శ్రీపర్వతం-4

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది నాల్గవ భాగం. [/box]

7

[dropcap]సో[/dropcap]మవారం నాడు కొరియర్ ప్యూన్ రావడం, ఉత్తరాలు, పుస్తకాలు, బ్రెడ్, బటర్, న్యూస్ పేపర్లు, కూరలు, పళ్ళు తేవడం జరిగింది.

మోహన్, సుబ్రహ్మణ్యేశ్వరరావు కోసం ఎనిమిదిన్నర వరకు చూసి, బట్టలు పట్టుకొని కృష్ణకు వెళ్ళిపోయాడు. శశికళ రెండు టెంట్లు సర్దించి, స్నానంచేసి, వచ్చిన ఉత్తరాలు చదువుకొని, వాటికి జవాబులు వ్రాసి టిఫిన్ తయారుచేసింది. పదిన్నరకు మోహన్ తిరిగి వచ్చాడు. అతడు వచ్చిన పావుగంటకే సుబ్రహ్మణ్యేశ్వరరావు కూడా వచ్చాడు.

అందరూ టిఫిన్ తిని సావకాశంగా కూర్చున్నారు.

“సుబ్రహ్మణ్యేశ్వరరావుగారు! మేము కిందటివారం ఆర్కిలాజికల్ క్లబ్‌లో కృష్ణమూర్తిగారి లెక్చరు విన్నాం. చాల కొత్త విషయాలు ఆయన చెప్పారు. మేము త్రవ్వకాలలో పడి ఇంతవరకు వెలువడ్డ అపురూపమైన శిల్పాలను, బౌద్ధుల కట్టడాలను, బ్రాహ్మణుల దేవాలయాలను చూడనే చూడలేదు. మేము తవ్వుతున్నది కూడా ఇక్ష్వాకుల చరిత్రకు సంబంధించినది కాబట్టి విజయపురిని ఈ చివరినుంచి ఆ చివరివరకు ఒక అంగుళం కూడా విడిచిపెట్టకుండా చూడాలి. అన్నీ ఒకరోజే చూస్తే ప్రయోజనం లేదు. దేవాలయాలను, స్తూపాలను, దుర్గంలో అశ్వమేధ ఘట్టం మొదలైన వాటిని, ఒకటి తరువాత ఒకటి చూసి పూర్తిగా అర్థం చేసుకోవాలి. వారానికి రెండుసార్లు శశికళ, నేనో రెండు సార్లు ఈ విధంగా వేరు వేరుగా తిరిగి వచ్చి, ప్రతి గురువారం వాటి గురించి చాల ఆసక్తి చూపిస్తున్నారు. మిమ్మల్ని కూడా ప్రతి గురువారం రాత్రి ఈ చర్చలలో పాల్గొనవలసిందని చూపిస్తున్నారు. మిమ్మల్ని కూడా ప్రతి గురువారం రాత్రి ఈ చర్చలలో పాల్గొనవలసిందని నేను ఆహ్వానిస్తున్నాను. నేనేమిటి, శశికళ కూడా ఇదే అభిప్రాయం వెలిబుచ్చారు. మీరు తప్పకుండా వస్తారని నమ్ముతున్నాను” అన్నాడు మోహన్.

“ఓ! తప్పకుండా వస్తాను. మూడు గంటలకు బయలుదేరానంటే సాయంకాలం అయిదుకేనా ఇక్కడికి చేరుకుంటాను, నాకు ఎంతో ఆసక్తి ఈ విషయాలలో” అన్నాడు సుబ్రహ్మణ్యేశ్వరరావు.

“శశికళ! ఒక ముఖ్యమైన విషయం మీతో చెప్పడం మరచిపోయాను. మన రావుగారిని మామూలు మనిషిగా తలుస్తున్నారా? అతడు బాడీబిల్డరనే మీకు తెలుసు. వారి తాతగారు వీనం వీరన్నగారు. వారు ఆర్థర్ కాటన్‌తో కలిసి గోదావరి ఆనకట్టను నిర్మించిన గొప్ప ఇంజనీరు.”

“అవును, ఆయన ఇంజనీరుగా పనిచేశారు. నేను మాత్రం డ్రాఫ్ట్‌మన్ గానే ఉండిపోయాను” అన్నాడు రావు.

“ఏదో రోజు మీరుకూడా డిజైన్ ఇంజనీరుగా అవుతారు. మీకు మంచి భవిష్యత్తుంది. డామ్ నిర్మాణం పూర్తయిన తరువాత మీ వంటి అనుభవమున్న వాళ్ళకు తప్పకుండా ప్రమోషన్లు దొరుకుతాయి” అన్నాడు మోహన్.

“చిన్న చిన్న వాగులే మహా నదులుగా సముద్రంలో కలుస్తాయి” అంది శశికళ.

అందరూ ఒక్కసారి నవ్వారు.

అప్పటికంకా పన్నెండే అయింది.

“ఇంతవరకు మీరు చెప్పడం నేను వినడం జరుగుతోంది. ఇప్పుడు నేను చెప్తాను, మీరు వింటారా?” అన్నాడు రావు.

“తప్పకుండా వింటాం” శశికళ, మోహన్ ఒక్కసారే అన్నారు.

మోహన్ తన కాంపు కాటు మీద మఠం వేసుకొని కూర్చున్నాడు.

మంచానికి కొంచెం దగ్గరగా కుర్చీలు ఈడ్చుకున్నారు రావు, శశికళ.

“నేను చెప్పబోయేవి శాస్త్రీయ విషయాలు కావు. నా అనుభవాలు. మీరిద్దరూ వృత్తిలోనున్న ఉపన్యాసకులు కాబట్టి మీకు మల్లే బాగా చెప్పలేను.”

“అటువంటివేమీ పట్టించుకోం” అంది శశికళ.

“నాగార్జున కొండమీద ఒకరకం పామును చూశాం. అది చూడడానికి త్రాచు పాములా కనిపించింది. మేము దగ్గరికి వస్తుంటే పడగ విప్పింది. నేను చాల భయపడి పోయాను. నాతో ఉన్న స్నేహితుడు నన్ను సమాధాన పరచి, ఈ రకం పాము విషసర్పం కాదని, తరచూ ఈ ప్రాంతాలలో కనిపించినా ఎవరూ దీనిని చంపరని చెప్పాడు.”

“అవునవును. ఇక్కడ త్రవ్వకాలలో చాల పాములు మండ్రగబ్బలు పైకి వచ్చాయని, కాని ఎవరినీ అవి కరవలేదని నాకు డాక్టరు సుబ్రహ్మణ్యంగారు చెప్పారు. వాటి ఉనికిని గౌరవించి, వాటి నుండి దూరంగా ఉంటారని, అందుచేత అటువంటి ప్రమాదం సంభవించలేదని ఆయన చెప్పారు” అంది శశికళ.

పాము, పడగలు అన్నమాటలు వినగానే మోహన్‌కి ధనంబోడు మీది అనుభవం జ్ఞాపకం వచ్చింది. దాని గురించి చెప్పాలనుకున్నాడు. కాని అది సమయం కాదని, ప్రస్తుతానికి ఎవరికి తెలియజేయకూడదని నిశ్చయానికి వచ్చాడు.

“నాగార్జునకొండమీద చాల ఓషధున్నాయి. కొండ ఎక్కడానికి తొలి రోజుల్లో దారి ఉండేది కాదు. ఒకసారి, సాయంకాలం డాక్టర్ పట్నాయక్ గారు, నేను, మరొక స్నేహితుడు శ్రమపడి కొండ మీదికి ఎక్కాం. అక్కడ నుండి కృష్ణానదిని, ఏలేశ్వరం గట్టుని, సింహగిరిని చూస్తూ ఉంటే సూర్యుడు అస్తమించాడు. చీకటి పడకుండా దిగి, పుల్లారెడ్డి గూడెం చేరాలని తిరుగు ప్రయాణం మొదలు పెట్టాం. కొద్ది సేపటిలోనే చీకటి పడింది. దారి సరిగ కనపించలేదు. పొదలను పక్కలకు తోసుకుంటూ నడిచాం. చీకటి రాత్రులేమో, వెన్నెల కొద్ది సేపు మసకగా కనిపించి మాయమయింది. గమ్యం చేరాలని ఆగకుండా తుప్పలలోను, చెట్లలోను, చేమలలోను తిరుగుతునే ఉన్నాం. లంబాడీ తండా దగ్గిరికొండ, నాగార్జున కొండ తిరిగాం. నాగార్జున కొండమీద కోనేరువంటి నుయ్యి ఉంది. నీరు స్వచ్ఛంగా ఉంటుంది. దాని చుట్టూ మూడుసార్లు తిరిగాం. కాని దారి దొరకలేదు.”

“ఇది నిజమేనా? శశికళ ప్రశ్నించింది.

“ఇది నిజంగా జరిగింది. ఆ విధంగా రాత్రంతా కాళ్ళు పడిపోయినట్లు ఆ కొండలమీద తిరిగాం. తూర్పువేపు కొండలమీద వెలుగు వచ్చిన తరువాత చూస్తే, మేము నిన్న సాయంకాలం ఎక్కడినుంచి బయలుదేరామో అక్కడే ఉన్నాం.”

“చాల ఆశ్చర్యంగా ఉందే!” అన్నాడు మోహన్.

“దీనికి కారణమేదేనా ఉంది?” ప్రశ్నవేసింది శశికళ.

“మీకు ముందుగానే చెప్పాను, నాగార్జున కొండ మీద ఓషధులున్నాయని, అటువంటిదానిని దేనినో తొక్కి ఉంటామని నా స్నేహితుడన్నాడు. దీనినే తీగతొక్కడం అంటారని డాక్టరు గారన్నారు. ఒకానొక ఓషధిని తొక్కితే చిత్తభ్రమ కలుగుతుందని ఆయన అన్నారు.”

“చాల గొప్ప అనుభవమే!” అంది శశికళ.

“ఇంకా ఏమైనా అనుభవాలు మీ సంచిలో ఉన్నాయా?” నవ్వుతూ అడిగాడు, మోహన్.

“అసలు అనుభవం, నిజానికి, వెనుక పడింది. వినడానికి మీకు ఓపిక ఉందా?”

“మేం సావధానంగా వింటాం!” అన్నాడు మోహన్.

“ఈ ఆదివారం కాకుండా క్రిందటి ఆదివారం మాచర్ల వెళ్ళాను. సాయంకాలం ఆరుబయట జొన్న చేలవేపు షికారుకు, ఒక్కడినే, పోయాను. అక్కడో చిన్న పంటకాలువ ఉంది. దానికి సమీపంలో ఒక పడుచు, పచ్చగడ్డి, పెద్దమోపు కట్టినది, కాలువపక్కను నిలిచి, ఎత్తడానికి ఎవరేనా వస్తారా అని చూస్తున్నాది. ఇంతలో డామ్ దగ్గిర వనిచేస్తుత బెజవాడ ప్రాంతపు మనిషొకడు అటువేపు నించి పోవడం తటస్థించింది. ఆ అమ్మాయి అతనిని పిలిచి, గడ్డిమోపు తలమీద కెత్తమంది. వయసులో ఉన్న అమ్మాయి పిలిచిందని అతడు పొంగిపోయి సాయం చేయడానికి మోవుమీద చేయివేశాడు. పచ్చగడ్డి మోపేమో, చాల బరువుగా ఉంది. అతడు ఎంత ప్రయత్నం చేసినా, ఒక అంగుళం మేరకు కూడా దాన్ని పైకెత్తలేకపోయాడు. అప్పుడా అమ్మాయి అతనిని ఆక్షేపించింది. ‘వరన్నం తిన్నవాడివి, నీకు బలమెక్కడిదయ్యా? చూడు – జొన్నరొట్టి తినే నా బలం’ ఇలా అంటూ ఆమె ఎడంచేత్తో అతి సులువుగా ఆ గడ్డి మోపు తల పైకి ఎత్తుకుంది.”

“మాచర్ల పడుచులు అంత బలవంతులా?” ప్రశ్నించింది శశికళ.

“ఈ మధ్య మాచర్లలో ఒక దొంగతనం జరిగింది.”

“ఈ ప్రాంతాలలో దొంగతనాలు కూడా ఉన్నాయా?” మోహన్ అడిగాడు ప్రసంగం మధ్యలో.

“ఈ బెజవాడ సరుకు దిగిన తరువాతే దొంగతనాలు, వ్యభిచారం ఈ ప్రాంతాలలో మొదలయాయి.”

“అప్పుడేం జరిగింది?” శశికళ ఆసక్తి చూపుతూ అడిగింది.

“కొంతమంది స్త్రీలు ఆ దొంగను పట్టుకొని చితకదన్ని చెవులు మూశారు.”

“అంత బలవంతులా ఈ పల్నాటి ప్రమదలు” అన్నాడు మోహన్.

“మళ్ళీ కథలోకి వద్దాం. ఆ అమ్మాయి అవలీలగా గడ్డిమోపును తలమీదికి ఎత్తుకోడం చూసి నాకు ఆశ్చర్యమేకాక ఒక కోరిక కూడా కలిగింది. ఆ పడుచు రమారమి అయిదడుగుల ఆరంగుళాల పొడవు. పొడవుకు తగ్గట్టే సౌష్టమైన శరీరం. శ్రమజీవి కాబట్టి కోమలంగా లేదు. అయినా కనుముక్కు తీరు చక్కగా కనిపించింది. ఒక పదహారేళ్ళ అమ్మాయి సులువుగా మోపునెత్తుకుందంటే మంచి కసరత్తు చేసిన శరీరమయి ఉండాలి. నిజానికి ఆ మోపు అంత బరువుందో లేదో! అటువంటి అమ్మాయిని నావంటి బాడీ బిల్డరు…”

శశికళ పకాలున నవ్వింది.

“అటువంటి కోరిక కోరడంలో తప్పులేదు” అన్నాడు మోహన్.

“అయామ్ సారీ! మీరు మరోవిధంగా అనుకోకండి!” అంది శశికళ.

“మీరు నవ్వినందుకు నాకు చిన్నతనం లేదు. ఆ పడుచు వంటి అమ్మాయిని పెండ్లాడితే బలం గల పిల్లలు పుడతారని, ‘ఈసురోమని మనుషులుంటే దేశం బాగుపడద’ని నేను అనుకుంటున్నాను.”

“యూ ఆర్ కరెక్టు – మీ కథ పూర్తయిన తరువాత మీ ఉద్దేశాన్ని బలపరిచే చారిత్రక విషయం మీకు చెప్తాను” అంది శశికళ.

“మళ్ళా కథలోకి – అటువంటి అమ్మాయిని నావంటి బాడీ బిల్డరు పెండ్లాడితే ఆజానుబాహువులు, బలవంతులు అయిన పిల్లలు పుడతారని అనిపించింది. ఈ వారం రోజులు ఆ అమ్మాయి గురించే ఆలోచించాను. ఆలోచించిన కొద్ది ఆ అమ్మాయి చక్కనిదని, పెండ్లాడితే ఆమెనే తప్ప మరొకరిని కూడదని ఒక నిశ్చయానికి వచ్చాను.”

“చాల బాగుంది! ఇది సవ్యమైన ఆలోచన!” అన్నాడు మోహన్.

“ఈ వారం రోజులు మరే విషయం గురించి ఆలోచించలేదు. ఆ అమ్మాయి ఒడ్డు, పొడుగు, వంవులు దేరిన శరీరం – నా కళ్ళల్లో నాట్యమాడేది.”

“అంటే ‘లవ్ ఎట్ ఫస్ట్ సైట్’ అన్నమాట అంది శశికళ.

“మీరు ఏవిధంగా అనుకోండి, నాకా అమ్మాయి మీద మనసయింది.”

“వెరీగుడ్!” అన్నాడు మోహన్.

“నిన్న ఆదివారం పనికట్టుకొని మాచర్ల బయలుదేరాను. పగలంతా ఒక స్నేహితుడితో గడిపి సాయంకాలం నాలుగు గంటలకు పొలాలవేపు వెళ్ళాను. అదే కాలువ, అదే చోట నిలబడ్డాను. సరిగా క్రిందటి వారం వచ్చిన సమయానికే ఆ అమ్మాయి వచ్చి తలమీద నున్న పచ్చగడ్డి మోపు గట్టుమీద పడేసి, కాలువ నీళ్ళల్లో కాళ్ళు చేతులు కడుక్కుంది. చుట్టు పట్ల నేను తప్ప మరెవరూ లేకపోవడం చూసి, ‘ఓ అబ్బాయ్! ఇలా మోపు తలకెత్తుతావా?” అంది నాతో గట్టిగా. నేను కూడా అటువంటి అవకాశం కోసమే చూస్తున్నానేమో, ఆమె వేపు నడిచాను. మోపును ఇటు అటు చూశాను. ఫంట్లాం చోక్కా తొడుక్కున్న మనిషి ఎందుకు పనికొస్తాడని ఆ అమ్మాయి అనుకున్నట్లుంది. నన్ను ఏవిధంగా ఆక్షేపిస్తే బాగుంటుందని ఆలోచిస్తోంది కాబోలు. “ఏందయ్యా చూస్తున్నావ్! తొందరగా ఎత్తు. నాకు పనుంది” అని హెచ్చరించింది. నేను రెండు చేతులతోను దానిని ఎత్తి ఆ అమ్మాయి తలమీద పెట్టాను.”

“పరీక్షలో నెగ్గారన్నమాట!” అన్నాడు మోహన్..

“నిజానికి ఆ మోపు చాల బరువుగానే ఉంది. హెవీ వెయిట్ లిఫ్టింగ్‌లో నాకు చాల అనుభవముండడంచేత ఏమీ అనిపించలేదు.”

“అప్పుడా అమ్మాయి ఏమంది” శశికళ ప్రశ్నించింది.

“ఇప్పుడు ఆక్షేపించడం నావంతు. ‘వరన్నం బలం ఇప్పుడు తెలిసిందా? బరువులెత్తడానికి, బలానికి జొన్నరొట్టెలే తినక్కర్లేదు’ అన్నాను నేను.”

“ఇందులో ఆక్షేపణేముంది?” అన్నాడు మోహన్. .

“నాకు ఆ అమ్మాయి మీద మనసు నిలిచిందని ముందే మీకు చెప్పాను. అందుచేత చాల నెమ్మదిగానే ఆమెతో అన్నాను. ఆమె కూడా నవ్వింది. ఆమెతో ఊరివేపు నడిచాను. పేరడిగాను. ‘వరలక్ష్మంది’. వయసడిగాను, పదహారు మన్ననే వెళ్ళాయంది. ‘పెళ్ళయిందా’ అన్నాను ‘కాలేదంది’. నన్ను పెళ్ళిచేసుకుంటావా?’ అని అడిగాను “మా అమ్మనడుగు’ అంది.”

“చాల బాగుంది సంభాషణ” అంది శశికళ.

“ఆమెతో వాళ్ళ యింటివరకు నడిచాను. వాళ్ళు కాపులు. విశాలమైన పెంకుటిల్లు. పెద్ద వీథి వాకాలి, పెరటిలో పశువులు, వీళ్ళు సంపన్నులే. ఆ అమ్మాయి వాళ్ళ అమ్మను తీసుకొచ్చింది. “ఈ అబ్బాయి నీతో మాట్లాడాలని వచ్చారు” అంది వాళ్ళమ్మతో ఆమె నన్ను కూర్చోమంది. కాచిన పాలు ఒక గ్లాసుతో తెచ్చి ఇచ్చింది. అటుపిమ్మట మాటలేమిటో చెప్పమంది. వాళ్ళ అమ్మాయి నాకు నచ్చిందని చెప్పాను. నా ఉద్యోగం గురించి, తల్లిదండ్రుల గురించి, ఆస్తిపాస్తులగురించి చెప్పాను. ఆ అమ్మాయి తల్లి నవ్వింది. మేనరికమొకటుంది కాని, అమ్మాయి చేసుకోనంది. మాకు ఇష్టం లేదు. ఒక సంవత్సరం వరకు పెళ్ళి చేయడానికి అవదు. అంతవరకు నువ్వు తాళగలిస్తే, పెద్దవాళ్ళని వచ్చి మాట్లాడమను’ అంది ఆమె.”

“మరేం! మీ రొట్టె వెన్నలో పడింది.” అన్నాడు మోహన్.

శశికళ చేతివాచీ చూసుకుంది. ఒంటిగంట కావస్తుంది.

“మనం లంచ్‌కి ఆలస్యమవుతాం. కుక్కరు అమర్చాలి. చాల పనుంది. లంచ్ అయినవరకు సంభాషణ వాయిదా వేస్తున్నాం” అంది శశికళ..

శశికళ చక్కగా వండుతుంది. కాలీఫ్లవరు, టమాటోలు, వంకాయలు, మరికొన్ని కూరలు కొరియర్ ఫ్యూన్ తీసుకొచ్చాడు. టమాటో పప్పు, పూవుకూర, పెరుగు వచ్చడి ఆమె సులువుగా చేసింది. రెండు గంటలకు వంట పూర్తయింది.

శశికళ స్త్రీ కాబట్టి మగాళ్ళకు వండి పెట్టాలని నియమమేదీ లేదు. మోహన్ ఏదో వండగలడుగాని శశికళకు మల్లే బాగా వండలేడు. వంట గురించి ఆమె ఎప్పుడూ వంతులు పడలేదు. కొందరు కొన్ని పనులు ఆనందంగా చేస్తారు. శశికళకు పాక కళ మీద చాల అభిమానం.

రెండున్నరకి అందరి భోజనాలయాయి.

శశికళ ఒక పది నిమిషాలు నడుంవాల్సి మోహన్ టెంటులోకి వచ్చింది. మోహన్ మఠం వేసుకొని తన మంచం మీద కూర్చున్నాడు. సుబ్రహ్మణ్యేశ్వరరావు వాలు కుర్చీమీద కూర్చున్నాడు. శశికళ మడత కుర్చీమీద వాళ్ళకి కొంచెం దగ్గరలో కూర్చుంది.

“మీరు బలమైన సంతానం గురించి ఏదో చెప్తామన్నారు” రావు జ్ఞాపకం చేశాడు.

“ఆ సంగతే మాట్లాడలని నిద్ర కూడా మానుకొని వచ్చాను” అంది శశికళ.

“వినేవాళ్ల కన్నా చెప్పేవాళ్ళు శ్రద్దగా ఉండడం చాల గొప్పమాట” అన్నాడు మోహన్.

“మీ అందరికీ తెలుసు, నేను పురాతన గ్రీసుదేశచరిత్రను అధ్యయనం చేశానని. చాల వరకు నేను మాట్లాడేవి ఆ దేశానికి చెందిన విషయాలే.”

“నేను హిందూ దేశ చరిత్ర చదివాను, కాని గ్రీసుదేశచరిత్ర తెలియనే తెలియదు. కాబట్టి, చెప్పబోయేది కొంచెం విపులంగా ఉంటే సంతోషిస్తాను” అన్నాడు రావు.

“నేను కూడా అదే అనుకుంటున్నాను. క్రీస్తు పూర్వం ఏడో శతాబ్దిలో లైకరగస్ రాజ్యాంగ సూత్రాలు అమలులోకి వచ్చాయి. గుర్రాలు మంచి పిల్లలను పెట్టాలని, డబ్బు వెచ్చించి, ఆసక్తి చూపి, జాతియైన మగ జంతువులతో జత కలుపుతారు. కాని, వారి భార్యలను మాత్రం, ఇంట్లో తలుపులు మూసి ఉంచి, తామే వాళ్ళను తల్లులుగా చేస్తారు! ఈ మగాడు ఏమైనా బలమైన వాళ్ళా? వాళ్ళు మూర్ఖులు, దుర్బలులు, లేకపోతే రోగులు, ఈ విధంగా లైకరగస్ రెండువేల ఆరు వందల సంవత్సరాల క్రింద, బలమైన సంతానం దేశానికి అవసరమని ఘోషించాడు.”

“చాల అద్భుతంగా ఉంది. లైకరగస్ గురించి ఇంకా విశేషాలు చెప్పడానికి ఉన్నాయా? అన్నిటికంటే ముందు గ్రీసుదేశం గురించి పరిచయం చేస్తారా?” అడిగాడు రావు.

“కొన్ని ద్వీపాలు, ద్వీపకల్పం యొక్క సముదాయమే గ్రీసుదేశం. ప్రభుత్వపు రికార్డులలో నేటి గ్రీసు దేశం పేరు ‘ఎల్లెనికె డిమోక్రాటియా’ అంటే గ్రీకు రిపబ్లిక్, ఇది దక్షిణ యూరప్‌లో ఉంది. దీని వైశాల్యం ఏభైవేల తొమ్మిది వందల చదరపు మైళ్ళు, ఈ దేశం జనాభా ఎనభైలక్షలు. దీని రాజధాని ఏథెన్సు. గ్రీసు దేశం పేరు ఎలా వచ్చిందంటే ఏకెలస్ లేక హెల్లాస్ అనే నది గ్రీసు దేశంలో ప్రవహిస్తుంది. గ్రీకులు ఏకెలస్ నదిని దేవుడిగా పూజించేవారు. ప్రార్థనలతోను బలులుతోను ఆ నదిని శాంతింపజేసేవారు. ఆ నది పుట్టిన చోట హెలెసెస్ అన్న ఒక జాతి ప్రజలు నివసించేవారు. ఆ జాతి చాల చిన్నదే అయినా గ్రీకులు ఆ పేరు గ్రహించి హెలెసెస్ అని ముందు పిలువబడ్డారు. రోమన్లు గ్రీసుదేశం జయించిన తరువాత హెలెసెస్‍లను గ్రెయిసై లేక గ్రీకులని పిలిచారు. ఆ విధంగా గ్రీకులు, గ్రీసుదేశం వాడుకలోకి వచ్చాయి.

“దక్షిణం నుంచి ఉత్తరం వేపుకు మనం సముద్రంలో ప్రయాణం చేస్తే గ్రీసు దేశంలో ముందు మనకు క్రీట్ ద్వీపం తగులుతుంది. ద్రాక్షరసం వలె గాఢంగా ఉన్న సముద్రంలో ఓ చక్కని ద్వీపముందని, దాని పేరు క్రీట్ అని, అందులో లెక్కకు మించిన ప్రజులుండేవారని, తొంభై నగరాలు ఆ ద్వీపంలో ఉండేవని హోమరు చెప్పాడు. అక్కడ ఉండే సంస్కృతిని, ఆ విస్మృతమైన నాగరికతను వెలికి తీసిన ఘనత నేటి ఆర్కియాలజీకి చెందుతుంది. ఈ ద్వీపంలో చక్కని వాతావరణం కనిపిస్తుంది. ఒక్కప్పుడీ ద్వీపం దట్టమైన అడవులుండేవి. యుద్ధ విన్యాసాలకు, వ్యాపారానికి ఇది చాల అనుకూలమైనది.

“క్రీ.శ. 1878లో ఒక క్రీటు దేశపు వర్తకుడు, ఆ ద్వీపపు రాజధానికి దీక్షిణపు ప్రాంతాలలో ఒక పర్వతం పక్కను పురాతన వస్తు సంపదను కనుగొన్నాడు. ట్రాయ్ నగరాన్ని త్రవ్వి బయటకు తెచ్చిన ప్రముఖ ఆర్కియాలిజిస్టు, జర్మన్ దేశయుడు, హెన్రిక్ స్క్లీమన్, క్రీ.శ. 1886లో ఆ స్థలం దర్శించాడు. వెంటనే త్రవ్వకాలు మొదలు పెట్టాలని ఆ భూమి యజమానితో బేరాలు సాగించాడు. కాని ఆ భూస్వామి మోసం చేయాలని చూశాడు. స్క్లీమన్ కోపంతో మళ్ళిపోయాడు. ఆ విధంగా మరొక నాగరకతను ప్రపంచానికి చూపించే బంగారు అవకాశాన్ని పోగొట్టుకున్నాడు స్క్లీమన్.”

“క్రీ.శ. 1893లో బ్రిటిష్ ఆర్కియాలజిస్టు, డాక్టర్ ఆర్థర్ ఇవాన్స్, ఏథెన్సు నగరంలో కొన్ని పాలరాతి శకలాలను గ్రీకు స్త్రీల నుండి కొన్నాడు. ఆ స్త్రీలు వాటిని తాయెత్తుగా ధరించేవాళ్ళు. వాటి మీద చెక్కిన చిత్రలిపి గురించి అతడు ఆసక్తి కనబరిచాడు. ఆ లిపిని ఏ పండితుడు చదవలేకపోయాడు. ఆ పాలరాతి తాయెత్తులు ఎక్కడనుండి వచ్చాయని, విచారణ చేస్తూ పరిభ్రమించాడు. పురాతన క్రీటు లిపికి చెందిన వస్తువులు ఏరాడు. 1895లో అతడు, ఒకప్పుడు స్క్లీమన్, ఏథెన్సులో ఫ్రెంచి విద్యాలయం, పురాతన నోసస్ నగరమని గుర్తించిన స్థలంలో కొంత భాగం కొన్నాడు. 1900లో ఆ స్థలంలో మిగిలిన భాగం కూడా కొన్నాడు. కొన్న తొమ్మిది వారాల్లో, నూట ఏభైమందితో త్రవ్వకాలు ప్రారంభించాడు. అతడు చాల తీవ్రంగా పనిచేశాడు. ఆధునిక చారిత్రక పరిశోధనలో చాల విలువైన నిధి, మినోస్ రాజభవనం, త్రవ్వి పైకి తీశాడు. ఈ రాజభవనం యొక్క నిర్మాణం చాల క్లిష్టంగా ఉంటుంది. పురతాన గ్రీకు కథలలో మనకు ఎదురయే వీరులు మినోస్, డెడలన్, థీస్యస్, అరియడేన్, మినోటారు – వీరికి దీనితో సంబంధముంది. అక్కడ ఉన్న శిథిలాలలోన, మరి కొన్నిటియందు చాల ముద్రల, మట్టి ఫలకాలు ఇవాన్సుకి లభించాయి. వాటన్నిటి మీద చిత్రలిపి కనిపించింది. నోసస్ రాజభవనాలను నాశనం చేసిన అగ్నిజ్వాలలు ఈ ఫలకాలను మాత్రం మనకోసం మిగిల్చాయి. వాటి మీద, బొమ్మలు అక్షరాలుగా చెక్కిన చిత్రలిపి ఈనాటికి కూడా ఎవరికీ అర్థం కాలేదు. ఇవాన్స్, నోసస్‌లో చాల సంవత్సరాలు పనిచేశాడు. అతనికి నైటు బిరుదాన్ని ఇచ్చి బ్రిటీష్ ప్రభుత్వం గౌరవించింది. అతడు తవ్వకాలు చేస్తుంటే చాల దేశాలనుండి ఆర్కియాలజిస్టులు అక్కడ గుమిగూడి చాల భవనాలను వెలికి తీశారు. ఇవాన్న నలభై మూడు అడుగుల లోతు వరకు తవ్వి రహస్యాలను బైటికి తీశాడు”.

మోహన్, రావు శ్రద్ధగా వింటున్నారు.

శశికళ ఒక గ్లాసుడు నీళ్ళు తాగి మళ్ళా చెప్పడం సాగించింది.

“మీకు గ్రీకుల గురించి చెప్పాలని మరోదారి పట్టాను. మనకీనాడు బాగా వాడుకలోనున్న ఇంగ్లీషు మాటలు – స్కూలు, జిమ్నాషియం, జామెట్రీ, మిస్టరీ, ఫిజిక్సు, అనాటమీ, కామెడీ, ట్రాజడీ, పోయట్రీ, ఎథిక్స్, పాలిటిక్స్, పూటక్రసీ, డెమాక్రసీ వంటివి గ్రీకు భాషనుంచి వచ్చిన పదాలే. అడవుల నిర్మూలనం, స్త్రీ స్వాతంత్ర్యం, కుటుంబ నియంత్రణ, రాజకీయాలు తెచ్చే భ్రష్టాచారం, శాస్త్రానికి మతానికి మధ్య జరిగే వివాదం, సామాన్య వర్గాల మధ్య, దేశాల మధ్య, ఖండాలమద్య పోరాటం, ఆర్థికంగా శక్తివంతులైన ధనికులకు ప్రతికూలంగా ధనికులు జరిపే విప్లవం, ప్రజా ప్రభుత్వానికి నియంతృత్వానికి మధ్య పోరాటం, వ్యక్తితత్వానికి కమ్యూనిజానికి మధ్యను రేగే ఘర్షణ – మొదలయిన నేటి సమస్యలు ఆనాడూ ఉండేవి.”

“క్రీటు ద్వీపంలో ఆర్కియాలజిస్టులు త్రవ్విపైకి తీసిన నోనస్ రాజభవనాల గురించి ఇంతకు ముందు ప్రస్తావించాను. క్రీస్తు పూర్వం 2100లో ఇవి నిర్మింపబడ్డాయి. వాస్తు శిల్పులు, కమ్మరులు, కుమ్మరులు, వడ్రంగులు చిత్రకారులు – వీరందరు తమ నేర్పును వినియోగించి ఆ రాజభవనాలలో, రాజమందిరాలు, పరిపాలనా మందిరాలు, నాట్యశాలలు, క్రీడారంగాలు రూపొందించారు. క్రీస్తు పూర్వం ఇరవై ఒకటవ శతాబ్దిలో పూర్తయిన ఈ భవనాలు క్రీస్తు పూర్వం ఇరవయ్యో శతాబ్దిలో – అంటే కట్టిన వంద సంవత్సరాలలో – నాశనమయాయి. క్రీస్తు పూర్వం పదిహేడవ శతాబ్దిలో నాశనమైన భవనాలే కాక మరో ఏభై నగరాలలో అద్భుతమైన కట్టడాలు కట్టారు. ఆ యుగం భవన నిర్మాణ చరిత్రలో చాల గొప్పది.”

“ఆనాడు నోనన్ రాజభవనం నిర్మించినవారికి మనుష్యులు, నిర్మాణానికి కావలసిన వస్తువులు పరిమితమయాయి. వారికి లోహం కూడా తక్కువే లభించేది. చంద్రకాంత శిలలు లేవు. అందుచేత వాళ్ళు సున్నపురాయి తోను, సిమెంటు వంటి జిప్సమ్ తోను కట్టారు. పై కప్పులకు, స్తంభాలకు, స్తంభాలమీద చెక్కడం పనికోసం కర్ర ఉపయోగించేవారు. వాళ్ళు రాతి దిమ్మలను చాల నిశితంగా చెక్కేవారు. దిమ్మకు దిమ్మకు మద్యను చెక్క సున్నం అవసరం లేకపోయేది. ఇరవై వేల చదరపుటడుగుల మైదానంలో మూడు నాలుగు అంతస్తుల భవనాలను లేపేవారు. విశాలమైన మెట్ల వరుసలు వాటికి నిర్మించారు. పలురకాలైన గదులు లేకపోయేది. ఇరవై వేల చదరపుటడుగుల మైదానంలో మూడు నాలుగు అంతస్తుల భవనాలను లేపేవారు. విశాలమైన మెట్ల వరుసలు వాటికి నిర్మించారు. పలు రకాలైన గదులు లేక మందిరాలు, కాపలా కాసేవారి గదులు, కర్మాగారాలు, ద్రాక్షరసం పిండే యంత్రశాలలు, సామాను కొట్లు, కార్యనిర్వాహక భవనాలు, సేవకుల నివాసాలు, పక్కగదులు, ఆహ్వాన మందిరాలు, శయన గృహాలు, స్నానశాలలు, మందిరం, కారాగృహం, సింహాసన మందిరం, పెద్ద మండపం, పక్కనే ఒక రంగస్థలం, రాజ నివాసం, శ్మశానం వీటన్నిటిని ఆ ఆవరణలో నిర్మించారు. క్రింది అంతస్తులో చతురస్రంగా ఉన్న చాల లావుగా ఉన్న స్తంభాలు నిర్మించారు. మీది అంతస్తులలో కర్ర స్తంభాలు నిలబెట్టారు. ఈ కర్ర స్తంభాలు గుండ్రంగా ఉండి, క్రిందకు వాలు వచ్చి సన్నంగా ఉండేవి. స్తంభశీర్షాలు గుండ్రంగా ఉండి, పై భాగం చదునుగా ఉండి పై కప్పును స్వీకరించేవి.”

“ఆ భవనాల లోపలిభాగంలో అందంగా అలంకరింపబడిన గోడ ఒకటుంది. దానిని ఒరుసుకుంటూ ఒక రాతి ఆసనం, చాల నేర్పుతో చెక్కినది ఉంది. దానిని ఆర్కియాలజిస్టులు మినోస్ యొక్క సింహాసనమంటారు. దానిమీద వినోద పర్యాటకుడు మర్యాదగా కూర్చుండి ఒక క్షణం తాను రాజునని భావించుకుంటాడు.”

“ఈ రాజ భవనంలో ఒక విషయం ఆధునికుల దృష్టిని ఆకర్షిస్తుంది. అది మురుగు నీరు పైకి పంపే పద్ధతి. అంత ఉత్తమమైన నిర్మాణ విధానం పురాతన కాలంలో ఎక్కడా లేదనే చెప్పుకోవచ్చు. రాతి గొట్టాల ద్వారా స్నానశాలలకు, మరుగు దొడ్లకు కావలసిన నీటిని కొండల నుండికాని, వర్షపు నీటిని కాని లోనికి తెచ్చుకుంటారు. వాడుకయిన నీటిని కాల్సిన ఎర్రమట్టి గొట్టాల ద్వారా పైకి పంపుతారు. ఆ గొట్టాలు ఆరంగుళాల వ్యాసముండి, రెండున్నర అడుగుల పొడవుండి, ఒక గొట్టంలో మరొక గొట్టం అమర్చడానికి వీలుగా ఒక చివరను వాలు ఉండి నిర్మింపబడతాయి. వీటి నిర్మాణంలో మరో విశేషం కూడా ఉంది. అడుగున నలిచినమట్టి, తొక్కు వంటివి పోకుండా అడ్డే ఏర్పాటులు కూడా ఉన్నాయి. బహుశా రాజుగారి పరివారానికి వేడినీళ్ళు, సరఫరా చేసే సాధనాలు కూడా ఉండి ఉండవచ్చు.”

“ఆ కాలపు రాజులు చాల విలాసవంతమైన జీవితం గడిపినట్లు రాజభవనాల గోడల మీది చిత్రాలు తెలియజేస్తాయి. పురాతన క్రీటు ద్వీపం ఏ విధంగా క్షీణించిందో తెలియదు. బహుశా పెద్ద భూకంపం వచ్చి రాజ భవనాలను కూలదోసి ఉంటుంది. తరతరాల నిర్బంధానికి ఎదురు తిరిగిన ప్రజ క్రోధంతో విప్లవం జరిపి వాటిని నాశనం చేసి ఉండవచ్చు.”

“క్రీస్తు పూర్వం 1450లో ఫెస్టస్ యొక్క రాజభవనం మళ్ళీ నాశనమయింది. హెగియా ట్రెడా రాజభవనం కాలిపోయింది. కొంతమంది ధనికుల గృహాలు మాయమయాయి. కాని, ఆ తరువాత ఏభై సంవత్సరాలలో నోసస్ వైభవోపేతంగా వెలిగింది. తరువాత క్రీస్తు పూర్వం 1400లో నోసస్ రాజభవనం అగ్ని జ్వాలలకు లోనయింది. ఇవాన్స్ జరిపిన తవ్వకాలలో అతనికొక సంగతి స్పష్టంగా తెలిసింది. ఏదో మహాగ్ని సంభవించింది. దానినెవరూ అదుపులో ఉంచలేకపోయారు. దాని విధ్వంసానికి సాక్ష్యంగా, కాలిపోయిన దూలాలు, స్తంభాలు ఆ శిథిలాలలో లభించాయి. గోడలు మసి బారి నల్లబడ్డాయి. అప్పుడు చిత్రలిపి చెక్కిన మట్టిఫలకాలను ఆ వేడికి గట్టిబడి, తరతరాలకు నిలిచి మనకు లభించాయి. విధ్వంస చర్య ఎంత సమగ్రంగా జరిగిందో చెప్పడానికి వీలుపడదు. చాల మంది ఆర్కియాలజిస్టు విద్యార్థులు, ఈ వినాశనానికి కారణం భూకంపం కాదని, పై రాజులెవరో దండెత్తి దేశాన్ని గెలువడమని భావిస్తారు. ఏదయితేనేం, ఈ మహా విపత్తు మాత్రం అకస్మాత్తుగా సంభవించింది. ఎందు చేతనంటే కళాకారులు ఆ సమయంలో సంపూర్ణంగా పనిచేస్తుంటే మృత్యువు దయ చేసింది.”

“క్రీట్ ద్వీపపు నాగరికత రాత్రికి రాత్రి సమసిపోయిందని మనం భావించరాదు. రాజభవనాలు మళ్ళా నిర్మించారు. ఈ సారి ఆర్భాటాలకు పోలేదు. చిత్రకళ కూడా ఉచ్చదశలోనే ఉండేది. క్రీస్తు పూర్వం పదమూడవ శతాబ్దం మధ్య భాగంలో ఒక ప్రత్యేకమైన వ్యక్తి మనకెదురు పడతాడు. గ్రీకు సాంప్రదాయం, మినోస్ రాజు గురించి చాల భయంకరమైన కథలు చెప్తుంది. అతని వీర్యంలో తేళ్లు, పాములు సమృద్ధిగా ఉండేవి. వాటిని చూసి అతని వధువులు కోపగించారు. అతని భార్య పసిఫే ఏదో రహస్యమైన యుక్తి ద్వారా వీటిని తప్పించి, భద్రంగా అతనికి చాల సంతానాన్ని కన్నది. థీస్యస్ భార్య అయిన ఫెడ్రా, చక్కని కేశాలు కల అరియడ్నే ఆమె సంతానమే. దేవుడైన పాసిడన్‌కి కోపం వచ్చేటట్లు మినోస్ రాజు వ్యవహరించాడు. దానితో ఆ దేవుడు మినోస్ భార్య అయిన పసిఫేకి దేవతలకు సంబంధించిన వృషభం పైని వెర్రికోరిక, విపరీతమైన కామం కలిగినట్లు చేశాడు. డెడ్లాస్ ఆమె పై జాలిగొన్నాడు. కుట్ర పన్ని ఆమెకా అవకాశం కలిగినట్లు చేశాడు. అప్పుడామె గర్భం ధరించి భయంకరమైన మినోటార్‌ని కన్నది. మినోస్ ఆ మృగాన్ని కారాగారంలో బంధించాడు. దానికోసం ఒక ప్రత్యేకమైన నివాస స్థానం నిర్మించమని డెడలాస్‌ని ఆజ్ఞాపించాడు. దానిని కేబిరింత్ అంటారు. అదొక ప్యూహం. అందులోకి వెళ్ళిన వాళ్ళు తిరిగి వెలుపలికి రాలేరు. ఎద్దు ముఖం, మనుష్య శరీరం ధరించిన ఆ భయంకరమైన మృగానికి అప్పుడప్పుడు నిర్ణీత కాలంలో మానవులను బలిగానిచ్చి మినోస్ రాజు శాంతింపజేశాడు.”

“డెడ్‌లాస్ వృత్తాంతం ఇంకా మనోహరంగా ఉంటుంది. అతడు మహాశిల్పి అయితేనేం తన మేనల్లుడి నైపుణ్యాన్ని చూసి ఓర్వలేకపోయాడు. కోపం రగిలిన ఒక క్షణంలో అతనిని నరికి పారేశాడు. అపుడు డెడ్‌లాస్‌ని శాశ్వతంగా గ్రీసు దేశం నుండి బహిష్కరించారు. అతడు మినోస్ రాజసభలో తలదాచుకున్నాడు. కొత్త కొత్త వస్తువులను యంత్రాలను కనిపెట్టి, రాజుగారి ముఖ్య కళాకారుడుగా, నియమింపబడ్డాడు. అతడు మహా శిల్పి. అతడు చెక్కిన ప్రతిమలు జీవకళ ఉట్టిపడుతూ ఉండేవి. గొలుసులు వేసి కడితేనే గాని ఆ శిల్పాలు తమంతట తాము నడిచి వెళ్ళిపోయేవని అతిశయోక్తిగా చెప్తారు. కాని, మినోస్ డెడ్‌లాస్‌ని చూసి అసహ్యించుకున్నాడు. తన భార్య పసిఫే కామ కలాపాలకు సహాయం చేశాడని అతనిమీద మండిపడ్డాడు. అతనిని, తన కొడుకైన ఇకారస్‌ని లేబిరింత్ వ్యూహంలో పడవేశాడు. డెడ్‌లాస్ తనకు, ఇకారస్‌కి రెక్కలు అంటించిన మైనం కరిగిపోయి ఇకారన్ సముద్రంలో పడిపోయాడు. డెల్టాస్ రిక్త హృదయుడై సిసిలీ దేశం ఎగురుతూ చేరుకున్నాడు. అక్కడ నుండే ప్రజను నాగరకులుగా తీర్చాడు. క్రిట్ ద్వీపానికి చెందిన పరిశ్రమలు, కళ, సంస్కృతి వారికి సమర్పించాడు.”

శశికళ ఒక అయిదు నిమిషాలు చెప్పడం ఆపింది.

రావు కెటిల్ నిండా నీళ్ళు పట్టాడు.

మోహన్ స్టౌ వెలిగించాడు.

శశికళ కాఫీ తయారు చేసింది. అందరూ తాగి తిరిగి కూర్చున్నారు.

“ఇంతకన్నా థీసియస్, అరియడ్నేల కథ దుఃఖ పూరితమైనది. మినోస్ ఏథెన్సుపై యుద్ధం చేసి విజయం సంపాదించాడు. ఆ నగరం నుండి, ప్రతి తొమ్మిదవ సంవత్సరం, ఏడుగురు బాలలు ఏడుగురు యువకులు నజరానాగా అతడు రాబట్టేవాడు. వాళ్ళను మినోటార్ మహామృగానికి ఆహారంగా సమర్పించేవాడు. దేశానికి సంభవించిన ఈ అవమానం భరించరానిది. మూడువసారి ఏథెన్సు నుండి వచ్చిన ఏడుగురు యువకులలో అందగాడైన థీస్యస్ కూడా ఉన్నాడు. అతని తండ్రి ఏథెన్సుకి రాజు. అతని పేరు ఏజూస్. తన కొడుకును మినోటార్ దగ్గరికి పంపడానికి అతడు ఇష్టపడలేదు. కాని థీస్యస్ పట్టు విడువలేదు. మాటికి మాటికి సమర్పించవలసిన ఈ బలిని అంతం చేయడానికి దృఢ నిశ్చయుడయాడు. ఏథెన్సు రాజకుమారునిపై అరియడ్నే జాలి వహించింది. మంత్ర శక్తి కల ఖడ్గమొకటి అతనికి ఇచ్చింది. సామాన్యమైన యుక్తి ఒకటి అతనికి నేర్పింది. గహలోకి పోయేటప్పుడు దారపుండ నొకటి విప్పుకుంటూ అతడు లోపలికి పోయి, మినోటారని సంహరించి, ఆ దారం ఆధారంగా తిరిగి వచ్చి అరియడ్నేని చేరుకున్నాడు. ఆమెను తనతో తీసుకొని, థీస్యస్, క్రీట్ ద్వీపం విడిచి పారిపోయాడు. తాను చేసిన వాగ్దానం ప్రకారం, దారిలో, నక్సోస్ ద్వీపంలో, ఆరియడ్నేని వివాహం చేసుకున్నాడు. కాని, అతడు విశ్వాస ఘాతుకమైన పనిచేశాడు. అరియడ్నే నిద్రిస్తూ ఉంటే ఆమెను విడిచి పెట్టి థీస్యస్ తన అనుచరులతో పడవెక్కి పలాయనమయాడు. అరియడ్నే, మినోన్ల తరువాత, క్రీట్ ద్వీపం, చరిత్ర పుటలలో మాయమయింది. తిరిగి క్రీస్తు పూర్వం ఏడవ శతాబ్దిలో లైకరగస్ ఆ ద్వీపానికి వచ్చే వరకు దాని గురించి మనకేమీ తెలియదు.”

అక్కడితో శశికళ చెప్పడం ఆపివేసింది. చీకటి బాగా వచ్చింది.

“ఇది మొదటి అధ్యాయమనుకుంటాను” అన్నాడు రావు.

“అవును. అవకాశం చూసుకొని మిగిలిన విషయాలు చెప్తాను” అంది శశికళ.

మోహన్ దీర్ఘంగా నిశ్వసించాడు. చాల దూరం చేయవలసిన ప్రయాణంలో ఇది మొదటి మజిలీ అనుకున్నాడు.

8

నాగార్జున కొండ లోయలో డాక్టర్ మోహన్, డాక్టర్ శశికళ త్రవ్వకాలు మొదలు పెట్టి నెల రోజులయింది. త్రవ్వకాలు జరపవలసిన ప్రదేశం సాపుచేయడం, ట్రెంచ్ గురించి మార్కింగు చేయడం, మూడు ట్రయల్ ట్రెంట్లు పూర్తిగా తవ్వడం జరిగింది.

ఫలితాలు ప్రోత్సాహకరంగా లేవు. త్రవ్వకాలు జరిపేటప్పుడు నాగలి వంతుగా, అంటే ప్లౌ షేర్‌గా తొమ్మిది అంగుళాలు ముందు తొలగిస్తారు. తరువాత పదడుగులలోతు వరకు తవ్వుతారు. దాని క్రింద ఇక్ష్వాకుల సంస్కృతికి సంబంధించిన పొర మొదలవుతుంది. ఆ పొర, లేక స్ట్రాటా, నాలుగడుగుల వరకు ఉంటుంది. దానికి దిగువన సహజమైన భూమి దొరుకుతుంది. అందుచేత రమారమి పదిహేను అడుగుల లోతు వరకు ట్రయల్ ట్రెంచు తవ్వారు. ప్లౌ షేర్ లో కాని, పదడుగుల లోతు వరకు గాని చిన్న వస్తువు కూడా లభించలేదు. ప్రతి మట్టి పెళ్ళను జాగ్రత్తగా పిండి కొట్టి జల్లెడ పట్టినా ఏవీ దొరకలేదు. ఇక్ష్వాకుల పొరలో కొన్ని ఎండిన మొక్కల రెమ్మలు, వాటి వ్రేళ్ళు లభించాయి. వాటిని జాగ్రత్తగా జల్లెడ పట్టి, మట్టిని తొలగించి మొక్కలను వేళ్ళను ఇద్దరు ఆర్కియాలజిస్టుల భూతద్దాలతో పరీక్షించారు. అవి ఏ మొక్కలో వారికి అంతుపట్టలేదు. బహుశా కొండ దిగువ ప్రాంతంలో కట్టడాలు లేకపోవచ్చునని వాళ్ళు అనుకున్నారు.

జాగ్రత్తగా జల్లించిన మొక్కలను, వ్రేళ్ళను ఒక చోట విడిగా కుప్ప పెట్టుమని మేటుతో చెప్పారు. సైటుకు కొంచెం దూరంలో వాగు ఉంది. వాగు దాటిన తరువాత 22వ సైటులో ఉన్న స్తూపం ఉంది. దీనికి కొద్ది దూరంలో కొంచెం మీదకు పడమటగా మహా స్తూపముంది. కొంచెం దిగువగా మ్యూజియం ఉంది. మేటు, వాగు గట్టుకు కొంచెం వెనక్కు చిన్న గుట్ట కనిపిస్తే అక్కడ ఈ రెమ్మలు, వ్రేళ్ళు ఎండి శుష్కించిన మొక్కలని పోశాడు.

ప్రస్తుతం డాక్టర్ మోహన్ త్రవ్వకాలు జరుపుతున్న సైటుకి ఏ నంబరూ లేదు. అది ఎక్కడుందో సరిగా చెప్పడానికి టెంట్ల నుండి బయలుదేరితే బాగుంటుంది.

లంబాడీ గుడానికి ఉత్తరాన 53 నంబరు సైటు ఉంది. ఆ సైటుకి కొంచెం దిగువను దారికి ఎడం చేతి వేపు టెంట్లు రెండూ ఉన్నాయి. అవి 53 నంబరు సైటుకి దగ్గిరగాను లంబాడీ గూడానికి దూరంగాను ఉన్నాయి. 53 నంబరు సైటు పురాతనమైన రాతి యుగానికి చెందిన నిక్షేపాలను బయట పెట్టింది. చాలకాలమయి పని పూర్తవడం చేత పనివాళ్ళెవరూ అక్కడ కనిపించరు.

సైటు 53 పక్కనుండి పోయేదారి ఉత్తరం వేపు వెళ్ళి, మాచర్ల నుండి మ్యూజియం వేపు వెళ్ళే రోడ్డును, సైటు 51 కి కొంచెం పక్కను కలుస్తుంది. అక్కడనుండి కుడివేపు, అంటే మాచర్ల వేపు రోడ్డు మీద పోతే సైటు నంబరు 52 వస్తుంది. అక్కడ కూడా ఒక స్తూపం ఉంది. దానికి ఎదురుగా, రోడ్డు దాటి ఉత్తరం వేపు పోతే ఫిరంగి మోటు కొండ ఉంది. ఆ దారికి ఎడమపక్క 49వ నంబరు సైటులో ధనికుల నివాస గృహం తవ్వి తీశారు. దానికి కొంచెం మీదను సైటు నంబరు 19లో స్నానశాల ఒకటుంది. దానిని దాటి కొండ అంచునుండి ఎడమకు పోతే సైటు 17లో ఆంఫీ థియేటరు ఎదురవుతుంది. అంఫీ థియేటరుకు ఎడమపక్క, కొండమలుపు తిరిగే చోట సైటు 18లో పాంథుల విశ్రాంతి గృహం – దీనినే పాంథశాల అని పిలవవచ్చు. దానిని దాటిన తరువాత, ఉత్తరానికి, కొండపక్క నుంచి పోతే కొంచెం దూరంలోనే ప్రస్తుతం త్రవ్వకాలు జరుపుతున్న నంబరులేని సైటు తగులుతుంది. టెంట్లనుండి మైలున్నర దూరం నడిస్తే సైటు వస్తుందన్నమాట.

ఈ దారంట అట్టే మంది నడవరు. లంబాడీ తండాలో వాళ్ళు గూడెం నుండి రోడ్డు వరకు కనిపిస్తారు. రోడ్డు మీద అప్పుడప్పుడు జీపా, లారీయో, బస్సో లేక రెండెడ్ల బళ్ళో కనిపిస్తాయి. రోడ్ల దాటికొండ పక్కనుండి సైటు చేరేవరకు మనుషులే కనిపించరు. ప్రభుత్వం జరుపుతున్న త్రవ్వకపు పనులు కృష్ణానదీ తీరం పొడుగునా, విజయపురి ఉన్నచోటా ముమ్మరంగా జరుగుతున్నాయి. అందుచేత ఆ పని వాళ్ళకు, మోహన్ కింద పనిచేస్తున్న వాళ్ళకు సంపర్కమే లేకుండా పోయింది.

పొద్దున్న పదకొండు గంటలయింది.

ఉదయం పనికి వచ్చిన దగ్గిర నుంచీ ఇప్పటివరకు ఇద్దరూ మూడవ ట్రయల్ ట్రెంచ్ మట్టిని జల్లిస్తుంటే చూస్తూ నిలబడ్డారు. జల్లించడం అయిన తరువాత ట్రయల్ ట్రెంట్లు మూడింటిలోకి దిగారు. పదిహేనడుగుల టైంలోకి దిగడానికి మెట్లుంటాయి. తవ్వేటప్పుడు ట్రెంచ్‌కి ఒకపక్కను మెట్లు చేసుకుంటూ లోపలికి పోతారు. టార్చిలైటుతో అడుగునున్న భూమిని పరిశీలన చేశారు. ఒక ట్రెంచ్‌లో మరో రెండడుగులు లోతుకు తవ్వించారు. అక్కడ సహజమైన భూమి తప్ప మరేవి దొరకలేదు.

పనులన్నీ చేసుకొని, పైకి వచ్చిన పెద్దగొడుగు కింద, టేబిలు దగ్గర ఉన్న బల్ల మీద కూర్చున్నారు. ఈ మధ్య ప్లాస్కులో కానీ పోని తెచ్చుకుంటున్నారు. మధ్యను వీలు దొరికినప్పుడు తాగతున్నారు. రోజూ పదిగంటలలోగా కాఫీ త్రాగడం అయేది. అది ఇవాళ వెనుకబడింది.

డాక్టర్ మోహన్ చాల నిరుత్సాహంగా కనిపిస్తున్నాడు.

డాక్టర్ శశికళ ముఖంలో ఏ భావం తోచడం లేదు.

“మనం త్రవ్వకాలు మొదలు పెట్టి ఒక నెల రోజులయింది. ఇప్పటివరకు ఏమి సాధించాం?” అన్నాడు మోహన్.

“ఈ ప్రశ్న నాకే వేస్తున్నారా?” అడిగింది శశికళ.

“మనసులో వేధిస్తున్న ఆలోచనను బైట పెట్టాను.”

“మనం కనీసం ఆరునెలలయినా త్రవ్వకాలు జరపందే ఏ నిర్ణయానికి రాకూడదు”.

“కొంతమంది అదృష్టవంతులకు పని ప్రారంభించిన వారం రోజులలోనే అద్భుతమైన ఫలితాలు లభించాయి.”

“నాకు అదృష్టం మీద అంత నమ్మకం లేదు. అందులో ఆర్కియాలజిస్టు ఫాలంమీద శ్రమే వ్రాసి ఉంది. శమపడడం మనవంతు. ఒకప్పుడు ఆర్నెలల వరకు పని చేసినా, ఏవీ దొరక్కపోవచ్చు. ఇంతకీ, ఒక సంగతి మిమ్మల్ని చాలకాలమయి అడగాలని అనుకుంటున్నాను. ఈ సైటు మీరే ఎంచుకున్నారా? అలా అయితే దేనిని చూసి ఎంచుకున్నారు.”

“ఎవరేనా జియాలజిస్టును పిలిచి చూపిస్తే బాగుండేదేమో! సాధారణంగా బౌద్ధులు వర్షావాసానికి కొండల దగ్గిర కట్టిన విహారాలలో ఉంటారు. మన సైటుకి కొద్ది దూరంలో అటు వైపు మహా స్తూపం ఉంది. ఛుల్ల ధర్మిగిరి కూడా దగ్గిరగానే ఉంది. ఈ ప్రాంతంలో చాల వరకు బౌద్ధుల కట్టడాలే ఉన్నాయి. అదే కాక మరోక కారణముంది. ఈ సైటొక్కటీ అట్టే మిట్టపల్లాలు లేకుండా ఉంది. మిగిలిన రెండు సైట్లు చదును చేసే సరికే మనకు ఆరు నెలలు పడుతుంది. ఈ మూడు సైట్లలో ఒకటి ఎంచుకోమన్నప్పుడు దీనికే నేను మొగ్గాను.”

“ఇప్పుడు మనమీ సైటు వదలిపెట్టి మరొక సైటుకోసం ప్రయత్నం చేస్తే ప్రయోజనముందా?” ప్రశ్నించింది శశికళ.

“ప్రయోజనం కనిపించదు. త్రవ్వకాలు 1960 సంవత్సరం అంతానికి పూర్తి చేయాలి. మళ్ళా మరొక సైటుకు అనుమతి దొరకవచ్చు. ఒకవేళ దొరికితే ఏ నాలుగు నెలలో పట్టవచ్చు. మనకున్న నిధులు సరిపడవు. “

“కాబట్టి మనం వేరే ఆలోచనలు పెట్టుకోకుండా మార్కుచేసిన బ్రెంట్లు అన్నీ పూర్తిగా త్రవ్వి, జల్లెడ బట్టి, అప్పుడు ఒక నిర్ణయానికి రావడం మంచిది. ఈ విధంగా మనం నిరాశకు లోనయితే ఇంత వరకూ మనల్ని ముందుకు నడుపుతన్న ఉత్సాహం చల్లారిపోతుంది.”

డాక్టర్ మోహన్ శశికళ ముఖంలోకి ఒక అయిదు నిమిషాలు నిశితంగా చూశాడు. ఆ ముఖం నిర్మలంగా ఉంది. ఆ చూపులలో ఏమీ చాంచల్యం లేదు. ఆప్త స్నేహితుడు భుజం తట్టి ముందుకు నడవమన్నట్లున్నాయి ఆ చూపులు.

తిరిగి శశికళ మాట్లాడింది.

“మనం ఒక సంగతి మరచిపోరాదు. మనం కూడా డాక్టరు సుబ్రహ్మణ్యం గారి టీములో వారిగానే భావించుకోవాలి. వారు చాల శ్రమలు పడి వెలికి తీసిన ఇక్ష్వాకుల సంస్కృతికి మనది కూడా చేర్చాలి.”

“అదెలా ఉండనే ఉంది. మరొక్క విషయం. ఇప్పటివరకూ మనకు ట్రయల్ ట్రెంచ్‌లో ఏవీ దొరకలేదని గురువుగారితో చెప్పమంటారా?”

“ఆయన చాల అనుభవమున్నవాళ్ళు. మరికొంత కాలం ఓపికతో త్రవ్వకాలు జరిపితే తప్పకుండా పలితముందంటారు. అతని టీమ్‌ని స్కలర్లు భుజాలు విదిలించుకుంటారు. తవ్వితే బంగారం దొరకవలసిన నేలలో ఎండిన మొక్కలవేళ్ళు రెమ్మలు లభించింనందుకు పెదవి విరుస్తారు. ఇవన్నీ మనకు నిరుత్సాహాన్ని కలిగిస్తాయి.”

“అవును మీరు చెప్పినది నిజం!”

“భగవద్గీతలో కృష్ణ పరమాత్మ మనవంటి వారికోసమే చెప్పాడు కదా! ‘కర్మణ్యేవాధి కారస్తే మాఫలేషు కదాచన’. పని చేయడమే మనవంతు. ఫలితాన్ని ఆశించడానికి మనకు అధికారం లేదు.”

ఈసారి డాక్టర్ మోహన్ మనసారా నవ్వాడు. శశికళ అతనితో పాటు నవ్వింది.

“మనమో ప్రణాళిక తయారుచేసి…..” మోహన్ మాటలను ఆమె మధ్యలోనే ఆపింది.

“ఇప్పటివరకు అనుసరిస్తున్నది ఉత్తమంగా ఉంది. త్రవ్వకాలలో ప్రొద్దుటి పూట ఇద్దరం ఉందాము. మధ్యాహ్నం ఒకరమే ఉండి, రెండోవాళ్ళు ఇప్పటివరకు జరిగిన తవ్వకాలను దర్శించి, పరిశీలించి, నిశితంగా వాటిగురించి చర్చించి ఇక్ష్వాకుల చరిత్రను పునర్నిర్మించాలి. మనకు లభించిన సాక్ష్యాలను ఆధారంగా చేసుకొని, ఇక్ష్వాకుల రాజ్యస్థాపన, రాజ్యాభివృద్ధి, వైభవం, పతనం సరిగా ఊహించి సమగ్రమైన చరిత్రను మనం సమర్పించాలి. చేయవలసిన పని ఎంతో ఉంది.”

మోహన్ ఆమె ముఖంలోకి చూసి నవ్వాడు.

“ఐ ఎగ్రీ విత్ యూ! మనం ఈ నిర్ణయానికి బద్దులమవుదాం!”

అలవాటు ప్రకారం అతడు చేయిచాపాడు. ఆమె కూడా చేయిచాపి అతని చేతిలో వేసింది. అప్రయత్నంగా జరిగిన ఈ పనికి ఇద్దరూ చకితులయి చేతులు ఒక్కసారే వెనక్కు తీసుకున్నారు.

“అయామ్ సారీ!….” అన్నాడు మోహన్.

“సారీ దేనికి? మన ఫ్రెండ్ రావుగారు, అదుగో, సైకిలు మీద ఇక్కడికే వస్తున్నారు” అంది శశికళ సంభాషణ మరోదారి మళ్ళిస్తూ..

రావు రానే వచ్చాడు. సైకిలు దూరంగా పెట్టి వాళ్ళని సమీపించాడు.

“ఇవాళ సాయంకాలం రావలసిన వాడిని. ఏదో సాకు చెప్పి ముందే వచ్చాను. మీకు ఇబ్బంది లేదుకదా?” అడిగాడు రావు.

“నో, నో! మీరుంటే మాకు చాల హుషారుగా ఉంటుంది.” అంది శశికళ.

“మీరు ఎప్పుడు వచ్చినా మాకు ఆనందమే. మనసు విప్పి మాట్లాడుకోడానికి ఈ లోయలో మీవంటి ఉత్తమ స్నేహితుడు దొరకడమే అబ్బురం” అన్నాడు మోహన్.

“మీరేదో సీరియన్‌గా ఆలోచిస్తున్నట్టుంది. టైము పన్నెండున్నర అయినా గుర్తించినట్లు లేరు” అన్నాడు రావు.

మోహన్ పనివాళ్ళ వేపు చేశాడు. వాళ్ళు చాల సేపయి పని ఆపి భోజనాల కోసం కూర్చుంటున్నారు.

“మాటల్లో పడి ఆకలికూడా మరచిపోయాం. పదండి పోదాం” అంది శశికళ.

ముగ్గురూ బయలు దేరారు. లంచి తయారయేసరికి రెండయింది.

వాళ్ళు తిరిగి సైటుకి వచ్చేసరికి మూడయింది. రావుకూడా వాళ్ళతోనే సైటుకు వచ్చాడు. టెంట్లలో ఉండిపోయి మాట్లాడుకుందామని వాళ్ళెవరూ అనుకోలేదు. ఏ నిమిషాన్న ఏది బయటపడుతుందో అటువంటి సూచన కనిపించగానే ఆధారాలు దెబ్బతినకుండా చాల జాగ్రత్తలు తీసుకోవాలి. సైటు దగ్గిర కూర్చొని మాట్లాడుకోడానికి నిశ్చయించారు.

డిసెంబరు నెల వచ్చింది. ఫిరంగి మోటునుండి జారుకుంటూ చల్లని గాలి వీస్తున్నది. సూర్యుడు కృష్ణవేపు వాలిపోయి లోయనంతటినీ తన బంగారు కిరణాలలో ముంచుతున్నాడు. లోయలో ఆనందం తాండవిస్తున్నట్లు కనిపించింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here