శ్రీపర్వతం-56

0
3

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 56వ భాగం. [/box]

మోహన్ చారిత్రక నవల-4.5

[dropcap]“అ[/dropcap]య్యో! ఎంత నిర్దయులు మీరు! ఆమె చేసిన నేరమేమిటి?”

“ఈ మారపుత్రిక మానవసమాత్రుడైన శ్రమణుని లోబరచుకోలేకపోయింది.”

“ఈ నేరానికి ఇంత కఠిన శిక్షా?”

“నేరం నేరమే! శిక్ష శిక్షే! శ్రమణులు ఈ సుందరిని స్వీకరించినట్లయితే ఈ కృష్ణాహి మిమ్మల్నే కాటువేసేది.”

“ఓ! మహారాజులు ఎంతటి దారుణమైన శిక్ష విధించారు. ఈ ఉత్తమరాలికింత కఠినమైన శిక్ష వేచియుందని తెలిస్తే, చాల సంతోషంతో ఈమెను స్వీకరించి, శిక్షననుభవించేవాడిని. అయ్యో! ఎంత ఘోరమయింది! బుద్ధ భగవానుడి పాదాలు మోపిన సీహళదేశమే కరుణకు దూరమయి, ఈ విధంగా ప్రవర్తిస్తే ఎవరిని నిందించాలి? ఓ భూపతి! నన్నుకూడ ఈ సర్పానికి బలి పెట్టవయ్యా!”

“శ్రమణా! మీకు శిక్ష పడితే మహారాజుగారి అభిమతం తీరుతుంది. యవన సుందరికి శిక్షపడితే మహారాణిగారి అక్కసు తీరుతుంది. ఈ న్యాయానికి కళ్లూ లేవు, చెవులూ లేవు. మీరు శ్రమణులు – ద్వంద్వాతీతులు – అనురాగానికి ద్వేషానికి, సుఖానికి దుఃఖానికి దూరమైనవారు. మీరు కూడా సాధారణ మానవులవలె పరితపిస్తారని నేననుకోలేదు.”

కళింగ భూపతి ముందునడిచాడు –

మిగిలిన వాళ్లు అతనిని అనుసరించారు –

శ్రమణుడు అక్కడ నిలబడిపోయాడు –

గొంతెత్తి అరవాలనుకున్నాడు – గొంతు బిగుసుకు పోయింది.

ముందు పోతున్న వారికి అడ్డుపడి తన ప్రాణాలు కూడా తీయమని చెప్పాలనుకున్నాడు. కాళ్లు ముందుకు పడలేదు.

ఆ స్థితిలో అతడు కొద్ది క్షణాలు ఉండిపోయాడు. క్రమంగా అవయవాలు అతని స్వాధీనంలోకి వచ్చాయి. మెల్లగా అడుగులు వేసి విశ్రాంతి మందిరం చేరుకున్నాడు. స్నానాదులు ముగించాడు. పరిశుభ్రమైన వస్త్రాలు ధరించాడు.

రాజోద్యోగి ఒకడు వచ్చి, మహారాజులు వెంటనే శ్రమణుడిని రాజ సభకు పిలుస్తున్నారని విన్నవించాడు.

సభ నిండుగా ఉంది. ఒక వంక ఆచార్యులు, భిక్షు సంఘం ఉన్నవి. రెండవ వంక దేశంలో గౌరవనీయులైన ఉన్నత కుటుంబాలవారు, రాజ ప్రతినిధులు ఉన్నారు.

శ్రమణుడు సభను ప్రవేశించగనే గౌరవ సూచకంగా సభ సభ అంతా లేచి నిలబడింది. అందరికీ ఆసనాలున్నాయి. ఆసనం లేనివాడు శ్రమణుడు. అందరూ కూర్చున్నా అతను మాత్రం నిలబడే ఉన్నాడు. పసుపు రంగు బట్టలు, నిర్మలంగా తోచే అతని ఆకృతి, వ్యథాపీడితమైన అతని ముఖం సభ్యులను ఆలోచనా పరులను చేశాయి.

అపుడు మహారాజు స్వయంగా మాట్లాడారు – వారికి ఇరుపక్కల నున్న ఆచార్య సంఘ మిత్రులు కాని, వేతుల్య వాదాన్ని సమర్థించే ఆచార్యులు కాని ఏమీ పలుకలేదు.

“శ్రమణులు సీహళ భూమిమీద చరణాలు మోపి నేటికి ఆరుమాసాలు పూర్తయాయి. ఈ రోజుతో వారి వర్షావాసం కూడా ముగిసింది. ఈ ఆరుమాసాలు ఆనందులు మేము పెట్టిన పరీక్షలన్నిటిలోను నెగ్గుకొని వచ్చారు. శ్రమణులు మోసకారులో బుద్ధ భగవానుని కృపకు పాత్రులో తెలుసుకోడానికి మాకింతకాలం పట్టింది. శ్రమణ ఆనందులను చాల కఠినమైన పరీక్షకు గురిచేశాము. కాంతా కాంచనాల యందు సాధారణ మానవుడికి ఉపేక్ష ఉంటుంది. ఆనందులు సిక్కమాణులుగా, శ్రమణులుగా శిక్షణ పొందారు. వీరి మనోనిగ్రహానికి అవధులు లేవు. మన దేశమంతటిలోను, చెప్పవలసి వస్తే దేశాలన్నిటిలోను, మహా సౌందర్యవతియైన యవన సుందరిని శ్రమణుల ప్రలోభానికి నియోగించాము. ఆమె తన కౌశలమంతా వినియోగించినా శ్రమణులను లోబరుచుకోలేక పోయింది.”

శ్రమణుడు గొంతెత్తి సభికులందరికీ చెప్పాలనుకున్నాడు. మహారాజులు నిర్దాక్షిణ్యంగా ఒక అమాయకురాలిని ఘోరాతి ఘోరంగా చంపించారని ఎలుగెత్తి అరవాలనుకున్నాడు. కాని అతని గొంతు బిగుసుకుపోయి ఒక్క పలుకు కూడా పైకి రాలేదు.

మహారాజులు తిరిగి చెప్పడానికి ఉపక్రమించారు.

“శ్రమణ ఆనందులు స్పఠికం వలె నిర్మలమైన వారు. వీరిని గౌరవించడం మన కర్తవ్యం. మీకందరికీ తెలుసు. రథికుడు దేవయ, కదర మరయ తటాకం తవ్వించాడు. ఒక గ్రామం కొత్తగా అక్కడ వెలసింది. తటాక జలాల పంపకం వలన లభించే కప్పాన్ని, మిగిలిన పన్నుల వలన లభించే ఆదాయాన్ని మా పూర్వులైన మహారాజు కనిట్ఠతిస్సులు శ్రీ పర్వతం పైగల బోధి గృహానికి, శాశ్వత దానంగా అనుగ్రహించారు. అంతేకాక, శ్రీ పర్వతం పైనున్న మహా విహారంలో మహారాజులు ఉపోసథా గృహమొకటి భిక్షు సంఘం కోసం నిర్మాణం చేయించారు. గిరి గ్రామ తటాకం నుండి, కొరవియతటాకం నుండి లభించే నీటిపన్ను, మాలకేటకకేదారం నుండి లభించే పంటల పన్ను ఈ మహావిహారానికి దానంగా దత్తం చేశారు. శ్రీ పర్వతం పైనున్న బోధి వృక్ష ప్రాసాదం చాల పవిత్రమైనది. మన ఆచార్యుల కోసం, భిక్షువుల కోసం, భిక్షుణుల కోసం, క్షుల్ల ధర్మగారి పైనున్న విహారంలో రాతి పలకలు తాపిన మండపం, చైత్యగృహం, గోవా గ్రామనివాసిని యైన ఉపాసిక బోధిసిరి నిర్మించి యిచ్చింది. మన ఆచార్యులు కాశ్మీర, గాంధార, చీనా, చిలాట, తోసలి, అపరాంత, వంగ, వనవాసి, యవన, దమిళ, పాలూర దేశాలలో దర్మం వ్యాప్తి చేశారు. తామ్రపర్ణి ద్వీపం విషయంలో చెప్పనే అక్కరలేదు. ప్రతి సంవత్సరం మనం భిక్షుసంఘంవారి కొరకు విహినీమలై, గిరి గ్రామాలనుండి వచ్చే ఆదాయాన్ని శ్రీ పర్వత విహారాలకు కొనిపోడానికి ఏర్పాటులు జరుగుతున్నాయి. ఈ వత్సరం, గడచిన వంద సంవత్సరాలకు వలె, నావనొకటి సిద్ధంచేసి, ధాన్యాన్ని, ధనాన్ని, సుగంధ ద్రవ్యాలను, మంచి గంధపు చెక్కలను కృష్ణ వర్ణ మహానదీ దక్షిణ తటాన్న గల విజయపురి మీదుగా, శ్రీ పర్వత విహారాలకు పంపుతున్నాము. శ్రమణ ఆనందులు శ్రీ పర్వత విహారాలలో తాము కోరిన భిక్షుసంఘంలో చేరి పవిత్రమైన జీవితాన్ని గడుపుతారు. మీకందరికీ తెలుసు. ఆనందులు మహా భిషక్కులని. శ్రీ పర్వత విహారాలలో ఒకదాని యందు ‘విగత జ్వరాలయ’ మన్న విఖ్యాత వైద్యశాల ఉంది. రెండు సంవత్సరాలయి, ఎవరో కించిత్ వైద్య జ్ఞానం కల భిక్షువులు దానిని నడుపుతున్నారు. శ్రమణ ఆనందులు విగత జ్వరాలయ ప్రధాన వైద్యులుగా భిక్షు సంఘాలకు, ఉపాసకులకు, సర్వజనావళికి సేవ చేయగలరు. ఈ విషయాలన్నీ శ్రేష్ఠి కుమార నందికి మన రాజదూత స్వయంగా వన్నివించగలడు. శ్రేష్ఠి ప్రముఖుడు మన పనులన్నీ సక్రమంగా నెరవేర్చగలడు.”

మహారాజులు ఒక క్షణం మౌనం వహించారు. తరువాత అన్నారు.

“అపరాహ్నం సమీపిస్తున్నది. శ్రమణుల కోసం రాజమాతంగం, పరివారం వేచి యున్నవి. ఇది యా ఆజ్ఞ”.

శ్రమణుడికి దేనిని కాదనడానికి వీలు లేకుండా మహారాజు ఆజ్ఞాపించారు. సభికుల ఆమోదించారు.

శ్రమణుడు అందరికీ నమస్కరించి ఛత్రవాహకుడు అనుసరించగా రాజసభ విడిచి పెట్టాడు. విశ్రాంతి మందిరంలో పరిచారకులను అందరినీ కలిసి, వారిచ్చిన లేత కొబ్బరినీరు తాగి ఆనందుడు గజారోహణం చేశాడు.

ఆనందుడు అనూరాధపురాన్ని తొలుత ప్రవేశించినపుడు దక్షిణ ద్వారం దాటి లోనికి వచ్చాడు. ఇపుడు నగరాన్ని ఉత్తర ద్వారం నుండి విడిచి పెట్టడానికి ఏర్పాటులు జరిగాయి. నగరంలోని ప్రజలు బారులు తీర్చి అతనికి వీడ్కోలు చెప్పారు.

ఉత్తర ద్వార సమీపంలో గల అగడ్తపై కర్రవంతెన దించారు. ఆ ప్రజలలో కళింగ భూపతి కనిపించాడు. మహాగజం వంతెన ఎక్కగానే అతడు గట్టిగా అరిచాడు.

“శ్రమణా! మీ మార్గాలు మంగళకరములగుగాక!”

(ఇక్కడితో మోహన్ చారిత్రక నవల ముగిసింది).

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here