Site icon Sanchika

శ్రీరామ రక్ష

[box type=’note’ fontsize=’16’] రామునిపై అచంచల విశ్వాసం గల ఓ విద్వాంసుడి కథను “శ్రీరామ రక్ష” పేరిట అందిస్తున్నారు విశాలి పేరి. [/box]

[dropcap]”శ్రీ[/dropcap]రామ పాదమా నీ కృప చాలునే చిత్తానికి రావే” అరమోడ్పు కన్నులతో పాటలో నిమగ్నమై పాడుతున్నాడు హనుమద్ దాసు. అటు పక్క నుంచి వెళ్తొన్న అతని భార్య భారతి అతనితో మాట్లాడద్దామని వచ్చీ, అయన్ని చూసి ఆ పని విరమించుకుంది.

“ఎలాగైనా ఈ విషయాన్ని ఈయనతో చర్చించాలి” అని మనస్సులో దృఢంగా అనుకొని వంటింట్లోకి వెళ్ళింది.

ఇంకో అరగంటకి హనుమద్ దాసు పూజ అయ్యింది. అతని పక్కన వచ్చి కూర్చొని భారతి అతని చేతికి మజ్జిగ గ్లాస్ ఇస్తూ “ఈ ఏడాది పంటలు ఇంటికి రాలేదు. అకాల వర్షం మూలంగా చేతికి వస్తుందనుకొన్న పంట ఇంటికి రాకుండానే పోయింది. మీ అమ్మ వయసా తొంభై దాటింది, కాస్త రేపటి గురించి ఆలోచించండి. ఈ రోజుల్లో ఆడపిల్లలైనా మగపిల్లలైనా ఒకటే! కాస్త సాయం చేయమని అల్లుళ్ళని అడగవచ్చు కదా? రేపు మీ అమ్మగారి ఆరోగ్యం ఏదైనా అయ్యి హాస్పటల్ అంటే డబ్బులు ఎలా? కాస్త ఆలోచించండి” అని అంది.

“చూడు భారతి… ఈ రోజు వరకు ఆ రాముడి దయతోనే బతికాను, నాకు ఏది కావాలో ఆయనే చూసుకుంటాడు. ఇంక అమ్మ పరిస్థితా, అంతగా ఏదైనా అయితే అప్పుడే అల్లుళ్ళని అడుగుతాను. ప్రస్తుతానికి మనకి తిండికి లోటులేదు, ఇల్లు బానే ఉంది, అనవసరంగా ఒకళ్ళ ముందు చేయి చాచడం దేనికి చెప్పు? పరిస్థితులు బాలేకపోతే అప్పుడే చూద్దాము. అలాంటి స్థితి నాకు ఆ రాముడు రానివ్వడులే భారతి. సరే.. నేను అలా జమిందారు గారి ఇంటి వరకు వెళ్ళి వస్తా” అని భుజం మీద కండువ వేసుకొని బయలుదేరాడు హనుమద్ దాసు.

జమీందారంటే… ఒకనాటి జమీందారీ కుటుంబాలకు వారసుడు. ఊరి పెద్ద, ఇప్పటికీ గ్రామస్తులు ఆయనను జమీందారు గారనే అంటారు.

హనుమద్ దాసు ఆదిత్యపురంలో చాలా గొప్ప పేరు ఉన్న సంగీత విద్వాంసుడు. ఒకప్పుడు ఆ సంగీతము ఆయనకి మంచి సన్మానాలే చేయించింది. బోలెడు మంది పిల్లలకి సంగీతం చెప్పాడు. అంతే కాదు ఆ చుట్టుపక్కల ఊర్లల్లో ఎవరి పెళ్ళి అయినా సరే హనుమద్ దాసు హరికథ ఉండాల్సిందే! కానీ కాలభ్రమణంలో ఆ ఆదిత్యపురంలో జనాలు తగ్గిపోసాగారు. కాస్తో కూస్తో చదువుకున్నవాళ్ళు ఉద్యోగరీత్యా పట్టణాలు చేరుకున్నారు. ఇంక మిగిలింది అటుకి ఇటుకి కాని వయసులో వారు. అటు పిల్లల దగ్గరకి వెళ్ళలేక, ఇటు ముసలి తల్లో లేక తండ్రో ముసలి వయసుకు వచ్చినవాళ్లను వదలలేక అదే ఊరిలో స్థిరపడినవారు.

హనుమద్ దాసుకి ముగ్గురూ కుతుర్లు, ఆ తరవాత ఒక కొడుకు. ముగ్గురు కూతుర్లని మంచి కుటుంబాలలోనే ఇచ్చాడు. అల్లుళ్ళు చాలా మంచివారు. తండ్రీతాతల నుంచి సంక్రమించిన ఐదు ఎకరాలలో కూతుర్ల పెళ్ళిల్లకని నాలుగెకరాలు అమ్మేశాడు. ఆ ఉన్న ఒక ఎకరం లో పంటలు బానే పండి ప్రతీ ఏడు వారి కుటుంబానికి సరిపోయేది. హనుమద్ దాసు కొడుక్కి పదహారు ఏళ్ళ వయసుండగా ఉన్నట్టుండి ఆడుతూ పాడుతున్నవాడే అకారణంగా రాత్రికి రాత్రే మరణించాడు. ఊర్లో జనాలు “నువ్వు నమ్ముకున్న నీ రాముడే నీకు అన్యాయం చేశాడు” అని అంటే….

“రాముడు ఎన్నటికీ అన్యాయం చేయడు… వాడికి పదహారేళ్ళు మాత్రమే తండ్రిగా ఉండే అర్హత నాకు ఉంది అంతే, అంతా రామార్పణం…” అని అన్నాడు హనుమద్ దాసు.

ఊర్లో జనం ఆయన రామభక్తికి ఆశ్చర్యపడ్డారు…. పేరుకి తగినట్టే అతని భక్తి అని అనుకున్నారు.

***

సాయంత్రం హనుమద్ దాసు భార్యతో “వచ్చే నెల శ్రీరామ నవమికి జమీందారు గారు చాలా గొప్ప ఏర్పాట్లు చేస్తున్నారు. ఆయన మనువలు, మనవరాళ్ళూ, బంధుజనం అంతా వస్తున్నారుట, శ్రీరామ నవమి రోజే వారి మనవరాలి పెళ్ళి కూడానట, అందుకు నా పాటల కచేరీ, హరికథ గురించి మాట్లడటానికి కబురంపారు” అని చెప్పాడు.

జమీందారు గారు చెప్పినట్టే నెల్లాళ్ల ముందుగా ఇంటిలో బంధుజనం వచ్చేశారు. వారు వచ్చిన మరునాడే జమీందారు గారి సహస్ర చంద్ర దర్శనం అవ్వడంతో ఆ రోజు హనుమద్ దాసు చేత హరికథ చెప్పించారు. ఆ హరికథ ఎంత బాగా నచ్చేసిందంటే అ పిల్లలకి, హరికథ అయ్యాక కూడా ఇంకా ఇంకా కథలు చెప్పమని ఆయన చుట్టూ చేరారు. ఇది చూసి జమీందారు గారు ఆ నెల మొత్తం రోజూ సాయంత్రం ఏడు గంటల నుంచి ఎనిమిదిన్నర వరకు హనుమద్ దాసుని హరికథ చెప్పమన్నారు. ఇప్పుడు ఆ ఇంట్లో జనాలే కాదూ ఊర్లో జనాలందరూ రోజూ హనుమద్ దాసు హరికథ కోసం వచ్చేవారు. హనుమద్ దాసు హరి కథ అయ్యాక కొన్ని త్యాగరాయ కీర్తనలో, లేక రామదాసు కీర్తనలో ఆలపించేవాడు. పిల్లలకు అది కూడా నచ్ఛేసింది. రోజూ పొద్దుటే ఆయన దగ్గరకు ఈ పాటలు నేర్చుకోడానికి వెళ్ళేవారు. ఆ ఇంట్లో పిల్లలే కాకుండా ఆ పెళ్ళికి వచ్చిన బంధువుల పిల్లలూ, ఆ పిల్లల స్నేహితులూ మొత్తం కలిపి ఒక పాతిక మంది వరకు రోజూ పాటలు నేర్చుకోడానికి వచ్చేవారు.

ఆ నెల మొత్తం ఒక తిరుణాల్లలా గడిచింది ఆదిత్యపురంలో. శ్రీరామనవమి రోజు ఆ సీతా కల్యాణం కన్నులకు కట్టినట్టు వర్ణించాడు హనుమద్ దాసు. అటు ఆ కల్యాణం, ఆ రాత్రే జమీందారు గారి ఇంట్లో కల్యాణం. అంతవరకూ పాటలు నేర్చుకొన్న పిల్లలు అంతా ఒకొక్కరు ఐదు వేల నుంచి పది వేల వరకు హనుమద్ దాసుకు గురు దక్షిణగా ఇచ్చారు. జమీందారు గారు కూడా బానే చదివించారు. మొత్తానికి దగ్గర దగ్గరగా లక్ష వరకు వచ్చే ఉంటుంది. పాటలు నేర్చుకొన్న పిల్లలు ఆయనకి ఒక లాప్‌టాప్ ఇచ్చి ఆన్‌లైన్‌లో సంగీతం నేర్పమని అడిగారు. ఆయన ఈ నెల్లాళ్లలో వారికి సంగీతం చెప్పి వారి నుంచి ఈ లాప్‌టప్ ఎలా వాడాలో నేర్చుకున్నాడు. ఈ డబ్బు పట్టుకొని ఇంటికి వచ్చి భారతికి, అతని అమ్మకి చూపించాడు. అతని అమ్మ చాలా సంతోషించింది. “అంతా ఆ రాముడు దయ, ఈ ఏడాది పంట డబ్బు ఈ విధంగా వచ్చిందిరా” అంటూ అలా వాలిపోయింది.

దగ్గరకు వెళ్ళి చూసిన భారతి, హనుమద్ దాసు ఆవిడ పోయిందని తెలుసుకున్నారు. ఆవిడ కార్యక్రమాలు అన్నీ అయ్యాక, జమీందారు గారు వచ్చి హనుమద్ దాసుతో “మేము ఇచ్చిన డబ్బు ఇలా ఉపయోగపడుతుందని అనుకోలేదు హనుమంతూ… చాలా బాధగా ఉంది” అని అన్నారు…

“అలా అనకండి బాబు గారు… పెళ్ళికైతే డబ్బు సాయం చేయమని ఎవరినేనా అడుగుతాము, ఇలాంటి దానికి అడగలేము కదా! ఆ రాముడికి తెలుసు ఏ సమయములో ఏ విధంగా డబ్బు పంపాలో అని…” అని అన్నాడు…

“అవునయ్య.. శ్రీరామును వారము.. మాకేల విచారము” అని నమ్మిన వారు మీరు… ముందు వెనుక ఇరుపక్కల తోడై మిమల్ని అన్ని విధాలుగా ఆయనే రక్షిస్తాడు” అన్నాడు జమీందారు.

Exit mobile version