Site icon Sanchika

శ్రీరాముడు అందరివాడేలే!!!!

                              విశ్వవ్యాప్తంగా విస్తరించి వున్న రామభక్తులందరికీ, రామ విరోధులు, నాస్తికులతో సహా ప్రపంచ ప్రజలందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. కొన్నికోట్ల సంవత్సరాలనుంచీ, ప్రపంచ వ్యాప్తంగా తన అపూర్వమైన వ్యక్తిత్వంతో శ్రీరామచంద్రుడు ప్రజలను ప్రభావితంచేస్తూవున్నాడు. రామాయణం ప్రధానంగా సంస్కృత భాషలో వాల్మీకి విరచితమయినా ప్రపంచంలోని పలుభాషలలో, పలు దేశాలలో రామాయణం విభిన్నమైన రూపాలలో ప్రచారంలో వుంది. హిందీ భాషలో కనీసం 11 రామాయణాలు,మరాఠీలో 8, బెంగాలీలో 25, తమిళంలో 12, తెలుగులో 5, ఒరియాలో 6 రామాయణాలతో సహా, గుజరాతి,మలయాళం, కన్నడ, అస్సామీ,ఉర్దు, అరబిక్,పెర్షియన్, భాషలలోనూ పలు రామాయణాలు ప్రచారంలో వున్నాయి.  కాళిదాసు, భాసుడు, భట్టి, ప్రవరసేన, భవభూతి, క్షేమేంద్రుడు, రాజశేఖరుడు, కుమారదాసు, సోమదేవ్, గుణదత్త, గురుగోవింద్ సింఘ్, సమర్థ రామదాసు, తులసీ దాసు, మైథిలీ శరణ్ గుప్త, కేశవ్ దాస్, విశ్వనాథ సత్యనారాయణ వంటి వారు రామాయణ రచనతో చిరంజీవులయ్యారు.
రామకీర్తి భారతదేశంలోనే కాదు, ప్రపంచంలోని పలుదేశాలలో విస్తరించింది. టిబెట్ వారికి ఒక రామాయణం వుంది. తుర్కిస్తాన్ వారికి, ఖోటానీ రామాయణ, ఇండోనేషియా వారికి కక్బిన్ రామాయణ, జావా వారికి సేరాత్రం, సైరిరాం, రాంకెలింగ్, పటాని రాం కథా వంటి రామాయణాలు, ఖామెర్ రామాయణ, బర్మా వారికి యుటో రామాయణ, థైలాండ్ వారికి రాంకియేన్ ….ఇలా పలు దేశాలలో పలు విభిన్న రూపాలలో రామాయణం ప్రచలితమవుతూన్నా, మౌలికంగా రామకథ అన్ని దేశాలలో అన్నిప్రాంతాలలో ఒకటే.
ఇలా ప్రపంచవ్యాప్తంగా పూజలందుకుంటూ ప్రజలను కాపాడుతూన్న అందరివాడయిన సీత,లక్ష్మణ ఆంజనేయ సమేత శ్రీరామచందుడికి ప్రణమిల్లుతూ…బలవంతులకు బుద్ధిని, బలహీనులకు శక్తినీ ఇవ్వాలని ప్రార్ధిస్తూ…సంచిక  శ్రీరామనవమి ప్రత్యేక పద్యాలనూ,కథలనూ,వ్యాసాలనూ అందిస్తోంది. మీ ఆశీస్సులను, ఆదరణను అభ్యర్ధిస్తోంది.

Exit mobile version