్తున్న వేడి గాలిలో కొవ్వొత్తి దీపం కొట్టుకుంది. కొవ్వొత్తిని లోపలికి దూర్చడానికి ఆ కన్నం పెద్దది చేయవలసి వచ్చింది. కానీ, ఆ పని చాలా కాలం పట్టింది. చివరికి కన్నం పెద్దదయింది. కార్టర్ ఎడమ చేతిని కొవ్వొత్తితో లోపలికి దూర్చాడు. తరువాత చాలా జాగ్రత్తగా తలను దూర్చాడు.

మెల్లగా, మృదువుగా, తెరలోంచి వచ్చినట్లు, ఆ చీకటి లోంచి అద్భుతమైన వస్తువులు వెలువడ్డవి. వింత మృగాలు అతనిని తేరి చూశాయి. నిలువెత్తున్న మానవాకారాలు కర్రలు పట్టుకొని అతనివేపు నడిచి నట్లయింది. వాటి మధ్యను పెద్ద పెట్టెలు, మెరుస్తున్న చలువరాతి పాత్రలు, గుర్రాలను పూన్చవలసిన రథాలు, మనోజ్ఞమైన పర్యంకాలు ఆ పెద్ద మంచాలకు జంతువుల శిరస్సులు, కాళ్ళు చెక్కి, విశ్రాంతిని సమకూర్చడానికి వేచి ఉన్నాయి.

“నీకేదేనా కనిపిస్తున్నాదా?” కార్నర్ వాన్ ప్రభువు అడిగాడు.

“అవును! అద్భుతమైన వస్తువులు కనిపిస్తున్నాయి” అన్నాడు కార్టర్.

తరువాత ఆ కన్నం పెద్దది చేశారు. ఇప్పుడు ఇబ్బంది లేకుండా అందరూ లోపలి వస్తువులను చూడడానికి వీలయింది. వాళ్ళు చిన్న పిల్లల వలె నిలబడి ఆశ్చర్యంతో చూశారు. ఈ లోపుగా టార్చిలైటు వచ్చింది.

దాని వెలుతురులో వాళ్ళకో గంధర్వ లోకం కనిపించింది. 3200 సంవత్సరాల కింద ఆరిపోయిన జీవితం వాళ్ళకు దర్శనమిచ్చింది.

తవ్వకాలలో, ఒక్క ఈజిప్టు లోనే కాదు, ప్రపంచంలో మరేచోట అటువంటి అనన్య సామాన్యమైన నిధి దొరకలేదు. అక్కడ ఉన్న వస్తువులు సంఖ్యలోనే కాక సౌందర్యంలోనూ ప్రత్యేకంగా పేర్కొనతగ్గవి. అవి సహజంగా ఉండడమే కాకుండా, చాలా తీరుగా దిద్దబడి ఉన్నాయి. అక్కడ కుర్చీ లేక సింహాసనం ఒకటుంది. ఈజిప్టులో అంతవరకు వెలువడ్డ ఏ వస్తువుకూడా అంత అందంగా లేదు. చంద్రకాంత శిలలతో నిర్మింపబడిన పాత్రలు అద్భుతమైన పనివాడితనం కలవి. పెద్ద మంచాలు, కుర్చీలు, పరుపులు, దివ్యమైన పూసలపని, విలువైన వజ్రాలు మొదలైనవి తాపిన నాలుగు రథాలు, శిలాజిత్తు తైలం పూసిన రాజుగారి విగ్రహాలు, విగ్రహాలకు బంగారు జోళ్ళూ ఇతర రాజ చిహ్నాలూ, లెక్కలేనన్ని పెట్టెలు, రాజుగారి దుస్తులు, తాళం చెవి వలె నున్న శిలువ ఆకారంలో నున్న కొవ్వొత్తుల స్టాండుకు పెట్టిన కొవ్వొత్తులు, ఉన్నాయి. ఇంకా కళ్ళకు కనిపించని వస్తువులెన్నో ఉన్నాయి. మరొక గది పక్కనే ఉంది. దానిలోకి కాలు పెట్టడానకవదు. చలువరాతి విగ్రహాలు, గృహోపకరణాలు మొదలైనవి నాలుగయిదడుగుల ఎత్తువరకు కుప్పగా పోసి ఉన్నాయి. తరువాత సీలు వేసిన గది తలుపుంది. ఆ తలుపు తెరిస్తే లోపల ఏముందో భగవంతుడికే తెలియాలి. ఆ వస్తువులలో కొన్ని మంచి స్థితిలో ఉన్నాయి. కొన్ని అంత బాగాలేవు. మొత్తానికి లోపలనున్న వన్నీ అద్భుతమైనవి. సీలువేసిన తలపు వెనుక ఏముందో!

కార్టర్‌కి అప్పటికి కూడా నమ్మకం కలుగలేదు. టుటన్ ఖమున్ దొరుకుతాడో లేడో!

కార్టర్ 1922 డిసెంబరు 4వ తారీకున కెయిరో పత్రికా విలేఖరిని ఒకరిని పిలిపించాడు. అతనితో ఈ విషయాలు చెప్పాడు.

“ఇప్పటి వరకు తెరచిన గదులు నిజంగా రాజుగారి సమాధి మందిరానికి తగిలి ఉన్న పక్కగదులు. మేమింకా తెరువని తలుపులమీద సీళ్ళున్నాయి. వాటిమీదనున్న బొమ్మలను బట్టి చూస్తే ఫారో టుటన్ ఖమున్ దొరుకుతాడని నమ్మకం కలుగుతున్నది. ముందుగా మొదటి గదిలో నున్న వస్తువులను ఇక్కడ నుంచి తరలించాలి. మరొక రెండు నెలల వరకు తవ్వకం పనులు వెనుకబడతాయి.”

పక్కగదిలో వస్తువులు చిందరవందరగ పడి ఉన్నాయి. నగలను ముక్కలు చేశారు. పెట్టెలను బలవంతంగా తెరచారు. రేకు తాపిన కర్రముక్కలు చెల్లా చెదరుగా పడి ఉన్నాయి. ఈ దుర్మార్గమైన పని చేస్తున్నప్పుడు ఏదో అవరోధం కలిగి వాళ్ళు తొందరగా సమాధిని విడిచి పెట్టారు.

ఎవరీ సమాధి చోరులు? వాళ్ళెందుకు సమాధి తలుపులు విరుగగొట్టారు?

కార్టర్ బాగా ఆలోచించాడు.

ఈ సమాధులు నిర్మించిన పనివాళ్ళకు, అర్చకులకు మాత్రమే వీటి రహస్యాలు తెలుస్తాయి. పనివాళ్ళు లంచాలు పుచ్చుకొని, సమాధుల రహస్యాలు చోరులకు అందజేసి ఉండాలి.

కాని, పురాతన కాలంలో సమాధులను కాపాడే అధికారులుండేవారు. వారు వేలీ ఆఫ్ కింగ్స్‌లో టుటన్ ఖమున్ సమాధి తెరవబడి ఉండడం చూశారు. వాళ్ళు వెంటనే అడ్డుగోడ కట్టి, తలుపులను తిరిగి సీళ్ళు వేశారు.

1923వ సంవత్సరం, ఫిబ్రవరి, 17వ తారీకున టుటన్ ఖమున్ సమాధిని కార్టర్ తెరుస్తాడని పత్రికలు ప్రకటించాయి. ఆరోజు చాలమంది పెద్దవాళ్ళ సమక్షంలో సమాధిని తెరిచారు. రెండవ గదిలో చాలా పెద్ద దైవపీఠముంది. అది పైకప్పు వరకు ఎదిగి, గదినంతటిని ఆక్రమించింది. నీలం రంగుతోను, బంగారం పనితోను అది మెరుస్తున్నది. దాని వెడల్పు పదకుండు అడుగులు, పొడవు పదిహేడు అడుగులు. దానికి రెండు తలుపులున్నాయి. ఆ తలుపులు తెరిస్తే లోపల మరోదైవపీఠం కనిపించింది. దానికి రెండు తలుపుతున్నాయి. వీటిమీద సీళ్ళున్నాయి. ఆ విధంగా మొత్తం నాలుగు దైవ పీఠాలు, ఒక దానిలోన ఒకటి అమర్చి ఉన్నాయి. నాలుగవదైన పీఠంలో రాతితో చేసిన శవపేటిక ఉంది..

ఆ శవపేటికను తెరువడానికి మరొక సంవత్సరం పట్టింది.

సమాధులలో లభించిన వస్తువులను, మానవహస్తాలు తాకే ముందు, వాటి వివరాలు గ్రంథస్థం చేయాలి. ఫోటోగ్రాఫులు తీయాలి. సరిగా వాటిని వర్ణించాలి. ఈ వివరాలన్నీ కార్టర్ కార్డులమీద ఎక్కించాడు.

ఈ వస్తువులలో హారాలు, మెడపట్టీలు, చెవిపోగులు, మొలతాళ్ళు చాలా ఇబ్బంది పెట్టాయి. ఇవన్నీ మూడు వేల సంవత్సరాల కింద గోరీలో ఉంచబడ్డాయి. వాటిని పైకి తీయడం కష్టమయింది. పూసలు సరిగా నున్నా, వాటి లోంచి దూర్చిన దారం క్షీణించి పోయింది. ఆ సమాధిలో 17 మెడ పట్టీలు దొరికాయి. ఒక మెడ పట్టీలో 93 పచ్చపూసలు, 40 ఆకు పచ్చ పూసలు, 50 ఎర్ర పూసలు, 71 నీలిపూసలు, 60 తెల్ల పూసలు 57 నీటి పూసలు (మరో వరుస) ఉన్నాయి. వెరసి ఆ గొలుసులో 371 లింకులు – పద్మాల ఆకారంలో నున్న కొక్కాలు రెండు గొలుసు చివరలను కలుపుతున్నాయి. ఇది అన్నిటి కన్న చిన్నదైన మెడపట్టీ.

టుటన్ ఖమున్ సమాధిలో 413 సేవకుల బొమ్మలు దొరికాయి. ఈ సంఖ్య గురించి కార్టర్ చాలా ఆలోచించాడు. 18వ రాజవంశం ఈజిప్టును పాలించేటప్పుడు సంవత్సరానికి 365 రోజులున్నా, వారానికి మాత్రం పదిరోజులుండేవి. రోజుకో సేవకుడు వారానికి ఒక ఓవర్సీరు ఉండేవాడు. నెలకొక సూపరింటెండెంటు ఉండేవాడు. ఆ విధంగా చూస్తే లెక్క సరిపోయింది.

365 + 36 + 12 = 413

ఆ సేవకుల బొమ్మలు మట్టితోను, చలువ రాతితోను, ఇసుక రాతితోను, నల్లరాతి తోను, కర్రతోను చేసినవి. వీటిలో కర్రతో చేసిన బొమ్మలు చాలా అందమయినవి. ఇవి చాలా ఇబ్బందులు కలుగుజేశాయి. వాతావరణంలో కలిగిన మార్పులకు ఇవి నాశనం అవడం మొదలయింది. వాటంతట అవే పాడయాయి. కర్ర కుంగిపోయింది. దానిమీద వేసిన సీమ సుద్దపొర వచ్చేసింది. బంగారపు రేకు ఊడిపోయింది.

పెట్టె తెరువడానికి, లోపలి వస్తువులను పైకి తీయడానికి చాలా శ్రమ, శ్రద్ధ అవుసరమయాయి. ఒక వస్తువును పైకి తీయడానికి ప్రయత్నించినపుడు మరొకటి ధ్వంసమయేది. పెట్టెలో ఉన్న బట్ట శిథిలమయింది.

పెట్టెకప్పును శుభ్రం చేసినా ప్రయోజనం లేకపోయింది. అప్పుడతడు కరిగించిన మైనం దానిమీద ఉపయోగించాడు. ఆ మైనం పగుళ్ళను నింపి, వేసిన రంగులను బయట పెట్టింది. ఈ పని చాలా కష్టసాధ్యం. పెట్టె మూతను ఎండలో వేడిచేశారు. మైనాన్ని కరిగించడమే కాకుండా మరిగించారు.

ఆ సమాధిలో లభించిన వస్తువులలో పిల్లరాజు బంగారు సింహాసనం చాలా ప్రశస్తమయినది. దానిని కర్రతో తయారుచేసి, దాని పైన బంగారు రేకుతాపారు. రాజు పిల్లవానిగా ఉన్నప్పుడు దానిని చేయించినట్లుంది. టుటన్ ఖమున్ పెద్దవాడైనప్పుడు దానిని పెద్దదిగా చేసినట్లు తెలుస్తుంది. ఆసనాన్ని రెండున్నర అంగుళాలు ఎత్తుచేశారు. చేరబడే వెనుక భాగం మీద, టుటన్ ఖమున్, అతని అందమైన భార్య అఖెసనమమ్ చిత్రాలున్నాయి. గృహంలో భార్యాభర్తలు మసలే దృశ్యమది. ఆ చిత్రంలో రాణి చాలా పలుచని తెల్లగౌను తొడుక్కుంది. శరీరమంతా ఆ పలుచని బట్టలోంచి కనిపిస్తుంది. ఎత్తుగా నున్న ఈకెల కిరీటం ధరించింది. టుటన్ ఖమున్ పడక కుర్చీలో కూర్చున్నాడు. ఆమె అతని శరీరానికి తైలం రాస్తున్నాది. ఆ యువ ఫారో, కుడి భుజం మీద విలాసంగా అని కూర్చున్నాడు. తన భార్యవేపు ఎడమ భుజం తిప్పాడు. అతని ముఖం లేతగా ఉంది. చిన్న పిల్లడి ముఖం వలె ఉంది. కాని, అతని కడుపు మాత్రం కొంచెం పెద్దదిగా ఉంది.

దానిమీద మూడు అడ్డు ముడుతలు కనిపిస్తున్నాయి. అతడు తలకు పెట్టుకున్న విగ్గు యొక్క రిబ్బన్లు గాలిలో కదులుతున్నాయి. ఈ రెండు చిత్రాలకు పైన సూర్యబింబముంది. భాస్కరుని కిరణాలు ఆ రాజదంపతులకు తగిలి ఆయువును ప్రసాదించుతున్నవి.

సమాధిని తెరచి రెండున్నర నెలలయింది. లూకస్ అన్న అతడు క్రిమినాలజిస్టు. అతనికి విషాల గురించి ఆధికారికమైన జ్ఞానం ఉంది. 1923, ఫిబ్రవరి 18వ తారీకున సమాధిని తెరిచారు. అతడు అన్ని టెస్టులు చేశాడు కాని, బాక్టీరియలాజికల్ టెస్టులు మాత్రం ముందుగా చేయలేదు. దీని ఫలితాలు కొత్త యిబ్బందులకు దారి తీశాయి.

సమాధి తెరచిన తరువాత, లోపలనున్న గోడలను, వస్తువులను తుడిచి అయిదు స్వాబులు అతడు తయారు చేశాడు. వాటిని రాయల్ నేవీ ఫాక్టరీకి, వారేహామ్ పట్టణం పంపించాడు. పంపిన అయిదు స్వాబులలోను నాలుగు నెగటివ్ గాను, ఒకటి పాజిటివ్ గాను వచ్చింది.

దానికి లూకస్ ఒక సమాధానం చెప్పాడు. ఆ బాక్టీరియా, లోపలికి వచ్చేవాళ్ళ ద్వారా వచ్చి ఉంటుందని, లోపల గోడల గురించి, రాతి శవపేటికను పట్టిన బూజు గురించి కాని మరివాళ్ళు శ్రద్ధ తీసుకోలేదు.

డాక్టర్ అలెగ్జాండర్ స్టాట్ అన్న మరొక కెమిస్టు, లూకస్ అభిప్రాయాన్ని ఆమోదించలేదు. అతడు కూడా, లూకతో పాటు ఆ స్వాబులు పరీక్షచేశాడు. గోడల మీద అంతటను ఇటుకరంగులో మాసికలు కనిపించాయి. ఇవి సున్నంలో కాని, గుడ్డులోని సొన బంకకింద వాడినప్పుడుకాని వచ్చిన క్రిమిజాలమయి ఉంటుందని అభిప్రాయపడ్డాడు. కాని, అతడు కూడా, ఆ సమాధి గృహం క్రిములతో నిండినదని గట్టిగా చెప్పలేదు. అతడు, లూకస్ నేలమీద అధిక సంఖ్యలో పడిన చచ్చిన కీటకాలను ఏరుకుంటూ కూర్చున్నారు. అలెగ్జాండర్ స్టాట్ వాటిని పైకి పంపించారు. కెయిరోలో పెద్ద అధికారులు అవి కుమ్మరి పురుగులని (పేడపురుగులని) కుళ్ళిన ఆకులు మొదలైనవి తిని బ్రతుకుతాయని చెప్పారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here