శ్రీపర్వతం-62

0
2

[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 62వ భాగం. [/box]

[dropcap]ఆ[/dropcap]యన వెళ్లిన తరువాత ఇద్దరి నడుమ మౌనం రాజ్యం చేసింది.

మోహన్ ఆమె వైపు చూస్తుండిపోయాడు.

శశికళ మోహన్ వైపు చూస్తుండిపోయింది.

ఇద్దరి నడుమ మౌనం మధురమైన సంగీతం పాడుతోంది. వారి కళ్లు నిశ్శబ్దంగా సందేశాలు పంపించుకుంటున్నాయి.

అంతలో మోహన్ చూపులో మార్పు వచ్చింది.

హఠాత్తుగా అతని కళ్లల్లోని భావంలో మార్పు రావటం శశికళకు అర్థం కాలేదు.

మోహన్ చెవుల్లో సన్నగా ఘోష వినిపిస్తోంది.

బుద్ధం శరణం గచ్ఛామి… ధర్మం శరణం గచ్ఛామి… సంఘం శరణం గచ్ఛామి.

మగవారి గొంతులో, ఆడవారి గొంతులూ కలగలసి వినిపిస్తున్నాయి.

అంతలో అతడి కళ్ల ముందు కలలాంటి దృశ్యం కనిపించింది.

ఎవరో భగభగలాడుతున్న యజ్ఞగుండం ముందున్నాడు.

అతడి చేతిలో వరిపిండితో చేసిన మగవాడి బొమ్మ ఉంది.

అతడి దగ్గర ఓ పాతికేళ్ల యువతి నిలుచుని ఉంది.

“అస్సనామౌ అనంద” అంటూ సాధకుడు బొమ్మకు ప్రాణప్రతిష్ఠ చేశాడు,

దహదహదహదహదహ

చక్షు చక్షు

కురు ఆనందం

అంధం అంధం

జ్వాలాయ జ్వాలాయ

నయనౌ నయనౌ

జ్వాల ఎగసెగసి పడుతోంది.

మోహన్ వణికిపోతున్నాడు.

అందమైన యువతి, సాధకుడు మిథున కర్మకు ఉద్యుక్తులవుతున్నారు.

ఎందుకని తన కళ్లు పోవాలని వీరు కోరుతున్నారు?

వీళ్లకి ఏం అపకారం చేశాడుతను?

వనిత మృత్యవు! వనిత మృత్యవు! వనిత మృత్యవు!

ఎవరో అతడి చెవులలో గుసగుసగా అన్నారు.

బుద్ధం శరణం గచ్ఛామి

ధర్మం శరణం గచ్ఛామి

సంఘం శరణం గచ్ఛామి

మోహన్ పిడికిళ్లు బిగుసుతున్నాయి.

“మోహన్… మోహన్” ఆందోళనగా పిలిచింది శశికళ.

అంతలో అతని కళ్ల ముందు నల్లగా అయిపోయిన సెలినా శరీరం కనిపించింది.

“ఏమయింది సెలీనాకు?” ఆందోళనగా అడిగాడు శ్రమణుడు.

“ఆమె నేరం చేసింది.”

“ఏంటది?”

“ఆరు నెలలు సమయం ఇచ్చినా తన అందచందాలతో శ్రమణుడిని లోబరుచుకోలేకపోయింది. అందుకని విష సర్పకాటుకు గురయింది.”

శ్రమణుడి హృదయం కంపించింది!

తాను తన ధర్మాన్ని పాటించటం మరొకరికి ప్రాణాంతకమా?

ఇదెక్కడి న్యాయం?

“శ్రమణా! మీ మార్గాలు మంగళకరములగుగాక!”

ఇందులో మంగళం ఏముంది? సాటి మనిషి ప్రాణాలు పోవటం మంగళకరమా?

ధర్మపాలన ఇంత క్రూరమైందుకు?

“మోహన్… మోహన్… ” అతనిని ఆందోళనగా కుదిపింది శశికళ.

ఉలిక్కిపడి ఆమె వైపు చూశాడు మోహన్.

తనని ప్రలోభపరచి ధర్మ భంగం చేసేందుకు వచ్చిన సెలీనాలా కనిపించింది శశికళ. ఏదో అనబోయాడు. అతని పెదిమలు కదిలాయి. శబ్దం బయటకు రాలేదు. అంతలో అతని మనోఫలకంపై బుద్ధభగవానుడి ప్రశాంత దివ్య సుందర విగ్రహం సాక్షాత్కరించింది.

అతడి మనస్సు ప్రశాంతమయిపోయింది.

“ఏమైంది మోహన్?” అడిగింది శశికళ.

ఆమె వైపు ప్రశాంత దృక్కులతో చూశాడు మోహన్.

“నేను నీకు అంతా చెప్తాను. నాకు కొంచెం ఆలోచించుకోని సమయం కావాలి. నాకు జరిగింది నాకు అర్థం కాగానే నీకు అంతా చెప్తాను.” అన్నాడు మోహన్ లేస్తూ.

“రేపు సెక్రటరీ దగ్గరకు వెళ్తున్నాము.”

నవ్వాడు మోహన్.

ఆమెని దగ్గర తీసుకున్నాడు.

“సెక్రటరీ దగ్గరకే కాదు, జీవితంలో ఇకపై వేసే ప్రతి అడుగు కలసేవేస్తాం” అన్నాడు.

ఆమె నవ్వుతూ వీడ్కోలు పలికింది.

అతడు గబగబా అడుగులు వేస్తూ బయటకు వచ్చాడు.

అతడి కళ్ల ముందు ప్రజ్వలిస్తున్న అగ్ని రేఖల వెలుతురులో గ్రుడ్డివాడవుతున్న ఆనందుడి ముఖం కనిపిస్తోంది.

“అస్సనామో ఆనంద” అన్న పదం చెవుల్లో మార్మోగుతోంది.

“అంధం అంధం కురు ఆనందం” ప్రతిధ్వనిస్తోంది.

పరుగులాంటి నడకతో వెళ్లిపోతున్న ఆనంద్ వైపు ఆలోచనగా చూస్తూ నిలబడిపోయింది శశికళ.

(ముగింపు త్వరలో)

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here