శ్రీపర్వతం-53

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 53వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-4.2

[dropcap]అ[/dropcap]తనికీ రహస్యం తెలియనక్కరలేదు.

హెచ్చరిక చాలు.

యశోనిథి ఈ నిర్ణయానికి వచ్చేసరికి బాగా వెలుతురు వచ్చింది.

శ్రమణుడిని హెచ్చరించిన తరువాత యశోనిధి తన యింటికి పోలేదు. తిన్నగా నదివేపు నడిచాడు. తాను రాజద్రోహి. ఆంతరంగికమైన విషయాన్ని శత్రువుకు నివేదించాడు. నియమాన్ని అతిక్రమించి బ్రతకడం కన్న ఆత్మవంచన లేదు.

నదిలో మునుగుతూ అతడు ఒకటే ప్రార్థన చేశాడు. “ఓ పరాత్పరా! లోకానికి ఉపకారం చేసే శ్రమణుడిని రక్షించు”.

శ్రమణుడికి యశోనిధి మరణం గురించి, ఆ రాత్రి విశ్రాంతి మందిరం పరిచారకులలో ఒకడు తెలియజేశాడు. కళింగ భూపతి ఆనాటి మధ్యాహ్నం కనిపించనే లేదు. బహుశా అతడు కూడా యశోనిధికై వెదుకుతున్నాడని శ్రమణుడు భావించాడు.

మరునాడు ఉదయం పరిచారకుడు వెంటరాగా శ్రమణుడు యశోనిధి గృహానికి పోయి దుఃఖంలో నున్న అతని సతీమణిని పుత్రుడిని ఓదార్చాడు. శవానికి దహన సంస్కారమైనంత వరకు శ్మశానంలో కూర్చున్నాడు. సాయంకాలానికి విశ్రాంతి మందిరానికి తిరిగి వచ్చాడు. ఆ రాత్రి పద్మాసనంలో ఉండి ఆలోచనలన్నీ కేంద్రీకరించాడు. అవన్నీ శూన్యంలో అంతమయాయి.

అటు తరువాత దినాలు దొర్లిపోయాయి.

వర్షాలు క్రమంగా తగ్గాయి.

కళింగ భూపతి అంత తరచుగా కనిపించలేదు. కనిపించినా అంతగా మాట్లాడడం లేదు. మాట్లాడినా అందులో ఆప్యాయత కరువయింది.

ఎవరో రోగులు వస్తున్నారు వెళ్తున్నారు. వర్షావాసం ముగియడానికి తొమ్మిది దినాలు మాత్రమే మిగిలాయి.

ఆ రాత్రి శ్రమణుడు వేగంగా నిద్రపోయాడు.

హఠాత్తుగా అతనికి తెలివి వచ్చింది. అతడు చుట్టూ చూశాడు.

ఆ పరిసరాలు కొత్తవి. అతడు కఠినశయ్య మీద లేడు. హంసతూలికా తల్పం మీద విలాసంగా నడుంవాల్చి ఉన్నాడు.

అతని తల్పం విశాలమైన దీర్ఘ చతురస్రాకార మండపం యొక్క ఒక చివర నుంది. రెండవ చివరనో వేదికో, రంగ స్థలమో ఉంది. వేదిక దీపాలంకృతమై ఉంది. దానిపై రత్నకంబళాలు పరచి ఉన్నాయి. వేదికకు ఒక పక్కను ఇద్దరు యువతులు వేణువులు వాయిస్తున్నారు. మరి యొక్క పక్కను యువతులిద్దరు వీణలను వాయిస్తున్నారు. మధ్యనో యిద్దరు యువతులు శ్రావ్యంగా గానం చేస్తున్నారు. ఇటు మధురమైన కంఠాలు, అటు ఈనుల విందయిన వాద్యాలు ఒకే స్రవంతిగా వెలువడుతున్నాయి.

ఆ యువతులు పాలీ భాషలో పల్లెపట్టుల శృంగార గీతాలను పాడుతున్నారు.

నీవు పెదవులను ముద్దిడుదు వంచు
నే నెరిగి కన్నులను మూసితి రవంత
గాడముగ నా తనువు కౌగిలించినయంత
కఠినుడా! మరచితిని కట్టుకథలన్ని.

ఆ యువతులలో ఒకతె పాటనాపింది. వేణువులు, వీణలు వాయిస్తున్న యువతులు నిశ్చలంగా కూర్చున్నారు.

పాట పాడుతున్న యువతులలో రెండవ ఆమె – లేచి నిలబడింది. రెండడుగులు ముందుకు వేసింది. ఆమె కాలి అందెలు ఘల్లుమన్నవి.

ఈ వసంతమ్మెపుడు నావాకిటను నిలిచె?
పూవులన్నియు నవ్వె
తావులన్ని పిలిచె.
పూవుటమ్ములతోను
పొంచెనట మారుండు
కంపించె ప్రియురాలి
కఠినస్తన ద్వయము.

ఆమె లాస్యం చేసింది. అపుడు ఆరుగురు యువతుల కంఠాలు ఏకమై గానం చేశాయి.

రమ్ము నా ప్రియతమా!
రమణీ మణీ హృదయ
రత్న పీఠమ్ముపై రాజ్యమ్ము నేలగా!

సింహళ వాసులు శ్యామల వర్ణులు – కాని, ఈ యువతులు మాత్రం ఒక చాయ మెరుగుగా ఉన్నారు. వారు సర్వాంగ సౌష్ఠవం కలవారు. కాముకుల హృదయాలను సులువుగా దోచుకోగలవారు.

తొలికోడి కూసింది.

ఆరుగురు యువతులు లేచి నిలుచున్నారు. దోసిళ్లతో పూలు విరజల్లారు, శ్రవణుని వేపు తిరిగి.

గవాక్షమెదో తెరచుకుంది. చల్లని గాలి లోనికి ప్రవేశించింది. గాలిలో ఒక సౌరభం. ఆ సౌరభం అంచెంలంచెలుగా మండపంలో వ్యాపించింది. పలుచని పొగ – ఆ పొగ తెరలో యువతులు మాయమయారు.

ఆ పొగ శ్రమణుని చుట్టుకుంది. అతనికి ఆవులింతలు వచ్చాయి. కనులు మూతలు పడ్డాయి. మృదుతల్పం మీద అతను ఒరిగిపోయాడు.

శ్రమణుడికి తెలివి వచ్చింది. బాగా వెలుగు వచ్చింది.

అతడు తన కఠినశయ్యమీదే ఉన్నాడు. విశ్రాంతి మందిరంలో పరిచారకులు వాళ్ల వాళ్ల పనులమీద ఉన్నారు.

శ్రమణుడు సావకాశంగా లేచి కార్యాలు తీర్చుకున్నాడు. స్నానాదులు ముగించాడు. వినయపిటకంలో కొన్ని ఖండికాలను వర్ణించాడు. ముందు వసారాలో కొద్దిమంది రోగులుంటే వారిని పరీక్షించి ఔషధాలను ఇచ్చాడు.

కళింగ భూపతి రెండు రోజులై రాలేదు. ఈ రోజు కూడా అతడు వచ్చే సూచనలు కనిపించలేదు.

మధ్యాహ్న భోజనానికి చాల వేళ ఉంది.

శ్రమణుడు ఆవరణలో నున్న మామిడి చెట్ల కింద ఆలోచిస్తూ ముందు వెనుకలకు నడుస్తున్నాడు.

రాత్రి జరిగిన విషయాలను అతడు వరుసగా జ్ఞాపకానికి తెచ్చుకున్నాడు.

రాత్రి అతనికి పరిచారకుడు మామూలు వేళకే మరిగిన పాలు చల్లార్చి యిచ్చాడు. పాలలో శర్కర వేయనే వేశాడు. అదికాక ఏలకుల పొడి, జాపత్రి – సుగంధ ద్రవ్యాల పొడులు వేశాడు. శ్రమణుడు మెల్లమెల్లగా తాగి ఏదో ఆనందాన్ని అనుభవించాడు.

రాత్రి వేగంగా నిద్ర వచ్చింది. మెలకువగా ఉండడానికి అతడు ప్రయత్నించాడు. కాని లాభం లేకపోయింది.

అతడు చాల శాస్త్రాలు చదువుకున్నాడు. కాని నాట్యం, అంగరాగాదులను ఉపయోగించడం, కామశాస్త్రం మొదలైన శృంగారకళలను అధ్యయనం చేయలేదు. కఠోరమైన బ్రహ్మచర్యం పాటిస్తున్నాడు. స్త్రీని సూటిగా ముఖంలోకి చూడలేదు. సర్వసంగ పరిత్యాగియై, అన్నీ విడిచి పరివ్రజించే అతడు ఈ విశ్రాంతి మందిరంలో రాజుగారి బందీగా ఉండిపోయాడు.

శ్రమణుడు ఈ మర్యాదలన్నీ పక్కకు పెట్టి వెళ్లిపోగలడు. కాని భగవానుడు ఒక విషయం నొక్కి చెప్పారు. రాజుల ఆజ్ఞలను గౌరవించమని.

ఆ వేణుగానం, వీణానాదం ఎంత రమ్యంగా ఉన్నాయి! ఆ యువతులు ఎంత మధురంగా గానం చేశారు. వాళ్లెంత చక్కని వాళ్లు. వారి గమనంలో ఎంత విలాసముంది? వారి నవ్వులలో ఎంత చిలిపి తనముంది?

అతని తలపులలో వారి ఒంటి చక్కదనాలు మెరిశాయి. అతని శరీరం పులకించింది.

పరిచారకుడు భోజనానికి పిలవడంతో అతను ఈ లోకంలోకి వచ్చాడు.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here