శ్రీపర్వతం-48

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 48వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-3.2

[dropcap]“కొం[/dropcap]తమంది భిక్షువులు ఉదేనుడి పలుకులను బుద్ధ భగవానునికి నివేదించారు. అతడు భిక్షువుల నుద్దేశించి, ధర్మబోధ చేసి, వారి సంశయ నివారణ చేశారు.”

“ఓ భిక్షువులారా! వర్షాకాలంలో మీరు పోవచ్చు. కాని, మీరు కార్యం నెరవేర్చి వారం దినాలలో వస్సావాసానికి మరలి రావాలి. మిమ్మల్ని ఆహ్వానించినవారు – భిక్షువులు, భిక్షుణులు, సిక్షమానులు (శిక్షమాణులు), సమణులు, సమణేరులు, ఉపాసకులు, ఉపాసికలు – అన్న ఈ ఏడు తరగతులకు చెందినవారై ఉండాలి. వారు పిలువబంపితేనే మీరు పోవాలి. లేని పక్షంలో పోకూడదు.”

శ్రమణుడు కొంచెం సేపు అగి మళ్లా చెప్పాడు.

“క్రమంగా ఈ పిలువబంపిన వారి సంఖ్య పెరిగింది. తల్లి, తండ్రి, సోదరుడు, ఇతర బంధువులు, స్నేహితులు, అనారోగ్యంతో ఉన్న భిక్షువులు – ఈ విధంగా చాలామంది సన్నిహితులు పిలిచినప్పుడే వెళ్లవలసిందని భగవానుడు సెలవిచ్చారు. లేని పక్షంలో వెళ్లరాదన్నారు.”

కళింగ భూపతి అంతా విన్నాడు. అతనికి సందేహాలు పూర్తిగా పోలేదు.

“శ్రమణా! మీ మాటలను బట్టి, ఒక వారం దినాలకు మించి వర్షావాసం విడువకూడదని తెలుస్తున్నది.”

“కాని, కొన్ని పరిస్థితులలో వస్సావాసం పూర్తిగా విడిచి పెట్టవచ్చు. కోసల రాజ్యంలో ఒక విషయానికి చెందిన (రాష్ట్రంలో ఒక భాగానికి చెందిన) భిక్షువులు వస్సావాసం ప్రవేశించారు. ఆ ప్రాంతాలలోనున్న క్రూర జంతువులు వాళ్లను ఎత్తుకుపోయి చంపాయి. ఈ సంగతి భగవానుడికి తెలిసింది. దీనిని ప్రమాదకరమైన పరిస్థితిగా పరిగణించి, వస్సావాసం త్యజించినవారు ఆ దోషానికి గురికారని భగవానుడు చెప్పారు. వాసానికి అంతరాయం కలిగినందుకు వాళ్లు శిక్షననుభవించనక్కరలేదు. ఆ విధంగానే వస్సావాసం ప్రవేశించిన భిక్షువులు సర్పపీడకు లోనయినప్పుడు, ఆ సర్పాలు వారిని కరిచి చంపినప్పుడు వారు వాసం త్యజించవచ్చు. వస్సావాసం ప్రవేశించిన భిక్షువులును బందిపోట్లు కొల్లగొట్టినా, భూతాలు వారిని ఆదేశించి వారి శక్తిని దోచుకున్నా వాసం త్యజించవచ్చు. భిక్షువులు వర్షావాసం ప్రవేశించిన చోటుకి సమీపంలో ఉన్న గ్రామం అగ్ని దగ్ధమైతే వారికి భోజనం దొరకదు. ఒకప్పుడు వారు వసించే విహారమే దగ్ధమైతే వారికి విశ్రాంతికి స్థలం లేక బాధ పడతారు. ఒకప్పుడు వాసం ప్రవేశించిన గ్రామం వరదకు కొట్టుకుపోయినా, లేక వారుండే చోటే వరద పాలయినా వారికి విశ్రాంతి లభించే చోటు లేకుండా పోతుంది. అప్పుడు కూడా వారు వాసాన్ని త్యజించవచ్చు. ఒకప్పుడు వాసానికి సమీపమందున్న గ్రామంలో ప్రజలు, దొంగలకు భయపడి, దానిని విడిచిపోవచ్చు. అప్పుడు సంఘం మీద విశ్వాసమున్న ప్రజల వెంట భిక్షువులు పోవాలి.”

“కోసల దేశంలో ఒక విషయంలోని భిక్షువులు వస్సావాసం ప్రవేశించిన తరువాత వారికి ముదుక భోజనం కాని, ఉత్తమమైన ఆహారంకాని లభించలేదు. కొంతమందికి మంచి భోజనం లభించినా పుష్టినివ్వలేదు. మరికొంతమందికి పుష్టికరమైన ఆహారం లభించినా మంచి ఔషధం దొరకలేదు. ఈ పరిస్థితులలో భిక్షువులు వర్షావాసం విడిచి పెట్ట వచ్చునని భగవానుడు ఆదేశించారు.”

కళింగ భూపతి వింటున్నాడు. సంఘంలోని భిక్షువులకు ఎదురయే సమస్యలు బుద్ధభగవానుడు తెలుసుకొని, వాటికి పరిష్కార మార్గాలు సూచించి, సంఘాన్ని కట్టుదిట్టం చేసినందుకు అతడు ఆశ్చర్యపోయాడు.

“శ్రమణా! వర్షావాసం పూర్తి అయిన తరువాత భిక్షువులు ఏ విధిని ఆచరించాలి?”

“భిక్షువులు వస్సావాసం మూడు నెలుల పూర్తి చేసిన తరువాత పవారణ విధిని నిర్వర్తించాలి. దానిని పక్షంలో పదునాల్గవ దినాన్న, పదునైదవ దినాన్న నిర్వహించాలి. అపుడు సంఘంలో విద్యావంతుడు, సమర్థుడు అయిన ప్రముఖ భిక్షువు సంఘం ముందు నిలబడి ఈ విధంగా విజ్ఞప్తిని ఘోషిస్తాడు!”

“సంఘంలోని పూజ్యులారా! వినండి! నేడు ప్రవారణా దివసం. సంఘం సిద్ధంగా ఉంటే పవారణ యొక్క కార్యక్రమం నిర్వహించుగాక!”

“అపుడు వయసులో పెద్ద అయిన భిక్షువు, తన ఉపరివసనం ఒక భుజం కప్పినట్లు సవరించుకొని, మోకాళ్ల మీద కూర్చొని, చేతులను జోడించి పైకెత్తి పలుకుతాడు.

స్నేహితులారా! సంఘం సమోంలో పవారణను ఘోషిస్తున్నాను. మీరు నా గురించి ఏది చూశారో, ఏది విన్నారో, ఏ వార్త ఆధారంగా నన్ను అనుమానిస్తున్నారో వాటి గురించి పలుకవలసింది. నాయందు కరుణతో వాటిని వివరించవలసింది. మీ పలుకులను బట్టి నా నేరం విశదమైతే, దానినుండి విముక్తిని పొందగోరుతున్నాను.”

“ఈ విధంగా ఆ భిక్షువు రెండువసారి, మూడవసారి పవారణను ఉద్ఘోషిస్తాడు. అటుపిమ్మట, భిక్షువు తరువాత భిక్షువు తమ పవారణను మూడుసార్లు ఉద్ఘోషిస్తారు. ఈ ప్రకారం భిక్షువులు వర్షావాసం తరువాత పరిశుద్ధులౌతారు.”

అప్పటికి రాత్రి కొంత గడిచింది. కళింగ భూపతి శ్రమణుడి దగ్గర సెలవు తీసుకొని స్వగృహానికి వెళ్లిపోయాడు.

వస్సావాసం ప్రవేశించేసారికి అపరాహ్నం దాటి చాలా కాలమవడం చేత శ్రమణుడు భోజనం చేయలేదు.

రాత్రి కళింగ భూపతి వెళ్లిన తరువాత తన కొరకు పరిచారకుడు తెచ్చిన వేడి పాలను మెల్లిగా తాగాడు.

శ్రమణుడు థమ్మపథంలోని గాథలను వర్ణించి, త్రిరత్నాలను నుతించి పడుక్కున్నాడు. అతనికి చాలాసేపటివరకు నిద్ర రాలేదు. బయట వర్షం పడుతోంది. మధ్య మధ్య మెరుపులు, ఉరుములు, పిడుగులు.

తాను అనూరాధపురం చేరిన దగ్గరనుంచీ దినాలు ఏవిధంగా గడిచాయో అతను జ్ఞాపకం తెచ్చుకున్నాడు.

అనూరాధపురం రెండు పెద్ద సరస్సులు మధ్య లేచిన మహానగరం. నగరంలోని భవనాలు, ప్రాసాదాలు ఉన్నతంగా ఉన్నాయి. మధ్యాహ్నపు ఎండలో ఈ జలాశయాలలోని నిర్మోలోదకాలు మెరుస్తుంటాయి. తిస్స సరస్సు పడమటికి ఉంది. సువార సరస్సు తూర్పుకుంది. రాజమార్గం దక్షిణం నుండి ఉత్తరానికి పోతూ నగరాన్ని రెండుగా విభజిస్తుంది. పురమధ్యంలో దుర్గం ఉంది. దుర్గంలో రాజప్రాసాదం ఉంది. బుద్ధ దంతధాతు గర్భమైన చైత్యముంది. రాజమార్గానికి తూర్పువేపు బురదలతో పారే మాల్వటునది ఉంది. అది దక్షిణం నుండి ఉత్తరానికి ప్రవహిస్తూ నగరం మధ్య భాగానికి చేరే ముందు చీలికలై, దుర్గంపై భాగంలో ఈ చీలికలు రెండూ ఏకమై, తిరిగి ఉత్తరానికి సాగుతుంది.

నగరం చాల విశాలమైనది. దీనిని రాజపురమని పిలుస్తారు. (పురరాజము), దేవానాం పియుడు ఈ నగరాన్ని నిర్మించాడు. దీనిని దర్శించిన విదేశ యాత్రికులు దీనికన్న ఉజ్వలమైనది విశ్వంలో మరొకటి లేదంటారు.

దక్షిణ ద్వారం దగ్గర అగడ్త మీద ఒక కర్రవంతెన ఉంది. ఆ వంతెనకు ఉపయోగించిన కలప మీద, సింహద్వారపు తలుపుల మీద చెక్కిన చిత్రాలు జీవం పోసుకున్నాయి. ఈ ద్వారం సాధారణంగా మూసి ఉంటుంది. దుర్భేద్యమైన ఈ తలుపుల మీద శత్రువులు దాడిచేసిన చిహ్నాలు కనిపిస్తాయి.

నగరంలోని వీదులు విశాలంగా ఉంటాయి. నేల మీద నున్న ఇసుక లేత గులాబి రంగులో ఉంటుంది. నగర వీతులలో ఒకటి ఉత్తర దక్షిణాలకు పోతుంది. మరొకటి తూర్ప పడమరలకు నదిని దాటిపోతుంది. ఇవి నగరం నుండి పోయి మహా సరస్సుల దగ్గిర అంతమవుతాయి.

నగరాన్ని నాలుగు భాగాలుగా విభజించవచ్చు. మధ్యను దుర్గముంది. అయితేనేం, నేత్రమనోహరమైన వృక్షసంతతి దట్టంగా వ్యాపించి, గాఢమైన హరితవర్ణపు రత్న కంబళం పరచినట్లుగా ఉంటుంది. మధ్య మధ్య లేత ఆకుపచ్చ రంగులో ఉన్న ఉద్యానవనాలు, లలిత ధూమ్రవర్ణంలో ఉన్న పథాలు, జేగురు రంగు ఇంటి పైకప్పులు, వాటి మధ్యలో పెద్దనదిని కలిసే ఉపనది కనిపిస్తాయి.

వాయవ్య దిశలో ఉన్న నగర భాగంలో మహా జన పథం ఉంది. అది సామాన్యులు నివసించే భాగం. తక్కువ కులాల వారు ఆ ప్రాంతాలలో ఉంటారు. సామాన్య ప్రజల గృహాలు గుంపులుగా కనిపిస్తాయి.

దుర్గమూ, సామాన్య ప్రజల గృహాలూ ఒకదానితో ఒకటి ఐకమైనట్లుంటాయి.

రాజ ప్రాసాదం చుట్టూ ఉండే అగడ్త మీద వంతెనలున్నాయి. రాతి ప్రాకారాల మీద, ద్వారాల దగ్గర కాపలా వారు ఎప్పుడూ ఉంటారు.

సీహళులు కానివారు ఎక్కడేనా ఉండవచ్చు. రాజ భవనం లోను, చైత్య గృహాలలోను ముఖ్యంగా ఈశాన్య భాగంలోను వాళ్ళు కనిపిస్తారు. ఈ భాగంలో వర్తకం జరుగుతుంది. దుకాణాలు, పానగృహాలు, భోజన శాలలు ఉండడమే కాకుండా, ఇరవైఎనిమిది హస్తకళలకు చెందిన నిగమాలు కిటకిటలాడుతూ నివసిస్తాయి. ఈ నగరం భాగం పర్యాటకులకు విహారభూమి. పగలు, రాత్రి, ఎల్లవేళల్లో ఈ ప్రాంతం సందడిగా ఉంటుంది.

నగరంలోకి వచ్చే విదేశీయుల వివరాలు, వారి ప్రవేశ నిర్గమనాలు నిశితంగా నగర రక్షకశాఖ పర్యవేక్షిస్తుంది. గూఢచారులను, దేశద్రోహులను కూడా ఈ శాఖ కనిపెడుతుంది. కానీ, చారుల సామర్థ్యం ముందు ఈ కట్టుదిట్టాలు ఏవీ పనిచెయ్యవు.

రాజ భవనానికి ఎదురుగా సభామందిరముంది. బలమైన రాతి పునాదులతోను, ఎత్తుగా లేచిన నల్లచేపమాను స్తంభాలతోను, ఏటవాలుగా ఉన్న పెంకుటి పైకప్పుతోను అది విరాజిల్లుతున్నది. మెట్లు వెడల్పుగా ఉండి స్వాగతమందిరానికి దారితీస్తాయి. మెట్లకు ఇరుపక్కల నగరదేవతల ప్రతిమలున్నాయి. ఈ సభా మందిరానికి ఒక పక్కను రాజోద్యోగులు పనిచేసే భవనముంది. దాని వెనుకను కోశాగారముంది. సభామందిరం దాటితే లీలోద్యానాలు, వాటి వెనుక రాజ ప్రాసాదము ఉన్నాయి. రాజమందిరానికి ఒక వేపు అంతఃపురముంది. రాజు సులువుగా ప్రవేశించడానికి అనువుగా ఉంది.

దుర్గంలో సభామందిరానికి పశ్చిమ భాగాన్న, దుర్గం ఆవరణకు సమీపంలో, మామిడితోపులో, విశాలమైన స్థలంలో నిర్మింపబడిన సుందర భవనమే విశ్రాంతి మందిరం. ఏకాంతంగా, నగరధ్వనులకు దూరంగా ఉన్నదీ విడిది.

నగర దక్షిణ ద్వారం నుండి దుర్గం వరకూ పోయే రాజమార్గం సగం దూరం గడచిన తరువాత కుడివేపున మౌర్యాశోకుని కుమారుడు భారతదేశం నుండి తెచ్చి నాటిన బోధి వృక్షముంది. మరి కొద్ది దూరం పోతే, ఎడమ వేపు, కంచుకోట ఉంది. ఇంకా ముందుకు పోతే, కుడివేపు, మార్గం పక్కనే రువన్వేలి స్తూపముంది. మరికొద్ది దూరంలో, దుర్గానికి సమీపంలో ఎడమవేపు థూపారామముంది.

అనూరాధ పురం చేరిన ఒక వారం వరకు స్వేచ్ఛగా తిరగడానికి శ్రమణుడికి అవకాశం లభించింది. ప్రతి దినం నగరంలో ఒక భాగం దర్శించి, భోజన సమయానికి అతడు విశ్రాంతి మందిరం చేరుకునేవాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here