శ్రీపర్వతం-6

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం‘ అనే చారిత్రక నవలలో ఇది 6వ భాగం. [/box]

11

[dropcap]మ[/dropcap]రునాడు గురువారం సాయంకాలం అయిదు గంటలకు క్లబ్బులో ఉపన్యాసమని నోటీసు వచ్చింది. శశికళ, మోహన్ ఇద్దరూ మెంబర్లుగా చేరారు. సాధారణంగా నెలకొక సమావేశం క్లబ్బులో జరుగుతుంది. అప్పుడు స్కాలర్లందరూ కలిసి పిచ్చాపాటి మాట్లాడుకోడం, తమ అనుభవాలను మననం చేసుకోడం, తాము సాధించిన విజయాల గురించి ఉత్సాహంతో ఉపన్యాసమివ్వడం చేస్తారు.

ఇంతవరకు మోహన్ కాని, శశికళ కాని ఆ సమావేశాలలో మాట్లాడలేదు. చెప్పుకోవలసి వస్తే, వాళ్ళు తవ్వకాలలో ఇంతవరకు సాధించింది ఏమీలేదు. శశికళ తన గ్రీసు దేశపు అనుభవాలను గురించి చెప్పాలనుకుంది. కాని, ఆలోచించి ప్రస్తుతానికి వాయిదా వేసింది. మోహన్‌కి పాత అనుభవాలు లేవు. అతడు కూడా మరొకరి ఉపన్యాసం వినడమే మంచిదని ఒక నిర్ణయానికి వచ్చాడు.

ప్రతి దినం వాళ్ళిద్దరూ సైటులో శ్రమపడుతున్నారు. ట్రయిల్ ట్రెంచ్‌లు కాక మిగిలిన ట్రెంచ్‌లలో కూడా వాళ్ళకి ఏవిధమైన చారిత్రకాధారాలు లభించలేదు. తవ్వకాలలో ఇక్ష్వాకుల నాటి మట్టి పొరలో ఎండిన మొక్కలు, వేళ్ళు మాత్రం లభిస్తున్నాయి. మొక్కల ఆకులు మాత్రం కుళ్ళి మట్టిలో కలిసిపోయాయి. మొక్కల రెమ్మలు, వేళ్ళు ఎండిపోయినా మట్టిలో కలిసిపోలేదు. ఆ లేయరు క్రింద సహజమైన మట్టి ఉంది. మరే సంస్కృతికి సంబంధించిన వస్తువులు లేవు.

ఆ వేళ్ళను, ఎండిన కొమ్మలను భద్రంగా ఒక చోట, దారికి అవతల పక్క పారబోయిస్తున్నారు. ప్రస్తుతానికి అవి ఏ జాతికి చెందిన మొక్కలో తెలుసుకోడానికి వ్యవధి లేదు. ఏ శిల్పమో లేక శాసనమో లేక కట్టడమో బయలు పడితే శ్రమ ఫలిస్తుంది.

మ్యూజియంలో క్యూరేటరుగా పనిచేస్తున్న ప్రసాద్ గారితో మోహన్‌కి ఈ మధ్యనే పరిచయం ఏర్పడింది. ఆయన డాక్టరు సుబ్రహ్మణ్యంగారి ఛాత్రులు. ఈ ఆయనకు శశికళను పరిచయం చేయడం కోసం, మోహన్ మూడు గంటలకే, ఆమెతో సైటు విడిచి బయలుదేరాడు.

“వీరు డాక్టర్ శశికళ! ఢిల్లీ విశ్వవిద్యాలయంలో అసిస్టెంటు ప్రొఫెసరుగా పనిచేస్తున్నారు” అన్నాడు మోహన్ శశికళను పరిచయం చేస్తూ.

క్యూరేటర్ ప్రసాద్ వాళ్ళిద్దరినీ బేబిలు ముందు కుర్చీలలో కూర్చోబెట్టి ఎటెండెంటును పంపించి కాఫీ తెప్పించారు.

“డాక్టర్ మోహన్, ఎవ్వళ్ళూ ఈ ప్రశ్న వేయనక్కర లేదు. మా ఆఫీసు ఓపెన్ ఎయిర్ మ్యూజియం పక్కనే ఉంది. మ్యూజియంకి కొంచెం ఎగువను గుట్టమీద డాక్ బంగళా ఉంది. మీరు దానిని చూసే ఉంటారు. ఆ గుట్ట పేరేమిటో తెలుసా?”

“నాకు తెలియదు” అన్నాడు మోహన్

“మేమింకా లోయలోని భాగాలను పూర్తిగా పరిశీలించలేదు. వీలు దొరికినప్పుడు కృష్ణానది గట్టున బయట పడ్డ దేవాలయాలను చూసి వస్తున్నాం. బౌద్ధుల స్థూపాలను, చైత్యాలను, విహారాలను సరిగా చూడలేదు. వచ్చిన దగ్గిరనుంచీ తవ్వకాలలోనే మునిగి పోయాం” అంది శశికళ.

“మీరు శాసనాలు చదివే ఉంటారు. ఆ శాసనాలలో ఒక స్థలం పేరు ఛూలధమ్మగిరి అని ఉంది. సంస్కృతంలో దీనిని క్షుల్ల ధర్మగిరి అంటారు. దానిమీదనే డాక్ బంగళా ఉంది.” అన్నారు ప్రసాద్.

వాళ్ళిద్దరూ చాల ఆశ్చర్యపోయారు.

“క్షుల్ల ధర్మగిరి ఒక మాదిరిగా ఎత్తుగా ఉన్న కొండ అని మేమనుకున్నాం” అన్నాడు మోహన్. .

“అదే పేరుగల బౌద్ధ విహారమొకటి ఆ గుట్టమీద, తవ్వకాలలో బయటపడింది. ఆ పవిత్ర స్థలంలో ప్రాజెక్టు ఆఫీసర్ల గురించి డాక్ బంగళా కట్టించారు. డాక్టరు సుబ్రహ్మణ్యంగారు కుటుంబాన్ని గుంటూరికి తరలించిన దగ్గిరనుంచీ, ఇది వారి రెండవ గృహమయింది. వారు సాధారణంగా సాయంకాలం ఇక్కడికి చేరుకుంటారు. వారి రాకతో గుట్ట మీది బంగళా కళకళలాడుతూ ఉంటుంది. రాత్రి పెట్రోమాక్సు లైట్లు వెలిగిస్తారు. ప్రాజెక్టులోని అతని ఆత్మ బంధువులమైన మేమందరం అక్కడ చేరి అనేక విషయాలు చర్చిస్తాం. ఆయన పది రోజులు గుంటూరులో ఉంటే, ఇరవై రోజులు ప్రాజెక్టులో పనిచేస్తారు” అన్నారు ప్రసాద్.

“అప్పుడప్పుడు రాత్రివేళ ఈ గుట్టమీది బంగళాలో వెలుతురు కనిపిస్తే, నాకది సముద్ర తీరాన్న ఉన్న దీపస్తంభంలా అనిపిస్తుంది” అంది శశికళ.

“డాక్టరు సుబ్రహ్మణ్యంగారు నిజంగా జ్ఞాన దీపమే! ఆర్కియాలజీ మహాసాగరంలో కొట్టుమిట్టాడుతున్న మావంటివారిని ఒక దరికి జేర్చిన మహానుభావులీయన” అన్నారు ప్రసాద్.

“ఇవాళ వారు రాలేదు. మీటింగు కూడా ఉండదు. నాకు డాక్టరు సుబ్రహ్మణ్యం గారి గురించి అంతగా తెలియదు. చెప్తారా?” శశికళ ప్రసాద్‌ని అడిగింది.

ప్రసాద్ చెప్పడం మొదలు పెట్టారు.

“శ్రీ సుబ్రహ్మణ్యం 1923లో జన్మించారు. వారియింటి పేరు రావిపాలు వారు. కాని అందరూ రాయప్రోలు వారనే పిలుస్తారు. వారి తండ్రిగారు వెంకట్రామయ్యగారు రంగమ్మగారు వారి జనని. శ్రీ సుబ్రహ్మణ్యం నెల్లూరు ఉన్న పల్లెపాడు అన్న చిన్న గ్రామంలో జన్మించారు. తల్లిదండ్రులు మధ్య తరగతికి చెందిన శిష్టాచార సంపన్నులు. శ్రీ సుబ్రహ్మణ్యం వారి అయిదవ సంతానం.”

“చిన్నతనంలోనే తండ్రిగారు స్వర్గస్థులవడం చేత, శ్రీ సుబ్రహ్మణ్యం చాల శ్రమపడి పైకి వచ్చారు. స్వశక్తి మీద వెలుగులోకి వచ్చారు. ఎన్నో ఆటంకాలు ఎదురైనా వారు దృఢ నిశ్చయంతో లక్ష్యం వేపు ప్రయాణం చేశారు. ఆయన బి.ఏ ఆనర్సు పాసయి ‘సూర్యవంశ గజపతులు’ అన్న విషయం మీద పరిశోధన చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం నుండి 1947లో డాక్టరేటు పట్టం పుచ్చుకున్నారు. తొలినాటి పి.హెచ్.డిలలో శ్రీ సుబ్రహ్మణ్యం గారొకరు.”

“శ్రీ సుబ్రహ్మణ్యం కర్మ యోగం మీద విశ్వాసం కలవారు. 1947లో వారు నాగార్జున కొండ సైట్ మ్యూజియంకి సంరక్షకులుగా (కస్టోడియన్‌గా) ఆర్కియాలాజికల్ సర్వే ఆఫ్ ఇండియాలో నియమితులయారు. పిమ్మట 1954లో నాగార్జున కొండ ప్రాజెక్టు పని ప్రారంభించారు.”

“అసలు శ్రీ సుబ్రహ్మణ్యంగారిని చరిత్రకారులుగా తీర్చిదిద్దిన ఘనత శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారికి చెందుతుంది. వారిని ఆర్కియాలజిస్టులుగా తీర్చిన గౌరవం సర్ మార్టిమర్ వీలరు మహాశయుడికి దక్కుతుంది. మనదేశంలో తొలిసారిగా వీలరు దొర నూరు మంది ఆర్కియాలజిస్టులకు శిక్షణ ఇచ్చారు. వారిలో శ్రీ సుబ్రహ్మణ్యం ఒకరు.”

“శ్రీ సుబ్రహ్మణ్యం, హరప్ప తవ్వకాలలో వీలరు దొర అధ్వర్యంలో శిక్షణ పొంది, ప్రపంచమంతటిలోను పెద్దదైన నాగార్జున కొండ తవ్వకాలను స్వతంత్రంగా నిర్వహించి, శిల్పాలలను తరలించిన మహామేధావి.”

“భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన పిమ్మట, సింధులోయ తవ్వకాల తరువాత నాగార్జున కొండలోయ తవ్వకాలే పెద్దవి. నాగార్జున కొండ తవ్వకాలలో డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు గడించిన అనుభవాన్ని గుర్తించి, ఈజిప్టు ప్రభుత్వం వారు, అవ్వన్ లోయలో తవ్వకాలకు వీరి సహాయం అర్థించారు.”

శశికళ చాల శ్రద్ధతో వింటున్నది.

“ప్రాజెక్టును చేపట్టినప్పుడు వారే పదవిలో ఉండేవారు?” మోహన్ ప్రశ్నించాడు.

“సూపరెండెంటుగా నియమించారు. ప్రాజెక్టు అడ్మినిస్ట్రేషను ఆఫీసు గుంటూరులో ఉండేది. అప్పుడాయన చేతికింద ఒక పాటరీ అసిస్టెంటు, ఒక ఫొటోగ్రాఫరు, ఒక డ్రాఫ్ట్స్‌మను సూటులో పనిచేసేవారు. ఇప్పుడీ ప్రాజెక్టు పెరిగి పెద్దయింది. శ్రీ సుబ్రహ్మణ్యం సూపరెంటెండింగ్ ఆర్కియాలజిస్టు పదవిలో ఉన్నారు. వారిక్రింద ఎనిమిది మంది డిప్యూటీ సూపరెంటెండింగ్ ఆర్కియాలజిస్టులున్నారు. పదిహేడు మంది టెక్నికలు అసిస్టెంటులు, పదిహేడు మంది డ్రాఫ్ట్స్‌మన్లు, ముగ్గురు ఫొటోగ్రాఫర్లు వారికి సహాయంగా పనిచేస్తున్నారు.”

“ఎంతమంది కార్మికులు తవ్వకాలలో పనిచేస్తున్నారు?”

“రెండువేల అయిదు వందల నుంచీ మూడువేల వరకు పనిచేస్తున్నారు.”

“మొదటి నుంచీ ఆయన కుటుంబాన్ని విడిచి ఒంటరిగా పని చేసేవారా?” మోహన్ అడిగాడు.

“తొలిరోజుల్లో ఆయన ఒంటరిగా కాంపులో పనిచేస్తూ, కుటుంబాన్ని గుంటూరులో ఉంచారు. కొంతకాలం తరువాత కుటుంబాన్ని నాగార్జున కొండకు తరలించారు. అప్పుడు వారికో పెద్ద సమస్య ఎదురయింది. పిల్లల చదువులకు నాగార్జున కొండలో ఎటువంటి సదుపాయాలు లేకపోయాయి. అందుచేత కుటుంబాన్ని తిరిగి గుంటూరికి తరలించారు. అప్పటి నుండి వారికి ఛూల ధమ్మగిరి మీదనున్న డాక్ బంగళా నివాసమయింది.”

“శ్రీ సుబ్రహ్మణ్యంగారు శాసనాలు చదవడంలో వారి అనుభవం గడించారని విన్నాను” అన్నాడు మోహన్.

“శ్రీ మల్లంపల్లి సోమశేఖరశర్మగారు శ్రీ సుబ్రహ్మణ్యంగారికి మెలకువలన్నీ నేర్పారు. వారు శ్రీ సుబ్రహ్మణ్యంగారిని చాల ఆదరంతో చూసుకునేవారు. తవ్వకాలలోను, పురాతత్త్వ పరిశోధనలోను తమ అనుభవాన్ని ఏ అరమరికలు లేక శ్రీ సుబ్రహ్మణ్యం గారికి అందజేశారు. అంతెందుకు, సర్ మార్టిమర్ వీలర్ దేశం నాలుగు చెరగల నుండి వచ్చిన యువ పరిశోధకులలో శ్రీ సుబ్రహ్మణ్యంగారి అభినివేశానికి, సహజమైన ఉత్తమ గుణాలకు చాలా సంతోషించి, వారికి శిక్షణ ఇవ్వడానికి ఎంపిక చేశారు. వీలరు దొర దగ్గర శిక్షణ పొందిన శ్రీ సుబ్రహ్మణ్యం తమ అనుభవాలను, తాము కనుగొన్న కొత్త పద్ధతులను చేర్చి చాలమంది ఆర్కియాలజిస్టులను రూపొందించారు.”

“వారు ట్రెయినింగ్ ఇచ్చిన వాళ్ళందరూ హిస్టరీ విభాగానికి గాని, ఆర్కియాలజీకి గాని చెందిన వాళ్ళా?” శశికళ అడిగింది.

“శ్రీ సుబ్రహ్మణ్యం అపూర్వమైన వ్యక్తి. గణిత శాస్త్రమెక్కడ, ఆర్కియాలజీ ఎక్కడ? మన స్నేహితుడు వీరభద్రరావు లెక్కలు ఎమ్మే. అతనిని ఉత్తమ ఆర్కియాలజిస్టుగా ఆయన తీర్చారు.”

“శ్రీ సుబ్రహ్మణ్యం అద్భుతమైన వ్యక్తి” అంది శశికళ.

“ఆయన వ్యక్తిత్వం బహుముఖమైనది. మీకు ఇంతకుముందే చెప్పాను. ఆయన కర్మయోగి అని. ఆయన తన సన్నిహితులతోను, పరిచయం లేని వాళ్ళతోను ఒకే విదమైన ఆదరంతో వ్యవహరించేవారు. ఒకసారి ఒక పెద్దమనిషి వారికి ప్రతికూలంగా బోనెక్కి సాక్ష్యం చెప్పడానికి వెనుకాడలేదు. అతడే, పరిస్థితులు మారి, డాక్టరు సుబ్రహ్మణ్యం గారిని సమీపించి ఉద్యోగమిప్పించమని ప్రాధేయపడ్డాడు. మరెవరేనా అయితే ఆ పెద్ద మనిషిని తిప్పి పంపేవారే. కాని, సుబ్రహ్మణ్యం గారు అతని పరిస్థితులను విచారించి తమకు అతడు చేసిన అపకారాన్ని విస్మరించి, ఉద్యోగమిచ్చారు. ఇటువంటివి ఎన్నో ఉదాహరణలు వారి ఉదార స్వభావం గురించి చెప్పవచ్చు. శ్రీ సుబ్రహ్మణ్యం ఒక వ్యక్తి కాదు – ఒక సంస్థ!”

అప్పటికే చీకటి కమ్ముకుంది. మోహన్, శశికళ కుర్చీలనుండి లేచారు.

“డాక్టర్ సుబ్రహ్మణంగారి గురించి చాల విషయాలు ఇంకా తెలుసుకోవాలి. మరోసారి మిమ్మల్ని ఇబ్బంది పెట్టక తప్పదు.” అన్నాడు మోహన్.

“మా గురువుగారి గురించి ఎన్నిసార్లు చెప్పినా, ఏవో సంగతులు మిగిలిపోతాయి. నాకు ఎప్పుడూ ఇబ్బంది లేదు. తప్పకుండా రండి….. అన్నట్లు….. ఎల్లుండి మీటింగు విధిగా జరుగుతుంది. దానికి హాజరు కావలసింది” అన్నారు ప్రసాద్.

సెలవు తీసుకొని వాళ్ళు తమ టెంట్లవేపు వెళ్ళిపోయారు.

12

ఆ రోజు శనివారం.

నాగార్జున కొండలోయలో చలి రోజు రోజుకి హెచ్చుతున్నది. సూర్యోదయం రమారమి ఆరున్నరకు అయినా, ఫరంగిమోటు వేపున్న కొండలెక్కి సూర్యుడు కనిపించే సరికి ఎనిమిది దాటుతోంది. ఎంత చలికాలమైన శశికళ ఉదయం అయిదు గంటలకే లేస్తుంది. టైపు చేయవలసినవి, చదవలవలసినవి, ఆ రోజు చూడవలసినవి – వీటి అన్నిటి గురించి ఒక పద్ధతిలో ఆరున్నర వరకు పనిచేస్తుంది. ఆ సరికి జావా వచ్చి వేడినీళ్ళు కాచుతుంది. ఏడుగంటలకు ఆమె స్నానాదులు ముగించి టిఫినుకు తయారయేవారు. ఎనిమిదయేసరికి ఇద్దరూ టెంట్లు విడిచి పెట్టి సైటుకు బయలు దేరేవారు.

జావా, టెంటులో ఉండి మధ్యాహ్నం భోజనం తయారు చేస్తుంది. సుబ్రహ్మణ్యేశ్వరరావు తాను ఏ రోజు వచ్చేది ముందుగా తెలియజేయడం చేత, ఆ ప్రకారం వండేది. వచ్చిన తొలిరోజులలో ఎవరి బట్టలు వాళ్ళు ఉతుకుకొనేవాళ్ళు. క్రమంగా ఆ పని జావా మీద పడింది.

శనివారం సాయంకాలం నాలుగు గంటలకే వాళ్ళిద్దరూ సైటు వదలి మ్యూజియం వేపు నడిచారు. ప్రసాద్ ఎక్కడికో వెళ్తే అయిదు వరకు మ్యూజియంలోని చిత్ర ఫలకాలని చూస్తూ కాలం గడిపారు.

సాయంకాలం అయిదున్నరకి క్లబ్ మాలులో చిన్న తేనీటి విందు జరిగింది. ఆ వచ్చినతను ఉత్తర దేశం వాడు. మనిషి కొంచెం పొడవుగా ఉన్నాడు. ఉన్న సూటులో కొంచెం స్థూలంగా కనిపిస్తున్నాడు. ఆ వేళ సమావేశానికి అతడు ముఖ్య అతిథి.

“డాక్టర్ అగర్వాల్ నా సహాధ్యాయి – నాతో పాటు డా॥ మార్టిమర్ వీలర్ దొర గారి దగ్గర శిక్షణ పొందిన నూరిగురిలో ఒకరు. వీరు ఢిల్లీలో పనిచేస్తున్నారు. ఇవాళ హరప్ప మొహెంజదారోల గురించి ఉపన్యాసిస్తారు….. శ్రీ అగర్వాల్”, డాక్టర్ సుబ్రహ్మణ్యంగారు వక్తను పరిచయం చేసి కూర్చున్నారు.

“అధ్యక్షులు డాక్టర్ సుబ్రహ్మణ్యంగారికి, సోదర ఆర్కియాలజిస్టులకు అభినందనలు. నర్ మార్టిమర్ వీలరు గారు మా గురువుగారని చెప్పుకునేందుకు నేను చాల గర్విస్తున్నాను. వారి గురించి ఎంత చెప్పినా సరిపడదు.”

“అవి రెండవ ప్రపంచ మహా సంగ్రామం జరుగుతున్న దినాలు. అల్టియర్స్ యుద్ధరంగంలో నిశితమైన దృష్టిగల ఒక పొడవాటి బ్రిగేడియర్ తన టెంటు ముందు పచారు చేస్తున్నాడు. సాయంకాలమవుతోంది. అతని కమాండింగ్ ఆఫీసరు, జనరల్ బ్రియాన్ హరక్స్ అతనిని ఒక పక్కకు నడిపించి అతనితో అన్నాడు.

“మీరు యుద్ధరంగంలో పనిచేసే యోధులనుకున్నాను. మిమ్మల్ని డైరక్టర్ జనరల్ ఆఫ్ ఆర్కియాలజీగా, హిందూ దేశంలో పనిచేయాలని ప్రభుత్వం కోరుతున్నది. మీరీ పూరాతత్త్వశాఖలో ఇంత ప్రముఖులని నేనెరుగును.”

ఆ బ్రిగేడియర్ నిజంగా పురాతత్త్వ శాఖకు ఇరుసువంటివాడు. అతడు డాక్టర్ మార్టిమర్ వీలరు – అటుపిమ్మట బ్రిటీష్ ప్రభుత్వం అతనికి సర్ బిరుదమిచ్చి గౌరవించింది. అతడు బ్రిటీష్ ఆర్కియాలజిస్టులలో ప్రథమ శ్రేణికి చెందినవాడు.

“అతడు తన కొత్త పదవిలో వెంటనే చేరలేదు. తరువాత సిసిలీమీద జరిగిన దాడిలో పాల్గొని యుద్ధ వీరుడుగా తన కర్తవ్యం నెరవేర్చాడు.”

“భారత ప్రభుత్వం ఇంకా బ్రిటీష్ వారి ఆధీనంలో ఉంది. ఇండియన్ ఆర్కెలాజికల్ సర్వేకి సంబంధించిన అధికారులలో ఉత్సాహమైతే ఉంది. కాని, అనుభవం లేదు. భారత ప్రభుత్వం అటువంటి వారికి ఆధునిక పద్ధతులలో శిక్షణ కోరింది.”

“అప్పటికి సింధు నదీ మైదానం – లేక లోయలో – చాల ముఖ్యమైన పురాతత్వ పరిశోధనలు జరుపవలసి ఉంది. సిందునది ఎత్తులో పుట్టి, 1700 మైళ్ళు ప్రవహించి అరేబియా సముద్రంలో కలుస్తున్నది. సింధులోయలో బహువురాతనమైన మానవ సంస్కృతి, బహుశా ప్రపంచమంతటిలోను అదే పాతదయి ఉంటుంది, దాని యొక్క శిథిలాలు అక్కడ లభించాయి.”

“ఇప్పుడీ శిథిలాలు విభక్త భారతంలో పాకిస్తాన్ దేశంలో ఉన్నాయి.”

డాక్టర్ అగర్వాల్ చాలా ఉత్సాహంతో మాట్లాడుతున్నారు. తవ్వకాలలో పని చేస్తున్న స్కాలర్లందరూ శ్రద్ధతో వింటున్నారు. దీపాలు వెలిగించారు. చలిగాలి నల్లమల శ్రేణినుంచి మందంగా వీస్తున్నది. బేరర్లు కాఫీ తెచ్చి అందరికీ ఇచ్చారు.

డాక్టర్ అగర్వాల్ తిరిగి చెప్పడం మొదలుపెట్టారు.

“అసలీ శిథిలాలు ఎలా కనుగొన్నారు? ఎప్పుడు కనుగొన్నారు? ఈ ప్రశ్న రానే వస్తుంది. ఈ శిథిలాలు అనుకోకుండా కంటబడ్డాయి. జాన్ బ్రంటన్, విలియమ్ బ్రంటన్ సోదరులు రైల్వే ఇంజనీర్లు. 1856వ సంవత్సరంలో వారు కరాచీ నుండి లాహోరుకు రైల్వే లైను వేస్తున్నారు. దక్షిణ భాగంలో రైలులైను వేస్తున్న జాన్ బ్రంటన్‌కి, గట్ల కట్టడానికి రాయి కావలసి వచ్చింది. బ్రామినాబాద్ శిథిలాలు మధ్య యుగానికి చెందననివి. అక్కడ అతనికి కావలసిన రాయి లభించింది. విలియమ్ బ్రంటన్ ఈ సంగతి తెలుసుకొని తను కూడా ఒక పురాతన నగరం యొక్క శిథిలాల కోసం ప్రయత్నించాడు. అతనికి హరప్పా గ్రామానికి సమీపంలో పురతన పట్టణం యొక్క శిథిలాలు కనిపించాయి. అక్కడ అతనికి రైలు లైనుకి దృఢమైన పునాదులుగా ఉపయోగించడానికి సమృద్ధిగా ఇటుకలు దొరికాయి. కాని అతను ఒక విషయం గమనించలేక పోయాడు. ఆ ఇటుకలు 3500 సంవతసరాల క్రిందవని అతనికి తెలియదు.”

“సింధునదిలోయలో వెంటనే త్రవ్వకాలు జరగలేదు. 1920 వరకు అవి మొదలు కాలేదు. హరప్ప తవ్వకాలలో చాల అసక్తికరాలైన వస్తువులు లభించాయి. మొహెంజదారో అక్కడికి నాలుగువందల మైళ్ళ దూరంలో నదికి దిగువభాగంలో ఉంది. అక్కడ కూడా తవ్వకాలు జరిగాయి. ఆ తవ్వకాలలో రెండు చోట్ల కంచు పనిముట్లు, రాతి పనిముట్లు లభించాయి. కాని, ఆ నగరాలు ఎంత పురాతనమైనవో ఎవరికీ తెలిసిరాలేదు.”

“పురాతత్వ శాస్త్రవేత్త, యోధుడు అయిన వీలర్ దొర హరప్పా శిథిలాలను ఒక ఉదయం, మే నెల, 1944లో దర్శించాడు. అతనికో పెద్దమంటి దిబ్బ కనిపించింది. దాని చుట్టూ పచ్చమన్ను గుట్టలు గుట్టలుగా పడి ఉంది. వాటిని చూసిన కొద్ది సేపటిలోనే అతనికో విషయం తెలిసివచ్చింది. ఆ పచ్చమన్ను గట్లు పెద్ద ఇటుక గోడలు పూర్వనగరం యొక్క ప్రాకారాలని అతడొక నిశ్చయానికి వచ్చాడు. చాల ఉత్సాహంతో అతడు, నది దిగువ భాగానికి మహేంజదరో వరకు ప్రయాణం చేశాడు. అక్కడ కూడా అతనికి అటువంటి శిథిలాలే ఎదురయాయి.”

“సింధు నది లోయలో ఒక కొత్త పద్ధతిలో వీలరు దొర తవ్వకాలు సాగించాడు. ట్రెంచిలు తవ్వడానికి బదులు, పనివాళ్ళు చతురస్రాకారంలో గోతులు తవ్వారు. గోతులకు మధ్యన తవ్వకం లేకుండా సన్నని దారులు విడిచి పెట్టారు. ఈ పద్ధతి వలన తవ్వకం పురాతత్వ పరిశోధకుల అదుపులో ఉంటుంది. త్రవ్వకాలు ఒక క్రమంలో ఉండి, పరిశోధించవలసిన చోటు అందుబాటులో ఉంటుంది. ఈ పద్ధతే మనమిప్పుడు నాగార్జున కొండ తవ్వకాలలో ఉపయోగిస్తున్నది.”

“వీలరు దొర పర్యవేక్షణలో పనిచేస్తున్న బృందాలు మొహెంజదారో తవ్వకాలలో లభించిన ఇటుకలు, కాల్చినవని కనుగొన్నారు. ఈ కారణాన్ని బట్టి వీలరు దొర ఒక విషయం నిర్ధారించి చెప్పాడు. 4000 సంవత్సరాలకింద ఈ పురాతన నగరంలో నివసించిన ప్రజలు, తమకు సమీపంలో ఉన్న వృక్షాలను ఆవాలలో ఇటుకలు కాల్చడానికి, వంట చెరకు కోసం కొట్టి వేశారు. అందు చేతనే ఇప్పటికి కూడా ఆ నగర పరిసరాలు బోడిగా, చెట్లు లేకుండా ఉన్నాయి.”

“మొహెంజదారో త్రవ్వకాలలో పనిచేసే పురాతత్వవేత్తలకు ఒక సమస్య ఎదురయింది. ఈ నగరం యొక్క పునాదులు, అంటే చాల పురాతనమైన సంస్కృతి చిహ్నాలు, నీటి అడుగున ఉన్నట్లు కనుగొన్నారు.”

“సింధునదికి ప్రతి వసంతకాలంలోను వరద వస్తుంది. వరద వచ్చినప్పుడు అడుగునో పలుచని మట్టిపొర నిలుస్తుంది. ఆ ప్రకారం నదియొక్క అడుగుభాగం ఈ 4000 సంవత్సరాలలో క్రమంగా పైకిలేచి, శిథిలాల పునాదులను, అట్టడుగు పొరలను కప్పివేసింది.”

“1950 సంవత్సరంలో, మరో బ్రిటీష్ ఆర్కియాలజిస్టు లెస్లీ అల్‌కాక్‌తో వీలరు దొర పనిచేశాడు. తనతో మరో ఆర్కియాలజిస్టుల బృందాన్ని తీసుకుపోయి, పునాదులను కనుక్కోడానికి గట్టి ప్రయత్నం చేశాడు. అప్పటికి, అంటే మే నెల తరువాత, నీటి మట్టం ఉన్నదన్నమట. చాల మంది గ్రామవాసులను తీసుకొని, వీలరు దొర నీటిని పంపు ద్వారా రేయింబవళ్ళు పారబోశారు. ఆ విధంగా పదడుగుల లోతు వరకు చేరడానికి వీలయింది. మరి దిగువకు పోడానికి వీలుపడలేదు. ప్రవాహం యొక్క ఒత్తిడి తీవ్రమై, వాళ్ళు తవ్విన భాగాన్ని నీరు ముంచెత్తింది.”

“సైటులో వాళ్ళు తవ్విన వాటిలో, నగరంలో చాల భాగం బయట పడింది. ఏభై అడుగుల ఎత్తున్న మట్టి దిబ్బలో పెద్దదైన ప్రభుత్వపు ధాన్యరాశుల గిడ్డంగి, స్తంభాలున్న మండపం, చాల పెద్ద స్నానాల శాల వెలువడ్డాయి. మట్టిదిబ్బ క్రింద విస్తరించిన పట్టణం దర్శనమిచ్చింది.”

“ఆ నగరం పునాదులు అరలవలె వ్యాపించి ఉన్నాయి. ఇటుకతో కట్టిన మురుగు కాలువలు ఆ పట్టణానికి ప్రత్యేకత. హరప్పాలో కూడా అటువంటి నగర నిర్మాణమే కనిపించింది. కాని రైల్వే ఇంజనీర్లు రైలు లైను వెయ్యడానికి నగరాన్ని ధ్వంసం చేశారు. దుర్గం వలె ఉన్నట్టి దిబ్బ కిందనున్న పునాదులు మాత్రం కళ్ళబడ్డాయి.”

“మొహెంజదారో తవ్వకాలలో పై పొర మట్టిలో పురుషులు, స్త్రీలు, పిల్లలు – వీరి అస్తిపంజరాలు లభించాయి. వీరందరిని, నగరం ఆక్రమించినప్పుడు, శత్రువులు నిర్దాక్షిణ్యంగా నరికివేశారు. క్రీస్తుపూర్వం 1500 సంవత్సరాల ప్రాంతంలో ఈ ముట్టడి జరిగి ఉంటుంది. ఋగ్వేదంలో ఒక విషయం మనకు నేటికి కూడా లభిస్తుంది. గోడలు ప్రాకారాలుగానున్న నగరాలను ఆర్యులు ముట్టడించారని ఆ పురాతన వైదిక సాహిత్యంలో ఉంది. మొహెంజదారో కూడా అటువంటి ముట్టడికి లోనయినది కావచ్చు.”

అగర్వాల్ ఒక క్షణం ఉపన్యాసం ఆపారు.

బయట చాల చీకటిగా ఉంది. గాలిలో చల్లదనం హెచ్చింది. లోపల రెండు పెట్రోమాక్సు లైట్లు వెలుగుతున్నాయి. వెచ్చగా ఉంది. క్లబ్బు కుర్రాడు టీ తెచ్చి అందరికీ ఇస్తున్నాడు.

అదో ప్రపంచం. ఆ సభలో కూర్చున్న కొద్దిమంది మేధావులు ఆర్కియాలజీ ఆధారంతో చరిత్రను పునఃసృష్టి చేస్తున్నారు.

అగర్వాల్ తిరిగి చెప్పడం మొదలు పెట్టారు.

“5000 సంవత్సరాలకు పూర్వం, ఈజిప్టు దేశవాసులు, సుమేరియన్లు మహోన్నతమైన ఆలయాలను నిర్మించారు. కాని, మట్టి గోడలు కల గుడిసెలలో నివసించేవారు. హిందూ దేశంలో, ఆ కాలంలో మహత్తరమైన నగర సంస్కృతి వర్ధిల్లింది. అదే మొహెంజదారో సంస్కృతి. మొహెంజదారో అంటే మృతుల భూమి.”

“కాలిన ఇటుకలు మొహెంజదారో నాటి నుండి మనదేశంలో వాడుకలో ఉన్నాయి. పదకొండు అంగుళాలు పాడవు, అయిదు అంగుళాలు వెడల్పు, రెండున్నర అంగుళాలు మందంగా నున్న ఇటుకలు సాధారణంగా ఉపయోగించేవారు. కాని, కాలువలను కప్పడానికి పద్దెనిమిది అంగుళాలు మందం కల ఇటుకలను ఉపయోగించారు. ‘ఎల్’ ఆకారంలో ఉన్న ఇటుకలను కూడా తయారు చేశారు.”

“మొహెంజదారో తవ్వకాలలో చదరంగా, దీర్ఘ చతురస్రాకరంగా, గుండ్రంగా ఉన్న ముద్రలు లభించాయి. ఇవి తళతళ మెరిసే మృత్తికతో తయారు చేసినవి. వీటి పైన పలురకాలైన బొమ్మలు, సూక్తులు చిత్రింపబడి ఉన్నాయి. వాటిపై చెక్కబడిన గురుతులు ఇప్పటికి కూడా ఎవరూ తెలుసుకోలేదు. బహుశా సరకుల పైన వేసే గురుతులు వీటిని ఉపయోగించి ఉండవచ్చు. లేకపోతే తాయెత్తులుగా ఇవి ఉపయుక్తమయి ఉండవచ్చు. బహుశా ఏ దేవతనో స్తుతించే వాక్యమేనా కావచ్చు. ఈ ముద్రల మీద వృషభాలను, పులులను, ఏక శృంగమృగాలను – ఇటువంటి చక్కని బొమ్మలను చెక్కారు. ఈ ముద్రల మీద చెక్కిన చిహ్నాలు, మొహెంజదారో ప్రజలు మాట్లాడే భాష యొక్క లిపి అని శాస్త్రజ్ఞులు వాటికి భిన్నమైనదీ భాష అనడంలో సందేహం లేదు. కొంతమంది పండితులు బ్రాహ్మీలిపి మొహెంజదారో లిపి నుండి జనించిందని విశ్వసిస్తారు.”

“పురాతన కాలంలో సింధు, బెలూచీస్థాన్‌ల వర్షపాతం చాల అధికంగా ఉండేది. అందుచేత ఈనాటికన్న హెచ్చుమంది జనులు ఆ ప్రాంతాలలో నివసించేవారు. ప్రస్తుతం కనిపిస్తున్న శిథిలాలకన్న పురాతన మొహెంజదారో నగరం చాల పెద్దదిగా ఉండవచ్చు. ఈనాటి శిథిలాలు ఒక చదరపు మైలు వైశాల్యం ఉన్న స్థలంలో ఉన్నాయి. ఈ నగర నిర్మాణం ఉత్తమ పద్ధతిలో సాగినట్లు తెలుస్తుంది.”

“ఈ నగరంలో వీథులు తూర్పు నుండి పడమరకు, ఉత్తరంనుండి దక్షిణానికి ఉన్నాయి. కొన్ని వీథులు ముప్పై అడుగుల వెడల్పు ఉన్నాయి. గృహాలు రెండు, మూడు అంతస్తులలో నిర్మింపబడ్డాయి. కాల్చిన ఇటుకల పైన మట్టితో తాపిన గోడలు కనిపిస్తాయి. భూమి తలానికి అడుగుగా పోయే మురుగు కాలువలు, ఉత్తమ శ్రేణికి చెందిన ఇటుకలతో నిర్మింపబడ్డాయి. ఈ గృహాల మధ్య మనకు దేవాలయాలు కాని, పూజా గృహాలు కాని కనిపించవు.”

“మొహెంజదారో ప్రజలకు శిల్పకళ తెలుసు. వాళ్ళు పూసలు తయారు చేయగలరు. నూలు వడకడం, బట్టలు వేయడం, బంగారపు నగలు, వెండివి, తయారు చేయడం తెలుసు. రాగి, లక్క, కొమ్ము దంతం పనులు కూడా చేసేవారు. వాళ్ళు వాడిన లిపి ఈ రాతి ముద్రలమీద చెక్కబడి ఉంది. ఇప్పటి వరకు ఆ లిపి చదివి అర్థం చెప్పేవాళ్ళు లేరు”.

“ఆ కాలంలో రాగి చాల ముఖ్యమైన లోహం. రాగి, కంచుపనిముట్టు, రాతి పనిముట్లు లభించాయి. ఇనుము ఎక్కడా లేదు.”

“మొహెంజదారో వాణిజ్య ప్రధానమైన నగరం. అక్కడి వ్యాపారం బహుముఖాలుగా వ్యాప్తి చెందింది. మొహెంజదారోకు, మెసపటేమియాలోని పురాతన నగరాలకు ఆర్ధిక సాంస్కృతిక విషయాలలో చాల దగ్గర సంబంధముంది. మెసపటేమియా ప్రాంతాలలో కూడా మట్టి ముద్రలు, కురువిందపు పూసలు, మధ్యభాగం ఉబ్బినట్టి కుండలు, మాతృ దేవతలను పూజించే విధానం, శృంగాలుకల దేవతలు, రెండు మూడు జాతులు కనిపించే మిశ్రమ మృగాలు, పవిత్రమైన వృక్షాల ఆత్మలు – మొహెంజదారోలో కన్పించేవి, అగపడతాయి. ఈ రెండు స్థలాలకు వ్యాపార సంబంధాలు ఉండి ఉండవచ్చు. వీటిని కలిపే మార్గాలు ఉండి ఉంటాయి.”

“మొహెంజదారోకి తనదంటూ ప్రత్యేకత ఉంది. ఉత్తమమైన ఇటుక కట్టడాల నిర్మాణం వీరికి తెలుసు. వీరు శివుని వంటి దేవతను పూజ చేసేవారేమో. లింగాన్ని వీరు పూజించేవారు.”

“మహేంజదరోలో మహాస్నానశాల ఉంది. స్నానశాల మధ్య భాగంలో దీర్ఘ చతురస్రాకారమైన స్విమ్మింగ్ పూల్ ఉంది. దీని పొడవు ముప్పై అడుగులు, వెడల్పు ఇరవై మూడడుగులు. దీని లోతు ఎనిమిది అడుగులు. లోపలికి దిగడానికి మెట్ల వరుసలున్నాయి. దీనికి నాలుగు వేపులా గాలరీలు, గదులు ఉన్నాయి. నూతుల నుండి నీరు తోడి నిపండానికి, ఉపయోగించిన నీటిని పైకి పంపడానికి, ఏర్పాట్లు ఉన్నాయి. ఆ నీటి మడుగు యొక్క అడుగు భాగం నీరు పీల్చకుండా నిర్మించబడింది. ఇటుకల పారలకు మధ్యన తారు పారలు వేసి వాటర్ టైట్‌గా దానిని నిర్మించారు. ఆవిరి స్నానానికి, లేక వేడిగాలి స్నానాలకు పైన ఉన్న గదులలో ఏర్పాటులు చేశారు. ఇవన్నీ చూస్తే వారికి గల ఇంజనీరింగ్ కౌశలం మనకు తెలుస్తుంది. అంతేకాక వాళ్ళు ఎంత విలాసవంతమైన జీవితం గడిపేవారో మనకు అర్థమవుతుంది.”

“మొహెంజదారో నగరంలోని గృహాలు దృఢనిర్మాణం కలవి. వాటి గోడలు వీథుల పార్శ్వాలుగా వర్తిస్తాయి. గృహాలలోకి ప్రవేశించే ముఖ్య ద్వారాలు మాత్రం ప్రధానమైన వీధుల వేపు ఉండకుండా, పక్క సందులలోంచి ప్రవేశించడానికి వీలుగా ఉంటాయి. పై అంతస్తు కోసం కట్టిన మెట్లు ఖాళీ లేకుండా, ఇటుకతో కట్టినవి. కొన్ని చోట్ల కర్రమెట్లు కనిపిస్తాయి. ఇంటి పైకప్పులు మట్టితో అతికినవి. నేలలు కూడా అటువంటివే. కొన్ని పెద్ద భవనాలకు అంగణం మధ్యనుంటుంది. పైకప్పు లేకుండా ఉంటుంది. దానికి నాలుగు వేపుల గదులుంటాయి. వాటిలో విశాలమైన ముందుహాలు, పరిచారకుల వసతులు కూడా ఉంటాయి. స్నానం చేసే గదులు వీథి వేపుండి, పలుచని ఇటుకలు నాటిన నేలలతో ఉంటాయి. పై అంతస్తులనుండి మురుగునీరు పోడానికి కాల్చిన మట్టి గొట్టాలను ఉపయోగించారు. ఈ గొట్టాలు పైకి కనిపించకుండా గోడల మధ్య ఉంచి కట్టారు. అక్కడక్కడ ఈ గొట్టాలు గోడలకు వెలుపల ఉంచి కట్టిన పరిస్థితులు కూడా ఉన్నాయి.”

“మురుగునీటిని వీథిలోని కాలువలోకి తిన్నగా విడిచి పెట్టకుండా, ముందొక నిలువ గోతిలోకి విడిచి పెడతారు. తరువాత ఆ నీరు పెద్దకాలువలోకి పోతుంది. ఈ ఏర్పాటు ధనికుల గృహాలలోనే ఉంది. సామాన్యులు ఇంటిలోని మురుగు నీటిని ముందు పెద్ద మంటిజాడిలోకి పట్టి, తేరిన నీటిని కాలువలోకి విడిచేవారు. పెద్ద పెద్ద కాలువల మీద కూడా గోడనుండి పొడుచుకువచ్చిన కప్పులు నిర్మించారు.”

“చాల ఇళ్ళల్లో సన్నని ఇటుకకట్టతో ఉన్న నూతులు కనిపించాయి. ఇంట్లో వాడుకకు అవసరమైన నీరు వాటినుండి దొరికేది”.

“మొహెంజదారోలో కొన్ని పెద్దయిళ్ళు, ఈతకు పనికివచ్చే పెద్ద స్నానశాల వెలువడ్డాయి. బహుశా ఇవి ఈనాటి రెస్టారెంట్ల వంటివని శాస్త్రజ్ఞులు భావిస్తున్నారు.”

“ఆ కాలంలో ధాన్యం ధనంగా ఉపయుక్తమయేది. ధాన్యం పోసి ఇతర వస్తువులను కొనుక్కునేవారు. ఆ ధాన్యధనాన్ని దాచుకోడానికి మొహెంజదారోలో కనుగొన్న పెద్ద ప్రభుత్వపు గిడ్డంగి ఉపయోగపడేది. ఈనాటి పెద్ద బాంకుతో అది సమానం”.

డాక్టర్ అగర్వాల్ ఒక క్షణం ఉపన్యాసం ఆపారు. చలికాలమైనా ఒక గ్లాసుడు మంచినీళ్ళు తాగి ఉపన్యాసం ముగిస్తూ అన్నారు.

“మొహెంజదారో నగర నిర్మాణంలోను, సానిటరీ ఇంజనీరింగ్ లోను ఆనాటి ప్రజలు పరిపూర్ణ జ్ఞానం ఉన్న వాళ్ళని మనం అనుకోనక్కరలేదు. కొన్నిచోట్ల, వాళ్ళు తవ్విన నూతులు మురుగు కాలువలకు తగులుతూ కనిపించాయి. పెద్ద మురుగు కాలువలు నివాసగృహాలకు సమీపంలో బహిరంగ ప్రదేశాలలో పారి మడుగులు కట్టేవి.”

“మొహెంజదారో నగర శిథిలాలు భూగర్భమైన వేయి ఏళ్ళ తరువాత, వాటిపైన ఏర్పడిన మట్టి దిబ్బల మీద ఒక బౌద్ధస్తూపం వెలిసింది.”

“కాలం ఏ విధంగా రహస్యాలను భూమిలో దాచుకుందో దీనిని బట్టి మనకు తెలుస్తుంది”.

అగర్వాల్ గారి ఉపన్యాసం ముగిసింది. సభికుల కరతాళ ధ్వని పది నిముషాల వరకు మోగింది.

“స్కీమన్ ట్రాయ్ నగరాన్ని బయట పెట్టాడు. కార్టర్ తూతన్ ఖామున్ సమాధిని కనుగొన్నాడు. ఇవాన్స్ నోసస్ రాజభవనాన్ని వెలికితీశాడు. ఏదో ఒకరోజు మీలో ప్రతి ఒక్కరు ఒక మహత్తరమైన శిథిలాన్ని బహిర్గతం చేసి చరిత్రకు నూతనాధ్యాయమొకటి రచిస్తారు. మిత్రులు డాక్టర్ అగర్వాల్‌కి మన అందరి తరపున కృతజ్ఞతలు.”

డాక్టరు సుబ్రహ్మణ్యంగారి ఆఖరిపలుకులతో సభ ముగిసింది.

(సశేషం)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here