Site icon Sanchika

శ్రీపర్వతం-39

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 39వ భాగం. [/box]

[dropcap]“నే[/dropcap]ను తవ్వకాల కోసం ఒక సంవత్సరం సెలవు పెట్టాను. ఇప్పటికి రమారమి ఎనిమిది నెలలు సెలవు అయిపోయింది. ఉద్యోగంలో చేరడానికి ఇంకా నాలుగు నెలలు వ్యవధి ఉంది. రిపోర్టు కాపీ ప్రభుత్వానికి పంపించాలి. ప్రభుత్వ మిచ్చిన గ్రాంటులో ఇంకా పదివేలు మిగిలింది. పనివాళ్లకు పూర్తిగా ఇచ్చివేశాను. శశికళ జీతం, నా జీతం తీసుకోగా ఇంకా అయిదువేలు ప్రభుత్వానికి వాపస్ చేయాలి. ఇవన్నీ అయిన తరువాత చారిత్రకమైన వ్యాసం వ్రాయాలి. ఈ పనులన్నీ ఇంటికి వెళ్లినా చేయవచ్చు. కాని విజయపురికి అందుబాటులో ఉండి, స్కాలర్లతో చర్చించి వ్రాస్తే బాగుంటుంది.”

“మీరు వ్రాసిన రిపోర్టు ఆ పని చేస్తుంది. తెలుగు వారి కందరికి అది చేరదు. ఏ ఫైళ్లలోనో ఉండిపోతుంది. వివరాలను ఆధారంగా చేసుకొని మరొక చారిత్రక నవల వ్రాస్తే అది తెలుగు వారి నందరిని చేరుతుంది. మీరు ఆసక్తికరంగా వ్రాయగలరు. మీకు తెలుగు, సంస్కృతం, ప్రాకృతం, ఇంగ్లీషు భాషలమీద మంచి అధికారముంది. మీ ఉపన్యాసాలను విన్న నేను ఆశ్చర్యపోయేవాడిని.”

మోహన్ ఒక పదినిమిషాలు మౌనంగా కూర్చున్నాడు. తరువాత మెల్లిగా అన్నాడు.

“మొదట, రిపోర్టు కాపీ ప్రభుత్వానికి పంపాలి. మీరు ప్రసాద్ నుండి రిపోర్టు తీసుకోండి. ఫోటోల కాపీలు, రిపోర్టు కాపీలు తయారు చేయించాలి. అయిదు వేల రూపాయలు డ్రాఫ్ట్, సెక్రెటరీ – కల్చరల్ వింగ్‌కి పంపించాలి. ఇవన్నీ ఒక వారం రోజులు పడతాయి. ఈలోగా వర్షాలు మొదలవుతాయి. అప్పుడు మీరు చెప్పిన చారిత్రక నవల వ్రాయడం మొదలు పెడతాను”.

“మీకు ఏ విధమైన ఇబ్బంది లేకుండా జావా వండి పెడుతుంది. మెగ్యా బజారు నుండి కూరలు, వెచ్చాలు తెస్తాడు. రోజు పొద్దున్న లంబాడీ తండా వెళ్లి వాళ్ల ఆవు పాలు తెస్తాడు.”

“చాలా బాగుంది. మీరు రేపు వెళ్లి ముందు నా బట్టలు తీసుకొని రండి. నా బాంకు చెక్ పుస్తకం కూడా మంటలలో కాలిపోయింది. మా అమ్మగారితో చెప్తే ఆమె పదివేల రూపాయలు ఇస్తారు. ప్రభుత్వానికి కట్టడానికి, మన ఖర్చులకు అవి సరిపోతాయి.”

మరునాడు సెలవు పెట్టి సుబ్రహ్మణ్యేశ్వరరావు ఉదయమే బస్సులో హైదరాబాదు వెళ్లాడు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు హైదరాబాదు వెళ్లిన పిమ్మట మధ్యాహ్నం భోజనాలయిన తరువాత, మోహన్ మెగ్యాను అడిగాడు.

“మెగ్యా! శిల్పం ఎక్కడ ఉంచారు?”

“అమ్మగారి టేబిలు మీద, కాగితాల మీద, జాగ్రత్తగా పడుకోబెట్టాము” అన్నాడు మోగ్యా.

“టెంట్లు కాలిపోయి తరువాత ఏమయినది?”

“అది తక్కిన శిల్పాల వలెనే సున్నపురాయి మీద చెక్కినది. మంటలకది పూర్తిగా కాలిపోయింది. మంటల ఆర్పడానికి బిందెలతో నీళ్లు పోస్తే, బొమ్మ పూర్తిగా కరిగిపోయి, సున్నపు నీళ్లకాలువ కట్టింది.”

చాలా సేపు మోహన్ ఆలోచించి అన్నాడు – “మంటలు ఎలా మొదలయాయి?”

“మేము వచ్చేసరికి పొయ్యి మీద గిన్నెలో మీ బట్టలు జావా ఉడకబెట్టి వెళ్లిపోయంది. పొయ్యిలో, నిప్పు పూసి పోయింది. మేము విగ్రహాన్ని టేబిలు మీద పెట్టి వెళ్లిపోయిన తరువాత మైదానంలో సుడిగాలి లేచింది. మేము ఇళ్లనుండి దాన్ని చూస్తునే ఉన్నాం. అది మన టెంట్ల మీద నుంచి పోయింది. మేము భోజనాలకు కూర్చుంటుంటే వెనుక టెంటు నుంచి పొగలు వస్తున్నాయని పిల్లలు చెప్పారు. వెంటనే కొంతమంది టెంట్ల దగ్గరికి పరుగెత్తారు. కొందరు కృష్ణకు పోయారు, నీళ్లు తేడానికి. ఇంతలో మంటలు లేచాయి. మీరు వచ్చారు. అన్ని వేగంగా జరిగిపోయాయి. ఆ సమయంలో గాలి బాగా మైదానం మీద వేస్తున్నది.”

మోహన్ చాలా సేపు అలా ఉండిపోయాడు.

ఈ సంఘటనకు ఎవరు కారణమని చెప్పగలడు. ప్రపంచం అంతటికి తవ్వకాలలో తనకు లభించిన చాలా ముఖ్యమైన ఆధారం నాశనమయింది. తనేవీ ఇప్పుడు చెప్పలేడు.

ఆ రాత్రికి సుబ్రహ్మణ్యేశ్వరరావు హైదరాబాదునుండి తిరిగి వచ్చాడు. మోహన్ అమ్మగారు చాలా ఆందోళన పడుతున్నారు. చెల్లెలు, బావగారు అతని ఆరోగ్యం గురించి తరచి తరచి అడిగారు. అతను బాగానే ఉన్నాడని, రెండు, మూడు నెలలలో పనిపూర్తి చేసుకొని హైదరాబాదు తిరిగి వస్తాడని చెప్పాడు. మోహన్ బట్టలు సూట్ కేసులో పెట్టి ఇచ్చారు. డబ్బులో అయిదువేలు ప్రభుత్వం పేర డ్రాఫ్ట్ కట్టాడు. మోహన్ అమ్మగారు ఏవో తినడానికి తయారు చేసి ఇచ్చారు.

ఒక వారం రోజులలో రిపోర్టు కాపీని తయారు చేయించి, సాంస్కృతిక శాఖ సెక్రెటరీకి మోహన్ ఢిల్లీ పంపించాడు. బాగా కోలుకున్నాడు. నీడ పట్టున భోజనం, నిద్ర అతనిని తిరిగి సహజ స్థితికి తీసుకొని వచ్చాయి. ఉదయం, సాయంకాలం ఒక అరగంట నడిచి వచ్చేవాడు.

సుబ్రహ్మణ్యేశ్వరరావు హైదరాబాదు నుండి 500 పేజీలున్న రూళ్ల కాగితాల రిజిస్టర్లు రెండు తెచ్చాడు. ప్రభుత్వం పని పూర్తి చేసిన తరువాత మోహన్, తాను వ్రాయబోయే నవల గురించి ఆలోచించడం మొదలుపెట్టాడు.

ఆ రోజు ఆదివారం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాచర్ల వెళ్లాడు. పొద్దున్న నుండి మసాబుగా ఉంది. సాయంకాలానికి పెద్ద వర్షం మొదలయింది. వాతావరణం చల్లబడింది.

రాత్రి ఎనిమిది వరకు లైట్లు పోయాయి. లైట్లు వచ్చిన తరువాత మోహన్ భోజనం చేసి తాను తలపెట్టిన చారిత్రక నవలను ప్రారంభించాడు.

ఒక పది పేజీలు వ్రాశాడు. అప్పటికి అర్ధరాత్రయింది. తరువాత నిద్ర పోయాడు.

మరునాడు ఉదయం సుబ్రహ్మణ్యేశ్వరరావు మాచర్ల నుండి వచ్చాడు. ఉదయం తొమ్మిది గంటలకు టిఫిన్ తిని, రావు వెళ్లిపోయిన తరువాత మోహన్ వ్రాయడానికి కూర్చున్నాడు. మధ్యాహ్నం ఒంటి గంటకు భోజనం చేసేవాడు. కొద్ది సేపు విశ్రాంతి తీసుకొని, మూడయేసరికి తిరిగి వ్రాయడం మొదలు పెట్టేవాడు.

పని హెచ్చుగా ఉండడంచేత సుబ్రహ్మణ్యేశ్వరరావు చీకటి పడుతుంటే తిరిగి వచ్చేవాడు. అతనితో రాత్రి మాట్లాడుతుంటే కాలం గడిచిపోయేది.

మొదటి రెండు ప్రకరణాలు రావుకి చదివి వినిపించాలని అతను అనుకున్నాడు. కాని అది తటస్థించలేదు. రావు ప్రతి ఆదివారం మాచర్ల వెళ్లిపోయాడు. హిల్ కాలనీలో ఉండేటప్పుడు తీరుబడే ఉండేది కాదు.

ఆ విధంగా కాలం గడచిపోయింది. శ్రావణ భాద్రపద మాసాలు వర్షాలతో గడచిపోయాయి.

మోహన్ వ్రాసే ముందు, ఆ దినం వ్రాయవలసింది, ఒక గంట వరకు లోతులకు పోయి ఆలోచించేవాడు. తరువాత, రచన, నల్లేరు మీద బండిలా సాగిపోయేది.

అప్పుడప్పుడు కథా స్రవంతి ఆగిపోయింది. మనస్సు పనిచేసేది కాదు. అకస్మాత్తుగా సెలీనా అతని మనో ఫలకం మీద ప్రత్యక్షమయేది. ఆమె రూపాన్ని చూడగనే అతను అన్ని జ్ఞాపకానికి తెచ్చుకునేవాడు.

“ఆనందా! మనం విజయపురి చేరుకున్న తొలిరోజులు. నువ్వు విగత జ్వరాలయంలో ప్రతిష్ఠింపబడ్డావు. ఈ సంగతి శ్రేష్ఠ కుమారనంది మహారాజులు, ఏహువుల ఛాంతములునికి నివేదించారు. మహారాజు గారు నిన్ను పిలువబంపారు. వెళ్ళడమా, మానడమా అని నువ్వు ఆలోచించావు. చక్రవర్తులు పట్ల, మహారాజుల పట్ల నువ్వు గౌరవంగా వ్యవహరించవలసిందని, తప్పకుండా వెళ్లి మహారాజు గారి దర్శనం చేసుకోవలసిందని, ఇది బుద్ధ భగవానుల కాలం నుండి వస్తున్న ఆచారమని నీకు జ్ఞాపకం చేశాను.”

అటు తరువాత మోహన్‌కి యథా ప్రకారం వివరంగా విషయాలు జ్ఞాపకానికి వచ్చాయి.

ఈ విధంగా మోహన్ రెండు నెలలు నిర్విరామంగా నవలమీద పనిచేశాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావుకు ఆ రెండు నెలలు తీరుబడి దొరకలేదు. అతను హైదరాబాదు నుంచి వచ్చిన దళసరి రికార్డు బుక్కులు నవలతో నిండిపోయాయి.

ఇంతలో ఆశ్వయుజం వచ్చింది.

ఒక ఆదివారం నాడు అకస్మాత్తుగా గౌరవనీయులైన ఇద్దరు వ్యక్తులు ఇల్లు వెతుక్కుంటూ వచ్చారు. జీపు మీద వచ్చారు.

ఒకాయన మోహన్‌కి తనను పరిచయం చేసుకున్నాడు.

“నా పేరు నంబియార్. నేను ప్రభుత్వపు సాంస్కృతిక శాఖలో అండర్ సెక్రటరీగా పనిచేస్తున్నాను. ఇతను నా ఇనస్పెక్టరు. మీకు ప్రభుత్వం ఆరు బయట రంగస్థలం సమీపంలో మొదట కొంత భూమి, ఆరు నెలల తరువాత మరో కొంత భూమి పురావస్తు శాఖలో త్రవ్వకాలకు అనుమతించింది. మీరు ఆచార్య నాగార్జునుని పారవత నివాసం శిథిలాలను కనుక్కున్నారు. చాలా సంతోషం. మీ రిపోర్టు మా సెక్రటరీగారికి సరిగా బోధపడలేదు. మిమ్మల్ని వెంటనే మాతో తీసుకురమ్మని వారు మమ్మలను పంపించారు. మీరు ఈ క్షణమే జీపులో మాతో హైదరాబాదు వచ్చి, పన్నెండు గంటల ఫ్లైటులో ఢిల్లీ చేరుకోవాలి. వ్యవధి లేదు.”

మోహన్ దిగ్భ్రమ చెందాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావుతో చెప్పడానికి అవలేదు. టేబిలు మీద ఉన్న పుస్తకంలో ఒక కాగితం వ్రాసి ఉంచాడు.

“ఢిల్లీ నుంచి ప్రభుత్వం యొక్క మనుష్యులు వచ్చారు. ఈ క్షణాన్నే నేను వాళ్లతో వెళ్లిపోతున్నాను. ఈ నవల వ్రాత ప్రతి, రెండు వాల్యూములు, నేను తిరిగి వచ్చే వరకు భద్రంగా దాచవలసింది. మెగ్యాకి, జావాకి నేను ఇవ్వవలసినది ఇచ్చాను. మీకు త్వరలో ఉత్తరం వ్రాస్తాను.”

మోహన్ వచ్చిన వాళ్లతో జీపుమీద వెళ్లిపోయాడు.

(సశేషం)

Exit mobile version