[box type=’note’ fontsize=’16’] సంచికలో ధారావాహికంగా ప్రచురితమవుతున్న ఘండికోట బ్రహ్మాజీరావు గారి ‘శ్రీపర్వతం’ అనే చారిత్రక నవలలో ఇది 63వ భాగం. [/box]
[dropcap]“ఏ[/dropcap]మైంది, నిన్న అలా వెళ్లిపోయావు?”
మోహన్ కలవగానే మొదటగా అడిగింది శశికళ.
ఇద్దరూ కలసి సెక్రటరీ దగ్గరకు బయలుదేరారు.
“నాకు హఠాత్తుగా నేను అనందుడిని, నువ్వు నన్ను లొంగదీసుకోవాలని వచ్చిన సుందరాంగివి అనిపించింది. ఆనందుడిని తన అందంతో లొంగదీసుకోలేకపోవటం వల్ల, ఆమెని విష సర్పం కాటుకి గురి చేస్తాడు రాజు. అది గుర్తుకు వచ్చింది” చెప్పాడు మోహన్.
శశికళ మౌనంగా ఉంది చాలా సేపు. చివరికి మృదువుగా అంది.
“ఒకవేళ నిన్ను నేను దారి నుంచి తప్పిస్తున్నానని నువ్వు అనుకుంటే మనం పెళ్లి గురించి ఆలోచించటం మానేద్దాం. నిన్ను కలిసే దాక నాకు వివాహం ఆలోచనే రాలేదు. ఒంటరిగానే జీవితం రీసెర్చిలో గడిపేయాలని అనుకున్నాను. కాబట్టి నాకు పెద్ద కష్టం ఏమీ లేదు” అంది శశికళ నిర్భావంగా.
మోహన్ మృదువుగా ఆమె చెయ్యి స్పృశించాడు.
“ఆది నుంచీ స్త్రీ, పురుషుడిని అతని గమ్యం నుంచి తప్పిస్తుందన్న ఆలోచన మానవ సమాజంలో ఉంది. ఒక్క భారతీయ సమాజంలోనే స్త్రీ లేకపోతే పురుషుడు అశక్తుడన్న అర్ధనారీశ్వర తత్వం ఉంది. ఆదిశక్తి, కాళీమాత వంటి ఆలోచనలు ఉన్నాయి. స్త్రీ పురుషుడిని దారి తప్పించదు. సరైన దారిలో పెడుతుంది. యముడు తీసుకు వెళ్తున్న భర్తను రక్షించిన సావిత్రి గాథ జ్ఞాపకం తెచ్చుకో. నిన్న నాకు ఈ విషయం అర్థమయింది. పురుషుడు తన వైఫల్యానికి స్త్రీని బాధ్యురాలిని చేసి, ఆమె పై దోషం పెట్టేస్తున్నాడు. గౌతముడు కూడా ఆరంభంలో స్త్రీలు భిక్షుణిలుగా ఉండటానికి ఆమోదించ లేదు. స్త్రీశక్తి అంటే పురుషుడికి భయం. అందుకే తపస్సు చేస్తున్న వారిని దారి నుంచి మళ్లించే రంభ, ఊర్వశి మేనకలు ఈ స్త్రీ శక్తికి ప్రతీకలయ్యారు. కాని దుర్గ, సరస్వతి, లక్ష్మి వంటి దేవతలున్నారు. వారు ఎవరినీ దారి మళ్లించరు. పైగా దారి చూపిస్తారు. బౌద్ధం లోతుగా చదవటం వల్ల స్త్రీలంటే ఒక రకమైన భయం ఏర్పడింది. ఇతర మతాల సంపర్కం వల్ల బహుశా అయా మతాల్లో స్త్రీలంటే ఉన్న భయాలు, అపోహల ప్రభావం మనపై పడింది. రాత్రి ఇదంతా అలోచించుకున్నాను. భయాలు తొలగిపోయాయి. స్త్రీ, పురుషులను పూర్ణానుస్వారంలోని చెరో అర్ధభాగాలుగా భావించే ఏకైక ధర్మం భారతీయ ధర్మం. ఆ ధర్మంలో జన్మించి నేను స్త్రీని చూసి భయపడటం, ఆమె దారి మళ్లిస్తుందని పారిపోవటం వంటివి అర్థరహితం. మన ఋషులంతా సంసారం చేస్తూ సన్యాసంలో బ్రతికి సమాజ హితం కోసం శ్రమించిన వారే. ఇది అర్థమయిన తరువాత నా అపోహలు, సందేహాలు పటాపంటలయిపోయాయి. శశికళా, నా చేయి పట్టకుని నాకు దారి దీపం చూపుతూ సరైన దారిలో నడిపిచవూ?” అభ్యర్థించాడు మోహన్.
శశికళ నవ్వింది.
“ఈ పిచ్చివాడిని దారిలో పెట్టటం చాలా కష్టం. భగవంతుడా ఎందుకు నాకీ పరీక్ష?” అని నాటకీయంగా అంది.
మోహన్ కూడా నవ్వాడు.
ఇద్దరూ తమ గమ్యం చేరుకున్నారు.
ఆఫీసులో అడుగు పెడుతుంటేనే పి.ఎ. కనిపించింది.
“కంగ్రాట్స్” అంది నవ్వుతూ మోహన్ని చూసి.
శశికళ పరిచయం చేసాడు మోహన్.
“ఓ పర్సనల్‌గా సెక్రటరీకి కంప్లయింట్ చేసేందుకు వచ్చారా?” నవ్వుతూ అడిగింది పి.ఎ.
“అవును. చాలా అల్లరి పిల్లవాడు.” నవ్వుతూ అంది శశికళ.
వీళ్లు వచ్చారని సెక్రటరీకి చెప్పగానే ఆయన తన గది నుంచి బయటకు వచ్చాడు.
గతంలో తను వచ్చినప్పుడు ఆయన ప్రవర్తనకీ, ఇప్పటి ప్రవర్తనకీ తేడాను గమనించి ఊక్కిరి బిక్కిరి అయ్యాడు మోహన్.
‘ఇంత తేడా ఎలా వచ్చింది?’
(ముగింపు త్వరలో)