శ్రీపర్వతం-30

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 30వ భాగం. [/box]

[dropcap]స[/dropcap]మాధి నంబరు 55లో ఆర్కియాలజిస్టులకు అఖెనటెన్ శరీరం లభించింది. అక్కడ వాళ్ళు ఫోటోగ్రాపులు తీయడం పూర్తిచేశారు. సమాధి గోడలకున్న చెక్కసున్నం, పైనుండి వచ్చిన గాలి తగిలి, కొద్ది గంటలలోనే పగుళ్ళు చూపి, రాలి పడిపోయింది.

అందుచేత టుటన్ ఖమున్ సమాధిలో నున్న అమూల్యమైన నిధులు ఎంతకాలం నిలుస్తాయి? అవి కూడా ఒక రోజు విచ్చిపోయి ధూళిలో కలిసిపోతాయి?

అన్నిటికన్నముఖ్యంగా, ఈ సమాధిని చూడడానికి వచ్చిన పర్యాటకుల బెడద హెచ్చయింది. నిధులను ఎవరో ఎత్తుకు పోతున్నారన్న వదంతులు వ్యాపించాయి.

టుటన్ ఖమున్ సమాధిని తెరవడంతో నిద్రపోతున్న రాజుని లేపినట్లయింది. అసంఖ్యాకంగా ప్రజలు రావడంతో పరిస్థితి మరీ అసహనమయింది.

ఆ పరిస్థితులలో కార్టర్‌కి, లార్డ్ కార్నర్ వాన్‍కి మధ్య అభిప్రాయ బేధాలు వచ్చాయి. రోజూ కార్నర్ వాన్ ప్రభువు సమాధికి వచ్చేవాడు. ఒక రోజు అతడు రావడం మానేశాడు. ఆ మరునాడు ఉదయానికి అతనికి 104 డిగ్రీల జ్వరం వచ్చింది. పన్నెండు రోజులపాటు జ్వరం వస్తూ పోతూ ఉండేది.

దోమకాట్లకు వచ్చిన జ్వరమని అతడు భావించాడు.

లక్సర్‌లో డాక్టరు అతనిని పథ్యం మీద ఉంచి, పక్క దిగకుండా విశ్రాంతి తీసుకోమన్నాడు. కాని పరిస్థితి మెరుగు కాలేదు. ఇంగ్లాండు నుంచి వాళ్ళ కుటుంబ వైద్యుడిని తెప్పించారు. రోగిని వెంటనే కెయిరో తరలించారు. కార్నర్ వాన్ ప్రభువుకి చాల తీవ్రమైన అస్వస్థత అని కార్టర్‌కి టెలిగ్రాం వచ్చింది. కాని, దానిని లక్ష్య పెట్టకుండా అతడు సమాధిలో పనిచేస్తునే ఉన్నాడు.

రోగం మలేరియా కాదని తెలిసింది. కార్నర్ వాన్ భార్య, అతని కుమారుడు కెయిరో వచ్చారు. ఇవన్నీ జరుగుతుంటే, కార్టర్ ఒకరోజు పనివాడిని ఒకడిని తనయింటికి పంపి, మరచిపోయిన వస్తువేదో తెమ్మన్నాడు. ఆ మనిషి పరిగెత్తుకొని తిరిగి వచ్చాడు. ఆ పని వాడు కార్టర్ యింటికి వెళ్ళేసరికి, యింట్లో ఎవరూ లేరు. ఇంట్లో ఉండవలసిన నౌకరిలిద్దరూ లక్సర్ నగరంలో బజారుకి వెళ్ళారు. కార్టర్ పంపిన పనివాడు ఇంట్లోకి ప్రవేశిస్తుంటే లోపలనుండి మనుష్యుల మూలుగువలె శబ్దం వినిపించింది. అతుడు చూసేసరికి, ఒక త్రాచుపాము, కార్టర్ పెంచుతున్న పక్షి యొక్క పంజరంలోకి దూరి, పిట్టను తింటున్నది.

ఆ పనివాడు, ఆ సర్పం కోడె నాగు అని, అది ఆ పక్షిమీద పగదీర్చుకుంటున్నదని, కార్టర్‍తో చెప్పాడు. సమాధిని శత్రువులకు చూపించడంలో ఆ పక్షి సహాయం చేసిందని, అందుచేత ఆ మహాసర్పం పగదీర్చుకుంటున్నదని అన్నాడు. ఇప్పుడేదో ఘోరం జరుగుతుందని వాడు నొక్కి చెప్పాడు.

కార్టర్‌కి మూఢనమ్మకాలు లేవు. అయినా ఈ వార్త అతని మనసులో గాఢంగా నాటుకుపోయింది. మరునాడే అతడు కెయిరో వెళ్లాడు. మరణోన్ముఖుడైన కార్నర్ వాన్ ప్రభువును చూశాడు. కాని ఆ ప్రభువు కార్టర్‌ని గుర్తించలేదు. ఈ విధంగా, అంతకాలం కలిసి పనిచేసిన వాళ్ళిద్దరూ ఆఖరి క్షణాలలో వివాదాలు తీరి దగ్గరికి రాలేకపోయారు.

కార్నర్ వాన్ ప్రభువుకి తీవ్రమైన జ్వరంలో సంధి ప్రలాపన ఇంకా హెచ్చింది.

“పక్షి ఒక్కటి నా ముఖాన్ని గీకుతున్నది.” – “పక్షి ఒకటి నా ముఖాన్ని గీకుతున్నది”. అన్నాడతడు మళ్ళా మళ్ళా.

డాక్టర్ అలాహస్సన్ కెయిరో లోని ఈజిప్షియన్ మ్యూజియంకి డైరెక్టర్ జనరల్‌గా పని చేస్తుండేవాడు. అతడొక సంగతి చెప్పాడు. సమాధిని ఎవరేనా క్షోభపెడితే అపుడు నెఫిబెత్ పక్షి అతని ముఖాన్ని గీకుతుంది.

సమాధి దూషణ ఘోరమైన నేరమని పురాతన ఈజిప్టు దేశవాసులు నమ్మారు. సమాధి, అందులోని మమ్మీ – ఈ రెండూ ‘కా’ దేవత యొక్క భూమిమీది నివాసాలు. ‘కా’దేవత, మనుష్యుని మరణం తరువాత అతని జీవవక్తిని కాపాడుతుంది. అందుచేత సమాధిలో పెట్టిన ఆహారం, పానీయం కూడా ‘కా’ దేవత కోసమే ఉంచినవి, శవం కోసం కాదు – ఎప్పుడయితే సమాధిని కాని, మమ్మీని కాని నాశనం చేసి దోచుకుంటారో, అపుడు ‘కా’ దేవతకు గృహమంటూ ఉండదు. పేరు కూడా ఉండదు.

క్రీస్తు పూర్వం 2423 – 2263 సంవత్సరాలలో 6వ రాజ వంశం ఈజిప్టును పాలించింది. ఆ వంశంలోని హరఖుప్ రాజు యొక్క సమాధి అశ్వన్‌లో బయటపడింది. ఆ సమాధి గోడపై శాపం ఈ విధంగా చెక్కి ఉంది.

“ఎరవయితే ఈ సమాధిని ప్రవేశిస్తారో, వాళ్ళమీద నేను, పిట్ట మీద పడినట్లు, విరుచుకుపడతాను. దేవుడు ఆ విధంగా వాళ్ళని విచారిస్తాడు.”

మరొక వేయి సంవత్సరాల తరువాత ఉర్సూ అన్న మరొకడు, గనుల పైన అధికారి, చాల ధనవంతుడు, తన కోసం తయారైన సమాధి విగ్రహం మీద ఈ విధంగా చెక్కించాడు.

“ఎవరయినా నా ఆస్తి మీద చేయి వేస్తే, ఎవరయినా నా సమాధిని అపవిత్రం చేస్తే, లేక నా మమ్మీని తీసుకుపోతే, సూర్యుదేవుడు అతనిని శిక్షిస్తాడు. అతని సొత్తు అతని పిల్లలకు చేరదు. అతని జీవితంలో ఆనందముండదు. అతడు తన సమాధిలో దప్పికతో అలమటిస్తాడు. అతని ఆత్మ శాశ్వతంగా నాశనమవుతుంది.”

కార్నర్ వాన్ ప్రభువు, 1923 ఏప్రిల్ 6వ తారీకు రాత్రి చనిపోయాడు. ఆ సమయంలో కారణం లేకుండానే కెయిరో నరగంలో విద్యుద్దీపాలు ఆరిపోయాయి. మరెవరూ బాగుచేయకుండానే కొద్ది సేపటిలో తిరిగి వచ్చాయి. కర్నార్ వాన్ ఒక ఆడ కుక్కను పెంచాడు. అది అతనితో పాటు ఇంగ్లాండు నుండి ఈజిప్టు వచ్చి, కొన్ని దినాలు తవ్వకాలప్పుడు అతనితోనే ఉండి, తిరిగి ఇంగ్లాండు వెళ్ళిపోయింది. కార్నర్ వాన్ చనిపోతున్న సమయమప్పుడే, ఆ కుక్క, ఇంగ్లాండులో అతని యింట్లో మొరగడం మొదలు పెట్టింది. పైన పిడుగు పడ్డట్లు, నేలను పడిపోయి చనిపోయింది.

కార్నర్ వాన్ ప్రభువు, 1923 ఏప్రిల్ 30వ తేదీ నాడు, ఇంగ్లాండులో పూడ్చబడ్డాడు. ఈజిప్టు తవ్వకాలలో మంచి పేరుపొంది, పైకి వచ్చే తరుణలో మరణించాడు.

ఒక మంత్రకత్తె అతని కొడుకును తండ్రి సమాధి దగ్గరికి పోవద్దని చెప్పింది. వెళ్తే దురదృష్టం కలుగుతుందని చెప్పింది. తరువాత ఆమె మాయమయిపోయింది.

కార్నర్ వాన్ ప్రభువు యొక్క కొడుకు తన శేషజీవితంలో చాల యిబ్బందులు పడ్డాడు. ఎవరెవరో అతనికి ధన సహాయం చేస్తూ ఉండేవారు.

వృద్ధత్వంలో అతడు అనేవాడు – ‘శాపం శాపమే – శాపాన్ని నమ్మాలా, మానాలా? కాని ఫలితాలు మాత్రం దానిని ఋజువు చేస్తాయి’.

అదే సమయంలో, టుటన్ ఖమున్ సమాధి తవ్వకాలలో కార్టర్‌తో పనిచేస్తున్న హెన్రీ బ్రెస్టెడ్‌కి ఒక వింతయైన జ్వరం పట్టుకుంది. అది మలేరియా కాదు. కొయినా కూడా పని చేయలేదు. ప్రతిదినం మధ్యాహ్నం వేళ జ్వరం వచ్చేది. అతడు ఆరు వారాలు రెండు సార్లు, నైలునది దాటి, గుర్రపు బండిమీద వేలీ ఆఫ్ కింగ్స్‌కి పోయేవాడు. చాల బలహీనంగా ఉండడంచేత అతడు కంచర గాడిద మీద అక్కడికి వెళ్ళలేకపోయాడు. ఆ రాజసమాధిలో బ్రెస్టెడ్ తెల్లటి మాస్కు ముఖానికి తొడుక్కొని పనిచేశాడు. దానితో ఆ విచిత్రమైన రోగం తగ్గిపోయింది.

ఇంగ్లీషు ప్రొఫెసర్ ఒకాయన, లాస్లెయిర్, కెనడా విశ్వవిద్యాలయంలో పనిచేసేవాడు. హోటలులో బ్రెస్టెడ్ ఉన్న గది పక్కదానిలో బస చేశాడు. అతడు సన్నగా పొడవుగా ఉండేవాడు. మంచి సంస్కారం కలవాడతడు. మృదుభాషి – అతడు టుటన్ ఖమున్ సమాధి చూడాలని ఆసక్తితో అంత దూరం వచ్చాడు. కార్టర్‌కి పరిచయం చేసే ఉత్తరాలు తెచ్చాడు. అతడు సమాధిని దర్శించి మధ్నాహ్నానికి తన మాటలు గదికి చేరుకున్నాడు. తన కోరిక తీరినందుకు అతడు చాలా సంతోషించాడు. కానీ, అతడు చాల తీవ్రమైన అస్వస్థతకు లోనయాడు. బ్రెస్టెడ్‌కి మందిచ్చిన ఇంగ్లీషు డాక్టరును పిలిపించారు.

రాత్రి చాలా వరకు రోగి దగ్గుతునే ఉన్నాడు. క్రమంగా దగ్గు తగ్గిపోయింది. బ్రెస్టెడ్ కుమారుడు అతనిని చూడాలని వెళ్లాడు. గదిలోంచి ఇంగ్లీషు డాక్టరు పైకి వస్తూ, ప్రొఫెసరు చనిపోయాడని చెప్పాడు.

“ఊపిరితిత్తుల వాపు” వలన అతడు చనిపోయినట్లు అతని డెత్ సర్టిఫికెటులో ఉంది. హోటలు యజమానులు బెంబేలెత్తిపోయారు. అతని మృతదేహాన్ని, అతని వస్తువులను ఎవరికీ తెలియకుండా రవాణా చేశారు.

బ్రెస్టెడ్ జీవితాంతం వింతయైన రోగంతో బాధపడ్డాడు. మరొక పన్నెండు సంవత్సరాల తరువాత అతడు న్యూయార్కులో చనిపోయాడు. అతడు తీవ్రమైన ఊపిరితిత్తుల వ్యాధితో మరిణించాడని డాక్టర్లు వెల్లడించారు.

కార్నర్ వాన్ ప్రభువుతో ఈ దురదృష్టం మొదలయింది. ఆ సంవత్సరమే అతని సోదరుడు చనిపోయాడు. అమెరికన్ ఈజిప్షియాలజిస్టు హెన్రీ గుడియల్ మరణించాడు. 1924 లో బ్రిటీస్ ఆర్కియాలజిస్టు డగ్లస్ రీడ్ చనిపోయాడు. అతడు మమ్మీ రూపంలో ఉండి, పూర్తిగా తెరువని టుటన్ ఖమున్ శవ పేటికకు ఫోటోలు తీశాడు.

ఆ విధంగా, మరి రెండు సంవత్సరాలలో, కార్టర్ గురువు నవెల్లీ స్నేహితుడు గౌల్డు, పారిశ్రామికవేత్త పుల్స్, పాపిరస్లు చదివే గ్రీన్ ఫెల్, అమెరికన్ ఈజిప్టాలజిస్ట్ ఎంబర్, కార్నర్ వాన్ ప్రభువు చనిపోయే వరకు సేవ చేసిన బ్రిటీస్ నర్సు – అందరూ చనిపోయారు. అందరూ విచిత్రమైన పరిస్థితులలో మరణించారు.

రిచర్డ్ బెథెల్ అన్న అతడు కార్టర్ యొక్క సెక్రటరీ, ఒక ఉదయం చూస్తే అతడు పక్కమీద చచ్చిపడి ఉన్నాడు. ఊపిరి ఆడక చనిపోయాడు. ఈ విపరీతమైన పరిస్థితులు అంతటితో ఆగలేదు. బెథెల్ తండ్రి, భవనం ఏడో అంతస్తు నుండి కిందికి దుమికి చనిపోయాడు. అతని శవపేటికను సమాది స్థలానికి తీసుకుపోతుంటే, ఆ శకటం కింద ఒక చిన్న కుర్రాడు పడి చనిపోయాడు. కార్టర్ కింద డ్రాఫ్ట్స్‌మన్‌గా పనిచేసిన హాల్ అన్న ఆర్కియాలజిస్టు బ్రిటీష్ మ్యూజియంలో పనిచేస్తూ చనిపోయాడు.

ఈజిప్టాలజీ ప్రారంభించిన దగ్గర నుండి డజన్ల కొద్దీ ఆర్కియాజిస్టులు, పరిశోధకులు, అనుకోకుండా ఆకాలంలో కారణం నిరూపించలేని మరణాలను పొందారు.

కాని, కొంతమంది, రిచర్డ్ లెప్సియత్, అడాల్ఫ్ ఎర్మన్, అలన్ గార్డినర్, గాస్టర్ మస్పరో, ఎడువార్డ్ నవెల్లీ – వంటి మహానుభావులు, ఈ పరిశ్రమలోనే వృద్ధాప్యం వరకు జీవించారు. అధిక సంఖ్యలో ఆకస్మికంగా చనిపోయిన స్కాలర్ల విషయంలో మనం ఏం జవాబు చెప్పగలం?

మరో ఉదాహరణ – ఎడ్వర్డ్ అయిన్‌టన్ అన్న అతడు ఈజిప్టులో కొన్ని సమాధులను బయట పెట్టాడు. అతడు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా తరపున సింహళంలో పని చేయడానికి వెళ్లాడు. కాని, అతడు ఈజిప్టుకు తిరిగి వెళ్ళి పోవాలని తపించాడు. ఈ సంగతి తన స్నేహితుడికి వ్రాశాడు. కాని, అతడు ఈజిప్టు దేశం తిరిగి చూడలేదు. హరిత వర్ణంలో పారే నైలునదిని మరి చూడలేదు. ఇంటుక రంగులోనున్న ఉన్నతమైన సమాధులను వాలీ ఆఫ్ కింగ్స్‌లో చూడలేదు. అతడు, సింహళంలో ఒక స్నేహితుడితో కలిసి వేటాడడానికి వెళ్ళాడు. స్నేహితుడితో కూడా అతడు అడవిలో చచ్చిపడి ఉన్నాడు. వాళ్ళ శరీరాలమీద ఒక దెబ్బ కూడా లేదు. వాళ్ళిద్దరూ నీళ్ళలో పడి చనిపోయారనడానికి బట్టలు తడిసిన గురుతులే కనిపించలేదు. అయితేనేం, చావుకేదో కారణముండాలి కదా! వాళ్ళు నీటిలో పడి మునిగి పోయారని డెత్ సర్టిఫికెట్‌లో ఉంది.

ఈ సందర్భంలో ఇంకొక ఉదాహరణ – ఆర్థర్ వేగేల్ పురాతనవస్తు శాఖకు ఇనస్పెక్టర్ జనరల్‌గా కెయిరోలో పనిచేసేవాడు. 18వ రాజవంశానికి చెందిన ఒక వజీరు సమాధిని తవ్వుతున్నప్పుడు, అతనికో మతగురువు మమ్మీ దొరికింది. అది వజీరు శవపేటికలో ఉంది. బహుశా వారసులకు ఖర్చు తగ్గించడం కోసం ఆ మత గురువు శరీరాన్ని మరొకరి శవపేటికలో పెట్టినట్లున్నారు. ఆ శవపేటిక యజమాని ఏమయాడో తెలియదు. ఆ మతగురువు మమ్మీని, శవ పేటికను వేగెల్ లక్సర్ నగరానికి తీసుకుపోయి తన ఆఫీసు స్టోరు రూమ్‌లో ఉంచాడు. శవపేటిక తలుపు తెరచి, అందులో ఉన్న మమ్మీ కనపడుతున్నట్లు విడిచి పెట్టాడు. అతడు ఎప్పుడు ఆ గదిలోకి ప్రవేశించినా, ఏదో వ్యాకులత అతనిని ఆవరించుకునేది. అతనికి మమ్మీలు కొత్తవి కావు. ఈ మమ్మీ మాత్రం అతడిని గారడీ చేసినట్లు ఆకర్షించుకొనేది.

ఈ విచిత్రమైన భావం అతని మనసులో జిజ్ఞాసను రేకెత్తించింది. ఒక ఉదయం అతను స్టోరు రూములోకి ప్రవేశించి, తనంతటతానే, ఆ పవిత్రపు మమ్మీ శరీరానికి చుట్టిన గుడ్లకట్టలను విప్పడానికి అప్పుడు అతడు విప్పాడు. క్రమంగా తాను చూసినది వ్రాసుకొని, బొమ్మలు గీసి ఫోటోలు తీశాడు. ముఖానికి చుట్టిన నారబట్టలు చాల పలుచగా ఉన్నాయి. వేగేల్ ఆ నారబట్టలను, ఆ మమ్మీని తన యింటికి తీసుకుపోయాడు. దానిన తన స్నేహితులకు చూపదలచాడు. తన ఉండే గృహానికి వెలుపల పోర్టికోలో మమ్మీని ఉంచాడు. నారబట్టలను గెస్టు రూములో టేబిలు డ్రాయరులో పడేశాడు.

ఈ సమయంలో ఆర్కియాలజిస్టు గృహానికి అతిథులు వచ్చారు. ఒక మహిళ, ఆమె కూతురు వచ్చారు. వేగెల్ మమ్మీకి చుట్టిన బట్ట గురించి మరచిపోయి, తన అతిథులుండే గదిని, వచ్చిన వాళ్ళకు యిచ్చాడు. రెండు రోజుల తరువాత చిన్నపిల్ల తీవ్రంగా జబ్బు పడింది. డాక్టరు వచ్చి పరీక్షించాడు, కాని, అది ఏ జబ్బో నిర్ధారణ చేయలేకపోయాడు. ఆ చిన్న పిల్ల పరిస్థితి ఇంకా విషమించింది. మరునాడు ఉదయం ఆ పిల్ల యొక్క తల్లి వేగెల్ దగ్గరికి పరుగెత్తుకొని వచ్చింది. ఆమె చేతిలో మమ్మీకి చుట్టిన బట్ట ఉంది.

“ఇదిగో! ఘోరమైన ఈ బట్ట – దీనిని వెంటనే తీసుకుపోయి కాల్చు. బతిమాలుకుంటున్నాను. మమ్మీని ఇంటి నుండి పంపించు. లేకపోతే చిన్నపిల్ల చనిపోతుంది” అంటూ చాల దుఃఖంతో ఆమె అరచింది.

వేగల్ ఇటువంటివేమీ నమ్మడు. కాని, ఆ మహిళ కోరికను మన్నించి మమ్మీని, మమ్మీకి చుట్టిన బట్టను ఒక పెట్టెలో పెట్టి కెయిరో పంపించాడు. రెండు రోజులలో ఆ పిల్లకు నయమయింది. వేగల్ కూడా ఆ విషయం మరచిపోయాడు.

వేగల్ తన యింట్లో మమ్మీకి చుట్టిన బట్టలు తొలగించి నప్పుడు ఫోటోలు తీశాడు. కొద్ది వారాల తరువాత ఆ ఫిల్ము కడిగాడు. ఒక ఫోటోలో మమ్మీకి కెమేరాకు మధ్యను ఒక వ్యక్తి యొక్క ముఖం అడ్డంగా కనిపించింది. ఈ విధంగా ఎందుకు జరిగిందో అతనికి బోధ పడలేదు. చాలమంది నిపుణులకు చూపించాడు. కాని ఎవరూ సమాధానం చెప్పలేక పోయారు.

వేగల్ పొట్టిగా దుబ్బుగా ఉంటాడు. 1908వ సంవత్సరంలో నైలునది పక్కనున్న అతని గృహానికి అతిథులు వచ్చారు. లిండన్ స్మిత్, అతని భార్య అమెరికా నుండి వచ్చారు. స్మిత్ గొప్ప చిత్రకారుడు. పారిస్‍లో చిత్రకళ అభ్యసించాడు. అతడు పురాతన ఈజిప్టు సమాధులను చిత్రీకరించి ఆర్కియాలజిస్టులను ఆశ్చర్యంలో మంచెత్తాడు. వేగల్‌కి ఇరవై ఎనిమిదేళ్ళే. కాని, చిత్రకారుడు అతనికంటె ఇరవై సంవత్సరాలు పెద్దవాడు. నైలునది రెండో గట్టున పిరమిడ్ల నీడల్లో పగలు పనిచేసి, రాత్రిళ్ళు ఇద్దరూ టెంటులో గడిపేవారు. ఒక సాయంకాలం వాళ్ళు వేలీ ఆఫ్ క్వీన్స్ వేపు నడుస్తుంటే వాళ్ళకో ఆలోచన తట్టింది. అర్థ వృత్తాకారంలో నున్న లోయలో చంద్రకిరణాలు ప్రసరించాయి. ఆ లోయలో వెన్నెలలో నాటకం వేయ నిశ్చయించారు వాళ్ళు. వేగల్ భార్య అఖెనటెన్ పాత్ర – అంటే పురుష పాత్రను స్త్రీ ధరించడం – స్మిత్ ఏదో చిన్న పాత్రను, అతని భార్య అఖెనటెన్ తల్లి పాత్రను ధరించడానికి సిద్ధమయారు.

ఈ నాటకం ఆడడానికి తీవ్రమైన యత్నాలు చేశారు. లక్సర్ నగరంలో ఉన్నతమైన పదవులలో నున్న వాళ్ళను మొదటి రాత్రి వేసే నాటకానికి ఆహ్వానించారు.

కాని, ఆ మొదటి రాత్రి మాత్రం రాలేదు.

డ్రస్ రిహార్సెల్సు వేసినప్పుడు స్మిత్ భార్య తన మొదటి సంభాషణ పూర్తి చేసిందో లేదో, ఆమె కళ్ళలో సూదులు పొడిచినట్లు బాధతో నేలను పడిపోయింది. మరి రెండు గంటలలో ఆమెకు సంధి ప్రలాన మొదలయింది. అర్థరాత్రి ఎడారి భూములమీద ప్రయాణం చేసి, నైలునదిని దాటి, లక్సర్ నగరంలో వేగల్ గృహం చేరడం ఒక దుస్వప్నం వలె జరిగింది. ఆమె చూపు చెదిరిపోయింది. మరొక రోజు తరువాత వేగల్ భార్య కూడా విపరీతమైన పరిస్థితులలో తెలివి తవిప్పి పడిపోయింది. ఆమెను కూడా కెయిరో తీసుకుపోయారు. ఆ స్త్రీ లిద్దరూ వచ్చే ప్రాణాలతో, పోయే ప్రాణాలతో, రెండు మూడు వారాలు ఆందోళనకరమైన పరిస్థితులలో జీవించారు. అదృష్టవశాత్తు వాళ్ళు తిరిగి ఆరోగ్యవంతులయారు. మరెప్పుడూ వాళ్ళు నాటకం సంగతి ఎత్తనే లేదు.

ఈ విచిత్రమైన పరిస్థితులకు అంతమంటూ లేదు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here