Site icon Sanchika

శ్రీపర్వతం-34

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 34వ భాగం. [/box]

[dropcap]అ[/dropcap]ఖెనటెన్ పాలనలో తొలగించిన అర్చకులను టుటన్ ఖమున్ తిరిగి నియమించాడు. అఖెనటెన్ రాజసభలో పనిచేసిన దాసీ కన్యలను, గాయికలను, నాట్యకత్తెలను తిరిగి దేవాలయాలకు బదిలీ చేశాడు.

ఈ విధంగా టుటన్ ఖమున్ ప్రజలకు సన్నిహితుడయాడు. అతడు తొమ్మిది సంవత్సరాలే రాజ్యం చేశాడు. అతని కాలంలో ఏ యుద్ధాలు జరగలేదు. ఆలాగే దేశ సంపత్తి కూడా పెరగలేదు. అందుచేతనే కాబోలు టుటన్ ఖమున్‌ని అందరూ మరచిపోయారు.

పురాతన ఈజిప్టు దేశంలో ఫారో సింహాసనమెక్కిన నాటి నుండి అతని సమాధి మందిర నిర్మాణం గురించి ప్రయత్నాలు మొదలవుతాయి. ఫారో చిన్న వయసులో చనిపోతే నిర్మాణం ఆగిపోయి ఆ స్థితిలోనే సమాధిని మూసివేయడం జరుగుతుంది.

ఈజిప్షియన్లు మానవ జీవితాన్ని సంపూర్ణంగా వర్ణించారు. కొన్ని గ్రంథాలలో సమాధి కార్యం వివరంగా ఉంది. కాని, మృతిని శరీరాన్ని లేపనాలతో రాయడం మాత్రం రహస్యంగా ఉంచారు. ఏ పుస్తకాలలో కూడా దాని గురించి లేదు. ఈ రహస్యం పూర్వీకులతోనే పోయింది.

గ్రీకు చరిత్రకారుడైన హెరోడోటస్ నుండి మనకు కొన్ని వివరాలు లభించాయి.

మృత శరీరాలకు లేపనాలు రాసే వాళ్ళు ప్రత్యేకంగా ఉంటారు. వారి దగ్గరికి మృతదేహం రాగానే వాహకులకు శరీరాల నమూనాలు చూపిస్తారు. అవి కర్రతో చేసి, రంగు పూసిన బొమ్మలు లేపనకర్మ మూడు విధాలుగా జరుగుతుంది. మొదటి తరగతి పని చాల విలువైనది. రెండవ తరగతి లేపనకర్మ కొంచెం చవక. మూడవ పద్ధతి అన్నిటికన్న చవక. బేరం కుదుర్చుకొని, శవాన్ని విడిచి పెట్టి, వాహకులు వెళ్ళిపోతారు.

లేపనకారులు అపుడు తమ పని మొదలు పెడతారు.

కొక్కెంవలె వంపుగా నున్న పనిముట్టును నాసికా రంధ్రాలలోనికి దూర్చి, మెదడులో కొంత భాగాన్ని, ఆ మార్గం గుండా పైకి తీసివేస్తారు. మిగిలిన భాగం కుళ్ళడానికి రసాయన పదార్థాలు లోనికి పంపుతారు. ఆ భాగం కుళ్ళి పైకి వస్తుంది. తరువాత మొనదేరిన ఇథోపియన్ శిలతో కడుపు ఎడమ భాగం కోసి పేగులు పైకి తీస్తారు. వీటిని తుడిచి, తాటి సారాయితో ముందు కడుగుతారు. మళ్ళా వాటిని ఘాటైన సుగంధ ద్రవ్యాల పొడితో చల్లుతారు. ఉదరాన్ని శుద్ధమైన గుగ్గిలంలోను, నాసిరకపు దాల్చిన చెక్క పొడితోను, ఇంకా మామూలు సుగంధ ద్రవ్యాల పొడితోను నింపుతారు. ధూపానికి పనికివచ్చే సాంబ్రాణిని మాత్రం ఉపయోగించరు. తరువాత కడుపు కుడతారు. ఈ విధంగా చేసినప్పుడు గుండెకాయ, మూత్ర పిండాలు శరీరంలో మిగిలిపోతాయి. లివరు, ఊపిరితిత్తులు, ఉదరం, ప్రేగులు పైకి తీసి జాడీలలో నిలువచేస్తారు. పిమ్మట దేహాన్ని వారంరోజులు నెట్రాన్‌లో పూర్తిగా ఉంచుతారు. వారం రోజుల తరువాత శరీరాన్ని కడిగి పాదాలనుండి తలవరకు, చాలా పలుచని బట్టగల బాండేజితో చుడతారు. వాటి పైన బంక పూస్తారు.

నెట్రాన్ అంటే సోడియం. ఇది నిలువచేయడానికి పనికిరాదు. కాని, శరీరంలోని చెమ్మను పూర్తిగా పైకి తీస్తుంది. ఆ విధంగా దేహం కుళ్ళకుండా రక్షింపబడుతుంది.

ఈ నెట్రాన్ అనేది సోడియం కార్బనేట్, బైకార్బనేట్, క్లోరైడ్ సల్ఫేటుల మిశ్రమం. ఈ ప్రకారం శరీరాన్ని ముప్పై అయిదు దినాలు నెట్రాన్లో ఉంచుతారు. మృత దేహాన్ని రసాయనికంగా నిలువజేసినప్పుడు వాటి ఆకారాలు అసహ్యకరంగా మారుతాయి.

మమ్మీలను తయారు చేసేవారు, కాళ్ళకు, జుత్తుకు గోరింట రాస్తారు. మిగిలిన శరీర భాగాలకు జేగురు రంగుతో పురుషులకు, పసుపు రంగు మట్టితో స్త్రీలకు రంగు వేస్తారు. కడుపు, స్తనాలు, బుగ్గలు మొదలైనవి లోతుకు పోతే, వాటిలో గుడ్డను ఉండలు చుట్టి ఉంచుతారు. గాజుకళ్ళు పెడితే అవి నిజమైన కళ్ళవలె కనిపిస్తాయి. అర్చకులు మృత దేహానికి ఈ విధంగా ముందు, తయారు చేసిన లేపనాలు పైన పూస్తారు.

ద్రాక్ష సారాయం, తైలం, కొవ్వు, జిగురు పదార్థాలు ఉపయోగించి, మమ్మీ మధురమైన వాసన వేసినట్లు చేస్తారు. ఈ విధంగా మమ్మీని తయారుచేయడానికి రెండు నెలలు పైగా పట్టేది. వాటిలో 17 రోజులు బాండేజీలు చుట్టడానికి అయేది.

చనిపోయిన 70 రోజులకు మమ్మీని శవపేటికలో ఉంచుతారు. మరో మూడు రాత్రులు, మూడు పగళ్ళు భటులు మృత దేహానికి కాపలా కాస్తారు. ఆ సరికి మృతుడు ఓసరిస్ దేవతగా మారుతాడు. తరువాత ఆ దేహాన్ని సమాధిలోకి తీసుకుపోతారు.

అదుగో! అదే! టుటన్ ఖమున్ మృత శరీరం. మమ్మీగా మార్చబడింది. ముప్పై మూడు శతాబ్దాలకింద ఈజిప్టులో జరిగిన శవయాత్ర ఇది.

థెబీస్ నగరంలో ప్రజలు తండోపతండాలుగా సమావేశమవుతున్నారు. నైలునది గట్టున పడవలను వరుసలు తీర్చి సిద్ధంగా ఉంచారు. లక్షల కొలది జనులు ఈజిప్టు ఉత్తర భాగం నుండి, దక్షిణ భాగం నుండి, ఈ శవయాత్రలో పాల్గొనడానికి వచ్చారు. వాళ్ళకీ యాత్ర విచార సూచకంగా లేదు.

“అందమైన పశ్చిమ దేశాన్ని ఫారో ప్రవేశిస్తున్నాడు. ఎంత సుందరమాదేశం! ఎంత అదృష్టవంతుడీ రాజు!” అంటున్నారు ప్రజలు.

అందుకోసమే ప్రజలు ఈ మహోత్సవంలో పాల్గొంటున్నారు. ఫారో కుటుంబ సభ్యులు మాత్రం దుఃఖంలో మునిగిపోయారు. అయ్యో! చిరకాల పరిచయం కల ఫారో దూరమౌతున్నాడన్న దుఃఖం తప్ప ఇది మరేదీకాదు.

శవపేటికలు మూడు. ఈ జీవితాన్ని ఆకస్మికంగా విడిచిన బాలరాజు మమ్మీగా చిన్న పేటికలో స్థాపించబడ్డాడు. వాహకులు వాటిని నైలునది ఒడ్డుకు మోసుకుపోతున్నారు. బంగారపు శవ పేటికలు ప్రాతః కాలపు టెండలో మెరుస్తున్నాయి. వాటి పైన చాందినీ ఉంది. టెక్కాలు చిరుగాలికి ఎగురుతున్నాయి.

అంత్యక్రియలు చేసే అర్చకులు ప్రార్థన చేస్తున్నారు.

“ఓ ప్రభూ! ఓసరిస్! నీకు అభినందనలు. నీవు జీవితాన్ని శాశ్వతంగా చేసే దేవుడివి. నువ్వు చాలా పేర్లు ధరించి, వివిధములైన చక్కటి ఆకారాలతో ఆలయాలన్నిటి యందు రహస్యంగా వర్తిస్తున్నావు.”

లక్షల కొలది ప్రజలు గుంపులుగా గూడి, గాలిలో వ్యాపిస్తున్న సుగంధ రూపాలను ఆఘ్రాణిస్తున్నారు. నైలునది గట్టున అయిదు బల్లకట్లు సిద్ధంగా ఉన్నాయి. రాజుగారి భవనంలోని వస్తువులు, సంపదలు, ఆహార పదార్థాలు ఒక దాని మీద నింపారు. అపుడు ఇంటిపనివాళ్ళ బొమ్మలు తీసుకొచ్చారు. వాటిని చూసి ప్రజలు ఆనందంతో కేకలు పెట్టారు. ఆ బొమ్మలు ఆ పనివాళ్ళ బొమ్మలు ఒకొక్క పనికి ఒక పనివాడు – ఒకొక్క ఆనందానికి ఒకొక్క నాట్యకత్తె – గానం చేసే వాళ్ళు, వాద్యాలు వాయించేవాళ్ళు, నగ్నంగా నాట్యం చేసేవాళ్ళు – వీళ్ళ బొమ్మలు, సర్వాంగసౌష్ఠనంగా నిర్మించి తెస్తారు. కాని, వీళ్ళు సమాధిలో నున్న రాజుని విడిచి పారిపోతారని, వాళ్ళ కాళ్ళు తీసివేస్తారు.

“ఓ కర్ణధారి! సుందరమైన పశ్చిమానికి పడవ నడుపు! సన్మార్గుల దేశమది” అని ఒక అర్చకుడు మొదటి పడవలో నిలుచుని ఘోషిస్తాడు.

పడవ తరువాత పడవ అర్చకులతోను, చనిపోయిన ఫారోత్‌ను, ముండనం చేయించుకున్న పూజారులతోను, విధవయైన రాణి తోను, రాజబంధువులతోను, స్నేహితులతోను, రాజభవనంలో ఉన్న వారితోను, అధికారులతోను నిండిపోతుంది. రాజుగారి ఆభరణాలు, సంపదలు, గృహంలో ఉపయోగించే వస్తువులు, ఆహారపదార్థాలు పడవలలోకి ఎక్కిస్తారు. లక్షల కొలది ప్రజలు, శవయాత్రలో పాల్గొన్నవారు నైలునది గట్టున ఉండిపోతారు.

నదికి రెండో గట్టున, ఈ పడవలకు స్వాగతమిచ్చేవారు తక్కువ మంది. వాళ్ళు మంచి సంస్కారమున్నవాళ్ళు. వాళ్ళు సమాధిలో పనిచేసేవారు, కళాకారులు అంత్యక్రియలు జరిపే పూజారులు, సమాధి రక్షకులు, అధికారులు.

బంగారపు శవపేటికను ఒక బండిమీద ఉంచుతారు. దానికి నాలుగు ఎద్దులను పూన్చుతారు. తలబోడిగా ఉన్న పూజారి సంజ్ఞ చేస్తాడు. దానితో బండి కదులుతుంది. ఇసుకల మీద నడుస్తుంది. బండి వెనుకను టుటన్ ఖమున్ భార్య అంఖెసెనమున్ నడుస్తుంది. ఆమె కట్టిన తెల్లబట్ట చివరలు నేలను జీరాడుతాయి.

ఆమె, కంఠస్థం చేసిన వాక్యాలు దుఃఖభారంతో చెప్తుంది.

“అహ! ఎంత దురదృష్టం. నువ్వు అధికంగా ప్రేమించిన సోదరిని నేను. నాతో ఎప్పుడూ సంభాషిస్తూ, నన్ను ప్రేమించి ఆనందించే నువ్వు ఎందుకయ్యా దూరాలకు పోతావు? కాని, ఈ రోజు సందరమయినది. నువ్వు సుఖివై ఓసరిస్ దేవునితో ఐక్యమవుతున్నావు.”

సమాధికి పోయేదారి ధూళితో నిండినది. తోవలో రాళ్ళు, మమ్మీని మోసే బండి మూలుగుతుంది.

“ఆహెూ! విధి నువ్వు మౌనంగా ఉండిపోయావా? ఒక్క పలుకేనా నాతో ఆడవా? నీకు ఎంతమంది సేవలకులుండేవారు. కాని, ఈ సమాధిలో, మృగాల అరుపులలో, నువ్వెలా ఉండగలవు? అయినా, ఈ రోజు సుందరమైనది. మనుష్యుడు, శృంగాలం, మర్కటం. శ్యేనం నీ సమాధిని కాస్తున్నాయి. ఈ నాలుగు సూరస్ దేవుని ముఖాలు”.

టుటన్ ఖమున్ సమాధికి ఎదురుగా తియే సమాధి ఉంది. సమాధిలోకి ప్రవేశించే ద్వారం దగ్గిర హోమం చేయవలసిన అగ్ని కుండముంది. తెచ్చిన ఆహార పదార్థాలు అగ్నిలో పడవేస్తారు. ఒక కోడె పెయ్యను పూల మాలలతో అలంకరించి బలికి సిద్ధంగా ఉంచుతారు. యజ్ఞం చేసే పురోహితుడు గొడ్డలితో లోనికి వస్తాడు.

కోడె పెయ్యె కుడిచేతి వేపున్న ముందు కాలును గొడ్డలితో నరుకుతాడు. ఆబోతు నేలను పడిపోతుంది. చుట్టూ ఉన్న వాళ్ళు, ఇంకా ప్రాణాలతో ఉన్న కోడె పెయ్యను కత్తులతో ముక్కలు ముక్కలుగా నరుకుతారు. ఆ మాంసఖండాలను నిప్పులో పడవేస్తారు. కనరు కంపు, పొగ అంతటా వ్యాపిస్తాయి.

అర్చకులు పాలు చిలుకుకుంటూ, ముందుగా బొమ్మలు, ఇంటి వస్తువులు మొదలైనవి సమాధి మందిరంలో చేరుస్తారు. తొమ్మిది మంది మిత్రులు శవపేటికను ఎత్తుకోడానికి ముందకు వస్తారు.

అపుడు అంఖెసెనమున్ తన భర్త మమ్మీపై బడి రోదిస్తుంది. ఇది ఆచారం .

“ఆహ! ఎంత దురదృష్టం! నైలు నది గట్టునగల ఉద్యానవనాలలో నువ్వు నాతో విహరించేవాడివి. ఇపుడు నీ కాళ్ళను కట్టి వేశారు. నేనెవరో నీకు తెలుసా? నేను నీ భార్యను. నువ్వు అత్యధికంగా ప్రేమించిన సోదరిని. నువ్వు శాంతంగా ఉన్నావు. ఈ ఆనందం నీదే. ఎంత దారుణమీ దుఃఖం! నా శరీరం నీకోసం ప్రార్థిస్తున్నది. కాని, నీ శరీరం చాల చల్లగా ఉంది. అయినా ఈ దినం మమ్మీకి సుందరమైనది. నేను నీ సోదరిని. నన్ను నువ్వు విడిచి పెట్టావు. అయ్యో! నేనొక్కతెను ఇంటికి మరలి పోవాలి”.

అంఖెసెనమున్‌ని అక్కడ నుంచి తీసుకుపోతారు. తొమ్మండుగురు మిత్రులు శవ పేటికను ఎత్తుతారు. డక్కలను తీవ్రంగా మ్రోయిస్తారు. అర్చకులు ధూప పాత్రలను మీదికి ఎత్తుతారు.

“దేవుడు వస్తున్నాడు” అంటూ తొమ్మిది మంది అర్చకులు ఒకరి తరువాత ఒకరు పలుకుతారు. అపుడు బంగారపు శవపేటికలో ఉన్న టుటన్ ఖమున్ మమ్మీని సమాధి మందిరంలోకి తీసుకుపోతారు. ఆ బంగారు శవపేటిక, 3,263 సంవత్సరాల వరకు సూర్యరశ్మి మరి చూడదు.

దుఃఖాన్ని సూచించే వాద్య ధ్వనులు ఆగిపోతాయి. ప్రార్థనలు ముగిసి పోతాయి. చాల తొందరగా దృశ్యం మారిపోతుంది. నేలమీద చాపలు పరుస్తారు. బల్లలు వేస్తారు. ఆహారం పంచి పెడతారు. పానపాత్రలు చేతుల కందిస్తారు. విచారంలో ఉన్న వారికి ఆనందం కలిగించడంకోసం, నగ్నంగా ఉన్ననాట్యకత్తెలు చేతులతో తామరపూలు పట్టుకొని నృత్యం చేస్తారు.

ప్రజల మధ్య నుండి, ఆ విధంగా ఫారో శరీరం అర్చకుల చేతులలోకి మారుతుంది. సమాధి గృహంలో కొద్ది గంటలు ఎటువంటి రహస్య కర్మలు జరుగుతాయో ఎవరికీ తెలియదు.

అంఖెసెనమున్ ఆఖరి సమయంలో తన ప్రియభర్త శవపేటిక పైన ఉంచిన పుష్పగుచ్చమే కాబోలు హెూవర్డ్ కార్టర్‌కి లభించింది.

టుటన్ ఖమున్ గురించి తెలుసుకున్నవారు చాలా సంతోషించారు. కాని, విస్మృతుడైన ఫారోను కనుగొన్న ఆర్కియాలజిస్టును మాత్రం ప్రజలు మరచిపోయారు. అతని ఖ్యాతి తొందరగా సమసిపోయింది. అతడు 1932లో లండన్ తిరిగి వచ్చాడు. నలభై సంవత్సరాలు తవ్వకాలలో పనిచేసి అతడు ఆరోగ్యం పోగొట్టుకున్నాడు. అతనికి 58 సంవత్సరాలు వచ్చాయి. ముని వలె అతడు శేషజీతం గడిపాడు, ఒంటరివాడయాడు.

అతని మేనకోడలు చరమదశలో అతని సహాయానికి వచ్చింది. అతడు మూడు పుస్తకాలు రచించాడు. టుటనఖమున్ సమాధిలో లభించిన వస్తువుల పట్టిక తయారు చేయడం మిగిలిపోయింది. అది 30,000 పౌండ్ల ఖర్చు. ఈ నాటికి అది అలాగే ఉంది.

హెూవర్డ్ కార్టర్, 1939 మార్చి 2వ తారీకున చనిపోయాడు. అతని అంత్యక్రియలు చాలా నిరాడంబరంగా జీరగాయి. వాటికి కార్నర్ వాన్ ప్రభువు యొక్క కుమార్తె, ఎలెలిన్ వచ్చింది. కార్టర్ ఆమెను అత్యధికంగా ప్రేమించాడు. కాని, ఆమె అందరానిదయింది.

కార్టర్ వ్రాసిన వన్నీ రిసెర్చికిచ్చాడు. ఆక్స్‌ఫర్డ్‌లో ఉన్న అస్మోలియం మ్యూజియంకి వాటిని ఇచ్చివేశారు. వాటి ఆధారంగా చాలమంది ఆర్కియాలజిస్టులు డాక్టరేటు పట్టాలు పుచ్చుకున్నారు.

కాని, ఒక్క విషయం మాత్రం స్కాలర్లకు సమస్యగా మిగిలింది. ఇరవై యేళ్ళ వయసుకు ముందే టుటన్ ఖమున్ ఏ కారణం వలన చనిపోయాడు? డాక్టర్ డెర్రీ అతని మమ్మీపై జరిపిన అటోప్సి ఫలితాలు ఏ సమాధానం చెప్పలేకపోయాయి. ఈ సమస్యకు జవాబు లభిస్తే, చరిత్ర రచనకు చాల ముఖ్యమైన ఆధారాలు లభించినట్లే!

1968 నవంబరులో, తొమ్మిది మందిగల ఒక బ్రిటీష్ రెసెర్చర్ల బృందం, ఈ రహస్యం తెలుసుకోడానికి లక్సర్ నగరం పోయింది. అత్యంత ఆధునికమైన సాంకేతిక పరిజ్ఞానంతో దీనిని సాధించదలచారు. లివర్‌పూల్ విశ్వవిద్యాలయంలో డాక్టర్ జార్జ్ హారిసన్ అనాటమీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్నాడు. అతడు టుటన్ ఖమున్ మమ్మీని శవపేటిక నుండి తీశాడు. మృతుడైన ఫారో యొక్క భౌతిక దేహానికి ఎన్నో ఇన్‌ఫ్రారెడ్ ఫోటోలు తీశాడు. మూడు రోజులు పరిశోధనలు జరిగాయి. అప్పుడొక అపూర్వమైన సంగతి బయటపడింది. టుటన్ ఖమున్ తలలో, ఎడమ చెక్కిలి వేపునుండి లోపలికి పోయిన రంధ్రమొకటి ఉంది. ఎక్కడైనా, మొనదేరిన రాతిమీద పడినా ఇటువంటిది ఏర్పడడానికి అవకాశముంది.

టుటన్ ఖమున్ హత్య చేయబడ్డాడా? లేక, ప్రమాదంలో చనిపోయాడా? విస్మృతుడైన ఫారో, ఈ రహస్యాన్ని తన తోనే సమాధికి తీసుకుపోయాడు.

అప్పటికి రాత్రి గడిచిపోయింది. తూర్పు తెల్లవారింది. కాని, సూర్యుడు మాత్రం నల్లమల వెనుకనుంచి పైకి రానందున లోయలో నీడ వ్యాపించి చల్లగా ఉంది.

“మీకు ఫారోల శాపసిద్ధాంతం గురించి చెప్పాలని మొదలు పెట్టి దారి తప్పిపోయాను. ఆర్కియాలజిస్టుల విజయాల గురించి చెప్పేటప్పుడు అన్నీ మరచిపోతాను” అంది శశికళ.

“శశికళా! మీరు చాల గొప్ప విషయాలు, సమగ్రంగా, ఆసక్తికరంగా చెప్పారు. మీకు ధన్యవాదాలు” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

శశికళ చక్కగా నవ్వింది.

“మోహన్ చాలా నిరుత్సాహంగా కనిపించారు. తవ్వకాలు జరిపేటప్పుడు, వేల కొలది సంవత్సరాల కింద భూస్థాపితమైన భవనాలను, దేవాలయాలను, విహారాలను బయట పెట్టవలసి వస్తుంది. ఆ భవనాల లోని ప్రజలో, ఆలయాలలోని దేవుళ్ళో, విహారాలలోని శ్రమణులో, ఇంతవరకు ప్రశాంతంగా నిద్రిస్తున్నవాళ్ళు, స్థాన భ్రష్టులై బయట పడతారు. వాళ్ళు ఆర్కియాలజిస్టులను శపించడంలో ఆశ్చర్యం లేదు. భూమి పూజ మనం మంచి ముహూర్తమందే చేశామా? ఏ దేవుడిని నిందించలేదు గదా? ఇటువంటి దేదేనా జరిగితే, ఆరు నెలలబట్ట మనం పడుతున్న శ్రమ మాత్రమే మిగులుతుంది” అంది ఆమె.

ఈసారి మోహన్ నవ్వాడు.

“మనం ఇటువంటి శాపాలను నమ్మం. కొంతమంది, జీవితమంతా శ్రమపడి, చాల తక్కువ విజయాలు పొందుతారు. మనం పని మొదలు పెట్టి ఆరునెలలు మాత్రమే అయింది. ఈ విజయపురి కృష్ణా నదీ జలాలలో మునిగిపోకుండా ఉంటే, మనం సావకాశంగా మరికొన్ని నెలలు పనిచేసే వాళ్ళం. శ్రమపడి ఫలితం పొందలేనప్పుడు నిరుత్సాహపడడం మానవ స్వభావం” అన్నాడు అతడు.

“నేను మీ దగ్గర సెలవు తీసుకుంటున్నాను. మరో పదిహేను రోజుల వరకు ఇక్కడికి రాడానికి వీలుపడదు” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“ఏమిటి విశేషం?” శశికళ ప్రశ్నించింది.

“మేము తిరుపతి, బెంగళూరు, మైసూరు వెళ్తున్నాము”.

“మేమంటున్నారు, మీ కాబోయే శ్రీమతితోనా?” మోహన్ అడిగాడు.

“అవును – అందరం కలిసి సరదాగా తిరిగివద్దామని మా మామగారు నన్నూ రమ్మన్నారు” అన్నాడు రావు.

“పెళ్ళికి ముందు హనీమూనన్నమాట!” అంది శశికళ.

“పదిమందితో వెళ్తంటే అది హనీమూనెలా అవుతుంది?” అన్నాడు రావు.

“విష్ యూ ది బెస్ట్ ఆఫ్ ఫ్లెషర్!” అన్నాడు మోహన్.

సుబ్రహ్మణ్యేశ్వరరావు బట్టలు వేసుకుంటూ ఉంటే మోహన్ స్టౌ ముట్టించి, కాఫీ తయారు చేశాడు.

అందరూ టెంటులో కాఫీ తాగి బయటికి వచ్చారు.

మొక్కల నుండి విరిసిన పల్లెల సువాసన వచ్చి వాళ్ళ ముగ్గురికి సుపభ్రాతం చెప్పింది.

(సశేషం)

Exit mobile version