శ్రీపర్వతం-31

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 31వ భాగం. [/box]

[dropcap]కె[/dropcap]యిరో నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జనరల్ డాక్టర్ గమాల్ మోహ్రెజ్. ఫారోల శాపం గురించి అతనినో రచయిత అడిగాడు.

“ఈ విపరీతమైన మరణాలను చూస్తే ఏదో కారణం ఉండి ఉంటుందని అనిపిస్తుంది. ఈజిప్టు పురాతన చరిత్రలో ఒకటి, రెండు, శాప మంత్రాలు లభించాయి. కాని, మేము ఏ మాత్రం వాటిని నమ్మం. నన్ను చూడండి! నా జీవితమంతా ఫోరోల సమాధులలోను, మమ్మీలతోను గడిచింది. నేనే మీకు సాక్ష్యం – ఇంకా బతికే ఉన్నాను” డైరెక్టరు జనరల్ గారు జవాబు చెప్పారు.

కెయిరో నేషనల్ మ్యూజియమ్ చాలామంది ఫారోల మమ్మీలు ఉన్నాయి. టుటన్ ఖమున్ ఎగ్జిబిషన్‌కి పంపుతున్నారు. దానికోసం రాయల్ ఎయిర్ ఫోర్సుకి చెందిన రెండు జెట్ విమానాలు వచ్చాయి. ఆ మాస్కును పనివాళ్ళు జాగ్రత్తగా కట్టి, దానిని మ్యూజియం నుండి తీసుకొని వెళ్ళడానికి భుజాల మీదికి ఎత్తుకుంటూ ఉంటే నేషనల్ మ్యూజియం డైరెక్టర్ జనరల్, డాక్టర్ గమాల్ మోహ్రెజ్ నేలను పడిపోవడం, వెంటనే చనిపోడం సంభవించాయి.

శాస్త్రజ్ఞులకు పిరమిడ్లపై ప్రత్యేకమైన ఆసక్తి ఉంది. ఈ మధ్యనే, కారల్ డ్రబల్ అన్న జెక్ రేడియో యింజనీరు, గుల్లగా ఉన్న చిన్న పిరమిడ్ గురించి పేటెంట్ తీసుకున్నాడు. పెటెంట్ నంబరు 91304 అది. ఆ పిరమిడ్ వింత వింత పనులు చేస్తున్నది. ఆ పిరమిడ్‌లో ఉత్తర దక్షిణాలకు ఉన్నట్లు చేపలను ఉంచారు. పదమూడు రోజులలో అవి డిహైడ్రేట్ అయిపోయాయి. మూడింట రెండు వంతులు వాటి బరువు తగ్గి అవి మమ్మీలయిపోయాయి. క్షేత్ర గణిత పద్ధతిలో నిర్మించిన ఆ కట్టడంలో మొద్దు బారిన రేజరు బ్లేడ్లను ఉంచితే, ఆరు రోజులలో అవి పదును బారాయి. కారల్ డ్రబల్ దీనికి ఏ సంజాయిషీ చెప్పలేకపోయాడు.

పిరమిడ్ల ఆకారాన్ని పరికించి చూస్తే, అవి యథాలాపంగా నిర్మింపబడినవి కావని తెలుస్తుంది. పురాతన ఈజిప్టు దేశీయులు చాల ప్రయోగాలు చేశారు.

ఇంతెందుకు, కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన ప్రొఫెసరు లూయీ అల్వరేజ్ ఈ మధ్యనే ప్రయోగాలు చేశాడు. అతనికి 1968లో నోబెల్ బహుమతి వచ్చింది. అతడు 1962లో గీజాలోనున్న పిరమిడ్లను ఎక్స్‌రే తీయాలని ప్రయత్నించాడు. కాని, ప్రపంచంలో నున్న చాల పెద్ద ఎక్స్‌రే యంత్రం కూడా చాల చిన్న పిరమిడ్‌ని కూడా ఎక్స్‌రే చేయలేదు. గీజాలోనున్న పిరమిడ్లలో మధ్యనున్నది చిన్నది. 1818లో గియెవన్ని బెల్‌జోని, ఆ పిరమిడ్‌లో ఒక ఖాళీ సమాధి మందిరం కనుగొన్నాడు. పిరమిడ్ శిఖరానికి నూట నలభై గజాల లోతుకున్న ఆ సమాధి మందిరంలో అల్వరేజ్ పరిశోధనకు కావలసిన సమాగ్రిని ముఫ్పై టన్నుల బరువుంది. ఆ సమాధి మందిరంలోకి వెళ్ళవలసిన దారి ఇరుకుగా ఉండడం చేత యంత్రాలలో ముఖ్యమైనవి రేడియేషన్ డిటెక్టరులు. వాటితో కాస్మిక్ కిరణాల శక్తిని కొలవడానికి వీలవతుంది. ఆ సమాధి పేరు ఛఫ్రిన్ పిరమిడ్ – అక్కడ ఈ యంత్రం సామగ్రిని అమర్చి సిద్ధం చేయడానికి మూడు నెలలు పట్టింది. అపుడు ఈజిప్టులో జరిగిన ఆరు రోజుల యుద్ధం వలన పని కొంతకాలం ఆగిపోయినా తిరిగి 1968లో వసంతకాలంలో మొదలయింది.

ప్రయోగం యొక్క మూల సూత్రమిది.

కాస్మిక్ రేడియోషన్ ఎంత శక్తివంతమైనదంటే, అది పిరమిడ్ యొక్క రాతిని కూడా దూసుకుపోతుంది. ఆ పిరమిడ్ నిర్మాణానికి రమారమి నలబై లక్షల టన్నుల రాతిని ఉపయోగించారు. గాలి, రాతిలోంచి లోపలికి పోలేదు. కాస్మిక్ కిరణాలు, మ్యు అన్ కణాల ప్రభావం వలన రాతిలోంచి పోగలవు. ప్రయోగం ఈ విధంగా జరుగుతుంది. కాస్మిక్ కిరణాలను ప్రసరించినప్పుడు, ప్రసారం చేసే కోణాన్ని మార్చుతూ, మ్యు అన్ కణాల ప్రభావాన్ని కొలవాలి. కిరణాలను, కోణం మార్చుతూ ప్రసరించినా, మ్యు అన్ కణాల ప్రభావంలో మార్పు లేనప్పుడు, పిరమిడ్‌లో మరే గది లేదని తెలుస్తుంది. భిన్న కోణాలలో కాస్మిక్ కిరాణాలను ప్రసరించినప్పుడు, మ్యు అన్ కణాల ప్రభావంలో మార్పు కనిపిస్తే పిరమిడ్‌లో ఖాళీ జాగా ఉందని (అంటే సమాధి మందిరం వంటిది లోపల ఉందని) తెలుస్తుంది. ఇది సిద్ధాంతం ప్రకారం జరగవలసినపని.

కాని ప్రయోగం జరిపినప్పుడు పరిస్థితులు మారిపోయాయి.

అన్నిటికన్న ముఖ్యమైన సంగతి – అమర్చిన యంత్ర పరికరాలన్నీ పిచ్చెక్కిపోయాయి. అనుకున్న దానికన్న మ్యు అన్ కణాల ప్రభావం అమితంగా గోచరించింది. పిరమిడ్‌లో నున్న శాస్త్రజ్ఞులకు ఇది అంతుపట్టకుండా పోయింది.

అపుడు ప్రొఫెసర్ అల్వరేజ్ అన్నాడు.

“ఇది ఇంద్రజాలం కావచ్చు! లేక ఫారోల శాపం కావచ్చు! మీరు ఏ పేరు పెట్టి పిలిచినా సరే! కాని మనం విశదం చేయలేనిదేదో ఇక్కడ ఉంది”.

ఆర్కియాలజిస్టుల అకాల మరణాలకు మూడు రకల కారణాలున్నాయి. మొదటిది – తీవ్రమైన జ్వరం, సంధి – సంధిలో మరణం సంభవిస్తుందన్న శంక ఉత్పన్నమవుతుంది. రెండవది – రక్త ప్రసరణం ఆగిపోయి పక్షవాతం రావడం. మూడవది ఆకస్మికంగా కాన్సర్ వచ్చి కొద్ది కాలంలో మరణం సంభవించడం.

ఆర్కియాలజిస్టులు సాధారనంగా శాపాల సిద్ధాంతాన్ని తోసిపుచ్చుతారు. కాని, ఈ మహానుభావులు మాత్రం, పురాతన కాలం నుండి సంప్రాప్తమైన గ్రంథాలలోని విషయాలను నమ్ముతారు.

శాస్త్ర దృష్టితో ఈ శాపాల విషయం పరిశీలించడం జరిగింది.

మరణాన్ని కలిగించే సూక్ష్మ క్రిములు, విషాలు, రేడియో ఆక్టివిట్, నరాల పై పనిచేసే విషవాయువు, విశ్వం నుండి ఉత్పనమైన నిగూఢ కిరణ ప్రసారం – ఇవన్నీ కారణాలని అంటారు.

డాక్టరు తాహా కెయిరో విశ్వవిద్యాలయంలో ప్రొఫెసరు – అతడు తను చేసిన పరిశోధనల గురించి, 1962 నవంబరు 3వ తారీకున కెయిరోలో పత్రికా విలేఖరుల ముందు ఉపన్యసించాడు. ఫారోల శాప సిద్ధాంతం గురించి తెలుసుకున్నట్లు అతడు చెప్పాడు. ఆర్కియాలజిస్టులను, మ్యూజియంలో పనిచేసే ఉద్యోగులను చాలకాలమై పరిశీలిస్తున్నట్లు, వీరు బూజు వలన కలిగే సాంక్రామిక వ్యాధికి గురి అవుతున్నారని, ఈ వ్యాధి సోకినవారి ఊపిరితిత్తులు శ్వాసనాళాలు మంటలు పుట్టి వాచిపోతాయని ఆయన చెప్పాడు. చాలా పరిశోధనలు జరిపి, ఆయన ఒక విషయం నిర్ధారించి చెప్పాడు. సమాధి మందిరాలలోను మమ్మీల శరీరాల మీదను ఉన్న ఈ బూజు వేలకొలది సంవత్సరాలు నాశనం లేకుండా బ్రతికి ఉంటుందని ఆయన చెప్పాడు. తరువాత ఆ శాస్త్ర పరిశోధకుడు ఇలా అన్నాడు.

“ఇంతకాలం, పురాతన సమాధులలో పనిచేసే స్కాలర్లు, ఏదో ఒక శాపానికి గురియై మరణించేవారని ఒక మూఢ విశ్వాసం వ్యాప్తిలో ఉంది. కాని, సమాధి మందిరాలలో, మరణం కలిగించే ఈ బూజు, వేలకొలది సంవత్సరాలు సజీవంగా ఉంటుందని కనుగొన్న తరువాత, అటువంటి శాపసిద్ధాంతం సమూలంగా నాశనం చేయబడింది. శాస్త్రజ్ఞులు ఈ సమాధులలో పనిచేసినప్పుడు, ఈ రోగ కారణమైన క్రిములతో సంసర్గం ఏర్పడి వ్యాధిగ్రస్తులవుతున్నారు. ఈనాటికి కూడా, కొంతమంది, ఫారోల శాపం అమానుషమైన అద్భుత శక్తులు కలదని నమ్ముతుంటారు. ఇవన్నీ కట్టుకథలంటే ఆశ్చర్యం లేదు.”

నిదానమైన ఆలోచనలుకల ఒక శాస్త్రజ్ఞుడు చెప్పిన మాటలివి. కాని, కొద్ది వ్యవధిలోనే, ఈ మాటలు విశ్వాసం కలిగించలేకపోయాయి. ప్రెస్ కాన్ఫరెన్స్ అయిన కొద్ది క్షణాలలోనే, డాక్టరు తాహా, తన సహోద్యోగులిద్దరితో, కెయిరో నుండి సూయజ్‌కి కారులో బయలుదేరాడు. ఆ ఎడారి రోడ్డు మైళ్ళ కొద్ది, వంపులు లేకుండా, తిన్నగా పోతుంది. దానిమీద వాహనాల రాకపోకలు కూడా అంతగా ఉండవు. కెయిరో నుండి డెబ్బై మైళ్ళు పోయిన తరువాత డాక్టర్ తాహా నడుపుతున్నకారు అకస్మాత్తుగా రోడ్డు రెండో పక్కకు పరుగెత్తి, ఎదురుగా వస్తున్న మరొక కారు మీదికి దూసుకుపోయింది. తాహా, అతని సహోద్యోగులు అక్కడికక్కడే మరణించారు. రెండవ కారులోని వారికి దెబ్బలు తగిలినా బతికి బయట పడ్డారు. ఈ సాక్షులు తాహా కారును చాల దూరం నుండి చూస్తున్నట్లు, ఉన్నట్లుండి అది వారిమీదికి సూటిగా దూసుకుపోయినట్లు చెప్పారు. వారి మాటలు విన్న తరువాత తాహా శరీరానికి పోస్టుమార్టమ్ చేశారు. ఆ శాస్త్రజ్ఞుడు ఊపిరాడక ఒక్కసారి చనిపోయినట్లు తెలిసింది. ప్రమాదం జరిగినప్పుడు చనిపోయిన మనిషి స్టీరింగ్ దగ్గిర ఉన్నాడు.

సూక్ష్మక్రిములు, విషాలు ఆర్కియాలజిస్టుల మరణాలకు కారణాలు కావచ్చుకాని, ఇవి కేవలం ఊహలేమో!

అతని పేరు డాక్టరు జాన్ వైకీస్ – అతడు దక్షిణాఫ్రికాకు చెందిన భూగర్భశాస్త్రజ్ఞుడు. అతడు రొడీషియా పర్వత పంక్తులలో ఉన్న గుహలలోకి 1950లో వెళ్ళాడు. ఆ గుహలు భూమి మట్టానికి 150 అడుగులు లోతులో ఉన్నాయి. అక్కడ గబ్బిలాలు విశేషంగా ఉన్నాయి. ఈ పక్షుల రెట్టలు ఎరుపుగా పనిచేస్తాయో తెలుసుకోడానికి అతడు ఆ గుహలలోకి ప్రవేశించాడు. అక్కడ అతనికి వేలకొలది గబ్బిలాలు ఎదురయ్యాయి. అతడు గుహలలో తన పరిశోధనను పూర్తి చేసి పగటి వెలుతురులోకి వచ్చాడు. గుండెలలో మంటగా ఉన్నట్లు, ఒళ్ళు నొప్పులు పెడుతున్నట్లు, చాల తీవ్రమైన జ్వరం వచ్చినట్లు అతడు చెప్పాడు. గుహలలోకి అతడు వెళ్ళినప్పుడు ఊపిరితిత్తుల రోగానికి గురయినట్లు డాక్టరు అనుకున్నాడు.

భూగర్భ శాస్త్రజ్ఞుడి జ్వరం ఇంకా ముదరండంతో పోర్టు ఎలిజబెత్ లోని పెద్ద హాస్పిటలుకి రోగిని పంపించారు. అక్కడ వైద్యులలో పెద్దతను, ఏదో అమెరికన్ జర్నల్‌లో ఈ విధంగా గుహలలో పరిశోధనలు జరిపినవాళ్ళు గురైన రోగం యొక్క లక్షణాలను వివరిస్తే, చదివాడు. డాక్టర్ వైలెస్ యొక్క రోగ చిహ్నాలు ఆ విధంగానే అతనికి కనిపించాయి. గుహా రోగం అతనికి తగిలింది. దీనిని హిస్టోప్లాస్ మాసిస్ అంటారు. ఈ రోగ క్రిమి గబ్బిలాల రెట్టల ద్వారా ఇతరులకు సంక్రమిస్తుంది. దీనిని అంటీబయాటిక్సుతో కుదర్చవచ్చు.

1870లో యూరోప్‌లో ఒక సొరంగం తవ్వారు. అప్పుడు చాలమంది పనివాళ్ళు ‘సొరంగ రోగం’తో బాధపడ్డారు. ఒక స్విస్ డాక్టరు ఈ రోగానికి కారణం కనుక్కున్నాడు. ఈ పనివాళ్ళ మలంలో చిన్న నులిపురుగు కనిపించింది. ఈ పురుగు తలలో రెండు విష గ్రంథులున్నాయి. ఈ గ్రంథులనుండి రోగాన్ని కలిగించే పదార్థం ప్రేగుల రక్తనాళాల ద్వారా రక్తంలోకి ప్రవేశించి ఎర్రరక్త కణాలను నాశనం చేస్తుంది. దీనిని గనులు తవ్వేవారి రక్తహీనత అంటారు. ఆర్కియాలజిస్టులకు ఇటువంటి రోగం కలగవచ్చు. దీనితో నీరసం ముంచుకొని వస్తుంది. రక్తహీనత కలిగి మనిషి పాలిపోతాడు.

ఇటువంటి రోగాలు ఆర్కియాలజిస్టులకు కలిగితే, వాటికి కారణం ఎవరి శాపం కాదని ఒక నిశ్చయానికి రావచ్చు.

ఆ విధంగానే విషాల విషయంలో కూడా – ఫారోలు తమ సమాది మందిరాలను చాల శక్తివంతమైన విషాలతో కాపాడుకున్నారని అంటే, ఆర్కియాలజిస్టుల మరణాలకు ఒక కారణం లభిస్తుంది. పురాతన కాలానికి చెందిన ఈజిప్షియన్లు విష ప్రయోగంలో ఆరితేరిన వాళ్ళు. వాళ్ళు పీచ్ పండ్ల పిక్కలనుండి ప్రస్సిక్ ఆసిడ్‌ను, ఒక జాతి మొక్కనుండి వసనాభిని తీసేవారు. ప్రస్సిక్ ఆమ్లం కాని, వసనాభి కాని అయిదు గ్రాములు వాడితే మరణం తప్పదు.

పురాతన కాలంలో విషప్రయోగం చాల వ్యాప్తి గాంచింది. ప్రాచీనులైన గ్రీకులు నాగరకమైన పద్ధతిలో విష ప్రయోగం చేసి మరణశిక్షలను అమలుచేశారు. వాళ్ళు ప్రస్సిక్ ఆమ్లం ఉపయోగించారు. సోక్రటిస్ ఒక గిన్నెడు గన్నేరు పిక్కల విషం తాగి మరణించాడు.

క్లియోపాత్రా ఈజిప్టు రాణులలో ఆఖరుది. విషప్రయోగం చేయడంలో ఆమె చాల నిపుణురాలని చరిత్ర చెప్తుంది. తాను కొత్తగా కనుగొన్న విషాలను బానిసల మీద ప్రయోగించడంలో ఆమె వెనుదీయలేదు. ఆమె ప్రియులు కూడా ఆమె నైపుణ్యానికి భయపడేవారు. ఈ సుందరమైన రాణితో అంటోనీ ఎప్పుడూ ఒంటరిగా భోజనం చేయలేదు. తన ఆహారం రుచి చూడడానికి మరొక మనిషిని వెంటనుంచుకునేవాడు.

ఒకసారి ఆంటోని తన ప్రియురాలితో పానగోష్ఠికి కూర్చున్నాడు. అతనితో వచ్చిన మనిషి ద్రాక్షాసవం ముందుగా రుచి చూశాడు. అతడు ఏమీ కాలేదు. అతను బతికి ఉండడం చూసి, ఆంటోనీ ఆ సవపాత్రను పెదవుల వేపు ఎత్తడానికి ప్రయత్నించాడు. అప్పుడు క్లియోపాత్రా విలాసంగా జడలోకి చేయి పోనిచ్చింది. తురుముకున్న పూలదండనుండి ఒక పువ్వును త్రుంచి ప్రియుడి ద్రాక్షసవం పాత్రలో పడవేసింది. అది ప్రియురాలి సరసంలో ఒక భాగంగా భావించి, ఆంటోనీ ద్రాక్షాసనాన్ని పెదవులవేపు తీసుకున్నాడు. కాని, అందమైన క్లియోపాత్రా, విషం పాత్రను అతని చేతులలోంచి లాక్కుంది. శిక్షననుభవిస్తున్న ఒక ఘోరమైన నేరస్తుడిని పిలిచి ఆ సవం తాగించింది. వాడు తాగడంతోనే నేలను పడి చనిపోయాడు. ఆంటోనీ ఇదంతా చూసి దిగ్ర్భాంతుడయాడు. అప్పుడా రాణీ వివరించింది. ద్రాక్షాసవంలో విషం లేదు. ఉన్నదంతా పువ్వునుండి వచ్చినదని ఆమె చెప్పింది. ఇటువంటి భయంకర ప్రయోగం చేయడంలో ఆమె ఉద్దేశమేమంటే, తన శక్తిని ఆంటోనీకి తెలియజేయడమే. అతనిని చంపడం చాలా సులువని ఆమె రుజువు చేసింది.

ఈజిప్టు దేశపు విషం చాల ప్రసిద్ధికెక్కినది. రోమన్ చక్రవర్తులు, విషప్రయోగం చేసే తమ మనుష్యులను నైలుదేశానికి పంపి శిక్షణ ఇప్పించేవాళ్ళు. కాలిగుల, క్లాడియస్, నీరో, కరకల్లా ఎన్నో రకాల విషాలను సేకరించారు. ఈ విధంగా విషాలను సేకరించడం కోసం కరకల్లా డెభ్బై అయిదులక్షల దీనారీ నాణాలను వ్యయం చేశాడు.

ఈనాటికి కూడా ఆఫ్రికాలో చాలా విషాలు లభిస్తాయి. అవి హృదయాన్ని స్తంభింపజేస్తాయి. కొన్ని విషాలు శరీరాన్ని సోకితే చాలు, చిత్త భ్రమ కలిగిస్తాయి. ఒకరకం విషం హృదయం మీద పనిచేసి మరణానికి దారితీస్తుంది. ఈ విషం తాగిన వారి చెమట, మరొకరికి తగిలినా ఈ రోగం ఇతరులకు సంక్రమిస్తుంది. సమాధులలో ఉన్న గోడల పై భాగాలలో, లేక సమాధులలో గల వస్తువులపై నిక్షేపించిన ఈ శక్తివంతమైన విషాలు మరణం కలిగిస్తాయి. గాలి చొరకుండా, సూర్యరశ్మి కూడా తగులకుండా మూసిన సమాధులలో ఈ విషాలు వేలకొలది సంవత్సరాలు, శక్తిని కోల్పోకుండా, స్థిరంగా ఉండి హాని కలిగించగలవని శాస్త్రజ్ఞులు నిర్థారణ చేశారు.

పురాతన కాలానికి చెందిన ఈజిప్షియన్లు పిరమిడ్లను ఆలయాలను నిర్మించారు. వీటి సాంకేతిక నిర్మాణ పద్దతులను, తరువాత తరాల వారికి, వేలకొలది సంవత్సరాల వరకు, నిగూఢంగా ఉండిపోయాయి. అంతటి నైపుణ్యం గల పూర్వులు, తమ దైవాంశ సంభూతులైన రాజులను, దొంగలు దోచుకోడానికి, సాహసవంతులు బయట పెట్టడానికి ఒప్పుకుంటారా? వాళ్ళు తప్పకుండా రక్షణ కల్పించే ఉంటారు.

అది శాపం కావచ్చు – విషం కావచ్చు – రోగం కావచ్చు. ఇక మళ్ళా మన కథకు వద్దాం.

హెూవర్డ్ కార్టర్ ఎప్పుడూ ఫారోల శాపసిద్ధాంతాన్ని నమ్మలేదు. అన్నిటికీ అదృష్టమే కారణమనేవాడు. జీవితంలో ఎదురయిన పరిస్థితులను వచ్చినట్లే స్వీకరించేవాడు. కాని, అతడు టుటన్ ఖమున్ సమాధి గురించి చేసే ప్రయత్నాలను మాత్రం విడిచి పెట్టలేదు. అటువంటి ప్రయత్నాలు చేస్తే, చిన్నతనం లోనే మృత్యువు తప్పకుండా కలుగుతుందని అందరూ అన్నారు. అతడు మాత్రం వెనుకంజ వేయలేదు.

ఫారోలు అతనిని తమ మాయలో బంధించారు.

శశికళ ఇంతవరకు చెప్పింది. అప్పటికే చాలా రాత్రయింది.

జావా ఎప్పుడో వండి పెట్టి వెళ్ళిపోయింది. టెంట్ల బయట కూర్చున్న వాళ్ళు లోపలికి పోయి భోజనాలు చేశారు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here