Site icon Sanchika

శ్రీపర్వతం-59

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 59వ భాగం. [/box]

[dropcap]”భా[/dropcap]రతదేశంలో లభించే శాసనాలలో ‘భిక్షుణి’ అన్న పదం వస్తే, అది మహిళా బౌద్ధ భిక్షువును సూచించేందుకు తప్ప, మరొకందుకు వాడలేదు. కాబట్టి ‘భిక్షుణి’ అంటే మహిళా బౌద్ధ భిక్షువుగానే భావించాల్సి ఉంటుంది. అతి అరుదుగా ‘సమనికా’ అనో, ‘పరిజితికా’ అనో మహిళా బౌద్ధ భిక్షువులను సూచించేందుకు వాడటం కనిపిస్తుంది. కానీ అత్యధికంగా మాత్రం ‘భిక్షుణి’ అని వాడటం కనిపిస్తుంది. అశోకుడి కాలంలో లభించిన శాసనాల ఆధారంగా ఆ కాలంలో బౌద్ధ సంఘంలో భిక్షులు, భిక్షుణులు, ఉపాసకులు, ఉపాసికలు ఉండేవారని తెలుస్తోంది. బౌద్ధ సంఘం తీసుకునే నిర్ణయాలన్నీ భిక్షువులు, భిక్షుణులు కలిసి చర్చించి తీసుకునేవారని తెలుస్తుంది.

‘ఏ చుమ్ ఖో భిఖూ వా భికుణీ వా సంఘమ్ భాఖతి’ అన్న వాక్యం సారనాథ్, సాంచి, కౌశంబి శాసనాలలో కనిపిస్తుంది. దీన్ని బట్టి ప్రాచీన భారతంలో స్త్రీలు, పురుషుల నడుమ తేడాలు ఉండేవి కావనీ, సమాజంలో ఇరువురి స్థానం సమానమే అని తెలుస్తుంది. స్త్రీలకు సంఘంలో ప్రవేశం లేదని గౌతమ బుద్ధుడు నిర్ణయిస్తే, ఆ నిర్ణయానికి వ్యతిరేకంగా పోరాడి స్త్రీలు భిక్షువులతో సమాన స్థాయిని సాధించుకున్నారు. సంఘానికి సంబంధించిన ప్రతి నిర్ణయంలోను తామూ పాలు పంచుకుని సమానంగా గౌరవాన్ని, నిర్ణయాధికారాన్ని సాధించుకున్నారు. ఈ ఆధారాలను బట్టి చూస్తే భారతీయ సమాజంలో స్త్రీని అణగదొక్కబడినదని, వంటింటి కుందేలనీ, వెనకబడి ఉన్నదనీ అనుకోవటం పొరపాటనిపిస్తుంది. ఇక్కడ భారతీయ సమాజం అంటే కేవలం బౌద్ధం మాత్రమే కాదు. బౌద్దం అప్పటి ప్రాచీన సమాజం నుంచే ఆవిర్భవించింది. బౌద్ధం లోని మహిళలు ప్రాచీన సమాజం నుంచి బౌద్ధానికి వచ్చిన మహిళలు. కాబట్టి వీరు ప్రదర్శించిన సాహసం, తెగువలకు మూలం వీరు వదిలిన సమాజంలో ఉంటుందనటంలో ఆశ్చర్యం లేదు. సంఘమిత్ర, పదిమంది భిక్షుణిలతో శ్రీలంక వెళ్ళి బౌద్ధం ప్రచారం చేయటం, ‘భిక్షుణి ఉపస్సయ’ అంటే భిక్షుణిలు ఉండే విహరాలు, వాటి వివరాలు, జీవన విధానం మనకు దీపవంశ, మహావంశ వంటి గ్రంథాల ద్వారా తెలుస్తాయి.

అశోకుడి తరువాత కూడా భిక్షుణిల ప్రాబల్యం కొనసాగింది. ఉజ్జయిని, కాకనదీ, కాచుపథ, కాపాసిగామ, కురమ, కురర, కురరఘర, చూడధీల, తుంబవన, నందినగర, పేమూల్, భోజకట, మదలచ్చికత, మహీమస్తీ, మోరగిరీ, వాఘమత, వాదివాహన, విదిశ వంటి ప్రాంతాలలో ‘భిక్షుణి ఉపస్సయ’లు విలసిల్లేయి.

‘బుద్ధ గయ’లో రాజు ఇంద్రాగ్నిమిత్ర, పెద్ద భార్య ‘కురణ్‌గీ’ను ‘అయా కురంగి’ లేక ‘ఆర్య కురంగి’ అని సంబోధించటం కనిపిస్తుంది. దాదాపుగా పదిహేనుకు పైగా శిలాశాసనాలలో ఇది కనిపిస్తుంది. ఆ కాలంలో అర్హత స్థాయి చేరుకున్న భిక్షువులను ‘అయా’ లేక ‘ఆర్య’ అనేవారు. అంటే ఆర్య అన్నది సంబోధనాత్మకమే తప్ప, జాతి వాచకం కాదనుకోవచ్చన్నమాట. కురంగి భిక్షుణిగా ముసలి వయసు వరకూ జీవించింది.

మధురకు చెందిన ‘ధనావతి’ అనే భిక్షుణి త్రిపిటకాలలో నిష్ణాతురాలని ఆమె ప్రభావం మధురలో మాత్రమే కాక, శ్రావస్తి, సారనాథ్ వంటి ప్రాంతాలకూ విస్తరించిందని హువిష్కుడి కాలానికి చెందిన శాసనాల ద్వారా తెలుస్తోంది. అమరావతిలో భిక్షుణిలకు సంబంధించి దాదాపు ఎనిమిది శాసనాలు లభిస్తున్నాయి. వీటిల్లో భిక్షుణిలను సమానికా, పరాజితికా లనటం కనిపిస్తుంది. బుద్ధ అనే భిక్షుణి థేర బెటియవందక భదంత బుధి సోదరి అన్న వివరం తెలుస్తోంది. మధురలో అయిదు, ఆరవ శతాబ్దం వరకూ భిక్షుణిల వ్యవస్థ కొనసాగిందని ‘ఫాహియాన్’ రాతల వల్ల తెలుస్తుంది. ‘భిక్షుణిలను సంఘంలోకి అనుమతించాలని అభ్యర్థించినందుకు అక్కడి భిక్షుణిలు ఆనందుడిని అర్చించేవార’ని ఫాహియాన్ రాశాడు. గుప్తుల కాలంలో శాక్యభిక్షుణి జయభట్ట ‘యశోవిహారా’నికి దానాలు ఇచ్చినట్టు ఆధారాలున్నాయి. ‘ఇంచింగ్’ అనే చైనా యాత్రికుడి ప్రకారం ‘భారతదేశంలో భిక్షుణిలు చైనా భిక్షుణిల కన్నా భిన్నం. భారత భిక్షుణిలు భిక్ష ఎత్తి జీవిస్తారు. వీరు అత్యంత సామాన్యమైన జీవితం పేదరికంలో గడుపుతున్నారు.’

‘భవభూతి’ మాలతీమాధవంలో సౌగత – పరివ్రాజిక కామందిని. ఆమె విద్యార్థినులు అవలోకిత, బుద్ధ రక్షిత, సౌదామినిల గురించి రాస్తాడు. ‘వాసవదత్త’లో ‘తారా’ను పూజించి ఎర్ర వస్త్రాలు ధరించే భిక్షుణి పాత్రను ప్రదర్శిస్తాడు. భవభూతి తన రచనలో భిక్షుణిలు దక్షిణ భారతంలోని ‘శ్రీపర్వతం’ వద్ద ఉండేవారని, వారు పసుపు రంగు వస్త్రాలు, ‘చీర-చీవర-పరిచ్ఛదా’ ధరించేవారని, వారు ‘పిండిపాతం’ మాత్రమే స్వీకరించేవారని రాస్తాడు”

చదివి దీర్ఘంగా నిట్టూర్చాడు మోహన్.

వ్యాసం పూర్తయినట్టు లేదు.

గ్రీకు చరిత్ర గురించి పరిశోధించే శశికళకు ఇంతగా బౌద్ధం గురించి పట్టు ఎలా వచ్చింది? ఇంత ఆసక్తి కలగటమే కాదు, ఇంత లోతయిన అవగాహన రావటం ఆశ్చర్యంగా అనిపించింది. ఆంతే కాదు, ఆమె ఇంతగా బౌద్ధం గురించి, శ్రీపర్వతం గురించి పరిశోధిస్తున్నట్టు ఎప్పుడూ తనకు చెప్పలేదు. తాను ఊహించలేదు.

ఆలోచిస్తూ కూర్చున్న మోహన్ అడుగుల సవ్వడి విని తల ఎత్తి చూశాడు.

నవ్వుతూ లోపలికి వచ్చింది శశికళ.

ఇప్పుడు ఆమె ముఖంలో కొద్ది సేపటి క్రితం తమ నడుమ ఏర్పడిన సాన్నిహిత్యం తాలూకూ ఛాయలు లేవు. సిగ్గు భావన లేదు. ఎంబరాస్‌మెంట్ లేదు.

ఏమీ జరగనట్టు నిర్మలంగా ఉందామె. కుర్చీలో కూర్చుంటూ అతని చేతిలో ఉన్న వ్యాసం వైపు చూసింది. చిన్నగా నవ్వింది.

“వ్యాసం పూర్తి కాలేదు. ఇంకా ఆరంభంలోనే ఉంది. ఎలా ఉంది?” అని అడిగింది.

మోహన్ ఆమె వైపు కళ్ళెత్తి చూడలేకపోతున్నాడు.

నేరం చేసి పట్టుబడ్డ వాడిలా ఉంది అతడి పరిస్థితి. తిన్నగా ఆమె వైపు చూడలేకపోతున్నాడు.

“బాగుంది” అని అతి కష్టం మీద అన్నాడు. “కానీ గ్రీకు చరిత్ర వదిలి బౌద్ధం వైపు ఎప్పుడు మళ్ళారు? పైగా భిక్షుణిలపై ప్రత్యేక శ్రద్ధ ఎప్పుడు ఆరంభమయింది?” మామూలుగా మాట్లాడాలని విఫల ప్రయత్నం చేస్తూ అన్నాడు.

ఆమె నవ్వింది.

“భిక్షుణిల విగ్రహం మన తవ్వకాలలో చూసినప్పుడు. భిక్షుణి చాలా అందంగా ఉంది. చూడగానే మనోహరంగా అనిపించింది. ఇంత అందగత్తెను భిక్షుణిగా ఊహించాలంటేనే బాధగా అనిపించింది. అసలు ఒక యువతి ఎందుకని భిక్షుణిగా మారుతుందో తెలుసుకోవాలనిపించింది. అప్పటి నుంచీ పరిశోధన ప్రారంభించాను” అని హఠాత్తుగా మాట్లాడడం మానేసింది.

తలెత్తి చూశాడు మోహన్ ఆమె వైపు.

ఆమె అతడి వైపే చూస్తోంది.

“ఎందుకని తల దించుకుని కూర్చున్నారు. అంత సిగ్గు ఎందుకు పడుతున్నారు? ఏం నేరం చేశారు?” అడిగింది సూటిగా.

తడబడ్డాడు మోహన్. గొంతు లోంచి శబ్దం బయటకు రాలేదు.

“నేను అందుకే మన క్యాంపు నుంచి చెప్పకుండా వచ్చేశాను” కఠినంగా ధ్వనించింది ఆమె స్వరం.

మోహన్ తల ఎత్తి ఆమె వైపు ప్రశ్నార్థకంగా చూశాడు.

“ఎందుకు?” అడిగాడు.

“మీకు తెలివి ఉంది. ఆలోచనలున్నాయి. కానీ మీకు స్త్రీ పురుష సంబంధాల పట్ల సరైన అవగాహన ఉన్నట్టు లేదు.”

“ఎందుకని?”

“చెప్పు… ఆ రోజు నన్ను స్నానం చేస్తుంటే చూసి ఎందుకని గిల్టీగా ఫీలయ్యావు? ఎందుకని నన్ను కలవటం నుంచి తప్పించుకున్నావు?”

చాలా సేపు మౌనంగా ఉన్న తరువాత, ఆలోచనలను కూడదీసుకుని చెప్పాడు మోహన్.

“నువ్వు నేను కావాలని వచ్చాననుకుంటావేమోనన్న భయంతో.”

వారు ఆక్షణాన ఎంత సన్నిహితంగా భావించుకున్నారంటే వారికి తెలియకుండానే వారు ఎంతో సన్నిహితుల్లా ఎక వచనంలో సంబోధించుకోవటం ఆరంభించారు.

పెద్దగా నవ్వింది శశికళ.

“నాకు తెలుసు. నువ్వు ఆ సమయంలో రావని. వచ్చావంటే ఏదో ప్రాధాన్యం కల విషయం చెప్పటానికేనని తెలుసు. నేను ఆ సమయంలో అలా ఉండటంలో నా తప్పు లేదు. నన్ను అలా చూడటంలో నీ తప్పు లేదు. నీతో అంత పరిచయం ఉన్న నేను నిన్ను ఎలా అపార్థం చేసుకుంటానని అనుకున్నావు? నిజం చెప్పు. నిజం చెప్పలేకపోతే ఇప్పుడే వెళ్ళిపో. గెటౌట్ నౌ ఇట్‍సెల్ఫ్” ఆమె ఎంతో నెమ్మదిగా మృదువుగా అంది. కానీ ఆమె కళ్ళు నిప్పులు కురిపిస్తున్నాయి.

మోహన్ కదలలేదు. తల వంచుకుని కూర్చున్నాడు.

ఆమె అతడినే చూస్తూ కూర్చుంది.

“మోహన్… ప్రపంచంలో అత్యంత దౌర్భాగ్యకరమైన పరిస్థితి ఏమిటో తెలుసా? నిజం చెప్పే అవకాశం వచ్చి కూడా నిజం చెప్పలేనితనం. వాడిని మించిన దౌర్భాగ్యుడు ఈ ప్రపంచంలో ఇంకెవరూ ఉండరు.”

చివుక్కున తల ఎత్తాడు మోహన్.

“నా మనసులో ఉన్న భావన ఆ క్షణాన స్పష్టమయింది. దాన్ని ఆమోదించలేకపోయాను. అణచలేక పోయాను. నీకు చెప్పలేకపోయాను. చెప్పకుండా ఉండలేకపోయాను. నువ్వు కాదంటే భరించలేను. ఆ తరువాత మనిద్దరం కలిసి ఆరోగ్యకరమైన వాతావరణంలో పని చేయలేము. వాతావరణాన్ని పాడు చేయటం నాకు ఇష్టం లేదు. ఏం చేయాలో తోచలేదు. నేను ఆలోచించికుని నా పై అదుపు తెచ్చుకునేలోగా నువ్వు వెళ్ళిపోయావు.”

“ఫోన్ చేయవచ్చు. కలవవచ్చు.”

ఆ తరువాత జరిగినదంతా గబగబా చెప్పాడు. చివరికి సెక్రటరీ విషయం కూడా చెప్పాడు.

“నిన్ను కలవటానికి నాకు ఒక కారణం దొరికింది. ఎలా అనుకున్నా, నా సమస్య వీడిపోయింది” చెప్పవలసిందంతా చెప్పేసి నిట్టూర్చాడు మోహన్.

చాలా సేపు శశికళ ఏమీ మాట్లాడలేదు. చేతిలో ఉన్న పేపర్ వెయిట్‌ను తిప్పుతూ దాని దిక్కే చూస్తూ కూర్చుంది.

“మోహన్…”

ఆమె తనని పేరుతో పిలవగానే పులకించిపోయాడు మోహన్. అది అతని ముఖంలో స్పష్టంగా కనిపించింది.

“నేను నీకు ఎన్నో సార్లు చెప్పాలని చెప్పలేకపోయాను ఓ విషయం.

నేను గ్రీకు చరిత్ర చదవటం మొదలుపెట్టినప్పటి నుంచీ నాకు ఒక కల వస్తుండేది. నేను ఎవరో ఒక యువకుడిని ప్రేమిస్తున్నానట. అతడితో సముద్రాల్లో, తుపానుల్లో ప్రయాణం చేస్తున్నానట. నన్ను అతడు రక్షిస్తున్నాడట. కల సరిగ్గా గుర్తు లేదు కానీ ఆ యువకుడి రూపం మాత్రం మెదలుతోంది, అస్పష్టంగా, నా మనసులో. నిన్ను చూసినప్పటి  నుంచీ ఎక్కడో చూసినట్టు అనిపించింది కానీ ఎక్కడో తెలియలేదు. ఆ రోజు నేను స్నానం చేసినప్పుడు, నువ్వు నన్ను చూసిన చూపు, నీ ముఖంలో ఒక అద్భుతాన్ని చూస్తున్న ఆనందాశ్చర్యాలతో పాటు, నీ కళ్ళల్లో పవిత్రమైన శిల్పాన్ని చూస్తున్న భావన నాకు నిన్ను ఎక్కడ చూశానో గుర్తుకు తెచ్చాయి. నేను కలలో చూసింది నిన్నే.”

అప్రతిభుడయి ఆమె వైపే చూస్తుండిపోయాడు మోహన్. అతని మనసులో తనకు కలలో కనిపించి విజయపురి చూపించి, ప్రేమించిన ‘సెలీనా’ మెదలుతోంది.

“ఆ రోజు నిన్ను చూడగానే నా మనసులో ఒకే పేరు మెదిలింది. ఆనందుడు…”

మోహన్ పెదిమలు కదిలాయి కానీ మాట రాలేదు.

“మోహన్… నువ్వు నన్ను చూసి వెళ్ళిపోవటం, తరువాత నన్ను కలవాలని ప్రయత్నించక పోవటం నాకు నిరాశ కలిగించాయి. నువ్వు నన్ను తిరస్కరించావనుకున్నాను. ఎంతో మంది లాగే స్త్రీ శరీరం అంటే భయం అనుకున్నాను. శరీరం దాటి మనసును చూడలేని అంధత్వం నీకూ ఉందనుకున్నాను.”

అప్పుడు చెప్పాడు మోహన్ గబగబ సెలీనా కల గురించి, తనకు దొరికిన విగ్రహం గురించి… అది మంటలలో కాలిపోవటం గురించి.

ఇద్దరూ ఏదో లోకంలో ఉన్నట్టు ఒకరివైపు ఒకరు చూస్తుండిపోయారు. ఇద్దరిలో శశికళ ముందు తేరుకుంది.

“ఇప్పుడు సెక్రటరీ ప్రతిపాదనను ఏం చేద్దామనుకుంటున్నావు?”

“నేను ఒక్కడినే నిర్ణయం తీసుకోలేను. ఇది మనిద్దరం కలసి పని చేసిన ప్రాజెక్టు. ప్రాజెక్టు నిధులు నా పేరు మీద మంజూరయినా, నాతో కలిసి పని చేసేందుకు నిన్ను ఎంచుకున్నాను. కాబట్టి దీనిమీద ఇద్దరికీ హక్కు ఉంటుంది. అందుకే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఇద్దరం కలిసి తీసుకోవాలి. అందుకే నీ దగ్గరకు వచ్చాను. ఇప్పుడు నీ వ్యాసం చూశాక, నా ఆలోచన మారింది. ఈ అంశం లేకపోతే నా రిపోర్టు అసంపూర్ణం. ముఖ్యంగా ఆ కాలం మహిళలకు ఉన్న స్వేచ్ఛ, ఆత్మవిశ్వాసం, ఆత్మగౌరవం, నిర్ణయాధికారం వంటి విషయాలను వదిలి నేను ఇచ్చే ఏ నివేదిక కూడా సంపూర్ణం కాదు. నాది నివేదిక, నీది సిద్ధాంతం” అన్నాడు మోహన్ మనస్ఫూర్తిగా.

“ఎదుటివారి గొప్పను ఒప్పుకునే సహృదయుడివి కాబట్టే నీకు బ్రతకడం రావటం లేదు.”

“అందుకే నాకు తోడుగా ఉండగలవా? అని అడగాలని వచ్చాను” మోకాళ్ళపై కూర్చుని అడిగాడు మోహన్.

అతడి వైపు పరిశీలనగా చూసింది శశికళ.

(సశేషం)

Exit mobile version