Site icon Sanchika

శ్రీపర్వతం-35

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 35వ భాగం. [/box]

39

[dropcap]బు[/dropcap]ద్ధ పూర్ణిమను లోయలో ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు.

మరో పది రోజుల తరువాత తవ్వకాల పని పూర్తిగా ముగిసి పోయింది.

మూడు నెలల కిందటే డాక్టర్ మోహన్ మరో ఎకరం జాగాలో తవ్వకాలు సాగించడానికి అనుమతి కోరుతూ ఉత్తరాలు వ్రాశాడు. అదనపు నిధులను కూడా మంజూరు చేయమని అర్థించాడు.

రెండు రోజుల కింద తవ్వకాలు సాగించడానికి అనుమతి వచ్చింది. మరో ఏభైవేల రూపాయల అదనపు నిధులు కూడా అందాయి.

అంటే తవ్వకాలు ఆపనక్కరాలేదు.

పనివాళు ఇరవయ్యో తారీఖు నుండి కొత్త పని కోసం ఎదురుచూస్తున్నారు. సోమవారం కొరియరు అబ్బాయి వచ్చిన తరువాత మోహన్‌కి, శశికళకి వేయి ఏనుగల బలం వచ్చింది. అదనంగా తవ్వకాలు జరపవలసిన స్థలం ప్రస్తుతం తీసిన ట్రెంచీలకు తగులుతూ ఉండాలి. తూర్పువేపున ఫిరంగి మోటుంది. పడమటి వేపు గోతులు, కొద్ది దూరంలో మ్యూజియంకి పోయే రోడ్డు, ఇక మిగిలినవి ఉత్తర దక్షిణాలు.

“ఈ ఎకరం స్థలం ఉత్తరానికి గాని, దక్షిణానికి గాని ఉండవచ్చు. లేకపోతే అర ఎకరం ఉత్తరం వేపు, అర ఎకరం దక్షిణం వేపు ఉన్నట్లు మార్కు చేసుకోవచ్చు. ఈ రోజు మధ్యాహ్నమే మేట్‌ని తీసుకొచ్చి స్థలం మార్కు చేద్దాం” అన్నాడు మోహన్.

“మీరు సాయంకాలం ఎండ తగ్గిన తర్వాత వెళ్ళి అదనపు సైటుని నిర్ణయించండి. నేను ఇల్లు సర్దుకోవాలి. గుట్టలు గుట్టలుగా నోట్సు టేబిలు నిండి పోయాయి. వాటిని సరిగా ఫైలు చేయకపోతే మన శ్రమ వృథా అవుతుంది” అంది శశికళ.

మోహన్, జావా మొగుడు, ఇద్దరూ సాయంకాలం నాలుగుకి సైటు వేపు బయలుదేరారు. అప్పటికి కూడా ఎండ తగ్గలేదు. క్రమంగా మోహన్ ఈ ఎండలకు అలవాటు పడుతున్నాడు. వాళ్లిద్దరూ బయలుదేరుతుంటే శశికళ కుండలోని నీళ్ళు వాటర్ బాటిల్‌లో పోసి ఇచ్చింది. టార్చిలైట్లు కూడా సంచిలో పెట్టింది. ఈ రెండూ చాలా అవసరం, వాళ్ళు తిరిగి వచ్చేసరికి చీకటి పడవచ్చు. ఏ పాము తల మీద కాలు వెయ్యకుండా ఇంటికి, కాదు కాదు టెంటుకి తిరిగి రావాలంటే టార్చిలైటు చాలా అవసరం. కృష్ణపక్షం లోయలో చీకటి, చిక్కటి కాటుక ముద్ద.

ముందు దక్షిణం వేపు ఉన్న స్థలాన్ని మోహన్ పరిశీలించాడు. గోతులు, గాతలు, ముళ్ళకంపలు, అక్కడక్కడ ఏపుగా పెరిగిన చెట్లు – చాలా సేపు వెదికాడు. కాని, అక్కడ ఏవీ దొరకవని అతని అంతరాత్మ చెప్పినట్లయింది.

క్రమంగా కొండల మీదకి చీకటి దిగింది – పడమట, కృష్ణా నది మీద మసక వెలుతుర్లు మాయమవుతున్నవి.

ఏం చేయడమో మోహన్‌కి తోచలేదు.

ఉత్తర భాగం వేపు నడిచాడు.

ఆలోచిస్తూ చూశాడు.

ట్రెంచిలకి పది గజాల దూరంలో ఒక చెట్టు కనిపించింది.

అది బోధి వృక్షం.

ఆ రావిచెట్టు చాల పైకి ఎదగవలసింది, మరుగుజ్జుగా ఉండిపోయింది. దాని ఆకులు కూడా వెడల్పుగా ఉండడానికి బదులు చిన్నవిగా ఉన్నాయి. ఎవరో బలవంతాన ఆ చెట్టును ఎదగకుండా మేకు కొట్టినట్లు అనిపించింది.

“మేట్! ఎన్నాళ్లయి నువ్వీ లోయలో ఉంటున్నావు?”

“నేనిక్కడే పుట్టాను, ఇక్కడే పెరిగాను” అన్నాడు జావా మొగుడు.

“నువ్వు ఈ ప్రాంతాలకు వచ్చేవాడివా?”

“తరచు ఇటు వేపు వచ్చేవాడిని. మ్యూజియంకి పోడానికి ఈ పక్కనుండే వెళ్ళేవాడిని.”

“ఎదురుగా కనిపిస్తున్న రావి చెట్టును ఎప్పుడేనా చూశావా?”

“చూడకపోవడమేమిటి? దీనికి మేము మరుగుజ్జు బుద్ధుడని పేరు పెట్టాము. నా చిన్నతనంలో ఎంత ఎత్తు ఉండేదో ఇప్పుడు కూడా అంత ఎత్తే ఉంది.”

“నిజమా?”

“ముమ్మాటికి”

సాధారణంగా శిథిలాల మీద, మట్టికప్పిన దిబ్బల మీద చెట్లు బాగా ఎదగవు. వేళ్లు లోతుకుపోలేవు. ఉత్తరం వేపున మట్టి దిబ్బ మీద రెండే చెట్లున్నాయి. రెండూ ఆ విధంగానే ఉన్నాయి. మిగిలిన భాగంలో పొదలున్నాయి.

ఆ చోట తవ్వకాలు జరిపితే తప్పకుండా చారిత్రాత్మకమైన శిథిలాలు బయటపడతాయి.

ఈ ఆలోచనతో మోహన్ గుండె వేగంగా కొట్టుకుంది.

ఆరునెలల వరకు తమ ఓర్పును పరిశీలించిన ఫలితం త్వరలోనే సాక్షాత్కరించనున్నది.

“మెగ్యా! మనం రేపు ఈ చోటు సాపు చేసి తవ్వకాలు మొదలు పెట్టాలి. ఉదయం అయిదు నుంచి పని ప్రారంబిస్తే ఎండకు దొరికిపోం – అందరినీ తీసుకొచ్చి అన్ని ఏర్పాట్లు చేయవలసింది. మంచి నీళ్ళు మరచిపోవద్దు.”

టెంట్లు చేరిన తర్వాత మోహన్ శశికళతో అన్నాడు.

“రేపటి నుండి ఉత్తరం వేపు తవ్వకాలను పొడిగాస్తాము. మనం ఉదయం అయిదుకే సైటు చేరుకోవాలి”.

“నేను రావడం లేదని ముందు చెప్పాను కదా!” అంది శశికళ.

“అయామ్ సారీ! ఏదో ఆలోచనలో పడి మరచిపోయాను”

తాను ఎందుకు ఉత్తరం వేపు స్థలాన్ని ఎన్నుకున్నాడో మోహన్ చెప్పాలనుకున్నాడు. కాని, ఆమె రెండు రోజుల తరువాత సైటుకి వచ్చినప్పుడు తెలుసుకుంటుందని భావించాడు.

ప్రస్తుతం ఉత్తరం వేపున్న ట్రెంచ్‌లకి ఆ మరుగుజ్జు చెట్టు పదిగజాల దూరంలో ఒక మట్టి దిబ్బ ఉంది. చుట్టూ పొదలు – సోమవారం నాడు రాత్రి అతనికి సరిగ్గా నిద్రపట్టలేదు – మంచం మీద ఇటూ అటూ దొర్లుతున్నాడు. తెల్లవారు వేళ నాలుగు గంటలకే లేచిపోయాడు. స్నానాదులు ముగించాడు. శశికళ టిఫిన్ తయారుచేసి సైటుకి పంపుతానని చెప్తే, ఒంటరిగా వెళ్ళిపోయాడు.

తూర్పు దిక్కు కొండల మీద వెలుగుతో నిండిపోయింది. చల్లని మంద పవనం కృష్ణమీద నుండి వీస్తున్నది. మోహన్ వీటిని గమనించినట్లు లేడు. తదేక దీక్షతో ముందుకు నడుస్తున్నాడు.

అప్పటికే మేట్ మెగ్యా తన జట్టుతో సైటులో ఉన్నాడు.

మెగ్యా చాలా నమ్మకమైనవాడు. ఒక్క క్షణం కూడా వృథా చెయ్యడు. పనివాళ్ళ చేత పొదలు కొట్టిస్తున్నాడు. చిన్న రావిచెట్టు వరకు జాగా చదును చేయించాడు. ఆ పని అయ్యేసరికి పది గంటలయింది.

జావా టిఫెన్, కాఫీ ఎనిమిది గంటలకే తెచ్చి, పెద్ద గొడుగు కింద టేబిల్ మీద పెట్టి వెళ్ళిపోయింది.

ఎండ ముదురుతున్నది – పదకొండు నుంచి సాయంకాలం వరకు ఎవరూ పని చెయ్యలేరు. అందుచేత ట్రయల్ ట్రెంచి కొత్త స్థలంలో మార్కు చేసి అందరూ తాటాకుల గుడిసెలోకి వెళ్ళిపోయారు.

మోహన్ కాఫీ మాత్రమే తాగాడు. టిఫిన్ తినలేదు. అప్పుడప్పుడు మంచినీళ్ళు తాగుతున్నాడు. గుడిసెలోంచి చూస్తుంటే ఎదురుగా బోధి వృక్షం కనిపిస్తుంది. ఎండకు చాలా ఆకులు రాలిపోయాయి. మిగిలినవి మెల్లగా కదుల్తున్నాయి.

జావా గొడుగు వేసుకు వచ్చింది. మోహన్ కోసం భోజనం తెచ్చింది. చల్లని పళ్ళరసం తెచ్చింది. మరో కాంటినుతో కుండలోని నీరు తెచ్చింది.

అందరూ భోజనాలు ముగించారు.

మోహన్ తల మీద టోపి పెట్టుకొని మార్కు చేసిన చోటును మరొకసారి చూసి వచ్చాడు. టేబిల్ పక్కనున్న బెంచి మీద కొంచెం సేపు నడుము వాల్చాడు.

సరిగ్గా సాయంకాలం నాలుగు గంటలకు పనివాళ్ళు ట్రయల్ ట్రెంచి తవ్వడం మొదలు పెట్టారు. సగం మంది పాత ట్రెంచి నుండి, సగం మంది బోధి వృక్షం నుండి తవ్వకాలు జరిపారు.

పాత ట్రెంచిల నుండి తవ్వే వాళ్లకు కొంచెం ఇబ్బంది కలిగింది. భూమి గట్టిగా ఉంది.

రావి చెట్టువేపు నుంచి తవ్వేవాళ్లకు పని సులువయింది. గునపాలు తొందరగా లోపలికి పోయాయి. నాలుగడుగుల లోతు త్రవ్వేసరికి లోపల గుల్లగా ఉన్నట్లు శబ్దాలు వినిపించాయి. వాళ్ళు చీకటి పడేవరకు పని చేశారు.

అప్పుడో వింత జరిగింది.

రావి చెట్టు కదిలింది. క్రమంగా పక్కకు వాలిపోయింది.

దాని వేళ్ళకింద నామ మాత్రానికి కూడా భూమి కనిపించలేదు. లోపల సొరంగమున్నట్లు అనిపించింది.

టార్చిలైటు వేసి మోహన్ ఆ బొరియలోకి చూశాడు. లోపల ఏమీ స్పష్టంగా కనిపించలేదు. లోయ పూర్తిగా చీకటిలో మునిగిపోయింది. ఆ రోజుకి పని ఆపి వేసి అందరూ బసలకు వెళ్ళిపోయారు.

***

మోహన్ టెంట్లు చేరిన తరువాత తన మంచం మీద ఒక పావు గంట చేరబడ్డాడు. శశికళ కాగితాలు సర్దడంలో మునిగిపోయింది. ఈ మధ్య టెంట్లలో పెట్రోమాక్సు లైట్లు వెలిగించడం మాని వేశారు. వెలుతురు వాటి నుంచి రావడం కన్న వేడి రావడం హెచ్చయింది. రెండు హరికన్ లాంతర్ల వెలుతురులో పని సాగిస్తున్నారు. .

శశికళ కాగితాలు సర్దేటప్పుడు కొంచెం చాదస్తంగా వ్యవహరిస్తుంది. రెండు కాగితాలు ఫైలు చేస్తే పది కాగితాలు చదువుతుంది. ఆ విధంగా కాగితాలను ఫైలు చేయడం కన్న చదవడంలోనే ఆమె కాలం హెచ్చుగా గడిచిపోతున్నది. ఫైలు చేయవలసిన కాగితాల గుట్ట, ఇంకా చాలా భాగం అలాగే ఉంది.

మోహన్ మంచి మీంచి లేచి బాత్ రూమ్‌కి పోయి స్నానం చేశాడు. గోలెంలో పోసిన కృష్ణాజలం చాల చల్లగా ఉండి ఒంటి మీద పోసుకున్నంతనే హాయినిచ్చింది. మనసుతీర స్నానం చేసి, బట్టలు మార్చుకొని, శశికళ టెంటులోనికి వెళ్ళాడు. ఆమె సన్నగా నవ్వి, కాగితాలు పక్కకు పెట్టి, అతని ముఖంలోకి చూసింది.

అతడు కొత్త విషయమేదన్నా చెప్తాడని ఆమె ఆశించలేదు. అటువంటి ప్రసక్తి తెచ్చి అతని మనసు బాధపెట్టడం ఆమె మానుకుంది.

“రెండు రోజులలో కాగితాలను సరిచేద్దామనుకున్నాను. కాని, గుట్టలుగా పేరుకున్న వాటిని చూస్తుంటే రెండు వారాల వరకు పని పూర్తి కాదని అనిపిస్తున్నది” అంది శశికళ.

కాగితాలను అలా విడిచి పెట్టి సైటుకి తప్పకుండా రావలసిందని శశికళతో అతడు చెప్పాలనుకున్నాడు. ఏమీ సైటులో దొరక్కపోతే, ఆమెను అనవసరంగా చేతిలోని పని విడిచి పెట్టి తిప్పడం జరుగుతుందని అనుకున్నాడు. గుట్టలుగా పేరుకున్న కాగితాలలో విజయపురి తవ్వకాల గురించి సంపూర్ణమైన వివరాలున్నాయి. ఇది చాలా ముఖ్యం. వాటిని సరిగా ఫైలు చేయడం ఎంతైనా అవసరం. ఏదైనా చారిత్రకమైన అవశేషం సైటులో దొరికితే ఆమెను పిలిపించవచ్చని భావించాడు.

వాళ్ళిద్దరూ సైటు గురించి, విజయపురి గురించి మాట్లాడడం, మానేసి, సావకాశంగా రేడియో వార్తలు విని, వాటి గురించి చర్చించి భోజనం చేసి, కొంత సేపు టెంట్లు ముందున్న లానులో పచారు చేసి ఎవరి టెంటుకు వారు వెళ్ళిపోయారు.

శశికళ నాలుగు కాగితాలు ఫైలు చేసి, అయిదో కాగితం చదువుతూ పదకొండున్నర వరకు మేల్కొంది. నిద్రలో కళ్ళు బరువెక్కిన తర్వాత కాగితాలను అలాగే విడిచి పెట్టి దీపం ఆర్పి శశికళ పడుక్కుంది.

మోహన్ సావకాశంగా మంచం మీద చేరబడ్డాడు. చదవడానికి అతనికి మనసవలేదు. దీపం ఆర్పివేశాడు.

అతనికి బుద్ధ పూర్ణిమ నాటి సంగతులు జ్ఞాపకం వచ్చాయి.

ప్రతి సంవత్సరం ఈ ఉత్సవం డాక్టర్ రావిప్రోలు సుబ్రహ్మణ్యం గారి ఆధ్వర్యంలో జరిగేది. వారు దూరప్రాంతాలనుండి, దేశ చరిత్రలో ఆచార్య పదవులను నిర్వహిస్తున్న వారిని ఆహ్వానించి, బుద్ధుడి జీవితం గురించి వారి చేత ఉపన్యాసాలు ఇప్పించేవారు. కాని, ఈ సంవత్సరం వారు బదిలీ మీద మరొక చోటుకి వెళ్ళిపోయారు. కృష్ణమూర్తి, కార్తికేయ శర్మ, వీరభద్రరావు, ప్రసాద్ మొదలైన ఆర్కియాలజిస్టులు, సుబ్రహ్మణ్యంగారు లేని లోటును తీర్చడానికి ప్రయత్నించారు.

ఆ రోజు శశికళ మామూలుగా తయారయి వచ్చినా చాలా చక్కగా కనిపించింది. వయసులో ఉన్న స్కాలర్ల చూపులు ఆమె అందాన్ని తాగుతుంటే, ఆమె వాళ్ళందరిలోనూ నవ్వుతూ స్వేచ్ఛగా తిరుగుతుంటే, మోహన్‌కి కొంచెం కష్టమనిపించింది. ఏం చేయడమో తెలియక, అతడు వాళ్లకు దూరంగా తిరుగుతూ ఒంటరిగా సాయంకాలం వరకు గడిపాడు. రాత్రి డిన్నరులో ఆమె వాళ్లందరి మధ్యను కూర్చుంటే తాను టేబిల్ చివర కూర్చున్నాడు. రాత్రి టెంట్లకు తిరిగి వచ్చినప్పుడు ఒకరితో ఒకరు మాట్లాడుకోలేదు. ఆనాటి నుంచీ ఆమె తన పనిలో తాను మునిగి ఏ విషయం గురించి అంతగా పట్టించుకోలేదు.

(సశేషం)

Exit mobile version