[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 52వ భాగం. [/box]
మోహన్ చారిత్రక నవల-4.1
[dropcap]య[/dropcap]శోనిధి జాడ ఆనాటి సాయంకాలం వరకు దొరకలేదు. పగలు రెండవ జామునుండి అతనిని వెదకడానికి నియోగించిన వేయి మందిరాలలో ఇద్దరు మాత్రం సాయంకాలానికి కృతకృత్యులయారు. ఉత్తర ప్రాకారం వేపు తుప్పలలో అతని శరీరం చిక్కుకొని ఉంది. ఏటి వరదలు గట్లు దాటి ప్రవహించినప్పుడీ శరీరం తుప్పలలో చిక్కుకుంది.
యశోనిధి మహా పరాక్రమవంతుడు. అపరిమిత ధైర్యశాలి. సకల విద్యల యందు నిష్ణాతుడు. అతడు జేట్ఠ తిస్స మహారాజుగారి అంగరక్షకుడే కాదు – అతని కుడి భుజం.
గడచిన రాత్రి మహారాజుగారి రహస్యమందిరంలో ఒక అత్యవసర సమావేశం జరిగింది. లోన మహారాజు, మహారాణి, రాజగురువులు సంఘమిత్రులు మాత్రమే ఆసీనులై ఉన్నారు. మందిర ద్వారం దగ్గర నిలబడ్డ యశోనిధికి వారి సంభాషణ స్పష్టాస్పష్టంగా వినిపిస్తూనే ఉంది.
ఏ అర్ధరాత్రి సమయానికి అతడు ఇంటికి తిరిగివచ్చాడు. ఆహారం భుజించలేదు. కనీసం పాలైనా తాగలేదు. వీధి వసారాలలో అతను తిరిగాడు. దర్మసంకటంలో పడ్డాడు. రహస్య మందిర ద్వారం దగ్గిర అతని చెవిని పడిన సంభాషణ చాల తీవ్రమైనది. మహారాజు ఒక నిశ్చయానికి వచ్చారు. శ్రమణుడిని ప్రజలముందు దోషిగా నిరూపించి శిక్షించాలి. వయసులో ఉన్న శ్రమణుడు దేనికి లొంగినా లొంగకపోయినా సుందరి యైన యువతి ముందు లొంగకతప్పదు. లొంగకపోతే అతడు బుద్ధుడితో సమానుడు. లొంగితే అతడు మామూలు మనిషి. మాయ వేషం ధరించిన భిక్షువు – కుహనా శ్రమణుడు – శిక్షార్హుడు – ఆదినుండి లంకలో థేరవాదం వ్యాప్తమై ఉంది. హీనయాన సంప్రదాయం బలమైన వేళ్లు తన్నింది. మహా విహారవాసులీ మూల సిద్ధాంతాన్ని అనుసరించిన వాళ్లు. మహా కచ్ఛాయనుడు దీని స్థాపకుడు. అతడు ఉజ్జయనీ నివాసి. థేరవాదానికి కౌశాంబి, ఉజ్జయిని కేంద్రాలు. వీరు త్రిపిటకాలకు పాలీ భాషకు అనుసంధానం చేశారు. అశోకుని కుమారుడు మహిందుడు పాలీ త్రిపిటకాలను తనతో లంకకు తీసుకొని పోయాడు. సింహళంలో రెండు పెద్ద బౌద్ధ విహారాలున్నాయి. ఒకటి మహా విహారము – రెండవది అభయ గిరి విహారము.
మహా విహార వాసులైన బౌద్ధ భిక్షువులు థేరవాదాన్ని అనుసరిస్తాడు. పాలీ భాషలో త్రిపిటకాలను పఠిస్తారు.
ఈ సాంప్రదాయం వోహారికతిస్సుని కాలం వరకు ఉచ్చస్థితిలో ఉంది.
మహాయాన సిద్ధాంతాన్ని మహా వంశంలో వేతుల్య వాదమంటారు. దీనిని దీప వంశంలో వితండవాదమంటారు. అభయగిరి విహార వాసులు దీనిని స్వీకరించారు. మహా విహార వాసులు ప్రతికూలించారు.
వోహారికతిస్సుడు అభయ గిరివాసులను దేశం నుండి బహిష్కరించాడు.
గోఠాభయుడి కాలంలో ఈ వితండవాదం తిరిగి తలెత్తింది. అతడు కూడా దీనిని నిషేధించి అరవైమంది అభయ గిరివాసులై భిక్షువులను దోషులుగా ఎంచి దేశం నుండి బహిష్కరించాడు.
సంఘమిత్రులు గోరభయ మహారాజుగారి పుత్రులు జేట్ఠతిస్సులకు, మహా సేనులకు గురువులు. అభయ గిరివాసులైన వితండ వాదులు పొందిన ఇక్కటులకు బాగా చలించిన వారు. రాజపుత్రులకు గురువులుగా కుదురుకొని, జేట్ఠతిస్సమహారాజును అభయగిరి విహారవాసుల పట్ల ఆదరం చూపించేటట్లు చేశారు. థేర వాదులను వితండ వాదాన్ని అనుసరించవలసిందని బలవంతం చేశారు. మహా విహారానికి చెందిన ఆస్తులను స్వాధీనం చేసుకున్నారు. మహా విహార వాసుల సంఘారామాలను దోపిడి చేయించారు. కొల్లగొట్టిన ధనాన్ని అభయగిరి విహారానికి సమర్పించారు.
జేట్ఠ తిస్సమహారాజు జేతవన విహారాన్ని సుసంబద్ధం చేశారు. అందులో దివ్యమైన స్తూపాన్ని నిర్మించారు. ఇది సింహళంలో గల స్థూపాలలో పెద్దది.
సంఘమిత్రులు, మహారాణి, మహారాజు అందరూ థేరవాదానికి శత్రువులే. శ్రమణుడు థేరవాదియైన శీలప్రతి శిష్యుడు. హీనయానానికి చెందినవాడు. అందుకే మహారాజు, శ్రమణుడికి ఈ విషయాలు తెలియకుండా ఉంచారు.
శ్రమణుడిని తొలగించడం అంత కష్టమైన పనికాదు. కాని, సంఘ మిత్రులకే ధైర్యం కలుగలేదు. శ్రమణుడు వర్చస్వి – మితభాషి – అతనిని చూస్తేనే రోగాలు తొలగిపోతాయి. ప్రజల హృదయాలలో అతడు స్థిరపడ్డాడు. రెండు నాళ్లకింద ఒక సంఘటన జరిగింది. మహా విహారానికి చెందిన ఒక శిథిల సంఘారామంలో వయసు మళ్లిన భిక్షువులు కొద్దిమంది ఇంకా తల దాచుకున్నారు. వారిలో ఒకరు అస్వస్థులుగా ఉండి, శ్రమణుడికి కబురు పంపారు. వస్సావాసం తాత్కాలికంగా విడువడానికి ఈ పిలుపు చాలు. విశ్రాంతి మందిరం పరిచారకుడు శ్రమణుడిని అనుసరించాడు. శ్రమణుడు వృద్ధ భిక్షువుతో కొంతకాలం గడిపి తన వసతికి తిరిగి వచ్చాడు. ఆ పరిచారకుడు మహారాజు నియోగించిన చారుడు. ఆ రాత్రే అతడు జరిగినదంతా ప్రభువుకు నివేదించాడు. అపుడొక విషయం శ్రమణుడికి స్పష్టమయింది. థేరవాదులు మహారాజుగారి శత్రువులు. వారిని హింసించడమే ప్రభువు ధ్యేయం.
ఆ మరునాటి రాత్రే రహస్య సమావేశం జరిగింది. శ్రమణుడి మీదికి, మారుడి కుమార్తెను ప్రయోగించి అతనిని స్త్రీలోలుడిగా ప్రజలలో చాటి బహిరంగంగా శిక్షించాలి.
ఈ మహారహస్యం యశోనిధి చెవిని పడింది.
ఆ క్షణం నుండి అతనికి శరీరం మీద వేయి తేళ్లు పాకినట్లయింది. శ్రమణుడు మహా వైద్యుడు. తన ఏకైక పుత్రుని మృత్యువు నుండి తప్పించి తన వంశాన్ని నిలబెట్టిన వాడు. జనులకు ఆరాధించ దగినవాడు. సిద్ధాంత పరమైన విభేదాలు పరిగణించి, మహారాజు, అతనిని ఈ లోకం నుండే తొలగించడానికి నిశ్చయించాడు. సంఘమిత్రుల ఆలోచన యిది.
ఈ కుట్ర వెనుక మహారాణి స్వార్థం కూడా లేకపోలేదు. ఆమె పరివారంలో ఒక చక్కని యవన యువతి ఉంది. మహారాజు కంట ఆ కన్య పడకుండా ఆమె అన్ని జాగ్రత్తలు తీసుకుంటున్నాది. ఆమెను మారుని కూతురుగా శ్రమణుడి మీద ప్రయోగించడానికి మహారాణి ముందుకొచ్చింది.
శ్రమణుడు గొప్ప శీలవంతుడు కావచ్చు. ఇంద్రియ నిగ్రహం కలవాడు కావచ్చు. మహారాణి పన్నిన కుట్ర నుండి తప్పించుకోడం మాత్రం అతనికి సాద్యపడకపోవచ్చు.
శ్రమణుడిని రక్షించాలి.
తాను ఈ మహారహస్యాన్ని ఎట్లు బయట పెట్టగలడు?
శ్రమణుడు చనిపోరాదు.
(సశేషం)