Site icon Sanchika

శ్రీపర్వతం-33

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 33వ భాగం. [/box]

[dropcap]’అ[/dropcap]ని’ అన్న పేరు కల బుద్ధిమంతుడున్నాడు. అతడేమన్నాడంటే “గొప్పవాడి కొడుకని, పైకి లేవనెత్తకండి, యోగ్యతని దృష్టిలో ఉంచుకొని మనుష్యుడిని ఉపయోగించండి”.

కాని, నిజజీవితంలో ఇది భిన్నంగా ఉండేది.

ఫారో దేవుడి వారసుడైతే, ప్రధానార్చకుడు దేవుడి సేవకుడు. అంతే కాకుండా ఇతడు దేవాలయాల ఆస్తులను సరిదిద్దవలసినవాడు. నిజానికి ఈ అర్చకుడే పాలించవలసినవాడు. ఆర్థిక విషయాలలో ఇతడే నాయకుడు.

రాజుకు శాశ్వతమైన జీవిత ముందని చెప్పే ఈ ప్రధాన అర్చకుడు ఫారో నుండి వస్తువులను సులభంగా రాబట్టేవాడు.

అఖెనటెన్ తల్లి పేరు ‘తియి’ – ఆమె చాల అందమైనది. ఆమెకు పన్నెండు మంది సవతులు. అంతేకాక ఆమె భర్తకు కొన్ని వందల మంది ఉంపుడుగత్తెలు. ఆమె చాలా తెలివైనది. భర్తను వేలిచుట్టూ తిప్పుకొనేది. అతినికి చాలమంది పిల్లలను కన్నది. కాని, అప్పుడప్పుడు ఆమె తన సుఖం కోసం అన్యత్ర సంచరించేది. అటువంటి తిరుగుళ్ళ ఫలమే టుటన్ ఖమున్. స్త్రీ సుఖం కోసం అలమటించే ఆమె భర్తకు ఈ విషయం తెలియదు. ఒకప్పుడు తెలిసినా, తెలియనట్టే వ్యహరించేవాడు. ఈ దుర్వార్తను అతడు పైకి రానీయలేదు.

మిటన్నీ అన్న రాజ్యం నేటి సిరియా దేశం. ఆ దేశానికి షుతర్నా అన్న రాజు ఉండేవాడు. అతని కూతురు చాలా చక్కనిది. ఆమెపై అఖెనటెన్ తండ్రికి మనసు పోయింది. ఈజిప్టు ఫారో నుండి బంగారం, బట్టలు ప్రతిఫలంగా తీసుకొని, రాజైన షుతర్నా, తన కూతురిని అద్భుతమైన నైలు దేశానికి పంపించాడు. ఆమెతో పాటు 317 మంది అంతఃపుర స్త్రీలు కూడా వెళ్ళారు. వాళ్ళు అత్యంత సౌందర్యవంతులు. షుతర్నా కూరురి పేరు గిలుఖేప.

గిలుఖేపకు ఒక సోదరుడుండేవాడు. అతని పేరు తుష్‌రత్తుడు. అతడు మరో ఏడు సంవత్సరాల తరువాత మిటన్నీ సింహాసనమెక్కాడు. అతనికి ‘తడుఖేప’ అన్న పేరుగల కూతురొకతె ఉంది. అందమైన కూతుళ్ళను ఉపయోగించి డబ్బు సంపాదించడం అతడు తండ్రి నుండి తెలుసుకున్నాడు. తాను కోరిన బంగారం, వెండి ముట్టిన తరువాత తుష్‌రత్తుడు ఒప్పందం అమలు చేశాడు. మిటన్నీ రాజపుత్రిక ‘తడుఖేప’ ఈజిప్టు దేశం చేరిన తరువాత తన పేరున నెఫర్ టిటిగా మార్చుకుంది.

ఆమెనోఫిస్, అఖెనటెన్ యొక్క తండ్రి. అతడు ఎనిమిదవ ఏటనే సింహాసనమెక్కాడు. అతని భార్య తియి. ఆమె ప్రజల మధ్య జరిగే ఉత్సవాలలో పాల్గొనేది. ఆమె భర్తను అంతగా పట్టించుకునేది కాదు. అధికారం ఆమె హస్తగతం చేసకుంది. ఆమెనోఫిస్ అంత చక్కనివాడు కాడు. అతడు భార్యలను కొనుక్కోవలసి వచ్చేది. అతడు అయిదడుగులు పొడవుండేవాడు. అతనికి బొజ్జ ఉండేది. ముఖం చంద్రుడివలె గుండ్రంగా ఉండేది, బట్టతల ఉండేది. జీవితం చివరి దశలో అతడు రోగగ్రస్తుడయాడు. ఎన్ని ప్రయత్నాలు చేసినా అతడు కోలుకోలేదు. రమారమి ముప్ఫై ఎనిమిది సంవత్సరాలు రాజ్యపాలన చేసి అతడు మరణించాడు.

మూడవ అమెనోఫిస్‌కి తియికి జన్మించిన పుత్రుడు సింహాసనానికి అర్హుడయాడు. ఇతని గురించి అర్చకులకు అంతగా తెలియదు. అర్చకుల విద్యాలయంలో ఇతడు చదువుకున్నాడు. విదేశాల రాజ సభలలో ఇతడు పాల్గొన్నాడు. అతడు తన పన్నెండవ ఏట సింహాసనమెక్కాడు. ఈ రాజు ‘అమున్’ దేవుడిని తోసి రాజన్నాడు. సూర్యదేవుడు ‘అటెన్’ని ఆరాధించేవాడు. ఇతని భార్య నెఫర్ టిటి సుందరి. అతనికి పదహారు సంవత్సరాలు వచ్చేసరికి, ఆమె అతని వలన ముగ్గురు కూతుళ్ళను కన్నది.

ఈ నాలుగవ ఆమెనోఫిస్, ఒక కొత్త స్థలంలో, నదీ తటాన, అఖెటటిన్ అన్న నగరం నిర్మించాడు. ఈ కొత్త నగరం రాజ్యపాలనకు, కొత్త మతాన్ని వ్యాప్తి చేయడానికి అనువుగా ఉండేది.

ఈ విప్లవకారుడైన రాజు, అర్చకుల ఆటలు కట్టించడానికి, అన్ని ప్రయత్నాలు చేశాడు. వాళ్ళ దుశ్చేష్టలకు మూలకారణం తెలుసుకున్నాడు. అర్చకులను బాధించడం కన్న, వారు పూజించే అమున్ దేవతని బాధించడానికి పూనుకున్నాడు. ఆ దేవత పేరు కనిపించిన చోట తుడిచి వేశారు.

అమున్‌కి సంబంధించిన కళాకృతులు, గ్రంథాలు ధ్వంసమయాయి. అతడు తన నాలుగవ పాలనా సంవత్సరంలో, నాలుగవ ఆమెనోఫిస్ అన్న తన పేరును, అఖెనటెన్‌గా (సూర్యునికి ఇష్టుడుగా) మార్చుకున్నాడు.

అఖెనటెన్, అతని అందమైన భార్య నెఫర్ టిటి, మానవ సంబంధాలకు ప్రాముఖ్యతనిచ్చారు. ప్రజల మధ్య దర్శనమిచ్చేటప్పుడు సుఖంగా ఉన్న కుటుంబంవలె కనిపించారు. అందరి ఎదుట వాళ్ళు ముద్దు పెట్టుకునేవారు. ఆ రాజ దంపతులు స్వయంగా కొత్త రాజధాని అఖెటటెన్‌లో పనులు చూసేవారు.

రాజ్యపాలన న్యాయంగా జరిగేది. భ్రష్టాచారం సమసిపోయింది. రాజ్యపాలనలో అవకతవకలు లేవు. ఎక్కడ అపవాదులు వ్యాపించలేదు.

ఈ రాజ్య పాలన దుష్టంగా మారుతుందని ఎవరనుకున్నారు!

ఈ చిక్కులన్నీ రాజుగారి అనారోగ్యంతో మొదలయాయి. ఒక విచిత్రమైన వ్యాధి రాజుకి కలిగింది. చిన్నతనంలో అఖెనటెన్ అందరు పిల్లలు వలెనే సామాన్యంగా ఉండేవాడు. అతని తల వెనుకభాగం మాత్రం పైకి పొడుచుకొని వచ్చినట్లు కనిపించేది. అతనికి పదిహేడవ యేడు వచ్చి తరువాత అతని శరీరం కొవ్వుతో బలిసిపోయింది. చేతి కండరాలు, కాలి కండరాలు, పిరుదులు, వక్షస్థలం చాల హెచ్చుగా ఉబ్బిపోయాయి. దురదృష్టవంతుడైన ఆ రాజుకి ఆడరూపు వచ్చింది. ఇది భగవంతుడిచ్చాడని అతడు నమ్మాడు, అతడు కొంచెమేనా ఈ మార్పుకి కలవరపాటు చెందలేదు. అతడు సత్యాన్నే ఆరాధించేవాడు. బాక్ అతని ప్రధానశిల్పి. తన యథార్థ రూపాన్నే చిత్రించమని (మలచమని) అతడు శిల్పిని అదేశించాడు. .

చిత్రకారులు అఖెనటెన్‌ని, నెఫర్ టిటిని నిడుపైన కోల ముఖాలతోను, చాల బలంగా నున్న తొడలతోను, సన్నటి పొడవు చేతులతోను చిత్రించారు.

కరనాక్‌లో ఉన్న అటెన్ ఆలయంలో పెద్ద శిల్పముంది. ఆ శిల్పం కడుపుతో ఉన్నట్లు, స్త్రీ పురుష చిహ్నాలతో ఉన్నట్లు కనిపించి, అకౌనటెన్ వంటి రాజ్య పాలకుడు ఇతడేనా అనిపిస్తుంది. అతడు కోరిన నిజాయితీ పరిధులను దాటి అసహ్యం కలిగిస్తుంది.

ఈ విచిత్రమైన రాజు, తాను చేయించవలసిన పనులను చాల నిలకడగా చేయించాడు. అతని శిల్పులు, సంప్రదాయానికి భిన్నంగా, అతని ఆజ్ఞలను నెరవేర్చారు. అంతవరకు శిల్పాలలను ఉబ్బెత్తుగాను, సంపూర్ణంగాను చెక్కేవారు. గోడమీద చెక్కిన బొమ్మలు పైకి వచ్చినట్లు కనిపించేవి. కాని, కొత్త పద్ధతి ప్రకారం, శిల్పాన్ని గోడ మీద ఉబ్బెత్తుగా చెక్కడానికి బదులు రాతిలోపలికి ఉలితో చెక్కబడింది. కళాకారులు శిల్పాలను రెండు రకాలుగా విభజించారు. అంతవరకు ఉబ్బెత్తుగా చెక్కిన శిల్పాలు ఒకరకం. అటు తరువాత గోడలో లోతుగా చెక్కిన శిల్పాలు రెండవరకం. ఈ విధంగా, రెండవ పద్ధతి ప్రకారం శిల్పాలను చెక్కడం నుంచి, అంతకు పూర్వం ఉబ్బెత్తుగా చెక్కిన అమున్ దేవుడి శిల్పాలను తుడిచిపెట్టడం సులువయింది. ఈ లోతుగా చెక్కిన శిల్పాలను నాశనం చేయడానికి వీలుకాలేదు. ఉబ్బెత్తు శిల్పాలకు బదులు లోతుగా చెక్కిన శిల్పాలు ముందుకొచ్చాయి.

అఖెనటెన్ ఒక పెద్ద పొరపాటు చేశాడు. ఇదే అతని పతనానికి కారణం. సూర్య దేవుడి మతంలో పూర్తిగా మునిగిపోయి, అతడు విదేశీయ రాజకీయాల గురించి పట్టించుకోలేదు. కళను, సంస్కృతిని, స్వదేశపు రాజకీయాలను అతడు గుప్పిటిలో పెట్టుకున్నా, విదేశ వ్యవహారాలను అతడు అశ్రద్ధ చేశాడు.

రెండు దశాబ్దాల శాంతి తరువాత, యుద్ధవ్యాపారం రమారమి వెనుకబడింది.

రాజుగారి 12వ పాలనా సంవత్సరం వరకు అతని సామంతులు కప్పాలు కట్టారు. ఆ సరికి అతనికి ఆరుగురు అమ్మాయిలు. అతని అందమైన భార్య నెఫర్ టిటి వాళ్ళతో కలిసి అతడు క్రీస్తు పూర్వం 1352 నవంబరు 21 తారీకున, సామంతుల నుండి బంగారం, వెండి కానుకలుగా పుచ్చుకున్నాడు.

తరువాత రాజధానిలో విపరీత పరిస్థితులు ఏర్పడ్డాయి.

దురదృష్టకరమైన సంఘటనలు, ఒకటి తరువాత ఒకటి, మొదలయాయి. రాజదంపతుల రెండవ కుమార్తె మరణించింది. ఈ చావుకి వాళ్ళు దిగ్ర్భాంతులయారు. పూర్తిగా విచారంలో మునిగి పోయారు. అఖినటెన్, నెఫర్ టిటి తమ తొమ్మిదేళ్ళ కుమార్తె మరణశయ్య పక్కను నిలబడ్డారు. ఒక సమాధిలో ఈ చిత్రం చెక్కి ఉంది. తరువాత జరిగిన సంఘటనలు తొందర తొందరగా సంభవించాయి.

ఈ విపరీత వర్తన గల రాజు, అతని అందాల భార్య, వేలకొలది శిల్పాలలో ఒకే హృదయం, ఒకే ఆత్మ కలవారుగా చిత్రింపబడిన వాళ్ళు, దెబ్బలాడుకున్నారు. అఖెనటెన్ తన పెద్ద కూతురు మెరిటాటెన్‌ను ఒకానొక స్మెన్‌ఖఱే అన్న అతనికి యిచ్చి పెళ్ళిచేశాడు. అతని వంశం గురించి, అతని శీలం గురించి అంతగా తెలియదు. ఆర్కియాలజిస్టులు వేరువేరుగా అభిప్రాయపడ్డారు. మూడవ అమెనాఫిస్‌కి అతడు అక్రమంగా కొడుకయాడని, లేక అతని భార్య తియికి ఇతరుని వల్ల జన్మించిన అక్రమ సంతానమని, లేక మూడవ అమెనాఫిస్‌కి అతని స్వంత కూతురికి గల సంబంధం నుంచి జన్మించిన వాడని అంటారు. ఏదయితేనేం! రాజుగారి పెద్ద కూతురిని పెళ్ళాడడంతో స్మెన్‌ఖఱేకి సింహాసనం అధిష్టించే హక్కు లభించింది. నెఫర్ టిటి పధ్నాలుగు సంవత్సరాలు పట్టమహిషిగా ఉండి, అన్ని అధికారాలను చేతిలో ఉంచుకొన్నది, ఒక్కసారిగా రాచరికపు పనులనుండి దూరం చేయబడి, నిర్బంధించబడింది. రాజధాని ఉత్తర భాగంలోనున్న రాజభవనంలో ఆమెను గృహ నిర్బంధంలో ఉంచారు. పట్టమహిషి బిరుదం రాజుగారి పెద్దకూతురు మెరిటెన్‌కి సిద్ధించింది. ఆమెతో పాటు ఆమె భర్త స్మెన్‌ఖఱే‌కి కూడా రాజ్యం పాలించే అధికారం లభించింది. అఖెనటెన్, స్మెన్‌ఖఱే – ఇద్దరూ కలిసి దేశాన్ని పాలించేవారు.

నెఫర్ టిటిని విసర్జించిన తరువాత అఖెనటెన్ స్వలింగ సంపర్కానికి – అంటే హోమో సెక్సువల్ గా – మారిపోయాడు. అతడు, స్మెన్‌ఖఱే ఆలింగనం చేసుకుంటున్నట్లు కొన్ని శిల్పాలలో బయటపడింది.

అఖెనటిన్ తనకు, తన అల్లుడికి కల సంబంధాన్ని దాచుకోలేదు. అంతేకాకుండా అతడు తన మూడవ కూతురు అంఖెసెస్ పాటెన్‌ను తానే పెండ్లియాడాడు. బహుశా ఈ వివాహం ఒక మిష అనిపిస్తుంది. ఏదయితేనేం, అఖెనటెన్ యొక్క కల్లోలపూరితమైన జీవితం తొందరగా ముగిసింది.

అఖెనటిన్ యొక్క ప్రియుడు, రాజ్యానికి వారసుడు అయిన స్మెన్‌ఖఱే మరణించాడు. ఈ వార్త నలుమూలలకు వ్యాపించకముందే, అఖెటటెన్ రాజధాని నగరం నిర్మాత, కొత్త మతం యొక్క ప్రవక్త అయిన అఖెనటెన్, తన ఇరవై తొమ్మిదో ఏట, పదిహేడు సంవత్సరాలు ఈజిప్టును పాలించి, మరణించాడు. అతని మరణంతో సామ్రాజ్యం తీవ్రమైన పరిస్థితులను ఎదుర్కోవలసి వచ్చింది.

ఫారో చనిపోతే ఈజిప్టు దేశం క్లిష్ట పరిస్థితులలో చిక్కుకుంటుంది. ప్రతి ఫారోతోను కొత్త సంవత్సరాలు మొదలవుతాయి. ఫారో గద్దెనెక్కడంతో మొదటి సంవత్సరంలో ప్రారంభమవుతుంది. ఆ విధంగా క్రీస్తు పూర్వం 1347 సంవత్సరంలో ఈజిప్టు అనిశ్చయ పరిస్థితులలో చిక్కుకొంది.

ఈ అనుకొని మార్పులతో, మరపులో పడిన నెఫర్ టిటికి చాల చక్కని అవకాశం వచ్చింది. ఆమె అందమైనదే కాక చాల తెలివైనది. రాజధానిలో, ఉత్తర భాగంలో ఉన్న రాజభవనంలో ఆమె పధ్నాలుగు సంవత్సరాలు మగ్గిపోయింది. ఈ అవకాశం రాగానే ఆమె మళ్ళా ముందుకొచ్చింది. స్త్రీగా రాజ్యపాలన చేయడానికి ఆమె ఇష్టపడలేదు. ఆమెకో పురుషుడు కావలసివచ్చాడు. అతడు రాజవంశం వాడై ఉండాలి.

తవ్వకాలలో ఆర్కియాలజిస్టులకు టర్కీదేశంలో నెపర్ టిటి వ్రాసిన ఉత్తరమొకటి లభించింది. బాబిలోనియన్ మహారాజుకి వ్రాసిన ఉత్తరమది. అది ఈ విధంగా ఉంది.

“నా భర్త మరణించాడు. నాకు పుత్రుడంటూ లేడు. నీ కొడుకులు పెద్దవాళ్ళయారని ప్రజలు చెప్తున్నారు. నీ కొడుకులలో ఒకరిని నా దగ్గరికి పంపితే, అతడు నా భర్త కాగలడు. ఎందుచేతనంటే, నా ప్రజలలో ఎవరినో పెళ్ళాడాలని నేను కోరడం లేదు”.

ఆ లేఖ కింది రాణి అని ఉంది.

అప్పుడు, ఈజిప్టు దేశచరిత్రలో, అంతవరకూ ఎవరూ విననటువంటి పేరు పైకి తేలింది.

ఆ పేరు టుటన్ ఖటేన్. ఆ పేరు క్రమంగా టుటన్ ఖముగా మారింది. అప్పటికి అతడు పన్నెండేళ్ళ కుర్రవాడు. సమాధిలో కనిపించిన బహుమతులను బట్టి, ఆ రాజు చిన్నతనంలోనే సింహాసనం ఎక్కినట్లు తెలుస్తుంది. చిన్నతనపు బహుమతులలో సగం సమాధి గృహంలో లభించాయి. అందుచేత, టుటన్ ఖమున్ చిన్నతనంలోనే సింహాసనం ఎక్కి, చాల కాలం పరిపాలించలేదని ఈ బహుమతుల వలన నిర్ధారణ అయింది.

ఎటువంటి అభ్యంతరం లేకుండా అతడు సింహాసనానికి వచ్చాడు. ఈజిప్టుకు కొత్త రాజు లభించాడు. టుటన్ ఖటెన్ పాలనా సంవత్సరం 1 మొదలయింది.

ఎవరీ టుటన్ ఖటేన్? ఇతడు మూడవ అమెనాఫిస్‌కి కొడుకుని చెప్పడానికి వీలులేదు. మూడో అమెనాఫిస్ తన 38వ సంవత్సరంలో చనిపోయాడు. అప్పుడు కడుపులో పడ్డా అతడు సింహాసనమెక్కేసరికి 16 సంవత్సరాలవుతుంది. టుటన్ ఖమున్ తన 12వ యేట సింహాసనమెక్కాడు. అందుచేత ఇతడు మూడవ అమెనాఫిస్ కొడుకు కాడు.

ఇతడు అఖెనటెన్ పుత్రుడని మరొక వాదముంది. అయితే న్యాయసమ్మతంగా పుట్టినవాడు కాడు. నెఫర్ టిటికి మగ సంతానం లేదు. కాబట్టి ఇతడు పట్టమహిషికి జన్మించలేదు.

కాని, ఆర్కియాలజిస్టులకు ఒక ఉజ్వలమైన ఆధారం లభించింది. అఖెనటెన్ తల్లి తియి యొక్క అంతఃపుర రక్షకురాలు హుయా, ఆమె సమాధి టెల్ అమర్నాలో బయట పడింది. ఆ సమాధి మందిరంలో, అఖెనటెస్ 12వ పాలనా సంవత్సరంలో, గోడ పైన ఒక శిల్పం చెక్కబడింది. అందులో తియి, ఆమె కుమారుడు ఒకరి కెదురుగా ఒకరు కూర్చున్నట్లు చిత్రించబడి ఉంది. అందులో వాళ్ళిద్దరూ మద్యపానం చేస్తున్నట్లుంది. ఆ చిత్రం కింద “రాజు గారి తల్లి, పట్టమహిషి” అని ఉంది. మహారాణి తియికి, సమస్యలు లేవనెత్తేవాడు అయిన అఖెనటెన్‌కి అక్రమమైన సంబంధం ఉంది.

తియికి, టుటన్ ఖమున్‌కి చాల పోలికలున్నాయి. నిండు పెదవులు, నాసికవంపు, కళ్ళు, పైకొచ్చిన దవడ ఎముకలు – ఇవన్నీ స్పష్టంగా టుటన్ ఖమున్ మహారాణి కుమారుడని తెలియజేస్తాయి. మూడవ అమెనాఫిస్ చనిపోయేసరికి అతని భార్య తియి ఇంకా ఆకర్షణీయంగానే ఉండేది. అందుచేత ఆమె అఖెనటెన్‌తో ప్రేమకలాపాలు జరపడంలో సందేహం లేదు.

ఈ సమస్యను ఫ్రెంచి ఆర్కియాలజిస్టు, నోబెల్ కోర్ట్ బాగా అధ్యాయనం చేశాడు. ఈజిప్షియన్ స్త్రీలు, నూబియన్ మహిళలు దృఢమైన శరీరాలు కలవారని, తియి తన నలభై ఎనిమిదో యేట ఆమె టుటన్ ఖమున్‌ని కనడంలో ఆశ్చర్యం లేదని ఆర్కియాలజిస్టు తన అభిప్రాయం తెలియజేశాడు.

పురాతన ఈజిప్టు దేశంలో జరిగిన కామ వ్యాపారాల గురించి నిశితమైన పరిశోధన జరపవలసి ఉంది. ఈ విషయం గురించి వ్రాయడానికి మర్యాదస్తులు మోహమాటపడ్డారు. ప్రేమ, కామం, కోరిక అన్న పదాలు ఆ దేశంలో వాటి వాటి ప్రత్యేకతలు సంతరించుకున్నాయి. ఈజిప్టులో కామ సంబంధాలను సూచించే చిత్రాలు, శిల్పాలు కనిపించవు. ఈ కారణం చేత కామ వ్యాపారం అక్కడ పురాతన కాలంలో నిషిద్ధమని చెప్పడానికి వీలులేదు. ఇవి గ్రీకు చిత్రాలలోను, రోమన్ చిత్రాలలోను మనకు అందక పోయినా, లిఖితంగా ఈ విషయం మనకు లభ్యమయింది. రచయితలు దీని గురించి నిర్మొహమాటంగా వ్రాశారు. విశ్వ విఖ్యాతమైన ట్యూరిన్ పాపిరస్‌లో, మూడు వేల సంవత్సరాలకింద అశ్లీల విషయాలకు సంబంధించిన వస్తు సామగ్రి లభ్యమయేదని వ్రాసి ఉంది. ఈజిప్టు మహిళ రతిలో సామాన్య భంగిమనే ఆమోదిస్తుంది. కాని పెద్దింటి వాళ్ళలో కోయిటస్ అటెర్గో, ఆనల్ ఇరోటిసిజం, ఆటో ఫెల్లషియో, నెక్రో ఫిలియా, పేడిరాస్టీ జూఫిలియా మొదలగు విపరీత రతులు వ్యాప్తిలో ఉండేవి.

కృత్రిమమైన కామవర్థకాలు లభించేవి. వాజీకరణౌషధాలు లభించేవి. అన్నీ నిరర్ధకమైతే, దైవాంశ సంభూతులు కామ విషయాలలో సలహాలిచ్చేవారు. వక్షానికి దిగువ భాగంలో లభించే దివ్యమైన సుఖాల గురించి పురాతన ఈజిప్టు సాహిత్యంలో విపులంగా ఉంది. కన్ను, నోరు, చేయి, పాము, బాణం – ఇవి జననేంద్రియాలకు చిహ్నాలు.

హాథోల్ తన వస్త్రాన్ని తొలగిస్తే సూర్యభగవానుడు ‘రా’ ఉబ్బి తబ్బిబ్బయాడు. దేవత అటుమ్ తన హస్తాన్ని ముష్టి మైధునానికి వినియోగించి ప్రపంచాన్ని సృష్టి చేశాడు. దేవతలు ఐజిస్, నెప్టీస్ అన్నవాళ్ళు, ఓసరిస్ జననాంగం మెత్తబడితే, దానిని ఉద్ధరించే ప్రయత్నాలు చేశారు. ఈ విషయాలు దేవతలకి సంబంధించినవి.

ఇక ఈజిప్షియన్ వనిత గురించి చెప్పాలంటే – ఆమె ప్రేమ విషయాలలో అసాధారణంగా బహుపురుష సంపర్కానికి సంసిద్ధతను చూపుతుంది. ఆమె పురుషులను వలలో వేసుకుంటుంది. సంభోగంలో చాల ఉద్రిక్తతను చూపిస్తుంది.

18వ రాజ వంశానికి చెందిన కథ ఒకటి ఒక పాపిరస్‌లో లభించింది.

ఒక పల్లెటూరి రైతు ఉండేవాడు. భర్త పొలానికి పోతే, అతని భార్య తన మరిదితో సరసాలాడుతుంది. కథ ఇలా నడుస్తుంది.

‘తొందరగా జొన్న విత్తనాలు ఇవ్వవలసింది. వాటికోసం నా అన్న పొలంలో వేచి యున్నాడు” అన్నాడా యువకుడు.

కాని, ఆమె అంది –

“వెళ్ళి ధాన్యం కొట్టు తలుపు తీసి, ఎన్ని కావాలో తీసుకో, నేను జుత్తు దువ్వడం పూర్తిచేయాలి.”

ఆ యువకుడు లోపలికి పోయి పెద్ద జాడీ తెచ్చాడు.

దానిలో బార్లీ గింజలు, గోధుములు పోసి బయటికి వచ్చాడు.

అప్పుడామె అడిగింది. “నీ భుజాల మీద ఎంత బరువుంది?”

“మూడు బస్తాల గోధుమలు, రెండు బస్తాల బార్లీ గింజలు. మొత్తం అయిదు బస్తాల బరువు” అతడు బదులు చెప్పాడు.

“నువ్వు చాల బలమైనవాడివి. ప్రతిదినం నువ్వెంత శక్తివంతుడవో కనిపెట్టుతునే ఉన్నాను” అంది ఆమె.

అతనికి తనను సమర్పించుకో గోరింది. ఆమె లేచి నిలబడి అతని చేతిని పట్టుకొని అంది:

“రా! మనం ఒకరితో ఒకరం ఆనందం అనుభవించుదాం. కలిసి పడుక్కుందాం. ఇది నీకూ మంచిదే. నీ శ్రమకు ప్రతిఫలంగా నీకో అంగీని కుట్టి పెడతాను.”

కాని, ఈ నీచమైన సలహా విని ఆ యువకుడు కోపంతో చిరుతపులి అయాడు… అలా నడుస్తుంది కథ.

ఇది కట్టుకథే! కాని, ఇటువంటి కథలలో కొంచెమైనా నిజంలేకుండా ఉండరు. పురాతన కాలం నాటి ఈజిప్టు వనిత చాల ముందడుగు వేసింది. స్త్రీ పురుషుల సంబంధాలు తారుమారయాయని హెరొడోటస్ గాభరాపడ్డాడు.

స్త్రీలు బజారులకు పోయేవారు. పురుషులు ఇంట్లో ఉండేవారు. స్త్రీలు నిలబడి మూత్ర విసర్జన చేసేవారు. పురుషులు కూర్చొని ఆ పని చేసేవారు. ఈ పద్ధతులే కామ వ్యాపార విషయంలో వాళ్ళు అవలంబించేవారు.

పురాతన కాలంలో, నాట్యకత్తెలు, బట్టలు ఒకటి ఒకటి విప్పి అంగప్రదర్శనం చేయడం ఈజిప్టులోనే జరిగింది. టుటన్ ఖమున్ ముత్తాత యొక్క సమాధి మందిరంలో అటువంటి న్యాటకత్తె చిత్రింపబడి ఉంది. అశ్లీల దృశ్యాలు లక్సర్ ఆలయంలో కూడా లభించాయి.

ఈజిప్టు రాజులకు ఎందరో భార్యలు. రెండవ రామెసిస్‌కి నలుగురు ముఖ్య రాణులు, ఆరుగురు ఇతరస్త్రీలు, అంతేకాక కొన్ని వందలు పక్కచేరే ప్రమదలు. ఆ విధంగానే మూడవ అమెనాఫిస్‌కి అంతఃపురంలో వందల కొద్ది మహిళలు అతని కనుసన్న కోసం ఎదురు చేసేవారు. అతడు పట్టమహిషి తియితో భోజనం చేసి, ఆమెతో పడుక్కునేవాడు. రెండవ భార్య గిలుఖేపతోను, తన కూతురు సితమున్‌తోను, మరోక భార్య తడుఖేప తోను సంసారం చేశాడు.

ఈ విధంగా చూస్తే, టుటన్ ఖమున్ స్త్రీల కోసం తాపత్రయపడినట్లు కనిపించదు. అతడు తన రాణితో, పరిపాలన చివరి వరకు, ఆనందకరమైన సంసారం చేశాడు. మరే స్త్రీ కూడా అతని జీవితంలో ప్రవేశించలేదు.

టుటన్ ఖమున్ భార్య రాజవంశంనుండి వచ్చింది. ఆమె పేరు అంఖెనెస్ పాటిన్ – ఆమె సింహాసనానికి వారసురాలు. అఖెనటెన్ నెఫర్ టిటి దంపతులకు జన్మించిన మూడవ సంతానం ఆమె. క్రీస్తుపూర్వం 1360 సంవత్సరంలో పుట్టింది. ఆమెకు పన్నెండు సంవత్సరాల వయసున్నప్పుడు ఆమె తల్లి దండ్రుల మధ్యగల సంబంధాలు బెడిసిపోయాయి. ఆమె తల్లి నెఫర్ టిటి భర్త నుండి వేరయి గృహనిర్బంధంలోకి వెళ్ళిపోయింది. ఆమె తండ్రి ఆమెను (కూతురిని) పెండ్లాడి చిన్నరాణి పదవిని ఆమెకిచ్చాడు. ఈ వివాహం వలన ఆమెకొక కూతురు జన్మించింది. చాల కొద్ది కాలంలోనే ఆమె ప్రాముఖ్యతకు వచ్చింది..

ఆర్కియాలజిస్టులకు తవ్వకాలలో ఒక కుండ పెంకు దొరికింది. దానిమీద స్మెన్‌ఖఱే బిరుదుల వెనుక రాజపత్ని అంఫేసెస్ పాటెన్ అని కూడా చెక్కబడి ఉంది. కాబట్టి ఈమె, తన తండ్రి అఖెనటెన్‌నే కాక, అతని సహపాలకుడైన స్మెన్‌ఖఱేని కూడా పెండ్లియాడింది. వారిద్దరూ మరణించిన తరువాత, ఆమె తన పదమూడవయేట, టుటన్ ఖమున్ సింహాసనమెక్కిన తరువాత, అతనికి న్యాయ సమ్మతమైన భార్యగా పట్టపురాణి అయింది. ఈ వయసుకి, ఈ రోజుల్లో ఆడపిల్లలు బడికి పోతుంటారు. కాని, ఈ పట్టపురాణి ఎంతమందినో పెళ్ళాడి ఎన్ని ఇబ్బందులకో లోనయింది.

ఈ ఈజిప్టు దేశీయులు ఎటువంటివారు? వీళ్ళు రాక్షసులా? అదుపు తప్పిన కామాంధులైన, కోడెకారులా? తమ కూతుళ్ళను కూడా వీళ్ళు విడిచి పెట్టలేదా? తమ భార్యలను మామూలు సరుకువలె బజారులలో అమ్ముకున్నారా? ఎవడు వేలంలో హెచ్చుపాట పాడితే వాడికే ఆడకూతుర్లను అమ్మివేశారా?

ఫారోలు పాలించిన ఈజిప్టుదేశంలో పెండ్లికి అంత తతంగం లేదు. పెళ్ళి కావలసిన ఇద్దరూ ముందుగా సంసారం చేసేవారు. అంగీకారం కుదిరితే వివాహపు బడంబడికను వ్రాయించేవారు. మేనమామ మేనకోడలిని, పినతండ్రుల పిల్లలు ఒకరి నొకరిని, సోదరుడు సోదరిని వివాహం చేసుకోడంలో ఎటువంటి అభ్యంతరమూ లేకపోయింది. వివాహాలు మతానికి గాని, చట్టానికి గాని చెందినవి కావు. నుబియా, సిరియా, బాబిలోను దేశాలకు చెదిన ఏ మహిళ అయినా తనకు నచ్చితే ఈజిప్టు దేశీయుడు పెండ్లి చేసుకునేవాడు. ఒక ధనికురాలైన ఈజిప్టు దేశపు స్త్రీ, కాసుకైన కొరగాని సామాన్యుడిని పెళ్ళాడిన సంఘటన ఉంది. ఆనాటి ఈజిప్షియన్లకు ఇది వింతకాదు. ఆ విదంగా టుటన్ ఖమున్ తన సోదరినే పెండ్లియాడాడు. ఇది ఫారోల సంప్రదాయం.

అఖెనటెస్ మతపరంగా తెచ్చి పెట్టిన అల్లకల్లోలాన్ని టుటన్ ఖమున్ ఎదుర్కోవలసి వచ్చింది. కొత్త రాజు తిరిగి అమున్‌ని ముఖ్య దేవతగా చేశాడు. దేవతా మందిరాలను బంగారంతో, వెండితో, కంచుతో, రాగితో నింపివేశాడు. తాను బందీలగా పట్టుకున్న బానిసపిల్లలను ఈ దేవాలయాలకు ఇచ్చి వేశాడు. దేవాలయాలకు ఇచ్చే బహుమతులను పెంచాడు.

(సశేషం)

Exit mobile version