Site icon Sanchika

నా విజయనగరం అణువణువునా శ్రీరాముడే!!!!!!!

[box type=’note’ fontsize=’16’]  విజయనగరం, పరిసరప్రాంతాలు సీతారాముల పాద స్పర్షతో పవిత్రమయ్యాయని వివరించే చివుకుల శ్రీలక్ష్మి రచించిన వ్యాసం నా విజయనగరం అణువణువునా శ్రీరాముడే!!!!!!! .[/box]

విళంబి నామ సంవత్సరాన వసంత ఋతువులో చైత్ర శుద్ధ నవమి నాడు పునర్వసు నక్షత్రాన జన్మించిన శ్రీరామచంద్రుడు “రామో విగ్రహవాన్ ధర్మః” అని మునులచే కొనియాడబడ్డాడు. చైత్రశుద్ధ పాడ్యమి మొదలు నవమి వరకు శ్రీరామ నవరాత్రులుగా, వసంత నవరాత్రులుగా పిలువబడుతూ  ఊరూరా సంబరాలు చేసుకుంటారు. దేవుని పెళ్ళికి అందరూ పెద్దలే అంటారు. ఊరంతా చలువ పందిళ్ళు వేసి,మామిడి తోరణాలు కట్టి, విద్యుత్ కాంతులలో పగలు పూజలు, రాత్రులు వివిధ కళారూపాల ప్రదర్శనలు హరికథలు, బుర్రకథలు, నాటకాలు, భజనలు, కోలాటాలు, ఏర్పాటు చేసి గ్రామప్రజలంతా ఆనందించేవారు. వారి కళారూపాలలో శ్రీరామ జననం; తాటక సంహారం; అహల్యా శాప విమోచనం; మొదలైనవి ప్రదర్శించి, ఆఖరి రోజున సీతాకల్యాణం జరపడం ఆనవాయితీగా కొందరు చేస్తే,రావణ సంహారం చేసిన శ్రీరామునికి పట్టాభిషేకం జరపడం కొందరు చేస్తారు.  రాముడన్న, రామపాలన అన్నా, రామ నామం అన్నా ప్రజలు అమితంగా ప్రేమించడానికి కారణం ప్రజలు రాముని తమలో ఒకనిగా భావించడం. ఆయా సంఘటనలలో తమని తాము ఆపాదించుకోవడం కారణం. ప్రజలు రాముడిని తమవాడుగా తలుస్తూ ఇలా అనుకుంటారు.

మాతారామో మత్పితా రామచంద్రః

స్వామీ రామో మత్సఖా రామచంద్రః

సర్వస్వంమే రామచంద్రో దయాళు

నాన్యం జానే నైవ జానే న జానే/”

భారతీయుల ఆరాధ్యదైవం పిలిస్తే పలికే రామయ్య తండ్రికి జిల్లా అంతటా అడుగడుగునా రామ మందిరాలు, ఆడా, మగా కూడా రామయ్య పేర్లతో అలరారుతూ, తోటలకు, చెరువులకు కూడా రాములోరి పేర్లే! హిందూమతం విష్ణుమూర్తి యొక్క దశావతారాలలో రామాయణంలో శ్రీరాముని రామావతారంగా పూజిస్తుంది. రామాయణాన్ని పరిశీలిస్తే వారు ఇక్కడ జన్మించకపోయినా రాముడు తండ్రిమాటకై 14 సం:లు అరణ్యవాసం దండకారణ్యంగా పిలువబడే ఈ ప్రాంతంలోనే వారు తిరిగారు. అరణ్యవాసం చేసే సమయంలో నగరాలు, పట్టణాలలో వారు అడుగు పెట్టకూడదనే నియమం ప్రకారం అడవులలో, కొండప్రాంతాలలో, నదీతీరాలలో సంచరించిన గుర్తులున్నాయి. ఈ ప్రాంతభౌగోళికతను పరిశీలించినపుడు ఎక్కడ చూసినా ఏ కొండపైనైనా రామపాదాలే కనబడతాయి.

శ్రీ సీతారాముల ఆవాసమే రామతీర్ధం  

విజయనగరానికి సుమారు 12 కి.మీ.ల దూరంలోగల రామతీర్థం అనే గ్రామం ప్రాచీనకాలంలో హిందూ, బౌధ్ధ, జైన మతాలతో విలసిల్లిన త్రివేణీసంగమం. ఇక్కడగల కొండలపైన మూడుమతాలకు చెందిన శిలావిగ్రహాలు కనిపిస్తాయి. గ్రామానికి ఉత్తరాన బోధికొండ, గురుభక్త కొండ, దుర్గ కొండ అని పిలువబడే మూడు కొండలున్నాయి. కొండలపేర్లే వాటి ప్రత్యేకతను సూచిస్తాయి. బోధికొండపై రామాయణ, మహాభారత కాలంనాటి ఆనవాళ్ళు, గురుభక్త కొండపై బౌధ్ధమతంలోని హీనయాన, మహాయాన సంస్కృతులకు నిలయంగా చైత్యాలు, స్థూపాలు, ఆరామాలు జైనులు చిహ్నాలు, దుర్గ కొండపై రామునికోవెల సహజమైన గుహలలో దుర్గాదేవి విగ్రహానికి వెనుకవైపున గల గోడలపై అతి ప్రాచీన శిలాశాసనము ఉన్నాయి. ఎత్తైన కొండలమధ్య క్లిష్టమైన మార్గంలో ప్రయాణించాలి కనుక స్థానికంగా ఉన్న గ్రామస్థులలో ఎవరినైనా ఒకరిని మార్గం చూపడానికి తీసుకువెళ్ళటం చాలా అవసరం.

కొండపైన రామాలయం

సీతా సమేత శ్రీరాముడు నడయాడిన నేల….. రామతీర్థం 

అతి ప్రాచీన వైష్ణవక్షేత్రమైన ఈ రామతీర్థంలో వనవాసకాలంలో శ్రీరాముడు సతీసోదర సమేతంగా తిరిగినందున ఇది రామతీర్థమైందని హిందువులు అంటారు. శ్రీరాముడు వనవాసకాలంలో సంచరించిన గుర్తులతో కొండపైన సీతారామ లక్ష్మణ విగ్రహాలు నిత్యపూజలు అందుకుంటున్నాయి. సీతమ్మ పురిటి మంచం, నిత్యమూ నీటితో నిండి ఉండే అగాధమైన లోతుగల సీతమ్మకొలను ఉన్నాయి. వర్షం పడినపుడు కొన్నిరోజులవరకూ వేడినీటి జలపాతాలు కొండపైనుండి ప్రవహిస్తాయి. కారణాన్ని అన్వేషించాలని త్రవ్వకాలు సాగించిన భూగర్బ శాస్త్రవేత్తలకు భౌగోళికంగా అపారమైన గంధకం నిలవలు కొండలలో ఉన్న ఋజువులు దొరికాయి. కొండదిగువన నీలాచలమనే నల్లనికొండపై శ్రీరామచంద్రుని ఆలయముంది.

శ్రీరాములవారి ఆలయం

 సార్వభౌమ’ బిరుదాంకిత పూసపాటి సీతారామరాజు(క్రీ.శ.1636-1717)

శ్రీరాముని కుమారులైన లవకుశులలోని కుశుని సంతతికి చెందిన వంశస్తులు దక్షిణ భారతదేశం వచ్చి స్థిరపడి రాజ్యాలు ఏర్పరచుకున్న చారిత్రికఆధారాలు ఉన్నాయి. విజయనగర ప్రభువులు ఆధ్యాత్మిక సంపన్నులు. విజయనగరసంస్థానపు తొలి పాలకులైన మాధవవర్మగా పిలువబడే రఘునాథరాజుగారి కుమారుడైన ‘సార్వభౌమ’ బిరుదాంకితుడైన సీతారామరాజు జయపురం రాజుల కొలువులో ఉండి వీరకృష్ణమదేవుని కుమార్తెను వివాహంచేసుకుని కుమిలి, దేవుపల్లి, గండ్రేడు పరగణాలను పొందారు. కుంభిలాపురం రాజధానిగా పాలించే పూసపాటిసీతారామరాజు రాజకీయాధికారాన్ని విస్తరింపచేసి రామతీర్థంలో శిథిలమైపోయిన కోదండరామస్వామి ఆలయాన్ని పునరుధ్ధరించారు. కుంభిలాపురం విశాలమైన వీధులతో, పెద్ద పెద్ద భవనాలతో ఉండేది. ప్రజలు వ్యవసాయంపై ఎక్కువగా ఆధారపడేవారు. వర్తకంకోసం వచ్చి అవకాశాలకై ఎదురుచూసే విదేశీయులందరినీ ఏకత్రాటిపై నడిపే సమర్ధత కలిగిఉన్న సీతారామరాజు విజయనగరానికి ఉత్తరసర్కారులలో మంచి శక్తివంతమైన రాజ్యమనే అభిప్రాయాన్ని కలిగించారు. సీతారామచంద్రరాజుకు శిథిలాలయం ఉనికిని ఒక మూగ దూదేకుల స్త్రీ చెప్పినందున ప్రతి సం: మాఘమాసంలో జరిగే స్వామి కళ్యాణోత్సవానికి వారే మొదట తాళిబొట్టు, తలంబ్రాలబియ్యం తెస్తారు.

దూదేకుల మూగవనితను కరుణించిన రామయ్య      

పూసపాటిసీతారామరాజు చంపావతీనదీతీరాన గల కుంభిలాపురం రాజధానిగా పాలించే రోజులలో జరిగిన సంఘటన. అతడు హరిపూజాదురంధరుడు. పండితులను ఆదరించేవాడు. దుష్టశిక్షణ-శిక్షరక్షణ చేసేవాడు. ‘యధారాజా-తథా ప్రజా’ అనేవిధంగా అక్కడి ప్రజలు కూడా నిత్యం వేదఘోషతో జీవనం గడిపేవారు. హరి హర బేధం లేక శివునీ, విష్ణువుని కూడా పూజించేవారు. ఆఊరిలో దూదేకుల కులానికి చెందిన రామభక్తురాలైన ఒక మూగస్త్రీ ఉండేది. ఒకరోజు తెల్లవారుఝామునే కొందరు కట్టెలు కొట్టుకునే వారు చల్దిఅన్నం మూటలు కట్టుకుని అడవికి బయలుదేరారు. ముసలిదైన మూగ స్త్రీముందు నడుస్తూండగా వారు ఎండుకట్టెలు కొట్టి మోకులుగా కట్టి తలలపై పెట్టుకుని తిరుగు ప్రయాణం అయేసమయానికి ఆకాశం, భూమీ ఏకమైనట్లుగా మబ్బులు కమ్మి, పెనుగాలులతో వర్షం మొదలైంది. వాగులూ, వంకలూ పొంగి ప్రవహిస్తూండగా దారీ,తెన్నూ కనబడక అందరూ తలొక దిక్కూ పరుగులెత్తారు.

ఆ మూగవనిత చలిలో, చీకటిలో, ఆకలితో శ్రీరాముని ప్రార్ధిస్తూ ఒక పెద్ద వటవృక్షం క్రింద నేలపై వాలింది. అంతట శ్రీరాముడు కరుణించినట్లుగా మేఘాలు పటాపంచలై ఆకాశం నిర్మలమైంది. ఆమె ఆర్తనాదం విని, సీతాదేవి ఆమెను రక్షించమని శ్రీరాముని కోరగా అతడు హనుమంతుని పంపగా అతడు ఆమెను రాముని వద్దకు తీసుకువెళ్ళేను. సీతాసమేతుడైన శ్రీరాముడు నారవస్త్రములు ధరించి, పక్కన లక్ష్మణునితో నిలచియుండుట చూసి పాదములను తాకిందామె. లక్ష్మణుడు ఆమె పరిచయమడుగగా మూగది కనుక మాట్లాడలేక మొగము తిప్పుకున్నదామె. సీత ఆమెను కరుణించమని కోరగా రాముడు ఆమె నాలుకను చూపించుమని దర్భతో మూడుబీజాక్షరాలు వ్రాయగా ఆమెకు మాటలు వచ్చాయి. వెంటనే ఆమె శ్రీరాముని శ్రావ్యంగా ఇట్లా స్తుతించింది.

రామ! నీదు మహిమ రాయి పడతియయ్యె!

తనరె శరము కాగ దర్భయొకటి

మూగనైన నన్ను ముద్దారఁ బలికించి

బ్రోచితయ్య నిన్నుఁ బొగడఁ దరమె?”

(శ్రీరామతీర్థ క్షేత్ర మహత్మ్యం- పద్య కావ్యం -53పే.)

శ్రీరాముడు ఆమె వెన్నుతట్టి ఆరాత్రి తన వద్దనే ఆశ్రయం తీసుకోమని చెప్పగా లక్ష్మణుడు సీతారాములకు, హనుమంతుడు వృధ్ధవనితకు పడకలు అమర్చి, ఫలములు తీసుకురాగా అందరూ ఆరగించిరి. సీతారాములు పవళించగా పాదములొత్తుతున్న హనుమను, కావలికాస్తున్న లక్ష్మణుని చూసి ఆమె కలా? నిజమా? అని సంశయపడుతూ వీళ్ళు ఎన్నాళ్ళు వనవాసం చేస్తారు? అనుకుంటూ హనుమంతుని మీరెవరని? అడిగింది. హనుమంతుడు రామావతారమును ఆమెకు వినిపిస్తాడు. రామావతారం పరిసమాప్తి అయిన తరువాత పాండవులు మాయాద్యూతంలో ఓడి పన్నెండేళ్ళు అరణ్యవాసం, ఒక ఏడాది అజ్ఞాతవాసం చేయునపుడు శ్రీకృష్ణుడు వారికి ధైర్యం కలిగించుటకు శ్రీరామావతార అర్చావతారమూర్తులను ఇచ్చి పూజింపమనెను. వారు రామునికి ఆలయాన్ని కట్టి ఆమూర్తులను పూజించి అరణ్యవాసమును పూర్తి చేసిరి. అజ్ఞాతవాసమును విరాటుని కొలువులో చేరమని చెప్పి తాను అక్కడనుండే కాపాడుతూ  ఉంటానని  రాముడు చెప్పగా అప్పటినుండీ మేము ఇక్కడనే ఉంటున్నామని హనుమ ఆమెతో తెల్లవార్లూ రామకథను చెప్పెను.

తెల్లవారాక రాముడు ఆవనితతో “జరిగినదంతయూ మీరాజుకి చెప్పి తీసుకురమ్మని చెప్పి”, హనుమతో “ఆమెను వారి బంధువులవద్దకు తీసుకుపొమ్మని” చెప్పెను. పుట్టుమూగి అయిన ఆమె తనవారిని చేరి, జరిగినదంతయూ మధుర వచనములతో చెప్పగా వారు విస్మయం పొందారు. ఆమె కుంభిలాపురంలోని వీధివీధిలోన తనను మూగిన జనుల మధ్య ఈ కథను చెప్తూండగా రాజు విషయం తెలుసుకుని రమ్మని చారులను పంపగా, వారు ఆమెను రాజ సముఖమునకు తీసుకుని రాగా ఆమె రాజుతో “తాము గతదినము కట్టెలుకొట్టుటకు అడవికి వెళ్ళి పెను తుఫానులో చిక్కుకుని పోగా శ్రీరాముడేవిధంగా కరుణించెనో కుంభిలికి వెళ్ళి మీ రాజుకి విషయమంతా చెప్పమని తనకు చెప్పిన విషయమంతా రాజుకి వివరించెను.

రాజు సంభ్రమంతో ఆమెతో కలిసి అడవికి వెళ్ళి రాముని చూచుటకు నిశ్చయించుకొనగా మంత్రులు, సామంతులు, బ్రాహ్మణులు, సర్వసైన్యంతో, అంతఃపురకాంతలతో, మంగళవాయిద్యాలతో రథంపై బయల్దేరారు. ఆవృధ్ధవనిత ముందు దారి చూపుతుండగా త్రోవలో క్రూరమృగాలను వేటాడుతూ రాజు చాలా దూరం వెళ్ళిన తరువాత

“ఏడీ? మీరాముడు కనిపించడేమీ? ఎంతదూరం వెళ్ళాలి?” అని అడుగగా గడచిన సంఘటనలన్నీ ఆమె నెమరు వేసుకుంటూ పలికింది. కానీ రాముడు కనబడకపోవడం వలన రాజు ఆమెపై కోపం తెచ్చుకుంటాడు. ఆమె దుఃఖిస్తూ తాను చెప్పినదంతా నిజమని చెప్పగా ఆ మాటలను విశ్వసించిన రాజు “తానూ,భార్యా ఇన్ని దినములనుండి పూజించినా కనబడని రాముడు ఆవృధ్ధ వనితను కరుణించి తమను కరుణించక పోవుటకు కారణం గతజన్మలో తాము చేసిన పాపములై  ఉండునని” చింతించెను.

దినమంతయూ తనతోపాటూ రాముని వెదకిన పరివారాన్ని చూసి “మీరంతా ఇళ్ళకు వెళ్ళండి. నేను సీతారామలక్ష్మణులను చూసేంతవరకూ అడవి నుండి తిరిగి రానని” శపథం చేయగా పరివారంలోని ఒక్కొక్కరూ నగరానికి మరలిరి. రాజు రామదర్శనం కోరి దర్భాసనంపై పడుకుని రాత్రంతా రామునే తలచుతూ కలత నిద్ర పోగా అర్ధరాత్రి రాజుకి కలలో సీతా, లక్ష్మణ, ఆంజనేయ సమేతుడై రాముడు కనిపించి  ఆదినమంతయూ కనబడక పోవుటకు కారణం నన్ను చూచుటకు వస్తూ త్రోవలో అనేక మృగాలను సంహరించి జీవహింస చేసి పాపం పొందావు. అందువలన ఇంటికి వెళ్ళి పరిశుధ్ధుడవై నీ దేవేరులతో కలిసి నా దర్శనానికి  వస్తే కన్పిస్తాను. శ్రీకృష్ణుడు సీతారాముల విగ్రహాలను పూజింపమని పాండవులకు ఇవ్వగా వారు ఆలయం కట్టి సతీ సమేతులై పన్నెండు సం:లు నాకు పూజలు చేసిరి. ప్రస్తుతం పూజాదికములులేక గిరిజనుడిలాగా ఈఅడవిలో తిరుగుతున్నాను. మాకొరకు మంచి ఆలయాన్ని నిర్మించిన భక్తాగ్రగణ్యుడవనే పేరు పొందగలవు. పూసపాటివారి వంశంలోన నీపేరు ఆచంద్రతారార్కం నిలుస్తుంది.” అని చెప్పెను. కలలో శ్రీరాముడు చెప్పినది విని నిద్రమేల్కొని, మన్నించమని రాముని పాదములను వేడుకుని పరిశుధ్ధుడై రావడానికి అడవిని వీడి కుంభిలాపురం చేరెను.

రాజు నగరం చేరి సభ తీర్చి రాముని మాటలు సభికులకు చెప్పెను. మరునాడు ఉదయాన్నే శుచులై రాజుతో పాటు ప్రజలుకూడా శ్రీరాముని చూచుటకు శ్రీరామమంత్రం జపిస్తూ అడవికి బయల్దేరారు.  చెట్టుకింద సీతారాముల విగ్రహాలు శిరసు మాత్రమే బయటకు కనిపిస్తూ ఉన్నాయి. అవి చూడగానే వేదమంత్రాల మధ్య అభిషేకాలు చేసి ఆవిగ్రహాలను పైకి తీసి, రాజూ, పరివారమూ కూడా ప్రదక్షిణలు చేసారు. వాటిని పల్లకిలో ఊరేగిస్తూ అక్కడేగల శ్వేతాచలం అనే కొండపైకి చేర్చిరి. దూదేకుల వంశానికి చెందిన వారు నియమ నిష్ఠలతో కోవెల నిర్మాణం పూర్తిగావించిరి. రాముడు నివసించిన క్షేత్రంగా ఆప్రదేశం రామతీర్థమైంది.

సీతారాముల విగ్రహాలు దొరికిన చోట ఏర్పడిన గుండం
తెలుగులోవ్రాయబడిన శాసనం

రామతీర్ద ఆలయ నిర్మాణము

కొండదిగువన నీలాచలమనే నల్లనికొండపై శ్రీరామచంద్రుని ఆలయముంది. ప్రధానఆలయానికి వెనుకగా లక్ష్మీదేవి ఆలయం ఉంది. కుడివైపున గోపాలస్వామి, ఎడమవైపున మాధవ, నృసింహస్వాముల ఆలయాలు దక్షిణంగా క్షేత్రపాలకుడైన సదాశివస్వాముల ఆలయాలున్నాయి.ఒక పెద్ద రాతిపైన గల రామతీర్థం ఆలయం ఎత్తైనప్రాకారం, వరండాలు, ధ్వజస్థంభం ఉన్నాయి. ప్రధానఆలయానికి ఎదురుగా గర్భగుడి ముందు బహిర్ద్వారగోడకు రాములవారికి ఎదురుగా ఆంజనేయస్వామివారు ఉంటారు. దక్షిణాన శ్రీమహలక్ష్మి అమ్మవారు, ఉత్తరాన పవళింపుగది, ఈశాన్యమూలన కల్యాణమంటపం ఉన్నాయి.

రామాలయంలోని రాముని జటధారి రామునిగా కొలుస్తారు. శివ-కేశవ అభేదాన్ని సూచిస్తూ శివాలయం, రామాలయం కలసి ఉండడం విశేషం. ఇక్కడ వైష్ణవ కుటుంబాలు ఎక్కువ. కోవెలకు ఎదురుగా విశాలమైన వీధిలో ఇరువైపులా వైష్ణవనివాసాలు ఉన్నాయి. వైష్ణవులు రంగనాథ సమేత ఆండాళ్ అమ్మవారిని కొలుస్తారు. దేవాలయం వెనుక సంపెంగ, మామిడి, రావి, మర్రి, అశ్వత్థ, వృక్షాలు చల్లని నీడను ఇస్తాయి. కోవెలకు దక్షిణభాగంలో పుష్కరిణి ఉంది. కొలను మధ్యలో గల సుగాలిమండపంలో క్షీరాబ్ధి ద్వాదశికి పూజలు చేస్తారు. కోవెల చుట్టూ గల చాపరాయి రామచెరువు, సీతమ్మచెరువు ఆనుకుని సీతారామునిపేట, గొర్లెపేట, కొత్తపేట, టొంపల పేట చిన్నచిన్న గ్రామాలున్నాయి. సీతారామునిపేటలో సీతారాముల వివాహం చేయించే కల్యాణం వారి కుటుంబముంది. అందుకే ఈ ఊరికి సీతారామునిపేట అని పేరువచ్చింది. గొర్లెపేటలో పూసపాటివంశీయుల ఇలవేలుపు దుర్గాదేవి ఆలయం చెట్టుపైన ఉంది. దీనిని దుర్గీపంచ అంటారు.  దానివెనుక ఒక ప్రాచీన శాసనముంది. కోవెలప్రక్కనేగల కోనేటిలో తెల్లని ఏకశిలను శ్వేతాచలమంటారు.దేవుని పూజకు మేము సిధ్ధం అంటూ కొలను నిండా తామరలు తెలుపు,ఎరుపు రంగులలో విరగబూస్తాయి.

రాములోరి చెరువు

శ్రీరామునిపై వెలసిన సాహిత్య సంపద

పూర్వకాలం నుండీ అనేక మందికి కావ్యరచనకు స్ఫూర్తినిచ్చిన ప్రదేశమిది.

రామతీర్థంలో నాలుగవ చాళుక్యవిష్ణువర్ధనుని కాలంలో (క్రీ.శ.771-806) ఉగ్రాదిత్యుడనే పండితుడు రామతీర్థం కొండలపై నివసించి ‘కళ్యాణకారకం’అనే వైద్యశాస్త్రగ్రంథాన్ని వ్రాసారు.

తాళపత్రాలలో ఆయుర్వేద గ్రంథం

విజయనగరరాజులు దక్షిణదేశ ప్రముఖ పండితులను పిలిపించి భూవసతులు ఇచ్చి తమ రాజ్యంలో ఉండే ఏర్పాటు చేసేవారు. రామతీర్ధం గత 400:లుగా విజయనగరరాజుల పర్యవేక్షణలో దేవబ్రాహ్మణ సమాగమంతో కర్మభూమిగా బౌధ్ధ, జైనులకేకాక హిందువులకు కూడా అనేక సం:లుగా పుణ్యక్షేత్రం. రాజుగారు రామతీర్థం వచ్చినపుడు నివసించేందుకు ఒక చిన్న కోట దాని చుట్టూ నివాసగృహాలు అనేకం  నిర్మించారు. అందమైన పాత్రలు తయారు చేసేవారు, బంగారు నగిషీపని చేసేవారు, బట్టలు నేసేవాళ్ళు, కుండలు చేసేవాళ్ళు, అనేక రకాల వృత్తులవాళ్ళు రామతీర్ధంలో ఉండేవారు. ఊరిలోని రాచవీధులు విశాలంగా ఉండేవి.

తిరుమలపెద్దింటి సంపత్కుమార వెంకటాచార్యులు విజయనగర మహారాజుల ఆస్థాన పురోహితులుగా రాజగురువుగా రామతీర్ధంలో నివాసముండేవారు. వారి స్వంత ఆలయం మూడంతస్తుల మేడలో ఉంది. అతడు దేశికోపదిష్ఠ నారాయణాక్షరీ మంత్రపారాయణుండు. రాజకార్యాలలో కూడా సలహాలను ఇచ్చేవారు. అతని వద్ద అనేకమంది శిష్యులుండేవారు. రాజకుమారులైన సీతారామరాజు, పెద విజయరామరాజు, ఆనందరాజు, చిన విజయరామరాజులు అక్కడే విద్యాభ్యాసం సాగింఛారు. ఈరాజగురువు అనేకమంది సామాన్యులకు కూడా గురువుగా ఉండేవాడు. గోగులపాటి కూర్మనాథకవి(క్రీ.శ.1720-1790) రామతీర్ధంలోనే ప్రాథమిక విద్య పూర్తి చేసుకుని సంకీర్తనాచార్యునిగా ఉండేవాడు.  కూర్మనాధ కవి  విజయనగరసంస్థాన ఆస్థానకవిగా సంస్థానదేవస్ఠానోద్యోగిగా ప్రభువుల నుండి అగ్రహారాలు పొందాడు. రామతీర్ధం; పద్మనాభం; సింహాచలం; శ్రీకాకుళంలలో పనిచేసారు. కూర్మన్న సంస్కృతకావ్యాలూ, ప్రబంధాలూ చదువుకున్నా మధుర కవిత అంటే ఇష్టం.  ఇతడు రచించిన కృతులలో రామతీర్థపతికి అంకితమిచ్చిన- ఏకాంతసేవ అను గేయ ప్రబంధం- గౌరీకల్యాణ, కుమారోదయగాధలతోకూడిన 3ఆశ్వాసాలతో కూడిన మృత్యుంజయవిలాసం అను యక్షగాననాటక ప్రబంధంలో పాటలూ, పద్యాలూ, దరువులూ, ద్విపదలూ, చూర్ణికలు, శ్లోకాలూ, ధండకాలూ అన్నీ కలగలిపి ఉండడం వలన దీనికి ‘శృంగార నాటకగేయప్రబంధం’ అను కొత్తపేరు పెట్టాడు.-సుందరీమణి శతకము: చంపకోత్పలమాలతో సంగ్రహితమైన రసికజన మనోరంజనమగు విప్రలంభ శృంగారశతకం – విజయరామా రామతీర్థాశ్రయా! అను మకుటంగల విజయరామశతకం పెదవిజయరామరాజుగారిపేరూ, రామతీర్థంలోని దేవుని పేరూ కలిసి వచ్చేటట్లుగా శతకం చెప్పారు. లక్ష్మీనారాయణ సంవాదం అనే మూడాశ్వాసాల గ్రంథం. మొదటి ఆశ్వాసంలోజగన్నాధస్వామి రాయబారం అను  తలుపుదగ్గర లక్ష్మీనారాయణ సంవాదం, రెండవ ఆశ్వాసంలో ‘చోరసంవాదం’ గా పిలువబడే తిరుమంగయాళ్వారు కథ, మూడవఆశ్వాసంలో నైవేద్యాలు, శోభనసేవలు, లాలి, ఏకాంతసేవ మున్నగు ఆలయసేవలు ఉంటాయి. దీనిని కూడా తన ఆరాధ్యదైవమైన శ్రీరామునికే అంకితమిచ్చెను. రామతీర్థం, పద్మనాభం, సింహాచలం, శ్రీకూర్మం మొదలైన దేవస్థానాలలో నేటికీ పాడబడుతూన్నవి. ఇది జగన్నాధస్వామి రాయబారంగా ప్రసిధ్ధం. ప్రజాశ్రేయస్సును కాంక్షిస్తూ గజపతి సంరక్షకులకు, విజయనగరదక్షులకు, దుష్టజన చిత్త విముఖులకు, ‘జయ మంగళం’ అని విజయనగర శ్రేయస్సును కాంక్షిస్తూ వర్ణించారు.  ప్రస్తుతం అందులోని మూడు పద్యములు మాత్రమే లభిస్తున్నాయి.అందులో ఒకటి ఉదా:

స్వామిన్ కన్నది వూట;పుణ్యనది క్రేవంజన్నదే బాట; మీ

ధామంబున్నదే పేట;ధర్మ సభ సత్యంబున్నదే మాట; యే

సీమన్  వస్తుసమృధ్ధిచే భటులచేఁ జెల్వైనదే కోట ; పెన్

మామీళ్ళున్నదే తోట శ్రీ విజయరామా! రామతీర్ధాశ్రయా!

పద్మనాభ యుధ్ధములో చిన విజయరామగజపతి మరణానంతరం నారాయణగజపతి మహారాజు కుంపిణీవారి చేతిలో ఎస్టేటుని వదలి బెనారస్ లోనే రాజసౌధాలు నిర్మించుకుని అక్కడే మరణించారు. ఆ మహారాజు ధార్మికతను, వదాన్యతను వేనోళ్ళ పొగడే ప్రజల మంచి సంపాదించుకోవాలంటే వారి వారసులకు రాజ్యాన్ని అప్పగించడమొకటే మార్గమని గ్రహించిన కుంపిణీవారి కోరికమీద మూడవవిజయరామగజపతి కాశీ నుండి క్రీ.శ.8-4-1848లో విజయనగరం వచ్చారు. కీలకనామసం: వైశాఖశుధ్ధ తదియ శుక్రవారంనాడు మూడవ విజయరామగజపతిగారి పట్టాభిషేకం వైభవోపేతంగా జరిగిన సందర్భంలో పోడూరి వెంకటకవిరాజు శ్రీరామలీలోత్సవాలు వర్ణిస్తూ రామలీలావిలాసము అనే మూడు ఆశ్వాసాల శృంగారప్రబంధం రచించారు. దీని పూర్తిపేరు. “విజయరామగజపతి మహారాజ పట్టాభిషేకమహోత్సవ రామలీలావిలాసం” ఇందులో శ్రీరామకథతో పాటు  విజయరామగజపతి సుగుణ సంపత్తి కూడా చిత్రించబడింది.

శ్రీవిజయరామరాజన్యశేఖరుండు /   రామలీలోత్సవంబతిరమ్యముగను

జేయుచుండగనాటి త్రేతాయుగంబు /    తోడవచ్చెననంగదోచెధరణీ!”

ఆ రోజులలో విజయనగరంలో లంకాపట్టణం, అయోధ్యామైదానములలో రామలీలలను భారీ ఎత్తున జరిపేవారు. ప్రభుత్వమహారాజా సంస్కృతకళాశాలకు ఎదురుగా ఉన్న విశాలమైన మైదానాన్ని అయోధ్యమైదానమని అంటారు. బుచ్చన్నకోనేరు దగ్గరున్న విశాలప్రాంతాన్ని లంకాపట్నమని అంటారు. విజయనగర రాజులు సూర్యవంశానికి చెందినవారు. రాముడు అయోధ్య(అయోధ్యమైదానము) నుండి బయలుదేరి వనవాసము చేసాడు. సీతమ్మవారిని అపహరించినందుకు రాముడు లంకకు (లంకాపట్నము) వెళ్ళి రావణుడిని సంహరించాడు. అందువలన విజయనగరంలో దసరా ఉత్సవాలలో రావణ కుంభకర్ణ వధను ఉత్సవంలా జరిపేవారు.

పూసపాటి రాజకవులు వెంకటపతిరాజు ఉషాభ్యుదయం, రేగులవలస విజయరామరాజు విష్ణుభక్తిసుధాకరం, ఛాట్రాతి లక్ష్మీనరసకవి భండనారాతిభీమ శతకం, శుధ్ధాంధ్రరామాయణం మొదలైన గ్రంథాలు రచించి రామతీర్థస్వామికి అంకితమిచ్చారు. గంటి సూర్యనారాయణశాస్త్రిగారు ‘రామతీర్థ చరిత్ర’ అనే పుస్తకంలో క్షేత్రమాహాత్మ్యాన్ని వర్ణించారు.

‘అభినవ ఆంధ్రభోజ’ పూసపాటి ఆనందగజపతిరాజుగారి ఆంతరంగికులైన కీ.శే. గురజాడ అప్పారావుగారు రాసిన “దేవుళ్ళారా! మీపేరేమిటి?“ అనే కథకు స్థానికత రామతీర్థము. భావకవిత్వానికి ఆద్యుడైన కీ.శే. దేవులపల్లి కృష్ణశాస్త్రిగారు తొలికవితను రామతీర్థంలోనే రాసినట్లు చెప్పుకున్నారు.

శ్రీమాన్ నిడవర్తి కందాడై గోవిందరాజ శ్రీ భాష్యకారాచార్యులవారు సంస్కృతశ్లోక ఆంధ్ర తాత్పర్యరూపంగా  ‘శ్రీరామతీర్థ క్షేత్రమాహాత్మ్యము’ వ్రాయాగా దీనికి తెనుగుపద్యరూపమున స్వతంత్ర పద్యకావ్యమును అదే పేరుతో శ్రీచావలి సాంబశివ సుబ్రహ్మణ్యంగారు రచించి పెద్దల మన్ననలను పొందిరి.

రామతీర్థంలోని క్షేత్రపాలకుడైన శివాలయఅర్చకులుగా రాజేటి మల్లికార్జున శర్మ(మల్లిబాబు) స్వామిసేవతోపాటు జ్యోతిష్యం, వాస్తుశాస్త్రములలో నిపుణులు. పదవతరగతి ఉత్తీర్ణులైనతరువాత నాలుగున్నర సంవత్సరాలు సింహాచలం వేదపాఠశాలలో శైలాగమశాస్త్రాల్ని అధ్యయనంచేసారు. తండ్రి తదనంతరం జీర్ణావస్థలో ఉన్న శివాలయఅర్చక భాధ్యతలు స్వీకరించి ఆలయాన్నిఅభివృధ్ధిచేయాలనే అకుంఠితదీక్షతో ప్రయత్నాలు మొదలుపెట్టారు. కాశీనుండితెచ్చి ప్రతిష్ఠించిన 150 సం: ల చరిత్ర కలిగిన అక్కడి శివలింగాన్ని పూజిస్తూ తనకున్న జ్యోతిష్య, వాస్తుశాస్త్ర జ్ఞానంతో భక్తుల అభిమానాన్ని సంపాదించుకుని 2004 సెప్టెంబరులోఒక కమిటీనిఏర్పాటుచేసి 30లక్షలరూపాయల వ్యయంతో ఆలయాన్ని పునః నిర్మాణాన్నికావించి శివాలయాన్నిఅందరికీ అందుబాటులోకి తెచ్చారు.

కామాక్షిదేవి

కామాక్షిఅమ్మవారికి ప్రతి పున్నమి,అమావాస్యలకు యజ్ఞాలు చేస్తున్నారు.ఇప్పటికి సుమారు 280 పైగా జరిగాయి. 360 యజ్ఞాలు పూర్తిచేస్తే ఆదేవికి ఆప్రదేశానికి శక్తిపీఠం ప్రభావం కలుగుతుందని పురాణాలలో చెప్పబడినది. కంటిచూపుతోనే కోరిన కోరికలను తీర్చే కామాక్షీదేవి మహిమాన్వితురాలు. అనేకమంది భక్తులకు అనేక నిరూపణలు చూపిన తల్లి.

రామతీర్థంలో జరిగే ఉత్సవాలు-పండగలు:

రామతీర్థంలో ప్రతిసం: శ్రీరామనవమి ఉత్సవాలు తొమ్మిదిరోజులూ ఘనంగా చేస్తారు.  చైత్రశుధ్ధ నవమికి –శ్రీరామజయంతి; వైశాఖశుధ్ధ ఏకాదశికి-గోపాలస్వామివారి కల్యాణం; జ్యేష్ఠశుధ్ధ పూర్ణిమకు- సహస్రఘటాభిషేకం; కార్తీకశుధ్ధ ద్వాదశికి –తెప్పోత్సవం; కార్తీకశుధ్ధ పూర్ణిమకు-గోపురోత్సవం; ధనుర్మాసంలో  గోదాకల్యాణం; రామతీర్థంలో మాఘశుధ్ధ ఏకాదశికి శ్రీ సీతారాముల కల్యాణం చేస్తారు. కల్యాణం; మాఘ శుధ్ధ పూర్ణిమకు- డోలోత్సవం; మాఘమాసంలోనే వచ్చే మహాశివరాత్రి పండగకు రెండురోజుల జాతర చేస్తారు. మాఘ బహుళ చతుర్దశికి- తిరుమంగళాయాళ్వారులవారి-రథోత్సవం సంప్రదాయపధ్ధతిలో జరుపుతారు. విజయనగర తీరప్రాంతాలలోగల బెస్తవారు శివరాత్రికి వారిదైన శైలిలో కోలలుపట్టుకుని-కోదండరామా! గోవిందా! అంటూ పాటలుపాడుతూ, నృత్యాలు చేసుకుంటూ వస్తారు. ఇక్కడి తోటలలోనే వంటలు వండుకుని తింటారు. శ్రీరాముని దర్శనంచేసుకుని సాంస్కృతిక కార్యక్రమాలు భజనలు, హరికథలు, పౌరాణిక నాటకాలు ప్రదర్శిస్తారు.

ప్రాచీనమైన ఈ ఆలయాన్ని పునఃనిర్మిస్తున్నారు.

నిర్మాణదశలో ఆలయం

రామతీర్థం ప్రముఖ పర్యాటక క్షేత్రంగా, ఆధ్యాత్మిక క్షేత్రంగా అభివృధ్ధి పొందేందుకు అవకాశాలున్నాయి. ఉత్తరాంధ్ర జిల్లాలనుండే కాక ఒడిస్సా, చత్తీస్ ఘఢ్ రాష్ట్రాల నుండి కూడా ప్రజలు రాముని ఆశీస్సులు కోరి వస్తారు.  ఏడాదికి సుమారు కోటి రూపాయలు పైగా ఆదాయము వచ్చే ఈప్రాచీన ఆలయం ప్రశాంతతకు మారుపేరు.  శ్రీమతి బొత్స ఝాన్సీలక్ష్మిగారు పార్లమెంటు సభ్యురాలిగా ఉన్న సమయంలో కొండపైకి మెట్ల మార్గమును, రెయిలింగును ఏర్పాటు చేయించారు. చుట్టుపక్కల కుమిలి, సారిపల్లి, సీతారామునిపేట, గుషిణి, మొదలైన పర్యాటక ప్రదేశాలున్నాయి.

సీతారాముల కల్యాణం

వివిధ కళారూపాలలో శ్రీ సీతారామచంద్రమూర్తి : 

చెట్టుభజన: ఆంధ్రుల భజన సంప్రదాయంలో చెట్టుభజన ముఖ్యమైనది. మరుగునపడుతున్న జానపద కళారూపాలలో చెట్టుభజన ఒకటి. విజయనగరంజిల్లాలో ప్రముఖంగా కనిపించే చెట్టుభజన కీర్తనకు సంబందించినది. చెట్టు నృత్యం ప్రతి బృందంవారూ భజనలోనూ నృత్యంలోనూ ఆనందాన్నీపారవశ్యాన్నీ పొందుతారు. మధ్యలో చెట్టుని పెట్టి చుట్టూ కాషాయాంబరధారులై, నిలువుబొట్టు పెట్టుకుని, తాళంతో చిందు వేస్తూ భజన చేస్తారు. భక్తిపాటలనూ, ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలనూ, ప్రచారం చేస్తూ తిరుగుతారు. హార్మోనియం, మద్దెల, తబల, మొదలగు ప్రక్కవాద్యాలుంటాయి. ఒక గురువు 40 రోజులు దీక్షతో ఉండి, 40 మంది శిష్యులని వెతుక్కుని దీక్ష ఇచ్చి, గజ్జె పూజచేసి, ప్రచారం మొదలుపెడతారు. కేవలం పురుషులే ఉంటారు. 15 సం:ల నుండి 30 సం:ల వయసు వరకూ బృందంలో ఉంటారు. గురువు చూపులతోనే హెచ్చరికలుచేస్తూ, దర్శకత్వం చేస్తాడు. ఒకో గురువు దగ్గర 20, 30 మంది శిష్యులు ఉంటారు. నేర్చుకుంటూనే చేస్తారు. ఆధ్యాత్మిక చింతనను ప్రజలలోకి తీసుకుని వెళ్ళేందుకు ఇది ఉపయోగపడుతుంది. శ్రీరామచంద్రునిపై పాటలు పాడతారు. దీనిని వంశపారంపర్యంగా అనుసరిస్తారు. 20,30 కేజీల బరువుగల ఇత్తడితో తయారుచేసిన చెట్టు, కొమ్మలు, చిలకలు, ప్రమిదల్లాగా వత్తులువేసి దీపాన్ని వెలిగిస్తారు. దీనిని శ్రీరామునికి ప్రతిరూపంగా భావిస్తారు. పెళ్ళిళ్ళపుడూ, యాత్రలు చేసినపుడూ, శ్రీరామనవమికి, ఏకాదశీ నుండీ పౌర్ణమివరకూ వచ్చే ఐదు రోజులూ చెట్టుభజన చేస్తారు. దగ్గరలోని గ్రామాలకు చెట్టుభజన చేయడానికి వెళ్ళినపుడు భుజాలపై రెండు కర్రలు వేసుకుని మధ్యలో చెట్టుని మోసుకుంటూ వెళతారు. చెట్టు భజనలో తప్పనిసరిగా చెట్టు ఉండాలి. భజనచేస్తూ, తాళం వేస్తూ, తగినట్లు అడుగులు వేస్తూ పాటలు పాడుతూంటారు. శ్రీరాములవారిమీదా, శివునిమీదా, వెంకటరమణునిమీదా పాటలు పాడతారు. పాడేవారు కూడా చిందులు వేస్తారు.

పాటలు: ఓ రాఘవా! మరుగేలరా!-  శ్రీమన్నారాయణ భావనారాయణా! –  నీ కొండకు నీవే రప్పించుకో! మొదలైనవి. ప్రదర్శన నాలుగైదు గంటలపాటు ఉంటుంది. పై ఊళ్ళు వెళ్ళినపుడు ఒక గంట భజన చేస్తారు. దూరప్రాంతాలకు చెట్టుని పట్టుకెళ్ళరు. పూర్వీకులు రాసిన పాటలనే పాడతారు. వృత్తిపరంగా వ్యవసాయదారులైన ఈ కళాకారులు కళని బ్రతికించుకోవడం కోసమే దీనిని కొనసాగిస్తున్నారు. సంప్రదాయాన్ని విడవకుండా ధనానికి ఆశించకుండా ఆధ్యాత్మికతను పెంపొందించుకునే ఈ చెట్టుభజన కళారూపాన్ని జీవకళగా ముందుతరాలవారికి అందించవలసిన బాధ్యత ఉంది. తిరుమల తిరుపతి దేవస్థానం, తిరుపతివారు ఉత్సవాలప్పుడు వీరిని పిలిపించి ప్రదర్శనలకు అవకాశమిస్తుంటారు.

గిరిజనుల పాటలు, పదాలు సాధారణంగా మౌఖికమైనవి. అనుశృతంగా పెద్దల నోటి నుండి విని పాడుకునేవే.

1.పనిపాటలు ముగించుకుని విశ్రాంతికోసం పాడే రామకథలు, తందాన పాటలు 2. స్త్రీలు పాడుకునే పురాణఘట్టాలు కుశలవులకథ, లక్ష్మణదేవర నవ్వు, ఊర్మిళాదేవి నిద్ర మొదలగునవి.

హరికథాపితామహుడుగా పేరుపొందిన శ్రీమత్ అజ్జాడ ఆదిభట్లనారాయణదాసుగారు సంగీతంలోనూ, నృత్యంలోనూ, కవిత్వంలోనూ పరిపూర్ణతను సాధించిన మహామనీషి. అతను రాసిన హరికథలలోని కథావస్తువులన్నీ రామాయణ, భారత, భాగవతములనుండి గ్రహించినవే. వాటికి పెట్టిన పేర్లన్నీ ప్రధానకథా సూచకములే. ప్రజలకు ఆస్తిక బుధ్ధి కలిగించుట, ధర్మభోధ చేయుట, ఆటపాటలతో ఆనందం కలిగించుట, ఉత్తమ సందేశాన్ని అందించుట

లక్ష్యం క్రీ.శ.1915సం:లో భార్య లక్ష్మీనరసమ్మ చనిపోగా ఆమె స్మృతి చిహ్నంగా ‘యథార్ధరామాయణము’ వ్రాసి అంకితమిచ్చారు. ఆరు విభాగాలు చేసి ఆరురోజులలో చెప్పునట్లు వ్రాసిన ఈ గ్రంథంలో ‘భక్తమందార భవదూర పరమపురుష!’  అను మకుటముతో 20 సీసపద్యాలు వ్రాసారు.

విజయనగరం కౌముదీపరిషత్ షట్కవి ప్రణీతం మాలికారామాయణాన్ని ముద్రించారు. ఆరుకాండలు, ఆరురకాల వృత్తాలతో మొత్తం 3,635 చరణాలు గల రామాయణమును సంస్కృతకళాశాలలోని పండితులు రచించారు. సభ్యులైన ఆరుగురు కవులచే  మాలికారామాయణమును రచింపచేయగా శ్రీ ఉపమాక నారాయణమూర్తిగారు ముద్రణా వ్యయాన్ని సమకూర్చారు.

శ్రీరామాయణ మలికన్‌ కవికృతి శ్రీషత్ త్రికప్రాససూ

త్రారూఢ ప్రియవృత్త పృంతలలితార్ధామోద సూక్తి ప్రసూ

నారామాకృతి పాళికన్‌ పిలిచి నీకర్పించుచున్నాము తల్లీ!

అంటూ ఈ కృతిని భారతీదేవికే సమర్పణం చేసారు.

శ్రీమారుతీభక్తమండలి (గుంచీలు): క్రీ.శ.1935 సం: హరికథా కంఠీరవ చొప్పల్లి సూర్యనారాయణబాగవతార్ గారు ‘శ్రీమారుతీ భక్తమండలి’ని స్థాపించారు. రెండున్నర అడుగుల ఎత్తున ఆంజనేయస్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠించారు. ప్రతి సం: ఆదిభట్ల నారాయణదాసుగారి ఉత్సవాలు వారం రోజులపాటు ఇక్కడ జరుగుతాయి. ఆ వారంరోజులూ ప్రముఖ హరిదాసులచే రామాయణం హరికథాగానాలు ఉంటాయి.

సాహిత్య అకాడమీ అవార్డు గ్రహీత-భమిడిపాటి రామగోపాలం: క్రీ.శ.06-02-1932- క్రీ.శ. 7-4-2010) తండ్రి సూర్యనారాయణగారు అమితమైన రామభక్తుడు. రామాయణంలోని వివిధఘట్టాల ఆకారంలో ‘శ్రీరామ’ అని కుదురుగా రామకోటి వ్రాసి, ఊరేగించారు.

విజయనగరంలో జన్మించిన ఖరిడేహాల్ వెంకటరావుగారు మహారాజాకళాశాలలో విద్యాభ్యాసం పూర్తిగావించి ఆంధ్రవిశ్వవిద్యాలయం, వాల్తేరు, ముంబైలలో అత్యున్నత చదువులు చదివి, అనేక పదవులు నిర్వహించిరి. వీరు బాపుగారి రేఖాచిత్రాలతో కూడిన శ్రీమద్రామాయణము, శ్రీచక్రశాస్త్రవిజ్ఞానంపై శ్రీ పప్పు వేణుగోపాలరావుగారు వ్రాసిన గ్రంథాన్ని తెలుగులో అనువదించిరి.

గరివిడి సూర్యపీథంలో గల రామశిల: శ్రీరామరావణ యుధ్ధసమయంలో వానరులచే నిర్మించబడిన సేతువు సముద్రగర్భంలో నిక్షిప్తమైయుంది.12 సం:లకు ఒకసారి మహాశివరాత్రినాడు  రామేశ్వరానికి 12 మైళ్ల దూరంలో రెండు శిలలు తేలుతూ అచటికి వచ్చి శివసరస్సు అనే నీటి మడుగులో తేలుతూ ఉంటాయని, మహామంత్రశక్తి సంపన్నులైన సన్యాసులకు అవి లభిస్తాయని అంటారు. రామపాదస్పర్శ పొందిన అటువంటి రెండు రామశిలలను తెచ్చి సూర్యస్తూపం వద్ద జలాశయం నిర్మించి అందలి నీటిలో ఉంచారు. దీనికి ప్రదక్షిణ చేసిన భక్తుల యొక్క సమస్త కోరికలను శ్రీ ఆంజనేయస్వామి తీరుస్తాడని అంటారు.

చాలామంది పండితులు శ్రీరామాయణ పారాయణచేసి ఇక్కడ రామునిసన్నిధిలో  మహాసామ్రాజ్య పట్టాభిషేకం చేసుకుంటారు. విజయనగరంలో గల వేద పండితులు; విజయనగరంలో శ్రీమద్రామాయణ పారాయణ చేసిన ప్రముఖులు ఎందరో ఉన్నారు. వారిలో పప్పు చక్రపాణి మాష్టారు; ఉలిమిరి సోమయాజులు; పప్పు రఘునాధ శర్మ; ధవళ సుబ్బారావుగారు, మంథా రామప్పంతులు; లక్ష్మన్న పంతులు: రఘుపతిగారు ప్రముఖులు. వీరు పారాయణ సమయంలో కాశీలో నివసిస్తూ కూడా చేస్తారు. పారాయణ అనంతరం శ్రీరామ పట్టాభిషేకం వైభవంగా చేసి అన్న సంతర్పణ చేస్తారు. ప్రముఖుల ప్రసంగాలు, ప్రవచనాలు భక్తులకు వినిపిస్తారు.

ఆధునిక రామనివాసం రామ నారాయణం:

విజయనగరంలో నారాయణం చలమయ్యగారు నిత్యం రామాయణం పారాయణ చేస్తూ పరిసమాప్తి కాగానే సీతారామకల్యాణం, మహాసామ్రాజ్య పట్టాభిషేకాలు చేసేవారు.108 వ సామ్రాజ్య పట్టాభిషేకంలో పరిసర గ్రామాల ప్రజలకు ఏడురోజులపాటు అన్నసంతర్పణ చేయగా రామలక్ష్మణులిరువురు సోదరుల రూపంలో వచ్చి ప్రసాదం ఆరగించి వెళ్ళిపోయారని తెలిసి వీరి భక్తికి మెచ్చిన రాజావారు గజారోహణ చేయించి ‘ధర్మ’ బిరుదు ప్రదానం చేసారు.

ధనుస్సు ఆకారంలో రామాలయం

రామాయణంలోని ఘట్టాలను 72 శిల్పాలుగా చెక్కించి చదువుకునేందుకు వీలుగా ఆయా ఘట్టాలను తెలుగు, ఇంగ్లీషు భాషలలో రాయించారు. శిల్పాలు ఆయిల్ పెయింటింగుతో జీవకళ ఉట్టిపడుతూ చూపరుల మనసులను ఆకర్షిస్తూ ఉంటాయి.  ముఖ్యంగా ఇవి చూడడం వలన చిన్నపిల్లలకు రామాయణం పట్ల అవగాహన యేర్పడే అవకాశముంది. వేయిమాటలలో చెప్పలేనిది ఒక చిత్రం ద్వారా తెలుస్తుంది అన్నది పెద్దల మాట. ధనుస్సు ఆకారంలో నిర్మింపబడిన ఈ నిర్మాణంలో ఇరువైపులా లక్ష్మీ, సరస్వతీ విగ్రహాలు, మధ్యలో నిలువెత్తు అభయాంజనేయస్వామి సుదూరానికి కూడా దర్శనమిస్తూంటాయి. విజయనగరంలో మతసమైక్యతకు నిదర్శనంగా ఈ శిల్పాలను ఒక క్రైస్తవ శిల్పి నిర్మించడం గర్వకారణం. దీనికి అనుబంధంగా వేదపాఠశాల నిర్వహింపబడుతోంది.

ధ్యాన మందిరంలో అనంతపద్మనాభస్వామి

శ్రీరామనామం ఎంతటి ప్రాధాన్యత కలది అంటే సాక్షాత్తు ఆ శివ మహాదేవుడే నిత్యం రామనామం స్మరిస్తూ ఉంటారట!

మరి కలియుగములో స్మరణయే చాలును అనే పెద్దల మాట ప్రకారం ఈ మంత్రం ఒక్కసారి పఠిస్తే కోటి సార్లు పఠించినట్లే!

శ్లో: శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే

సహస్ర నామ తత్తుల్యం రామనామ వరాననే!

                                                                    స్వస్తి…….

                                    సమస్త లోకాన్ సుఖినో భవంతు! శుభమస్తు!

Exit mobile version